National Education Policy
-
ఎన్ఈపీ సారథులు ఏపీ విద్యార్థులు
సాక్షి, అమరావతి: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)–2020 అమలులో విద్యార్థులను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల ‘ఎన్ఈపీ సారథి’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం అమలు కోసం ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులను ఎంపిక చేసింది. తాజాగా వారి జాబితాను ప్రకటించింది. ఎన్ఈపీ సారథులుగా ఎంపికైన వీరిని ఎన్ఈపీ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, వివిధ ఉన్నత విద్యాసంస్థలకు చెందిన వైస్చాన్స్లర్లు, డైరెక్టర్లు ప్రిన్సిపాళ్లు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా ఎన్ఈపీ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలుగుతామని యూజీసీ భావిస్తోంది. మన రాష్ట్రం నుంచి 8 కాలేజీలకు చెందిన 23 మంది విద్యార్థులకు ఈ అవకాశం దక్కింది. సర్టిఫికెట్, డిప్లొమో, యూజీ, పీజీ విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్ఈపీ లక్ష్యాల సాధనలో విద్యార్థులను నిమగ్నం చేయడం, ఉన్నత విద్యారంగంలో సంస్కరణలపై విద్యార్థుల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా యూజీసీ దీనికి శ్రీకారం చుట్టింది. విద్యా సంస్కరణలు విజయవంతంగా అమలు కావడానికి విద్యార్థుల ప్రమేయం, వారిలో నిబద్ధత చాలా ముఖ్యమైనవని, అప్పుడే ఇది విజయ వంతం అవుతుందని యూజీసీ అభిప్రాయ పడుతోంది. ఈవెంట్లు, డిబేట్లు, పోటీలు, క్విజ్లు వంటి కార్యక్రమాలను కాలేజీల్లో నిర్వహించేలా కార్యక్రమాలు రూపొందించింది. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎన్ఈపీపై ప్రచారం చేయడం, కాలేజీల్లో ఎన్ఈపీ హెల్ప్ డెసు్కల ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతిభగల విద్యార్థుల ఎంపిక ఎన్ఈపీ అంబాసిడర్‌గా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు తమ సంస్థల్లో అత్యుత్తమ వ్యక్తిత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామర్థ్యాలు, సృజనాత్మకత, బాధ్యతాయుత ప్రవర్తన, నాయకత్వ పటిమ ఉన్న ముగ్గురు విద్యార్థులను నామినేట్ చేశాయి. వారి నుంచి యూజీసీ అర్హులైన వారిని ఎంపిక చేసి ఎన్ఈపీ అంబాసిడర్లుగా ప్రకటించింది. వీరి విధుల్లో ఎన్ఈపీ– 2020 కార్యక్రమాలపై ఇతర విద్యార్థులకు అవగాహన పెంచడం, క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం ప్రధానమైనవి. అంతేగాక ఈ కార్యక్రమం అమలుపై యూజీసీకి ఫీడ్‌బ్యాక్‌ను అందించాలి. అంబాసిడర్‌గా ఎంపికైన వారికి యూజీసీ గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్తో వారికి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సర్టిఫికెట్తో పాటు యూజీసీ ఆన్లైన్ ప్రోగ్రామ్‌లు, ఇతర అవకాశాలను కూడా వారు పొందుతారు. అలాగే ఈ అనుభవం వారికి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విద్యాకోర్సుల అభ్యాసానికి సహకరిస్తుంది. -
ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ: జాతీయ విద్యావిధానంలో భాగంగా పరీక్షల విధానంలో కేంద్రం కొత్త మార్పులకు సిద్ధమైంది. ఇకపై ఇంటర్లో ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్సీఎఫ్) ప్రతిపాదనలు చేసింది. అలాగే, 9–12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జెక్టుల సంఖ్యను పెంచాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్సీఎఫ్ నివేదికను బుధవారం జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలికి అందించారు. ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఏ పరీక్షలో అయితే ఉత్తమ మార్కులు సాధిస్తారో వాటినే ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ చెప్పింది. ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని పేర్కొంది. క్రమక్రమంగా అన్ని బోర్డులు కూడా సెమిస్టర్ లేదా టర్మ్ బేస్డ్ వ్యవస్థకు మారతాయని కేంద్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. దీనివల్ల విద్యార్థులు ఒక సబ్జెక్టును పూర్తిచేయగానే అతడు పరీక్ష రాయొచ్చని, ఇలా ఒక పరీక్ష పూర్తయినా విద్యార్థిపై కంటెంట్ భారం తగ్గుతుందని చెప్పింది. ఎన్‌సీఎఫ్‌ను ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ నేతృత్వంలోని జాతీయ స్టీరింగ్ కమిటీ రూపొందించింది. బోర్డు పరీక్షల్లో ఇలాంటి సంస్కరణలు తొలిసారి కాదు. 2009లో పదో తరగతిలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానాన్ని ప్రవేశపెట్టగా, 2017లో రద్దుచేసి తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని తెచ్చారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఇకపై కచ్చితంగా మూడు లాంగ్వేజ్ సబ్జెక్టులు చదవడం తప్పనిసరని ఎన్సీఎఫ్ సిఫార్సు చేసింది. వీరు మూడు లాంగ్వేజ్‌లతోపాటు మ్యాథ్స్, కంప్యూటేషనల్ థింకింగ్, సోషల్ సైన్స్, సైన్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వెల్–బియింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్ లాంటి వాటి నుంచి ఏడు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. -
‘జాతీయ విద్యా విధానం అమలులో ఏపీ టాప్’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాతీయ విద్యా విధానం అమలులో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమి షన్ చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు. ఈ వి ద్యా విధానాన్ని అమలు చేయాలనుకున్న తొలినుంచి ప్రభుత్వం తోడ్పాటు, సహకారం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య చాలా పటిష్టంగా ఉందని ప్రశంసించారు. జేఎన్టీయూ(కే)లో 2 రోజులపాటు జరిగే ఉన్నత విద్య ప్రణాళిక 5వ సమావేశం శనివారం జేఎన్టీయూ ప్రాంగణంలో ప్రారంభమైంది. దీనికి హాజరైన జగదీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర వర్సిటీలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. జాతీయ విద్యా విధానంతో 2030 నాటికి భారతదేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ విద్యావిధానం అమలు చేయడంలో రా ష్ట్రాలు, స్థానిక సంస్థలు, పాఠశాలల స్థాయి లో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 600 వర్సిటీలలో రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వివిధ రకాల పరిశోధనల కోసం రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వినియోగించేందుకు యూజీసీ కార్యచరణ ప్రణాళిక రూపొందించిందని జగదీష్ కుమార్ చెప్పారు. యువ తకు ఉద్యోగవకాశాలు రావాలంటే నైపుణ్యం ఉండాల్సిందేనన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి బాగుందన్నారు. ఈ యూనివర్సిటీల ఏర్పాటుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ–వర్సిటీలలో దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది విద్యార్థులను చే ర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు -
నాలుగేళ్ల బీఈడీ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత ఒకే సమయంలో డిగ్రీ, బీఈడీ కలిపి పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుంది. సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశాలల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం అర్ధరాత్రి ఎన్టీఏ విడుదల చేసింది. తెలంగాణలో మూడు విద్యా సంస్థలకు నాలుగేళ్ల బీఈడీ కోర్సు నిర్వహించేందుకు అనుమతి లభించింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, వరంగల్ ఎన్ఐటీ, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో 250 సీట్లు ఉంటాయి. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయవచ్చని ఎన్టీఏ పేర్కొంది. ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్సీఈఆర్టీ రూపొందించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్లైన్, డిజిటల్ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధించాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమిస్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రవేశ పరీక్ష ఇలా.. ఇంటర్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పన్నెండో తరగతి, ఇంటర్ సిలబస్‌లోంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 160 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్సీఈఆర్టీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. తెలంగాణలో మూడు కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీకి అనుమతించారు. వీటిలో మొత్తం 250 సీట్లు ఉన్నట్టు ఎన్టీఏ తెలిపింది. -
కేంద్ర విద్యాశాఖ నిర్ణయం.. ఇక నాలుగేళ్ల కోర్సుగా బీఈడీ!
సాక్షి, హైదరాబాద్: మారుతున్న బోధన విధానాలకు అనుగుణంగా అధ్యాపకుల శైలిలోనూ మార్పులు తేవాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల స్వరూప స్వభావాన్ని మార్చాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న రెండేళ్ళ కాలపరిమితి స్థానంలో కోర్సును నాలుగేళ్ళకు పెంచబోతున్నారు. ఇప్పటికే బీఈడీ కోర్సుల మార్పులకు సంబంధించిన ముసాయిదా ప్రతిని రూపొందించారు. గత నెల 27న ఢిల్లీలో దీనిపై ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రాలకు చెందిన ఉన్నత విద్యా మండళ్ళు, కేంద్ర విద్యాశాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి బీఈడీలో కొత్త కోర్సుల రూపకల్పన బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. జాతీయ విద్యావిధానం–2020లో తీసుకొచ్చిన మార్పులను అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిలోనూ గుణాత్మక మార్పులతో ముసాయిదా రూపొందించారు. నవీన బోధన విధానం..: కాలానుగుణంగా వస్తున్న మార్పులతో నవీన బోధన విధానంతో కొత్త సబ్జెక్టులను బీఈడీలో చేర్చబోతున్నారు. విద్యార్థి సైకాలజీని అర్థం చేసుకుని, సునిశిత విశ్లేషణతో బోధించే మెళకువలు ఇందులో పొందుపర్చాలని నిర్ణయించారు. బోధన ప్రణాళికలో వర్చువల్, డిజిటల్ పద్ధతులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. వాస్తవ ప్రపంచంలోకి వెళ్ళి విద్యార్థి సముపార్జించే జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా గుర్తించాలనే అంశాలను బీఈడీలో చేర్చబోతున్నారు. ఆన్లైన్, డిజిటల్ ప్లాట్ ఫామ్‌కు అనుగుణంగా పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టును విద్యారి్థకి అర్థమయ్యేలా టెక్నాలజీతో అందించే విధానాన్ని బీఈడీలో పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. -
డిగ్రీలో సమూల మార్పులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా డిగ్రీలో సరికొత్త మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. విద్యార్థులు కోరుకున్న సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పించేలా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘బకెట్’విధానాన్ని తీసుకొస్తున్నామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో గురువారం మండలి కార్యాలయంలో కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్‌సహా ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాందీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో సమావేశం నిర్వహించింది. సమావేశ వివరాలను లింబాద్రి మీడియాకు వివరించారు. నచ్చిన కోర్సు... ♦ ఇప్పటి వరకూ డిగ్రీ కోర్సులు మూస విధానంలో ఉండేవి. బీఏ హెచ్‌పీపీ తీసుకుంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లు మాత్రమే చదవాలి. అయితే కొత్త విధానంలో ఏ, బీ, సీ, డీ బకెట్లుగా సబ్జెక్టులను విడగొడతారు. వీటిల్లో వేటినైనా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు... ఎ గ్రూపులో అరబిక్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ, లిటరేచర్ ఇలా కొన్ని సబ్జెక్టులుంటాయి. బి గ్రూప్‌లో ఎకనామిక్స్, హిందీ, ఇంగ్లిష్, తెలుగు, సాహిత్యం, ట్రావెల్ టూరిజం వంటి కొన్ని కోర్సులుంటాయి. ఇలా సి, డీ గ్రూపుల్లోనూ కొన్ని కోర్సులుంటాయి. విద్యార్థులు ఏవేని మూడు బకెట్స్ నుంచి ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ♦ డిగ్రీలో క్రెడిట్ సిస్టమ్ అమలు చేయడం వల్ల ప్రతీ దాన్ని క్రెడిట్ విధానంలో కొలుస్తారు. బకెట్ విధానం వల్ల బీఏ విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సు, సాహిత్యం, మరే ఇతర కోర్సు అయినా చేయవచ్చు. ♦ ఈ విధానం క్షేత్రస్థాయిలో అన్ని కాలేజీల్లో ఎలా అమలు చేయాలనే దానిపై మండలి ఓ కమిటీని నియమించి, దాని సూచనల మేరకు మార్పులు చేస్తుంది. విభిన్న సబ్జెక్టులతో డిగ్రీ చేసిన విద్యార్థికి మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యం వచ్చే వీలుంది. మరికొన్ని మార్పులు ♦ విద్యార్థి కాలేజీలోనే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా దేశ, విదేశాల్లో ఎక్కడైనా ఒక కోర్సు చేసే వీలుంది. దానికి సంబంధిత సంస్థలే పరీక్షలు నిర్వహిస్తాయి. క్రెడిట్స్‌ను ఆయా సంస్థలకు బదలాయిస్తాయి. ♦ డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు మరికొన్ని కంప్యూటర్ అనుబంధ కోర్సులను సబ్జెక్టులుగా తీసుకురానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోర్సుల బోధనకు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కాలేజీ మొదలయ్యే నాటికే పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జూలై నుంచే డిగ్రీ క్లాసులు మొదలవ్వాలని తీర్మానించారు. ♦ కోవిడ్ మూలంగా చాలామంది విద్యార్థుల్లో అభ్యసన నష్టాలు కన్పిస్తున్నాయి. వీటిని పూడ్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి పక్కా ప్రణాళికను త్వరలో ఖరారు చేయబోతున్నారు. -
భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఎన్ఈపీ: మోదీ
న్యూఢిల్లీ: యువత సామర్థ్యం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్య, నైపుణ్యాలకు నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) కొత్త రూపమిచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఏళ్లుగా విద్యావిధానంలో సరళత లోపించడంతో ఈ రంగంలో స్తబ్దత ఆవరించిందని చెప్పారు. ఎన్ఈపీలో విద్య, నైపుణ్యాలకు సమాన ప్రాముఖ్యత లభించిందన్నారు. దీనివల్ల విద్యార్థులకు ప్రతిబంధకాలుగా మారిన గత నిబంధనలను తొలగించి విద్యారంగంలో మరిన్ని సంస్కరణలను చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుందని ప్రధాని చెప్పారు. విద్య, నైపుణ్యాలతో యువశక్తిని సంసిద్ధులను చేయడం అంశంపై శనివారం జరిగిన బడ్జెట్ అనంతర వెబినార్‌నుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మన ఉపాధ్యాయుల పాత్ర ఇకపై కేవలం తరగతి గదులకే పరిమితం కారాదు. దేశవ్యాప్తంగా ఉన్న మన విద్యా సంస్థలకు మరిన్ని రకాల బోధనోపకరణాలు అందుబాటులోకి రానున్నాయి. వీటివల్ల గ్రామాలు, నగరాల్లోని పాఠశాలల మధ్య అంతరాన్ని తగ్గించే అనేక అవకాశాలు ఉపాధ్యాయులకు చేరువలో రానున్నాయి’అని ప్రధాని మోదీ చెప్పారు. -
ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్: కేంద్రం
ఢిల్లీ: విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్ తీసుకురానుంది. విద్యార్థుల వయసు ఆరు ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్ ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు.. ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. -
ఎన్ఈపీలో శుభ్రతను చేరుస్తాం
ఉస్మానియా యూనివర్సిటీ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ–2020)లో శుభ్రత, మౌలిక వసతుల కల్పన అంశాలను కూడా చేరుస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రపరిచే యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ఈపీ కోసం కోట్లాది రూపాయాలను వెచ్చిస్తున్నామని ఇందులో మరుగుదొడ్ల పరిశుభ్రతకు నిధుల కేటాయింపుపై శ్రద్ధచూపుతామని తెలిపారు. తగిన యంత్రాంగం లేక దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మరుగుదొడ్లు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని, వాటిని శుభ్రపర్చడం సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలో మరుగుదొడ్ల శుభ్రత, మంచినీరు, కరెంట్ బిల్లుల చెల్లింపు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిందన్నారు. పాఠశాలల్లో టీచర్ల నియామకంతో పాటు మరుగుదొడ్లను శుభ్రపరిచే (శానిటేషన్) సిబ్బందిని కూడా నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ముందుకు రావాలన్నారు. అనంతరం ఎన్టీపీసీ అందచేసిన 94 యంత్రాలను వివిధ పాఠశాలల ప్రధాన అధ్యాపకులకు అందచేశారు. త్వరలో మరో 150 యంత్రాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మరుగుదొడ్డిని కిషన్‌రెడ్డి మిషన్‌తో శుభ్రపరిచారు. -
మాతృభాషలో శాస్త్ర, సాంకేతిక పదాల అర్థాలు
న్యూఢిల్లీ: ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక పదాలకు ఇకపై మాతృభాషలో సులభంగా అర్థాలు తెలుసుకోవచ్చు. జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ (సీఎస్టీటీ) దాదాపు 30 లక్షల పదాలు, వారి అర్థాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ఒక వెబ్సైట్, యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల శాస్త్ర, సాంకేతిక విద్యను మాతృభాషలు, ప్రాంతీయ భాషల్లో బోధించడం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, అనువాదకులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. శాస్త్రీయ, సాంకేతిక పదాలు, వాటి అర్థ వివరణలను గూగుల్‌లో మాతృభాషలో తెలుసుకోవచ్చు. shabd.education.gov.nic అనే వెబ్సైట్లో ఈ వివరాలు త్వరలో కనిపించనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వెబ్సైట్, యాప్ ప్రారంభం కానుంది. మెడిసిన్, లింగ్విస్టిక్స్, పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ తదితర విభాగాల పదాలు, అర్థాలు ఇందులో ఉంటాయి. విద్యను సాధ్యమైనంత మేరకు మాతృ భాషలు, స్థానిక భాషల్లో బోధించాలని జాతీయ విద్యా విధానం నిర్దేశిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ.. అన్ని స్థాయిల్లో భారతీయ భాషలను ప్రోత్సహించాలని పేర్కొంటోంది. ప్రస్తుతం 22 అధికారిక భాషల్లో పదాల అర్థాలను వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భాషల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఎస్టీటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ గిరినాథ్ ఝా చెప్పారు. పుస్తకాల ప్రచురణ కోసం సీఎస్టీటీని కేంద్రం 1961లో ఏర్పాటు చేసింది. -
Tholimettu Program: ‘తొలిమెట్టు’తో కొత్త ఒరవడి
‘నేషనల్ అచీవ్మెంట్ సర్వే’ (నాస్) 2017 నవం బర్–2021 ఫలితాలు విద్యార్థులలో కనీస సామర్థ్యాలు కొరవడినట్టు తేల్చింది. భాషలో విద్యార్థులు సుమారు 70 శాతం మంది కనీస స్థాయి లేదా అంత కంటే తక్కువస్థాయి సామ ర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు 2021 నాస్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2020 మార్చి నుండి రెండేళ్ల పాటు కరోనా కారణంగా విద్యారంగం అతలాకుతలం అయింది. దీనివలన తలెత్తిన అభ్యసనా సంక్షోభం విద్యాశాఖ ముందు అనేక సవాళ్లను మిగిల్చింది. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యసన సంక్షోభాన్ని నివారించి, తరగతి వారీగా భాష, గణితాల సామర్థ్యాలను సాధించడానికి ‘జాతీయ విద్యావిధానం–2020’ అమలులో భాగంగా దేశవ్యాప్తంగా ‘ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీని ద్వారా ప్రాథమిక స్థాయిలో 11 ఏళ్ల లోపు ఉన్న 5 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ‘తొలి మెట్టు’ అనేపేరుతో 2022 ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్నారు. ‘సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్రంలోని 52 వేల మంది ఉపాధ్యాయులకు 3 విడతలలో శిక్షణ అందించారు. అందుకే ఈ కార్యక్రమాన్ని 2025 వరకు అమలు అయ్యే విధంగా రూపకల్పన చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 11.24 లక్షల విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి తరగతి గదిలో మూడు ముఖ్యమైన విషయాలు చోటు చేసుకోవాలి. 1. తగిన పాఠ్య బోధన సోపానాలు వినియోగించుకుంటూ పీరియడ్ ప్రణాళికను అమలు చేయాలి. 2. అవసరమైన బోధనాభ్యసన సామగ్రితో అభ్యసన ప్రక్రియ కొనసాగాలి. 3. పాఠ్యపుస్తకాన్ని సమర్థంగా వినియోగించాలి. ‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి తరగతి గదిలో విద్యార్థితో మాట్లాడించడం, కీలక పదాలను గుర్తింపచేయడం, పఠన కృత్యాలు నిర్వహించడం వంటివి నిర్వహించి అభ్యాసం కల్పించాలి. ఇందుకోసం రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణాసంస్థ కృత్యపత్రాలను కూడా తయారు చేసి ఉపాధ్యాయులకు అందచేస్తుంది. వీటి సహకారంతో పాఠశాల విద్య పూర్తయ్యేసరికి విద్యార్థులంతా ఆయా సబ్జెక్టులలో నిర్దేశించిన సామర్థ్యాలలో అభ్య సన ఫలితాలను సాధించాలి. అప్పుడే గుణాత్మక విద్యను సాధించినట్లుగా భావిస్తారు. ‘తొలిమెట్టు’ కార్యక్రమాల అమలు పర్య వేక్షణ కోసం మండల స్థాయిలోనూ, పాఠశాల సముదాయ స్థాయిలోనూ... నోడల్ అధికారులనూ, విషయ నిపుణులనూ నియమించారు. వీరు పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో బోధనను పరిశీలించి ఎక్కడికక్కడ అనుమాన నివృత్తి చేసి, సమీక్షలు నిర్వహిస్తూ ‘తొలిమెట్టు’ విజయవంతం కావడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నచోట కూడా 5 తరగతులకు ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణతో పాటు విద్యాశాఖకు ఎప్పటికప్పుడు పంపించవలసిన నివేదికలను నింపడంతోనే ఒకరికి బాధ్యతలు సరిపోతే మిగిలిన ఒక్కరితో బోధన సాధ్యమేనా? ఏలికలే ఆలోచించాలి. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!) మొత్తం మీద జాతీయ విద్యావిధానం–2020 అమలుకు తొలిమెట్టు కార్యక్రమ ఉత్తమ ఫలితాలు అవసరం. తెలంగాణలో తొలిమెట్టు కార్యక్రమం ద్వారా తరగతి గదిలో మార్పు ఎంతవరకు సాధ్యం అనేది వేచి చూడాల్సిందే. (క్లిక్ చేయండి: ప్రాథమిక స్థాయిలో శిక్షణేదీ?) - డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు సామాజిక విశ్లేషకులు -
విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యం పెరగాలి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యం పెరగాలి అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి అన్నారు. ఆ దిశగా జాతీయ విద్యా విధానం ద్వారా కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. శనివారం విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–ఒక అంచనా’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో మొత్తం 27 అంశాల్లో మార్పులు చేశారని చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడంలో ఏపీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. ప్రాక్టికల్స్‌తో కూడిన విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించేందుకు.. ఇంటర్న్‌షిప్స్‌ని తప్పనిసరి చేసినట్లు చెప్పారు. విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించేందుకు.. రాష్ట్రంలో పలుచోట్ల రీసెర్చ్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నైపుణ్యంతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడమే కొత్త విద్యా పాలసీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సదస్సులో కృష్ణా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకయ్య, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగ ప్రొఫెసర్ అరబింద్ కుమార్, జానియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కల్పన, డైరెక్టర్ విజయలక్ష్మి, సిద్ధార్థ అకాడమీ జాయింట్ సెక్రటరీ ఎన్.లలిత్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘సర్దుబాటు’తో అపరిమిత ప్రయోజనాలు
మార్పు నిరంతర ప్రక్రియ. పాత వాటి స్థానంలో అంత కన్నా మెరుగైన కొత్త విధానాలు, వ్యవస్థలు రావడం అనివార్యం, అభిలషణీయం కూడా. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా మన రాష్ట్రంలో పాఠశాలల సర్దుబాటుకు చూపుతున్న చొరవను ఇందులో భాగంగానే చూడాలి. అర్థం చేసుకోకుండా ఒక విధానాన్ని వ్యతిరేకించడం సరైన చర్య కాదని విద్యార్థుల తల్లిదండ్రులు, విమర్శకులూ గ్రహించాలి. కొంతమంది ‘మా పాఠశాలను తరలించవద్దు’ అంటూ ధర్నాలకు దిగడం మనం చూస్తున్నాం. ప్రభుత్వం పాఠశాలలను తరలిస్తున్నామని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. మరి ఈ ఆందోళనకారులను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? మన రాష్ట్రంలో చాలా గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలల్లో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. వారు ఒకటి నుండి 5వ తరగతి వరకు రోజుకు 9 నుండి 18 సబ్జెక్టులను బోధించాల్సి ఉంటుందనే విషయం తల్లిదండ్రులకు చాలామందికి తెలియదు. బోధనేతర పనులైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు, టాయిలెట్ మెయింటెనెన్స్, పాఠశాల ఆవరణ శుభ్రత వంటి పనులను కూడా వీరు రోజూ పర్యవేక్షించాలి. ఈ పరిస్థితుల్లో పిల్లలకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం సాధ్యంకాదు. ఒక సబ్జెక్టును దానిలో నిష్ణాతుడైన ఒక టీచర్ బోధించినప్పుడే పిల్లలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్న నూతన విధానం. ఇది తెలియక పాఠశాలల ముందు ధర్నా చేస్తున్నారు. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి మన రాష్ట్రంలో విద్యా విధానంలో మరిన్ని మార్పులు వస్తాయి. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్, హై స్కూల్, హై స్కూల్ ప్లస్‌లు విద్యా విధానంలో ప్రవేశిస్తాయి. ఈ విధానంలో ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లు... హైస్కూల్ ప్లస్‌లుగా మారిపోతాయి. ఈ ప్లస్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. అంటే మూడవ తరగతి నుంచీ ఇంటర్మీడియట్ వరకూ మన ప్రభుత్వ పాఠశాలలు ఒకే చోట విద్యను బోధిస్తాయన్నమాట. ఎన్ఈపీలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో చదువుకునే 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను మూడు కిలోమీటర్ల లోపు ఉన్న అప్పర్ ప్రైమరీ లేదా హైస్కూల్లో చేర్చుతారు. దీనర్థం ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేస్తారని కాదు. ప్రైవేటు పాఠశాలల్లో ఉండే ఎల్కేజీ, యూకేజీల్లాగానే గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లలో ప్రీ పైమరీ–1(పీపీ–1), ప్రీ పైమరీ–2 (పీపీ–2) క్లాసులు ఏర్పాటు చేస్తారు. అలాగే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ తరగతులు కూడా ఉంటాయి. ఈ పాఠశాలల్లో రెండవ తరగతి వరకూ చదువుకున్న తర్వాత పిల్లలను మూడు కిలోమీటర్ల లోపు ఉన్న హైస్కూల్లో చేర్చుకుంటారు. ఇందువల్ల పిల్లలకు అపరిమిత ప్రయోజనాలు చేకూరుతాయి. మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూళ్ళలో సర్దుబాటు చేయడం ద్వారా పిల్లలకు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ ఉంటారు. కాబట్టి, అక్కడ హైస్టాండర్డ్తో సబ్జెక్టు బోధించడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదివించడానికి ఏడెనిమిది మైళ్ల దూరంలో ఉన్న స్కూళ్లకు పంపించడంలో లేని ఇబ్బందులను మూడు కిలోమీటర్ల లోపలే... అన్ని హంగులతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి బాధపడటం సరికాదేమో తల్లిదండ్రులు ఆలోచించాలి. పాఠశాలల సర్దుబాటు విషయంలో టీచర్లు కూడా అపోహాలను తొలగించుకోవాలి. వారి ఉద్యోగాలకు వచ్చే ముప్పు ఏమీ ఉండదు. కాంప్లెక్స్ లెవల్లో ఉపాధ్యాయులకు సర్దుబాటు, ఎన్ఈపీపై ప్రత్యక్ష తరగతులు అవసరం. - వి. వి. రమణ సామాజిక విశ్లేషకులు -
National Education Policy–2020: సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. విద్యార్థులు ఆర్జించిన నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా వారి ప్రతిభను పూర్తిస్థాయిలో మదింపు(అసెస్మెంట్) చేసేలా కొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. జాతీయ విద్యా విధానం–2020ను ప్రాతిపదికగా తీసుకొని ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. విద్యార్థుల ప్రతిభను మదింపు చేసే సంస్కరణలను కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అందుకే అన్ని స్కూళ్లలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి చెప్పారు. కొత్త మార్పులు ఏమిటంటే.. విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి వీలుగా ప్రాక్టికల్ పరీక్షలు లేని సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాల ఆధారంగా 20 శాతం మార్కులు కేటాయిస్తారు. అంటే అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నల సంఖ్యను మరో 33 శాతం పెంచుతారు. వాటిలో తగిన ప్రశ్నలను ఎంచుకొని, సమాధానాలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. సమర్థత, నైపుణ్యాలను నిశితంగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. పుస్తకాల్లో లేని ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించి, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3, 5, 8 తరగతుల పిల్లలకు సామర్థ్య సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి మార్కుల ఆధారంగా ఉండవు. విద్యార్థుల అభ్యసన స్థాయి, గతంలో పోలిస్తే ప్రతిభను ఎంతవరకు మెరుగుపర్చుకున్నారో వీటిద్వారా తెలుస్తుంది. విద్యార్థుల టాలెంట్‌ను అన్ని కోణాల్లో అంచనా వేసేలా ప్రత్యేక ప్రోగ్రెస్ కార్డ్‌ను సీబీఎస్ఈ జారీ చేస్తుంది. -
సేవకుల తయారీ విధానమది
వారణాసి: బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా గురువారం వారణాసిలో ఆయన పర్యటించారు. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుపై ఏర్పాటైన మూడు రోజుల ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’ సమ్మేళనాన్ని ప్రారంభించారు. బ్రిటిషర్ల విద్యావిధానంలో స్వాతంత్య్రానంతరం కొన్ని మార్పులు జరిగినా చాలా వరకు పాతవే కొనసాగుతున్నాయన్నారు. కేవలం డిగ్రీ హోల్డర్లను తయారు చేయడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడమే విద్యావిధానం లక్ష్యం కావాలన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన వాతావరణాన్ని క్యాంపస్‌లలో కల్పించాలి. విద్యావిధానం ద్వారా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా యువతను సంసిద్ధులను చేయడమనే గురుతర బాధ్యత మనపై ఉందన్నారు. ‘వినూత్నమైన, నవీనమైన కొత్త ఆలోచనలను ఈ వేదికపై చర్చించాలి. వర్సిటీకి 50–100కిలోమీటర్ల పరిధిలోని సమస్యలను, వనరులను గుర్తించి, వాటికి పరిష్కారాలను కనుగొనాలి. ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని అధ్యయనం చేయాలి’ అని విద్యార్థులకు ప్రధాని సూచించారు. విద్యార్థులు క్షేత్ర పర్యటనల ద్వారా ఆధార సహిత పరిజ్ఞానం పెంచుకోవాలని ప్రధాని నొక్కి చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా పర్యటించిన ప్రధాని..అక్షయపాత్ర మధ్యాహ్న భోజన వంటశాలను ప్రారంభించారు. ఎల్టీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌లో లక్ష మంది విద్యార్థులకు భోజనం తయారు చేసేందుకు వీలుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని రూ.1,774 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సంపూర్ణానంద స్టేడియంలో ఏర్పాటైన సభలో ప్రధాని ప్రసంగిస్తూ..అభివృద్ధి అంటే పైపై మెరుగులు కాదు..పేదలు, అణగారిన, గిరిజన వర్గాల సాధికారతేనని అన్నారు. ‘ఎంపీగా సేవచేసేందుకు కాశీ నాకు ఒక అవకాశమిచ్చింది. స్వల్పకాలిక పనులతో కొందరు లాభపడి ఉండొచ్చు. కానీ, అలాంటి వాటితో దేశం అభివృద్ధి చెందదని కాశీ ప్రజలు కోరుకున్నారు. వారి ముందుచూపువల్లే ప్రస్తుతం వారణాసిలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ మొత్తం ప్రాంతం దీనివల్ల ప్రయోజనం పొందుతోంది. దివ్య, నవ్య, భవ్య కాశీ అనే రీతిలో ఎనిమిదేళ్లుగా అభివృద్ధి చెందుతోంది’ అని ప్రధాని చెప్పారు. మీ ప్రతిభ అమోఘం జాతీయ విద్యావిధానం సమ్మేళనానికి హాజరైన ప్రధాని మోదీ స్కూలు విద్యార్థుల ప్రతిభాపాటవాలను చూసి ముగ్ధులయ్యారు. ఆయన చుట్టూ చేరిన స్కూలు పిల్లలు ఒకరు శివతాండవ స్తోత్రమ్ ఆలపించగా మరొకరు డ్రమ్ వాయించారు. ఒకరు యోగాసనాలు వేసి చూపించగా మరొకరు స్వచ్ఛతా కార్యక్రమం ప్రాముఖ్యంపై పాట పాడారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రతిభ ఉంది. మీ అందరూ చాలా ప్రతిభావంతులైన చిన్నారులు’అంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి రోజూ పరిశుభ్రత పాటిస్తున్నారా? వ్యాయామం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించగా వారంతా అవునని సమాధానమిచ్చారు. -
రాష్ట్రాలను సంప్రదించకుంటే చిక్కులే..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చే జాతీయ విద్యా విధానంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాకే నిర్ణయం తీసుకోవాలని.. లేకుంటే సమస్యలు తప్పవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలనైనా చేయవచ్చు. కానీ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలతో కలిసి విధానాలను రూపొందిస్తే ఎలాంటి అడ్డం కులుండవు. అలా కాకుండా కేంద్రమే నిర్ణయం తీసుకుని ప్రజలపై రుద్దాలని అనుకోవద్దు’ అని సూచించారు. ఢిల్లీలో విద్యా వ్యవస్థ తీరు చాలా బాగుందని.. అలాంటి విధానం దేశవ్యాప్తంగా అవసరమని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. శనివారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి మోతీభాగ్‌లోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. పాఠశాల ప్రాంగణంలో కేసీఆర్ బృందానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఢిల్లీ విద్యాభివృద్ధి ప్రణాళికపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను సీఎం కేసీఆర్ తిలకించారు. తరగతి గదులు, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కాసేపు ముచ్చటించారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, స్కూల్ కరిక్యులమ్, ఇతర అంశాలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు. తర్వాత మహమ్మదీయ నగర్‌లోని మొహల్లా క్లినిక్‌ను కేసీఆర్ సందర్శించారు. అక్కడ రోగులకు అందే వైద్య సేవలను తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ బాగుంది ఢిల్లీలో విద్యా వ్యవస్థ తీరు చాలా బాగుందని సీఎం కేసీఆర్ కొనియాడారు. ‘‘మార్కులు, ఇతర ఆందోళనల నుంచి విద్యార్థులను దూరం చేసేలా ప్రాక్టికల్ విధానాలతో విద్యను నేర్పుతున్నారు. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం బాగుంది. ఇక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. ఎలన్ మస్క్ అవ్వాలని ఉందని కొందరు విద్యార్థులు చెప్పారు. వారి ఆలోచనా విధానం భేష్. ఇలాంటి కార్యచరణను ప్రభుత్వం చేపట్టడం మనదేశంలో ఎక్కడా జరగట్లేదు. ఈ విధానాలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను అందిస్తాయి మన దేశానికి ఢిల్లీ తరహా విద్యా విధానం చాలా అవసరం. తెలంగాణలోనూ ఈ విధానం అమలు చేస్తాం. రాష్ట్రం నుంచి త్వరలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, అధికారుల బృందాన్ని పంపించి అధ్యయనం చేస్తాం’’అని కేసీఆర్ ప్రకటించారు. ఇక్కడి మొహల్లా క్లినిక్‌ల ద్వారా సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందుతోందన్నారు. ఐదారేళ్ల క్రితం మొహల్లా క్లినిక్‌ల గురించి తెలుసుకుని తెలంగాణ అధికారులను పంపి అధ్యయనం చేయించామని.. ఇదే తరహాలో హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం 350 బస్తీ దవాఖానాలు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. నేడు చండీగఢ్‌కు కేసీఆర్.. సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్‌కు వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర సాగుచట్టాల రద్దు ఉద్యమంలో మరణించిన 600 రైతు కుటుంబాలను పరామర్శించి.. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేయనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ కూడా హాజరవుతుండటంతో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటేనే అభివృద్ధి సీఎం కేసీఆర్ పాఠశాలల సందర్శనకు రావడం మాకు గౌరవం. అన్ని విషయాలు తెలుసుకొనేందుకు అనేక ప్రశ్నలు అడుగుతూ ఇంత సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటూ ఈ విధంగా సమన్వయంతో ముందుకు వెళ్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మేం తెలుసుకుంటాం. – ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ -
హైబ్రిడ్ విద్యా విధానమే ఉత్తమం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులు టెక్నాలజీకి విపరీతంగా అలవాటు పడకుండా హైబ్రిడ్ విద్యా విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు రకాల పద్ధతుల ద్వారా బోధన జరగాలన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలుపై ప్రధాని శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ విధానం ఎక్కువ కావడంతో పిల్లలు టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడుతున్నారని ప్రధాని హెచ్చరించారు. సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి , అమలు చేస్తున్నట్టు మోదీ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో డేటాబేస్‌లన్నింటినీ, పాఠశాలల్లోని రికార్డులతో అనుసంధించాలని చెప్పారు. ఈ పరిజ్ఞాన సహకారంతో పాఠశాలల్లోనే పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించివచ్చునని ప్రధాని చెప్పినట్టుగా అధికారిక ప్రకటన వెల్లడించింది. డ్రాపవుట్ విద్యార్థుల్ని గుర్తించి బడి బాట పట్టించడానికి ఈ విధానం దృష్టి సారిస్తోందని ప్రధాని వివరించారు. -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం..తెరపైకి కొత్త జాతీయ విద్యావిధానం!
కొల్లాపూర్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడుల నేపథ్యంలో అక్కడ వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోవడం మన జాతీయ విద్యావిధానంపై కొత్త చర్చకు తెరలేపిందని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్, నానో అప్లికేషన్స్ టెక్నాలజీ అడ్వయిజరీ గ్రూప్ (నాటాగ్) చైర్మన్ వలిపె రాంగోపాల్‌రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే జాతీయ విద్యా విధానంలో ఇందుకు సంబంధించి భారీ మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ విద్యా విధానాన్ని సరళతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి’కి పలు అంశాలను వెల్లడించారు. మార్పునకు శ్రీకారం చుట్టాలి... ‘దేశంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మెడిసిన్ చదివేందుకు మాత్రం ఎక్కువ శాతం మంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. అక్కడ ఫీజులు తక్కువ ఉండటమే కారణం. ఉక్రెయిన్‌కు చదువు కోసం వెళ్లిన వారిలో అధిక శాతం వైద్య విద్యార్థులే ఉన్నారు. మన దేశంలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటే కఠిన నిబంధనలు ఉన్నాయి. వాటిని సవరిస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది. జాతీయ విద్యావిధానాన్ని సరళతరం చేయాల్సిన అవసరం ఉంది. ఇండియాలో మాత్రమే ఒక్కో విభాగానికి ఒక్కో యూనివర్సిటీ ఉంది. ఫారెన్ కంట్రీస్ తరహాలో యూనివర్సిటీల్లో అన్ని విభాగాలను ఒకేచోట అందుబాటులో ఉంచాలి. ఈ మార్పు ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి మేము ప్రారంభించాం. ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఐఐటీ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ డిగ్రీ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నాం. ఢిల్లీ ఐఐటీలో మెడిసిన్ పీహెచ్డీ కోర్సును ప్రారంభించబోతున్నాం. మున్ముందు దేశంలో ప్రత్యేక యూనివర్సిటీలు ఉండే అవకాశాలు లేవు’అని రాంగోపాల్‌రావు తెలిపారు. దేశంలో ఇంటర్, డిగ్రీతోనే చాలా మంది చదువులు ఆపేస్తున్నారని రాంగోపాల్‌రావు పేర్కొన్నారు. ఉన్నత విద్యకు వెళ్లే వారి సంఖ్య 1:4గా ఉందని, దీనిని 1:2గా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. ‘నానో’కు కేంద్రం ప్రోత్సాహం... నానో స్టార్టప్‌లకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందని రాంగోపాల్‌రావు తెలిపారు. 2003–04లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నేతృత్వంలో నానో మిషన్ ప్రారంభమైందని, మున్ముందు అన్ని రంగాల్లోనూ నానో ప్రభావం ఉంటుందన్నారు. నూతనంగా చేపట్టబోయే స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించిందని వివరించారు. ప్రజలకు మేలు చేసే, ఉపాధి అవకాశాలు పెంపొందించే స్టార్టప్‌లకు ఐఐటీ ఖరగ్‌పూర్ తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. నానో స్నిఫర్.. మైక్రో న్యూట్రిన్స్.. ‘నేను నానో స్నిఫర్ అనే టెక్నాలజీని రూపొందించా. భూమిలో అమర్చే మందుపాతరలను ఇది గుర్తిస్తుంది. దీనిని దేశ రక్షణ వ్యవస్థలో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం నానో స్నిఫర్‌ను బ్రిటన్ రక్షణ వ్యవస్థలో వాడుతోంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రాణనష్టం ఉండదు. వ్యవసాయ రంగంలో ఎరువులు, నీటి వినియోగాన్ని ఆదా చేసేందుకు మైక్రో న్యూట్రిన్స్ టెక్నాలజీని రూపొందిస్తున్నా. ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల మొక్కలకు ఎంతమేరకు నీళ్లు, ఎరువులు అందించాలనేది తెలుస్తుంది. దీనిని తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఢీల్లీ ఐఏఆర్‌టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నాం. పదో తరగతి చదివిన వారు సైతం ఈ టెక్నాలజీ సాయంతో పొలాల్లోనే భూసార పరీక్షలు చేయవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నానో వస్తువులు సాధారణ వస్తువులకంటే 5 రెట్లు తక్కువ ధరకు లభిస్తాయి’అని రాంగోపాల్‌రావు తెలిపారు. ఐఐటీ చదివిన వారికి ఇక్కడే ఉపాధి గత పదేళ్లలో ఐఐటీ చదివిన వారిలో 95 శాతం మంది దేశంలోనే ఉద్యోగాలు చేస్తున్నారని లేదా పరిశ్రమలు స్థాపిస్తున్నారని రాంగోపాల్‌రావు చెప్పారు. కేవలం 5శాతం మందే విదేశాలకు వెళుతున్నారని, ఇది మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాలు మినహా 23 రాష్ట్రాల్లో ఐఐటీ యూనివర్సిటీలు ఉన్నాయని తెలిపారు. హరియాణాలో మాత్రం ఢిల్లీ ఐఐటీకి అనుబంధంగా ఎక్స్టెన్షన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
స్కూళ్ల మ్యాపింగ్‌తో మెరుగైన విద్యా బోధన
సాక్షి, అమరావతి: జాతీయ విద్యావిధానంలో భాగంగా చేపట్టిన స్కూళ్ల మ్యాపింగ్‌తో అనర్థాలు జరుగుతాయన్నది అపోహ మాత్రమేనని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విపక్షాల దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపైనా ఉందన్నారు. మ్యాపింగ్ విధానంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సచివాలయంలోని 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభమైన తొలిరోజు సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఏ ఒక్క స్కూలూ మూతపడదు.. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న విద్యా పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తూ అమలుకు సన్నాహాలు చేస్తున్నాయని మంత్రి సురేష్ తెలిపారు. నాడు – నేడు తరహాలో తెలంగాణలో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. స్కూళ్ల మ్యాపింగ్‌తో విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే ఈ విషయాన్ని స్పష్టం చేశారని, ఏ ఒక్క పాఠశాల మూత పడదని, ఉపాధ్యాయ పోస్టులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. నిపుణులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యా బోధన విద్యార్థులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న విద్యా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజా ప్రతినిధుల సూచన మేరకు జిల్లాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు మంత్రి సురేష్ సుముఖత వ్యక్తం చేశారు. ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరారు. నూతన విద్యా విధానం, పాఠశాలల మ్యాపింగ్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజర్ మురళి, అడిషనల్ డైరెక్టర్లు పార్వతి, సుబ్బారెడ్డి, ప్రసన్నకుమార్, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జేడీ రామలింగం, మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఆర్జేడీలు, డీఈవోలు పాల్గొన్నారు. -
నూతన విద్యా విధానంతో నవశకానికి నాంది
అనంతపురం విద్య: నూతన జాతీయ విద్యా విధానం నవ శకానికి నాంది పలికిందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అనంతపురంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్చువల్ విధానంలో ఉప రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పెంపొందేలా యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు పెంపొందా లన్నారు. వర్సిటీల్లో హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పూర్తిస్థాయి క్యాంపస్ అందుబాటులో వస్తే ప్రపంచ స్థాయి ర్యాంకింగ్ జాబితాలో సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఏపీ చోటుదక్కించుకుంటుందన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్ సహా మరో ఐదు పీజీ ప్రోగ్రాంలు ప్రవేశపెట్టడం, పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలతో పాటు సహ పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో విద్యా విప్లవం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విద్యా విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో 7 వర్సిటీలను అంతర్జాతీయ ప్రమాణాలు గల వర్సిటీలుగా మార్పు చెందేలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. కేంద్ర విద్యా మంత్రి (స్వతంత్ర) డాక్టర్ సుభాష్ సర్కార్ మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ పురోగతికి కట్టుబడి ఉన్నామన్నారు. శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి నిధులు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకమండలిని కూడా నియమించలేదని, శాశ్వత బోధన సిబ్బంది లేరని పేర్కొన్నారు. యూనివర్సిటీ వీసీ ఎస్ఏ కోరి, జేఎన్టీయూ (ఏ) వీసీ జింకా రంగజనార్దన, సెంట్రల్ యూనివర్సిటీ డీన్ జి.ఆంజనేయస్వామి, ఎస్వీ యూనివర్సిటీ మాజీ వీసీ వీవీఎన్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త తరానికి సరికొత్త చదువులు
మెడిసిన్ విద్యార్థి దేశ చరిత్రను చదవకూడదా? ఇంజనీరింగ్ విద్యార్థికి తెలుగు సాహిత్యం అక్కర్లేనిదా? ఆటపాటలు, ఇతర నైపుణ్యాలు కూడా చదువులో భాగం కావా? ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న ‘జాతీయ విద్యా విధానం–2020’ ఇలాంటి వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తోంది. పునాది దశ నుంచే బాలలను సర్వతోముఖంగా అభివృద్ధి చేసేలా కొత్త పాఠాలను రచిస్తోంది. అయితే ఈ కొత్త విధానం మీద కొన్ని అనుమానాలూ కలుగుతున్నాయి. పెద్ద ఎత్తున మార్పులు చేసేటప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయా అన్న ఆలోచన తలెత్తుతుంది. ఈ వ్యవస్థల రూపకల్పనకు భారీగా నిధులు అవసరం. పాలకులు అన్ని నిధులను కేటాయించగలరా అన్నది మరో అనుమానం. అయితే, జాతీయ విద్యా విధానంలోని మంచిని ముందుగానే స్వీకరించిన ఏపీ ప్రభుత్వం అంతకంటే మెరుగైన విద్యను అందించే దిశగా అవిరళ కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి ఒక ఏడాది పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు ఇప్పటికే జాతీయ విద్యా విధానం అమలు దిశగా పయనిస్తున్నాయి. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానంలోని ముఖ్యాంశాలను చర్చిద్దాం. వాస్తవానికి స్వాతంత్య్రం తర్వాత చాలాకాలం పాటు మన ప్రభుత్వాలు విద్యా విధానాన్ని సమగ్రంగా పట్టించుకోలేదు. 1960వ దశకంలో ఏర్పడిన కొఠారీ కమిషన్ సిఫార్సులు చాలా వరకు అమలు జరగలేదు. 80వ దశకంలో అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా వ్యవస్థే ఇప్పటిదాకా కొనసాగుతోంది. 30 ఏళ్లకు పైగా కొనసాగిన మూస విధానాల్ని అధిగమించేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే మాజీ కేబినెట్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం నేతృ త్వంలో కమిటీ రూపుదిద్దుకొన్నది. ఆ కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివే దిక ఆధారంగా ఇస్రో మాజీ చైర్మన్, శాస్త్రవేత్త కస్తూరి రంగన్ ఆధ్వ ర్యంలో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటనలు జరిపి, లక్షల సంఖ్యలో సలహాలు, సూచనలు స్వీకరించింది. నిపుణు లైన కమిటీ సభ్యులు ఇవన్నీ అధ్యయనం చేసి ఈ విద్యా విధానం ముసాయిదాకు రూపకల్పన చేశారు. దీని ఆధారంగా రూపొందినదే జాతీయ విద్యా విధానం 2020. ఇందులో అనేక ముఖ్యమైన ప్రతి పాదనలు కనిపిస్తాయి. ఇప్పటిదాకా ఉన్న 10+2+3 విధానాన్ని అప్ గ్రేడ్ చేసి, 5+3+3+4 అనే 4 దశలుగా మారుతాయి. 3 నుంచి 18 ఏళ్ల వయసు దాకా నిరంతరాయత ఉంటుంది. ప్రాథమిక విద్యలో మూడో సంవత్సరం నిండినప్పటినుంచే అభ్యసనం మొదలవుతుంది. వాడుక భాషలో చెప్పుకొనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలతో పాటు 1, 2 తరగతులు ఉంటాయి. అన్ని వర్గాల పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకొనే మాదిరిగా కరిక్యులమ్ రూపొందిస్తారు. దీని కోసం అందుబాటులో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను, సమీప విద్యాలయాలకు అనుసంధానం చేస్తారు. ఈ విధానాన్ని ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ) అని పిలుస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తారు. చిన్నారుల వయసుకి తగినట్లుగా తరగతి వేళలను ఏర్పాటు చేయడం, ఆహ్లాదకర వసతులు కల్పించటం జరుగుతుంది. తయారీ దశలో పిల్లలను చదువు, సబ్జెక్టుల పట్ల అభిరుచి పెంచు కొనేట్లుగా తీర్చిదిద్దుతారు. పిల్లలకు చక్కటి మౌలిక వసతులు అందు బాటులోకి వస్తాయి. పాఠశాల విద్యా ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో చట్రం ఏర్పాటవుతుంది. పిల్లలకు పఠనంలో ఆసక్తి పెంచేందుకు జాతీయ పుస్తక ప్రోత్సాహ విధానాన్ని అమలు చేస్తారు. పాఠశాలలకు పెద్ద ఎత్తున పుస్తకాలు అందజేస్తారు. మాధ్యమిక దశలో విద్యార్థులకు చదువు, సబ్జెక్టులు, అంశాల పట్ల స్పష్టమైన దృక్కోణం ఏర్పడుతుంది. కరిక్యులమ్, కో కరిక్యు లమ్, అదనపు కరిక్యులమ్ అనే గోడలను తప్పించే ప్రయత్నం జరు గుతుంది. చదువుతో పాటు ఆటపాటలు, సంగీతం, యోగా, క్రాఫ్ట్స్ వంటి అంశాలను మేళవించేందుకు పెద్ద పీట వేస్తారు. అన్ని అంశా లను కరిక్యులమ్‌లోనే చేర్చటం ద్వారా ఆయా అంశాలలో చురుకైన పిల్లలకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. చక్కటి క్రీడాకారులు, కళా కారులుగా పిల్లలను తీర్చిదిద్దేందుకు ప్రాతిపదిక ఏర్పడుతుంది. సెకండరీ దశలో టీనేజ్ పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా కరిక్యులమ్‌కు మెరుగులు దిద్దుతారు. సబ్జెక్టులతో పాటు భాష, వ్యక్తిత్వ నిర్మాణం వంటి వాటి మీద దృష్టి పెడతారు. వృత్తి విద్యా నైపుణ్యాలను పరిచయం చేస్తారు. ఇది రెండు విధాలుగా ఉపయోగ పడుతుంది. పేదలకు వృత్తి విద్య ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగ వుతాయి. ధనికుల పిల్లలకు వివిధ వృత్తుల పట్ల గౌరవం ఏర్పడు తుంది. ఇదంతా పాఠశాల విద్యలో వచ్చే మార్పులు. అయితే ఈ క్రమంలో మూడు, నాలుగుసార్లు పిల్లల అభ్యసన స్థాయిని పరీ క్షించటం జరుగుతుంది. ఇందుకోసం జాతీయ మూల్యాంకన కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తారు. దీని ద్వారా 2, 5, 8 తరగతు లలో విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తారు. 10, 12 తరగతులలో బోర్డు పరీక్షలు ఉంటాయి. అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బందికి ఈ నూతన విధానం కోసం తగిన శిక్షణ ఇస్తారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్నీ కొత్త మార్గంలోకి ఉత్తేజ పరుస్తారు. ఇక, ఉన్నత విద్యలో అద్భుతమైన మార్పులు చోటుచేసు కుం టాయి. సైన్స్ విద్యార్థి అవే సబ్జెక్టులు చదవాలి, ఆర్ట్స్ విద్యార్థి ఇలాగే ఉండాలన్న కట్టుబాట్లు ఉండవు. ఇంజనీరింగ్ విద్యార్థి తెలుగు లిటరేచర్ తీసుకోవచ్చు. మెడిసిన్ విద్యార్థికి చరిత్ర అందుబాటులోకి వస్తుంది. విద్యార్థులకు ఏ ఏ సబ్జెక్టులు ఆసక్తి ఉంటే ఆయా కోర్సులను చదువుకోవచ్చు. 21వ శతాబ్దికి అవసరం అయ్యే మాదిరిగా ఉన్నత విద్యను సమూలంగా మార్పులు చేస్తారు. చదువుతో పాటు టెక్నా లజీకి పెద్దపీట వేస్తారు. అధునాతన సబ్జెక్టులను అందరికీ అందు బాటులోకి తెస్తారు. దేశంలోని 900 విశ్వవిద్యాలయాలు, 40 వేల కళాశాలలను సమీకృత విద్యాలయాలుగా మారుస్తారు. టెక్నాలజీ, పరిశోధనలకు పెద్ద పీట వేయటం జరుగుతుంది. ఒక్కో సంవత్సరం కోర్సు పూర్తవుతుండగానే పిల్లలకు తగిన సర్టిఫికెట్‌ను బహూక రిస్తారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తారు. ప్రతీ జిల్లాలో మల్టీ డిసిప్లీనరీ యూనివర్సిటీ లేక కళాశాలలు ఏర్పాటవుతాయి. ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులను ప్రారంభిస్తారు. ప్రతీ టీచర్‌కు ఏటా 50 గంటల శిక్షణ తప్పనిసరి. మొత్తంగా చెప్పాలంటే ప్రస్తుత విద్యా వ్యవస్థలోని అనేక లోపాలకు ఈ జాతీయ విద్యా విధానం పరిష్కారం చూపుతుంది. ఇది అమలు చేయటం ద్వారా టీచర్లను, అంగన్వాడీ కార్యకర్తల్ని తొల గించటం జరగదు. పాఠశాలల్ని మూసేయటం, పిల్లల్ని చదువుకు దూరం చేయటం జరగదు. ధనవంతుల పిల్లలతో సమానంగా నిరు పేదల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించటం జరుగు తుంది. అయితే ఈ కొత్త విధానం మీద కొన్ని అనుమానాలు కలుగు తున్నాయి. పెద్ద ఎత్తున మార్పులు చేసేటప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయా అన్న ఆలోచన తలెత్తుతుంది. ఈ వ్యవస్థల రూప కల్పనకు భారీగా నిధులు అవసరం. అంత మొత్తంలో ప్రభుత్వాలు నిధులను కేటాయించగలవా అన్నది మరో అనుమానం. వివిధ రకాల వృత్తి విద్యలను ఏకం పాకం చేసేస్తే గందరగోళం ఏర్పడుతుందనేది మరో అనుమానం. వీటన్నింటికీ రాబోయే కాలమే జవాబు చెబుతుంది. రమా విశ్వనాథన్ విద్యాభారతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక క్షేత్ర ప్రచార కన్వీనర్ ‘ మొబైల్ : 92901 93417 -
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో సమావేశమైన ఏపీ విద్యాశాఖ మంత్రి
అమరావతి: టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ విద్యావిధానం అమలుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. కాగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు.. అమలవుతున్న పథకాలను ఎమ్మెల్సీలు అభినందించారు. -
ఏపీలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ పురోభివృద్ధి కోసం చేపడుతున్న సంస్కరణలు ప్రశంసనీయమని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కొనియాడారు. సమర్థత గల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. ‘21వ శతాబ్దంలో శక్తిమంతమైన సమాజ నిర్మాణం’ అనే అంశంపై ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ శనివారం దృశ్యమాధ్యమ పద్ధతిలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన ప్రత్యేక విశిష్ట ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించింది. కస్తూరి రంగన్ ముఖ్య ప్రసంగం చేస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తిగా విన్నాను. విద్యాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంస్కరణలు విద్యారంగంలో వినూత్న, ఉన్నత ప్రమాణాలకు బాటలు వేస్తాయి. పాఠశాల స్థాయి, ఉన్నత విద్యాస్థాయిలో ఈ కార్యక్రమాలు అద్భుతంగా అమలు చేయడం ముదావహం. విద్యారంగంపై ఇంత చిత్తశుద్ధితో పనిచేసే సమర్థత గల నాయకుడు ఉండటం గొప్పవిషయం. విద్యాభివృద్ధి పథకాలను రూపొందించడం, వాటిని సమర్థంగా అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగతంగా ఎంతో చిత్తశుద్ధితో కృషి చేయడం ప్రశంసనీయం. నూతన విద్యావిధానంలో సూచించిన మేరకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ అనేక మంచి ఆలోచనలతో కార్యక్రమాలు అమలు చేయడం, అందుకు తగ్గ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇది నాలెడ్జి సొసైటీని మరింతగా ప్రోత్సహిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించగలుగుతుంది. జాతీయ విద్యావిధానం అమలు పరిచే దిశలో ఏపీ అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉంది’ అని ప్రశంసించారు. విద్యారంగానికి రూ.30 వేల కోట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏటా రూ.30 వేల కోట్ల బడ్జెట్‌ను విద్యా రంగానికి కేటాయిస్తున్నామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సారథ్యంలో వినూత్న సంస్కరణలు చేపట్టి విద్యా వ్యవస్థను పటిష్ట పరుస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీఎస్ రావు మాట్లాడుతూ ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రొ వైస్ చాన్సలర్ డి. నారాయణరావు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయలక్ష్మి సక్సేనా, ఎస్ఆర్ఎం రిజిస్ట్రార్ వినాయక్ కల్లూరి, డాక్టర్ రఘునాథన్, ప్రొఫెసర్లు డాక్టర్ రంజిత్ తాషా, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ పంకజ్ పాఠక్, రవ్వా మహేశ్, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, పరిశోధనా రంగ నిపుణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. -
పనితీరే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: దేశ భవిష్యత్తును నిర్మించేది గురువులే. పునాదులు బలంగా ఉంటేనే జాతి పురోగమిస్తుంది. అందుకే నూతన జాతీయ విద్యా విధానంలో కేంద్రం బోధనను మెరుగుపర్చడంపై ప్రత్యేకదృష్టి పెట్టింది. సమూల మార్పులు రావాలని, విద్యాబోధనలో యాంత్రిక, మూస విధానాలు పోవాలని సంకల్పించింది. టీచర్ల పనితీరును నిరంతరం మదింపు చేయాలని, సామర్థ్యం ఆధారంగానే పదోన్నతులు, వేతనాల పెంపు ఉండాలని నిర్ణయించింది. ఇందులో భాగం గా పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు పనితీరు సూచికలు (పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) అమల్లోకి రానున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో ఉపాధ్యాయుల బోధన తీరు ఎలా ఉంది? అర్థమయ్యేలా చెబుతున్నారా? అనే అంశాల ఆధారంగా టీచర్ల పనితీరును అంచనా వేయనున్నారు. అంతేకాదు విద్యార్థులు ఏం నేర్చుకున్నారన్న దాన్ని పరీక్షించేందుకు లెర్నింగ్ ఇండికేటర్స్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 2021– 22 నుంచి వీటిని ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇకపై టీచర్ల పనితీరు ఆధారంగానే పదోన్నతులు, వేతనాల పెంపు విధానం అమలు చేసేలా రాష్ట్రాలు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది. ఇప్పుడున్న నిబంధనలను కూడా అందుకు అనుగుణంగా మార్పు చేయాలని కోరింది. అంతకంటే ముందు టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రతి టీచర్, ప్రిన్సిపాల్‌కు కచ్చితంగా 50 గంటల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం (సీపీడీ) ఉండేలా చూడాలంది. రాష్ట్రాల్లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్) ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇటీవల నూతన జాతీయ విద్యా విధానంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ఆదేశాలను జారీ చేసింది. బదిలీల్లోనూ ప్రాధాన్యం టీచర్లు కనబర్చే ప్రతిభ,, జవాబుదారీతనం ఆధారంగా పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యం కల్పించాలని పేర్కొంది. టీచర్స్ కెరీర్ ప్రోగ్రాంను రాష్ట్రాలు రూపొందించుకోవాలని, ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న నిబంధనలు, మార్గదర్శకాలను మార్పు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నిర్వహణ, నాయకత్వంలో సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. సీనియారిటీ ఆధారంగా కాకుండా సర్టిఫికెట్ కోర్సు చేసిన వారిని ప్రధానోపాధ్యాయుడిగా నియమిస్తేనే బాగుంటుందని యోచిస్తోంది. కొత్తగా టీచర్లుగా నియమితులైన వారు పాఠశాలల్లో విధుల్లో చేరడానికంటే ముందే ఉపాధ్యాయ విద్యాసంస్థల్లో వారికి ఆరు నెలల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వనుంది. మరోవైపు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ► తరగతి గదిలో పాఠ్యాంశాల బోధనకు ముందు టీచర్లు ఏం చేయాలి. ఏం చేస్తున్నారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ► పిల్లల పురోగతి తెలుసుకొని తగిన చర్యలు చేపట్టేందుకు ఆన్లైన్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దానిద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తక్షణ చర్యలు చేపడతారు. ► టీచర్లకు సబ్జెక్టుపై, బోధనలోని స్టెప్స్‌పై (ఏ పాఠ్యాంశం తర్వాత ఏది చెప్పాలనేది) శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ► ప్రతినెలా సబ్జెక్టుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వృత్తిపరమైన నైఫుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తారు. బోధన యాంత్రికం పాఠశాలల్లో విద్యాబోధనలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ విషయం గతంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ... రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నిర్వహించిన సర్వేలోనే తేలింది. బోధన సరిగ్గా జరగడం లేదన్న నిర్ణయానికి వచ్చింది. ఉపాధ్యాయులు యాంత్రికంగా పనిచేస్తున్నారని, పాఠ్యపుస్తకాల్లోని ముందుమాట కూడా సరిగ్గా చదవకుండానే పాత పద్ధతిలో బోధిస్తున్నారని తేల్చింది. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఉపాధ్యాయులు పుస్తకాల్లోని ముందుమాట చదివి బోధన చేపట్టాల్సి ఉంటుంది. కాని వాటిని చదివి అర్థం చేసుకొని పాఠాలు బోధిస్తున్న వారు కేవలం 20 శాతం మంది మాత్రమే ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ అంచనాకు వచ్చింది. మిగిలిన వారు మొక్కుబడిగా బోధన కొనసాగిస్తున్నారని తేల్చింది. -
విద్యాశాఖ బలోపేతానికి ‘స్టార్స్’
న్యూఢిల్లీ: పాఠశాల విద్య బలోపేతానికి తీసుకువస్తున్న జాతీయ విద్యా విధానం కింద ‘స్టార్స్’ ప్రాజెక్టుకి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా స్ట్రెంథెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (స్టార్స్) ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రి మండలి ఈ ప్రాజెక్టుకి ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రూ.5,718 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన స్టార్స్ ప్రాజెక్టుకి ప్రపంచ బ్యాంకు రూ.3,700 కోట్ల ఆర్థిక సాయం అందిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలను పెంచి పాఠశాలలు మంచి ఫలితాలు రాబట్టేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ‘‘చదువు అంటే బట్టీ పట్టి రాయడం కాకుండా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవడం అన్న ప్రాతిపదికపైన ఈ విధానాన్ని తీర్చి దిద్దాం’’ అని జవదేకర్ చెప్పారు. విద్యార్థులపై మార్కుల ఒత్తిడి లేకుండా బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకు రావడం కోసం ఈ స్టార్స్ ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నట్టు ఆయన చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశాల్లో విద్యా రంగంలో నాణ్యత పెంచడానికి తొలుత కృషి చేయనున్నట్టు చెప్పారు. రూ.520 కోట్ల ప్యాకేజీ.. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లకు రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు లబ్ధి చేకూరేలా చేయడమే కేంద్రం లక్ష్యమని జవదేకర్ చెప్పారు.