Moratorium
-
Go First bankruptcy: 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వండి
న్యూఢిల్లీ: కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికను 30 రోజుల్లోగా సమర్పించాలంటూ విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచించింది. అందుబాటులో ఉన్న విమానాలు .. పైలట్లు ..ఇతర సిబ్బంది, నిర్వహణ ఏర్పాట్లు, నిధులు .. వర్కింగ్ క్యాపిటల్, లీజుదార్లతో ఒప్పందాలు తదితర వివరాలు అందులో పొందుపర్చాలని డీజీసీఏ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళికను సమీక్షించిన తర్వాత డీజీసీఏ తగు నిర్ణయం తీసుకోవచ్చని వివరించాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 2న స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా మే 3, 4 తారీఖుల్లో రద్దు చేసిన విమాన సేవలను ఆ తర్వాత మరిన్ని రోజులకు పొడిగించింది. ఈలోగా సర్వీసుల నిలిపివేతపై డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో మారటోరియం వ్యవధిని ఉపయోగించుకుని పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించేందుకు సమయం ఇవ్వాలంటూ గో ఫస్ట్ తన సమాధానంలో కోరింది. మరోవైపు లీజుదార్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. గో ఫస్ట్ దివాలా పరిష్కార పిటిషన్‌ను అనుమతించాలని ఎన్సీఎల్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మే 22న జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీ ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిచ్చింది. కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న ఉత్తర్వులను రిజర్వ్ చేసిన ఎన్సీఎల్టీ దాదాపు వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా బుధవారం నాడు ఆదేశాలను వెలువరించింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) అభిలాష్ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్మెంటు.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్పీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. గో ఫస్ట్ తాను బాకీల విషయంలో డిఫాల్ట్ అయ్యానని, రుణదాతల నుంచి వచ్చిన డిమాండ్ నోటీసులను కూడా సమర్పించిందని, లీజు సంస్థలు కూడా దీన్ని ఖండించడం లేదని ద్విసభ్య ఎన్సీఎల్టీ బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో దివాలా చట్టంలోని సెక్షన్ 10 కింద కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనుంది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవరీ చేసుకోవడానికి గానీ ఉండదు. గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
వేలకోట్ల రుణ భారం, వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న వొడాఫోన్ ఐడియా రూ.8,837 కోట్ల ఏజీఆర్ బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసింది. 2016–17కు అవతల రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏజీఆర్ బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ జూన్ 15న డిమాండ్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రానివిగా పేర్కొంది. దీంతో ఏజీఆర్ బకాయిల చెల్లింపు వాయిదా ఆప్షన్‌ను తక్షణం వినియోగించుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత ఆరు సమాన వాయిదాల్లో రూ.8,837 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై టెలికం శాఖ మారటోరియం (విరాం) ఆఫర్ చేసిందని.. వాస్తవానికి ఇవి సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిలో లేవని వివరించింది. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్చుకునే ఆప్షన్‌ను టెలికం శాఖ ఆఫర్ చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియా బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతించింది. దీంతో కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. 2018–19 సంవత్సరం వరకు అన్ని టెలికం కంపెనీలు ఉమ్మడిగా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.1.65 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
మారటోరియం మరో రెండేళ్లు
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులపై గతంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని (మారటోరియం)ను కొన్ని షరతులతో ఏఐసీటీఈ మరో రెండేళ్లు పొడిగించింది. దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏఐసీటీఈ ఓ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక మేరకు కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకుండా తాత్కాలిక నిషేధాన్ని రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చింది. డిమాండ్‌కు మించి కాలేజీలు, సీట్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి మారటోరియంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. పీపీపీ మోడ్‌తో సంప్రదాయ కోర్సులతో పాటు మల్టీ డిసిప్లినరీలతో ఉపాధి అవకాశాలున్న ప్రాంతాల్లో కొత్త పాలిటెక్నిక్ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపింది. ట్రస్టు, సొసైటీ, కంపెనీగా నమోదైన మూడేళ్లలో రూ.5 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన పరిశ్రమలు స్థాపించే సంస్థలకు మినహాయింపు వర్తిస్తుంది. గత ఏడాది 100 లోపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు (ఎన్ఐఆర్ఎఫ్)లో చోటు సాధించి 10 వేల మంది విద్యార్ధులతో 25 ఏళ్లుగా ఇతర విద్యాసంస్థలు నడుపుతున్న దాతృత్వ సంస్థలకు కూడా మినహాయింపునివ్వనున్నారు. ప్రాంతీయ భాషల్లోకి సాంకేతిక పదాలు సాంకేతిక విద్యా కోర్సులను ఆంగ్లంలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శాస్త్రీయ, సాంకేతిక పదాలను ఆయా భాషల్లోకి అనువదించేలా ఏఐసీటీఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ (సీఎస్టీటీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక భాషల్లో సాంకేతిక విద్యా కోర్సులను బోధించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. (చదవండి: ‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు) -
డిపాజిట్ బీమాతో బ్యాంకులపై ధీమా
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిపాజిట్ బీమా సంస్కరణలు .. బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు విఫలమైనా, డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసా ఈ సంస్కరణలతో లభించిందని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని ప్రభుత్వం ఇటీవల రూ. 5 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన పక్షంలో ఈ స్థాయి వరకూ డిపాజిట్లు ఉన్న వారు.. 90 రోజుల్లోగా తమ డబ్బు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. సంబంధిత చట్టాన్ని అమల్లోకి తెచ్చాక గత కొద్ది రోజుల్లో సుమారు 1 లక్ష మంది పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్ల పైచిలుకు అందిందని ప్రధాని చెప్పారు. ఆర్బీఐ మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న మిగతా బ్యాంకుల్లోని మరో 3 లక్షల మంది ఖాతాదారులకు కూడా త్వరలో వారి డిపాజిట్ మొత్తం లభించగలదని ఆయన తెలిపారు. 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి వచ్చిన క్లెయిమ్స్‌కు సంబంధించి తొలి విడత చెల్లింపులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇటీవలే విడుదల చేసిందని మోదీ చెప్పారు. రెండో విడత డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. డిపాజిటర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి..: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, బ్యాంకులు బాగుండాలంటే డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అటు మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని .. ఆర్థిక సమస్యలతో నిల్చిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశపడితే రిస్కు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధిక వడ్డీ రాబడుల కోసం ఆశపడితే అసలుకే ఎసరు వచ్చే ముప్పు ఉంటుందని డిపాజిట్‌దారులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లతో రిస్కులు కూడా ఎక్కువగానే ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. -
ఆటో ‘మొబైల్’కు బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఊపిర్లూదే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. ఆపరేటర్లు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం విధించడం, ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) నిర్వచనాన్ని సవరించడం, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తొలగించడం, టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉపాధి, పోటీకి ఊతం: టెలికం మంత్రి వైష్ణవ్ ‘‘టెలికం పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకు, కొత్త సంస్థలు వచ్చేలా దారి ఏర్పర్చేందుకు తొమ్మిది వ్యవస్థాగతమైన సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది’’ అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీలో..: సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలను మినహాయించారు. ఇది .. ఇక నుంచి అమలవుతుంది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట శాతాన్ని టెలికం కంపెనీలు.. కేంద్రానికి చట్టబద్ధమైన సుంకాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు కట్టాల్సిన బాకీలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీంతో అవి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. తాజాగా టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడంతో టెల్కోలకు ఊరట లభిస్తుంది. మరోవైపు, ప్రభుత్వానికి టెల్కోలు గత బాకీలను చెల్లించేందుకు నాలుగేళ్ల దాకా మారటోరియం (వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెలికంలో ఆటోమేటిక్ మార్గంలో 100%ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చారు. ఇప్పటిదాకా ఇది 49%గానే ఉంది. దానికన్నా మించితే ప్రభుత్వ అనుమతి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ► స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబదీ్ధకరించారు. ఎస్‌యూసీ బాకీలపై నెలవారీ చక్ర వడ్డీ విధానం స్థానంలో వార్షిక చక్రవడ్డీ విధానాన్ని ప్రకటించారు. అలాగే వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఇకపై టెల్కోలు పదేళ్ల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయొచ్చు, అలాగే ఇతర సంస్థలతో పంచుకోవచ్చు. సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేశారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి. ► ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీలను తగ్గించారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) చెల్లింపులో జాప్యానికి గాను విధించే పెనాలీ్టలను తొలగించారు. వడ్డీ రేట్లను క్రమబదీ్ధకరించారు. భవిష్యత్తులో నిర్వహించే వేలానికి బ్యాంక్ గ్యారంటీ అవసరం ఉండదు. ► స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించారు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు. భవిష్యత్తులో నిర్వహించే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రంపై ఎస్‌యూసీ ఉండదు. ► ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే..స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించారు. ఉభయతారకంగా సంస్కరణలు.. ఈ సంస్కరణలు.. టెలికం రంగానికి, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగావకాశాలకు తోడ్పడతాయి. వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు ప్రకటించిన పీఎల్ఐ స్కీముతో తయారీకి ఊతం లభిస్తుంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి డిజిటల్ లక్ష్య సాకారానికి దోహదం.. ఎకానమీకి తోడ్పాటు అందించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాల సాకారానికి తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, చర్యలను స్వాగతిస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పాటు.. పరిశ్రమ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు, డిజిటల్ ఇండియా ఆకాంక్షల సాధనకు కేంద్రం ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. టెల్కోలు నిలదొక్కుకునేందుకు ఇవి దోహదపడగలవు. ప్రధాని పిలుపు మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్టెల్ సిద్ధం. – సునీల్ మిట్టల్, చైర్మన్, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ సంస్కరణలు నిదర్శనం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎగుమతులకు జోష్... సవరించిన పీఎల్ఐ పథకం ఎగుమతులకు భారీ అవకాశాలను కలి్పంచనుంది. దేశీ ఆటో పరిశ్రమ ప్రపంచవ్యాప్త సప్లై చైన్‌తో మమేకమయ్యేందుకు దోహదపడుతుంది. మన కంపెనీల అవకాశాలకు తోడ్పడుతుంది. –విపిన్ సొం«దీ, ఎండీ, సీఈఓ, అశోక్ లేలాండ్ పరిశ్రమకు దన్ను.. తాజాగా సవరించిన పీఎల్ఐ పథకం ఆటో పరిశ్రమకు అవసరమైన జోష్‌నివ్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారి చూపనుంది. –వేణు శ్రీనివాసన్, చైర్మన్, టీవీఎస్ మోటార్ ఇవి అత్యధిక నిధులు.. ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకాలలోకెల్లా తాజాగా కేటాయించిన నిధులు అత్యధికం. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు, విడిభాగాలకు ప్రోత్సాహకాల ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు మద్దతివ్వడం.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. –కెనిచి అయుకవా, ప్రెసిడెంట్, సియామ్ -
టెలికం రంగంలో సంస్కరణలు తేవాలి
న్యూఢిల్లీ: సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం రంగాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రానికి టెల్కోలు విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే సుంకాలు తగ్గించాలని, వేలం వేసిన స్పెక్ట్రం హోల్డింగ్ కాలావధిని రెట్టింపు చేయాలని, స్పెక్ట్రం చెల్లింపులపై 7–10 ఏళ్ల పాటు మారటోరియం ఇవ్వాలని కోరాయి. టెల్కోల సమాఖ్య సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఈ మేరకు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌కు లేఖ రాసింది. అత్యధిక పన్నుల భారం పడే రంగాల్లో టెలికం పరిశ్రమ కూడా ఒకటని అందులో పేర్కొంది. ఆదాయాల్లో 32 శాతం భాగం పన్నులు, సుంకాల రూపంలో కట్టాల్సిన ప్రస్తుత విధానంతో కంపెనీలు మనుగడ సాగించడం కష్టంగా మారిందని వివరించింది. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల దగ్గర నిరంతరం మిగులు నిధులు ఉండే పరిస్థితి లేనందున ఇంతటి భారీ స్థాయి పన్నులనేవి పరిశ్రమ వృద్ధికి ప్రతికూలమని సీవోఏఐ తెలిపింది. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో తదితర సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లేఖ కాపీలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కూడా సీవోఏఐ పంపింది. పలు ప్రతిపాదనలు.. టెలికం రంగాన్ని తిరిగి పటిష్టమైన, నిలకడైన వృద్ధి బాట పట్టించడానికి ప్రాథమిక ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని సీవోఏఐ పేర్కొంది. ఇందులో భాగంగా తీసుకోతగిన విధానపరమైన చర్యలకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసింది. పన్నులు, సుంకాలు తగ్గించడం, స్పెక్ట్రంనకు సంబంధించి ధరను సహేతుకంగా నిర్ణయించడం, చెల్లింపులకు సులభతరమైన నిబంధనలు విధించడం, హోల్డింగ్ వ్యవధిని పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి. అలాగే, సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్) నిర్వచనాన్ని పునఃసమీక్షించడం, కనీస ధరను నిర్ణయించడం, ఆర్థిక..పనితీరుపరమైన బ్యాంక్ గ్యారంటీల నుంచి మినహాయింపునివ్వడం వంటి ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి. రుణాలు, నష్టాల భారంతో వొడాఫోన్ ఐడియా అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో సీవోఏఐ ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియాను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అది గానీ మూతబడితే పరిశ్రమలో రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆఖరు నాటికి వొడాఫోన్ ఐడియా మొత్తం రుణభారం రూ. 1,91,590 కోట్లుగా ఉంది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపు బకాయి రూ. 1,06,010 కోట్లు, ఏజీఆర్ బాకీ రూ. 62,180 కోట్లుగా ఉంది. -
బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
-
బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త!
బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అందించింది. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) 1961 చట్ట సవరణలకు నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం డీఐసీజీసీ బిల్లు 2021ను ఆమోదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లోగా ఖాతాదారులు తమ డిపాజిట్లపై ₹ 5 లక్షల వరకు బీమా పొందవచ్చు అని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మారటోరియం విధించిన కూడా బ్యాంకు ఖాతాదారులకు డిపాజిట్ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. భారతదేశంలోని విదేశీ బ్యాంకు శాఖలు కూడా దీని పరిధిలోకి వస్తాయని ఆమె అన్నారు. తాజా చట్టం వల్ల 98.3 శాతం బ్యాంకు ఖాతాదారులు ఊరట కలుగుతుందని సీతారామన్ తెలిపారు. "సాధారణంగా, బీమా కింద డబ్బు పొందడానికి పూర్తి లిక్విడేషన్ తర్వాత ఎనిమిది నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ, కొత్త చట్టం వల్ల ఇప్పుడు మారటోరియం విధించినప్పటికి 90 రోజుల్లోగా ఈ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తవుతుందని డిపాజిటర్లకు ఈ చట్టం ఉపశమనం ఇస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. 2020లో ఈ బీమా మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ. 5లక్షలకు పెంచారు. అయితే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి, లిక్విడేషన్ చర్యలు ప్రారంభించిన తర్వాతే డీఐసీజీసీ నుంచి బీమా మొత్తాన్ని పొందేందుకు వీలు ఉండేది. తాజాగా ఈ డీఐసీజీసీ చట్టాన్ని సవరించడంతో దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నగదును వెనక్కి తీసుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. -
విధాన నిర్ణయాల్లో... మా జోక్యం ఉండదు
న్యూఢిల్లీ: విధానపరమైన నిర్ణయాల్లో తమ జోక్యం ఉండబోదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకులు రుణ అకౌంట్లను మొండిబకాయిలుగా (ఎన్పీఏ) ప్రకటించడాన్ని నిలుపుచేస్తూ తాను ఇచ్చిన స్టేను మార్చి 23వ తేదీన సుప్రీంకోర్టు తొలగించింది. అయితే ఎన్పీఏగా ప్రకటించడానికి సంబంధించి మరిన్ని అంశాలను సమీక్షించాలని దాఖలైన తాజా పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం ఉండబోదని పేర్కొంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఇప్పటికే వచ్చిన తీర్పులో పేర్లు, సంబంధిత పొరపాట్లు ఏదైనా జరిగితే సవరణలకు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేయవచ్చు. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అలాంటి అంశాలు ఏవీ లేవు. దీనిని మేము విచారించలేము’’ అని డీవై చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది. దీనితో ఈ అప్లికేషన్ ఉపసంహరణకు న్యాయవాది ధర్మాసనం అనుమతి కోరారు. దీనికి బెంచ్ అంగీకరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రుణ చెల్లింపులపై గత ఏడాది ఆగస్టు 31 వరకూ 6 నెలల పాటు ఆర్బీఐ మారటోరియం విధించింది. ఈ కాలంలో బ్యాంకింగ్ చక్రవడ్డీ వసూళ్లపై జరిగిన విచారణ సందర్భంగా సెప్టెంబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇస్తూ, ఆగస్టు 31 వరకూ మొండిబకాయిలుగా ప్రకటించిన ఖాతాలను తన తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ యథాతథంగా కొనసాగించాలని పేర్కొంది. ఇరు పక్షాల వాదనల అనంతరం ఈ స్టేను వెకేట్ చేస్తూ, ఈ ఏడాది మార్చి 23న తీర్పును ఇచ్చింది. అలాగే మారటోరియం కాలంలో చక్రవడ్డీ తగదనీ ఆదేశా లు ఇచ్చింది. దీనితో తీర్పునకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అప్పటికే వసూలు చేసిన వడ్డీ మొత్తాలను రిఫండ్ చేసేలా లేదా రుణ అకౌంట్ల తదుపరి వాయిదాల్లో సర్దుబాటు జరిగేలా బ్యాంకింగ్‌కు ఆదేశాలిచ్చింది. -
వోడాఫోన్ ఐడియా మూతపడనుందా?
ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ గ్రూప్ సంయుక్త కంపెనీ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఐఎల్) టెలికాం కంపెనీ మూతపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) షేర్లు జూన్ 30 పడిపోయిన దానికంటే కంటే జూలై 1న భారీగా పడిపోయాయి. వొడాఫోన్ ఐడియా షేర్లు జూలై 1న 8.54శాతం క్షీణించి రూ.9.1 వద్ద ముగిసింది. ఈ టెలికాం సంస్థకు ఎఫ్ వై21 క్యూ4లో రూ.7,022.8 కోట్ల ఏకీకృత నికర నష్టం కలిగింది. మొత్తం 2021 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రూ.44,233 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఇందులో జనవరి-మార్చి త్రైమాసిక నష్టాలు(రూ.6,985 కోట్లు) కూడా ఉన్నాయి. మరో పక్క చందాదారుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోతుంది. కేవలం 2021 జనవరి-మార్చి త్రైమాసికంలోనే 20 లక్షల చందాదారులు ఇతర నెట్ వర్క్ లకు మారారు. 2021 ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం చందాదారుల సంఖ్య 27 కోట్లకు పడిపోయింది. ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న టెల్కో వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజాగా స్పెక్టం వాయిదాల చెల్లింపునకు సంబంధించి ఏడాది పాటు మారటోరియం ఇవ్వాలంటూ టెలికం శాఖ (డాట్)కు విజ్ఞప్తి చేసింది. జూన్ 25న డాట్ కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాసింది. తమ దగ్గరున్న నగదును సవరించిన ఏజీఆర్ (సవరించిన స్థూల అదాయం) బాకీలకు చెల్లించాల్సి వస్తున్నందున వచ్చే ఏడాది ఏప్రిల్ 9న కట్టాల్సిన రూ.8,292 కోట్లు స్పెక్ట్రమ్ వాయిదా మొతాన్ని కట్టే పరిస్థితి లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాము చెల్లించాల్సిన వాయిదాలకు మరో ఏడాది పాటు 2023 ఏప్రిల్ దాకా మారటోరియం ఇవ్వాలంటూ వీఐఎల్ కోరింది. గత అరు నెలలుగా కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇన్వెస్టర్లు ముందుకు, రావడం లేదని తెలిపింది. టారిఫ్‌లు పెరిగితే తప్ప టెలికం పరిశ్రమ కోలుకోలేకపోవచ్చని, తాము నష్టపోతామని ఇన్వెస్టర్లు భావిస్తుండటమే ఇందుకు కారణమని వివరించింది. ఒకవేల ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే వొడాఫోన్ ఐడియా లిక్విడేషన్ కు వెళ్లనున్నట్లు గ్లోబల్ సీఈఓ నిక్ రీడ్ ఇప్పటికే చెప్పారు. చదవండి: జీఎస్టీతో పన్ను చెల్లింపుదారులు రెట్టింపు -
మార్కెట్‌కు ‘సుప్రీం’ జోష్
ముంబై: రుణాల మారిటోరియంపై సుప్రీంకోర్టు తీర్పు స్టాక్ మార్కెట్‌కు జోష్‌నిచ్చింది. కరోనా కాలంలో కేంద్రం ప్రకటించిన రుణాల మారటోరియం గడువును పెంచడానికి అత్యున్నత న్యాయస్థానం విముఖత చూపింది. అలాగే పూర్తిగా వడ్డీ మాఫీ సాధ్యం కాదని, అసలు ఈ అంశంలో కేంద్రానికి తాము ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేమని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుతో బ్యాంకు రుణాలు, వడ్డీకి సంబంధించి ఇన్నాళ్ళూ కొనసాగిన ప్రతిష్టంభనకు తెరపడింది. దీంతో బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అధిక వెయిటేజీ కలిగిన ఈ రంగ షేర్లు రాణించడంతో ఇండెక్సులు లాభాలను ఆర్జించగలిగాయి. సెన్సెక్స్ 280 పాయింట్లు లాభంతో 50 వేలపైన 50,051 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 14,815 వద్ద ముగిసింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ వారం ఆరంభం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో కరోనా కేసులు అదుపులోకి రావచ్చని ఆశాభావం ట్రేడర్లలో నెలకొంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మూడున్నర తగ్గడం, దేశీయంగా బాండ్ ఈల్డ్స్ తగ్గడం తదితర అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియల్టీ షేర్లకు సైతం స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు మెటల్, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 603 పాయింట్ల పరిధిలో కదలాడగా, నిఫ్టీ 171 పాయింట్ల రేంజ్లో ట్రేడైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.108 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు సైతం రూ. 529 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా కాంగ్రెస్ ఎదుట యూఎస్ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ)ఇచ్చేందుకు ఫెడరల్ ౖచైర్మన్ పావెల్‌తో పాటు ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎలెన్ సిద్ధమైన తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి. ‘‘మారిటోరియంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఇన్వెస్టర్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని నాణ్యమైన షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. ఎంఎండీఆర్ చట్ట సవరణకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో సిమెంట్ షేర్ల ర్యాలీ రెండోరోజూ కొనసాగింది. ప్రభుత్వం నుంచి సబ్సీడి నిధులు విడుదల కావడంతో ఫెర్టిలైజర్ షేర్లకు డిమాండ్ లభించింది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ తెలిపారు. 603 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 105 పాయింట్ల లాభంతో 49,876 వద్ద, నిïఫ్టీ 24 పాయింట్ల పెరుగుదలతో 14,768 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపు లాభాల్లో కదలాడిన సూచీలు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నష్టాల బాటపట్టాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 49,662 వద్ద, నిఫ్టీ 14,707 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదుచేశాయి. నష్టాల్లో కదలాడుతున్న సూచీలకు సుప్రీం తీర్పు ఉత్సాహాన్నిచ్చింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ట్రేడింగ్ ముగింపు వరకు ర్యాలీని కొనసాగించాయి. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం (49,662) నుంచి 603 పాయింట్ల పాయింట్లు పెరిగి 50,265 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు ఎగసి 14,879 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను నమోదుచేశాయి. -
మారటోరియం : సుప్రీం కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: కరోనా, లాక్డౌన్ సమయంలో రుణాలపై విధించిన మారటోరియం పొడిగింపు, మొత్తం వడ్డీని మాఫీ చేయడం లాంటి అంశాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఆరు నెలల రుణ మారటోరియంను పొడిగించాలని కోరుతూ వివిధ వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థల పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మంగళవారం తన తీర్పును ప్రకటించిన సుప్రీం వడ్డీని పూర్తిగా మాఫీ చేయలేమని పేర్కొంది. అలాగే మాలాఫైడ్, ఏకపక్షంగా ఉంటే తప్ప కేంద్రం ఆర్థిక నిర్ణయాలను న్యాయ సమీక్ష చేయలేమని పేర్కొంది. ప్రత్యేక ఆర్థిక ఉపశమనం లేదా ప్యాకేజీలను ప్రకటించమని ప్రభుత్వాన్ని లేదా కేంద్ర బ్యాంకును ఆదేశించలేమని, ప్రత్యేక రంగాలకు ఉపశమనం అడగలేమని కూడా సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. చక్రవడ్డీ వసూలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, సుభాష్ రెడ్డి, ఆర్షా కూడిన అత్యున్నత ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. వడ్డీ మినహాయింపుపై వడ్డీని రూ .2 కోట్ల వరకు కేంద్రం పరిమితం చేసిందని సుప్రీం గుర్తు చేసింది. అలాగే ఈ ఆరు నెలల కాలానికి రుణ గ్రహీతలనుంచి చక్రవడ్డీ వసూలు చేయొద్దని తెలిపింది. మారటోరియం కాలాన్ని పొడిగించడం, మొత్తం వడ్డీ మాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఖాతాదారులకు, పెన్షనర్లకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి, మరి అలాంటప్పుడు బ్యాంకులు రుణాలపై పూర్తిగా వడ్డీని ఎలా మాఫీ చేయగలవని సుప్రీం ప్రశ్నించింది. గతేడాది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) విధించిన మారటోరియం 2020 ఆగస్టుతో ముగిసింది. రుణాలపై వడ్డీ వసూళ్ల మీద మారటోరియం పొడిగించడానికి కేంద్ర ఆర్ధికశాఖ, ఆర్బీఐ నిరాకరించాయి. ఇప్పటికే రూ.2 కోట్ల వరకు రుణాలపై కేంద్రం వడ్డీ మాఫీ చేసిన సంగతి తెలిసిందే. -
చక్రవడ్డీ మాఫీ : వారికి సుప్రీం షాక్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ కాలంలో విధించిన ఆరు నెలల మారటోరియం కాలానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది.క్రెడిట్ కార్డు వినియోగదారులు కార్డ్ రుణాల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశారని, వారికి మారటోరియం ప్రయోజనాలు అవసరమా అంటూ అత్యున్నత న్యాయస్థానం గురువారం కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రెడిట్ కార్డుదారులు రుణగ్రహీతల కిందకు రారని చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇవ్వకూడదని అభిప్రాయపడింది వాస్తవానికి వారు రుణాలు పొందలేదని, దానికి బదులుగా వస్తువులు కొనుగోళ్లు చేశారని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే ప్రీ-కోవిడ్ డిఫాల్టర్లు కూడా చక్రవడ్డీ మాఫీ పొందలేరని తెలిపింది. లోన్ మారటోరియం, ప్రయోజనాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. వడ్డీ మినహాయింపు ప్రణాళికలో ఇప్పటివరకు 13.12 కోట్ల ఖాతాలకు రూ .5270 కోట్లు జమ అయ్యాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం మార్చినుంచి ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో రూ .2 కోట్ల వరకు ఉన్న అన్ని రుణాలపై వడ్డీవడ్డీని రద్దు చేసింది. ఈ భారాన్ని భరించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన చెల్లింపులను కూడా ప్రారంభించింది. SG: banks havs to lodge claim to SBI for which a separate nodal agency is created, they’ll verify, take it from Government and then pay it SG: I am a credit card holder and I received SMS for ex gratia credit Sc: but do you need it? People like you should not get the benefit — Bar & Bench (@barandbench) November 19, 2020 -
ఆర్బీఐ షాక్ : ఎల్వీబీ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: బ్యాంకు కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు మారటోరియంను విధించిన నేపథ్యంలో ప్రయివేట్ రంగ బ్యాంకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టడంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 20 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరవుకావడంతో రూ. 3.10 నష్టంతో రూ. 12.45 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా ఇంతక్రితం మార్చి 31న నమోదైన ఏడాది కనిష్టం రూ. 10.40కు చేరువైంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అర్ధగంటలోనే కౌంటర్లో 3.5 కోట్లకుపైగా షేర్ల విక్రయానికి సెల్ ఆర్డర్లు(బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) నమోదైనట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)పై కేంద్రం మంగళవారం మారటోరియం విధించింది. ఈ నెల 17 నుంచి డిసెంబర్ 16 వరకూ 30 రోజులపాటు మారటోరియం అమల్లో ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. బ్యాంక్ ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉన్నాగానీ రూ.25,000 వరకూ మాత్రమే వెనక్కు తీసుకోగలుగుతాడు. అయితే ఆరోగ్య వ్యయాలు, ఉన్నత విద్యకు చెల్లింపులు, వివాహ ఖర్చుల వంటి అత్యవసరాలకు ఆర్బీఐ ముందస్తు అనుమతితో ఖాతాదారుడు రూ.25,000కు మించి తన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బ్యాంక్ బోర్డ్‌ను పక్కనబెట్టి కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సలహా మేరకు అత్యవసర ప్రాతిపదికన కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌గా కెనరాబ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్‌ను నియమించింది. తొలిసారి దేశీ బ్యాంకింగ్ చరిత్రలో తొలిసారి విదేశీ బ్యాంకుకు చెందిన దేశీ యూనిట్‌తో దేశీయ బ్యాంకును విలీనం చేసేందుకు ఆర్బీఐ ప్రతిపాదించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇందుకు ప్రధానంగా డీబీఎస్ బ్యాంకు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటం, విలీనంతో ఎల్వీబీ ఖాతాదారులు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగే వీలుండటం వంటి అంశాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇందుకు ఆర్బీఐను సంప్రదించినప్పటికీ అనుమతించకపోవడం గమనార్హం. ఇదే విధంగా క్లిక్స్ క్యాపిటల్ ప్రతిపాదనకు సైతం నో చెప్పింది. విలీనానికి సంబంధించి రెండు సంస్థల మధ్య ప్రతిపాదించిన వేల్యుయేషన్స్ సక్రమంగా లేవన్న కారణం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. డీబీఎస్ బ్యాంక్‌తో విలీనం తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకింగ్ సేవల దిగ్గజం... డీబీఎస్ బ్యాంక్ ఇండియా (డీబీఐఎల్)తో విలీనానికి ఆర్బీఐ ముసాయిదా పథకాన్ని వెలువరించింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. భారత్‌లో తమ అనుబంధ సంస్థ డీబీఐఎల్ రూ. 2,500 కోట్ల మేర నిధులు ఇవ్వనున్నట్లు డీబీఎస్ వెల్లడించింది. దేశీయంగా డీబీఎస్ బ్యాంకు 26 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 13 రాష్టాలు, 24 పట్టణాలలో సేవలు విస్తరించింది. ఎల్‌వీబీకి ఎన్ఆర్ఐ కస్టమర్లు అధికంగా ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆసియాలో కార్యకలాపాలు విస్తరించిన డీబీఎస్ ఈ కస్టమర్లకు మరింత సులభంగా సర్వీసులు అందించగలుగుతుందని అభిప్రాయపడ్డాయి. డీబీఎస్ బ్యాంకులో సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్ వాటాదారుకావడంతో ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో ఎల్వీబీ విలీనం తదుపరి అవసరమైతే మరిన్ని నిధులతో బ్యాంకు కార్యకలాపాలను విస్తరించగలదని పేర్కొన్నాయి. డీబీఎస్ బ్యాంకు ఇంతక్రితం దేశీయంగా మురుగప్ప గ్రూప్‌తో ఏర్పాటు చేసిన ఎన్బీఎఫ్సీ జేవీ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్‌లోనూ 37.5 శాతం వాటాను సొంతం చేసుకుంది. కాగా.. ఎల్వీబీని విలీనం చేసుకుంటే దక్షిణాదిలో కార్యకలాపాలను విస్తరించేందుకు వీలు కలుగుతుందని విశ్లేషకులు తెలియజేశారు. ఎల్వీబీ ప్రస్తుతం 563 బ్రాంచీలు, 974 ఏటీఎంలను కలిగి ఉంది. డీబీఎస్ బ్యాంకులో ఎల్వీబీ విలీనమైతే సంయుక్త సంస్థ 12.51 శాతం సీఆర్ఏఆర్ను, 9.61 శాతం సీఈటీ-1 క్యాపిటల్‌నూ సమకూర్చుకోగలదని వివరించారు. -
ఆర్బీఐ గుప్పిట్లోకి.. లక్ష్మీ వి‘లాస్’!
ముంబై: ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)పై కేంద్రం మంగళవారం మారటోరియం అ్రస్తాన్ని ప్రయోగించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌పై మంగళవారం నుంచి (17వ తేదీ) నుంచి 30 రోజులపాటు– డిసెంబర్ 16 వరకూ మారటోరియం అమల్లో ఉంటుంది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఒక బ్యాంక్ ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా, కేవలం రూ.25,000 వరకూ మాత్రమే (30 రోజుల వరకూ) వెనక్కు తీసుకోగలుగుతాడు. అయితే ఆరోగ్య వ్యయాలు, ఉన్నత విద్యకు చెల్లింపులు, వివాహ ఖర్చుల వంటి అత్యవసరాలకు ఆర్బీఐ ముందస్తు అనుమతితో ఖాతాదారుడు రూ.25,000కు మించి తన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బ్యాంక్ బోర్డ్‌ను పక్కనబెట్టి కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సలహా మేరకు కేంద్రం ఈ అత్యవసర నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌గా కెనరాబ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్ నియమితులయ్యారు. ప్రత్యామ్నాయం లేకే...: ఆర్బీఐ ‘‘బ్యాంకుకు సంబంధించి విశ్వసనీయ పునరుద్ధరణ ప్రణాళికలేని పరిస్థితుల్లో డిపాజిటర్ల ప్రయోజనాలు, బ్యాంకింగ్ స్థిరత్వం, ఫైనాన్షియల్ వ్యవహారాల పటిష్టత ముఖ్యం. ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 45 కింద బ్యాంక్‌పై మారటోరియం విధించాలని కేంద్రానికి సిఫారసు చేయడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆర్బీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 17వ తేదీ నుంచి 30 రోజులపాటు... అంటే డిసెంబర్ 16వ తేదీ వరకూ అమలుజరిగే విధంగా బ్యాంక్‌పై మారటోరియం విధించింది’’ అని ఈ పరిణామానికి సంబంధించి వెలువడిన ఆర్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. తాజా మారటోరియం ప్రకారం, సేవింగ్స్, కరెంట్ లేదా మరే డిపాజిట్ అకౌంట్ నుంచీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ తనకు తానుగా, ఆర్బీఐ నుంచి అనుమతి పొందకుండా రూ.25,000 మించి ఖాతాదారుకు చెల్లించలేదని కూడా స్పష్టం చేసింది. డీబీఎస్ బ్యాంక్‌తో విలీన ప్రతిపాదన తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకింగ్ సేవల దిగ్గజం... డీబీఎస్ బ్యాంక్ ఇండియా (డీబీఐఎల్)తో విలీనానికి సంబంధించి ముసాయిదా పథకాన్ని కూడా ఆర్బీఐ వెలువరించింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. భారత్‌లో తమ అనుబంధ సంస్థ డీబీఐఎల్ రూ. 2,500 కోట్ల మేర నిధులు ఇవ్వనున్నట్లు డీబీఎస్ వెల్లడించింది. సర్వత్రా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ విలీన డీల్‌తో ఎల్వీబీ డిపాజిటర్లు, కస్టమర్లు, ఉద్యోగులకు కొంత ఊరట లభించగలదని పేర్కొంది. అలాగే డీబీఐఎల్ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను మరింతగా పెంచుకునేందుకు ఇది తోడ్పడగలదని తెలిపింది. బీఎస్ఈలో బ్యాంక్ షేరు మంగళవారం 1% నష్టంతో రూ. 15.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆర్బీఐ మారటోరియం ఆదేశాలు వెలువడ్డాయి. బ్యాంక్ వ్యాపారం ఇలా... రిటైల్, మిడ్–మార్కెట్, కార్పొరేట్ రంగాల్లో బిజినెస్ చేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు– వీఎస్ఎన్ రామలింగ చెట్టియార్ నేతృత్వంలో ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో స్థాపించారు. 2019 జూన్ 30వ తేదీ నాటికి 569 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో ఏడు కమర్షియల్ బ్యాంక్ బ్రాంచీలుకాగా, ఒకటి శాటిలైట్ బ్రాంచ్. ఐదు ఎక్స్టెన్షన్ కౌంటర్లు, ఏడు ప్రాంతీయ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకుకు బ్రాంచీలు ఉన్నాయి. దాదాపు 1,047 ఏటీఎంలు సేవలు అందిస్తున్నాయి. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి బ్యాంక్ వ్యాపారం రూ.37,595 కోట్లు. నికర నష్టాలు రూ.397 కోట్లు. స్థూల మొండిబకాయిల (ఎన్పీఏ)ల పరిమాణం 24.45 శాతంగా ఉంటే, నికరంగా చూస్తే ఇది 7.01 శాతంగా ఉంది. బ్యాంకులో దాదాపు నాలుగువేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్బీఐ కీలక ప్రతిపాదన
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగం బ్యాంకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక నెల తాత్కాలిక నిషేధం ముగిసిన వెంటనే ఈ బ్యాంకును డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) తో విలీనం చేయనుంది. ఈ మేరకు ఒక ముసాయిదా పథకాన్ని ఆవిష్కరించినట్లు మంగళవారం వెల్లడించింది.ఇందుకు డీబీఐఎల్ 2,500 కోట్ల రూపాయల అదనపు మూలధనాన్ని ముందస్తుగా సమకూరుస్తుందని ఆర్బీఐ తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్‌మనోహరన్‌ను బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. ముసాయిదా పథకంపై ఇరు బ్యాంకుల సభ్యులు, డిపాజిటర్లు ఇతర రుణదాతల నుండి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది. ఇవి 2020 నవంబర్ 20 న సాయంత్రం 5 గంటలలోపు తమకు చేరాలని ఆర్బీఐ తన నోటీసులో తెలిపింది. మరోవైపు లక్ష్మి విలాస్ బ్యాంక్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం మారటోరియం విధించింది. ఈ రోజు (నవంబరు, 17వ తేదీన) సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 16 వరకు మారటోరియం అమలులో ఉండనుంది. మారటోరియం సమయంలో విత్‌డ్రా లిమిట్‌ను 25వేలకు కుదించింది. ఈ వెంటనే ఆర్బీఐ విలీన ప్రతిపాదనని ప్రకటించడం గమనార్హం. కాగా ఇటీవల జరిగిన బ్యాంక్ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్యాంకు తీరుపై ఆగ్రహంతో ఉన్న వాటాదారులు (దాదాపు 60 శాతం) భారత బ్యాంకింగ్ చరిత్రలోనే తొలిసారిగా ప్రస్తుతం తాత్కాలిక ఎండీ, సీఈఓగా ఉన్న సుందర్‌ను తిరిగి ఆ పదవిలో తిరిగి నియమించే తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో పాటు మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఎన్ సాయిప్రసాద్, గోరింక జగన్మోహన్ రావు, రఘురాజ్ గుజ్జర్, కేఆర్ ప్రదీప్, బీకే మంజునాథ్, వైఎన్ లక్ష్మీ నారాయణలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా తిరిగి నియమించే తీర్మానాన్ని కూడా భారీ మెజార్టీతో వ్యతిరేకించిన సంగతి విదితమే. -
చక్రవడ్డీ మాఫీ.. అకౌంట్లలో జమ ప్రారంభం!
న్యూఢిల్లీ: మారటోరియం సమయంలో నిర్దిష్ట రుణ అకౌంట్లపై చార్జీ చేసిన చక్రవడ్డీ రుణ గ్రహీతలకు రిఫండ్ చేయడం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.. ‘‘కోవిడ్–19 రిలీఫ్ ఎక్స్‌గ్రేషియా మీ అకౌంట్లో నవంబర్ 3న క్రెడిట్ అయ్యింది’’ అని ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ నుంచి ఒక మెస్సేజ్ వచ్చినట్లు ఒక కస్టమర్ తెలిపారు. రూ.2 కోట్ల రుణం వరకూ ఆరు నెలల మారటోరియం (2020 మార్చి 1– ఆగస్టు 31 మధ్య) సమయంలో అమలు చేసిన చక్రవడ్డీ రద్దు పథకాన్ని నవంబర్ 5వ తేదీలోపు అమలు చేయాలని గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ సంస్థలుసహా అన్ని బ్యాంకులకు సూచించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో నిర్దిష్ట రుణ అకౌంట్లలో ఆరు నెలల కాలానికి చార్జ్ చేసిన చక్రవడ్డీ–సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని రుణ గ్రహీతలకు ఎక్స్‌గ్రేషియో గ్రాంట్‌గా అందించే పథకాన్ని గత నెల్లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ పరిధిలోకి గృహ, విద్యా, క్రెడిట్ కార్డ్, ఆటో, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలు, కన్జూమర్ డ్యూరబుల్స్, వినియోగ రుణాలు వస్తున్నాయి. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ క్రియాశీలతకు సంబంధించిన రుణాలకు ఈ పథకం వర్తించదు. అక్టోబర్ 23న ఆర్థిక మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధించి ఒక నిర్వహణా పరమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తొలుత ఈ పరిహారాన్ని బ్యాంకింగ్ రుణ గ్రహీతలకు చెల్లిస్తుంది. అటు తర్వాత కేంద్రం నుంచి తిరిగి పొందుతుంది. ఎక్స్‌గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29 నాటికి బాకీ ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఇవి మొండిపద్దులుగా మారి ఉండకూడదు. మార్చి 1 నుంచి ఆగస్టు 21 దాకా కాలానికి (184 రోజులు) రిఫండ్ చేస్తారు. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. (చదవండి: కామత్ కమిటీ ఏం సూచించింది..?) నేపథ్యం ఇది... కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో కుదేలైన రుణగ్రహీతలకు కాస్త వెసులుబాటునిచ్చే విధంగా రుణ బాకీల చెల్లింపును కొంత కాలం వాయిదా వేసుకునే వీలు కలి్పస్తూ ప్రభుత్వం మార్చి 1 నుంచి ఆగస్టు 31 దాకా ఆరు నెలల పాటు రెండు విడతలుగా మారటోరియం ప్రకటించింది. అయితే, ఈ వ్యవధిలో అసలుపై వడ్డీ మీద వడ్డీ కూడా వడ్డించే విధంగా బ్యాంకుల నిబంధనలు ఉన్నాయి. ఈ చక్రవడ్డీ భారాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. సామాన్యుడి దీపావళి పండగ మీ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా స్కీమ్ రూపొందించింది. -
చక్రవడ్డీ మాఫీపై ఆర్థిక శాఖ వివరణ
న్యూఢిల్లీ: మారటోరియం వ్యవధిలో రుణాలపై చక్రవడ్డీ మాఫీపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. సాధారణ వడ్డీ, చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని రుణ గ్రహీతల ఖాతాల్లో బ్యాంకులు జమ చేసే అంశంపై స్పష్టతనిచ్చింది. ఎక్స్‌గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29 నాటికి బాకీ ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. రూ. 2 కోట్ల దాకా ఎంఎస్ఎంఈ, విద్య, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల బకాయిలు మొదలైన వాటికి ఈ స్కీము వర్తిస్తుంది. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఇవి మొండిపద్దులుగా మారి ఉండకూడదు. మార్చి 1 నుంచి ఆగస్టు 21 దాకా కాలానికి (184 రోజులు) రీఫండ్ చేస్తారు. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. నవంబర్ 5 కల్లా రుణగ్రహీతల ఖాతాల్లో ఎక్స్‌గ్రేషియా జమ చేయాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని బ్యాంకులకు కేంద్రం తర్వాత రీయింబర్స్ చేస్తుంది. -
లోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ : రుణ కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మారటోరియం కాలంలో అన్ని రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీయే వసూలు చేస్తామని, వడ్డీపై వడ్డీని వెనక్కు ఇస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అవిడఫిట్‌లో పేర్కొన్న దిశగా చర్యలు చేపట్టింది. మారటోరియం అమలైన ఆరు నెలల కాలంలో ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమచేయనున్నారు. బ్యాంకులు రుణగ్రహీతల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనుండగా, తర్వాత ప్రభుత్వం బ్యాంకులకు రీఎంబర్స్ చేస్తుంది. మారటోరియం సమయంలో ఈఎంఐలపై చక్రవడ్డీ కాకుండా సాధారణ వడ్డీనే వసూలు చేయాలని ఈ వ్యత్యాసాన్ని అర్హులైన రుణగ్రహీతల ఖాతాల్లో వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఈనెల 21న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఆ తర్వాత జూన్‌లో మరో మూడు నెలల పాటు మారటోరియం వ్యవధిని పొడిగించింది. ఈ వ్యవధిలో ఈఎంఐలపై చక్రవడ్డీ వసూలు చేయరాదని పలువురు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశాలతో వడ్డీపై వడ్డీని వెనక్కితీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కాగా ఈ పిటషన్లపై నవంబర్ 2న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. కాగా, మారటోరియం పధకాన్ని ఉపయోగించుకోకుండా ఈఎంఐలను యథావిథిగా చెల్లిస్తున్న వారికీ చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. చదవండి : లోన్లపై వడ్డీ మాఫీ : పండుగ కానుక -
రుణాలపై చక్రవడ్డీ మాఫీ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో రుణగ్రహీతలకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కోవిడ్–19 సమయంలో ప్రకటించిన మారటోరియంను ఉపయోగించుకున్న వారితోపాటు యథాప్రకారం వాయిదాలు చెల్లించిన వారికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. ఈ పథకం అమలుతో కేంద్రంపై రూ.6,500 కోట్ల మేర భారం పడనుంది. రూ.2 కోట్ల రుణగ్రహీతలకు లబ్ధి కలిగేలా సాధ్యమైనంత త్వరగా వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలనీ, ‘సామాన్యుడి దీపావళి’ కేంద్రం చేతుల్లోనే ఉందంటూ ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం పలు మార్గదర్శకాలను ప్రకటించింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు రూ.2 కోట్లలోపు బకాయి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఫిబ్రవరి 29వ తేదీ నాటికి వాటిని నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా ప్రకటించి ఉండకూడదు. ఆ మొత్తాన్ని ఈ ఏడాది మార్చి 27వ తేదీన ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం పథకాన్ని పూర్తిగా గానీ పాక్షికంగా గానీ వినియోగించుకున్న వారి ఖాతాల్లో రుణ సంస్థలు జమ చేయాల్సి ఉంది. మారటోరియం అవకాశాన్ని వినియోగిం చుకోని, ఎప్పటి మాదిరిగా వాయిదాలు చెల్లించే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలతో ఆయా సంస్థలు కేంద్రం నుంచి రీయింబర్స్మెంట్ పొందవచ్చు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో రుణాల చెల్లింపులపై కేంద్రం విధించిన 6 నెలల మారటోరియం అమలుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్ 2వ తేదీన జరగనుంది. -
లోన్లపై వడ్డీ మాఫీ : పండుగ కానుక
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా, లౌక్‌డౌన్ కాలంలో అమలు చేసిన రుణాల మారటోరియం సమయంలో మాఫీకి సంబంధించిన కేంద్రం శుభవార్త అందించింది. రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం పథకం కింద రూ .2 కోట్ల వరకు రుణాలపై "వీలైనంత త్వరగా" వడ్డీ మినహాయింపును అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన తరువాత ఈ మార్గదర్శకాలు వచ్చాయి. ఆర్థిక శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల కాలానికిగాను (మార్చి 1 నుండి ఆగస్టు 31, 2020 వరకు) 2 కోట్ల రూపాయలకు మించని హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్ లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వడ్డీ డబ్బులను కస్టమర్ల లోన్ అకౌంట్లో జమ చేస్తాయి. దీన్ని అనంతరం కేంద్రం నుంచి ఆయా బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. రుణగ్రహీత పూర్తిగా లేదా పాక్షికంగా తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా చక్రవడ్డీకి, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని చెల్లిస్తుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు అదనపు భారం పడనుంది. -
ఈఎంఐలు కట్టిన వారికి కేంద్రం శుభవార్త?
న్యూఢిల్లీ : మారటోరియంలో వెసులుబాటు కల్పించిన కాలంలోనూ నెలవారీ వాయిదాలు (ఈఎంఐ)లు కట్టిన వారికి కేంద్రం శుభవార్త చెప్పనుంది. వారు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీపై వడ్డీని మాఫీ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీపావళి వరకల్లా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కరోనా లౌక్‌డౌన్ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్లన్నటిపైనా మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. (రుణాలపై చక్రవడ్డీ మాఫీకి ఓకే) మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఇది అమల్లో ఉండగా చాలామంది తమ ఈఎంఐలను సమయానికి చెల్లించలేదు. మరికొందరు ఎప్పటిలాగానే చెల్లింపులు చేశారు. ఈ క్రమంలో రూ.2 కోట్ల లోపు పర్సనల్, హోమ్ లోన్లు వంటివి తీసుకుని, ఈఎంఐలు సమయానికి చెల్లించిన రుణగ్రహీతల వడ్డీపై వడ్డీ మాఫీ చేసే దిశగా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు కేంద్రం దీనిని ఆరు నెలల కాలానికి అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. -
సామాన్యుడి దీపావళి మీ చేతుల్లోనే.!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి ప్రేరిత సమస్యల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మారటోరియం పథకం కింద రూ.2 కోట్ల వరకూ రుణాలపై నెలవారీ వాయిదాల(ఈఎంఐ)కు చక్రవడ్డీ మాఫీని ‘సాధ్యమైనంత త్వరగా’ అమలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ‘‘సామాన్యుని దీపావళి మీ చేతుల్లోనే ఉంది’’ అని ఈ సందర్భంగా ప్రభుత్వ, బ్యాంకుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నవంబర్ 14వ తేదీ దీపావళి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘సామాన్యుని ఇబ్బందులు అర్థం చేసుకుంటామని, చక్రవడ్డీ భారం లేకుండా చూసే అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. ఇది ఆహ్వానించదగిన అంశం. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఇంకా ఎటువంటి ఉత్తర్వునూ జారీ చేయలేదు. మీరు మాకు కేవలం ఒక్క అఫిడవిట్ అందజేశారు అంతే. వడ్డీ రద్దు ప్రయోజనాన్ని ఎలా అందిస్తున్నారన్న అంశమే మాకు ఇప్పుడు ప్రధానం. ఇందుకు తగిన ఆదేశాలను ఇచ్చారా? లేదా అని మాత్రమే మేము ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం’’ అని జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఆర్ సుభాషన్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రం తరఫున వీడియో–కాన్ఫరెన్సింగ్ ద్వారా వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘తగిన పటిష్ట నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని కూడా ధర్మాసనం పేర్కొంది. కేసు తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. కరోనా కష్టకాలం నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్బీఐ మార్చి నుంచి ఆగస్టు వరకూ మారటోరియం విధించడం తెలిసిందే. అయితే కేంద్రం నిర్ణయం ఏదైనా అమలు చేయడానికి బ్యాంకులు సిద్ధమని బ్యాంక్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. మారటోరియం కాలానికి సంబంధించి ప్రస్తుత రుణాలపై వడ్డీమీద వడ్డీవేస్తూ, బ్యాంకులు సొమ్ము చేసుకోవడం తగదని పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ దత్తా న్యాయస్థానానికి విన్నవించారు. రూ.2 కోట్ల వరకూ రుణాలు తీసుకున్న వారిపై చక్రవడ్డీ తగదన్నారు. ‘‘తగిన ద్రవ్య విధానం, ప్రతిపాదనల అమలు లేకుండా ఆయా రుణా లను మొండిబకాయిగా వర్గీకరించవద్దంటూ ఇప్పటికే మేము ఆదేశాలు ఇచ్చాము’’ అని బెంచ్ స్పష్టం చేసింది. డిఫాల్ట్ కాని రుణాలకే పునరుద్ధరణ: ఆర్బీఐ ముంబై: రుణాల పునరుద్ధరణ అవకాశం ఈ ఏడాది మార్చి 1 నాటికి చెల్లింపుల్లో ఎటువంటి వైఫల్యాలు లేని ప్రామాణిక ఖాతాలకే ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను పరిశీలించిన తర్వాత మార్చి నుంచి ఆగస్ట్ వరకు ఆరు నెలల పాటు రుణ చెల్లింపులపై విరామానికి (మారటోరియం) ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆగస్ట్ తర్వాత కూడా అనేక రంగాల్లో పరిస్థితులు కుదుటపడకపోవడంతో రుణాల పునరుద్ధరణకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో రుణ గ్రహీతలు, రుణదాతలకు స్పష్టతనిస్తూ ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ► మార్చి 1 నాటికి 30 రోజులకు పైగా రుణ చెల్లింపులు బకాయి పడి, ఆ తర్వాత క్రమబద్ధీకరణ చేసుకున్నప్పటికీ అవి పునరుద్ధరణకు అర్హమైనవి కావు. ► ఇక అమలు దశలో ఉన్న ప్రాజెక్టులు, కార్యకలాపాలను వాయిదా వేసిన వాటికి సంబంధించిన రుణాలను కూడా ఈ పథకం నుంచి ఆర్బీఐ మినహాయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నాటి ఆదేశాలు, ఇతర మార్గదర్శకాలు వీటికి అమలవుతాయి. ► ఒకే సంస్థకు ఒకటికి మించిన సంస్థలు రుణమిచ్చినట్టయితే.. ఆ రుణ పునరుద్ధరణకు గాను అన్ని సంస్థలు సంయుక్తంగా కలసి ఇంటర్ క్రెడిటార్ ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. ► జూన్ 26 నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిర్వచనం మారినప్పటికీ.. అదేమీ ఆయా పరిశ్రమల రుణాలపై ప్రభావం చూపించదని ఆర్ బీఐ స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన రుణాల పరిష్కారానికి మార్చి 1 నాటికి అమల్లో నిర్వచనమే ఆధారంగా తీసుకోనున్నట్టు తెలిపింది. ► ప్రాపర్టీపై రుణాలకూ పునరుద్ధరణ అవకాశం ఉంటుంది. కాకపోతే అవి వ్యక్తిగత రుణాల్లోకి రాకూడదు. ► సాగుకు సంబంధించి అన్ని రుణాలు, ఎన్బీఎఫ్సీ రంగానికి సంబంధించినవీ ఈ పథకం కింద పునరుద్ధరించుకోవచ్చు. కాకపోతే పాడి, మత్స్య, పశు సంరక్షణ, పౌల్ట్రీలకు ఇచ్చిన రుణాలకు ఈ అవకాశం ఉండదు. -
ఉపశమనం ఇంతటితో సరి
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీని మాఫీ చేశామని, ఇంతకుమించిన ఉపశమనం ఇవ్వబోమని కేంద్రం స్పష్టంచేసింది. ఆర్థిక వ్యవహారాల్లో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పునరాలోచించే ప్రసక్తే లేదని తేల్చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, తదనంతర పరిస్థితుల వల్ల ఆదాయం పడిపోయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మారటోరియంతో ఎంతో ఉపశమనం కలిగించామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీ(వడ్డీపై వడ్డీ)ని మాఫీ చేశామని, ఇంతకంటే ఎక్కువ ఊరట కలిగించలేమని పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగే ప్రమాదం ఉందని, బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్నవారికి ఆరు నెలల మారటోరియం కాలానికి ఈ వెసులుబాటు లభిస్తుందని వెల్లడించింది. మారటోరియం గడువును ఆరు నెలల కంటే పొడిగించడం కుదరదని తెలిపింది. రుణాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని తీసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి పంకజ్ జైన్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. రుణ గ్రహీతలకు చక్రవడ్డీని మాఫీ చేయడం కాకుండా ఇంకా ఇతర ఏ ఉపశమనాలూ కలిగించలేమని కేంద్రం తెలిపింది. ఆరు నెలల మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేస్తామని, అంతకంటే ఇంకేం చేయలేమని కేంద్రం ప్రకటించడం తెల్సిందే. ఈ అంశంపై కేంద్రం తన వాదనను వినిపిస్తూ అక్టోబర్ 5న న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి వివరాలతో మరో అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పంకజ్ జైన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. మారటోరియం గడువును పొడిగిస్తే రుణగ్రహీతలపై మరింత భారం పడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ 13న తదుపరి విచారణ జరపనుంది. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు మారటోరియం విధించింది. రుణాలు, వడ్డీలపై ఇన్స్టాల్మెంట్ల చెల్లింపులను వాయిదా వేసుకోవచ్చని సూచిస్తూ ఆర్బీఐ మార్చి 27న తెలిపింది. తర్వాత కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో మారటోరియం గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించారు. కేంద్ర సర్కారు నిర్ణయం వల్ల తమపై భారం తగ్గదని, వడ్డీపై వడ్డీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటూ పలువురు రుణగ్రహీతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి ఆరు నెలల మారటోరియం కాలానికి చక్రవడ్డీని మాఫీ చేస్తామని కేంద్రం సమాధానమిచ్చింది.