MPTC elections
-
ఎన్నికల కౌంటింగ్‌కు ముహూర్తం ఫిక్స్
-
పశ్చిమ గోదావరి జిల్లా లో జోరుగా పరిషత్ ఎన్నికల ప్రచారం
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతంగా ఉపసంహరింప చేసిన నామినేషన్లను పునరుద్ధరించే అంశంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు సోమవారం ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కడైనా అభ్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపచేశారని నిర్ధారణ అయితే వాటిని పునరుద్ధరించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు గత నెల 18న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు కాగా.. వాటిపై సోమవారం తుది విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, వీఆర్ఎన్ ప్రశాంత్, వీఆర్ రెడ్డి, జీఆర్ సుధాకర్ తదితరులు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఎన్నికల కమిషన్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. పత్రికా కథనాల ఆధారంగా ఎలా నిర్ణయిస్తారు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఒకే నామినేషన్ వచ్చిన చోట నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారులు ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తక్షణమే ప్రకటించి ఫారం–10, ఎంపీటీసీ, జెడ్పీసీలుగా గెలుపొందినట్టు ఫారం 29 జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రసుత కేసులో కూడా రిటర్నింగ్ అధికారులు నిబంధనల మేరకే నడుచుకున్నారని తెలిపారు. వీటిపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడమే మార్గమని వివరించారు. పత్రికల్లో ప్రచురితమైన కథనాలను ఆధారంగా చేసుకుని బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఎన్నికల కమిషనర్ ఓ నిర్ణయానికి వచ్చారని, ఇది ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జనసేన పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ నెల 15కి వాయిదా వేశారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యాజ్యాల్లో విచారణ 8కి వాయిదా
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అప్పటికల్లా కౌంటర్లు దాఖలు చేసి, ఆ కాపీలను పిటిషనర్లు, ఇతర ప్రతివాదులకు అందచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అప్పటికల్లా కౌంటర్లు దాఖలు చేయకపోతే, ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు లేనట్లుగానే భావించి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత నెల 18న ఉత్తర్వులిచ్చారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై ఫిబ్రవరి 20వ తేదీకల్లా నివేదికివ్వాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులకనుగుణంగా అదేరోజు ప్రెస్‌నోట్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను, ప్రెస్‌నోట్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించి.. రద్దు చేయాలని కోరుతూ పలువురు పిటిషన్లు వేశారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాలన్నీ గత వారం విచారణకు రాగా, కౌంటర్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ గడువు కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. మార్చి 3 వరకు గడువిచ్చారు. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన వివేక్ చంద్రశేఖర్, ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌లు స్పందిస్తూ.. ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు. ఈ వ్యాజ్యాలను అడ్డంపెట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. ఈ నెల 3వ తేదీకల్లా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ వ్యాజ్యాలను అడ్డంపెట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని సుమన్ అన్నారు. అందుకే కౌంటర్ల దాఖలులో జాప్యం చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ.. కౌంటర్ల దాఖలులో జరిగిన జాప్యానికి కోర్టును క్షమాపణ కోరారు. విచారణను సోమవారానికి వాయిదా వేస్తే, ఆలోగా కౌంటర్ల కాపీలను అందరికీ అందచేస్తామని అభ్యర్థించారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
తాజా నోటిఫికేషన్ అక్కర్లేదు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) హైకోర్టుకు నివేదించింది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ తెలిపారు. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా మనుగడలో ఉండగా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఇప్పటికే ఇదే అంశంపై వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ఈ వ్యాజ్యాన్ని కూడా వాటితో పాటు కలిపి విచారించాలని కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని కూడా ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులిచ్చారు. గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని, ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఈ దృష్ట్యా గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ పథకాన్ని అడ్డుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణ అవసరమో లేదో ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడి చెబుతామన్నారు. ఇందుకు అంగీకరిం చిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ఎ.కె. గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘కళా’కు పరాభవం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుకు ఊహించని పరిణామం ఎదురైంది. తన సొంత మండలానికి చెందిన నాయకులు షాక్ ఇవ్వడంతో ఆయన కంగుతిన్నారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఇంకా పోలింగ్ జరక్కుండానే అవమానకరమైన ఫలితాలను చవిచూశారు. ఉపసంహరణలకొచ్చేసరికి ఇంకెంతటి చేదు అనుభవాలను ఎదుర్కొంటారో చూడాలి. సొంత మండలమైన రేగిడిలో మూడు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్ష పదవిని సైతం దక్కించుకోబోతోంది. దీన్నిబట్టి టీడీపీ ఎంత గడ్డు పరిస్థితిలో ఉందో స్పష్టమవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి సొంత మండలంలోనే ఇలా ఉంటే జిల్లాలో మిగతా చోట్ల ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నానాటికీ తీసికట్టు కళా వెంకటరావు.. ఈ పేరుకు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉండేది. గతంలో అనేక పర్యాయాలు మంత్రిగా చేసిన అనుభవం.. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా.. ఇంతటి పేరున్న కళా వెంకటరావు పరిస్థితి ప్రస్తుతం దయనీయమని చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసినప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా తన పెత్తనం ఇంకా ఉన్నప్పటికీ సొంత మండలంలో కనీసం పట్టు సాధించలేకపోయారు. దాదాపు ఉనికిని కోల్పోయారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో సొంత మండలమైన రేగిడిలో మూడు ఎంపీటీసీ స్థానాలకు తన పార్టీ అభ్యర్థుల చేత నామినేషన్ వేయించలేకపోయారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఖండ్యాం, కందిశ, కొమ్మెర ఎంపీటీసీ స్థానాలకు ఒక్క వైఎస్సార్సీపీ అభ్యర్థులే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవమైపోయాయి. కనీసం నామినేషనే వేయలేదంటే అక్కడ టీడీపీ కార్యకర్తలే లేరా అనే సందేహానికి ఊతమిచ్చింది. దీన్నిబట్టి టీడీ పీ ఎంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కుంటుందో స్పష్టమవుతుంది. అధినేత చంద్రబాబునాయు డు అజెండాను తలకెత్తుకోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని అక్కడివారు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ఎఫెక్ట్.. రాష్ట్రంలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందేందుకు దోహదపడే పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుతగలడం, మూడు రాజధానులు వ ద్దు–అమరావతే ముద్దు అని చంద్రబాబు అజెండాను భుజానికెత్తుకుని ముందుకెళ్లడం వలన ప్రజలు చీదరించుకుంటున్నారు. రాగా రాగా వచ్చే అవకాశాన్ని కాలదన్నుతున్నారని, అభివృద్ధికి అడ్డుపడే నాయకులకు అండగా ఉండటం అనవసరమని కళా వెంకటరావు సొంత మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా తిరస్కరిస్తున్నా రు. అధికారంలో ఉన్నంతకాలం అవినీతి అక్రమాలకు తెరలేపి, జన్మభూమి కమిటీల పేరుతో పచ్చనేతలను ప్రజల్లోకి వదిలేసి జిల్లాను నాశ నం చేసిన నేతలకు పట్టం కట్టడం కన్నా పక్కన పెట్టడమే మంచిదన్న నిర్ణయానికొచ్చిన ప్రజలు ఛీత్కరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తగి న బుద్ధి చెబుతామని బాహాటంగానే ప్రజలు ప్రకటిస్తుండటంతో ఆ పార్టీ తరపున పోటీ చే యడానికి నాయకులు భయపడుతున్నారు. అందులో భాగంగా కళా వెంకటరావు సొంత మండలంలోని మూడు ఎంపీటీసీ స్థానాలకు ఏకంగా నామినేషన్ వేయలేదు. జిల్లాలో టీడీపీ దయనీయ పరిస్థితికి ఇది తార్కాణంగా నిలిచింది. -
రాజకీయ పార్టీలతో.. 17న ఈసీ భేటీ
సాక్షి, అమరావతి : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 17వ తేదీ శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరుకావాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాసినట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ సమావేశం ఉ.11గంటలకు విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా ఆర్హత సాధించిన వాటిలో అధికార వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను సమావేశానికి హాజరుకావాలంటూ అధికారులు లేఖ రాశారు. జనసేన పార్టీకి గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా అర్హత లేకపోయినప్పటికీ.. నిర్ణీత గుర్తు కలిగి ఉన్న రిజస్టర్డ్ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకోవడంతో ఆ పార్టీని కూడా సమావేశానికి ఆహ్వానించారు. వీటితో పాటు రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్టు కాంగ్రెస్, బీఎస్పీలకు కూడా లేఖలు రాశారు. వీటితో పాటు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకున్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేతోపాటు వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మరో ఆరు పార్టీలను కూడా ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. -
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రెండు దశల్లో ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 45 రోజుల్లో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు నూతన చైర్మన్లు, అధ్యక్షులు కొలువుదీరనున్నారు. వచ్చే నెలన్నర రోజుల వ్యవధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, ఫలితాల వెల్లడి ప్రక్రియ ముగిసి నూతన సారథులను ఎన్నుకోవడం పూర్తి కానుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 333 మండలాల్లో తొలివిడతలో, 327 మండలాల్లో రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలో సగం మండలాల చొప్పున రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ముగిసిన నాలుగు రోజులకు రెండో దశ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. 17 సాయంత్రం షెడ్యూల్ విడుదల.. - ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. - ఈనెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అదే రోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. - రాష్ట్రంలో 660 మండలాలు ఉండగా 333 జడ్పీటీసీలకు, 5,352 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 327 జడ్పీటీసీలకు, 4877 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. - ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల అనంతరం మూడు రోజుల వ్యవధితో జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. - 660 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక ఒకే రోజు జరుగుతుంది. 13 జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికను కూడా ఒకే రోజు నిర్వహిస్తారు. - జడ్పీటీసీ స్థానాలకు జిల్లా కలెక్టరు కార్యాలయం లేదా జడ్పీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. - ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. - రెండు విడతల్లో మొత్తం 660 జడ్పీటీసీ, 10,229 ఎంపీటీసీ స్థానాలకు 34,320 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. - బ్యాలెట్ పేపర్ విధానంలో పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల నిర్వహణకు మొత్తం నాలుగు రకాల బ్యాలెట్ బాక్స్‌లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. చిన్నది, మధ్యస్తం, పెద్దది, జంబో తరహాలో బ్యాలెట్ బాక్స్‌లను వర్గీకరించారు. అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. - పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కోసం 30 గుర్తులను (ఫ్రీ సింబల్స్) సిద్ధం చేశారు. - మొదటి దశ ఎన్నికల్లో 1,45,05,502 మంది ఓటర్లు, రెండో దశలో 1,36,17,833 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. - మొత్తం 2,17,908 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. - ప్రతి కేంద్రంలో పోలింగ్ అధికారితో పాటు మరో ఐదుగురు సిబ్బంది ఉంటారు. మండల పరిధిలో కొంతమంది సిబ్బందిని అదనంగా ఉంచుతారు. ఏర్పాట్లపై చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 17వ తేదీన షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ శుక్రవారం కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై చర్చించారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటైన చోట, ఉన్నవాటిని రెండుగా విభజించిన చోట ఎన్నికల నిర్వహణకు కొత్తగా ఓటర్ల జాబితా, వార్డులను వర్గీకరించాల్సి ఉంటుంది. ఆయా చోట్ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే ప్రక్రియను ఫిబ్రవరి 8 నాటికి పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి ఎన్నికల సిబ్బందికి ఒక విడత శిక్షణ పూర్తి కావాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను తెప్పించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
విప్ ధిక్కరణ.. ఎంపీపీపై వేటు..!
సాక్షి, కామారెడ్డి : పార్టీ విప్ ధిక్కరించిన ఓ ఎంపీపీపై వేటు పడింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని నాగిరెడ్డిపేట్ ఎంపీపీ కృష్ణవేణి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. పార్టీ విప్ ధిక్కరించి టీఆర్ఎస్ మద్దతుతో ఎంపీపీగా గెలుపొందారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విప్ తీసుకున్న సంతకం తనది కాదని కృష్ణవేణి బుకాయించడంతో ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. సంతకం ఆమెదే అని తేలడంతో కృష్ణవేణిపై అనర్హతవేటు వేయాలంటూ కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ఎంపీపీ కృష్ణవేణిపై అనర్హత వేటు వేయాలని ప్రిసైడింగ్ అధికారుకు ఆదేశాలు జారీచేసింది. -
ఎంపీపీ ఎన్నిక ; ఎంపీటీసీ కిడ్నాప్..!
సాక్షి, హైదరాబాద్ : ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తన భర్త కనిపించడంలేదని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం మూట్పూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డి అదే గ్రామం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంపీటీసీగా గెలుపొందారు. ఫలితాల వెల్లడి అనంతరం రాంరెడ్డి కనిపించడం లేదు. గురువారం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఆయన భార్య జ్యోతి మండల కార్యాలయానికి వచ్చారు. తన భర్త జాడ తెలపాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రిజల్ట్స్ తెలుసుకుందామని వచ్చిన తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో రాంరెడ్డిని ఎవరైనా క్యాంపునకు తీసుకెళ్లారా అనే విషయం తేలాల్సిఉంది. -
ఎంపీటీసీగా గెలిచిన పైలట్
శంషాబాద్ రూరల్: ఓ పైలట్.. ప్రజా సేవ కోసం ప్రాదేశిక ఎన్నికల్లో పోటీచేసి ఎంపీటీసీగా గెలుపొందారు. శంషాబాద్ మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన గుర్రం ఆనంద్‌రెడ్డి బీటెక్ తర్వాత పైలట్‌గా ఏపీ ఏవియేషన్ అకాడమిలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత యూఎస్ఏతో పాటు వివిధ దేశాల్లో 14 ఏళ్ల నుంచి పైలట్ ఉద్యోగం చేశారు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆయన తాత్కాలికంగా ఉద్యోగానికి సెలవు పెట్టారు. కాంగ్రెస్ పార్టీపై చిన్నగోల్కొండ ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గుర్రం విక్రమ్‌రెడ్డిపై 673 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆనంద్‌రెడ్డి తండ్రి గుర్రం వెంకట్‌రెడ్డి మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, టీడీపీ మండల అధ్యక్షుడుగా పనిచేశారు. ఆయన కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా విజయం సునాయాసంగా వరించిందని చెప్పవచ్చు. మనం సమాజం నుంచి తీసుకున్న దాంట్లో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆనంద్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని పేర్కొన్నారు. తన గెలుపుతో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ పోలింగ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతొంది. ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉదయమే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో తొలి రెండుగంటల్లో 19 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో భాగంగా 27 జిల్లాల్లో 161 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 741మంది పోటీ చేస్తున్నారు. ఇక 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 5,723మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడతలో 30 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. -
పరిషత్ పోరు: తొలిదశ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
-
టికెట్ కలిపింది ఇద్దరినీ...
రామడుగు (చొప్పదండి): చిన్న మనస్పర్థలతో భార్యాభర్తలు ఐదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడిపోవడానికి కోర్టు మెట్లెక్కారు. కానీ.. స్థానిక ఎన్నికల పుణ్యమా అని విడిపోవడానికి నిశ్చయించుకున్న దంపతులు ఏకమయ్యారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని మోతె ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. దీంతో పలువురు ఆభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్టు ఆశించారు. కోరటపల్లికి చెందిన సీనియర్ నేత కలిగేటి లక్ష్మణ్ కూడా టికెట్టు కోసం పార్టీ అధినాయకత్వానికి విన్నవించుకున్నాడు. పలువురి పేర్లతోపాటు లక్ష్మణ్ పేరు కూడా పరిశీలించారు. కుటుంబ గొడవల కారణంగా ఆయన భార్య కాపురానికి రావడం లేదన్న విషయం నాయకులు గుర్తించారు. ఇదే విషయమై లక్ష్మణ్‌ను అడగగా, తన భార్య రావడం లేదని, కోర్టులో కేసు నడుస్తుందని, తన తల్లికి టికెట్టు ఇస్తే గెలిపించుకుంటానని విన్నవించుకున్నాడు. దీంతో వారు ‘నీ భార్యను తీసుకొని వస్తేనే టిక్కెట్ ఇస్తాం’అని చెప్పడంతో లక్ష్మణ్ తన భార్య తరఫు బంధువులతో సంప్రదింపులు జరిపాడు. కాపురానికి వచ్చేలా ప్రయత్నాలు చేసి బుధవారం భార్య కవితను ఒప్పించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ భార్యకు టికెట్టు కేటాయించారు. గురువారం బీఫాం ఆర్వోకు అందజేశారు. కాగా, పార్టీ టిక్కెట్ భార్యాభర్తలను ఏకం చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మణ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలు మమ్మల్ని కలుపడం సంతోషంగా ఉందని చెప్పారు. -
పంతం నెగ్గించుకున్న తీగల కృష్ణారెడ్డి
టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిపై సందిగ్ధత వీడింది. మొన్నటి వరకు జెడ్పీ పీఠం కోసం పోటీపడిన ముగ్గురు నేతల కుటుంబ సభ్యుల్లో ఒకరికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చైర్మన్ గిరిపై మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసింది. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరపడినట్లయింది. జెడ్పీ చైర్పర్సన్ పదవిని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీరాజ్ కొత్త చట్టం సంస్కరణల నేపథ్యంలో చైర్పర్సన్ కీలకంగా మారనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ పదవికి తీవ్ర పోటీ ఏర్పడింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీ తరఫున ముగ్గురు నేతలు తమ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కోరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూతురు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోడలు పదవిని ఆశించారు. తన కూతురు పోటీ విషయంలో ప్రకాశ్‌గౌడ్ చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. దీంతో తమకు వద్దని అధిష్టానానికి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కోడలు మంచాల నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. తొలిదశ ఎన్నికల జాబితాలో ఉన్న ఆ మండలంలో అప్పటికే నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అవకాశం చేజారింది. దీంతో అనితారెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది. అంతేగాక అనితారెడ్డి మామ కృష్ణారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అంతకుముందు అనితారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్కేపురం డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా బరిలోకి దిగి ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో తమకు ఎలాగైనా చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. ఫలితంగా చైర్పర్సన్ పదవి కోపం అనితారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు మహేశ్వరం స్థానికుల్లో ఒకరికి లేదంటే.. మొదటి నుంచి పార్టీలో కొనసాగిన వారికే జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీని కోరారు. దీనికితోడు టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైన స్థానిక ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి కూడా తమ వర్గానికి జెడ్పీటీసీ టికెట్ కావాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో అనితారెడ్డి గెలుపుకోసం స్థానిక నాయకులు, సబితమ్మ వర్గం ఏ స్థాయిలో కృషిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుంచి రేసులో ఇద్దరు.. జెడ్పీ చైరపర్సన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డి సతీమణి నిత్యారెడ్డి ఒకరుకాగా.. తుక్కుగూడ మాజీ సర్పంచ్ కొమిరెడ్డి నర్సింహారెడ్డి కోడలు శాలినీరెడ్డి మరొకరు. మంచాలలో నిత్యారెడ్డి పోటీచేస్తుండగా.. శాలినీరెడ్డి మహేశ్వరం నుంచి బరిలో నిలిచారు. అయితే ప్రస్తుతానికి వీరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే అభ్యర్థి పేరును ప్రకటిస్తే గ్రూపు రాజకీయాలు మొదలయ్యే ప్రమాదం ఉందని పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే నేతలు, కార్యకర్తల వలసలతో కుదేలవుతున్న జిల్లా పార్టీ.. గ్రూపు తగాదాలైతే ఇతర పార్టీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో జెడ్పీటీసీ స్థానాలు దక్కితే.. ఆ తర్వాత చైర్పర్సన్ అభ్యర్థి పేరును ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో అనిశ్చితి.. మరోపక్క బీజేపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఆ పార్టీలో చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నవారు పెద్దగా లేనట్లు తెలుస్తోంది. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపుపై ప్రధానంగా దృష్టిసారించింది. తొలి, రెండు దశల్లో ఎన్నికలు జరిగే మండలాల్లో ఆ స్థాయి అభ్యర్థులు లేరని పార్టీలో చర్చజరుగుతోంది. ఇక ఆశలన్నీ మూడో దశ ఎన్నికలు జరుగుతున్న మండలాలపైనే ఉన్నాయి. -
బెదిరించడంతో విత్‌డ్రా!
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్ : గగ్గలపల్లి ఎంపీటీసీ నామినేషన్ విత్‌డ్రా విషయంలో హైడ్రామా సాగింది. నాగర్‌కర్నూల్ మండలంలో తొలి విడతలో ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఆదివారంతో ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దొడ్ల వెంకట్ నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి దొడ్ల ఈశ్వర్ రెడ్డితో పాటు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నిం గ్ అధికారులు ప్రకటించారు. ఇది వరకు బాగానే ఉన్నా.. తాను విత్‌డ్రా చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ నారాయణరెడ్డి ధర్నాకు దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్‌రెడ్డితో పాటు మరో నలుగురు టీఆర్ఎస్ నాయకులు తనను ఈనెల 28న మధ్యాహ్నం 12.45గంటలకు గగ్గలపల్లి నుంచి కారులో బలవంతంగా తీసుకెళ్లి ఉయ్యాలవాడలోని ఓ టీఆర్ఎస్ నేత ఇంట్లో బంధించి, రూ.20 లక్షలు ఇస్తామని నామినేషన్ విత్‌డ్రా చేసుకోమన్నారని ఆరోపించారు. విత్‌డ్రా చేసుకోకుంటే కుటుంబసభ్యులపై దాడులు చేస్తామని బెదిరించి తన భార్యకు రూ.10లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టలేకపోయినా 28న విత్‌డ్రా చేసుకున్నానని ఆయన తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సోమవారం నారాయణరెడ్డి ధర్నా చేశారు. అనంతరం డీఆర్వో మధుసూదన్‌నాయక్‌కు వినతి పత్రాన్ని అందించారు. మద్దతుగా కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థిని బెదిరింపులకు గురిచేశారని, ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండా మణెమ్మ తెలిపారు. తమ పార్టీ అభ్యర్థికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. వారి వెంటనాయకులు పాపయ్య, మాజీ సర్పంచ్‌లు భార్గవి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ, నిరంజన్, నగేష్ తదితరులు ఉన్నారు. -
ప్రతిష్టాత్మకం..పరిషత్ ఎన్నికలు
బెల్లంపల్లి : పరిషత్ ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ , గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే ఈఎన్నికల్లోనూ సత్తాచాటాలని టీఆర్ఎస్ తహతహలాడుతుండగా కనీసం పరిషత్ ఎన్నికల్లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలనే కాంక్షతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఆ రెండు పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా పోరాడుతున్నాయి. అందులో భాగంగానే సమర్థులైన అభ్యర్థులను పోటీలోదింపి ప్రచార పర్వం సాగిస్తున్నాయి. అయితే మారిన పరిణామాలతో ప్రతీచోట ఎన్నిక ఏ ఒక్కరాజకీయ పార్టీకి అంత ఈజీగా లేకపోవడంతో చెమటోడ్చాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడా ఏకపక్షంగా ఏ పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు కానరావడం లేదు. ఈ తీరు ఆయాపక్షాల అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. పోటీలో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉండటంతో ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి. ఎన్నికల్లో గెలుపు సాధించడమే ప్రధాన కర్తవ్యంగా రెండు ప్రధాన పక్షాలు ముందుకు సాగుతుండటంతో ఓటర్ల ఆదరణ ఎవరికి ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. అసెంబ్లీ నియోజకవర్గంలో... బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు తొలిదఫాలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. నియోజకవర్గంలోని 7 జెడ్పీటీసీ స్థానాలకు ఏకంగా 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తాండూర్, కన్నెపల్లి జెడ్పీటీసీ సా ్థనాల్లో ఆరుగురు అభ్యర్థులు, కాసిపేటలో నలుగురు అభ్యర్థులు, నెన్నెల , భీమిని, బెల్లంపల్లి మండలాల్లో ముగ్గురు అభ్యర్థుల చొప్పున పోటీకి సిద్ధమయ్యారు. వేమనపల్లి మండలంలో మా త్రం ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోంది. ఏకగ్రీవానికి ‘నై’ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వగా పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఆ పాచిక ఎక్కడా సరిగా పారలేదు. ప్రతీచోట పోటీ చేయడానికే ఔత్సాహిక అభ్యర్థులు మరీ ముఖ్యంగా యువకులు ఆసక్తి చూపించారు. రిజర్వేషన్ ప్రాతిపదికన మహిళలు కూడా అధికసంఖ్యలోనే పోటీలో ఉన్నారు. ఓ ప్రధానరాజకీయ పార్టీ అక్కడక్కడ తమ అభ్యర్థులు ఏకగ్రీవం కావడానికి ఆదిలో పావులు కదిపినా ప్రయోజనం లేకుండా పోయింది. అన్నిచోట్ల కూడా పోటీకీ అభ్యర్థులు సిద్ధపడటం, ప్రలోభాలకు ఆకర్షితులు కాకపోవడంతో పోటీ అనివార్యమైంది. కాగా ఎన్నికల ప్రచారపర్వం మరో రెండు, మూడురోజుల్లో ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంపీటీసీ బరిలో 166 మంది 47 ఎంపీటీసీ స్థానాల్లో 166 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాసిపేట మండలంలో ఉన్న 9 స్థానాల్లో అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా తాండూర్లోని 9 స్థానాలకు 39 మంది, బెల్లంపల్లిలోని 8 స్థానాలకు 26 మంది, నెన్నెలలో 7స్థానాలకు 19 మంది. కన్నెపల్లిలో 5 స్థానాలకు 18 మంది, వేమనపల్లిలో 5 స్థానాలకు 14 మంది పోటీలో ఉన్నారు. భీమిని మండలంలో 4 స్థానాలు ఉండగా 8 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చిన్నగుడిపేట ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. ఇక్కడ ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఆఖరిరోజు నలుగురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అయితే సదరు అభ్యర్థి ఎన్నికను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ ఒక్కస్థానంలో మినహా ఇతర అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో హోరాహోరీగా పోటీ కనిపిస్తోంది. -
తొలి విడత ప్రచారం షురూ!
సాక్షి, హైదరాబాద్: తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురణతో రాజకీయ పార్టీలు, స్వతంత్రుల గుర్తుల వారీగా బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను రిటర్నింగ్ అధికారులు ఖరారు చేసి, అభ్యర్థుల జాబితాలు ప్రకటించారు. వచ్చేనెల 6న 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలుండడంతో రాజకీయ పార్టీల గుర్తులతో బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్నకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు లేదా నాలుగు రోజుల్లోనే వీటి ముద్రణ పూర్తిచేసి, పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. ఈ విడత ఎన్నికల ప్రచారం కూడా ఆదివారం సాయంత్రం నుంచే మొదలైంది. నేడు రెండో విడత నామినేషన్ల పరిశీలన రెండోదశ పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సోమవారం సాయంత్రం 5 వరకు నామినేషన్లను పరిశీలించి, 5 గంటల తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా సిద్ధం చేస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా అప్పీలు చేసుకోవాలి. మే1న సాయంత్రం 5లో గా వాటిని పరిష్కరిస్తారు. 2న నామినేషన్ల ఉపసం హరణ గడువు ముగిశాక, అదేరోజుసాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 10న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం వరకు 1,913 ఎంపీటీసీ స్థానాలకు 4, 652, 180 జెడ్పీటీసీ స్థానాలకు 660 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోదశకు నామినేషన్ల ప్రక్రియ ఆఖరు రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
చెంబెడు నీటితో చెరువు నింపుతాం
జనగామ: జలం కోసం జనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని జనగామ మండలంలోని పెంబర్తి గ్రామ యువకులు నిర్ణయించారు. పెంబర్తిలోని పెద్ద చెరువు ఎండిపోయినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం.. చుక్క నీరు లేక ఎండుతున్న పంటలకు తోడు గుక్కెడు నీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలను చూసిన చలించిపోయిన యువకులు వినూత్న నిరసనకు దిగారు. స్థానిక యువకులు చొప్పరి సంతోష్, సతీష్, ఏదునూరి రాము, గుడికందుల ప్రశాంత్, మణికంఠ, సాయి, పల్లపు శ్రీకాంత్, గుజ్జుల వేణు, పల్లపు హరీశ్ ఆధ్వర్యాన ఇంటింటికి చెంబెడు నీళ్ల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో వెయ్యి దరఖాస్తులు అందించిన యువకులు మరో నిరసన చేపట్టారు. ఇంటింటికీ చెంబు చొప్పున సేకరించిన నీటితో పెద్ద చెరువును నింపే యత్నం చేస్తామని, అప్పుడైనా ప్రజాప్రతినిధులు మేల్కొంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం వంద బిందెల నీటిని పెద్దచెరువులో పోసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపి సత్తా చాటుతామని యువకులు పేర్కొన్నారు. -
మీ ఎంపీటీసీగా ఎవరుండాలి?
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త పరీక్ష తెచ్చిపెట్టాయి. ఆయా నియోజకవర్గాల్లోని అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే.. ఎమ్మెల్యేలకు రాజకీయంగా, పార్టీలో పట్టు ఉంటుంది. దీంతో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ బీఫారం దక్కితే గెలుపు ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో ఉంది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల కోసం అధికార పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. ఆశావహుల్లో పోటీని అధిగమించి గెలిచే వారికి అవకాశాలు ఎలా ఇవ్వాలా అని ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. ఏకాభిప్రాయం అనే విధానాన్ని అనుసరించాలని కొందరు నిర్ణయించారు. అయితే అన్ని పార్టీల నేతలు టీఆర్ఎస్లోకి చేరడంతో గ్రామాల్లో రెండు మూడు గ్రూపులుగా ఉన్నాయి. అన్ని స్థాయిలలో గ్రూపులు ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కావట్లేదు. దీంతో అభ్యర్థుల ఎంపిక కోసం చివరికి సర్వే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అన్ని గ్రామాల్లో పలు సంస్థలతో సర్వే నిర్వహించి.. టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు ఎమ్మెల్యేలు సొంత ఖర్చులతో సర్వేలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల్లోనూ పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు సర్వేలతోనే అభ్యర్థులను ప్రకటించారు. పలు సంస్థలతో.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అమలు చేస్తున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టికెట్ల కోసం పోటీలో ఉన్న వారి జాబితా రూపొందించి వారిలో మెరుగైన అభ్యర్థి ఎవరనేది ప్రజల నుంచి తెలుసుకునేలా ఈ సర్వేలు సాగుతున్నాయి. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇబ్బంది లేకున్నా.. ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు మాత్రం ఎమ్మెల్యేలకు తలనొప్పులు తెస్తోంది. మరోవైపు గ్రామాల్లోని స్థానిక పరిస్థితులను అంచనా వేయడం క్లిష్టంగా మారుతోంది. సర్వే నివేదికల ఆధారంగా మండలాల వారీగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల ముఖ్యులతో చర్చించి సర్వే వివరాలను చెబుతున్నారు. సర్వేలో పలానా వారి పేరు ముందుందని, వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుందని వివరిస్తున్నారు. ఆశావహులకు సర్వే వివరాల కాపీలను అందజేసి పార్టీ గెలుపు కోసం పని చేయాలని అనునయిస్తున్నారు. మరోసారి సర్వే చేయాలని ఎమ్మెల్యేలను కొందరు కోరుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎమ్మెల్యేలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. బీ ఫారాలు ఇచ్చే వరకు సర్వేలు నిర్వహిస్తామని, అప్పటి వరకు ఎవరు మెరుగ్గా ఉంటే వారికే అవకాశం వస్తుందని చెబుతున్నారు. సర్వే వివరాలను పరిశీలించిన ఆశావహులు అందులోని అంశాలను చూసి ఎమ్మెల్యేల నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. గ్రామ ప్రజల్లో తమ గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని అంటున్నారు. -
పరిషత్తు.. కసరత్తు
సాక్షి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అన్ని పార్టీలూ కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ, సర్పంచ్, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తెరలేచింది. ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పార్టీల నాయకులు ప్రణాళికలు రూపొందించుకునే పనిలోపడ్డారు. దూకుడుమీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో సోమవారం సమావేశంకాగా.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తపరిచేందుకు కాంగ్రెస్ మండలాల వారీగా సమావేశాలకు శ్రీకారం చుట్టింది. టార్గెట్ చైర్మన్ అసెంబ్లీ, సర్పంచ్ విజయాలతో దూకుడు మీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ పరిషత్ చైర్మన్లను కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం తమదేనంటున్న గులాబీ శ్రేణులు అదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి అధికారం కూడా టీఆర్ఎస్ చేతిలో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయనే భావనతో టీఆర్ఎస్ పెద్దలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవాలని ఇప్పటికే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో పిలుపునిచ్చారు. అందులోభాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లా ప్రజాపరిషత్‌లు, 66 మండల పరిషత్‌లను కైవ సం చేసుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పరిషత్ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తరలివెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ప్ర జాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో అన్ని జిల్లా ప్రజాపరిషత్‌లను కైవసం చేసుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులుగా సమర్థవంతులను ఎంపిక చేసుకోవాలన్నారు. అలాగే ఇటీవ ల ఉమ్మడి జిల్లాలో ఓటమి చెందిన ఏకైక పార్టీ అ భ్యర్థి కోవ లక్ష్మికి జెడ్పీ చైర్పర్సన్ అవకాశం క ల్పించారు. ఆసిఫాబాద్ టీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్స న్ అభ్యర్థిగా కోవ లక్ష్మి పేరును కేసీఆర్ ప్రకటిం చారు. అలాగే పరిషత్ ఎన్నికల బాధ్యతలు పార్టీ నేతలకు అప్పగించిన సీఎం, ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం జెడ్పీ స్థానాలు గెలవాలని తేల్చిచెప్పారు. పోరుకు కాంగ్రెసై అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లోనైనా ఉనికి చాటుకోవా లని ఉబలాటపడుతోంది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ.. అదే ఊపుతో మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలను దక్కించుకోవాలని యోచిస్తోంది. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మండలాల వారిగా పార్టీ నాయకులు, క్యాడర్‌తో మంతనాలు జరుపుతున్నారు. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల పేర్లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీనితోపాటు కాంగ్రెస్ పార్టీకి వీలైనన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే మండలాల వారిగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ, పార్టీ క్యాడర్‌ను స్థానిక పోరుకు సమాయత్తం చేసే పనిలో కాంగ్రెస్ నేతలున్నారు. పార్టీ గుర్తులతో జరిగే పరిషత్ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవడానికి టీఆర్ఎస్, పునరుత్తేజం పొందడానికి కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. -
‘పరిషత్’ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ఏప్రిల్ 11న రాష్ట్రంలో తొలివిడత లోక్‌సభ ఎన్నికలు ముగియగానే, రెండో వారంలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. మే నెల మొదటి లేదా రెండో వారంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవకాశమున్నట్లుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 27న జిల్లా పంచాయతీ అధికారులు చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా వార్డులు, పంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తయింది. తుది జాబితా పూర్తయిన నేపథ్యంలో శనివారం మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల పరిధిలోని ఎంపీటీసీ స్థానాల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలతోపాటు జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ)ల పరిధిలోని జెడ్పీటీసీ సీట్ల వారీగా ఓటర్ల జాబితాలను కొన్ని జిల్లాల్లో సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలను ఆయా జిల్లాల్లోని సంబంధిత మండల, జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించినట్టు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తి కాని జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి కల్లా అధికారులు తమ పనిని ముగించవచ్చని చెబుతున్నారు. 27న జిల్లాల్లోని పంచాయతీల వారీగా ప్రచురించిన ఓటర్ల తుది జాబితాకు అనుగుణంగా ఏప్రిల్ 7 నుంచి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాలు సిద్ధం చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ జాబితాల ఆధారంగా పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేసుకుని, అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది. మండలాల పరిధిలోని పంచాయతీల్లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను ఏప్రిల్ 20 కల్లా పూర్తిచేసుకోవాలని పేర్కొంది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ, సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నిక కమిషన్ , పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. -
‘ప్రాదేశిక’ ఓటర్లు 57,789
సాక్షి, కరీంనగర్‌రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లతో ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు స్థానిక నాయకులు కసరత్తులు చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో 24,402, కరీంనగర్‌రూరల్ మండలంలో 33,387 ఓటర్లు, మొత్తం 57,789 మందితో కూడిన కొత్త ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారులు శని వారం విడుదల చేశారు. ఆయా గ్రామపంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలున్నట్లయితే ఈనెల 20వరకు లిఖితపూర్వకంగా స్వీకరిస్తారు. తుది ఓటర్ల జాబితాను ఈనెల 27న ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ మండల పరిషత్ సమావేశమందిరంలో కరీంనగర్, కొత్తపల్లి మండలాలకు చెందిన రాజకీయపక్షాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయపార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీవో పవన్‌కుమార్ కోరారు. ఎంపీటీసీ కోసం ప్రయత్నాలు ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో స్థానిక నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తూ నే మరోవైపు ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు మద్దతు కూడగట్టుతున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తులతో ఉండటంతో రిజర్వేషన్ల ప్రకా రం పోటీచేసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు నాయకులు మరోమారు పోటీ చేసేం దుకు సమాయత్తమవుతున్నారు. రిజర్వేషన్లు కలి సిరాని నాయకులు తమ భార్యలను బరిలో దిం చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్‌రూరల్ మండలంలో మొత్తం 12, కొత్తపల్లి మం డలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కరీంనగర్‌రూరల్ ఎంపీపీ పదవి జనరల్, కొత్తపల్లి ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో పలువురు నాయకులు ఎంపీపీ పదవికోసం పావులు కదుపుతున్నారు. కరీంనగర్ ఎంపీపీ కోసం జనరల్ ఎంపీటీసీస్థానాలైన బొమ్మకల్–2, నగునూరు–2, గోపాల్పూర్, చెర్లభూత్కూర్, చామన్‌పల్లి ఎంపీటీసీలకు అవకాశముంది. అదేవిధంగా కొత్తపల్లి ఎంపీపీ కోసం బావుపేట–1, చింతకుంట–1, నాగులమల్యాల ఎంపీటీసీ స్థానా ల నుంచి మహిళలకు అవకాశముంది. దీంతో ఈస్థానాల నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు నాయకులు పోటిచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. స్థానిక నాయకుల నుంచి అవసరమైన మద్దతు కూడగట్టుతున్నారు. సతీమణులకు అవకాశం కరీంనగర్‌రూరల్ జెడ్పీటీసీ స్థానం జనరల్ మ హిళ, కొత్తపల్లి జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళలకు కేటాయించడంతో అధికారపార్టీకి చెందిన పలువు రు నాయకులు తమ భార్యలను రంగంలోకి దిం పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్‌రూరల్ జెడ్పీటీసీ కోసం టీఆర్ఎస్ నుంచి బొమ్మకల్, చేగుర్తి మాజీ సర్పంచులు పురుమల్ల లలిత, బల్మూరి భాగ్యలక్ష్మి, దుర్శేడ్ ఎంపీటీసీ కోరుకంటి శోభరాణి, బీజేపీ నుంచి మొగ్ధుంపూర్ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి లక్ష్మి, కాంగ్రెస్‌పార్టీ నుంచి ఇరుకుల్ల మాజీ సర్పంచ్ మారుతీరావు సతీమణి శ్వేత పోటీచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తపల్లి జెడ్పీటీసీ కోసం బావుపేటకు చెందిన పిల్లి మహేశ్‌గౌడ్, మల్కాపూర్మాజీ సర్పంచ్ కాసారపు శ్రీనివాస్‌గౌడ్, ఎలగందల్‌కు చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిమ్మ ల అంజయ్య తదితరులు తమ సతీమణులను పోటీలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు 57,789 కొత్తపల్లి మండలం 24,402 కరీంనగర్‌రూరల్ మండలం 33,387 -
మే మొదటి వారంలో పరిషత్ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు మే నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలిదశలోనే (ఏప్రిల్ 11) తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ రెండో నోటిఫికేషన్ ఇచ్చి.. దీనికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలు గడువు ముగిసేలోపు (మే 25) జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబరులో అసెంబ్లీ, జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో నెలల తరబడి ఎన్నికల నియమావళి అమల్లో ఉంటోంది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతి ఉండటంలేదు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను త్వరగా ముగించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈవీఎంలతో పరిషత్ ఎన్నికల్లో ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలు (ఈవీఎం) ఉపయోగించాలనే ఆలోచనలో ఎస్ఈసీ ఉంది. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై టీఆర్ఎస్, తదితర పార్టీల నుంచి సానుకూలత వ్యక్తమైనట్టు సమాచారం. ఈ ఎన్నికలు రెండువిడతల్లో నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించాలనే ఆలోచనతో ఎస్ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా అన్ని పార్టీలనుంచి ఆమోదం వచ్చినట్లు సమాచారం. వేగంగా ఏర్పాట్లు పరిషత్ ఎన్నికలకోసం ఎస్ఈసీ ఏర్పాట్లును వేగవంతం చేసింది. వచ్చే జూలై 4న కొత్త జడ్పీలు, ఎంపీపీ పాలకవర్గాలు ఏర్పడేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలోని పాత 9 జడ్పీల స్థానంలో 32 జడ్పీల చైర్పర్సన్లు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాల పరిధిలో ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. కొత్త జడ్పీలు, ఎంపీపీల పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కూడా పూర్తయింది. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారయ్యాయి. 32 జడ్పీలు, 535 ఎంపీపీలు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ ప్రక్రియను పూర్తిచేయడంలో భాగంగా ఇప్పటికే పాత 9 జడ్పీల స్థానంలో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 32 జడ్పీలు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాలను ఎంపీపీలుగా పునర్విభజన పూర్తిచేశారు. 32 జడ్పీ చైర్పర్సన్లు, 535 ఎంపీపీలకు సంబంధించి ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్టు సమాచారం. కొత్తగా 68 మున్సిపాటిలీలు ఏర్పడిన నేప థ్యంలో ఆయా మండలాల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీలను వాటిలో విలీనం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 489 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 27న ఓటర్ల తుది జాబితా ఈ నెల 27న రాష్ట్రంలో గ్రామపంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఎస్ఈసీ ఇదివరకే ఆదేశించింది. తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించాలని గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సూచించిన మేరకు వార్డుల విభజన పూర్తిచేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ నెల 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ జాబితాలపై వివిధ ప్రక్రియలను నిర్వహించాక 27న డీపీవో చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామపంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి. -
‘బీసీ రిజర్వేషన్ల తగ్గింపు దుర్మార్గం’
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 18 శాతానికి తగ్గించి అమలు చేయడం దుర్మార్గమని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో శుక్రవారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామ స్థాయిలలో బీసీల నాయకత్వం ఎదగకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జిల్లా పరిషత్ చైర్మన్లలో ఆరు చైర్మన్లు, 550 మండల పరిషత్ చైర్మన్లలో 94 చైర్మన్లు ఏ లెక్కన ఇస్తారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. రిజర్వేషన్ల తగ్గింపునకు వ్యతిరేకంగా అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.