Nursing
-
నీళ్లలో మత్తు మందు ఇచ్చి.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం
ముంబై: మహిళలపై నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్ర ఆందోళనలు రెకేత్తిస్తున్నాయి. కోల్‌కతా ఘటన తరువాత ఇంకా ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు నమోదు కాగా.. తాజాగా మరో నర్సింగ్ విద్యార్ధిపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది.మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం విధులు పూర్తి చేసుకొని యువతి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రత్నగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ విద్యార్థిని ఆటోలో ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యలో డ్రైవర్‌ను నీళ్లు అడగ్గా.. అతను తాగే నీటిలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. దీంతో యువతి స్పృహ కోల్పోయి పడిపోయింది. అక్కడి నుంచి ఆమెను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.చంపక్ గ్రౌండ్ సమీపంలో తీవ్ర గాయాలతో బాధితురాలు అపస్మారక స్థితిలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. యువతికి అనేక గాయాలైనట్లు వైద్యులు తెలపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.ఈ ఘటన రత్నగిరిలో కలకలం రేపింది. ఈ కేసులో సత్వర చర్యలు తీసుకోవాలని, నేరానికి పాల్పడిన నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి వెలుపల నిరసనలు చేపట్టారు. -
ఐసీయూలో రోగిపై అత్యాచారం
జైపూర్: ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగి ఆలనాపాలనా చూడాల్సిన నర్సింగ్ అసిస్టెంట్ అఘాయిత్యానికి పాల్పడిన అమానవీయ ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. అఘాయిత్యం వేళ ప్రతిఘటించిన ఆమెకు నిందితుడు మత్తుమందు ఇంజెక్షన్ ఇవ్వడం దారుణం. అల్వార్ జిల్లాలోని శివాజీ పార్క్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల వివాహిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో తీవ్ర అస్వస్థతకు గురై జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఐసీయూ గదిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అక్కడే పనిచేసే చిరాగ్ యాదవ్ అనే నర్సింగ్ అసిస్టెంట్ ఆమెను రేప్‌చేయబోయాడు. వెంటనే ప్రతిఘటించిన ఆమెకు ఒక మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి ఘోరానికి పాల్పడ్డాడు. తర్వాత కొంతసమయానికి భర్త ఫోన్ చేయగా ఆమె జరిగిన దారుణాన్ని చెప్పి బోరుమంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వైఎస్సార్ మెడ్‌నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది. మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్‌లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకోవాలి మైలాఫ్ట్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. – డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
24 గంటల్లో 31 కాన్పులు
జనగామ: జనగామ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ప్రసవాల్లో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 31 కాన్పులు చేసి.. వైద్యులు సర్కారు దవాఖానా సత్తా చాటారు. సాధారణ ప్రసవాలు–17, ఆపరేషన్లు 14 కాగా... ఇందులో 12మంది మగపిల్లలు, 19 మంది ఆడపిల్లలు జన్మించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు ఆధ్వర్యంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి, డాక్టర్లు సౌమ్యారెడ్డి, సిరిసూర్య, సిబ్బంది సంగీత, విజయరాణి, సెలెస్టీనా ప్రసూతి కాన్పులు చేశారు. ఎంసీహెచ్ వైద్యుల అంకితభావంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా వీరిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
ఏపీలోనే ఏఎన్ఎంలు ఎక్కువ
రోగులకు వైద్యసేవల కల్పన, వారి సంరక్షణలో కీలకపాత్ర పోషించే నర్సుల అందుబాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రభాగాన ఉంది. క్షేత్రస్థాయిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ముఖ్యపాత్ర పోషించే ఏఎన్ఎంలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా మనదే కావడం గమనార్హం. నర్సులు, ఏఎన్ఎం, జీఎన్ఎంల సంఖ్యలో సంబంధిత విద్యలో ఏపీ ముందంజలో ఉందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 2021–22 వార్షిక నివేదికను ఐఎన్‌సీ విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. నర్సులు, జీఎన్ఎం, ఏఎన్ఎంల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలు ముందున్నాయి. – సాక్షి, అమరావతి ఏపీలో 1.39 లక్షల మంది ఏఎన్ఎంలు.. దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ ఏఎన్ఎంలు 9.82 లక్షల మంది ఉన్నారు. అయితే, ఏపీలోనే అత్యధికంగా 1.39 లక్షల మంది ఉన్నారు. రాజస్థాన్‌లో 1.10 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 75వేల మంది ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కేవలం 10,219 మందితో 19వ స్థానంలో ఉంది. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి సచివాలయానికొక ఏఎన్ఎంను నియమించిన విషయం తెలిసిందే. రిజిస్టర్డ్ నర్సులు దేశవ్యాప్తంగా 24.71 లక్షల మంది ఉన్నారు. తమిళనాడులో అత్యధికంగా 3.32 లక్షల మంది ఉండగా, కేరళలో 3.15 లక్షల మంది, మూడోస్థానంలో ఉన్న ఏపీలో 2.62 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ 53,314 మందితో 14వ స్థానంలో ఉంది. కొత్త కోర్సులు.. సెమిస్టర్ విధానం నర్సింగ్ విద్యలో కౌన్సిల్ అనేక మార్పులు చేసింది. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పుల నేపథ్యంలో సిలబస్‌లో సవరణలు చేసింది. బీఎస్సీ నర్సింగ్ విద్యలో ఇప్పుడు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరమే ఇది అమల్లోకి వచ్చింది. మరోవైపు.. డాక్టర్ ఆఫ్ నర్సింగ్ ప్రోగ్రాంను, ఈ–లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఫౌండేషన్, కోర్, ఎలక్టివ్ కోర్సులు ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో పేషెంట్ సెంటర్డ్ కేర్‌ను తీసుకొచ్చింది. ఇందులో రోగి వ్యక్తిగత ప్రాధాన్యతలు, అవసరాలను గుర్తించి సంపూర్ణమైన సేవలు అందించాల్సి ఉంటుంది. నర్సింగ్ కౌన్సిల్ కొన్ని సూచనలు కూడా చేసింది. అవి.. ♦ హెల్త్‌కేర్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ♦ రోగి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ♦ వ్యక్తిగత పనితీరుతో రోగికి ఎలాంటి ప్రమాదం కలిగించకుండా వ్యవహరించాలి. ♦స్కిల్ ల్యాబ్, క్లినికల్ లెర్నింగ్ పద్ధతులపై దృష్టి సారించాలి. నర్సింగ్ విద్యలోనూ టాప్–5లో.. ఇక నర్సింగ్ విద్యలోను ఏపీ దేశంలోని టాప్–5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ సీట్లకు సంబంధించి కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 19,860 సీట్లు ఉండగా, తమిళనాడులో 12వేలు, మధ్యప్రదేశ్‌లో 9వేలు, రాజస్థాన్‌లో 8,165 ఉన్నాయి. ఏపీ 8,030 సీట్లతో ఐదో స్థానంలో ఉంది. తెలంగాణ 4,980 సీట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక ఏఎన్ఎం విద్యకు సంబంధించి 910 సీట్లతో ఏపీ దేశంలో 12వ స్థానంలో, 455 సీట్లతో తెలంగాణ 17వ స్థానంలో ఉంది. మరోవైపు.. జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ) సీట్లు తెలంగాణలో 3,962 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 7,125 ఉన్నాయి. ఇవి దేశంలోనే అత్యధికంగా కర్ణాటకలో 24,731 సీట్లున్నాయి. ఇక ఏఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31 ఉండగా, తెలంగాణలో 16 మాత్రమే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 545 స్కూళ్లు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. జీఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 163 ఉండగా, తెలంగాణలో 88 ఉన్నాయి. కర్ణాటకలో ఇవి అత్యధికంగా 520 ఉన్నాయి. -
స్టాఫ్ నర్స్.. ఇక నర్సింగ్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సు హోదాను నర్సింగ్ ఆఫీసర్‌గా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. అలాగే అనేక నర్సింగ్ పోస్టుల హోదాలను మార్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్, ఈఎస్ఐ, రైల్వే ఆసుపత్రులు సహా ఇతర ఆసుపత్రుల్లో కొత్త హోదాను అమలు చేస్తోంది. దీన్ని కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. ఆ ప్రకారం తెలంగాణలోనూ నర్సింగ్ పోస్టుల్లో ఉన్న వారికి కొత్త హోదాలు ఇవ్వాలని నర్సులు కోరుతున్నారు. హోదాను మార్చడం వల్ల సమాజంలో గౌరవం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం వీటిని తె చ్చింది. హోదాను మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికపరమైన భారం ఏమీ ఉండదంటున్నారు. బీఎస్సీ నాలుగేళ్లు, ఎంఎస్సీ రెండేళ్లు, పీహెచ్డీ ఏళ్లు చదివినా కూడా ప్రాథమికంగా స్టాఫ్ నర్సు పోస్టే ఉంటుంది. దీనివల్ల ఉన్నతస్థాయిలోని నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు సరైన గౌరవం పొందలేకపోతున్నారని చెబుతున్నారు. ఆసుపత్రుల్లో అనేక విధానపరమైన నిర్ణయాల్లో డాక్టర్లు భాగస్వాములుగా ఉంటున్నారని, అధిపతులుగా కూడా వారే ఉంటున్నారన్న విమర్శలున్నాయి. ఇలా నర్సులపై వివక్ష కొనసాగుతోందన్న ఆందోళన ఉంది. పైగా నర్సింగ్ డైరెక్టరేట్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు నర్సులు చెబుతున్నారు. -
నర్సుల సంఖ్యలో మన స్థానం 14
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లో రోగులకు సేవలందించడంలో, వైద్య సంబంధిత విధుల్లో నర్సులు, ఏఎన్ఎంలది కీలకపాత్ర. ఇలాంటి నర్సులు, ఏఎన్ఎం, జీఎన్ఎంల సంఖ్యలో.. సంబంధిత విద్యలో తెలంగాణ వెనుకబడి ఉందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలు ముందున్నాయి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తమ వార్షిక నివేదిక–2021–22ను విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ ఏఎన్ఎంలు 9.82 లక్షల మంది ఉన్నారు. అత్యధికంగా 1.39 లక్షల మందితో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ 1.10 లక్షల మందితో రెండో స్థానంలో ఉంది. ఇక 10,219 మందితో తెలంగాణ 19వ స్థానంలో ఉంది. రిజిస్టర్డ్ నర్సులు దేశవ్యాప్తంగా 24.71 లక్షల మంది ఉన్నా రు. అత్యధికంగా 3.32 లక్షల మందితో తమిళనా డు మొదటి స్థానంలో ఉంది. కేరళ రెండో స్థానం (3.15 లక్షల మంది)లో, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం ( 2.62 లక్షల మంది)లో ఉన్నాయి. తెలంగాణ 53,314 మందితో 14వ స్థానంలో నిలిచింది. నర్సింగ్ సీట్లలో కర్ణాటక నం.1 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ సీట్ల సంఖ్యలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 19,860 సీట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్ 8,030 బీఎస్సీ సీట్లతో ఐదో స్థానంలో ఉండగా, తెలంగాణ 4,980 సీట్లతో దేశంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఎంఎస్సీ నర్సింగ్‌లో తెలంగాణ 493 సీట్లతో దేశంలో పదో స్థానంలో ఉండగా, ఏపీ ఏడో స్థానంలో ఉంది. 3,360 సీట్లతో కర్ణాటక ఎంఎస్సీ నర్సింగ్‌లోనూ మొదటి స్థానంలో నిలిచింది. కొత్త కోర్సులు..సెమిస్టర్ విధానం.. నర్సింగ్ విద్యలో కౌన్సిల్ అనేక మార్పులు చేసింది. వైద్య రంగంలో వస్తున్న ఆధునీకరణల నేపథ్యంలో సిలబస్‌లో సవరణలు చేసింది. బీఎస్సీ నర్సింగ్ విద్యలో ఇప్పుడు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సంవత్సరమే ఇది అమల్లోకి వచ్చింది. మరోవైపు డాక్టర్ ఆఫ్ నర్సింగ్ ప్రోగ్రాంను, ఈ–లెర్నింగ్ కోర్సులను తీసుకొచ్చింది. ఫౌండేషన్, కోర్, ఎలక్టివ్ కోర్సులు ప్రవేశపెట్టింది. గ్రాడ్యుయేషన్ కోర్సులో పేషెంట్ సెంటర్డ్ కేర్‌ను తీసుకొచ్చింది. ఇందులో రోగి వ్యక్తిగత ప్రాధాన్యతలు, అవసరాలను గుర్తించి సంపూర్ణమైన సేవలు అందించాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి నర్సింగ్ కౌన్సిల్ కొన్ని సూచనలు కూడా చేసింది. ‘హెల్త్ కేర్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. రోగి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. వ్యక్తిగత పనితీరుతో రోగికి ఎలాంటి ప్రమాదం కలిగించకుండా వ్యవహరించాలి. స్కిల్ ల్యాబ్, క్లినికల్ లెర్నింగ్ పద్ధతులపై దృష్టి సారించాలి..’అని సూచించింది. ఏఎన్ఎం సీట్లలో ఆంధ్రప్రదేశ్ టాప్.. ఏఎన్ఎం (ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ) సీట్లలో తెలంగాణ దేశంలో 17వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 455 ఏఎన్ఎం సీట్లు ఉన్నాయి. అత్యధికంగా 12,015 సీట్లతో మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 910 సీట్లతో 12వ స్థానంలో నిలిచింది. జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ) సీట్లు తెలంగాణలో 3,962 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 7,125 ఉన్నాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటకలో 24,731 సీట్లున్నాయి. ఏఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31 ఉండగా, తెలంగాణలో 16 ఉన్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 545 స్కూళ్లు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. జీఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 163 ఉండగా, తెలంగాణలో 88 ఉన్నాయి. దేశంలో అత్యధికంగా కర్ణాటకలో 520 ఉన్నాయి. -
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్‌కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్‌లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్‌గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్‌రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్‌లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్‌లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్‌తో ఫ్లూయిడ్‌ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
టెక్‌యేతర ఉద్యోగాలకు డిమాండ్
ముంబై: బహుళ జాతి ఐటీ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న తరుణంలో గతేడాది డిసెంబర్లో దేశీయంగా టెక్‌యేతర రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, ఆహార సర్వీసులు, నిర్మాణం, విద్యా రంగాల్లో ఈ ధోరణి నెలకొంది. నెలవారీగా ఉద్యోగాల పోస్టింగ్‌లపై అంతర్జాతీయ జాబ్ సైట్ ఇన్‌డీడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం హెల్త్‌కేర్ అనుబంధ విభాగాలైన డెంటల్, నర్సింగ్ రంగాల్లో ఉద్యోగాల పోస్టింగ్స్ అత్యధికంగా 30.8 శాతంగా నమోదయ్యాయి. ఫుడ్ సర్వీసెస్ (8.8%), నిర్మాణం (8.3%), ఆర్కిటెక్చర్ (7.2%), విద్య (7.1%) థెరపీ (6.3%), మార్కెటింగ్ (6.1%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కరోనా మహమ్మారి అనంతరం వ్యాపార పరిస్థితులు సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో నిర్మాణం, సివిల్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కాస్త సందడి నెలకొందని నివేదిక పేర్కొంది. అలాగే మహమ్మారి సమయంలో భారీగా కోతలు పడిన మార్కెటింగ్ విభాగంలోనూ హైరింగ్ పుంజుకుందని వివరించింది. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని కల్పించడంతో పాటు వ్యాపారం, అమ్మకాలను పెంచుకునేందుకు మార్కెటింగ్ అవసరాన్ని బ్రాండ్లు గుర్తించాయని పేర్కొంది. బెంగళూరు టాప్.. జాబ్ పోస్టింగ్స్ విషయంలో మొత్తం 16.5 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిల్చింది. ముంబై (8.23%), పుణె (6.33%), చెన్నై (6.1%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చిన్న నగరాల్లోను డిమాండ్ పెరుగుతోందనడానికి సూచనగా ఉద్యోగాల పోస్టింగ్స్‌లో అహ్మదాబాద్, కోయంబత్తూర్, కొచ్చి, జైపూర్, మొహాలీ వంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా 6.9 శాతంగా నమోదైంది. ప్రయాణాలపై కోవిడ్–19పరమైన ఆంక్షల ఎత్తివేతతో విదేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలను భారతీయులు గణనీయంగానే అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో దేశాలవారీగా చూస్తే మొత్తం సెర్చ్‌లలో అమెరికా వాటా 39.29 శాతంగా ఉండగా, కెనడా 17.23 శాతం, బ్రిటన్ 14.34 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ 13.79 శాతం వాటాతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయంగా వివిధ ఉద్యోగాల కేటగిరీల్లో వృద్ధి కనబడుతోందని, భారత్‌లో హైరింగ్ ధోరణులు సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనమని ఇన్‌డీడ్ ఇండియా హెడ్ (సేల్స్) శశి కుమార్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి కల్పనపై దృష్టి పెడితే కచ్చితంగా దేశీయంగా జాబ్ మార్కెట్‌కు మరింత ఊతం లభించగలదని ఆయన చెప్పారు. దేశీయంగా ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో ధోరణులే నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. -
నర్సింగ్‌లో ఏడాది రెసిడెంట్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: భారత నర్సింగ్ మండలి (ఐఎన్‌సీ) ఆస్పత్రుల్లోని క్రిటికల్ కేర్ విభాగాల్లో సేవలందించేందుకు కొత్తగా స్పెషాలిటీ కోర్సును ప్రవేశపెట్టింది. దీనిని పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ స్పెషాలిటీ నర్సింగ్– రెసిడెన్సీగా పిలుస్తారు. ఈ కోర్సులో చేరేవారికి ఏడాదిపాటు రెసిడెంట్ శిక్షణ ఇస్తారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. 200 పడకలున్న ఆస్పత్రులు ఈ కోర్సును బోధించేందుకు అనుమతిస్తారు. కరోనా కాలంలో క్రిటికల్ కేర్ వైద్యం అనేది కీలకంగా మారింది. దీంతో క్రిటికల్ కేర్ మెడిసిన్ వేగంగా అభివృద్ధి చెందింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల సంరక్షణ కోసం నర్సుల నైపుణ్యాలను పెంచాల్సిన అవసరముందని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం నొక్కి చెప్పింది. ఐసీయూ సేవలు అవసరమయ్యే రోగుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. ఈ రోగులను చూసుకోవడానికి నర్సులు ఉండాల్సిన అవసరముందని తెలిపింది. రోగికి అవసరమైన పోషకాహారం, కమ్యూనికేషన్, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ మొదలైన అంశాలపై వీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏడాది రెసిడెన్సీ కోర్సులో 10 శాతం థియరీ, 90 శాతం స్కిల్ ల్యాబ్, క్లినికల్ అంశాల్లో అభ్యసనం ఉంటుంది. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన వారు ఈ కోర్సును చేయవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన నర్సులను మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏదైనా క్రిటికల్ కేర్ యూనిట్లో మాత్రమే నియమించాలి. క్రిటికల్ కేర్ విభాగంలో పనిచేసే నైపుణ్యం కలిగిన నర్సులు అవసరమని భావించి కేంద్రం ఈ కోర్సు ప్రవేశపెట్టిందని నర్సింగ్ నిపుణులు అనిల్‌కుమార్, రుఢావత్ లక్ష్మణ్ పేర్కొన్నారు. -
ఎనలేని సేవకు ప్రతిరూపం
దేవుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడని అంటారు.. అనారోగ్యంపాలై.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ కన్నా మిన్నగా చూసే నర్సునూ సృష్టించాడంటే అతిశయోక్తి కాదు.. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు పునర్జన్మనిచ్చిన ఆ అమృతమూర్తులకు నేడు నర్సుల దినోత్సవం సందర్భంగా వందనం.. అభివందనం. గుంటూరు మెడికల్: అనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరి చేరని రోజులివీ.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ.. ఆస్పత్రి బెడ్‌పై కాలిన, కుళ్లిన గాయాలతో, దుర్గంధం వెదజల్లే శరీరభాగాలతో ఉన్న స్థితిలో ఎవరైనా ఆ రోగివైపు కన్నెత్తి చూస్తారా? కానీ ఆ స్థితిలోనూ అతనితో ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో సకల సేవలూ చేసే నర్సులు దేవతలతో సమానం. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. జీవితాంతం కృతజ్ఞత చూపించడం తప్ప. ఈ రోజే ఎందుకంటే.. రెండో ప్రపంచ యుద్ధకాలంలో గాయపడిన సైనికులకు విశేష సేవలందించిన నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు మే 12న. అందుకే ఏటా ఆ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు. నర్సింగ్ పోస్టుల భర్తీకి సీఎం ప్రాధాన్యం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని టీచింగ్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్‌నర్సుల పోస్టులు మంజూరు చేశారు. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ఏఎన్ఎంలు ఉండేవారు. ఇప్పుడు వారి స్థానంలో జీఎన్ఎం నర్సులను నియమించారు. గ్రామాల్లోనూ బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా నియమించారు. 200 మందికి ఇన్ సర్వీస్ కోటాలో జీఎన్ఎం కోర్సును అభ్యసించే అవకాశం కల్పించారు. గుంటూరు జీజీహెచ్‌లో ఒకే సారి 250 స్టాఫ్‌నర్సు పోస్టులను మంజూరు చేశారు. అమ్మ కూడా నర్సే అమ్మ సముద్రాదేవి స్టాఫ్‌నర్సుగా గుంటూరు జీజీహెచ్‌లో వైద్యసేవలు అందించారు. ఆమెతోపాటు అప్పుడప్పుడు ఆస్పత్రికి వచ్చేదానిని. ఆమె స్ఫూర్తితో నేనూ ఈ వృత్తిలోకి వచ్చా. హైదరాబాద్‌లో 2000లో జీఎన్ఎం కోర్సును పూర్తి చేశా. ప్రభుత్వ నర్సుగా ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్ డిచ్‌పల్లిలో. 22 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నా. రోగులకు సేవలందించడం సంతృప్తినిస్తోంది. – చిలువూరి కిరణ్మయి, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ కావాలనుకున్నా.. డాక్టర్ కావాలనుకున్నా.. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. అందుకే నర్సునయ్యా. 22 ఏళ్లుగా పనిచేస్తున్నా. కోవిడ్ సమయంలో చేసిన సేవలకు ఉన్నతాధికారులు వచ్చి అభినందించడం మరిచిపోలేని అనుభూతి. – పొట్లూరు మంజు, జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్–2) అమ్మ కోరిక మేరకు.. అమ్మ కోరిక మేరకు నర్సింగ్ వృత్తిలోకి ప్రవేశించాను. 39 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఎక్కువగా పసికందులకు చికిత్స అందించే ఎన్ఐసీయూలో పనిచేశాను. చికిత్స అనంతరం పిల్లలు వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు చేతులు జోడించి చూపే కృతజ్ఞతతో పడిన కష్టమంతా మరిచిపోతాను. – షేక్ సమీనా, జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్–2) -
కట్నంతో లాభాలెన్నో!
ముంబై: వరకట్నంతో చాలా ప్రయోజనాలున్నాయంటూ పలు ఉదాహరణలను పేర్కొన్న బీఎస్సీ నర్సింగ్ రెండో ఏడాది పాఠ్యపుస్తకం ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్ నర్సింగ్ పుస్తకంలోని ఒక పేరాలో పేర్కొన్న అంశాలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పేజీ ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యురాలిగా అడుగుపెట్టేందుకు వరకట్నం ఎంతగానో సాయపడుతుంది. ఇంట్లోకి సమస్త సామగ్రి, వాహనాలు ఇలా అన్నీ కట్నం రూపంలో వచ్చిపడతాయి. అమ్మాయి తన తల్లిదండ్రుల ఆస్తిలో భాగాన్ని ఇలా కట్నంరూపంలో అత్తవారింటికి తెచ్చుకోవచ్చు. కట్నాలు ఇచ్చే స్తోమత లేకే కొందరు తల్లిదండ్రులు అమ్మాయిలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారు చదివి, ఉద్యోగం సంపాదిస్తే కట్నం డిమాండ్ తగ్గుతుంది. ఇదొక మంచి ప్రయోజనం. అందవిహీన అమ్మాయిలకు మంచి/అందవిహీన అబ్బాయిలతో పెళ్లి అవ్వాలంటే కట్నం ముట్టజెప్పాల్సిందే’ అంటూ పలు వ్యాఖ్యానాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇలాంటి పాఠ్యపుస్తకాలు ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు’ అంటూ శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠ్య ప్రణాళిక నుంచి వెంటనే ఈ పుస్తకాన్ని తొలగించి, సంబంధికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆమె లేఖ రాశారు. -
Yasmeen:అసలు పెళ్లి అవుతుందా అని హేళన.. దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్
Acid Attack Survivor Yasmeen Mansoori: ఎవరో మూర్ఖంగా చేసిన పనికి ముఖం కాలిపోయింది, కళ్లు తెరవలేని పరిస్థితి. అయినా జీవితం మీద ఆశలు వదులుకోలేదు. ఇరవై సర్జరీలు చేయించుకున్నా, ముఖం పూర్వస్థితికి రాలేదు. ఏ మాత్రం నిరాశపడకుండా కష్టపడి చదివి ఏకంగా ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ అయ్యింది యాస్మిన్ మన్సూరి. చిన్నపాటి కష్టాలను సాకులుగా చూపుతూ లక్ష్యం లేకుండా, నిర్లక్ష్యంగా బతుకుతోన్న ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది యాస్మిన్. అది 2004.. ఉత్తర్ ప్రదేశ్‌లో షామిలీ జిల్లాలో ఉంటోన్న యాస్మిన్ వాళ్ల కుటుంబం జీవనం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. అప్పుడు యాస్మిన్‌కు పదహారేళ్లు. ఒకరోజు వారిమీద కిట్టని వాళ్లెవరో యాసిడ్ పోశారు. ఈ దుర్ఘటనలో యాస్మిన్ చర్మం మూడు పొరల లోతు వరకు కాలిపోయింది. కళ్లు తెరిచే పరిస్థితి లేదు. తనతోపాటు ఉన్న చెల్లి శరీరం కూడా కాలింది. మంచి వైద్యం తీసుకునేందుకు యూపీ నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు వారిని. కొన్నాళ్లు కుటుంబం మొత్తం అక్కడే ఉంటూ మెరుగైన వైద్యం చేయించుకున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఆసుపత్రికి వెళ్లక తప్పని పరిస్థితి వారిది. దీంతో రెండు వారాలకొకసారి ఢిల్లీ వెళ్లడం యాస్మిన్ జీవితంలో ఒక భాగమైంది. చికిత్సలో వాడే మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపించడంతో చాలా ఇబ్బందులకు గురైంది. ఈ అక్క చెల్లెళ్లను చూసిన వాళ్లు ‘‘ఈ పిల్లలను ఎవరు పెళ్లి చేసుకుంటారు, వీరికి అసలు పెళ్లి అవుతుందా?’’ అని గుసగుసలాడుకునేవారు. ఒకపక్క శారీరక బాధ, మరోపక్క గుండెల్లో గుచ్చుకునే మాటలు మానసికంగా బలహీన పరిచేవి. కొన్నాళ్లకు ఇలా కాదు. అయ్యిందేదో అయ్యింది. దానిని మార్చలేము కాబట్టి అలాగే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది యాస్మిన్. సేవలు నచ్చి... సఫ్దర్ జంగ్ తర్వాత చికిత్స కోసం ఎయిమ్స్‌కు వెళ్లింది యాస్మిన్. అక్కడ కొంతమంది నర్సులు రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు నచ్చడంతో తను కూడా నర్స్ అయ్యి సేవలందించాలనుకుంది. అనుకున్న వెంటనే దూరవిద్య ద్వారా ఇంటర్మీడియట్ చదువుతూనే, మరోపక్క కంప్యూటర్ కోర్సు చేసింది. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో బిఏలో చేరింది. ఒకపక్క బిఏ చేస్తూనే ‘జామియా హమ్దార్ద్ యూనివర్సిటీ’లో నర్సింగ్‌లో చేరింది. అయితే ఆర్ట్స్ సబ్జెక్ట్ చదవడం వల్ల నర్సింగ్ బాగా కష్టంగా అనిపించేది తనకు. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పటికీ నిరాశ పడకుండా తరువాతి ప్రయత్నంలో పాస్ అయ్యింది. ఉత్తమ ఉద్యోగిగా నర్సింగ్ అయిపోయిన వెంటనే 2014లో హకీమ్ అబ్దుల్ అహ్మద్ సెంటెనరీ ఆసుపత్రిలో ఉద్యోగం దొరికింది. ఇక్కడ రెండేళ్లు పనిచేసాక, మరో ఆసుపత్రిలో చేరింది. ఇక్కడ యాస్మిన్ సేవలకు గుర్తింపుగా ‘బెస్ట్ ఎంప్లాయీ అవార్డు’ వచ్చింది. ఒకపక్క ప్రైవేటు హాస్పిటల్స్‌లో చేస్తూనే మరోపక్క ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేది. ఇదే సమయంలో ఎయిమ్స్‌లో నర్సులు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది,. అర్హతలన్నీ ఉన్నప్పటికీ డిజెబిలిటీ నిబంధనలకు ఆమె సరిపోదని తిరస్కరించారు. దీంతో యాసిడ్ సర్వైవర్‌ను కూడా డిజెబిలిటీ విభాగంలో చేర్చాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. ధర్మాసనం 2016లో డిజెబిలిటీ చట్టంలో కొన్ని సవరణలు చేసి యాసిడ్ సర్వైర్స్‌ను కూడా ఈ చట్టపరిధిలోకి చేర్చింది. దీంతో రెండేళ్ల తరువాత ఎయిమ్స్‌లో ఉద్యోగాన్ని పొంది, ‘‘దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్’’ గా రికార్డు సృష్టించింది. ఇక్కడ రోగులకు మంచి సేవలందించడంతో ‘ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ పర్సన్’ విభాగంలో ‘బెస్ట్ ఎంప్లాయీ’ అవార్డును అందుకుంది. ‘‘ప్రస్తుతం దేశంలో ఎంతోమంది అమ్మాయిలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. అమ్మాయిల జీవితంలో పెళ్లి అతిముఖ్యమైన అంశంగా చూస్తారు. అది సరికాదు. పెళ్లికి ముందు మనకెన్నో కలలు ఉంటాయి. వాటిని నిజం చేసుకుని ఆ తర్వాతే, జీవితంలో ముందుకు సాగాలి’’ అని యువతకు చెబుతోంది. -
ఏఎన్‌యూలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ).. టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–03, నాన్ టీచింగ్ పోస్టులు–04. ► టీచింగ్ పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్(రూరల్ డెవలప్మెంట్, కంప్యూటర్ సైన్స్) అసోసియేట్ ప్రొఫెసర్(ఇంగ్లిష్). అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► నాన్ టీచింగ్ పోస్టులు: స్వీపర్, క్లీనర్, యుటెన్సిల్ క్లీనర్, మార్కర్. అర్హత: మార్కర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మిగతా పోస్టులకు సంబంధిత పని అనుభవంతోపాటు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వేతనం: నెలకు రూ.13,000 నుంచి రూ.40,270 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 ► వెబ్సైట్: https://www.nagarjunauniversity.ac.in/indexanu.html ఏపీవీవీపీ, అనంతపురంలో వివిధ ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాల యం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్/ఎంబీబీఎస్ డాక్టర్–01, నర్సు(ఏఎన్ఎం)–02, కౌన్సిలర్– 03, డేటాఎంట్రీ ఆపరేటర్–01, వార్డ్బాయ్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిది, పదో తరగతి/ఇంటర్మీడియట్ (ఎంపీహెచ్(ఎఫ్) ట్రెయినింగ్), గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ/ డిప్లొమా(సైకియాట్రీ మెడిసిన్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యం ఉండాలి. ► వయసు: 42 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సీనియారిటీ ప్రాతిపదికన ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, అనంతపురం చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021 ► వెబ్సైట్: ananthapuramu.ap.gov.in గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, నెల్లూరులో 13 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 13 ► పోస్టుల వివరాలు: వాచ్మెన్–02, క్లీనర్/వ్యాన్ అటెండెంట్–01, ఆయాలు–01, స్వీపర్లు–01, ల్యాబ్ అటెండెంట్లు–01, కుక్స్–03, కిచెన్ బాయ్/టేబుల్ బాయ్–02, తోటీ/స్వీపర్–02. ► అర్హత: ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు పదో తరగతి, మిగతా అన్ని పోస్టులకు ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021 ► వెబ్సైట్: spsnellore.ap.gov.in -
‘నీట్’లాగే నర్సింగ్‌కూ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: మెడికల్ అడ్మిషన్లకు ‘నీట్’ ఎలాగో నర్సింగ్ ప్రవేశాలకూ జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష (యూనిఫామ్ ఎంట్రీ ఎగ్జామ్) రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న జాతీయ నర్సింగ్ కౌన్సిల్ స్థానంలో కొత్తగా ‘నేషనల్ నర్సింగ్, మిడ్వైఫరీ కమిషన్ (ఎన్‌ఎన్‌ఎంసీ)ను ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తూ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. దీనిపై వచ్చే నెల 6నాటికి దేశవ్యాప్తంగా అభిప్రాయాలు కోరింది. నర్సింగ్ విద్య, వృత్తిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకనుగుణంగా తీర్చిదిద్దేందుకు బిల్లులో అనేక అంశాలను చేర్చారు. ప్రస్తుత నర్సింగ్ వ్యవస్థను సమూలంగా మార్చాలన్నదే దీని ఉద్దేశమని నర్సింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇకపై నర్సింగ్ కోర్సు చేయాలంటే.. ఇప్పటివరకు బీఎస్సీ నర్సింగ్‌లో చేరాలంటే ఇంటర్ బైపీసీ అర్హతగా ఉంది. ఓపెన్ కేటగిరీలో 45%, రిజర్వేషన్ కేటగిరీలో 40% మార్కులు సాధించిన వారు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటన అనంతరం దరఖాస్తు చేసుకోవాలి. మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇక ఎంఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలంటే బీఎస్సీ నర్సింగ్ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే ఏడాదిపాటు ఎక్కడో ఒకచోట పనిచేసిన అనుభవం ఉండాలి. అలాంటివారికి వారి మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 2014కు ముందు ఎంఎస్సీ నర్సింగ్‌లో చేరేందుకు ఎంట్రన్స్ నిర్వహించేవారు. తదనంతరం దాన్ని ఎత్తేశారు. ప్రస్తుతం దేశంలో బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరడానికి మార్కులే అర్హత. నర్సింగ్ కోర్సు పూర్తయ్యాక రాష్ట్రాల్లోని నర్సింగ్ కౌన్సిళ్లలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నర్సులుగా చేరేవారు. ఇకపై నర్సింగ్ వృత్తి చేపట్టడం అంత సులువు కాదు. నర్సింగ్ విద్యలో నాణ్యతను పెంచడానికి కొత్తగా జాతీయస్థాయిలో నీట్ తరహా ఎంట్రన్స్ పెడతారు. దానిని ‘యూనిఫామ్ ఎంట్రీ ఎగ్జామ్’గా పేర్కొన్నారు. ఇందులో అర్హత సాధించినవారు జాతీయ, రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఇక నర్సింగ్ కోర్సు పూర్తయినవారికి మళ్లీ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో పాసైన వారే నర్సింగ్ వృత్తి చేపట్టడానికి లేదా ఎంఎస్సీ కోర్సులో చేరడానికి అర్హులు. ముసాయిదాలోని మరికొన్ని అంశాలు నర్సింగ్ కోర్సు సిలబస్ ఆలిండియా స్థాయిలో ఆంగ్లంలో ఒకటే ఉంటుంది. కాలేజీల్లో నర్సింగ్ విద్యా ప్రమాణాలను పెంచాలి. నైపుణ్యం, విజ్ఞానం, ప్రవర్తన, విలువలు, నైతికత, హెల్త్‌కేర్, పరిశోధన వంటివి నేర్పించాలి. పోటీతత్వం పెంచాలి. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నర్సింగ్ విద్యాసంస్థలను తీర్చిదిద్దేలా మార్గదర్శకాలు రూపొందించాలి. మౌలిక సదుపాయాల కల్పన, మంచి ఫ్యాకల్టీని కల్పించడం ద్వారా నాణ్యతను పెంచాలి. అంతర్జాతీయ స్థాయిలో నర్సింగ్ ఫ్యాకల్టీకి శిక్షణనివ్వాలి. కమిషన్ అమల్లోకి వచ్చిన తరువాత మూడేళ్లలోపునే జాతీయస్థాయి ప్రవేశ పరీక్షను తీసుకొస్తారు. బిల్లు పాసైన ఐదేళ్లలో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ అమలుచేస్తారు. జాతీయస్థాయి రిజిస్ట్రేషన్ నర్సింగ్ కోర్సు ఏ రాష్ట్రంలో చదివినవారు ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది ప్రస్తుత నిబంధన. కానీ కొత్త కమిషన్‌లో కీలకమార్పు చేశారు. నేషనల్ పోర్టల్‌లో జాతీయస్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. కాలేజీల్లో తనిఖీలు కఠినంగా ఉంటాయి. థర్డ్ పార్టీకి తనిఖీల బాధ్యత అప్పగిస్తారు. తనిఖీ వివరాలను పబ్లిక్ డొమైన్లో పెడతారు. ఏఎన్ఎంలు ఇకపై ‘నర్స్ అసోసియేట్’గా కొత్త హోదా పొందుతారు. లేడీ హెల్త్ వర్కర్స్, మేల్ హెల్త్ వర్కర్లను కూడా నర్స్ అసోసియేట్‌గానే పిలుస్తారు. నాలుగు మండళ్ల ఏర్పాటు ఎన్‌ఎన్‌ఎంసీ పరిధిలో కొత్తగా నర్సింగ్–మిడ్ వైఫరీ యూజీ ఎడ్యుకేషన్ బోర్డు, నర్సింగ్– మిడ్వైఫరీ పీజీ ఎడ్యుకేషన్ బోర్డు, నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ అసెస్మెంట్–రేటింగ్ బోర్డు, నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఎథిక్స్ అండ్ రిజిస్ట్రేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఎన్‌ఎన్‌ఎంసీకి చైర్పర్సన్, నర్సింగ్ అడ్వైజరీలు, సభ్యులు ఉంటారు. వీరిలో ఎయిమ్స్ వంటి సంస్థలు, ఆసుపత్రుల్లో పనిచేసే సూపరింటెండెంట్లు ఉంటారు. 12 మంది నిపుణుల్లో నర్సులు ఉంటారు. మిడ్వైఫరీ నుంచి, ఎన్జీవో నుంచి ఒక్కొక్కరు ఉంటారు. ఒకరు మెడికల్ లా తెలిసినవారు సభ్యులుగా ఉంటారు. సెర్చ్, సెలక్షన్ కమిటీలో ఆఫీస్ బేరర్లను నియమిస్తారు. చైర్మన్, సభ్యులు నాలుగేళ్లకోసారి మారతారు. చైర్మన్, సభ్యులు ఆస్తులు ముందే ప్రకటించాలి. నాణ్యత పెరుగుతుంది ప్రస్తుత నర్సింగ్ కౌన్సిల్ స్థానే నేషనల్ నర్సింగ్, మిడ్వైఫరీ కమిషన్‌ను తీసుకురావడం వల్ల నర్సింగ్ విద్యలో సమూల మార్పు లొస్తాయి. జాతీయస్థాయి పరీక్ష, ఎగ్జిట్ ఎగ్జామ్ల వల్ల నర్సింగ్ వృత్తి, విద్యలో ప్రమాణాలు, నాణ్యత పెరుగుతాయి. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందుతాయి. – లక్ష్మణ్ రుడావత్, ప్రధాన కార్యదర్శి, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ -
సర్కారా! గాడెవడురో?!
‘నిగ్గదీసి అడుగు..’ అంటూ ప్రశ్నల కొడవళ్లను మన ముందు పెట్టిన సినిమా. ‘అగ్గితో కడుగు ఈ సమాజ జీవనచిత్రాన్ని’ అని ఎలుగెత్తిన సినిమా. ఇద్దరు అగ్రదర్శకులు కథ అందించిన సినిమాలో కొన్ని దృశ్యాలు ఇవి. ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... రౌడీనాయకుడు మరియు రాజకీయనాయకుడు గురునారాయణను ఎయిర్‌పోర్ట్‌లో విలేకర్లు చుట్టుముట్టారు.ఆయన ముఖం కందగడ్డలా ఉంది. ఈ ముఖాన్ని చూసి ప్రశ్న అడగనక్కర్లేదు. అయినా సరే అడిగారు...‘‘మీరు ఢిల్లీ వెళ్లిన పని ఏమైంది సార్?’’సూటిగా సమాధానం చెప్పకుండా ‘‘ఐయామ్ వెరీ హ్యాపీ’’ అంటూ వేగంగా కారు వైపు దౌడు తీశాడు గురునారాయణ.దారిలో అభిమాని ఒకడు దండ పట్టుకొని దగ్గరకు వస్తూ ‘‘అన్నా... ఒక్క నిమిషం’’ అన్నాడు.‘‘ఏ టైమ్‌లో దండేయాలో కూడా తెల్వదు. ధమాక్ లేనోడు’’ అని అభిమాని వైపు కొరకొరా చూస్తూ కారెక్కాడు గురునారాయణ.‘‘అన్నా...పోయేటప్పుడు అందరూ సపోర్ట్ చేస్తానన్నరు. గిట్లైందేంది?’’ అడిగాడు నర్సింగ్.‘‘అందరూ పాలిటిక్స్ నేర్చిండ్రురా’’ పండ్లు నూరాడు గురునారాయణ.ఇంట్లో...‘‘అదేన్నా... ప్రొహిబిషన్ గడబిడలో సారా దుకాణాలు తీసేస్తరట. అందుకే రాజాసింగ్ పరేశాన్ల ఉన్నడు’’ అన్నాడు నర్సింగ్.‘‘సారా మీద బతికే సర్కారోళ్లు భయపడాలెగాని దందా మీద బతికే మనకేమైతదిరా’’ అని రాజాసింగ్‌కు ధైర్యం చెప్పాడు గురునారాయణ.‘‘లేదన్నా, సీరియస్‌గానే ఉన్నదట’’ భయపడుతూనే ఉన్నాడు రాజాసింగ్. ‘‘ఛల్ తీ. ఒక్కటి పోతే ఇంకొక్కటి ఉంటది. గుడుంబ లేదా’’ అని మళ్లీ ధైర్యం చెప్పాడు గురునారాయణ. అప్పుడే లాయర్‌సాబ్ ఇంట్లోకి వచ్చాడు.‘‘లాయర్సాబ్కి కుర్చేయండి’’ అని మార్యాద చేస్తూనే ‘‘గా ఢిల్లీ ముచ్చట అగడొద్దు’’ అని చెప్పకనే చెప్పాడు గురునారాయణ. ఢిల్లీ టాపిక్‌ను దారి మళ్లించడానికి ‘‘గావళ్లు ఏమైన్రూ?’’ అని ఆరా తీశాడు.‘‘ఎవళు సార్?’’ అడిగాడు నర్సింగ్.‘‘గదేరా, కొట్లాడొచ్చిన్రు చూడు. వాళ్లను పిలువు’’ గురునారాయణ.వాళ్లు వచ్చి గురునారాయణ ముందు నిల్చున్నారు.‘‘ఈళ్లు గౌలిగూడ బార్ల దూరి వాళ్ల మందుతాగి వాళ్లనే కొట్టిండ్రు. బయట కనబడితే పోలీసులు ఎక్కడ బొక్కలో నూకుతరోనని ఫికరైతాండ్రు. మీదికెళ్లి వాడి బర్త్‌డే నంట. గదో సెంటిమెంట్ బెట్టిండు. జర ఏమైనా చెయ్’’ అని లాయర్సాబ్తో చెబుతూ కుర్రాళ్ల వైపు తిరిగి...‘‘జరిగింది జరిగినట్లు చెప్పుండ్రి. లేకపోతే బర్త్‌డే కేకు కాదు జైల్లో చిప్పకూడు తినాల్సొస్తది’’ అరిచాడు గురునారాయణ. గురునారాయణ మినిస్టర్ అయిన తరువాత.... ఒకరోజు‘‘ప్రెసొల్లా! లేలేలే... ఆ దుక్నం మనకొద్దు బై. ఆళ్లు అడ్డమైన కొచ్చెన్లెస్తరు మనకు చెప్పనీకి రాదు. నాకు సిగై్గతది. పొమ్మను పో’’ టీవీలో మైకేల్‌జాక్సన్ డ్యాన్స్ ప్రోగ్రాం చూస్తూ అన్నాడు గురునారాయణ.‘‘భలేవారే! ప్రెస్వద్దా...మీరు గొప్పోడు అని నేను, నేను గొప్పాడు అని మీరు అనుకుంటే సరిపోద్దా? ప్రపంచానికి తెలియాలి. పబ్లిసిటీ ఇంపార్టెంట్. లేకపోతే ఎక్కడి మైకేల్ జాక్సన్, ఎక్కడి మనం... చూడట్లా!’’ అని నక్క బుర్రతో సలహా ఇచ్చాడు లాయర్‌సాబ్.‘‘ఏక్‌ధమ్ సమజైంది బై. మంచిగచెప్పినవ్’’ అని లాయర్సాబ్కు థ్యాంక్యూ చెబుతూ ‘‘గా పోరిని రమ్మను’’ అని నర్సింగ్‌తో అన్నాడు గురునారాయణ.రిపోర్టర్ అనిత లోపటికి వచ్చింది.గురునారాయణ కండ్లలో కనిపించని భయం. ‘‘థియేటర్లలో జరిగిన హత్యల విషయంలో మీ కామెంట్ ఏమిటి?’’ అడిగింది అనిత.‘‘గదైతే నేను ఖండిస్తున్నాను. అంతే’’ అన్నాడు గురునారాయణ గంభీరంగా.‘‘అంటే?’’ అర్థం కానట్లు చూసింది రిపోర్టర్.‘‘ఖండిస్తున్నాను కదా. అంతే’’ అని మరోసారి అన్నాడు గురునారాయణ.‘‘అది అర్థమైంది కాని, మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారని...’’ అడిగింది రిపోర్టర్.‘‘ఏం యాక్షన్ తీసుకుంటం. పోలీసోళ్లకు జెప్పినం. నువ్వే గదరా డీయస్పీతో ఫోన్లో మాట్లాడినవ్. గాడేం జెయ్యలే. సూడుమళ్లా’’ నర్సింగ్ వైపు తిరిగి అన్నాడు గురునారాయణ.‘‘ఇలాంటి ముఠా తగాదాల వల్ల ఎంతోమంది అమాయకులు వాళ్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన మినిస్టర్ మీరై ఉండి కూడా మీరేం చేస్తున్నారని...’’ సూటిగా వాడిగా అడిగింది రిపోర్టర్ అనిత.‘‘మళ్లా ఏంజేస్తున్నారంటవ్...చెప్పిన కదా... ఖండిస్తున్నాను’’ మరోసారి బలంగా ఖండించాడు గురునారాయణ.‘‘మళ్లీ ఖండిస్తున్నానంటున్నారు. అసలు ఏ విషయాన్ని ఖండిస్తున్నారో తెలుసా మీకు?’’ అసహనంగా అడిగింది అనిత,‘‘ఏందమ్మో ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నవ్’’ అని గయ్యిన లేచాడు నర్సింగ్.‘‘ష్ష్ష్’’ అన్నాడు లాయర్‌సాబ్. ఆయన ‘ష్ష్ష్’ని గౌరవిస్తున్నట్లుగా అందరూ సైలెంటైపోయారు.ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మరో ప్రశ్న అడిగింది రిపోర్టర్...‘‘సర్కార్‌ని విడిపించడంలో మీ చేయి కూడా ఉందని ఒక రూమర్ ఉంది. దాని గురించి మీ కామెంట్ ఏమిటి?’’‘‘సర్కారా? గాడెవడ్రో’’ అని నాటకీయంగా ఆశ్చర్యపోయాడు గురునారాయణ.ఇలా అన్న కొద్దిసేపటికే ఆ సర్కార్ గురునారాయణ ఇంట్లోకి పరుగెత్తుకు వచ్చాడు. ప్రత్యర్థి గ్యాంగ్ అతడివెంటబడుతుంది.సర్కార్‌ని చూసి అక్కడున్నవాళ్లు అదిరిపోయారు.‘‘అన్నా. పక్కకు పోదం. రూమ్‌లోకి పా’’ అని సర్కార్‌ని పక్క గదిలోకి తీసుకెళ్లాడు నర్సింగ్.‘‘అతనే సర్కార్ కదూ’’ అడిగింది అనిత.అబద్ధాలు బాగా నమిలి జీర్ణించుకున్న గురునారాయణ నీళ్లు నమలలేదు.ఈలోపే సర్కార్‌ని పట్టుకోవడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ ఇంట్లోకి దూసుకొచ్చాడు.అతడిని చూసి...‘‘ఏంద్వయ్యా గిట్ల జొర్రబడితివి.ఈడ నీకేం పని?’’ అరిచాడు గురునారాయణ.‘‘సర్కార్‌ని అరెస్ట్ చేయడానికి వచ్చాను’’ దృఢంగా అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘గాన్ని అరెస్ట్ చేస్తావా? నీ తాన వారంటు ఉందా? నేను పాలిట్రిక్స్ మంత్రిని.ఖబడ్దార్’’ అని హెచ్చరించాడు గురునారాయణ.‘‘సర్కార్ ఎవరో తెలియదు అన్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు?’’ అడిగింది రిపోర్టర్.‘‘ఆ...గాడు నా నియోజకవర్గం ఓటరు. జర్రంత డేంజర్ల పడి ఉంటడు. హెల్పింగ్ కోసం ఇంట్ల దూరిండు. దీనికి పెద్ద పంచాయితీ జేస్తున్నారే...ఆ...’’ అని గట్టిగా అరిచాడు గురునారాయణ. -
సెల్‌ఫోన్ కోసమే హత్య
అదే సెల్‌ఫోన్ నిందితుడిని పట్టించింది హత్యకేసును ఛేదించిన పోలీసులు అత్తాపూర్(రాజేంద్రనగర్): హత్య కేసులో నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 9న అత్తాపూర్ పెద్ద తాళ్లకుంట చెరువు వద్ద నర్సింగ్(40) అనే వ్యక్తి హత్య చేయబడ్డ విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ ఆధారంగా దర్యాప్తు.. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం, ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడు నగరంలోని గుడ్డిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన ఎస్.నరేష్(38)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. నర్సింగ్కు రోజూ కల్లు తాగే అలవాటు ఉండడంతో 9వ తేదీన హైదర్‌గూడ కల్లు కాంపౌండ్‌కు వెళ్లాడు. కల్లు తాగుతుండగా నిందితుడు నరేష్ నర్సింగ్‌ను చూసి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ దొంగిలించాలని పథకం వేశాడు. నర్సింగ్ వద్దకు వెళ్లి ఇంకా కొద్దిగా కల్లు తాగించి పక్కనే ఉన్న తాళ్లకుంట చెరువు వద్ద గల ఈదమ్మ దేవాలయం వద్దకు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి దాటిన అనంతరం నిందితుడు నర్సింగ్ వద్ద నుంచి డబ్బులు, సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా నర్సింగ్ ప్రతిఘటించాడు. దీంతో కోపంతో నరేష్ అతడి తలపై బండరాయితో కొట్టి హత్య చేసి అతడి జేబులో ఉన్న రూ. 500, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు. మరుసటి రోజు మృతుడి సెల్‌ఫోన్‌తో నరేష్ తన బంధువులకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఎస్సై వి.ఉమేందర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ విద్యార్థిని మృతి
కర్నూలు(హాస్పిటల్): రోడ్డు ప్రమాదంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు గ్రామానికి చెందిన ముత్యాలు కుమార్తె పి. లింగమ్మ(19) కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజిలో బిఎస్సీ నర్సింగ్ కోర్సు మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె నగరంలోని గిరిజన హాస్టల్లో ఉంటోంది. ఇదే హాస్టల్లో ఆమెకు తుగ్గలి మండలం సూర్యతండాకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని బి. సుజాత పరిచయమైంది. ఆదివారం ఆమె సుజాత ఊరికి వెళ్లేందుకు గుత్తికి వెళ్లింది. అక్కడ నుంచి బైక్‌పై ఆమెను సుజాత సోదరుడు ఎం. స్వామినాయక్‌తో కలిసి వెళ్లారు. మార్గమధ్యంలో జొన్నగిరి గ్రామం వద్ద స్పీడ్‌బ్రేకర్ రావడంతో అదుపు తప్పి బైక్‌పై నుంచి కింద పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సేవకు ప్రతిరూపం నర్సింగ్ వృత్తి
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నెల్లూరు(అర్బన్): నర్సింగ్ వృత్తి సేవకు ప్రతిరూపమని రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ది ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ఏఐ) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నర్సింగ్ సేవలపై తొలి రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ స్థానిక అచ్యుత సుబ్రహ్మణ్యం కల్యాణమండపంలో శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కామినేని మాట్లాడూతూ డాక్టర్ రోగిని ఐదు నిమిషాలు మాత్రమే పరిశీలిస్తాడన్నారు. తరువాత 24 గంటల పాటు అడ్మిట్ అయిన రోగిని కంటికి రెప్పలా చూడాల్సిన బాధ్యత నర్సులపైనే ఉందన్నారు. నర్సింగ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల 28శాతం ఓపీ పెరిగిందన్నారు.నాణ్యమైన వైద్య సేవలందించేందుకు తాము కృషి చేస్తామన్నారు. నర్సింగ్ అసోసియేషన్ కోసం స్థలం మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని అసోసియేషన్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ సభలో నర్సింగ్ సేవలకు సంబందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నర్సింగ్ సేవలు, సమస్యలు గురించి వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఏఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలి, డా.ఇందిర, నర్సింగ్ డెప్యూటీ డైరెక్టర్ వేదమణి, రిజిస్ట్రార్ రోజారాణి, డీఎం అండ్ హెచ్ఓ డా.వరసుందరం, బీపేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, నిర్వాహకులు ప్రభుదాస్, పద్మావతి, ఝాన్సిలక్ష్మీబాయి, మాధురి, సుశీల, బొల్లినేని, నారాయణ, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. రొట్టెల పండుగ ఏర్పాట్ల పరిశీలన అనంతరం మంత్రి శ్రీనివాస్ బారాషహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు జరగడం సంతోషకరమన్నారు. కేంద్రం నుంచి మంత్రి వెంకయ్యనాయుడు ఇక్కడి అభివృద్ది పనులకు నిధులు విడుదల చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
నర్సింగ్ సీట్లు ఈ ఏడాది లేనట్టే !
సిబ్బంది కొరతే ప్రధాన కారణం కళాశాల నిర్వహణపై ఐఎన్‌సీ అసంతృప్తి సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ అధికారుల ప్రదక్షిణలు ఎంజీఎం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాల నిర్వహణపై ఇండియ¯ŒS నర్సింగ్ కౌన్సిలింగ్(ఐఎన్సీన్) అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ ఏడాది సీట్ల భర్తీకి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై నర్సింగ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రార్ ఐదు రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపాల్‌కు నోటీసులు జారీ చేయడంతో సీట్ల ను కాపాడుకునేందుకు రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి ఢిల్లీలోని ఐఎన్‌సీ బృందం వద్దకు పయనమయ్యారు. ఇం డియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ సభ్యులు ప్రతి సంవత్సరం కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులకు సరిపడా అధ్యాపక బృందంతో పాటు హాస్టల్ వసతి, లైబ్రరీ వంటి సౌకర్యాలను పరిశీలిస్తారు. వారు సంతృప్తి చెందితేనే అడ్మిషన్లకు అనుమతి ఇస్తారు. 2012లో కళాశాల స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించలేదు. అంతేకాక ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఉన్న హాస్టళ్లలో విద్యార్థులకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో పాటు అక్కడి నుంచి విద్యార్థులకు కళాశాలకు నడిచి రావాల్సిన దుస్థితి నెలకొంది. అంతే కాకుండా నర్సింగ్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు మెస్ సౌకర్యం సరిగ్గా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌ల విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, ఐదుగురు అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. కళాశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఐఎన్‌సీ నిబంధనల ప్రకారం పది మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి. కానీ ఇక్కడ ఐదుగురు మాత్రమే ఉండడంతో ఐఎన్‌సీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి, సీట్ల అనుమతికి నిరాకరించారని అధ్యాపకులు చెపుతున్నారు. ఫ్యాకల్టీ నియామకం గురించి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదని నర్సింగ్ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు బీఎస్సీ నర్సింగ్ కళాశాలపై దృష్టి పెట్టి సీట్లను కాపాడడడంతో పాటు వెంటనే అధ్యాపకులను నియమించాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ప్రశాంతంగా నర్సింగ్ పరీక్షలు
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ, ప్రై వేటు నర్సింగ్ పాఠశాలల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఆడిటోరియంలో ఈ నెల 14న ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 24 వరకు నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 13 పాఠశాలల నుంచి 2,959 మంది విద్యార్థినులు పరీక్షలు రాస్తున్నారు. గురువారం ఎంఎస్–వన్ పరీక్షను ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు రాశారు. పరీక్షల చీఫ్‌గా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, చీఫ్ ఎగ్జామినర్‌గా సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వై.శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు 21 మంది ఇన్విజిలేటర్లు పరీక్షను పర్యవేక్షిస్తున్నారు. -
సేవకు ప్రతి రూపం నర్సింగ్
జేసీ ఇంతియాజ్ అహ్మద్ నెల్లూరు(అర్బన్): సేవలకు ప్రతిరూపమే నర్సింగ్ వృత్తి అని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో గురువారం మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ స్త్రీల టైనింగ్ కోర్సుల ఎంపికకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ కోర్సులో చేరేందుకు ప్రభుత్వ, మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి 51 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా 26 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన వారు తమ చదువులు పూర్తి చేసుకుని భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వరసుందరం, ఏఓ సాయిరాం, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
సుశీల్, నర్సింగ్ వివాదాన్ని పరిష్కరించండి
డబ్ల్యుఎఫ్ఐకు ఢిల్లీ హైకోర్టు సూచన న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ మధ్య నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 74కేజీల విభాగంలో ఎవరిని గేమ్స్‌కు పంపాలనే సమస్యకు పరిష్కారం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ), సుశీల్ కలిసి తీసుకోవాలని సూచించింది. రియో ఒలింపిక్స్ సన్నాహక శిబిరంలో తన పేరు లేకపోవడం.. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్స్‌కు సమాఖ్య సుముఖంగా లేకపోవడంతో చివరి ప్రయత్నంగా సుశీల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. కేంద్ర క్రీడా శాఖ, డబ్ల్యుఎఫ్ఐ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ‘సుశీల్ గతంలో దేశం గర్వించదగ్గ విజయాలు సాధించాడు. అలా అని నర్సింగ్ యాదవ్‌ను తక్కువగా చేయలేం. అతడి కృషి వల్లే దేశానికి ఒలింపిక్ బెర్త్ దక్కింది. వ్యక్తిగతంగా ఒకరికి ఇబ్బంది ఎదురైనా.. దేశాన్ని మాత్రం అత్యున్నత స్థాయిలో నిలపాలి. చివరి ప్రయత్నంగా అయితేనే మేం జోక్యం చేసుకుంటాం. ముందుగా డబ్ల్యుఎఫ్‌ఐను నిర్ణయం తీసుకోనిద్దాం’ అని జస్టిస్ మన్మోహన్ అన్నారు. మరోవైపు సుశీల్ కుమార్, డబ్ల్యుఎఫ్ఐ మధ్య నేడు సమావేశం జరగనుంది. -
నర్సింగ్‌లో ఉద్యోగావకాశాలు
కరీంనగర్: హైదరాబాద్‌లోని నైటింగేల్ హోంహెల్త్ సర్వీసెస్‌లో యువతి, యువకులకు నర్సింగ్ అసిస్టెంట్లుగా ఉద్యోగ అవకాశాలున్నాయని డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. పదవతరగతి నుంచి ఏదైనా డిగ్రీ, ఏఎన్ఎం, జీఎన్ఎం చదివి ఉండి, 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు అర్హత గల వారు ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. వేతనం 6 వేల నుంచి 13 వేల వరకు ఉంటుందని చెప్పారు. 8వ తేదీన పూర్తి వివరాలతో ఉదయం 10 గంటలకు ఈజీఎంఎం కార్యాలయం, అం బేద్కర్ స్టడీసర్కిల్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. వివరాలకు 8341516276 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. -
నర్సింగ్ రిజిస్ట్రేషన్లకు బ్రేక్
తెలంగాణ ఎంపీహెచ్డబ్ల్యూలకు ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో అడ్డంకులు {పభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అనర్హులుగా మిగులుతున్న వైనం లబోదిబోమంటోన్న ఐదు వేల మంది విద్యార్థులు హైదరాబాద్: తెలంగాణలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల (ఎంపీహెచ్‌డబ్ల్యూ) కో ర్సుచేసిన నర్సింగ్ విద్యార్థుల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ (ఏపీఎన్‌సీ)లో సాంకేతికపరమైన అడ్డంకులు ఏర్పడటం తో ఈ పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్సు పూర్తిచేసిన ఎంపీహెచ్‌డబ్ల్యూ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా చేరడానికి, ఏఎన్ఎంలుగా పనిచేయడానికి అవకాశం లేకుండా పోతోంది. రెండేళ్లు కష్టపడి చదివాక ఈ దుస్థితి ఏర్పడడంతో వారంతా లబోదిబోమంటున్నారు. పోస్టుల భర్తీ ఉన్నా: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద పెద్దఎత్తున ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ పోస్టుల్లో దాదాపు 80 శాతం ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు పూర్తిచేసిన వారితో భర్తీ చేయనుంది. కానీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో దాదాపు 5వేల మంది ఎంపీహెచ్డబ్ల్యూలు అర్హత కోల్పోయే ప్రమాదముం ది. అంతేగాక ఎవరైనా వేరే దేశాలకు వెళ్లాల్సి ఉన్నా రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో ఇబ్బం దులు పడే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వానికి విన్నవిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని తెలంగాణ నర్సింగ్, పారామెడికల్ సంఘం నాయకులు గోవర్ధన్, నగేశ్ తదితరులు పేర్కొంటున్నారు. ఈ విషయమై తెలంగాణ ఆ రోగ్య, సంక్షేమశాఖ కమిషనర్ జ్యోతిబుద్దప్రకాశ్ను కలసి సమస్యను పరిష్కరించాలని కోరారు. టీ లోగోతో సర్టిఫికెట్ ఇవ్వడం వల్లే తెలంగాణలో సుమారు 150 ఎంపీహెచ్‌డబ్ల్యూ కాలేజీలు ఉండగా అందులో ఏడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆస్పత్రుల్లో నర్సులుగా, ఏఎన్ఎంలుగా పనిచేయడానికి ఈ విద్యార్హత తప్పనిసరి. ఈ కోర్సులో చేరడానికి కనీస విద్యార్హత పదో తరగతి. దీంతో గ్రామాల్లోని పేద విద్యార్థులు సత్వర ఉపాధి కోసం ఈ కోర్సులను ఎంచుకుంటుంటారు. ఈ నేపథ్యంలో 2013 నవంబర్‌లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన దాదాపు 5 వేల మంది విద్యార్థులు ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి పరీక్షలు రాశారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. విభజన తర్వాత తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నర్సింగ్ పరీక్ష బోర్డు ఏర్పాటు చేసి ఈ కోర్సు పూర్తి చేసిన వారందరికీ సర్టిఫికెట్లు జారీచేసింది. అయితే వైద్యరంగంలో డాక్టర్లు ప్రాక్టీసు చేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలన్నా మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఎలాగో నర్సింగ్ కోర్సు చేసిన వారు కూడా తప్పనిసరిగా నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకుంటే వారెక్కడా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేయడానికికానీ వీలుండదు. తెలంగాణ ఏర్పడ్డాక ఏపీఎన్‌సీ విడిపోకపోవడం... తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఏర్పడకపోవడంతో రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీఎన్సీనే రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ తెలంగాణ లోగోతో సర్టిఫికెట్లు ఉన్నందున తాము రిజిస్ట్రేషన్లు చేయబోమని ఏపీఎన్‌సీ చేతులెత్తేస్తోంది. దీంతో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంపీహెచ్డబ్ల్యూలకు సర్టిఫికెట్లు జారీచేసింది. అవన్నీ తెలంగాణ లోగోతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యంకాదు. - రోజారాణి, రిజిస్ట్రార్, ఏపీ నర్సింగ్ కౌన్సిల్