mirchi crop
-
మిర్చి పంటపై దృష్టిసారించిన అధికారులు
-
చిట్టి చిల్లీ.. చాలా ఘాటు గురూ! ఒక్కసారి కొరికితే..
సాక్షి, కాకినాడ(పిఠాపురం): చిట్టి చిల్లీ... చూడటానికి చెర్రీ పండులా ఎర్రగా గుండ్రంగా ఉంటుంది. నోరూరిస్తుంది. కానీ ఒక్కసారి కొరికితే చెంబుడు నీళ్లు తాగినా మంట తగ్గదు. అంతటి ఘాటు ఉన్న ఈ చిట్టి మిరపకాయల ధర కూడా సాధారణ మిర్చి కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుంది. ఈ చిట్టి మిర్చికి పుట్టినిల్లు కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రాంతమైనా... మరాఠా వాసులతోపాటు దుబాయ్, మలేషియా దేశాల ప్రజలకు దీనిపై మక్కువ ఎక్కువ. సొంతగా విత్తనం తయారీ... గొల్లప్రోలు మండలంలోని రేగడి భూములు పొట్టి మిరప సాగుకు అనుకూలం. గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, ఎ.విజయనగరం గ్రామాలలో సుమారు 600 ఎకరాలలో పొట్టి మిరపను సాగు చేస్తున్నారు. రైతులే సొంతగా విత్తనాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. తమకు పండిన పంటలో నాణ్యమైన కాయలను ఎంపిక చేసుకుని ఎండబెట్టి విత్తనాన్ని సిద్ధం చేసుకుంటారు. ఎకరాకు 70 నుంచి 80 బస్తాలు దిగుబడి వస్తుంది. వాతావరణం అనుకూలిస్తే పెట్టుబడి పోను ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ చిట్టి మిరపకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ముంబై, పుణె ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి దుబాయ్, మలేషియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 250 నుంచి 350 టన్నుల వరకు ఎగుమతి చేస్తారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లోని స్టార్ హోటళ్లకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు టన్ను పొట్టి మిర్చిని విదేశాల్లో రూ.7లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పదేళ్లుగా సాగు చేస్తున్నా పదేళ్లుగా పొట్టి మిరప సాగు చేస్తున్నా. మొత్తం మీద మిరప సాగు లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేయడం వల్ల మంచి దిగుబడి వస్తోంది. ఆదాయం కూడా బాగుంది. – వెలుగుల బాబ్జి, మిరప రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం రైతులే మార్కెటింగ్ చేసుకునేలా చర్యలు ప్రస్తుతం రైతు దగ్గర వ్యాపారులు కేజీ రూ.300 వరకు కొంటున్నారు. దానిని రూ.1.200లకు అమ్ముకుంటున్నారు. రైతులే స్వయంగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. – ఎలియాజర్, డీపీఎం ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ 410 ఎకరాల్లో పొట్టి మిర్చి సాగు గొల్లప్రోలు మండలంలో ఈ ఏడాది 410 ఎకరాల్లో పొట్టి మిర్చి సాగు చేశారు. ఉద్యానశాఖ ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు అందిస్తున్నాము. మంచి డిమాండ్ ఉన్న పంట కావడంతో రైతులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. – బీవీ రమణ, జిల్లా ఉద్యాన శాఖాధికారి, కాకినాడ -
‘ఎర్ర’బంగారం మెరుపులు
సాక్షి, అమరావతి: మిరప రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నల్లతామరతో సహా తెగుళ్ల ప్రభావం ఈసారి పెద్దగా లేకపోవడం.. గతేడాది కంటే మిన్నగా దిగుబడులొచ్చే అవకాశం ఉండటం, మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలుకుతుండటంతో రైతుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.62 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది రికార్డు స్థాయిలో 5.12 లక్షల ఎకరాల్లో సాగైంది. పూతకొచ్చే దశలో విరుచుకుపడిన నల్లతామరకు తోడు అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఫలితంగా 60–70 శాతం పంట దెబ్బతినగా, హెక్టార్‌కు 20 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గుతుందని భావించారు. కానీ.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంట సాగవుతోంది. ఈ ఏడాది సాగు లక్ష్యం 3.95 లక్షల ఎకరాలు కాగా.. 5.55 లక్షల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేస్తున్నారు. సర్కారు బాసటతో.. నల్లతామర పురుగు ప్రభావంతో గతేడాది తీవ్రంగా నష్టపోయిన మిరప రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో విత్తు నుంచీ ప్రభుత్వం అండగా నిలిచింది. నాణ్యమైన మిరప నారును అందుబాటులో ఉంచడంతోపాటు నల్లతామరను ఎదుర్కొనేందుకు వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రోటోకాల్‌పై ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించింది. ప్రత్యేక పోస్టర్లు, హోర్డింగ్‌లతో పాటు కరపత్రాలు ముద్రించి వలంటీర్ల ద్వారా రైతులకు పంపిణీ చేయించింది. మిరప ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు తోట బడులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. వీడియో, ఆడియో సందేశాలతో వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం పంట పూత దశకు చేరుకోగా.. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఎక్కడా నల్లతామరతో పాటు ఇతర తెగుళ్ల జాడ కనిపించలేదు. ఫలితంగా దిగుబడులు కూడా ఈసారి గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది హెక్టార్‌కు 20 క్వింటాళ్లు రావడం గగనంగా మారగా.. ఈ ఏడాది హెక్టార్‌కు 40–50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో ధరలు 2020–21లో క్వింటాల్ రూ.13 వేలు పలికిన ఎండు మిర్చి 2021–22లో ఏకంగా రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ.27 వేల వరకు పలికింది. ప్రస్తుతం సాధారణ మిరప రకాలు రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతుండగా.. బాడిగ, 341 రకాలు రూ.27,500 వరకు పలుకుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతమున్న డిమాండ్ కొనసాగి.. ఎగుమతులు ఊపందుకుంటే ధరలు ఇదే రీతిలో కొనసాగే అవకాశాలుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దిగుబడి బాగా వచ్చేలా ఉంది నేను మూడెకరాల్లో మిరప వేశా. గతేడాది నల్లతామర పురుగు వల్ల ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. సేంద్రియ, బిందు, మల్చింగ్ విధానాల్లో సాగు చేయడంతో తెగుళ్ల బెడద కన్పించలేదు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా ఉంది. మార్కెట్లో రేటు కూడా బాగుంది. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నా. – కల్యాణం వెంకట కృష్ణారావు, కోనయపాలెం, చందర్లపాడు, ఎన్టీఆర్ జిల్లా నల్లతామర ప్రభావం లేదు ఈ ఏడాది నల్లతామర ప్రభావం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. వర్షాలు కాస్త కలవరపెడుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడులొస్తాయి. గతేడాది హెక్టార్‌కు 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది రెట్టింపు వస్తుందని అంచనా వేస్తున్నాం. – వంగ నవీన్‌రెడ్డి, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా రికార్డు స్థాయిలో సాగు గతేడాది నల్లతామర దెబ్బకు ఈసారి విస్తీర్ణం తగ్గిపోతుందనుకున్నాం. కానీ రికార్డు స్థాయిలో రైతులు మిరప సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుకు విత్తు నుంచీ తోడుగా నిలవటంతో పంటపై తెగుళ్ల ప్రభావం ఎక్కడా కన్పించడం లేదు. కచ్చితంగా హెక్టార్‌కు 50 క్వింటాళ్లకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
ఆంధ్ర మిర్చి రైతుకు అండగా...
చిన్న, సన్నకారు రైతులకు సాధికారితను అందించడంతో పాటు అనూహ్య మార్కెట్ ఒడిదుడుకుల నుంచి వారిని కాపాడేందుకు వెజిటబుల్ సీడ్స్ ఉత్పత్తిదారు సిన్జెన్టా ఇండియా ముందుకొచ్చింది. దీనిలో భాగంగా గుంటూరులోని మిర్చి పంట రైతుల కోసం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (ఏఐసీ)తో ప్రత్యేకమైన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో రైతులు తమ పంట దిగుబడికి సహేతుకమైన ధరలను పొందగలరు. అంతేకాకుండా మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయినప్పటికీ నష్టాల బారిన పడకుండా కాపాడుకోగలరని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ బీమా పధకాన్ని ప్రారంభించిన సందర్భంగా సిన్జెన్టా ఇండియా చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్ డాక్టర్ కె సీ రవి మాట్లాడుతూ ‘‘ చిన్న కమతాల రైతులకు మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల నుంచి కాపాడేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. దీనిద్వారా వారు తమ ఆదాయానికి భద్రత పొందగలరు మరియు వారు కోరుకున్న పంటను సాగు చేసుకునే అవకాశమూ లభిస్తుంది. ఈ పథకం మిర్చి పంట సాగు చేస్తున్న రైతులకు ఓ గొప్ప తోడ్పాటుగా నిలువనుంది. దాదాపు 80% ఎండుమిర్చి వేలం గుంటూరు ఏపీఎంసీని పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి సరైన వేదిక’’ అన్నారు. ‘‘తమ వర్కింగ్ క్యాపిటల్‌ను తిరిగి పొందడంతో పాటుగా పంట ఉత్పత్తిలో ఎదురయ్యే ఖర్చులనూ సెటిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు తాము పండించిన పంటను సుదీర్ఘకాలం పాటు విక్రయించకుండా ఉండలేరు. అయితే మార్కెట్లో డిమాండ్–సరఫరా నడుమ అంతరాల కారణంగా మార్కెట్లో నిత్యావసరాల ధరలలో హెచ్చుతగ్గులు వల్ల రైతులు నష్టపోయే అవకాశాలూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో తాము పెట్టుబడి పెట్టిన డబ్బును సురక్షితంగా ఉంటుందంటేనే రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు. స్థిరమైన మార్కెట్ ధరను పొందడం ద్వారా రైతులు పంట ఎంపికలో సరైన నిర్ణయాలను తీసుకోగలరు’’ అని ఏఐసీ సీఎండీ ఎంకె పొద్దార్ అన్నారు. -
నల్ల తామరతో జాగ్రత్త!
మిరప పంటను నల్ల తామర పురుగులు గత ఏడాది తీవ్రంగా నష్టపరిచాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడిన రైతులు ఎక్కువగా పంట నష్టాన్ని చవిచూశారు. రసాయన రహిత పద్ధతుల్లో సేద్యం చేసిన రైతులు తక్కువ ఖర్చుతోనే పంటను చాలా వరకు రక్షించుకోగలిగారు. బ్లాక్ త్రిప్స్ లేదా నల్ల తామర (త్రిప్స్ పర్విస్పినస్).. కొత్త రకం పురుగు ఇది. గత ఏడాది మిరప తోటల్లో విధ్వంసం సృష్టించి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. తెలుగు రాష్ట్రాలు సహా ఆరు రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో వందలాది గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) నిపుణులతో కూడిన కమిటీ లెక్క తేల్చింది. బ్లాక్ త్రిప్స్ 2015లో తొలిసారి బెంగళూరు పరిసరాల్లో బొప్పాయి తోటల్లో మొదటిసారి ఈ కొత్త రకం తామరపురుగు ను శాస్త్రవేత్తలు గుర్తించారు. 2018–19లో కర్ణాటకలో అనేక జాతుల అలంకరణ మొక్కలకు సోకింది. 2021లో మిర్చి పంటను తొలి సారి ఆశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, చత్తిస్‌ఘడ్ రాష్ట్రాల్లో పంటలకు నష్టం కలిగించింది. మిరపకు అత్యధికంగా దిగుబడి నష్టం కలిగించింది. మిరపతో ఆగలేదు. 2021 అక్టోబర్–డిసెంబర్ మధ్యకాలంలో కేంద్ర శాస్త్రవేత్తల బృందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో పర్యటించినప్పుడు మిరపతోపాటు వంగ, మినుము, కంది, పుచ్చ, కీర దోస, సొర, మామిడి, పత్తి పంటల్లోనూ బ్లాక్ త్రిప్స్ కనిపించింది. ప్రపంచ మిరప సాగు విస్తీర్ణంలో 40% మన దేశంలోనే ఉంది. అత్యధిక మిరప ఉత్పత్తిదారు, ఎగుమతిదారు కూడా మన దేశమే. హెక్టారుకు రూ.2.5 లక్షల నుంచి 4 లక్షల మేరకు రైతులు పెట్టుబడి పెట్టే వాణిజ్య పంట కావటంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో మిరప పంటను సాగు చేసుకునే పద్ధతిని ఏపీ రైతు సాధికార సంస్థ నిపుణులు కంచర్ల రామచంద్రం రైతులకు ఈ కింది విధంగా సూచించారు. తామర పురుగులు 1–2 ఎం.ఎం. పొడవుంటాయి. మిరప పైరును ఆశించి ఆకులు, పూత నుంచి రసం పీల్చటం వలన ఆకులు పైకి ముడుచుకుంటాయి. మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పూత రాలిపోతుంది. కాయలు గిడసబారి పొట్టిగా ఉంటాయి. దిగుబడులు పూర్తిగా తగ్గుతాయి. తామర పురుగుల బెడద తగ్గాలంటే మిరప రైతులు ఈ పద్ధతులను పాటించాలి. 1. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడొద్దు. ఘన, ద్రవ జీవామృతాలను మాత్రమే వాడాలి. ఘన జీవామృతం ఎకరాకు 1500 కిలోలు దుక్కిలో వేసి బోదెలు తోలాలి. మిరప మొక్కలు నాటే రోజు 500 కిలోల ఘన జీవామృతాన్ని మొక్కల మొదళ్ల దగ్గర వేస్తూ నాటాలి. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతంను నీటి తడులతో పారించాలి. స్ప్రే కూడా చేయాలి. 2. మిరప పంటను ఏకపంటగా సాగు చేయకూడదు. అంతర పంటలుగా.. ఉల్లి, కొత్తిమీర, ముల్లంగి వంటి పంటలను.. ప్రతి రెండు మిరప మొక్కలకు మధ్య నాటాలి. 3. మిరపలో ఎర పంట (ట్రాప్ క్రాప్)గా ఎకరానికి 200–300 బంతి మొక్కలు నాటాలి. 4. ప్రతి ఎకరాకు 25–30 నీలి రంగు జిగురు అట్టలను పొలంలో అక్కడక్కడా పెట్టాలి. 5. మిరప పొలం చుట్టూ 3 లేదా 4 వరుసల్లో మొక్కజొన్న/జొన్నను రక్షక పంటగా విత్తాలి. 6. మిరప మొక్కలు నాటిన 10వ రోజు నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి: ► మొదట 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ∙3 రోజుల తర్వాత గంజి ద్రావణం పిచికారీ చేయాలి. ∙7 రోజుల తర్వాత కోడిగుడ్లు+నిమ్మ రసం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ∙15 రోజులకు పేడ+మూత్రం+ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ► 22వ రోజు వంద లీటర్ల నీటిలో 10 లీ. ద్రవ జీవామృతంతోపాటు 250 గ్రా. వర్టిసిల్లియమ్ లెకాని స్ప్రేచేయాలి. ► 30వ రోజు దశపర్ణి కషాయం స్ప్రే చేయాలి. ► 37వ రోజు మట్టి ద్రావణం స్ప్రే చేయాలి. ► 45వ రోజు నల్లేరు కషాయం స్ప్రే చేయాలి. తదుపరి అవసరాన్ని బట్టి పై షెడ్యూల్ ప్రకారం తిరిగి అదే వరుసలో మరోసారి పిచికారీ చేయాలి. ఏపీ రైతు సాధికార సంస్థ నిపుణులు కంచర్ల రామచంద్రంను 90004 00515 నంబరులో సంప్రదించవచ్చు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Kakinada: నల్ల తామరకు ‘ఉల్లి’ కళ్లెం! ఆదర్శంగా దుర్గాడ రైతులు..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అలాంటి ఉల్లి రైతులకు తల్లిగా మారింది. కుళ్లిన ఉల్లిపాయలతో తయారు చేసిన కషాయం పొట్టి మిర్చి మొదలు అనేక ఇతర పంటలకూ సంజీవినిగా మారింది. అనుకోని ఉపద్రవాలకు పకృతి వ్యవసాయమే ధీటుగా సమాధానం చెబుతుందని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన రైతులు నిరూపించారు. దుర్గాడ గ్రామంలో సుమారు వెయ్యి మంది చిన్నా, పెద్దా రైతులు ఉంటారు. పొట్టి మిర్చి అనే అరుదైన దేశవాళీ రకం రౌండ్ మిర్చికి దుర్గాడ పెట్టింది పేరు. వందలాది మంది రైతులు ఈ రకం మిర్చిని ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే సాగు చేశారు. ఈ ఏడాది మిర్చి తోటలను నల్ల తామర (త్రిప్స్ పార్విస్పైనస్) సర్వనాశనం చేసింది. దుర్గాడలో సుమారు 300 ఎకరాల వరకు ఉల్లి సాగవుతోంది. కుళ్లిపోయిన ఉల్లి పాయలతో తయారు చేసిన కషాయం మిరప తోటలను, ఇతర తోటలను రసంపీల్చే పురుగుల నుంచి రక్షించడానికి ఉపయోగపడటం విశేషం. ‘ఉల్లి కషాయంతో ముడత విడిపోతుండటంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా రైతులోకంలో పాకిపోయింది. గత డిసెంబర్లో అనేక జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా రైతులు దుర్గాడ వచ్చి ఉల్లి కషాయాన్ని తీసుకెళ్లి పంటలను రక్షించుకున్నారు. లీటరు రూ.30కి విక్రయిస్తున్నాం. అప్పట్లో రోజుకు 500–600 లీటర్ల వరకు అమ్మాం. మిర్చితోపాటు అనేక ఇతర పంటల్లోనూ రసం పీల్చే పురుగులన్నిటినీ ఉల్లి కషాయం కంట్రోల్ చేసింది. దుర్గాడలో ఉల్లి కషాయం వాడని రైతు లేరు. ఈ ఏడాది ఆ గ్రామానికి చెందిన వెయ్యి మందికి పైగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తామంటున్నారు..’ అని ఏపీ ప్రకృతి వ్యవసాయ విభాగం ఎంసీఆర్పీ వెంకట రమణ ‘సాక్షి’తో చెప్పారు. మిరప, మామిడి, పత్తి, మునగ, దోస, సొర, క్యాప్సికం, బంతి, చామంతి, టమాటా, దొండ వంటి అనేక పంటలపై దాడి చేస్తున్న రసంపీల్చే పురుగుల నియంత్రణకు ఉల్లి కషాయం చాలా ఉపయోగపడిందని ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది చెబుతున్నారు. ఉల్లి కషాయంతో పాటు, కుళ్లిన చేపలతో మీనామృతం, అల్లం వెల్లుల్లితో తయారైన అగ్నిఅస్త్రం, దేశవాళీ ఆవు పెరుగుతో తయారైన పులిసిన మజ్జిగతో ప్రకృతి వ్యవసాయంలో చక్కని ఫలితాలు సాధిస్తూ దుర్గాడ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయనిక వ్యవసాయం చేస్తున్న ముర్రె మన్నెయ్య అనే మిర్చి రైతు నల్ల తామర తాకిడికి పంటను పీకేద్దామనుకున్నాడు. పక్క పొలానికి చెందిన రైతు సూచన మేరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మారి అనేక దశపర్ణి కషాయం, ఉల్లి కషాయం, పుల్లమజ్జిగ, పంచగవ్య పిచికారీ చేసి పంటను పూర్తిగా రక్షించుకున్నారు. అసలేమీ రాదనుకున్న ఎకరంన్నర పొలంలో సుమారు పది క్వింటాళ్ల మిర్చి దిగుబడి పొందారు. నష్టాలపాలయ్యే దశలో సాగు పద్ధతి మార్చుకొని లాభాలు పొందాడు. ప్రతి ఇల్లూ కషాయ విక్రయ కేంద్రమే! దుర్గాడలో పంట సీజన్లో సుమారు 15 టన్నుల వరకు ఉల్లిపాయలు పాడైపోతూ ఉంటాయి. గతంలో వీటిని పారేసే వారు. కానీ ప్రస్తుతం ఉల్లి కషాయం తయారీలో కుళ్లిన ఉల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో దానికీ ఆర్థిక విలువ వచ్చింది. మామూలు ఉల్లి కేజీ రూ. 20 ఉంటే పనికి రాని ఉల్లి కేజీ రూ. 3–5 వరకు పలుకుతోంది. ఇళ్ల దగ్గర పూల మొక్కలకు బదులుగా సీతాఫలం, ఉమ్మెత్త, వేప తదితర ఔషధ మొక్కలను పెంచటం ప్రారంభించారు. ప్రతీ ఇంటి వద్దా దేశవాళీ ఆవులు దర్శనమిస్తున్నాయి. గ్రామం మొత్తంలో సుమారు 70 మంది రైతులు తమ ఇళ్ల వద్ద ఉల్లి కషాయం తయారు చేసి అమ్మటం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. ప్రతి రైతూ ఉల్లి కషాయం వాడారు ప్రకృతి వ్యవసాయంలో ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు పొట్టి మిర్చి దిగుబడి వచ్చేది. అయితే, ఈ ఏడాది నల్లతామర విరుచుకు పడటంతో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే రైతులు చాలా మంది పూర్తిగా నష్టపోయి తోటలు పీకేసి నువ్వులు వేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మిరప చేలు ఉల్లి కషాయం వల్ల తట్టుకున్నాయి. దిగుబడి 15 క్వింటాళ్లకు తగ్గింది. దుగ్గాడలో రసాయన సేద్యం చేసే రైతులు సహా ప్రతి రైతూ ఏపీ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం తయారు చేసి ఇచ్చిన ఉల్లి కషాయం వాడి ఉపశమనం పొందారు. తోటలు తీసేద్దామనుకున్న రసాయన రైతులు కొందరు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించి తోటలను నిలబెట్టుకున్నారు. – ఎలియాజర్(94416 56083), ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్టు మేనేజర్, కాకినాడ జిల్లా ఉల్లి కషాయం బాగా పని చేస్తోంది ఉల్లి కషాయం పంటలను ఆశించే రసంపీల్చే పురుగులను బాగా కట్టడి చేస్తోంది. పకృతి వ్యవసాయం డీపీఎం గారు ఉల్లి కషాయం తయారీ విధానాన్ని వివరించగా ప్రయోగాత్మకంగా తయారు చేసి చూసాను. మొదట్లో నా పొలంలో పిచికారీ చేస్తే పురుగుల తీవ్రత తగ్గి పంట నిలబడింది. దీంతో ఎక్కువ మోతాదులో తయారీ ప్రారంభించా. ప్రతి రోజూ 20–50 లీటర్ల ఉల్లి కషాయం తయారు చేస్తున్నాను. ఇప్పటి వరకు సుమారు 80 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుచేసిన మిర్చి పంట నల్ల తామర పురుగును తట్టుకుని నిలబడడంతో మిగిలిన రైతులు కూడా వాడడం ప్రారంభించారు. సొంతంగా దేశవాళీ ఆవులను పెంచుతూ భారీగా ఉల్లి కషాయం, జీవామృతం, మీనామృతం, అగ్ని అస్త్రం వంటి మందులు తయారు చేసి స్థానిక రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఇతర ప్రాంతాల రైతులు కూడా వచ్చి ఉల్లి కషాయం కొనుక్కెళ్తున్నారు. – గుండ్ర శివ చక్రం (95537 31023), రైతు, ఉల్లి కషాయం తయారీదారుడు, దుర్గాడ, కాకినాడ జిల్లా ఉల్లి కషాయం తయారీ, వాడకం ఇలా.. ఉల్లి కషాయానికి కావాల్సినవి: ఉల్లి పాయలు (కుళ్లినవైనా పర్వాలేదు) – 20 కేజీలు, వేపాకు – 5 కేజీలు, సీతాఫలం ఆకు – 2 కేజీలు, ఉమ్మెత్తాకు – 1 కేజీ, గోమూత్రం – 20 లీటర్లు, గోవు పేడ – 2 కేజీలు. తయారు చేసే విధానం: ఉల్లి పాయలు, వేపాకులు, సీతాఫలం ఆకులు, ఉమ్మెత్తాకులను మెత్తగా దంచి ముద్దగా చేసి దానికి ఆవు పేడ కలిపి సిద్ధం చేసుకోవాలి. ఒక పొయ్యిపై పెద్ద పాత్రను పెట్టి 20 లీటర్ల గోమూత్రాన్ని పోసి, దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఆకులు, ఉల్లి మిశ్రమాన్ని దానిలో కలుపుకోవాలి. మూడు పొంగులు వచ్చే వరకు అర గంట పాటు మరగబెట్టాలి. తరువాత చల్లారనిచ్చి, వడకట్టి ఒక పరిశుభ్రమైన డ్రమ్ములో భద్రపరచుకోవాలి. ఇలా దాదాపు 20 లీటర్ల ఉల్లి కషాయం తయారవుతుంది. మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఉల్లి కషాయాన్ని వారానికి ఒకసారి చొప్పున మూడు వారాల పాటు పిచికారీ చేయడం వల్ల చీడపీడల నుంచి పంటకు ఉపశమనం లభిస్తుంది. వాడే విధానం: 4 లీటర్ల ఉల్లి కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి చేలల్లో పిచికారీ చేసుకోవాలి. ఉల్లి కషాయం కలిపిన సుమారు 150 లీటర్ల ద్రావణం ఎకరానికి అవసరమవుతుంది. ఉద్యానవన పంటలకు ఆకులు మొదళ్లు తడిచేలా పిచికారీ చేసుకోవడం వల్ల అన్ని రకాల పురుగులు నశిస్తాయని రైతులు చెబుతున్నారు. దుర్గాడలో ఉల్లి కషాయాన్ని పకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు లీటరు రూ. 30లకు విక్రయిస్తున్నారు. – వీఎస్‌వీఎస్ వరప్రసాద్, సాక్షి, పిఠాపురం, కాకినాడ జిల్లా -
పంట పోయింది.. గుండె ఆగింది
గార్ల: తామర పురుగు ఆశించి మిర్చితోట ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే మనో వేదనతో ఓ రైతు గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్నకిష్టాపురంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మాళోత్ భావ్‌సింగ్ (40) తన 20 గుంటల భూమితో పాటు మరో 20 గుంటల భూమిని కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. పంటకు నల్ల తామర పురుగు సోకడంతో పూత కాత రాకపోగా, మొక్కలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే తోటకు రూ.1.5 లక్షలు బయట అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో శుక్రవారం తోటకు నీళ్లు కట్టి ఇంటికి వచ్చి గుండెపోటుతో కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి చూసేసరికి మృతి చెందాడు. -
హోమియోలో మందు ఉంది
సాక్షి, యాదాద్రి: నల్లతామర పురుగు, నల్లపేను వంటి తెగుళ్లతో నష్టపోతున్న మిర్చి రైతులు పంటకు హోమియోపతి మందులు పిచికారీ చేస్తే తెగుళ్లకు చెక్ పెట్టవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురానికి చెందిన అమేయ కృషి వికాస కేంద్రం యజమాని జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 19 రకాలకు పైగా తెగుళ్లు సోకి లక్షలాది ఎకరాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రైతులు మిర్చికి సోకుతున్న చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించి పురుగుమందులు పిచికారీ చేస్తున్నా ఆశించిన ఫలితం ఉండడం లేదు. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గా, అలాగే ఒడిశాలోని పలు జిల్లాల్లో మిరప పంటకు తెగుళ్లు సోకి రైతులు భారీగా నష్టపోతున్నారు. హోమియోపతి మందులతో.. మనుషులు వివిధ రోగాలకు వాడే హోమియోపతి మందులను ప్రత్యామ్నాయంగా మిర్చిపంట తెగుళ్లకు వాడుకుంటుంటే ఫలితం ఉంటుందని బాల్‌రెడ్డి చెప్పారు. ఎకరాకు రూ.10 వేల ఖర్చు అవుతుందన్నారు. నాట్లు వేసే సమయంలోనే గుర్తించాలి కానీ, ఆలస్యం అయిందన్నారు. ఇప్పటికైనా రైతులు హోమియో మందులను వాడితే నష్టాల నుంచి బయటపడవచ్చని సూచించారు. ముఖ్యంగా తామర పురుగు నివారణకు అర్నేరియాడయోడెమా 30, తూజా 30 హోమియో మందులను పిచికారీ చేయాలని, 20 లీటర్ల నీటిలో 2.5 మి.లీటర్లు పోసి పిచికారీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇండోనేíసియా నుంచి నల్లపేను.. ఇండోనేసియా నుంచి వచ్చిందని చెబుతున్న నల్లపేను తెగులు మిరప పంటపొలాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మిరప రైతులు తక్కువ ఖర్చుతో లభించే హోమియోపతి మందులను వాడితే ప్రయోజనం ఉంటుందని జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు. వరంగల్, గుంటూరు, కృష్ణా, రాయచూర్ జిల్లాల్లో తాను సూచించిన హోమియో పతి మందులను వాడి రైతులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన వెల్లడించారు. -
పంటను తినేస్తున్న ఆ పురుగు జాడ తెలిసింది
సాక్షి, అమరావతి: మిరపను చిదిమేసింది.. మామిడి పూతను ఆశించింది.. చింతను తాకింది.. ఇక కందులు, పెసలు, శనగతో పాటు పత్తి, వంగ, మునగ, దోస, సొర, కాప్సికమ్, బంతి, చామంతి.. ఇలా పలు పంటలను ఆశిస్తోంది. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టిస్తోంది. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ పురుగు ఉధృతిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగి అధ్యయనం చేస్తున్నాయి. ఇలా ఒక్కసారిగా దాదాపు అన్ని రకాల పంటలపై దాడి చేసి, నాశనం చేస్తున్న దీనిని వ్యవసాయ శాస్త్రవేత్తలు ‘త్రిప్స్ పార్విస్పైనస్’ అని చెబుతున్నారు. అంటే అదో కొత్త రకం తామర పురుగు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా మూడేళ్లుగా మిరప ధరలు మార్కెట్లో నిలకడగా ఉన్నాయి. ఈ ఏడాది ఏకంగా క్వింటాల్ రూ.16 వేల నుంచి రూ.20 వేలకు పైగా పలుకుతోంది. ఈ కారణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో మిరప సాగైంది. అయితే అనూహ్యంగా ఈ ఏడాది ఈ పంటను ఈ కొత్త తామర పురుగు చిదిమేసింది. తొలుత సాధారణ తామర పురుగు (స్కిప్టో ట్రిప్స్ డార్సాలిస్) గానే భావించారు. సాధారణ పురుగు ఆకుల మీద చేరి రసాన్ని పీలిస్తే, ఈ కొత్త రకం పురుగు పూత, పిందెల్లోకి చేరి రసాన్ని పీల్చి.. కనీస దిగుబడి కూడా రానీయకుండా నాశనం చేస్తుందని గుర్తించారు. యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు – ఈ పురుగు ఉధృతిని ఆదిలోనే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టింది. ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన బృందాలను తొలుత రంగంలోకి దింపింది. శాంపిల్స్ సేకరించి నేషనల్ బ్యూరో ఫర్ అగ్రికల్చర్ ఇన్సెట్ రీసోర్సెస్ (ఎన్బీ ఎఐఆర్)కు పంపించింది. – ఇది సాధారణ తామర పురుగు కాదని సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రిప్స్‌లో ఒకటైన ట్రిప్స్ పార్విస్పైనస్గా, ఇండోనేషియా నుంచి 2015లో మన దేశంలోకి చొరబడినట్టుగా గుర్తించారు. రాష్ట్ర ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య పద్ధతులు పాటించేలా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో 20–30 శాతం పంటను కాపాడగలిగారు. రంగంలోకి జాతీయ పరిశోధనా సంస్థలు – భవిష్యత్‌లో పెనువిపత్తుగా మారబోతుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)తో పాటు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు లేఖలు రాసి కేంద్రంపై ఒత్తిడి తీసు కొచ్చింది. – ఫలితంగా ఐసీఎఆర్కు అనుబంధంగా పని చేస్తోన్న డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ (డీపీపీక్యూఎస్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ (ఐఐహచ్ఆర్), నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ (ఎన్‌సీఐపీఎం), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ (సీఐపీసీ)లతో పాటు ఎన్బీ ఏఐఆర్లకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తల బృందాలు.. ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించాయి. – ఇండోనేషియా, మలేషియా దేశాల్లో పుట్టిన ఈ కీటక ఉధృతిని ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్ఘడ్æ, గుజరాత్, మహారాష్ట్రలో గమనించారు. మిరపతో పాటు ఇతర పంటలకూ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. సాధారణంగా తామర పురుగు బలహీన పడి సంతతి తగ్గిపోవడంతో.. దాని స్థానంలో బలమైన ఈ కొత్త రకం తామర పురుగు వ్యాపిస్తున్నట్టుగా గుర్తించారు. – ఈ బృందాలు గత నెల రోజుల్లో మూడు విడతలుగా పర్యటించాయి. ప్రస్తుతం ఏపీ–తెలంగాణాలో పర్యటిస్తున్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న పంటను ఏ విధంగా కాపాడాలి? రానున్న సీజన్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇతర పంటలకు వ్యాపించకుండా ఏం చేయాలి? అనే అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి త్వరలో కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. ఏపీ ప్రభుత్వ చొరవ వల్లే.. 2015లో దేశంలో గుర్తించిన ఈ పురుగు 2021లో ఉధృతంగా వ్యాపించింది. ఇందుకు గల కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నాం. దీని ఉధృతిని ఏపీ ప్రభుత్వమే ముందుగా గుర్తించింది. కేంద్రానికి లేఖలు రాయడం వల్లే ఐసీఏఆర్ బృందాలను పంపింది. గ్రామ స్థాయిలో యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఇంత ఉధృతిలో కూడా 20–30 శాతం పంటను కాపాడగలిగారు. దీని కట్టడికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్‌లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై వారంలోగా కేంద్రానికి నివేదిక సమర్పించ బోతున్నాం – డాక్టర్ రచన ఆర్ఆర్, సీనియర్ శాస్త్రవేత్త, ఎన్‌బీఎఐఆర్, బెంగళూరు పంట నష్టం అపారం ఈ పురుగు మిరపపై ఉధృతంగా వ్యాపించింది. 60 శాతానికి పైగా పంటను దెబ్బతీసింది. నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మిరపతో పాటు ఇతర పంటలపై కూడా ఎక్కువగా కన్పిస్తోంది. సాధ్యమైనంత త్వరగా దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా వచ్చే సీజన్లో విత్తు నుంచి కోత వరకు అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై కేంద్రం త్వరలో ప్రొటోకాల్‌ను రూపొందిస్తుంది. – డాక్టర్ రాఘవేంద్ర కే.వీ, ఎంటమాలజీ శాస్త్రవేత్త, ఎన్‌సీఐపీఎం, న్యూఢిల్లీ ప్రారంభ దశలోనే గుర్తించాం ఈ పురుగు ఉధృతిని ప్రారంభ దశలోనే గుర్తించాం. ఎన్బీఏఐఆర్కు శాంపిల్స్ పంపించాం. వాటి తీవ్రతను గుర్తించగలిగాం. ఆర్బీకే స్థాయిలో యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాం. రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే జాతీయ స్థాయిలో అధ్యయనం జరుగుతోంది. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఏపీ ఉద్యాన శాఖ -
38 సార్లు మందు కొట్టినా.. చేతికి అందలేదు
సాక్షి, కోదాడ(నల్లగొండ): గతేడాది మిర్చికి మార్కెట్లో మంచి రేటు ఉండటంతో ఈ ఏడాది రైతులు ఎంతో ఆశతో మిరప సాగు చేపట్టారు. కానీ, తెగుళ్ల తీవ్రతతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. విపరీతమైన తెగుళ్లతో పంట ఎదుగుదల లేక, పూత రాక.. వచ్చినా కాత నిలవకుండా పోయింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రెడ్లకుంటకు చెందిన అంబటి నారాయణ రెండు ఎకరాల్లో మిరప సాగు చేపట్టారు. సాగు చేసిన తర్వాత పంటకు విపరీతంగా తెగుళ్లు సోకడంతో పురుగు మందులతో పాటు సేంద్రియ ద్రావణాలను కూడా దాదాపు 38 సార్లు స్ప్రే చేశాడు. రెండు ఎకరాల సాగు కోసం రూ.లక్షా 25 వేల పెట్టుబడి పెట్టాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. క్వింటా మిరప కూడా దిగుబడి రాలేదు. చేసేదేం లేక గత వారం రోజులుగా పంటపొలంలో గేదెలు మేపుతున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
Photo Story: కడుపు మంట.. కన్నుల పంట
ధాన్యపు రాశులు ఒక వైపు... దీన గాథలు మరో వైపు. వ్యవసాయం జూదాన్ని తలపిస్తోంది. కొన్ని పంటలు అన్నదాతలకు నష్టాలు మిగులుస్తుంటే.. కొన్ని పంటలు రైతులకు లాభాల్ని ఆర్జించిపెడుతున్నాయి. కడుపు మంట రఘునాథపాలెం: మిరప సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయన్న ఆ రైతు ఆశలు అడియాశలయ్యాయి. తెగుళ్ల కారణంగా కాపు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రైతు మిరప తోటను దున్నేశాడు. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం సూర్యా తండాకు చెందిన రైతు అంగ్రోత్ మత్రు గత ఏడాది మిర్చి క్వింటాకు రూ.15 వేల ధర పలకడంతో ఈసారి కూడా 2 ఎకరాల్లో సాగు చేశాడు. ఎకరానికి దాదాపు రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. తీరా కాపు దశకు చేరాక గుబ్బ రోగంతో కాయ ముడుచుకు పోయింది. దీంతో తోటకోసం చేసిన అప్పు తీర్చేందుకు కూరగాయలు సాగు చేయాలని నిర్ణయించుకున్న మత్రు, పంటను సోమవారం ట్రాక్టర్‌తో దున్నేశాడు. మండలంలో మిర్చి తోటలను వైరస్ ఆశించిందని వ్యవసాయాధికారి తెలిపారు. కన్నుల పంట గోదావరి జలాలు జిల్లా వ్యాప్తంగా పుష్కలంగా అందటంతో నేల బంగారు సిరులను కురిపించింది. జిల్లాలో దాదాపు 2,28,436 ఎకరాలలో అన్నదాతలు వరిపంట సాగు చేశారు. ప్రకృతి కూడా కరుణించడంతో ఈసారి అధిక దిగుబడి వచ్చింది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మార్కెట్లతోపాటు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిండుగా దర్శనమిస్తోంది. సిద్దిపేట మార్కెట్ ధాన్యరాశులతో ఇలా కళకళలాడుతోంది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
మిర్చి సాగు భళా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిర్చి సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రధాన పంటలలో ఒకటైన మిర్చి వచ్చే ఖరీఫ్‌లో 28 వేల హెక్టార్లలో అదనంగా సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 1.22 లక్షల హెక్టార్లలో సాగు అవగా ఈ ఖరీఫ్‌లో 1.50 లక్షల హెక్టార్లలో అవుతుందని అంచనా. అంటే 28 వేల హెక్టార్లలో అదనంగా సాగు అయ్యే అవ కాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా విత్తన ప్రణాళిక ను ఖరారు చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య వెల్ల డించారు. సుమారు 40 వేల కిలోల విత్తనాలు సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భం గా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. ► నాణ్యమైన విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల వద్దనే కొనుగోలు చేయండి. విత్తనానికి భరోసా ఉంటుంది. ► అధీకృత డీలర్ నుంచి మాత్రమే విత్తనాలు, నమోదయిన నర్సరీల నుంచే నారు కొనుగోలు చేయాలి. ► విత్తనాలు, నారు లభ్యతపై ఏమైనా సమస్య లుంటే స్థానిక మండల వ్యవసాయాధికారిని సంప్రదించవచ్చు. ► నకిలీ విత్తనాన్ని అంటగట్టే ప్రమాదం ఉన్నందున అధిక డిమాండ్ ఉన్న హైబ్రీడ్ రకాలను ఎంచుకోవద్దు. ► భూసార పరీక్షల ఆధారంగా మాత్రమే ఎరువులను వాడాలి. ► కల్తీ, నకిలీ విత్తనాలు ఎక్కడైనా అమ్ముతున్న ట్టు దృష్టికి వస్తే సమీపంలోని వ్యవసాయా« దికారికి లేదా 1902కి ఫిర్యాదు చేయవచ్చు. ► మిర్చి విత్తనాలకు విత్తన శుద్ధి చాలా అవస రం. పురుగు, తెగుళ్ల మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వైరస్ నివారణకు ట్రైసోడియం ఆర్థోఫాస్పేట్తో విత్తన శుద్ధి చేయాలి. ఏఏ వంగడాలు అనువైనవంటే... అనువైన రకాలు, విత్తన శుద్ధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యాన వర్సిటీ లాం పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సి. శారద రైతులకు పలు సూచనలు చేశారు. ► ఉద్యానవర్సిటీ నుంచి వెలువడిన జీ–3, జీ–4, జీ–5, సింధూర్, భాస్కర్, ఎల్సీఏ–334, ఎల్సీఏ–353 రకాలు అధిక దిగుబడులు ఇస్తాయి. ► సూటి రకాలలో ఎల్సీఏ–620, ఎల్సీఏ 625, సంకర రకాలలో ఎల్సీహెచ్–111, పాప్రికా రకాలలో ఎల్సీఏ 424, ఎల్సీఏ 436 ఉన్నాయి. ► ఎల్సీఏ–620 రకం 170 నుంచి 190 రోజుల్లో దిగుబడి వస్తుంది. హెక్టార్‌కు 65 నుంచి 68 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది. ► పలు ప్రైవేటు సంస్థలు కూడా వివిధ రకాల సూటి, సంకర రకాలను విడుదల చేస్తున్నాయి. ఇండాయ్–5, తేజస్వినీ, యూఎస్–341, దేవనూర్ డీలక్స్, గోల్డ్–50, బీఎస్ఎస్–355, బీఎస్ఎస్–273, హెచ్‌పీహెచ్ 5531, ఎస్4884, ఎస్–5531 ముఖ్యమైనవి. -
మిర్చిని మింగేస్తోంది
సాక్షి, అమరావతి: వాణిజ్య పంటల్లో ప్రధానమైన మిర్చికి కాయ కుళ్లు సోకి రైతులను అపార నష్టాలకు గురి చేస్తోంది. ప్రస్తుత వాతావరణం, అకాల వర్షాలు, మంచు, భూమిలో తేమ వంటి వాటి వల్ల ఈ తెగులు సోకుతోంది. దీనివల్ల మార్కెట్లో ధర పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖాధికారులు రైతుల్ని అప్రమత్తం చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. శాస్త్రవేత్తల బృందంతో కలిసి రైతులకు నేరుగా సూచనలు, సలహాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తెగులు పరిస్థితి ఇలా.. ప్రస్తుతం మిరప కాయ పండే దశలో కొంత, కోత దశలో మరికొంత ఉంది. కోత తర్వాత రవాణా, నిల్వ చేసే దశలో కూడా ఈ తెగులు రావొచ్చు. ఇప్పటికే పలుచోట్ల కాయ కుళ్లు సోకి తాలు కాయలుగా మారి రైతులు నష్టపోతున్నారు. కొల్లిటోట్రైకమ్ అనే శిలీంధ్రం వల్ల ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల 10నుంచి 54 శాతం వరకు దిగుబడి తగ్గిపోతుంది. కాయ నాణ్యత లోపిస్తుంది. పూత సమయంలో మొదలై ఈ నెలాఖరు (మార్చి) వరకు ఈ తెగులు కనిపిస్తూనే ఉంది. అకాల వర్షాలు పడితే తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నీటి పారుదల కింద సాగయ్యే తోటల్లో ఈ బెడద ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి నేలకు దగ్గరగా ఉన్న వాటి కాయలు లేదా ఆకులపై కాయ కుళ్లు లక్షణాలను గమనించవచ్చు. పండు కాయలపై తొలుత చిన్న నీటి మచ్చలు ఏర్పడి క్రమేపీ పెరుగుతాయి. మచ్చలు నలుపు రంగులోకి మారతాయి. తెగులు ఉధృతి ఎక్కువయ్యే కొద్దీ మచ్చల మధ్య భాగంలో వలయాలు ఏర్పడతాయి. పచ్చి కాయలకు కూడా శిలీంధ్రం సోకుతుంది. కానీ.. కాయ పండిన తరువాతే లక్షణాలు బయట పడతాయి. కుళ్లిన కాయలు రాలిపోతాయి. తెగులు ఆశించిన కాయలు ఎండిన తరువాత తాలు కాయలుగా మారతాయి. తాలు కాయలకు మార్కెట్లో ధర వుండదు. నివారణ ఎలాగంటే.. పంట మారుస్తుండాలి. విత్తనం నుంచి తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున మేలైన కాయ నుంచి విత్తనాన్ని సేకరించి శుద్ధి చేయాలి. ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కాప్టా్టన్తో లేదా 3 గ్రాముల మాంకోజెబ్ పట్టించి శుద్ధి చేయాలి. కాయలు పండటం మొదలైన వెంటనే ముందుజాగ్రత్త చర్యగా మాంకోజెబ్, కార్బండిజమ్ 2.5 గ్రాములు లేదా క్లోరోదలోనిల్ 2 గ్రాములు, ప్రోపినెబ్ 2 గ్రాముల్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశిస్తే అజాక్స్ స్త్రోబిన్, ప్రోపికొనజోల్, డైఫిన్ కొనజోల్, కాపర్ హైడ్రాక్సైడ్, పైరా క్లోస్ట్రోబిన్, మేటిరమ్, టేబుకోనజోల్, ట్రైప్లొక్స్ స్త్రోబిన్ మందులలో ఏదో ఒక దానిని 10 రోజుల వ్యవధిలో 2, 3 సార్లు పిచికారీ చేయాలని గుంటూరు లాంఫామ్‌లోని ఉద్యాన పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.హరిప్రసాదరావు సూచించారు. నేటినుంచి శాస్త్రవేత్తల బృందాల పర్యటన కాయ కుళ్లు తెగులుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. కాయ కోసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా చేలల్లో ఉన్న కాయలు నాణ్యత కోల్పోకుండా కాపాడుకునేందుకు సూచనలు, సలహాలను ఈ బృందం ఇస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్న తరుణంలో రైతులకు అవగాహన కల్పిస్తే ఇప్పుడే కాకుండా భవిష్యత్‌లోనూ మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు హనుమంతరావు చెప్పారు. తెగులు ఉధృతికి కారణాలివీ - తెగులును తట్టుకోలేని రకాల సాగు - ఏకరూప పంట వేయడం - కాయ పండే దశలో వర్షాలు కురవడం - నీటి తడులు ఎక్కువగా పెట్టడం, తేమ ఎక్కువగా ఉండటం - ఆకులు, కాయలపై తేమ ఎక్కువ సేపు ఉండటం - 20–24 డిగ్రీల ఉష్ణోగ్రత, 80 శాతం కంటే ఎక్కువ తేమ ఉండి మంచు ఎక్కువగా కురవడం -
బుంగ మిర్చి.. బందరు కుచ్చి
సాక్షి, మచిలీపట్నం: బుంగ మిర్చి. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో బుట్ట మిరప అని కూడా పిలుస్తారు. దీనికి మసాలా పెట్టి బజ్జీలేస్తే లొట్టలేసుకుని తినాల్సిందే. కొంచెం కారంగా.. ఇంకొంచెం కమ్మగా ఉండే ఈ బజ్జీ రకం మిర్చి అచ్చం క్యాప్సికమ్‌ను పోలి ఉంటుంది. కానీ.. సైజులో మాత్రం దానికంటే తక్కువ. అరుదైన ఈ రకం దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో మాత్రమే సాగులో ఉంది. ఆ తరువాత మచిలీపటా్ననికి కూతవేటు దూరంలోని పోతేపల్లిలో సాగవుతోంది. ఇక్కడి కౌలు రైతులు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలా వచ్చింది.. మచిలీపట్నంలోని రాజుపేటకు చెందిన ఓ వ్యక్తి సుమారు 50 ఏళ్ల క్రితం కర్ణాటక ప్రాంతం నుంచి ఒక మిరప మొక్కను తీసికొచ్చి నాటారట. దాని నుంచి వచ్చిన విత్తనాలతో రెండు మొక్కల్ని అభివృద్ధి చేసి.. వాటిలో ఒక దానిని పోతేపల్లి గ్రామంలో ఒక రైతుకు ఇచ్చారని చెబుతారు. ఆ ఒక్క మొక్క నుంచి వచ్చిన విత్తనాలతో 40 ఎకరాల్లో సాగు చేపట్టారని రైతులు చెబుతున్నారు. దీనిని అక్కడక్కడా కూర కోసం వినియోగించినా.. ఎక్కువగా బజ్జీలకే వాడతారు. కృష్ణా, గుంటూరు, విజయవాడ నగరాలతోపాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు, బరంపురం ప్రాంతాల్లో ఈ రకం మిర్చికి డిమాండ్ ఎక్కువ. ఇక్కడి నుంచి ప్రతి వారం కనీసం మూడు లారీల కాయలు ఎగుమతి అవుతాయి. ప్రత్యేకతలివీ.. తొలకరిలో ఇతర పంటల మాదిరిగానే జూన్‌లో నారు పోస్తారు. ఆగస్టులో మొక్కలు నాటుతారు. నాటిన మూడో నెల నుంచి 9వ నెల వరకు దిగుబడి వస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకూ వారానికోసారి కాయల్ని కోస్తారు. చల్లటి వాతావరణంలో మాత్రమే సాగయ్యే బుంగ మిరపకు ఎకరానికి రూ.3 లక్షల పెట్టుబడి అవుతుంది. దీనిని కౌలు రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.40 వేల వరకు కౌలు చెల్లిస్తారు. ఎకరానికి కనీసం 12 లక్షల వరకు కాయల దిగుబడి వస్తుంది. ఒక్కో కాయను 40 పైసల నుంచి 60 పైసలకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. కాయ సగటు ధర 50 పైసల వరకు ఉంటుంది. పెట్టుబడి, ఇతర ఖర్చులు పోను ఎకరానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. చిత్రమేమిటంటే ఈ పంట పోతేపల్లి గ్రామంలో మాత్రమే పండుతుంది. ఇక్కడి విత్తనాన్ని తీసుకెళ్లి పొరుగు గ్రామాల్లో సాగు చేసేందుకు ప్రయత్నించినా విజయవంతం కాలేదు. ప్రోత్సహిస్తున్నాం.. క్యాప్సికమ్ జాతికి చెందిన బుంగ మిర్చి రకం ఇసుక నేలల్లోనే పండుతుంది. పోతేపల్లిలో ఇసుక నేలలు ఎక్కువగా ఉండడం వలన ఈ పంట సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకు సలాహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం. –దయాకరబాబు, ఏడీ, హార్టికల్చర్ లాభాలు బాగుంటాయి ఈ రకం మిర్చి ఈ ప్రాంతంలోనే పండుతుంది. దీనిని సాగు చేస్తే లాభాలు బాగుంటాయి. మిగిలిన పంటలతో పోలిసే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కర్ణాటకలోని హుబ్లీ, బెల్గాం, ధార్వాడ ప్రాంతాల నుంచి విత్తనం తెచ్చుకుంటున్నాం. – కె.నూకలయ్య, రైతు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరింత సాగు ఎకరా 20 సెంట్లలో 40 ఏళ్లుగా ఈ పంట సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.రెండు లక్షల వరకు మిగులుతుంది. ఈ ప్రాంతంలో పండించే పంటను సేకరించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నా. ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే బాగుంటుంది. – కటికల రాజేష్, సాగుదారు -
‘ఎర్ర’ బంగారమే...
సాక్షి, ఖమ్మం: వర్షాభావ పరిస్థితులు.. చీడపీడలు.. గణనీయంగా పెరిగిన పెట్టుబడులు.. ఈ క్రమంలో ఎలాగోలా చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో ధర లేని పరిస్థితి. కష్టమైనా.. నష్టమైనా భరిద్దామనే ఉద్దేశంతో పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఇప్పుడు ఖరీఫ్ పంట పెట్టుబడికి నగదు అవసరం ఉండడంతో ఆ పంటను మార్కెట్లో అమ్ముతుండగా.. వారం రోజులుగా మిచ్చి పంటకు మంచి ధర పలుకుతోంది. మధిర వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుత సీజన్లో క్వింటాకు రూ.10,500లతో ప్రారంభమైన ధర శుక్రవారం నాటికి రూ.11,700 చేరింది. గత ఖరీఫ్‌లో రైతులు తక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేయగా.. ఇప్పుడు ధర మాత్రం బాగానే పలుకుతోంది. దీంతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన పంటను అమ్మేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో 25 లక్షల బస్తాల మిర్చి నిల్వ చేసుకునే అవకాశం ఉంది. గత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు, చీడపీడలు, వైరస్ ;పట్టడంతో ఆశించిన మేర మిర్చి పంట దిగుబడి రాలేదు. పంట చేతికొచ్చే సమయంలో పెట్టుబడులు, చేసిన అప్పులు తీర్చేందుకు కొందరు రైతులు మొదటి విడత కోసిన మిర్చిని కల్లాల్లోనే అమ్మగా.. మరికొందరు రైతులు తేజరకం క్వింటా మిర్చి రూ.8వేల నుంచి రూ.8,500, లావు రకం రూ.7వేల నుంచి రూ.7,500లకు అమ్మారు. ఇంకొందరు రైతులు ఆ రేటుకు మిర్చి అమ్మితే నష్టపోతామని భావించి కోల్ట్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 లక్షల బస్తాల మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో ఉంచారు. ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేస్తుండడంతో డిమాండ్ పెరిగి.. మంచి ధర కూడా పలుకుతోంది. ఇప్పటికే రైతులు 10 లక్షల బస్తాలను విక్రయించగా.. మరో 10 లక్షల బస్తాలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పంటలకు పెట్టుబడులు పెట్టేందుకు, గత ఏడాది చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు మిర్చి పంటను విక్రయించేందుకు సన్నద్ధమయ్యారు. దీనికితోడు గిట్టుబాట ధర కూడా ఉండడంతో పంటను విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రైతుల పంట ఉత్పత్తుల రాకతో మార్కెట్ యార్డు కళకళలాడుతోంది. ముఖ్యంగా తొడిమ తీసిన మిర్చిని 10 కేజీలు, 25 కేజీల ప్యాకింగ్‌తో చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు ఆర్డర్లు ఉన్నాయి. మిర్చి పంటకు ఆశాజనకమైన రేటు ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రైతు కంట.. మిర్చి మంట
గత ఏడాది పర్వాలేదనిపించిన మిరప ఈ ఏడాది పుట్టిముంచేలా ఉంది. పోయిన సంవత్సరం ధరలు, దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది మిరపను సాగు చేసేందుకు మరికొంత మంది రైతులు ముందుకొచ్చారు. మిరపలో వచ్చే లాభాలతో అప్పుల బాధ నుంచి గట్టెక్కవచ్చని ఆశించిన అన్నదాతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చేలకు వైరస్ సోకిందని వాపోన్నారు. మార్కెట్లో లభించే మందులన్నీ వాడినా పరిస్థితి మెరుగుపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పెట్టుబడులు పెరిగి, ధరలు దిగజారడంతో సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కారంచేడు (ప్రకాశం): జిల్లాలో సుమారు 54 వేల హెక్టార్ల (1.35 లక్షల ఎకరాలు)లో మిరప సాగు చేశారు. సాగుకు నీరు లేక పొలాలన్నీ బెట్టకు రావడమే కాకుండా భూమిలో తేమ లేక పంటలకు కొత్తకొత్త తెగుళ్లు సోకాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల రైతులు ఎకారానికి సగటున రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెప్తున్నారు. జిల్లాలో మిరప రైతులు పంటలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో మిరప చేలకు ప్రధానంగా బూడిద తెగులు, పండాకు, కొమ్మ ఎండు తెగుళ్లు ఆశించాయి. వీటి వల్ల దిగుబడులు ఘోరంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయాధికారుల సూచనల మేరకు మార్కెట్లో ఎన్ని రకాల నివారణ మందులున్నాయో వాటన్నింటినీ పిచికారి చేసామని సాగుదారులు వాపోతున్నారు. సాగునీరు జిల్లాకు సక్రమంగా విడుదల కాకపోవడమే మిరప రైతు నష్టానికి కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన సాగు ఖర్చులు: గత ఏడాదితో పోల్చుకుంటే భూమి కౌలు నుంచి పంట చేతికందే వరకు అయిన సాగులో ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతులు చెప్తున్నారు. ఖర్చు వివరాలు రూపాయల్లో.. ఎకరం భూమి కౌలుకు 30 వేలు– 40 వేలు విత్తనాలు, దుక్కి 13–16 వేలు సేద్యం, వ్యవసాయం 5–8 వేలు నీళ్ల మందులు 30–35 వేలు కలుపునకు 18–20 వేలు అదనపు ఎరువులకు 10–12 వేలు నీళ్ల ఖర్చులు, కోతలకు మొత్తం ఎకరానికి రూ. 1.5 లక్షకు పైగా ఖర్చు గణనీయంగా తగ్గిన దిగుబడులు: గత ఏడాదితో పోల్చుకుంటే మిరపలో దిగుబడులు గణనీయంగా తగ్గాయని రైతులు చెప్తున్నారు. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడి వస్తే అందుకు తగ్గట్లుగానే బస్తా రూ. 13 వేలు నుంచి రూ. 15 వేల వరకు వచ్చిందని రైతులు చెప్తున్నారు. వీటిలో కూడా సుమారు 20 శాతం వరకు తాలు కాయలే దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. ఈ ఏడాది ఎకరానికి కేవలం 5 నుంచి 12 బస్తాలకు మించి దిగుబడులు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర కూడా క్వింటా రూ. 8000 మాత్రమే వుంది. అంటే సగటున ఎకరానికి రైతులు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు చెప్తున్నారు. దిగుబడులు, ధరలు పోల్చుకుంటే.. గత ఏడాది.. ఈ ఏడాది సాగు ఖర్చు రూ. 1.25 లక్షలు.. 1.60 లక్షలు దిగుబడులు 10–15 బస్తాలు.. 5–12 బస్తాలు ధరలు(కింటా) రూ. 9–11 వేలు.. రూ. 7–8 వేలు ఎకరానికి రూ. 50 వేలకు పైగా నష్టం మిరప రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోవాల్సిందే. సాగుకు సక్రమంగా నీరు విడుదల చేయకపోడంతో తెగుళ్లు సోకాయి. వీటి వల్ల ఎకరానికి గత ఏడాది 15 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది కేవలం 5 బస్తాలు కూడా రాలేదు. గత ఏడాది బస్తా రూ. 11 వేల వరకు ఉంటే ఈ ఏడాది కేవలం రూ. 8 వేలకు మించడం లేదు. సగటున మిరప రైతు ఈ ఏడాది ఎకరానికి రూ. 50 వేలకు పైగా నష్టం వస్తుంది. – పోతిని వెంకట్రావు, పోతనివారిపాలెం తెగుళ్లను నివారించలేక పోయాం ఈ ఏడాది మిరపకు విపరీమైన తెగుళ్లు వచ్చాయి. వీటిలో ప్రధానంగా బూడిద తెగులు, కొమ్మ ఎండు, పండు ఆకు తెగుళ్లు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కేవలం తెగుళ్ల మందులకే ఎకరానికి రూ. 30 – 35 వేల వరకు ఖర్చు చేశాం. అయినా తెగుళ్ళు నివారించలేకపోయాం. గత ఏడాది కొద్దిగా లాభాలు వస్తే ఈ ఏడాది అప్పటి లాభాలకు వడ్డీలతో కలుపుకొని నష్టపోయాం. – నక్కా రామకృష్ణ, రైతు కారంచేడు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి మిరప రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు తెగుళ్లను నివారించుకోవచ్చు. బూడిద తెగుళ్ళకు ఎకరానికి 1 లీటరు నీటిలో 2 గ్రాముల కోపరాక్సిక్లోరైడ్, ఇండెక్స్‌లను పిచికారి చేసుకోవాలి. కొమ్మ ఎండు, పండు ఆకు తెగుళ్లకు అమిస్టర్ లేదా, నోటీఓలను తరచుగా 1 లీటరు నీటిలో 2 గ్రాముల చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే కొంత ఉపసమనం ఉంటుంది. – కే శివనాగప్రసాద్, ఏడీఏ, పర్చూరు -
అయ్యో రైతన్నా..బె‘ధరా’ల్సిందేనా!
మధిర(ఖమ్మం): ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటకు మంచి ధర వస్తుందని కొన్ని నెలలుగా కోల్డ్ స్టోరేజీల్లో సరుకు నిల్వ చేసిన రైతులు బెదిరిపోయేలా, గుండెధైర్యం చెడేలా ఇంకా రేటు పతనమవుతోంది. గత ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మిర్చి పంటలో చాలా వరకు నిల్వ చేశారు. అప్పుడు క్వింటా ధర రూ.9,500 పలికింది. అయితే పెట్టుబడి భారం పెరగడంతో ఆ రేటుతో గిట్టుబాటు కాదని ఎక్కువమంది సాగుదారులు మిర్చిని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ నడుస్తున్న తరుణంలో వ్యవసాయ పెట్టుబడి అవసరాల రీత్యా..అప్పటి మిర్చిని అమ్ముకోవాలనుకుని మార్కెట్‌కు తెస్తుండగా డిమాండ్ ఉండట్లేదు. ప్రస్తుతం క్వింటాకు రూ.8,500 మాత్రమే రేటు పలుకుతోంది. అంటే..ఏడాది పాటు నిల్వ ఉంచితే..ఉన్న రేటు కూడా పడకపోగా క్వింటాకు వెయ్యి రూపాయల చొప్పున దిగజారడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. తేజ సన్నరకం మిర్చిని 70శాతం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచితే..క్వింటాకు ఆరు నెలలకు రూ.350 చొప్పున కట్టాలి. చాలామంది రైతులు..30 క్వింటాళ్ల వరకు సరుకును నిల్వ ఉంచారు. దీంతో వీరికి వేలాది రూపాయల భారం పడింది. ఇంటి నుంచి మిర్చిని శీతల గిడ్డంగి వరకు తరలించేందుకు ఎగుమతి, అక్కడ దిగుమతి, ఇతర రవాణా ఖర్చులు..కలిపి తడిసి మోపెడయ్యాయి. పైగా..వీటి ధర పెరుగుతుందనే ఆశతో, ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నారు. అంతకుముందు సంవత్సరం మిర్చి నిల్వ చేసినప్పుడు రైతులకు కలిసివచ్చింది. క్వింటాకు రూ.2వేలకు పైగానే పెరిగింది. కానీ..ఈసారి అసలు డబ్బులు కూడా రాని దైన్యం నెలకొనడంతో ఏం చేయాలో తెలియక అమ్మాలంటేనే..బెదిరిపోతున్నారు. రైతుల పరిస్థితి ఆగమాగం.. మార్కెట్లో క్వింటా ఒక్కింటికి తేజ రకాలను రూ.8,500లకు వ్యాపారులు అడుగుతున్నారు. లావు రకాలను అడిగే నాథుడే లేడు. సుమారు 6నెలలు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచి, అద్దెలు చెల్లించి, వడ్డీలు పెరిగి అప్పు తడిచిమోపెడవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటా ఒక్కింటికి వెయ్యిరూపాయలు ధర తగ్గడంతోపాటు మరో వెయ్యిరూపాయల వరకు ఖర్చులు, వడ్డీలు అవుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, చైనా, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి ఆర్డర్లు లేకపోవడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో 32 కోల్డ్‌స్టోరేజీలు ఉండగా వాటిల్లో సుమారు 20లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉన్నాయి. మరికొంతమంది చిన్నచిన్న వ్యాపారులు ధర పెరుగుతుందని కల్లాల్లో కొనుగోలుచేసి కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేయగా..వీరికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. అంతేకాకుండా కోల్డ్‌స్టోరేజీలో సాంకేతిక సమస్య ఏర్పడినా, మిర్చి నిల్వ చేసినప్పుడు కొద్దిగా తేమ ఉన్నా నాణ్యత తగ్గిపోయి ధర మరింత క్షీణిస్తుంది. ప్రస్తుతం వివిధ రకాల పంటలు పలు దశల్లో ఉన్నాయి. వీటికి పెట్టుబడి పెట్టేందుకు రైతులకు డబ్బులు అవసరమవుతున్నాయి. అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చిన రైతులకు వ్యాపారులు అడిగే రేటు వింటే కళ్లల్లో కన్నీరు తిరుగుతోంది. లావు రకాలపై చిన్నచూపు.. లావు రకాలైన 334, 275 తదితరాల మిర్చికి డిమాండ్ ఉండట్లేదు. గత ఖరీఫ్ సీజన్లో రూ.9000 ధర పలకగా..ఇప్పుడు 7,500కు పడిపోయింది. క్వింటాకు రూ.1500 తగ్గిపోవడంతో ఈ సరుకును అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. క్వింటాకు రూ.2వేల నష్టం.. ధర పెరుగుతుందని కోల్డ్ స్టోరేజీలో మిర్చిని నిల్వ ఉంచితే..ఇప్పుడు క్వింటాకు రూ.2వేల నష్టం వస్తోంది. మిరపనారుకు, కూలీలకు, అరకలు, ఎరువులు, పురుగుమందుల పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. కానీ మద్దతు ధర మాత్రం పెంచట్లేదు. 61బస్తాలు మే నెలలో కోల్డ్‌స్టోరేజీలో నిల్వ ఉంచా. ఆరోజు కల్లంలో రూ.9వేలకు అడిగారు. కానీ ఇప్పుడు రూ.8,500 అంటున్నారు. నెలనెలా రేటు తగ్గుతోంది. – గూడూరు ప్రభాకర్‌రెడ్డి, పెద్దకోరుకొండి, కల్లూరు మండలం పెట్టుబడికి డబ్బుల్లేవు.. ప్రస్తుతం పత్తి, మిర్చి పంటలు సాగుచేశా. వాటికి పెట్టుబడి పెట్టేందుకు చేతిలో డబ్బులు లేవు. కోల్డ్‌స్టోరేజీలో నిల్వ ఉన్న మిరప బస్తాలను అమ్ముకునేందుకు యార్డుకు వచ్చిన. లావు రకం మిర్చి కావడంతో ఎవరూ కొనట్లేదు. రైతు పరిస్థితి దిగజారుతోంది. ఇదేవిధంగా కొనసాగితే వ్యవసాయం చేయడం కష్టమే అవుతుంది. మా బాధలను పట్టించుకునే వారు కరువయ్యారు. – బండి సుబ్బారావు, దేశినేనిపాలెం, మధిర మండలం -
వేలాది ఎకరాల్లో ఒరిగిపోయిన మొక్కజొన్న
తల్లాడ: ఆదివారం రాత్రి అకాల వర్షం, వడగండ్ల వాన, గాలి బీభత్సానికి మండలంలో సాగు చేసిన మొక్కజొన్న పైరు నేలకొరిగి పోయింది. మూడు నెలలుగా సాగు చేసిన మొక్కజొన్న పైరు కంకి వేసి కోత దశకు వచ్చింది. మండలంలో 4,490 ఎకరాల్లో మొక్కజొన్న పైరు సాగు చేశారు. మరో పది రోజుల్లో కంకులు ఎండి మిషన్‌తో కోయవచ్చని రైతులు భావించారు. ఈ నేపధ్యంలో ఆకస్మికంగా వచ్చిన వర్షం, గాలి బీభత్సానికి మొక్కజొన్న పైరు నేలకొరిగిపోయింది. మండలంలో వెయ్యి ఎకరాల్లో పంట నాశనం అయ్యింది. ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులకు నిరాశ మిగిలింది. తల్లాడ, నారాయణపురం, అన్నారుగూడెం, రెడ్డిగూడెం, ముద్దునూరు, రామానుజవరం, కుర్నవల్లి, రంగంబంజర, రేజర్ల, బాలప్పేట, పినపాక, మంగాపురం గ్రామాల్లో మొక్కజొన్న పైరు సాగు చేశారు. అకాల వర్షం ఈ ఏడాది మొక్కజొన్న పంటను రైతులను నట్టేట ముంచింది. మామిడి, మిర్చి రైతులకూ నష్టం.. గాలివానకు మండలంలోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కోసి కల్లాల్లో ఉంచిన మిర్చి కూడా కొన్ని చోట్ల తడిచిపోయింది. ఎండబెట్టిన మిరపకాయలు చెల్లా చెదురయ్యాయి. తల్లాడలో నేలకొరిగిన మొక్కజొన్న పైరు -
ముంచిన ‘మిర్చి’
అవనిగడ్డ/మోపిదేవి: కృష్ణాజిల్లా దివిసీమలో పచ్చి మిర్చి పంట రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర లేకపోవడంతో రైతులు మిర్చిని కోసేసి సమీపంలోని కృష్ణానదిలో పారబోస్తున్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని నాగాయతిప్ప, కోసూరువారిపాలెంలో రైతుల వద్ద కిలో మిర్చి కేవలం రూపాయి నుంచి మూడు రూపాయలే పలుకుతుండడంతో రైతులు తమ పంటను గురువారం కృష్ణానదిలో పారబోసి నిరసన తెలియజేశారు. ఈ గ్రామాల పరిధిలోని 15 మంది రైతులు 200 బస్తాల మిర్చి ఇలా నదిలో పారబోశారు. పంటకు ధర లేకపోవడంతో దిక్కులేక ఇలా పారబోస్తున్నామని పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. 320 ఎకరాల్లో సాగు కృష్ణాజిల్లా మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లో గత ఏడాది డిసెంబర్లో 320 ఎకరాల్లో సాగుచేశారు. మోపిదేవి మండలంలో అత్యధికంగా 250 ఎకరాల్లో సాగయింది. ఈ ప్రాంతంలో వీఎన్ఆర్ 145, టొకీటో 006 యూఎస్ రకాలను సాగుచేశారు. ఇవి పచ్చిమిర్చికి మాత్రమే పనికొస్తాయి. ఎండుమిర్చికి ఉపయోగపడవు. ధర పడిపోవడంతో చేసేదిలేక కూలీలతో కోయించి పారబోస్తున్నామని, అలాగే వదిలేస్తే మిగిలిన పంట రాదని పలువురు రైతులు చెప్పారు. మరోవైపు.. మిర్చి పంట సాగు చేయడానికి కౌలుతో కలుపుకుని ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.25లక్షలు ఖర్చు చేశారు. రెండేళ్ల క్రితం మిర్చి పంట లాభాలు తెచ్చిపెట్టగా.. ఆదే ఆశతో ఈ ఏడాదీ పెద్దఎత్తున సాగుచేసిన రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. పొలం వద్ద కిలో మిర్చి మూడు రూపాయలకు కొంటున్నారు. కానీ, టిక్కీ (70)కిలోల బస్తా కోయడానికి రూ.120లు కూలీ అవుతోంది. గోతాంకు రూ.30, పొలం నుంచి ఊరిలోకి తోలడానికి ఆటోకు రూ.20, అక్కడ నుంచి హైదరాబాద్‌కు బస్తాకు రూ.100తో మొత్తం కలిపి బస్తా మిర్చికి రూ.270 ఖర్చవుతుండగా వచ్చేది మాత్రం 210 రూపాయలే. గతంలో ఉత్తరాది నుంచి ఆర్డర్లు రావడంతో మిర్చికి బాగానే ధర పలికింది. పదిరోజుల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ధర బాగా పడిపోయింది. స్థానికంగా వారపు సంతలు, కూరగాయల దుకాణాల్లో తక్కువకు కొనడం.. ఖర్చులు కూడా రాకపోవడంతో కూలీలతో కోయించి మిర్చిబస్తాలను సమీపంలోని కృష్ణానదిలో పారబోస్తున్నారు. ఇలా రెండు రోజుల నుంచి 200 బస్తాల వరకు రైతులు నదిలో పారబోసి నిరసన తెలిపారు. పంటను దున్నేస్తున్నారు.. మరోవైపు.. ధర పడిపోవడం, ఖర్చులు రాకపోవడంతో మోపిదేవి మండల పరిధిలోని నాగాయతిప్పలో రైతులు మిర్చిపంటను రొటేవేటర్‌తో దున్నేస్తున్నారు. గ్రామానికి చెందిన యక్కటి రామకృష్ణ, గజ్జల శేషు, సనకా పెదబాబు, శ్రీనివాసరావు ఏడెకరాల్లోని తమ మిర్చి పంటను దున్నించేశారు. రైతుబజార్, మార్కెట్లో కిలో మిర్చి రూ.22 నుంచి రూ.30 అమ్ముతుండగా, రైతుల నుంచి మాత్రం కిలో రూ.3 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దిక్కులేక పారబోస్తున్నాం.. రెండేళ్ల క్రితం మిర్చికి బాగా లాభాలు రావడంతో ఈ ఏడాది రైతులు ఎక్కువగా సాగుచేశారు. ఎకరాకు కౌలు, ఖర్చులు కలిపి రూ.1.25లక్షలు అయ్యాయి. కిలో మిర్చి రూ.3 కూడా కొనడంలేదు. అందుకే నదిలో పారబోస్తున్నాం. – బళ్లా లక్ష్మణస్వామి, మోపిదేవిలంక, మోపిదేవి మండలం అప్పుచేసి మిర్చి సాగు చేశాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర పడిపోయింది. చేసేదిలేక పారేస్తున్నాం. కోల్డ్ స్టోరేజి నిర్మిస్తే ఇలాంటి సమయంలో భద్రపరచుకుంటాం. – ఉప్పల సతీష్‌బాబు (నాని), నాగాయతిప్ప, మోపిదేవి మండలం కలెక్షన్ సెంటర్‌కి ప్రతిపాదనలు పంపాం.. మిర్చి రేటు పడిపోవడంతో రైతులు నదిలో పారబోస్తున్న మాట వాస్తవమే. ఇక్కడి పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశాను. మోపిదేవిలో కలెక్షన్ సెంటర్ కోసం ప్రతిపాదనలు పంపించాం. ఇది కార్యరూపం దాలిస్తే రోజుకు 10 టన్నులు ప్రాసెసింగ్ చేయవచ్చు. – రాజశేఖర్, ఉద్యాన శాఖాధికారి -
యార్డు నిండెన్.. ధర తగ్గెన్..
ఖమ్మంవ్యవసాయం : మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది.. వ్యాపారులు ఇదే అదనుగా భావించారు.. రైతులకు కుంటిసాకులు చెప్పి.. ధర దోపిడీకి పాల్పడ్డారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సరుకు రాక ఎక్కువైనప్పుడల్లా వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకోవడం నిత్యకృత్యమైంది. నాలుగు రోజుల సెలవుల తర్వాత సోమవారం ఖమ్మం మార్కెట్‌కు మిర్చి భారీగా వచ్చింది. సుమారు 60వేల బస్తాలు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నుంచి విక్రయానికి వచ్చింది. ప్రధాన యార్డు నిండటంతో మరో యార్డును మిర్చి కోసం కేటాయించారు. దీనిని అదనుగా భావించిన వ్యాపారులు కూడపలుక్కొని ధరను పూర్తిగా పతనం చేశారు. గత వారంతో పోలిస్తే ఏకంగా రూ.2వేలు తగ్గించి కొనుగోలు చేశారు. గత వారం క్వింటా రూ.11,275 వరకు పలికిన ధర సోమవారం గరిష్టంగా రూ.10,100 చేరింది. వ్యాపారులు కొనుగోలు చేసింది సగటున రూ.9వేలు మాత్రమే. జనవరి మూడో వారం నుంచి రోజుకో రకంగా ధర పెరిగింది. డిసెంబర్ చివరి వారంలో రూ.8,800 వరకు ఉన్న ధర 20 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.11,000 దాటింది. జనవరి 27 వరకు రూ.11, 275 ధరను తాకింది. ఈ క్రమంలో స్థానిక వ్యాపారులు ధరను పెంచుకుంటూ పోతే ఇబ్బందులు ఎ దురవుతాయని చర్చించుకొని సిండికేటుగా మారి, తిరిగి ధర తగ్గించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో జనవరి 30న ధరను రూ. 10,800 తగ్గించారు. 31వ తేదీ నాటికి రూ.10,600 చేర్చారు. సోమవారానికి(జనవరి 5న) ఏకంగా గరి ష్ట ధరను రూ.1 0,125 తీసుకొచ్చారు. కానీ. అంతా కూడపలు క్కొని సగటున రూ.9వేలకు మించి ధర పెట్టలేదు. కొందరి పంటను రూ.8వేల వరకు కూడా కొనుగోలు చేశారు. ఇదేమిటంటే.. నాణ్యత లేదని, తేమ అధికంగాఉందని కుంటి సాకులు చెప్పారు. రూ.2వేలకు పైగా ధర దోపిడీ గత నెల 27వ తేదీ ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.2వేల నుంచి రూ.2,500 వరకు ధర తగ్గించి కొంటున్నారు. విదేశాల్లో తేజ రకం మిర్చికి డిమాండ్ ఉన్నప్పటికీ ఇక్కడి వ్యాపారులు సిండికేటుగా మారి దోపిడీకి గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఇంతగా ధర తగ్గించడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరుకు పెరుగుతుండటంతో వ్యాపారులు ధరను కృత్రిమంగా పడేసి ధర దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అవసరాన్ని ఆసరా చేసుకొని దగా రబీ పంటల సాగు అవసరాలు, మిర్చి కోసిన కూలీల చార్జీలు చెల్లించటం కోసం రైతులు పంటను విక్రయానికి తెస్తున్నారు. దీనిని వ్యాపారులు అదనుగా భావించి.. సిండికేటుగా ఏర్పడి ధర దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాపారులు ధరను తగ్గించినా రైతులు ధిక్కరించలేకపోతున్నారు. పంటల సాగుకు పెట్టుబడులు ఇచ్చేది ఆ వ్యాపారులే కావటంతో ఏమీ మాట్లాడలేక పెట్టిన ధరకే పంటను విక్రయించక తప్పటం లేదు. వ్యాపారులు పెట్టే ధరలను చూసి రైతులు బిత్తర చూపులు చూస్తున్నారు. రూ.11వేలు వస్తుందనుకున్నా.. మిర్చికి ధర ఉందని, క్వింటాల్‌కు రూ.11వేలకు పైగా ధర వస్తుందని ఆశించా. ఎకరం మిర్చి తోట వేశా. 20 బస్తాలు విక్రయానికి తెచ్చా. క్వింటాల్‌కు రూ.9వేల ధర పెట్టారు. ఎంత బతిమిలాడినా వ్యాపారులు ధర పెంచలేదు. ధరలో అన్యాయం చేశారు. ధర దోపిడీ చేస్తున్నారు. – షేక్ జానీమియా, వనంవారి కిష్టాపురం, ముదిగొండ మండలం కూలీలకు డబ్బు ఇవ్వాల్సి ఉండి మిర్చి అమ్మకానికి తెచ్చా.. మిర్చి తోట ఏరిన కూలీలు డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కుటుంబ అవసరాలు కూడా ఉన్నాయి. అయినా ఖమ్మం మార్కెట్లో రూ.11వేలకు పైగా ధర ఉందని 30 బస్తాల మిర్చిని అమ్మకానికి తెచ్చా. రూ.9వేల ధర పెట్టారు. అవసరాన్ని చూసి రైతులకు వాత పెడుతున్నారు. – ధర్మసోత్ సాగర్, ఎల్లంపేట, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా -
వ్యవసాయ మంత్రి వివరణివ్వాలి
► ‘రైతులకు బేడీలు’పై కేంద్ర మంత్రి దత్తాత్రేయ ► మిర్చి పంటకు రాష్ట్రం బోనస్ ప్రకటించాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: మిర్చి పంటకు మద్దతు ధర కోసం ధర్నా చేపట్టిన రైతులను అరెస్టు చేసి బేడీలేయడం దురదృష్టకరమని, దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వివరణ ఇవ్వాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. బేడీలు వేసే విషయంలో సుప్రీంకోర్టు మార్గ దర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలే దన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. రైతులకు రాజకీయ పార్టీల తో సంబంధం ఉండదని, వారు స్వతహాగా ధర్నా చేస్తే రాజకీయ పార్టీలను అంటగ డుతూ అరెస్టులు చేయడం సరికాదన్నారు. మిర్చి రైతులను ఆదుకోడానికి రూ.5 వేల మద్దతు ధర, రూ.1,250 ఓవర్ హెడ్ చార్జీ లను కేంద్రం ప్రకటించిందని, దీన్ని అందిపు చ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కేంద్రం సాయా నికి రాష్ట్ర ప్రభుత్వమూ అదనంగా ధర ప్రకటిం చి ఉంటే రైతులకు ఉపయోగపడేదని, కానీ రాష్ట్ర సర్కారు ఈ విష యాన్ని పట్టించుకోకపో వడం దారుణమన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడానికి ఇప్పటికైనా పంటకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడికైనా ఎగుమతి చేసి అమ్ముకునేలా వరంగల్, అచ్చంపేట, అదిలాబాద్, ఆత్మకూరు, భైంస, చొప్పదండి, దేవరకద్ర, జగిత్యాల, ఖమ్మం, జోగిపేట, కామారెడ్డి, వికారాబాద్ మార్కెట్ల ను ఈ–నామ్ వెబ్‌పోర్టల్‌కు అనుసంధానిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దత్తాత్రేయ కోరారు. జామర్లు ఏర్పాటు చేయండి.. నీట్ పరీక్ష నిబంధనలను పునః సమీక్షించా లని కేంద్ర మానవ వనరనుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరినట్లు దత్తాత్రే య తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తనిఖీల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి బదులు ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సీఎస్టీ నిధులు విడుదల చేయండి తెలంగాణకు రావాల్సిన రూ.250 కోట్ల సీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి జైట్లీని కోరినట్లు దత్తాత్రేయ వెల్లడించారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు మూడో విడత కింద రావాల్సిన రూ.450 కోట్లను కూడా విడుదల చేయాలన్నారు. పీఎఫ్ లబ్ధిదారులకు 8.65 శాతం వడ్డీ రేటు ఇవ్వడానికి జైట్లీ అగీకరించారని చెప్పారు. సామాజిక సురక్ష కింద అంగన్వాడీలకు, సహాయకులకు పెన్షన్, పీఎఫ్, ఇళ్లు వంటి ప్రయోజనాలను అందించడానికి చర్యలు తీసుకుంటామని దత్తాత్రేయ వెల్లడించారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతోనూ సమావేశమైన దత్తాత్రేయ.. బడ్జెట్లో తెలంగాణకు ప్రకటించిన ఎయిమ్స్‌కు నిధులు మంజూరు చేయాలని, నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. -
‘రంగు’ మారుతోంది!
- మిర్చి పంటకు ధరాఘాతం – నిల్వ చేయడానికి గోదాములు లేవు – ఇళ్ల వద్ద, తోటల్లో భద్రపరిచిన రైతులు – ఎండలకు రంగు మారుతోందని ఆవేదన – ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు - రాయదుర్గం మండలం టి.వీరాపురం రైతు ఈడిగ వెంకటేశులు రూ.3 లక్షల దాకా పెట్టుబడి పెట్టి ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తొలి విడతగా గ్రేడింగ్ చేసుకుని 30 సంచుల మిర్చిని కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. నాణ్యమైన మిర్చి క్వింటాల్ రూ.4,199, రెండోరకం రూ.911 పలికింది. మొత్తం 9.50 క్వింటాళ్లకు రూ.13,392 చేతికొచ్చింది. ఇంత తక్కువ ధరతో మిగిలిన మిర్చిని అమ్మలేక, అలాగే ఉంచుకున్నాడు. నిల్వ చేయడానికి గోదాములు లేకపోవడంతో ఇంటి వద్దనే టెంకాయ పట్టలు కప్పి కాపాడుకుంటున్నాడు. రాయదుర్గం : జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో మిర్చి పంటను అధికంగా సాగు చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో 24 వేల ఎకరాలు, రాయదుర్గం పరిధిలో 2,250 ఎకరాల్లో పంట వేశారు. బోర్లలో వచ్చే అరకొర నీటితోనే పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. అయితే..ధర ఉన్నట్టుండి పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అత్యధిక శాతం మంది రైతులు బ్యాడిగ రకం మిర్చి సాగు చేశారు. దీన్ని రాయదుర్గానికి 200 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా బాగల్‌కోట తాలూకా బ్యాడిగ పట్టణానికి మాత్రమే తీసుకెళ్లి అమ్ముకోవాల్సి ఉంది. ఈ రకం మిర్చికి మిగతా ఎక్కడా మార్కెటింగ్ సౌకర్యం లేదు. ఇక్కడి నుంచి మార్కెట్‌కు రవాణా చేయాలంటే 30 కిలోల బస్తాకు రూ.75దాకా వెచ్చించాల్సి ఉంది. పంటచేతికొచ్చిన తొలినాళ్లలో క్వింటాల్ ధర రూ.22 వేల వరకు పలికింది. తీరా పంట పూర్తిస్థాయిలో చేతికొచ్చేసరికి ధర అథఃపాతాళానికి పడిపోయింది. పంటను గిట్టుబాటు ధర వచ్చేవరకు నిల్వ చేసుకుందామనుకున్న రైతులకు ఎక్కడా గోదాముల సౌకర్యం లేదు. దీంతో పొలాలు, ఇంటి ఆవరణల్లో నిల్వ చేసుకున్నారు. మండే ఎండలతో సరుకును సంరక్షించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎండవేడిమికి మిర్చి రంగు మారుతుండటంతో ధర పలకదని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి.. గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎకరాకు రూ.30 వేల పరిహారమివ్వాలి రాయదుర్గం నియోజకవర్గంలో చాలా మంది రైతులు బ్యాడిగ రకం మిర్చి సాగుచేశారు. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల దాకా పెట్టుబడులు పెట్టారు. కౌలు రైతులకైతే మరో రూ. 20వేలు అదనం. ధరలు ఘోరంగా పడిపోవడంతో రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. నిల్వ చేసుకోవడానికి గోదాములు లేవు. గుంటూరు రకం కాకపోవడంతో కర్ణాటకలోనే ఈ పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ విషయం మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులుకు కూడా తెలుసు. తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.30 వేల ప్రకారం పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలి. - గౌని ఉపేంద్రరెడ్డి , వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
మిర్చి రైతు కంటతడి
- జిల్లాలో మూడింతలు పెరిగిన మిరప విస్తీర్ణం - ధర భారీగా పతనం, పెట్టుబడి కూడా రాని వైనం - గుంటూరు యార్డుకు వెళ్లేందుకు సవాలక్ష షరతులు - లబోదిబోమంటున్న రైతులు అనంతపురం అగ్రికల్చర్ : గిట్టుబాటు ధర లేక కుదేలైన అరటి, మామిడి, చీనీ రైతుల మాదిరిగానే ఇప్పుడు మిరప రైతులు కూడా కంటతడి పెడుతున్నారు. జిల్లాలలో మిరప సాధారణ సాగు విస్తీర్ణం 2,500 హెక్టార్లు కాగా.. గతేడాది మంచి ధరలు పలకడంతో రైతులు ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో పంట వేశారు. ఒక ఎకరా వేసే రైతులు రెండు, మూడు ఎకరాలు సాగు చేశారు. దీంతో విస్తీర్ణం మూడింతలు పెరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7,700 హెక్టార్ల విస్తీర్ణంలో మిరప సాగైంది. గుంతకల్లు, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, రాయదుర్గం, కణేకల్లు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుత్తి, పామిడి తదితర మండలాల్లో ఎక్కువగా పంట వేశారు. భారీగా పెట్టుబడి జిల్లాలో బ్యాడిగ, బ్యాడిగ కడ్డీ, బ్యాడిగ డబ్బీ, 232, 273, ఎల్సీఏ 334, తేజ్ లాంటి మిరప రకాలు సాగు చేశారు. ఇది తొమ్మిది నెలల పంట. ఎకరాకు రూ.75 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ సారి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నందున గతేడాది మాదిరి ధరలు పలికితే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశించారు. దిగుబడుల పరంగా ఆశాజనకంగా వచ్చినా ధరలు మాత్రం భారీగా పతనమయ్యాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. పెట్టిన పెట్టుబడులు పరిగణనలోకి తీసుకుంటే క్వింటాల్ ఎండుమిర్చి రూ.9 వేల నుంచి రూ.10 వేలు పలికితే నష్టం ఉండదు. కానీ.. ప్రస్తుతం మార్కెట్లో రూ.5 వేలకు కాస్త అటూఇటు పలుకుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గుంటూరులో అమ్ముకునేందుకు అష్టకష్టాలు జిల్లాతో పాటు బళ్లారి మార్కెట్లో కూడా మిర్చి ధరలు పతనమయ్యాయి. కొనేవారు కరువయ్యారు. ఎండుమిర్చికి కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైసెస్–ఎంఎస్పీ) విధానం కూడా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు మిర్చి యార్డులో క్వింటాల్ రూ.8 వేల కన్నా తక్కువకు అమ్ముడుపోయిన రైతులకు క్వింటాల్‌పై రూ.1,500 చొప్పున ప్రోత్సాహం ప్రకటించింది. దీంతో జిల్లా రైతులు అక్కడికి వెళుతున్నారు. అనంతపురం నుంచి గుంటూరుకు సరుకు తీసుకెళ్లాలంటే క్వింటాల్‌పై రూ.200 వరకు రవాణా భారం పడుతుంది. అక్కడికి తీసుకెళ్లిన వెంటనే కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పంట సాగు చేసినట్లు వ్యవసాయ లేదా ఉద్యానశాఖ అధికారుల ద్వారా అన్ని వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలి. గుంటూరు యార్డులో అమ్ముతున్నట్లు అక్కడి నుంచి మరో ధ్రువీకరణ పత్రం తెప్పించుకుని.. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే సరుకును లోపలికి అనుమతిస్తారు. ధ్రువీకరణ పత్రం పంట పొలాలు పరిశీలిస్తే కానీ ఇవ్వలేమని అధికారులు మెలిక పెడుతుండటంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. అలాగే అమ్మిన 20 రోజులకు కాని బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కాదంటున్నారు. రూ.8 వేలు పలికినా పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. పురుగుమందులు, ఎరువుల అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి పండించిన పంటను అమ్ముకునేందుకు ఇన్ని కష్టాలు పడాలా అంటూ నిట్టూరుస్తున్నారు. మిరప రైతుల కష్టాలను జిల్లా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మార్కెట్ సదుపాయం నిల్ మిరప పంట విస్తీర్ణం ఇటీవల పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైనా మార్కెట్ సదుపాయం కల్పించకపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి కోల్డ్‌స్టోరేజీలు, మౌలిక సదుపాయాలు లేవు. కోల్ట్స్టోరేజీలను ఏర్పాటు చేయడంతో పాటు రైతుబంధు పథకం వర్తింపజేస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చిన సమయంలో అమ్ముకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. -
మిర్చి పంటను ప్రభుత్వమే కొనాలి
కణేకల్లు : మిర్చి పంటను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.1500 ప్రకారం పరిహారం కింద కంటితుడుపుగా భిక్షమేసి రైతులను మభ్యపెట్టడం శోచనీయమన్నారు. కణేకల్లులో శనివారం గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక మంది రైతులు మిర్చి పంట సాగు చేసి గిట్టుబాటు ధరలేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉన్నకాటికి అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో మంచి ధర వస్తోందనే ఆశతో ఇంకా చాలా మంది రైతులు గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నారని ప్రభుత్వమే మిర్చి ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోÆýరారు. తక్కువ ధరలకు పంట ఉత్పత్తులను అమ్మేసుకుని నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు ఉషారాణి, వైఎస్సార్సీపీ నాయకులు కళేకుర్తి జయరామిరెడ్డి, కె.విక్రంసింహారెడ్డి, టీ.కేశవరెడ్డి, మక్బూల్, అజ్ముతుల్లా గంగలాపురం మృత్యుంజయ్య తదితరులు పాల్గొన్నారు. గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయండి రాయదుర్గం రూరల్ : కరువు కాటకాలతో రైతులు సతమతమవుతూ పశువుల్ని పోషించలేక కబేళాలకు విక్రయిస్తున్నారని, పశు సంపదను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని ఆయతపల్లిలో తిప్పేస్వామి గృహంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నా గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉచితంగా రైతులకు గడ్డి కొనుగోలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పశుసంపద కబేళాలకు తరలిపోకుండా కాపాడాలన్నారు. కర్ణాటకలో రైతుల్ని ఆదుకోవాలనే ఉద్ధేశంతో అక్కడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో దొరికే గడ్డిని కొనుగోలు చేసి పశువులను కాపాడుతోందని గుర్తు చేశారు. మరి టీడీపీ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవడంలో చిత్తశుద్ధి కరువైందన్నారు. కార్యక్రమంలో కణేకల్లు మాజీ ఎంపీపీ ఆలేరు రాజగోపాల్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, యువజన నాయకులు నాగిరెడ్డి, కాంతారెడ్డి, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పంట నీట మునిగిందని.. రైతు ఆత్మహత్య
అమరావతి(గుంటూరు): చేతికొచ్చిన మిరప పంట వరదలో కొట్టుకుపోయిందని మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వెంకట్రావు(48) తనకు ఉన్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మిరప పంటను సాగు చేశాడు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట మొత్తం నీటిపాలైంది. దీంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.