organs
-
అవయవ దానకర్ణులమవుదాం...!
బాగా డబ్బుంటే ఎన్ని రకాల దానాలైనా చేయడం సాధ్యమే. కానీ అవయవదానం అలాకాదు. ఎంతో పెద్దమనసుంటే తప్ప అది సాధ్యం కాదు. అది అనేక మందికి కొత్త జీవితాల్ని ప్రసాదిస్తుంది. ఆ జీవిపై ఆధారపడ్డ అనేక మంది జీవితాలను నిలబెడుతుంది. ఇలా ప్రత్యక్షంగా ఒక్కళ్ల బతుకునే కాకుండా పరోక్షంగా ఎన్నో జీవితాలను కాపాడుతుంది. ఎన్నో జీవితాల్ని కాపాడే అవయవదానంపై అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం. అవయవ దానాలు రెండు విధాలుగా చేయడం సాధ్యం. మొదటిది దాతలు బతికుండగానే ఇవ్వగలిగేవీ, రెండు మృతి చెందాక మాత్రమే సాధ్యమయ్యేవి. జీవించి ఉండగానే ఇవ్వదగ్గ దానాల్లో తేలిగ్గా చేయగలిగేది రక్తదానం. దాతలు రక్తదానం చేసిన 24 గంటల్లోపే మళ్లీ ఆ రక్తం తిరిగి భర్తీ అవుతుంది. ఇలా కేవలం ఒక రోజులో తిరిగి భర్తీ అయ్యే రక్తాన్ని ఇవ్వడానికే దాతలు ఒకపట్టాన ముందుకురారు. ఇక అవయవదానం అంటే ఎంత మంది ముందుకొస్తారో ఎవరికైనా ఊహకు తట్టే విషయమే. మన దేశంలోని వివిధ సాంస్కృతిక నేపథ్యాల కారణంగా అవయవ దానాలు చాలా తక్కువ. వీటికి తోడు చాలామంది చదువుకున్నవాళ్లలోనూ ఉన్న మూఢనమ్మకాల వల్ల అవయవదానం అంత విస్తృతంగా జరగడం లేదు. బతికి ఉండగానే ఇవ్వగలిగేవి...జీవించి ఉండగానే ఇవ్వగలిగిన దానాల్లో ప్రధానమైనది రక్తం. దాదాపు 120 సీ.సీ. రక్తం కేవలం 24 గంటల్లోనే తిరిగి మళ్లీ దాతల ఒంట్లో భర్తీ అవుతుంది. అయితే రక్తంలోని ఇతర కణాలూ, అంశాలూ మళ్లీ పుట్టడానికి ఎనిమిది వారాల సమయం పడుతుంది. అందుకే ఒకసారి రక్తదానం చేసినవారు కనీసం మూడు నెలల తర్వాతే ఇవ్వమని డాక్టర్లు సూచిస్తారు. కాలేయంలో కొంత ముక్క తొలగించినా మళ్లీ పూర్తిగా యథారూపానికి పెరుగుతుంది కాబట్టి కాలేయం వంటి కొన్నింటిని దాత జీవించి ఉండగానే ప్రదానం చేయవచ్చు. ఇక రెండు మూత్రపిండాల్లో ఒక కిడ్నీని బతికి ఉండగానే ఇవ్వడం సాధ్యమే. అయితే ఈ మూత్రపిండాల దానం విషయంలో అనేక అక్రమాలు, అవయవదానం స్వీకరించేవారి నుంచి ప్రలోభాలూ, కిడ్నీ అవసరమైనవారికి అక్రమంగా కట్టబెట్టడానికి అవినీతితో కూడిన వ్యాపారాలూ... అలాంటి అనేక అనుచితమైన విధానాలూ, మోసాలూ వెలుగులోకి రావడంతో ఈ దానంపై సర్కారు అతి కఠినమైన ఆంక్షలు విధించింది. చాలా కట్టుదిట్టమైన నిబంధనల పరిధిలోనే, అందునా రక్తసంబంధీకుల మధ్యనే కిడ్నీ దానాలు జరిగేలా ప్రభుత్వం కట్టడి చేస్తోంది. ఇవేగాక జీవించి ఉండగానే మరికొన్ని అవయవదానాలూ చేయడానికి అవకాశముంది. వాటిలో ఇవి కొన్ని... చర్మం (ఉదాహరణకు అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడ్డవారికి గ్రాఫ్టింగ్ కోసం చర్మం ఉపయోగపడుతుంది) ఎముకలోని మూలుగ (బోన్‌మ్యారో) మూలకణాలు తిరిగి ఆవిర్భవించేలా చేయడానికి బొడ్డుతాడులోని రక్తం రక్తంలోని అంశాలైన ప్లేట్లెట్లు, ప్లాస్మా (ఇందులో ప్లేట్లెట్లు ప్రధానంగా డెంగీ కేసుల్లోనూ, ప్లాస్మా అనే రక్తాంశం అగ్నిప్రమాదాల్లో గాయపడ్డవారికి పనికి వస్తాయి) ఎముకల్లోని కొంత భాగం పేగుల్లోన్ని కొంత భాగం ప్రాంక్రియాటిక్ (క్లోమ) గ్రంథిలో కొంతభాగం. జీవన్మృతుల నుంచి సేకరించగలిగే అవయవాలుకళ్లు / కళ్లలోని నల్లగుడ్డు (కార్నియా) మూత్రపిండాలు (జీవన్మృతుల నుంచి రెండు కిడ్నీలూ సేకరించి అవసరమైన మరో ఇద్దరికి అమర్చడం ద్వారా రెండు ప్రాణాలు కాపాడవచ్చు) కాలేయం ఊపిరితిత్తులు గుండె గుండె కవాటాలు (వాల్వ్స్) పేగులు ప్రాంక్రియాస్ (క్లోమ గ్రంథి) అవయవ ప్రదానాల్లో మన దేశం...భారత పార్లమెంట్లో 1994లో ‘‘ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ – 1994’’ అనే చట్టం రూ΄పొందినప్పటి నుంచి మన దేశంలో అవయవదానాలకు అవకాశం సమకూరింది. ఇక నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓటీటీఓ) అనేది అవయవాల సేకరణ, పంపిణీల విషయంలో మన దేశంలో ఉన్న అత్యున్నత సంస్థ. చట్టబద్ధంగా అనుమతి ఉన్నప్పటికీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జీవన్మృతుల నుంచి జరిగిన అవయవదానాల సంఖ్య 2014లో 6,916 కాగా 2022 నాటికి ఈ సంఖ్య 16,041కి పెరిగింది. ఇలా ఈ సంఖ్య అంతో ఇంతో పెరుగుతూ వచ్చినప్పటికీ...పాశ్చాత్య దేశాలైన యూఎస్, స్పెయిన్ వంటి వాటితో పోలిస్తే ఇప్పటికీ మనదేశం ఎంతో వెనకబడి ఉంది. అంటే 2019 గణాంకాల ప్రకారం... స్పెయిన్‌లో ప్రతి పదిలక్షల మందికి 35.1 (పీఎంపీ... అంటే పర్ మిలియన్ పాప్యులేషన్), యూఎస్‌లో ప్రతి పది లక్షల మందికి 21.9 (పీఎంపీ) అవయవదానాలు చేస్తుండగా మన దగ్గర ఆ సంఖ్య ప్రతి పదిలక్షల మందికి కేవలం 0.65 (పీఎంపీ) గా మాత్రమే ఉంది. (ఒకప్పుడు ఈ సంఖ్య కేవలం 0.34 పీఎంపీ మాత్రమే).యూఎస్ తర్వాత మన దేశంలోనే ఎక్కువగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం కొంతలో కొంత ఆనందించాల్సిన అంశం. దేశంలో కేవలం 13 రాష్ట్రాల్లో మాత్రమే అవయవదానాలు ఓ మోస్తరుగా జరుగుతున్నాయి. మన దేశంలో అవయవదానాల్లో ముందున్న రాష్ట్రాల్లో మొదటిది తెలంగాణ రాష్ట్రం కాగా... తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ అత్యధికంగా అయవయదానాలు జరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణభారత రాష్ట్రాల్లోనే అవయవదానాలు ఎక్కువ. మన దేశంలో అవయవాలు కావలసిన వాళ్లు చాలా ఎక్కువ కాగా... ఆ అవయవాల లభ్యత చాలా చాలా తక్కువ.దాంతో అవయవాలకు భారీ డిమాండు ఉంది. అవయవదానం కోసం ఎదురుచూస్తూ జీవితకాలంలో అవి దొరకనందున కన్నుమూసేవారి సంఖ్య మనదేశంలో చాలా ఎక్కువ. జీవన్మృతుల నుంచి అవయవాలు సేకరించి వాటిని అవసరమైన వారికి అందించడం అనే సమన్వయ కార్యకలాపాలు నిర్వహణలో ‘జీవన్‌దాన్’ అనే సంస్థ కార్యాలయాలు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కృషిచేస్తున్నాయి. ఇవి మృతి తర్వాతే..ఇక దేహంలోని కొన్ని కీలకమైన అవయవాలను కేవలం మృతిచెందాక మాత్రమే ప్రదానం చేయడం సాధ్యమవుతుంది. తాము జీవించి ఉండగానే తమ మరణానంతరం అవయవాలను ప్రదానం చేస్తామంటూ కొందరు ప్రతిన (ప్లెడ్జ్) బూనడం వల్ల ఈ దానాలు సాధ్యమవుతాయి. అలాగే రోడ్డు లేదా ఇతరత్రా ప్రమాదాలకు గురైన కొంతమందిని కొంతమంది నిపుణుల ఆధ్వర్యంలో హాస్పిటల్లో బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటిస్తారు. యాక్సిడెంట్లో తలకు లేదా ఇతరత్రా తీవ్రమైన గాయాలు కావడం దాంతో మెదడు పూర్తిగా దెబ్బతినడం/ మెదడులో రక్తస్రావం కావడం వంటి కొన్ని పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలు జీవించి ఉన్నప్పటికీ వారి మెదడు మృతిచెందుతుంది. ఎలాంటి చికిత్సలతోనూ వీరు తిరిగి జీవించే అవకాశం లేనందున వారి బంధువుల అనుమతితో బ్రెయిన్‌డెడ్ వ్యక్తుల అవయవదానం సాధ్యమవుతుంది. ఇలాంటి జీవన్మృతుల్లో సైతం కొద్దిసేపు శరీరం బతికి ఉన్నప్పుడే అవయవాలను సేకరించగలగాలి. లేకపోతే క్రమంగా శరీరమూ... తర్వాత లోపలి అవయవాలూ మృతిచెందడం మొదలైపోతుంది. ఈలోపే సేకరణ ప్రక్రియ జరగాలి. డా. చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజీషియన్ (చదవండి: నోటిలో నాటే ఇంప్లాంట్స్...) -
రష్యా పైశాచికత్వం!.. ఉక్రెయిన్ సైనికుల శరీర భాగాలతో..
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రష్యా సైనికుల ఆగడాలు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. యుద్ధంలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల అవయవాలను రష్యా అమ్ముకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు.కాగా, ఫ్రీడమ్ టు డిఫెండర్స్ ఆఫ్ మారియుపోల్ గ్రూప్ అధిపతి లారీసా సలేవా తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా సైన్యంలో చేతిలో బంధీలుగా ఉండి చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల బాడీల్లో పలు అవయవాలు మిస్ అయినట్టు గుర్తించారు. అయితే, రష్యాకు సంబంధించిన జైళ్లలో ఉక్రెయిన్ సైనికులకు దారుణంగా హింసించి చంపేశారు. అనంతరం, వారి మృతదేహాలను ఉక్రెయిన్‌కు పంపించారు. అయితే, సైనికుల మృతదేహాలను కుటుంబ సభ్యులు పరిశీలించడంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.సైనికుల శరీరభాగాలు తేడాగా ఉండటంతో పరిశీలించగా.. వారి అవయవాలు దొంగిలించారని గుర్తించాం. రష్యా సైనికులు దారుణాలకు ఒడిగట్టారు. అవయవాలు దొంగతనం చేసిన బ్లాక్ మార్కెట్ వాటిని అమ్ముకున్నారు. ఉక్రెయిన్ ఖైదీలను చిత్ర హింసలకు గురి చేసి చంపి.. వారి అవయవాలతో వ్యాపారం చేస్తోంది. ప్రపంచం మొత్తం ఈ దారుణాల గురించి స్పందించాలి. వెంటనే ఈ దురగతాలను ఆపాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. రష్యా సైన్యం చేతిలో బంధీలుగా మారి విడుదలైన సైనికులు బలహీనంగా ఉన్నారని, వారి ఆరోగ్యం క్షీణిస్తోందని ఓ సైనికుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆమె కోరారు. కాగా, ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. తమపై ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు గడుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు పదివేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు సమాచారం. కాగా, వారంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని సైనికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
లాంగ్ కోవిడ్‌తో అవయవాలకు ముప్పు
లండన్: కోవిడ్–19 మహమ్మా రి బారినపడి, ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగైన వారిలో కూడా అవయవాలు దెబ్బతింటున్నట్లు యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో వివిధ యూనివర్సిటీల సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. లాంగ్ కోవిడ్‌తో శరీరంలోని కొన్ని ప్రధాన అవయవాలు క్రమంగా పనిచేయడం ఆగిపోతున్నట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు. కరోనా బాధితుల మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) స్కానింగ్లతో ఈ విషయం కనిపెట్టినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలకు లాంగ్ కోవిడ్ ముప్పు మూడు రెట్లు అధికంగా పొంచి ఉందని అన్నారు. మనిషిపై దాడి చేసిన కరోనా వైరస్ తీవ్రతను బట్టి ముప్పు తీవ్ర కూడా పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ పత్రికలో ప్రచురించారు. 259 మంది కరోనా బాధితులపై అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక 5 నెలల తర్వాత వారి ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలించారు. కరోనా సోకని వారితో పోలిస్తే వారి శరీరంలోని ప్రధాన అవయవాల్లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించారు. అన్నింటికంటే ఊపరితిత్తులే అధికంగా ప్రభావితం అవుతున్నట్లు తేల్చారు. గుండె, కాలేయం ఏమాత్రం దెబ్బతినడం లేదని గమనించారు. లాంగ్ కోవిడ్‌కు మరింత ప్రభావవంతమైన చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
దారుణం: శస్త్ర చికిత్స చేసినట్లు చేసి..అవయవాలు దొంగలించారు
శస్త్ర చికిత్స కోసం వెళ్లిన ఓ బాలిక శరీరంలో ఏకంగా అవయవాలనే తొలగించేశారు వైద్యులు. దీంతో సదరు బాలిక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిన రెండు రోజులకే చనిపోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలిక పేగు సంబంధిత వ్యాధితో జనవరి 21న అడ్మిట్ అయ్యింది. దీంతో ఆమెకు జనవరి 24న శస్త్ర చికిత్స చేశారు. చికిత్స చేసిన అనంతరం రెండు రోజుల తర్వాత అంటే జనవరి 26న ఆమె చనిపోయింది. తొలుత బాలిక కుటుంబ సభ్యులు సదరు ఆస్పత్రిపై ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయారు. అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఆమె మృతదేహంపై చిల్లులు చిల్లులుగా ఉండి ఏవో సంచులుగా కనిపించాయి. అప్పుడే అనుమానం వచ్చింది మృతదేహం నుంచి అవయవాలు తొలగించి వాటి స్థానంలో ప్లాస్టిక్ సంచులు ఉంచినట్లు అనిపించి వెంటనే వారు ఆ కార్యక్రమాలను నిలిపేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెడికల్‌కి సంబంధించిన కేసుగా నమోదు చేశారు. ఆ బాలికకు శస్త్ర చికిత్స చేసిన హిందూ రావు ఆస్పత్రిపై కూడా కేసు నమోదు చేశారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురుతేగ్ బహుదూర్ ఆస్పత్రి వద్ద ఉంచారు. ఆ బాలికకు పోస్ట్‌మార్టం చేసేందుకు ప్రత్యేక మెడికల్ బోర్డును నియమించాలని పోలీసులు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు డీసీపీ కల్సి ఈ కేసును పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలే: ఉత్తరాఖండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు) -
అవయవదానాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది : మంత్రి హరీష్ రావు
-
చైనాలో వింత ఘటన.. పురుషుడికి అలా ఎందుకు జరుగుతోంది!
చైనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పురుషుడికి(33) గత 20 ఏళ్లుగా రుతుక్రమం అవుతోంది. ఓ రోజు మూత్రంలో రక్తం, తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతడు ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో చికిత్స అందించిన వైద్యులు అతడికి షాకింగ్ వార్త చెప్పారు. అతడికి గర్భాశయం ఉందని, అండాలు విడుదలవుతున్నట్లు తెలిపారు. జీవశాస్త్రపరంగా అతడు మహిళ అని నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా అతడు ఖంగుతిన్నాడు. ఇక, గత 20 ఏళ్ల నుంచి అతడి మూత్రంలో రక్తం వస్తూనే ఉంది. అయితే,యుక్తవయస్సులో ఉన్నప్పుడు మూత్రవిసర్జన సమస్య ఉండడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అతడికి మూత్రంలో రక్తంతోపాటు సాధారణ పొత్తికడుపు నొప్పి వస్తున్నది. ఇటీవల కడుపునొప్పి నాలుగు గంటలకుపైగా కొనసాగడంతో డాక్టర్‌ను సంప్రదించాడు. డాక్టర్ అతడికి అపెండిసైటిస్ అని నిర్ధారించారు. అనతరం ఆపరేషన్ చేసినప్పటికీ కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో.. బాధితుడికి స్కానింగ్ తీయడంతో అసలు విషయం బహిర్గతమైంది. అతడికి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. కాగా, ఆరోగ్యకరమైన వయోజన మహిళల్లో హార్మోన్లు ఎలా ఉంటాయో అలాగే ఉన్నట్లు కనుగొన్నారు. చివరకు రుతుక్రమం వల్లే ఇలా మూత్రంలో రక్తం వస్తుందని నిర్ధారించారు. అనంతరం తనకున్న స్త్రీ పునరుత్పత్తి అవయవాలను అతడు కోరడంతో గత నెలలో అతడికి శస్త్రచికిత్స చేశారు. అది విజయవంతం కావడంతో బాధితుడు సంతోషం వ్యక్తం చేశాడు. Man’s urinary problem leads to intersex diagnosis, told he’s been menstruating @SCMPNews #Intersex #LGBTI #China🇨🇳 https://t.co/gaLA2pXn6C — Chloë M. Smith PhD. (@ChloeMS) July 9, 2022 -
ఐక్యరాజ్యసమితి దినోత్సవం.. చరిత్ర, విశేషాలు
ప్రతి ఏడాది అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ రోజు ప్రాముఖ్యత, ఏవిధంగా ఏర్పాటైంది తదితర విషయాలను స్మృతి పథంలోకి తీసుకురావడమే కాక రాబోయేతరాలకు చాటి చెప్పేలా ఈ దినోత్సవాన్ని అన్ని దేశాలు కలిసి ఘనంగా నిర్వహిస్తాయి. 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ రోజున ఏడాది ఐక్యరాజ్యసమితి వార్షికోత్సవం (ఐక్యరాజ్యసమితి) దినోత్సవంగా నిర్వహిస్తారు. చరిత్ర: 'యునైటెడ్ నేషన్స్' అనే పేరును యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఉపయోగించారు. యూఎన్‌లో ఆరు కీలక విభాగాలు ఉన్నాయి. అవి ప్రధానంగా జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, సెక్రటేరియట్ తదితరాలు న్యూయార్క్‌లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉండగా, అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది. ఐక్యరాజ్య సమితి(యూఎన్) ఏర్పడిన సమయంలో యూఎన్ 51 సభ్య దేశాలను కలిగి ఉంది. ఇందులో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రాముఖ్యత: ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయ శాంతి, భద్రతల దృష్ట్య దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాలన్నింటిని ఏకతాటి పైకి తీసుకొచ్చేలా సమన్వయం చేసే కేంద్రంగా ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. యూఎన్ దినోత్సవ వేడుకలు యూఎన్ దినోత్సవం సాధారణంగా న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ హాల్లో ఐక్యతకు గుర్తుగా అన్ని దేశాలు కలిసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే ఈ ఏడాది యూఎన్ డే ప్రత్యక్ష్యంగా అన్ని దేశాలు వేర్వేరుగా ముందుగా రికార్డు చేసిన ప్రదర్శనలతో ఈ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాయి. ఈ మేరకు అక్టోబరు 21న రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శాశ్వత మిషన్ స్పాన్సర్ చేసిన “బిల్డింగ్ బ్యాక్ టు గెదర్ ఫర్ పీస్ అండ్ ప్రోస్పెరిటీ” అనే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. ‘76 సంవత్సరాల క్రితం విపత్కర సంఘర్షణల నీడ నుండి బయటపడే ప్రపంచానికి యూఎన్ ఆశావాహ దృక్పథంగా ఆవిష్కరింపబడింది. దేశవ్యాప్తంగా ఈ UNని మహిళలు, పురుషులు ఆ ఆశను చిగురించేలా మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్స్పో 2020 దుబాయ్ అక్టోబర్ 24న వివిధ అధికారిక కార్యక్రమాలతో ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని గౌరవ దినంగా జరుపుకుంటోంది’ అన్నారు. -
గుండెతో సహా అమ్మకానికి 'అమ్మ' అవయవాలు
కొచ్చి: తల్లి తన బిడ్డలను నవమాసాలు కడుపులో మోస్తుంది. ఈ లోకంలోకి అడుగు పెట్టాక వారి పెరుగుదల కోసం జీవితాన్నే త్యాగం చేస్తుంది. పిల్లల కన్నా తనకేదీ ముఖ్యం కాదనుకున్న ఓ తల్లి గుండెతో సహా తన అవయవాలను అమ్మకానికి పెట్టింది. అందరినీ కంటతడి పెట్టిస్తోన్న ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న ఆ పేద మహిళ పేరు శాంతి. ఆమెకు ఐదుగురు పిల్లలు. కాయకష్టం చేసి పైసలు సంపాదిస్తున్న ఆమె పెద్ద కొడుకు గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతనికి బ్రెయిన్ సర్జరీ చేశారు. రెండో కొడుకు పుట్టుకతోనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. (కూతురి బర్త్‌డే: ఆ తండ్రి కోరిక ఇదే!) చేయి చాచి అడిగినా సాయం చేయలేదు పదకొండేళ్ల కూతురు కూడా రోడ్డు ప్రమాదంతో నరాల వ్యాధి బారిన పడింది. వీరందరినీ పోషించేందుకు కుటుంబ బాధ్యతను భుజాన వేసుకున్న మూడో కొడుకును లాక్డౌన్ వెక్కిరించడంతో ఉపాధి కోల్పోయాడు. ఆఖరు బిడ్డ ఇంకా స్కూలు విద్యనభ్యసిస్తోంది. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి పిల్లల మందులకు మరింత ఇబ్బంది కాసాగింది. దీంతో ఆ తల్లి సిగ్గు చంపుకుని చేయి చాచి సాయం కోరితే పైసా ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈసారి ఆమె ఎవరి సాయం కోరలేదు. తన అవయవాలను అమ్మి అయినా సరే పిల్లల చికిత్సకు ఏ లోటూ రాకూడదని, ఉన్న అప్పులు తీరిపోవాలని నిర్ణయించుకుంది. ఓ బోర్డును ఏర్పాటు చేసి, దానిపై తన గుండెతో సహా అన్ని అవయవాలను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. ఆమె బ్లడ్‌గ్రూప్ వివరాలను కూడా పొందుపరిచింది. స్పందించిన ప్రభుత్వం ఈ విషయం గురించి శాంతి మాట్లాడుతూ.. "నేను గర్భంతో ఉన్నప్పుడు భర్త వదిలేశాడు. తర్వాత డ్రైవింగ్ టీచర్‌గా పని చేశాను. కానీ అప్పుడే కూతురి ఆరోగ్యం పాడవడంతో ఆమెను చూసుకునేందుకు ఆ పనిని వదిలేయక తప్పలేదు. చాలా రోజులుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. అద్దె కూడా చెల్లించలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాం. నా ముగ్గురు పిల్లలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నాయి. అందుకే నా అవయవాలను అమ్మి వారిని బాగు చేసేందుకు సిద్ధమయ్యాను" అని వాపోయింది. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడి ప్రభుత్వం స్పందించింది. ఆమెను తాత్కాలిక నివాసానికి తరలించింది. ఆమె పిల్లలకు అవసరమయ్యే చికిత్సను, మందుల బిల్లులను కూడా ప్రభుత్వమే భర్తిస్తుందని కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ హామీ ఇచ్చారు. (ఆన్లైన్ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో?) -
11.5 కిమీ.. 9 నిమిషాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ – సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్ మధ్య మార్గం.. అనునిత్యం రద్దీగా ఉంటుంది.. ఈ మార్గంలో వాహనాల సరాసరి స్పీడు గంటకు 25 కిలోమీటర్లు మించదు.. పగటి పూట, పీక్ అవర్స్‌లో ఆ వేగం 20 కిలో మీటర్లకు చేరదు. అయితే ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ మూడు లైవ్ ఆర్గాన్స్ కోసం నగర ట్రాఫిక్ పోలీసులు శనివారం ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. ఫలితంగా ఈ 11.5 కిమీ మార్గాన్ని అంబులెన్స్ కేవలం 9 నిమిషాల్లో అధిగమించింది. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన స్థానిక ట్రాఫిక్ పోలీసుల నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైందని నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ తెలిపారు. వీరి కృషిని అభినందిస్తూ నగర కొత్వాల్ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. ఉదయం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలోని పశ్చిమ, ఉత్తర మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ శనివారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ రోగికి కిడ్నీ, లంగ్స్, లివర్ మార్పిడి చేయాల్సి ఉందని, ఆ శస్త్ర చికిత్స ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుండగా.. డోనర్ ఇస్తున్న ఆ అవయవాలు ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరనుంది అన్నది వాటిలో వినిపించిన సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఉదయం 8 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలయ్యాయి. టీసీసీసీ నుంచి నిరంతర పర్యవేక్షణ.. డోనర్ ఇచ్చిన అవయవాలతో కూడిన బాక్స్‌లను తీసుకువెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 11.5 కిలోమీటర్ల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లేందుకు సిద్ధమైంది. అలా నే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారు లు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించ డానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద యం 8 గంటల నుంచి వీరంతా తీవ్ర ఉత్కంఠతో గడిపారు. ఇదీ ప్రయాణించిన మార్గం.. శనివారం ఉదయం 9 గంటలకు ‘లైవ్ ఆర్గాన్ బాక్స్’లతో కూడిన అంబులెన్స్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి పంజగుట్ట, బేగంపేట రసూల్‌పురా, ప్రకాష్‌నగర్ మీదుగా ప్రయాణించి సరిగ్గా 9.09 గంటలకు కిమ్స్ ఆస్పత్రికి చేరింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో కేవలం 9 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. ఈ కాసేపు అంబులెన్స్ సైరన్‌కు పోటీగా ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్ సెట్స్ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. విలువైన ప్రా ణం కాపాడేందుకు ట్రాఫిక్ పోలీ సులు చూపిన చొరవను ఆ యా ఆస్పత్రి యాజమాన్యాలు కొనియాడాయి. -
80 నిమిషాల్లో 560 కి.మీ ప్రయాణం
రాంగోపాల్‌పేట్: పుణేలోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి లంగ్స్ (ఊపిరితిత్తులు) సేకరించారు... అవి అక్క డి నుంచి చార్టెడ్ ఫ్లైట్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి మినిస్టర్ రోడ్‌లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నాయి. మొత్తం 560 కి.మీ దూరం ప్రయాణానికి కేవలం 80 నిమిషాలు పట్టింది... ఇక్కడ సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తికి ఆ లంగ్స్‌ను అమర్చే చికిత్సను వైద్యులు మొదలుపెట్టారు. పుణే ట్రాఫిక్ పోలీసులు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ద్వారా రెండు ఎయిర్‌పోర్టుల నుంచి రోడ్డు మార్గంలో తరలించే ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమైంది. బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి సేకరించి ఆదివారం ఉదయం పుణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఆ వ్యక్తి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులు అవయవదానం చేసి మరో నలుగురి ప్రాణం పోయాలని మానవత్వంతో ముందుకొచ్చారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఊపిరితిత్తుల దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. జీవన్‌ధాన్ డాక్టర్ స్వర్ణలత, పుణేలో జడ్‌టీసీసీ సెంట్రల్ కో–ఆర్డినేటర్ ఆర్తిగోఖలే.. పుణే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఊపిరితిత్తులను సేకరించి హైదరాబాద్ కిమ్స్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి శస్త్రచికిత్స ద్వారా లంగ్స్‌ను సేకరించారు. పుణే ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు అక్కడి ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. 11 కిమీ దూరం ఉండే పుణే ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది. అప్పటికే ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న చార్టెడ్ ఫ్లైట్ ఆ ఆర్గాన్స్‌తో పుణే నుంచి బయలుదేరి 4.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఆదేశాల మేరకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వరకు బేగంపేట ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి 2.9 కి.మీ దూరం ఉండే కిమ్స్ ఆసుపత్రికి 2 నిమిషాల 5 సెకన్లలో అంబులెన్స్‌లో ఆర్గాన్‌ను చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న కిమ్స్ వైద్యుల బృందం ఆర్గాన్‌ను మరో వ్యక్తికి అమర్చే శస్త్రచికిత్స మొదలెట్టారు. ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి సుమారు 6 నుంచి 8 గంటలు పడుతుందని వైద్యులు చెప్పారు. -
కరోనా : రక్తపు గడ్డలపై కీలక పరిశోధన
కరోనా రోగులు, బ్లడ్ క్లాట్స్‌కు సంబంధించి పాథాలజిస్టులు లేబొరేటరీల్లో నిర్వహించిన పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనాతో బాధపడిన రోగుల్లో ఏర్పడిన రక్తపు గడ్డలు( బ్లడ్ క్లాట్స్) సమస్య కేవలం ఊపిరితిత్తుల్లో కాదు దాదాపు అన్ని అవయవాల్లోనూ ఉందని పెథాలజిస్టులు ప్రకటించారు. కరోనాతో మరణించిన వ్యక్తుల శరీరాలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలను గమనించారు. (కరోనాతో మరో ముప్పు) ఇప్పటివరకూ వైద్యులు భావిస్తున్నట్టుగా పెద్ద నాళాల్లో మాత్రమే కాకుండా, చిన్నచిన్న నాళాలలో కూడా రక్తపు గడ్డలను గమనించినట్టు ఎన్వైయు లాంగోన్ మెడికల్ సెంటర్లోని పాథాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ అమీ రాప్‌కివిచ్ గురువారం రాత్రి వెల్లడించారు. కొంతమంది కోవిడ్-19 రోగుల్లో రక్తం గడ్డకట్టే సమస్య చాలా అనూహ్యంగా వుంటుందని కూడా ఆమె అభివర్ణించారు. అలాగే థ్రాంబోసిస్ (రక్తపు గడ్డలు) కేవలం ఊపిరితిత్తులలో మాత్రమే కాదు, దాదాపు ప్రతి అవయవంలోనూ గుర్తించామని ఆమె చెప్పారు. ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఇతర అవయవాల్లో కూడా వీటిని కనుగొన్నామన్నామని వివరించారు. అలాగే గుండెలో మెగాకార్యోసైట్లు ఉత్పత్తి చేసే ప్లేట్లెట్స్ రక్తం గడ్డలకు కారణమని చెప్పారు. మహమ్మారి ప్రారంభ దశలో, మయోకార్డిటిస్ ఊపిరితిత్తుల్లో మంటను రేకెత్తిస్తుందని వైద్యులు భావించారు. కానీ శవపరీక్షలలో మయోకార్డిటిస్ ఉనికి చాలా తక్కువగా ఉందని రాప్‌కివిచ్ చెప్పారు. ఈ వ్యాధి మనుషుల శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి నిర్వహించిన శవపరీక్షల్లో తాజా విషయాలను గుర్తించినట్టు ఆమె తెలిపారు. అలాగే చిన్న చిన్న నాళాలలో కూడా గడ్డలు ఏర్పడటంపై పరిశోధకులు దృష్టి సారించాలని ఆమె సూచించారు. రాప్‌కివిచ్ పరిశోధనను జూన్ చివరిలో ది లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. కాగా కరోనా రోగుల్లో కనిపిస్తున్న రక్తపు గడ్డలే చాలామంది చనిపోవడానికి కారణమవుతున్నాయని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందిన దశలో వైద్యులు తాము ఊహించిన దానికంటే అధికంగా ఇలాంటి బ్లడ్ క్లాట్స్‌ను ఎక్కువమంది రోగుల్లో చూసినట్టు గత పరిశోధనల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. -
బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవాలు మాయం!
సాక్షి, విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఓ ప్రముఖ ఆస్పత్రి అవయవాలను సేకరించిన వ్యవహారం విశాఖలో వివాదాస్పదంగా మారుతోంది. ఒడిశాకు చెందిన మృతుడి తల్లిదండ్రులు, బంధువులను మభ్యపెట్టి అవయవాలను తీసుకున్నట్లు అందిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. డబ్బులు లేవనడంతో.. 2016 డిసెంబరు 13న ఒడిశాలోని గంజాం జిల్లా జాగాపూర్ గ్రామానికి చెందిన కడియాల సహదేవ్ (32) ఇచ్ఛాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. చికిత్స కోసం బాధితుడిని విశాఖలోని ఓ ఆసుపత్రికి బంధువులు తెచ్చారు. ఐదు రోజుల పాటు వైద్యం అందించిన అనంతరం బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. నిరుపేదలమైన తాము వైద్య చికిత్స వ్యయాన్ని చెల్లించలేమని బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు పేర్కొనడంతో అవయవాలు దానం చేస్తే డబ్బులు కట్టకుండా మృతదేహాన్ని తీసుకెళ్లవచ్చని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. అనంతరం వారి నుంచి సంతకాలు తీసుకుని బ్రెయిన్ డెడ్ అయిన సహదేవ్ నుంచి కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలను సేకరించారు. అనుమతి తీసుకున్నాకే సర్జరీ చేశాం.. ఈ విషయమై ఆసుపత్రి యాజమాన్యం ప్రతినిధి మోహన్ మహరాజ్‌ను వివరణ కోరగా ఈ కేసు ఇప్పటికే కోర్టులో ఉందని, నోటో(నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్) యాక్ట్ ప్రకారం, జీవన్‌దాన్ అనుమతితో అన్ని నియమాలు అనుసరించి ఈ సర్జరీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ‘అన్నిటికీ మృతుడి తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాం. గర్భిణి కావడంతో మృతుడి భార్య రాలేదని చెప్పారు. మృతుడి అవయవాలను జీవన్‌దాన్ అలాట్మెంట్ ప్రకారం వేరే ఆసుపత్రికి తరలించాం. కార్నియాని మోసిన్ ఐ బ్యాంక్ మృతుడి తల్లిదండ్రుల అంగీకారంతో తీసుకుంది. పోలీస్ అనుమతి, ఫోరెన్సిక్ ఇంటిమేషన్, పంచనామా, పోస్టుమార్టం అన్నీ జరిగాయి’ అని చెప్పారు. బీమాకు దరఖాస్తుతో షాక్.. ప్రమాదం జరిగిన సమయంలో గర్భిణిగా ఉన్న బాధితుడి భార్య లక్ష్మీయమ్మ ఆసుపత్రికి రాలేదు. భర్త అంత్యక్రియల అనంతరం బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయగా తిరస్కరణకు గురైంది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సహదేవ్ మృతదేహంలో అవయవాలు లేవని బీమా సంస్థ పేర్కొనడంతో నివ్వెరపోయిన ఆమె జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కమిషన్ ఆదేశాల మేరకు మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యంపై ఏపీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కోరాడ రామారావు తెలిపారు. -
అకస్మాత్తుగా కాలూ– చేయి బలహీనం...కారణమేమిటి?
నా వయసు 30 ఏళ్లు. ఒకరోజు నాకు ఎడమ కాలు, చేయి కదిలించడం కష్టంగా అనిపించింది. అనుమానం వచ్చి డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎమ్మారై చేయించారు. మెదడులో ఒకచోట క్లాట్ ఏర్పడినట్లు తెలిసింది. దాంతో నేను, మా కుటుంబసభ్యులం చాలా ఆందోళనకు గురవుతున్నాం. నాకు ఎందుకిలా జరిగింది? దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చు? పరిష్కారం ఏమిటి? పరిస్థితి తీవ్రతరం కాకముందే మీ సమస్యకు కారణం దొరకడం మీ అదృష్టం. చాలా రకాల కారణాలతో మెదడులో రక్తనాళాలు చిట్లిపోతుంటాయి. తలకు గాయం కావడం వల్ల, రక్తపోటు పెరగడం వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల ఈ విధంగా జరుగవచ్చు. మీరు ఈదే సమయంలో మీకు తెలియకుండానే ఎప్పుడో తలకు గాయం అయి ఉండవచ్చు లేదా వంశపారంపర్యంగా వచ్చే బలహీన రక్తనాళాల వ్యాధి (ఆర్టిరియో వీనస్ మాల్ఫార్మేషన్) కారణంగా ఇది జరిగి ఉండవచ్చు. ఎడమకాలు, చేయి కదిలించడం సాధ్యం కాని స్థితి అనికాకుండా కష్టంగా తోచిందని మీరు చెబుతున్నందున మీ మెదడులో పెద్దవైన ధమనులు కాకుండా రక్తకేశనాళికల్లో ఈ క్లాట్ ఏర్పడి ఉండవచ్చు.ప్రధానంగా మెదడుకు రక్తం సరఫరాచేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి రక్తం అందకపోవడం (ఇస్కిమిక్) లేదా మెదడులోని భాగాలకు వెళ్లే సన్నని రక్తకేశనాళికలు చిట్లిపోవడం (హేమరేజిక్) కారణాల వల్ల మెదడులో క్లాట్స్ ఏర్పడతాయి. కొన్నిసార్లు శరీరంలోని వేరే ప్రాంతంలో ఏర్పడిన క్లాట్స్ రక్తప్రవాహంలో వెళ్లి మెదడులోని సన్నని ధమనల్లో చిక్కుకుపోతాయి. ఈ స్థితిని సెరిబ్రోవాస్క్యులార్ యాక్సిడెంట్ అంటాం. మెదడులో క్లాట్ ఏవిధంగా ఏర్పడనప్పటికీ దాని పరిణామాలు మాత్రం ఒకేవిధంగా ఉంటాయి. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతను నిర్వహిస్తూ శరీరంలోని వేర్వేరు అవయవాలు నియంత్రిస్తుంటాయి. అందువల్ల క్లాట్స్ ఏర్పడిన భాగం తాలూకు మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా నిలిచిపోయి అక్కడి కణాలు పనిచేయడం నిలిచిపోతుంది. అందువల్ల మెదడులో ఆ భాగాలు శరీరంలో నియంత్రించే అంగాలు చచ్చుబడతాయి. నాడుల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. మెదడు క్లాట్ ఏర్పడిన ప్రదేశం, ఆ క్లాట్ పరిమాణాన్ని బట్టి శరీరంలో వివిధ భాగాల్లో ఆ ప్రభవ లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి. హఠాత్తుగా పక్షవాత లక్షణాలు కనిపించవచ్చు. అవికూడా శరీరంలో ఒకవైపునే ఏర్పడతాయి. మెదడులోని కుడిభాగం... శరీరంలోని ఎడమభాగాన్నీ, మెదడులోని ఎడమభాగం... శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తుంటుంది. మీ ఎడమ కాలు, చేయి అదుపుతప్పాయని అంటున్నారు కాబట్టి మీ మెదడులో కుడిభాగంలో క్లాట్స్ ఏర్పడి ఉంటాయి. మీరు వెంటనే చికిత్స చేయించుకోవాలి. మెదడుక్లాట్స్కు ఇప్పుడు చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. మీరు చెప్పినదాన్నిబట్టి మీ క్లాట్ ఉన్నట్లు అనిపిస్తోంది. మందులతోనే దాన్ని కరిగించే అవకాశం ఉంది. ఒకవేళ మందులతో క్లాట్ కరగకపోతే బ్రెయిన్ సర్జరీ ద్వారా క్లాట్‌ను పూర్తిగా తొలగించి, శాశ్వత పరిష్కారం ఏర్పరచవచ్చు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. రక్తపోటు వల్లనో, వంశపారంపర్య కారణాల వల్లనో మీకు ఇది జరిగి ఉంటే భవిష్యత్తులో మెదడులోని ధమనులు హఠాత్తుగా చిట్లిపోయి, మెదడు కణజాలంలోకి రక్తస్రావం అయి, మెదడులోని ఆ భాగం పనిచేయడం నిలిచిపోయి పక్షవాతానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా న్యూరోసర్జన్‌ను సంప్రదించండి. డాక్టర్ జి. వేణుగోపాల్, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట హైదరాబాద్ -
29 కిలోమీటర్లు...22 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి–శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య ఉన్న 29 కిమీ మార్గాన్ని లైవ్ ఆర్గాన్ గుండెతో కూడిన అంబులెన్స్ కేవలం 22 నిమిషాల్లో అదిగమించింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా సిటీ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఇచ్చినట్లు అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ బుధవారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న డోనర్ తన గుండె, ఊపిరితిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతంలోని ఆస్పత్రికి చేరాల్సి ఉందని సమాచారం అందింది. ఆ ఆస్పత్రుల్లో దీన్ని రిసీవ్ చేసుకోవాల్సిన రోగి ఆపరేషన్ మొదలైంది. లైవ్ ఆర్గాన్ గుండెతో కూడిన అంబులెన్స్ మధ్యాహ్నం 12.37 గంటలకు లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దింపారు. దీనికి దాదాపు రెండు గంటల ముందు నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి. డోనర్ ఇచ్చిన గుండెతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 29 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు సైబరాబాద్ అధికారుల సాయం కూడా తీసుకున్నారు. ఆ సమయంలో ఈ రూట్ రద్దీగా ఉంటుంది. దీనికితోడు ఇతర జంక్షన్లలోనూ దూసుకువచ్చే వాహనాల వద్ద ప్రమాదాలు, ఆటంకాలు లేకుండా చూడటానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఓ సబ్–ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధమైంది. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరిన ‘లైవ్ ఆర్గాన్స్ బాక్స్’తో కూడిన అంబులెన్స్ మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ప్రయాణించి సరిగ్గా 12.59 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కాపు కాశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ ఆర్గాన్‌ను వైద్యులు తీసుకువెళ్లిపోయారు. -
ఎరిథ్మియా అంటే ఏమిటి? ఎందుకొస్తుంది?
మా బావ వయసు 42 ఏళ్లు. సిగరెట్లు కాలుస్తాడు గానీ, మద్యం అలవాటు లేదు. కానీ అప్పుడప్పుడు మైకం కమ్మినట్టు కనిపిస్తాడు. కొద్దికాలంగా ఛాతీలో అప్పుడప్పుడు నొప్పి అంటున్నాడు. తరచు శ్వాస తీసుకోడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కొన్నిసార్లు స్పృహ తప్పుతున్నాడు. దాంతో సిటీలో పెద్ద హాస్పిటల్లో చూపించాం. పరీక్షలన్నీ చేసి కార్డియాలజిస్ట్‌ను కలవమన్నారు. ఆయన కొన్ని టెస్ట్‌లు చేసి గుండె ఎక్కువగా కొట్టుకుంటోంది. అరిథ్మియా వ్యాధి అని నిర్ధారణ చేశాడు. హైదరాబాద్ వెళ్లిఎలక్ట్రోఫిజియాలజిస్ట్ను కలవమన్నారు. మాకు గాభరాగా ఉంది. అసలీ గుండెజబ్బు ఏమిటి? ఎందుకొస్తుంది? చికిత్స ఉందా? ఆందోళనలో ఉన్నాం. దయచేసి వివరంగా తెలియజేయండి. మన గుండెకు ప్రత్యేకమైన విద్యుత్ వ్యవస్థ ఉంటుంది. గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గుండె సంకోచవ్యాకోచాలు చెందాలి. నిర్దిష్ట సమయానికి అందే విద్యుత్ ప్రేరణలతోనే ప్రతీసారీ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే గుండెలోని విద్యుత్ చర్యలే గుండె స్పందనలను ప్రేరేపిస్తుంటాయన్నమాట. గుండె కొట్టుకోడాన్ని నిర్ణయించే విద్యుత్ ప్రేరణలలో హెచ్చుతగ్గులు ‘ఎరిథ్మియా’కు దారితీస్తాయి. అంటే గుండె ఎక్కువగానో లేదా తక్కువగానో కొట్టుకోవడం జరుగుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయాన్నీ కలిగించవచ్చు. గుండె రక్తాన్ని సరఫరా చేసే తీరిది... గుండె పూర్తిగా కండర నిర్మిత అవయవం. ఇది శరీర భాగాలకు ప్రతిరోజూ 16,000 లీటర్లకు పైగా రక్తాన్ని పంప్ చేస్తుంటుంది. శరీరపు మూలమూలా ఉన్న అతి చిన్న రక్తకేశనాళికల (క్యాపిల్లరీస్) వరకూ చేరే విధంగా రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంటుంది.గుండె కుడి–ఎడమ భాగాలలో రెండేసి గదులు ఉంటాయి. వీటిలో పైభాగంలోని వాటిని ఏట్రియా అని, కింద ఉన్న వాటిని వెంట్రికల్స్ అని అంటారు. శరీరంలోని వివిధ అవయవాల నుంచి గుండెకు వచ్చిన రక్తం... దాని కుడి ఏట్రియమ్‌లోకి చేరుతుంది. తర్వాత దాని కిందనే ఉన్న కుడి వెంట్రికల్‌లోకి ప్రవహిస్తుంది. రక్తం అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి పంప్ అవుతుంది. అక్కడ రక్తం ఆక్సిజన్‌లో శుద్ధి అవుతుంది. శుద్ధమైన రక్తం గుండెలోని ఎడమ ఏట్రియమ్‌లోకి వెళ్తుంది. అక్కడి నుంచి ఎడమ వెంట్రికల్కు చేరుకుంటంది. ఎడమ వెంట్రికిల్ శుద్ధ రక్తాన్ని శరీర భాగాలన్నింటికీ పంప్ చేస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గుండెలో సంకోచ వ్యాకోచాలు ఓ క్రమపద్ధతిలో పూర్తిగా లయబద్ధంగా జరగాలి. నిర్దిష్ట సమయానికి అందే విద్యుత్ ప్రేరణలతోనే ప్రతిసారీ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రేరణ మొదట కుడి ఏట్రియమ్లో ‘సైనల్ నోడ్’ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి విద్యుత్ తరంగాలు తీగలాంటి ప్రవాహకాలుగా పనిచేసే ప్రత్యేక కండరాల ద్వారా గుండెలోనే ఉన్న ఏట్రియో–వెంట్రిక్యులార్ నోడ్ (ఏవీఎన్)కు చేరతాయి. ఇక్కడి నుంచి విద్యుత్తు వెంట్రికల్స్కు ప్రవహించి అవి సంకోచించేటట్లు చేస్తుంది. దాంతో రక్తం అన్ని శరీర భాగాలకు పంప్ అవుతుంది.విద్యుత్ ప్రేరణలతో ఈ విధంగా ఒక చక్రభ్రమణంలా సాగే ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒకసారి గుండె స్పందనగా పరిగణిస్తారు. ఈ విద్యుత్ ప్రరసణ ప్రక్రియలో ఎలాంటి ఆటంకం ఏర్పడినా అది గుండె స్పంనల్లో లోటుపాట్లకు కారణం అవుతుంది. దీనివల్ల గుండె ఎక్కువసార్లు కొట్టుకోవడమో (ఈ కండిషన్‌ను టాకికార్డియా అంటారు) లేదా తక్కువ సార్లు ప్రతిస్పందించడమో (దీన్ని బ్రేకికార్డియా అంటారు) జరుగుతుంది. గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్యలు సైనల్ నోడ్, ఏవీనోడ్ లేదా విద్యుత్ ప్రసారం చేసే కండరాలలో లోపాల వల్ల ఏర్పడతాయి. గుండె అతి వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకుంటూ ఉంటే శరీర భాగాలకు రక్తసరఫరా దెబ్బతింటుంది. దాంతో మైకం కమ్మినట్టుగా ఉంటుంది. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, స్పృహతప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమస్య నిర్ధారణ ఇలా... గుండెకు సంబంధించిన విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అది సాధారణ స్థాయికంటే ఎక్కువసార్లో లేదా చాలా తక్కువ పర్యాయాలో కొట్టుకుంటుంది. ఎలక్ట్రోఫిజియాలజీలో గుండె విద్యుత్ వ్యవస్థ పనితీరును సమీక్షించే పరీక్షలు నిర్వహించి, గుండె స్పందనల్లో అసాధారణ స్థితి ఏదైనా ఉందేమో తెలుసుకుంటారు. గుండెలోకి వెళ్లే రక్తనాళాల ద్వారా కాథటర్లు, వైర్ ఎలక్ట్రోడ్లను ప్రవేశపెట్టడం ద్వారా దాని విద్యుత్ చర్యలను పరిశీలించగలుగుతారు. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులకు కారణాలు ఏమిటో తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తిలో గుండె పనితీరును మళ్లీ మాములు దశకు (నార్మల్కు) తెచ్చేందుకు అవసరమైన చికిత్సా వ్యూహాన్ని నిర్ణయిస్తారు. అందుబాటులో మంచి చికిత్స... మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ బావగారికి వచ్చిన సమస్యను చక్కదిద్దే ఎలక్ట్రోఫిజియాలజీ విభాగం ఎంతగానో అభివృద్ధి చెందింది. గుండె విద్యుత్‌క్షేత్రంలో లోటుపాట్లను సరిదిద్దే అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అరిథ్మియాకు సాధారణ మందులతో చికిత్స చేస్తారు. గుండె స్పందనలు సాధారణ స్థితికి చేరుకునేందుకు వేర్వేరు మందులను సిఫార్సు చేసి, వాటితో గుండె ఏ మేరకు సాధారణ స్థితికి చేరుకుంటుదో పరిశీలిస్తారు. క్యాథటర్ అబ్లేషన్, కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ అనే ప్రక్రియలను అనుసరిస్తారు. అవసరాన్ని బట్టి కార్డియోవర్టర్, డిఫిబ్రిలేషన్, పేస్‌మేకర్ వంటి ఇంప్లాంట్స్‌ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలో వచ్చే విపరీత వ్యత్యాసాల వల్ల ఏర్పడే అనారోగ్యాలకు ఇప్పుడు ఎలక్ట్రోఫిజియాలజీతో సరైన చికిత్స అందుబాటులో ఉంది. దీంతో గుండె సమస్యలు వచ్చిన ఆ వ్యక్తి ఎలాంటి రాజీ లేకుండా పూర్తిస్థాయిలో సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది. డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
సాయి వాణి యదార్థ భవిష్యవాణే
ఎన్ని అవయవాలు మన శరీరంలో దాగి ఉన్నా.. మనం ఎవరమో, ఎలాంటి లక్షణాలు కలవాళ్లమో ఎదుటివాళ్లకి తెలియపరచుకునేందుకు లేదా తెలిసేందుకు అదే విధంగా ఆ ఎదుటివాళ్లని గురించిన ఓ అవగాహన మనకి కలిగేందుకూ ప్రధానంగా సహకరించేది నోరు మాత్రమే. ఆ నోటి నుంచి వెలువడే మాట ప్రకారమే కార్యకలాపాలన్నీ సాగుతాయి.అయితే ఈ మాటని సంస్కృత భాషలో ‘వాక్కు’ అంటారు. ఆ వాక్కుని వినగానే దాని నుంచి వచ్చే భావాన్ని ‘అర్థం’ అంటారు. ఈ వాక్కు, అర్థం అనే రెండింటి గురించీ అలాగే రెండింటి మధ్య ఉండే సంబంధం కొద్దిపాటిగా తెలిస్తే తప్ప ఈ వ్యాసం, తద్వారా సాయితత్త్వం మనకి తెలియదు. కాబట్టి క్లుప్తంగా తెలుసుకోవలసిందే. లౌకికానాం హి సాధూనా మర్థం వాగనువర్తతేఋషీణాం పునరాద్యానాం వాచ మర్ధోను ధావతిఇది మహాకవి చెప్పిన మాట.లౌకికులమైన మనం ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు, అది ఏ విధంగా ఎదుటివాడికి అర్థాన్నియ్యాలో, ఎలా బోధపడాలో దాన్నంతా ముందుగా మనం ఆలోచించి, అనుకుని, అదే అర్థం వచ్చేలా దానికి సరిపోయిన మాటల్ని (వాక్కు) ఒకచోట చేర్చి ఆ మాటలనే మాట్లాడతాం.‘అయం ఘటః’ ఇది ఓ కుండ అని ఈ మాటకి అర్థం. ‘నల్లగా ఉన్నదీ, ఏదో ఓ వస్తువుని దానిలో ఉంచుకునేందుకు వీలైనదీ, మట్టితో చేయబడినదీ అయిన ఇది కుండ’ అని ఇంత అర్థాన్ని లోపల అనుకుని దానికి సరిపడిన ఘటం (కుండ) అనే వాక్కుని అంటాం. ఇది మనకి అనుభవంలో తెలిసిన విషయం– నిత్యవ్యవహారంలో సాగుతున్న అంశం కూడా.అదే మరి ఋషులుగానీ మాట్లాడవలసివస్తే.. వాళ్లు మనలా అర్థాన్ని లోపల కుదుర్చుకుని, దానికి సరిపడ్డా వాక్కులని (మాటల్ని) కూర్చుకుని మాట్లాడరట. వాళ్లు ముందుగా వాక్కుని (మాటని) అనేస్తారు. ఆ మీదట ఆ వాక్కుని బట్టి అర్థం ఏర్పడుతుందట. కద్దిగా వివరించుకుంటే.. ఓ ఋషి ఓ వ్యక్తిని ‘త్వం రాక్షసో భవ!’ నువ్వు రాక్షసుడివి అయిపోదువుగాక! అని అన్నట్లయితే, ఆ ఋషి ఈ వ్యక్తిని చూసి ముందుగా ఈ అర్థాన్ని లోపల అనుకుని దానికి సరిపోయినట్లుగా వాక్కులని అనడమన్నమాట. కడుపు మండిన ఆవేదనతో ఈ వాక్కులని అనగానే ఎదుటివ్యక్తిలో రాక్షస లక్షణాలు(కోరలూ, కొమ్ములూ మిడిగుడ్లూ, భయంకర వికృతదేహం, తుమ్మముళ్లు వంటి రోమాలూ, వికటాట్టహాసం...) అలా చూస్తూ ఉండగానే ఒకటికొకటిగా ప్రవేశిస్తూ క్షణాల్లో రాక్షసుడిగా అతడు కనిపించేస్తాడన్నమాట. ఇలాంటి సంఘటనలని మనం నిత్యం అనేక పురాణకథల్లో వింటూనే ఉంటాం కదా!సాయి చరిత్రతో ఏమిటి సంబంధం?ఇదేదో వినడానికి బాగానే ఉంది గానీ.. దీనికీ– సాయి చరిత్రకీ సంబంధమేమిటి? అని అనిపిస్తుంది కదా! ఏ ఋషులైతే రాబోయే సంఘటనలని తమ తపశ్శక్తితో ముందుకు ముందే దర్శించగలరో అలాంటి శక్తే సాయికి కూడా ఉందనే విషయాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించడానికీ, అలా నిరూపించి సాయి తపశ్శక్తి స్థాయి ఎంతటిదో తెలియజేయడానికీనూ.ఈ తీరుగా నిరూపించని పక్షంలో– సాయికి రాబోయే కాలంలో ఏం జరగబోతోందో ఎలా తెలుసు? అని ఎవరైనా అడిగితే – ఆయన దేవుడు గదా! ఆయనకి తెలియనిదేముంటుంది? అని టక్కున సమాధానం చెప్పేస్తారు. ఇంకాస్త లోతుకి దిగి అవతలి వ్యక్తి ‘ఆయనే గనుక దేవుడయ్యుంటే ఎవరికీ కనిపించకుండా ఉండాలిగా!? తన దైవమహిమతో ఎవరికీ అసలు కష్టాలే రాకుండా చేసేయొచ్చు కదా!? అయినా కాలకృత్యాలు చేస్తుండే ఎవరూ దైవం కానేకాడంటూ మీ పురాణాలే చెప్పాయిగా!?’ అంటూ ప్రశ్నిస్తే సమాధానాన్ని చెప్పలేక – అలా మాట్లాడితే కళ్లుపోతాయి! అయినా ఇలాంటి దుర్విమర్శలని విన్నా కూడా పాపమే! అంటూ వెళ్లిపోతూ కనిపిస్తారు ఎందరో భక్తులు. ప్రతి పనికీ ఒక హేతువు ఉండి తీరుతుంది. ఆ దృష్టితో దాదాపుగా ఎవరూ ఆలోచించరు. సాయి నిజానికి మనిషే అయినా ఆ అతీంద్రియ శక్తి ఎలా వచ్చింది అనే ధోరణితో ఆలోచిస్తేనూ, ఆ అతీంద్రియశక్తికి సంబంధించిన సాక్ష్యాలని తెలుసుకుంటేనూ ఆయన ఎలా అందరికంటే ఉన్నతస్థితిని సాధించగలిగాడో మనకి అర్థమవుతుంది. దాంతో సాయి గురించి చేసే దుర్విమర్శలనీ, అలాగే వ్యతిరేక ప్రచారాలనీ తిప్పికొట్టగలగడమే కాక, హేతుబద్ధమైన సమాధానాలని చెప్పి సాయికున్న గొప్పదనాన్ని ధైర్యంగా నిరూపించగలం. అందుకే సాయికున్న అతీంద్రియశక్తి ఎలా ఆయనకి లభించిందో మనం తప్పక తెలుసుకుని ఉండాల్సిందే! ఈ దృష్టితో పరిశీలిస్తున్నాం కాబట్టి ముందుగా ఆయనకున్న అతీంద్రియ శక్తిని నిరూపించే ఒకటి రెండు సంఘటనలని వివరించుకుని, ఆ శక్తి లభించడం వెనకున్న కారణాన్ని తెలుసుకుందాం! ఆగవయ్యా బాబూ! ఆగు!! సాయి తన మసీదుకి ఎవరొచ్చినా జాతి, మత, కుల, స్త్రీ, పురుష, ముసలి, యువక, వితంతు భేదాలని వేటినీ పరిగణించకుండా అందరినీ – భోజనం చేసి మాత్రమే వెళ్లండి – అని చెప్పేవాడు. దాదాపుగా భోజన సమయానికి వచ్చి ‘రైలు వెళ్లిపోతుంది... అవతల పనుంది...’ అంటూ ఎవరైనా వెళ్లినట్లయితే అనుకున్న రైలు దాటిపోవడం లేదా ఆలస్యం కావడం కారణంగా ఇటు భోజనం అటు ప్రయాణమనే రెండూ సాగక కచ్చితంగా ఇబ్బందికి గురవుతూ ఉండేవారు భక్తులు. ఇది ఏ ఒక్కరికో కలిగిన అనుభవం కాదు. అందుకే సాయి మాటని వింటే దాన్ని ఓ ఆదేశంగానే భావించే వారు తప్ప ఎవరూ ధిక్కరించి వెళ్తూ ఉండేవారు కానే కాదు. అందరినీ ఉద్దేశించి చెప్పే మాట కంటే ప్రత్యేకంగా ఎవరితోనైనా సరే ఏదైనా చెప్తే ఇక ఆ మాటకి పర్యవసానం మరింత తీవ్రంగా ఉండేది. పాటిల్ తాత్యాకోతే అనే సాయి సన్నిహిత భక్తుడు వారం వారం జరిగే సంతకి వస్తూ ఉండేవాడు. ఆ వచ్చినప్పుడు సాయిని దర్శించి షిర్డీకి 3 మైళ్ల దూరంలోని కోపర్గావ్ సంతకి వెళ్తూండేవాడు. అలా ఒకసారొచ్చి వీధిలోనే టాంగాని నిలిపి సాయి వద్ద కొచ్చి పాదాభివందనం చేసి తాను వెళ్లడానికి అనుమతినీయవలసిందని సాయిని కోరాడు. సాయి చిరునవ్వు నవ్వుతూ – ‘ఎందుకలా తొందరపడుతూ టాంగాని కూడా అక్కడే నిలిపి.. వచ్చీ రాగానే వెళ్లిపోతావెందుకు? కాస్త ఆగవయ్యా బాబూ! ఆగు! ఒక్క నిముషం ఉండు! సంతదేముంది? ఎక్కడికీ పోదు! తర్వాత వెళ్దువుగానీ ఆగు! ‘ఇప్పుడు మాత్రం నువ్వు షిర్డీని దాటి ఊరు బయటికెళ్లకు!’ అని ఇంత వివరంగా అన్నాడు అతనితో. అయినా పాటిల్ తొందరని తన ముఖంలో చూపిస్తూ మళ్లీ ఓ నమస్కారాన్ని చేసి – తప్పనిసరిగా వెళ్లాల్సిందే! – అనే నిర్ణయంతో మసీదుమెట్లని దిగుతూ ఉంటే సాయి గమనించాడు. ‘సరే! తొందరగా వెళ్లాలంటున్నావుగా! శ్యామాని నీ వెంట తీసుకెళ్లు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకు!’ అని మళ్లీ అన్నాడు సాయి. అలా రెండుమార్లు సాయి వద్దేవద్దని చెప్పడంలోని ఆంతర్యం పాటిల్‌కి అర్థం కాలేదు. సాయి కూడా వివరించి చెప్పనూ లేదు.సాయి మాటని ఓ ఆజ్ఞగా భావించే శ్యామా ఈ పాటిల్‌తో బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉంటే.. అంత అవసరమేముంది? వద్దులే! అన్నట్లు చేసంజ్ఞ చేసి చెప్తూ తానొక్కడే బయలుదేరాడు కోపర్గావ్ అనే సంత జరిగే ప్రదేశానికి. టాంగాకున్న రెండు గుర్రాల్లో ఒక దాన్ని ఈ మధ్యే కొన్నాడు. దానికి వేగంగా పరిగెత్తి తన శక్తిని చూపించుకోవాలనే అత్యుత్సాహం తప్ప మరేదీ తెలియదు. టాంగాని అదిలించగానే బయలుదేరాయి గుర్రాలు.తీవ్రమైన వేగంతో గుర్రాలు పరుగెత్తడం ప్రారంభించాయి. ఎత్తుపల్లాల గురించి పాటిల్ పగ్గాలు లాగి వేగాన్ని తగ్గించాడు. మళ్లీ ఆ పల్లాన్ని దాటాక చురుగ్గా లాగవలసిందని సూచించడం కోసం గుర్రాలు రెండింటినీ తన చేతి కొరడాతో పెద్ద దెబ్బ తగులకుండా కొట్టాడు. మొదటి గుర్రానికి ‘కొరడా – దానితో కొడతారు’ అనే జ్ఞానముంది గానీ.. ఈ కొత్తగా వచ్చిన రెండో గుర్రానికి ఆ ఆలోచన లేదు– అదే ప్రథమానుభవం కావడంతో. అంతకుముందు రెండు మూడు సంతలకి వెళ్లిన కారణంగా ఆ తోవ ఈ రెండో గుర్రానికి తెలిసి అదే మార్గంలో వెళ్తున్నా – ఈ కొరడా దెబ్బ తనకి మొదటిసారి అయ్యేసరికి విపరీతమైన వేగంతో పరిగెట్టేది కాస్తా ఒక్కసారిగా మోకాళ్ల మీద కూచుండిపోయింది. దాంతో టాంగా మొత్తం ఓ పక్కకి ఒరిగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన అయిన కారణంగా పాటిల్‌కి నడుము విరిగినట్లే అనిపించింది. ఏం జరిగిందో అర్థం కావడానికి రెండు మూడు నిమిషాలు పట్టింది.మెల్లగా టాంగాని దిగాడు పాటిల్. ఇక ఎవరూ తనకి గుర్తు రాలేదు. సాయి మాటలే చెవిలో వినపడసాగాయి. ‘ఆగవయ్యా బాబూ ఆగు!... పోనీ నీతో శ్యామాని కూడా తీసుకెళ్లుతోడుగా! ఒంటరిగా మాత్రం వెళ్లకు! ఊరుదాటి బయటికి వెళ్లకు!’ అనేవే. పాటిల్‌కి సాయి మాటల్లోని అర్థం, భావార్థం, తాత్పర్యం కూడా స్పష్టంగా తెలిసినట్లయింది. తానే తనలో చిరునవ్వు నవ్వుకున్నాడు– సాయిని గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు చేశానా? అని. వెంటనే సాయినామస్మరణని అనేక పర్యాయాలు చేసుకుని, సంతపని చేసుకుని కృతజ్ఞతలని సాయికి మనసులోనే తెలియజేసుకుంటూ ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లిపోయాడు. ఇదేమిటి? మళ్లీ చేశానా?ఈ సంఘటన జరిగి కొంతకాలం అయిపోయింది. మళ్లీ ఇదే పాటిల్ షిర్డీకి సమీపంలో ఉన్న ‘కొల్లార్’ అనే గ్రామానికి టాంగా మీద బయలుదేరాడు. మార్గం మధ్యలో ఉన్న షిర్డీకి వెళ్లి మసీదులో ఉన్న సాయిని దర్శించి పాదాభివందనం చేసి సాయి ఆజ్ఞ కోసం కళ్లలోకి చూస్తూ – ‘దేవా! ఇలా వెళ్లి అలా తిరిగొచ్చేస్తాను’ అన్నాడు నోరు తెరిచి. సాయి ఆ పాటిల్‌ని చూస్తూ ‘వెళ్లు అనలేదు, వెళ్లద్దు అని కూడా అనలేదు. వెళ్లద్దని కిందటిసారిలా అనలేదు. ‘అంతే కాకుండా మరొకరిని తోడుగా తీసుకెళ్లు అదీ కాక ఊరిని దాటి వెళ్లద్దు’ వంటి మాటలేమీ అనలేదు. దాంతో పాటిల్ దాన్ని సాయి వ్యతిరేకత అలాగే సాయి ఆజ్ఞా అనే రెండు లేనట్లుగా భావిస్తూ బయల్దేరాడు పూర్వంలాగానే. పూర్వపు టాంగా కాదిది. ఇది దానికంటే చిన్నది. అంతేకాక తేలికైనది కూడా. గుర్రాలు మాత్రం బలిష్ఠంగా ఉన్నవి. యవ్వనంలో కూడా ఉన్నవీ అయిన కారణంగానూ, టాంగా తమకి సరిపోయిన బలంగా ఉన్నది కాకపోయిన కారణంగానూ వేగంగా లాగుతూ పరిగెత్తసాగాయి. రెండింటికి రెండూ పోటీపడుతూ గోతులు, గొçప్పులు, చిన్న చిన్న నీటి కాలవలూ వచ్చినా కూడా లెక్కచేయకుండా పరిగెత్తేయడంతో పాటు వేగాన్ని తగ్గించడం కూడా లేకుండా సాగిపోతూ సాగిపోతూ పెద్ద గోతిలో కూలబడిపోబోయి ఓ క్షణంలో పక్కకి తిరిగి మార్గం పక్కన ఉన్న తుమ్మచెట్టుని గుద్దుకుని ఆగిపోయాయి. తుమ్మ చెట్టు విరిగిందంటే గుర్రాల వేగాన్ని లెక్కించుకోవచ్చు. టాంగా కూడా బాగా దెబ్బతింది. అక్కడి నుండి తిరిగి పాటిల్ తన గ్రామాన్ని చేరడానికి çపడ్డ శ్రమ ఇంతా అంతా కాదు.తన నడుం విరక్కుండా, కాళ్లూ చేతులూ ఇతర భాగాలకీ ఏ దెబ్బలూ తగలకుండా సాయిౖ దేవుడే రక్షించాలనే దృఢవిశ్వాసం కలిగిన పాటిల్ ఇక ఎప్పుడూ సాయి ఆజ్ఞని పాటించి తీరాల్సిందే! అని దృఢనిశ్చయానికి వచ్చేశాడు. సాయి మాట్లాడిన ప్రతి మాటనీ బాగా విశ్లేషించుకుని స్పష్టంగా అర్థం చేసుకున్నాకనే ఏ పనినైనా చేయాలని నిశ్చయించేసుకున్నాడు. అప్పుడనుకున్నాడు పాటిల్– ఇదేమిటి? ఒక్కసారి బుద్ధొచ్చాక కూడా మళ్లీ ఇదే తప్పు చేశానా? అని.మరొక్క సంఘటనఒకసారి ఒక ఆంగ్లేయుడు సాయి దర్శనానికొచ్చాడు. ఒకరి నుంచి సిఫారసు ఉత్తరం కూడా తీసుకొచ్చి బాబాను దర్శించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు అక్కడి వారితో. వారంతా అన్నారు ‘సాయి అనుమతీ, ఆజ్ఞా లేనిదే మసీదు మెట్లని ఎక్కనేలేవు’ అని. మూడు మార్లు తీవ్ర ప్రయత్నం చేసినా సాయి అనుమతినీయలేదు.3 రోజుల పాటు ఓ గుడారాన్ని వేసుకున్నా అతనికి సాయి అనుమతి లభించనే లేదు. ఇక నిరాశతో ఇంటికి వెళ్లిపోదామనుకున్న వేళ – మెట్లు దిగి వెళ్తున్న సాయి దర్శనం అతనికి లభించింది. అనుమతిని కోరాడు సాయిని. – ‘అంత తొందరెందుకు? రేపు వెళ్లచ్చు కదా!’ అన్నాడు సాయి అతనితో. అయినా అతను ‘‘4 రోజుల పాటు ఉన్నాను. దర్శనం కూడా అయ్యింది. ఇంకా దేనికి ఉండటం?’’ అనుకుంటూ బయల్దేరబోతుంటే– భక్తులందరూ సాయి అనుమతిని పొందాకే వెళ్లడం మంచిదని ఏకగ్రీవంగా చెప్తూ ఒకటి రెండు దుస్సంఘటనలని వివరించి చెప్పారు కూడా! అయినా అతడు విరమించలేదు ప్రయాణాన్ని.ఆ ఆంగ్లేయుడు టాంగాని ఎక్కి వెళ్తూ ఉంటే గుర్రాలు మొదట్లో మెల్లగానే ప్రయాణించసాగాయి. తర్వాత వేగాన్ని పుంజుకున్నాయి. అలా వెళ్తూన్నప్పుడు ఓ వ్యక్తి సైకిలు మీద గుర్రాలకి అడ్డంగా మార్గాన్ని దాటుతూ వేగంగా వెళ్లిపోయాడు. ఎప్పుడూ అలాంటి రాకని ఎరుగని గుర్రాలు ఒక్కసారిగా బెదిరిపోయాయి. దాంతో టాంగా అదుపు తప్పింది. ఆంగ్లేయుడు నేలమీద పడిపోయాడు. లేచే సత్తువ లేకపోయింది. ఎవరో సహాయపడి మొత్తానికి అతడ్ని అతను కోరిన చోటుకి పంపారు. ఆసుపత్రిలో పడి కొంతకాలం పాటు చికిత్స చేయించుకున్నాడు కూడా.అప్పుడు అతనికి అర్థమైంది – సాయి వాక్కుకి ఉన్న శక్తి ఏమిటో!ఎక్కడిది ఈ శక్తి?‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ ఏ దైవనామాన్నయితే నిరంతరం మననం చేస్తారో ఆ కారణంగా అలా మననం చేసిన వ్యక్తికి ఓ శక్తి వచ్చి చేరుతుంది. ఆ శక్తి ఆ తీరుగా మననం చేసిన వ్యక్తి మాటలోకి వెడుతుంది. దాంతో ఆ వ్యక్తికి జరగబోయే సంఘటనతో పాటూ తాను ఏదంటే అదే జరిగే అతీంద్రియశక్తి అబ్బుతుంది. అందుకే అలాంటి వ్యక్తులు మనలా కాక ఆచి తూచి మాట్లాడుతూ ఉంటారు.సాయి నిరంతరం ‘అల్లాహ్ హో మల్లిక్!’ అనే నామాన్నే ఒకప్పుడు 12 ఏళ్ల పాటు నేలమాళిగలో, ఆ మీదట వేపచెట్టు కింద, ఆ తర్వాత అడవిలో, ఆ తర్వాత కూడా ఎప్పుడూ విరామం దొరికితే అప్పుడు మననం చేస్తూ ఉండటంతో ఆ శక్తి వాక్కుకొచ్చింది. అదీ నిజమైన కారణం– అదే యథార్థ కారణం.పైవారం సాయి మసీదులో కనిపించే హిందూ సంప్రదాయాలు (సాయిలో సన్యాసధర్మం మసీదులో హైందవ ధర్మం).– సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
మెదడులోని గడ్డలు మళ్లీ మళ్లీ వస్తాయా?
నా వయసు 40 ఏళ్లు. విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాను. హాస్పిటల్లో చూపించుకుంటే టెస్ట్‌లన్నీ చేసి, మెదడులో గడ్డ ఏర్పడినట్టు గుర్తించారు. బ్రెయిన్ ట్యూమర్లకు సర్జరీ చేయించుకున్నా అవి పూర్తిగా పోవని విన్నాను. నిజమేనా? ఈ గడ్డలను నిర్మూలించడం సాధ్యం కాదా? దయచేసి వివరంగా తెలియజేయండి. మీరు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ గురించి ఈ రోజుల్లో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలతో ట్యూమర్ శస్త్రచికిత్స చాలా సురక్షితమే. మెదడులోని గడ్డలను సమూలంగా తొలగించవచ్చు. మెదడులో ట్యూమర్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి బినైన్ ట్యూమర్లు, మెలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి కేంద్ర నాడీమండలం (సీఎన్ఎస్)లోని పలురకాల కణాల నుంచి ఏర్పడతాయి. మెదడు గడ్డల్లో బినైన్ ట్యూమర్లు మెదడులో లోతుగా పాతుకుపోయి ఉండవు. ఈ రకమైన ట్యూమర్లు క్యాన్సర్ కారకమైనవి కావు. అందువల్ల బినైన్ ట్యూమర్లు ఉన్న ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడం సులువు. పైగా వీలైతే వీటిని తేలిగ్గా పూర్తిగా తొలగించి వేయగలగడం సాధ్యమే. అయితే ఒక్కోసారి వీటిని సర్జరీ చేసి తీసివేసినా మళ్లీ అవి తిరిగి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. ఈ గడ్డలు చురుకైనవి కావు. అందువల్ల మెదడులోని ఇతర భాగాలలోని కణజాలానికి విస్తరించే అవకాశం ఏమీ ఉండదు. కానీ ఈ బ్రెయిన్ ట్యూమర్లు శరీరంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించేవిగా, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారగలవు. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతలను నిర్వర్తిస్తూ, శరీరంలోని భిన్న అవయవాలను నియంత్రిస్తుంటాయి. అందువల్ల ట్యూమర్ ఏర్పడిన భాగం మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. అందువల్ల మెదడులో గడ్డ ఏర్పడిన ప్రదేశాన్నిబట్టి, ఆ ట్యూమర్ రకాన్ని బట్టి దాని ప్రభావం శరీరంలోని వివిధ భాగాలపై (అంటే అది నియంత్రించే భాగంపైన) కనిపిస్తూ ఉంటుంది. మెదడులో గడ్డలను బట్టి కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. కొందరిలో అది వినికిడి శక్తిని ప్రభావితం చేస్తే, మరికొందరిలో కంటి చూపును దెబ్బతీయవచ్చు. ఈ విధంగా జరిగినప్పుడు మెదడులో ఒకవైపు ఏర్పడిన బినైన్ ట్యూమర్లను తొలగిస్తే మళ్లీ మరోవైపు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే గత దశాబ్ద కాలంలో ట్యూమర్ల చికిత్స అభివృద్ధి చెందింది. గడ్డ ఏర్పడిన మెదడు భాగానికి ఏమాత్రం నష్టం కలిగించకుండా, ఫలితంగా మెదడులోని ఆ భాగం అదుపు చేసే అవయవాల పనితీరు దెబ్బతినకుండా ట్యూమర్‌ను తొలగించివేయగల వైద్యసాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న 3 టెస్లా ఇంట్రా ఆపరేటివ్ మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (3 టీ ఎమ్మారై) మెదడులో గడ్డల తొలగింపు ఆపరేషన్‌లో గణనీయమైన మార్పు తెచ్చింది. అప్పటి రోజుల్లో ఎక్స్–రే, ఆ తర్వాత అల్ట్రాసౌండ్, ఆపైన ఎమ్మారై... ఇప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ వైద్యసాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల కారణంగా శరీరం లోపలి భాగాల్లో అతి చిన్న మార్పునూ పసిగట్టి చూపగల నిర్ధారణ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటిదే తాజాగా అందుబాటులోకి వచ్చిన ఐఎమ్మారై (ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై). అది మరో అడుగు ముందుకు వేసి ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే శరీరంలోపలి అవయవాల స్పష్టమైన చిత్రాలను తీస్తుంది. దీని సహాయంతో న్యూరో వైద్య నిపుణులు మెదడులోని గడ్డలను తొలగించే విషయంలో చాలా నైపుణ్యాన్ని, కచ్చితత్వాన్ని సాధించగలిగారు. ఈ సాంకేతికతల కారణంగా ఇప్పుడు గడ్డలన్నింటిని దాదాపుగా కూకటివేళ్లతో సహా తొలగించడానికి వీలవుతోంది. అలాగే పార్కిన్సన్స్ డిసీజ్, వణుకుడు (ఎసెన్షియల్ ట్రెమర్స్) వ్యాధులకు సంబంధించిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలానికి ఏమాత్రం నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా చేయడానికి వీలవుతోంది. అందువల్ల మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మీ డాక్టర్ సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకోండి. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? మా పెద్దన్న వయసు 63 ఏళ్లు. ఇటీవల ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. చేతులు, కాళ్లు, తల తరచూ వణుకుతున్నాయి. మాట్లాడేటప్పుడు వణుకు వస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చిరునవ్వుతో సంతోషంగా ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉంటున్నాడు. తిండి కూడా సయించడం లేదు. ఏం పెట్టినా రుచీపచీ లేని తిండి పెడుతున్నారంటూ చిరాకు పడుతున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే పార్కిన్సన్స్ వ్యాధిగా నిర్ధారణ చేశారు. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? ఇది ప్రమాదకరమా? ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి? దయచేసి వివరించండి. మీరు చెబుతున్న మీ అన్నగారి లక్షణాలను బట్టి అది పార్కిన్సన్స్ (వణుకుడు) వ్యాధిగానే అనిపిస్తోంది. పార్కిన్సన్స్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీకణాలు దెబ్బతినడం, క్షీణించడం కారణంగా ఇది వస్తుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాలకూ... శరీరంలోని నాడీవ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి (కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనికి తయారుచేసే కణాలు క్షీణించడం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దాంతో శరీరభాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సాధారణంగా అరవై ఏళ్లకు పైబడ్డవారే ఎక్కువగా పార్కిన్సన్స్ వ్యాధికి గురవుతుంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం ఇది వంశపారంపర్యంగా వస్తూ, చిన్న వయసులోని వారిలోనూ కనిపిస్తుంటుంది. మన దేశంలో దాదాపు కోటికి పైగా మంది దీనితో బాధపడుతున్నారు. సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఆధునిక సౌకర్యాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం ద్వారా దీన్ని అదుపు చేయడానికి వీలుంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్స ఇటీవల సమూలంగా మారిపోయింది. ఈ వ్యాధిగ్రస్తులు తమను వేధిస్తున్న లక్షణాలను అదుపు చేసుకొని, సాధారణ జీవితం గడిపేందుకు ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్యపరమైన ఔషధాలు, సర్జికల్ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. పార్కిన్సన్స్ వ్యాధి మధ్యస్థాయిలో ఉండి శరీరక పరిమితులు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలను అదుపు చేయటంతో పాటు వాడుతున్న మందుల నుంచి గరిష్ఠప్రయోజనం పొందేందుకు ఇప్పుడున్న ఆధునిక చికిత్సలు తోడ్పడుతున్నాయి. చికిత్సవ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్యపరిస్థితి, శరీరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్స చికిత్స వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు మందులు, ఫిజియోథెరపీ, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స ఉపయోగపడతాయి. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట కనిపెట్టిన ‘ఎల్ డోపా’ అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది. శక్తిమంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మోతాదులో ఏవైనా లోటుపాట్లు జరిగితే మొత్తంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సహాయపడుతూ డోపమైన ఉత్పత్తి జరిగేట్లు చేస్తుంది. దాంతో అవయవాలు బిగుసుకుపోవడం, వణుకుడు తగ్గుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు సంబంధించి మరో శక్తిమంతమైన చికిత్స డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్). ఈ శస్త్రచికిత్స వ్యాధి పెరుగుదలను నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపనిచేందుకు పేస్ మేరక్ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చుతారు. మెదడులోని కొన్ని కణాలను తొలగించడం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. డోపమైన తయారీ పునరుద్ధరించగలగడం సాధ్యమవుతుంది. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆమె అవయవాలు చూసి షాక్
అమెరికాకు చెందిన రోజ్ మేరీ బెంట్లీ అనే మహిళకు ఒక హార్ట్ తప్పమిగిలిన అవయవాలన్నీ రివర్స్‌లోనే..అయినా ఆరోగ్యంగా 99 ఏళ్లు బతికేసింది. ప్రపంచంలో నిజంగా ఒక వైద్య అద్భుతమేనంటూ వైద్యశాస్త్ర నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ విద్యార్థులు ఈ అద్భుతాన్ని గమనించారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అనాటమిస్ట్స్ వార్షిక సమావేశంలో ప్రెజంటేషన్లో భాగంగా ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్సు యూనివర్శిటీఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించింది. వివరాల్లోకి వెళితే రోజ్ మేరీ బెంట్లీ 99 ఏళ్ల వయసులో 2017 అక్టోబరులో చనిపోయారు. అయితే ఆమె కోరిక మేరకు ఆమె బాడీని యూనివర్శిటీకి పరిశోధనల నిమిత్తం దానం చేశారు కుటుంబ సభ్యులు. ఇదే అద్భుత ఆవిష్కరణకు నాంది పలికింది. ఆమె శరీరంలోని అవయవాలు చూసి యూనివర్శిటీ విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లు, నిపుణులు ఒక్కసారిగా షాకయ్యారు ఒక హృదయం తప్ప అన్ని అవయవాలు రివర్స్‌లో ఉన్నాయి. కాలేయం, ప్లీహము, కడుపు, జీర్ణవ్యవస్థ, పెద్దప్రేగు సహా అన్నీ ఆరోహణ స్థితిలో ఉన్నాయి. కుడి ఊపిరితిత్తుల్లో సాధారణంగా ఉండాల్సిన 3 లాబ్స్‌కు బదులుగా రెండు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు గుండెలోని కుడి కర్ణిక సాధారణం కంటే రెండు రెట్లు పెద్దదిగా ఉంది. ఈ అరుదైన పరిస్థితిని సిటస్ ఇన్వర్సస్ విత్ లెవోకార్డియా అని పిలుస్తారని అనాటమీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాకర్ చెప్పారు. 5 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలా పుట్టినవాళ్లు దీర్ఘకాలం బతకడం కూడా కష్టమే. ఒక వేళ జీవించినా తరచూ ప్రాణాంతకమైన కార్డియాక్ వ్యాధులు, ఇతర అసాధారణతలతో బాధపడతారట. అయితే బెంట్లీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా దాదాపు వందేళ్లు హాయిగా జీవించారామె. ఆమె కుటుంబానికి గానీ, బెంట్లీకి గానీ ఈ అసాధారణ పరిస్థితి గురించి తెలియదు. అయితే గాల్‌బ్లాడర్ ఆపరేషన్‌తో పాటు 50 ఏళ్ల వయసులో హిస్టరెక్టమీ (గర్భసంచి తొలగింపు) చేయించుకున్నారని బెంట్లీ కుమార్తె తెలిపారు. అయితే అపెండిసైటిస్ ఆపరేషన్ సందర్భంగా మాత్రమే అపెండిసైటిస్ ఉండాల్సిన ప్లేస్‌లో లేదని డాక్టర్లు తెలిపారన్నారు. చనిపోవడానికి రెండు మూడు సంవత్సరాలకు ముందు ఆర్థరైటిస్‌తో బాధపడ్డా రన్నారు. అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చిన బెంట్లీ మంచి స్విమ్మర్ కూడా. అంతేకాదు మరణానంతరం శరీరాన్ని దానం చేయాలని నిర్ణయించుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు -
29 కిలోమీటర్లు...26 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి–శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య ఉన్న 29 కిమీ మార్గాన్ని లైవ్ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్స్ కేవలం 26 నిమిషాల్లో అధిగమించింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఇచ్చినట్లు అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న డోనర్ తన గుండె, ఊపిరి తిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకు చేరాల్సి ఉందని సమాచారం అందింది. చెన్నైలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు ఇవి చేరాల్సి ఉంది. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో వీటిని రిసీవ్ చేసుకోవాల్సిన రోగులకు ఆపరేషన్స్ మొదలయ్యాయి. లైవ్ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్స్ తెల్లవారుజామున 3 గంటలకు లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరగా అధికారులు అప్రమత్తమై ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దింపారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్లలో ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి. డోనర్ ఇచ్చిన గుండె, ఊపిరి తిత్తులతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 29 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. తెల్లవారుజామున సాధారణ రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండకపోయినప్పటికీ... ఎయిర్పోర్ట్ రూట్లో కచ్చితంగా ఉంటుంది. దీనికితోడు ఇతర జంక్షన్లలోనూ దూసుకువచ్చే వాహనాల వద్ద ప్రమాదాలు, ఆటంకాలు లేకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఓ సబ్–ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లడానికి సిద్ధమైంది. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 2.58 గంటలకు ‘లైవ్ ఆర్గాన్స్ బాక్స్’తో కూడిన అంబులెన్స్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే మీదుగా సరిగ్గా 3.24 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కాపు కాశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ రెండు లైవ్ ఆర్గాన్స్ చెన్నై వెళ్లిపోయాయి. -
డ్రోన్ ద్వారా అవయవాలు!
న్యూఢిల్లీ: ఓ నగరంలోని ఆసుపత్రిలో దాత నుంచి సేకరించిన అవయవాలను నిమిషాల వ్యవధిలో మరో ఆసుపత్రిలోని రోగికి అమర్చవచ్చు. ఒకచోటి నుంచి మరోచోటికి అత్యవసర పరిస్థితుల్లో మందుల్ని అప్పటికప్పుడు చేరవేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త డ్రోన్ ద్వారా ఈ రెండు ఘటనలు వాస్తవరూపం దాల్చనున్నాయి. ఈ విషయమై పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ..‘ఆసుపత్రుల మధ్య డ్రోన్ల రాకపోకల కొత్త డ్రోన్ విధానానికి సంబంధించి డిసెంబర్ 1(నేటి) నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరించిన నెలరోజుల తర్వాత డ్రోన్ల వినియోగానికి లైసెన్సులు జారీచేస్తాం. దేశవ్యాప్తంగా కొన్నిప్రాంతాల్లో డ్రోన్ల ప్రయాణ దూరాన్ని విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈ కొత్త విధానానికి సంబంధించిన నిబంధనలను 2019, జనవరి 15న భారత్‌లోని ముంబైలో జరిగే ప్రపంచ విమానయాన సదస్సులో విడుదల చేస్తాం. అంతేకాకుండా కొత్త డ్రోన్ విధానంలో భాగంగాసరుకుల రవాణాకు ఒకే ఆపరేటర్ బహుళ డ్రోన్లను వినియోగించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది’’ అని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో భారత్ తొలి డ్రోన్ విధానాన్ని, నియమనిబంధనల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందిస్తూ..‘సహాయక చర్యలు, ఏరియల్ సర్వే, పంటల అంచనా, సరుకుల చేరవేత తదితర రంగాల్లో డ్రోన్ల సేవలను గణనీయంగా వాడుకోవచ్చు. వీటి వినియోగానికి డిజిటల్ ‘కీ’ని జారీచేస్తాం. ఓటీపీ ద్వారా రిజస్టర్ అయ్యాక మాత్రమే డ్రోన్లు టేకాఫ్ కాగలవు’ అని ఆయన వెల్లడించారు. -
మరణ కారణం.. అవయవ వైఫల్యం
కర్ణాటక , బొమ్మనహళ్లి: ఉడుపిలోని శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామీజీ (55) ఆకస్మికంగా మరణించిన మిస్టరీలో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. జులైలో ఆయన మఠంలో కన్నుమూయడం తెలిసిందే. దీనిపై రకరకాల అనుమానాలు, ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో కీలకమైన పోస్టుమార్టం ఫోరెన్సిక్ నివేదిక వెలువడింది. ఆయనపై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని, స్వామీజీ కాలేయం పనిచేయక, శరీరంలో రక్తం గడ్డకట్టడంవల్ల మృతి చెందారని మణిపాల్ వైద్యులు ఫోరెన్సిక్ నివేదికలో తెలిపారు. మంగళూరు నగరంలో ఉన్న సైన్స్ ప్రయోగశాల, కేఎంసీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇచ్చిన నివేదికలో స్వామీజీ కాలేయం పూర్తిగా చెడిపోయి ఉందని పేర్కొన్నారు. ఈ నివేదికను పోలీసులకు అందజేయడం జరిగింది. మూత్రపిండాల వైఫల్యం అన్ననాళంలో రంధ్రాలు పడటం, శరీరంలో ఎక్కడ చూసినా రక్తం గడ్డ కట్టిందని, మరణానికి ఇవే కారణాలని వైద్యులు తెలిపారు. దీనికి తోడు మూత్రపిండాలు కూడా పనిచేయడం లేదని, కడుపులోకి పెద్దమొత్తంలో రక్తం చేరిందని, ఇదే విషంగా మారి మరణించి ఉంటారని వైద్యులు తెలిపారు. మంగళూరు సైన్స్ ప్రయోగశాలలో రూపొందించిన నివేదిక పైన పోలీసులు వైద్యులను రెండుసార్లు సుమారు 10కి పైగా ప్రశ్నలను అడిగారు. వైద్యులు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అనంతరం ఎఫ్ఎస్ఎల్ నివేదికను పోలీసులు స్వీకరించినట్లు తెలిసింది. అనారోగ్యం వల్లనే స్వామీజీ కన్నుమూశారని, ఆయన పైన ఎలాంటి విష ప్రయోగం జరగలేదని వైద్యులు తెలిపారు. -
అవయవాలతో వ్యాపారం
లక్ష్మీకాంత్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఆర్గాన్స్’. సందీప్తి, శ్రీలక్ష్మి, ప్రసాద్ రెడ్డి, మోహన్ ఇతర పాత్రల్లో నటించారు. రవికిరణ్ దర్శకత్వం వహించారు. రాజ్ కిరణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత ముత్యాల రామదాసు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆర్గాన్స్’ డిఫరెంట్ టైటిల్. అవయవ దానం చేయడం అనే మంచి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా హిట్ అయి యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఆర్గాన్స్’ నా మొదటి చిత్రం. మా సినిమా చూసిన వారు కంటతడి పెట్టుకుంటారు. ఇందులో అవయవదానంతో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది’’ అన్నారు రవికిరణ్. ‘‘మనిషి జీవించడానికి అవయవాలు ఎంతో ప్రధానం. కొందరు వాటిని తమ స్వార్థానికి వ్యాపారంగా మార్చేశారు. అలాంటి వాళ్లను హీరో ఏ విధంగా ఎదుర్కొన్నాడన్నదే కథ. సెన్సార్ పూర్తయింది. త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు బత్తుల లక్ష్మీనారాయణ. ∙సందీప్తి, లక్ష్మీకాంత్ -
ఆచమనం అంటే ఏమిటి?
రోజులో ఆచమనం పేరుతో అనేకసార్లు మెల్లగా నీరు తాగడం వల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది. పూజలు, వ్రతాల్లో ‘ఆచమనం’ అనే మాట చాలా సార్లు వింటాం. కానీ ఆ పదానికి అర్థం చాలామందికి సరిగా తెలీదు. అందుకే ‘ఆచమనం’ అంటే ఏమిటి, అసలు ఆచమనం ఎందుకు చేయాలి? నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి, అలా ఎందుకు తాగాలి, ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు? మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి? నీరు కాస్త ఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది... వంటి సందేహాలు కలగడం సహజం. అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం. మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ ఉండే కార్టిలేజ్ కవచం కొంత వరకూ రక్షణ లభిస్తుంది. ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదమే. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం ’V’ ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి. ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాసనాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం. రోజులో ఆచమనం పేరుతో అనేకసార్లు మెల్లగా నీరు తాగడం వల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది. ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది. ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి. అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది. -
నిశ్చలత్వమే యోగం
ఆత్మీయం ఈ భౌతిక ప్రపంచంలో మంచి జరిగినా, చెడు జరిగినా తాము దాన్ని ప్రశంసించకుండా, విమర్శించకుండా ఎవరైతే ఉంటారో, ఎటువంటి భావాన్నీ వెలిబుచ్చక కలత చెందక నిశ్చలంగా ఉంటారో అటువంటి వారినే యోగులంటారు. నిలకడగల జ్ఞాని లేదా యోగి తాబేలు వంటివాడు. ఏదైనా అవసరం కలిగినప్పుడు తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకునే సౌకర్యం ఏవిధంగా కలిగి ఉంటుందో, అదేవిధంగా తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలిగిన వాడే సమగ్రమైన జ్ఞాని, యోగి. సమదర్శనులు రమణమహర్షి వలె జనన మరణ స్థితులను జయించిన వారై ఉంటారు. అటువంటి సమదర్శనులయిన జ్ఞానుల చేత ఈ దేహం, సంసార బంధాలలో తగులుకోక జనన మరణ చక్రాన్ని జయించబడింది. అటువంటి వారు బ్రహ్మమువలె దోషం లేని వారయినందువల్ల బ్రహ్మములోనే ఉన్నవారు కాగలరు. అంటే అన్నింటిలోనూ సమదృష్టి గల మనస్సు, ఆత్మ సాక్షాత్కారం గల వారి çహృదయానికి ప్రతీకయే గాక సాక్షాత్తూ దేవుని వలె రాగద్వేషాలకు అతీతులం కాగలం. దోషరహితులమై ఆధ్యాత్మికానందాన్ని అనుభవించగలం. -
మానవతకు పాతర
►మూడు రోజుల పురిటిగుడ్డును ప్రాణాలతో పాతిపెట్టే పాతకం ►కన్నతండ్రి ప్రోద్బలంతో ఆస్పత్రి గార్డు అకృత్యం.. ►నెలలు నిండకుండా.. అవయవాలు వృద్ధి చెందకపోవడమే కారణమట ►శ్మశానంలో ఆ ఘాతుకాన్ని గమనించి అడ్డుకున్న పలువురు ►సెక్యూరిటీ గార్డుకు దేహశుద్ది.. పాప క్షేమంగా ఆస్పత్రికి.. నెలలు నిండకుండానే ఈ లోకంలోకి వచ్చేయడమే ఆ పురిటిగుడ్డు చేసిన పాపం.. అవయవాలు అంకురించకుండానే పుట్టిన ఆడబిడ్డ.. వైద్యానికే లక్షలు పోయాలన్న బెంగ.. ఆ తండ్రి హృదయాన్ని కఠిన పాషాణంగా మార్చేశాయి.. కన్నపేగు అన్న కనికరాన్ని కూడా దూరం చేశాయి.. పురిటి వాసన కూడా పోని పసికూనను ప్రాణాలతోనే పాతిపెట్టే పాతకానికి పురిగొల్పాయి.. బిడ్డకు జన్మనిచ్చిన ఆస్పత్రికి చెందిన సెక్యూరిటీ గార్డే తోడ్పాటునందించి.. మానవ విలువలకు.. పేగు బంధానికి పాతరేసే అకృత్యానికి తెగబడితే.. మరుభూమిలో ఆ దారుణాన్ని గుర్తించి.. గార్డును చితకబాది.. పసిగుడ్డు ప్రాణాలు పోకుండా కాపాడారు కొందరు మానవతామూర్తులు.. చివరికి చైల్డ్‌లైన్, చైల్డ్ ప్రొటెక్షన్, పోలీసు విభాగాలు స్పందించి.. పసికూనకు రక్షా కవచంగా నిలిచారు. పెదవాల్తేరు (విశాఖ తూర్పు) : పసికందు బతికుండగానే కడతేర్చాలనుకున్న కసాయితనం. నెలలు నిండకుండా పుట్టిందనే నెపంతో కాటికి తీసుకువెళ్లిన కూృరత్వం. గుక్కతిప్పకుండా కేరుమంటున్నా గుండె కరగని అమానుషత్వం.. ఆ నరరూప రాక్షసుడి పైశాచికత్వాన్ని వివరించడానికి ఎన్ని పదాలు చాలుతాయి? ఆ కర్కోటకుడి నిర్దాక్షిణ్యాన్ని చెప్పాలంటే ఏ భాషలో ఏ మాటలు సరిపోతాయి? అయితే ఏ దేవతలు పుణ్యం కట్టుకున్నారో.. అంత ముష్కరుడి చేతుల్లో పడి కూడా పసిపాప ప్రాణాలు నిలిచాయి. పట్టపగలు శ్మశానం నుంచి పసిపాప మృత్యుఘోష విన్న స్థానికులు వెంటనే స్పందించడంతో చిట్టితల్లికి పంచప్రాణాలు నిలిచాయి. జరుగుతున్న దారుణాన్ని తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయి కర్కోటకుడికి దేహశుద్ధి చేశారు. బొడ్డుతాడు ఊడని ఆ పసికందును రక్షించేందుకు పోలీసులకు సమాచారం అందించారు. బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో శిశువుకు వైద్యం సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ చిన్నయిదేవి.. బాలల సంరక్షణ విభాగం ప్రతినిధి ఆనంద్‌ను సంఘటన స్థలానికి పంపించారు. ఆయన హుటాహుటిన శ్మశానానికి వెళ్లి పసికందును అక్కున చేర్చుకున్నారు. వెంటనే తదుపరి వైద్యం కోసం కృష్ణా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కారా ప్రతినిధుల ఆగ్రహం ఈ విషయం తెలిసి కారా (సెంట్రల్ ఎడ్పాప్షన్ రిసోర్స్ అథారిటీ) సభ్యుడు కంభంపాటి వాసుబాబు ఆస్పత్రికి వెళ్లి యాజమాన్యం, శిశువు తండ్రితో మాట్లాడాడు. శిశువు నెలలు నిండకుండా పుట్టిందని, దీంతో అవయవాలు సంపూర్ణంగా వృద్ధి చెందలేదని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొనగా, వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారని శిశువు తండ్రి తెలిపాడు. బతికున్న పసికందును ఎలా కప్పిపెడతారంటూ కారా సభ్యుడు వాసుబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి బిడ్డలు పుట్టినప్పడు వైద్యం చేయించే స్తోమత లేకపోతే బాలల రక్షణ విభాగానికి ఆశ్రయిస్తే నిధులు కేటాయిస్తారని చెప్పారు. అలా కాకుండా పసికందు ప్రాణాలు తీయడానికి పూనుకోవడం నేరమన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి యాజమాన్యంపైన, శిశువు తల్లిదండ్రులను, పూడ్చిపెట్టడానికి ప్రయత్నించి సెక్యూరిటీ గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శిశువుకు వైద్యం శిశువుకు వైద్యంతోపాటు సంరక్షణ బాధ్యతలను చైల్డ్ వెల్పేర్ కమిటీకి అప్పగించామని కారా సభ్యుడు వాసుబాబు పేర్కొన్నారు. వైద్యానికి కావాల్సిన నిధులు సమకూర్చుతామని తెలిపారు. శిశువుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శిశు గృహం సిబ్బంది సైతం బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చొరవ ప్రశంసనీయం పసికందును ప్రాణాలతో పూడ్చిపెడుతున్నారన్న విషయం తెలుసుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం కన్వీనర్ గొండు సీతారాం స్థానికులతో కలిసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి శిశువును సంరక్షించేందుకు విశ్వప్రయత్నం చేశారు. బిడ్డకు ఆసరాగా అధికారుల నిలబడేందుకు వీలుగా వారితో సంప్రదింపులు జరిపారు. దీంతోపాటు పసికందు విషయాన్ని అందించిన స్థానికులు మహాలక్ష్మి, రాజులను సైతం కారా ప్రతినిధులు అభినందించారు. నెలలు నిండ లేదని... నర్సీపట్నానికి చెందిన మామిడి గోవింద్ గర్భిణి అయిన తన భార్యను జిల్లా పరిషత్ జంక్షన్లో గల కృష్ణా ఆస్పత్రిలో చేర్పించాడు. మూడు రోజుల క్రితం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యం సవ్యంగాలేదు. దీంతో వైద్య పరీక్షలు చేశారు. నెలల నిండకుండా ఏడో నెలలో బిడ్డ పుట్టడంతో అవయవాలు పూర్తిగా వృద్ధి చెందలేదు. పసిబిడ్డ వైద్యానికి పెద్దమొత్తంలో ఖర్చవుతుందని ఆస్పత్రి వర్గాలు బిడ్డ తల్లిందండ్రులకు తెలిపారు. వారి మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయో ఏమో కానీ బతికి ఉన్న ఆ బిడ్డను పెదజాలారిపేట శ్మశాన వాటికలో మంగళవారం సాయంత్రం పూడ్చేందుకు కృష్ణా ఆస్పత్రికి చెందిన సెక్యూరిటీ గార్డు గొయ్యి తవ్వతున్నాడు. అదే సమయంలో శ్మశాన వాటికలో దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్థానికులకు పసిబిడ్డ ఏడుపు వినిపించింది. అనుమానంతో స్థానికులు అక్కడి వెళ్లి చూసేసరికి హృదయ విదారక దృశ్యం వారి కంట పడింది. చలించిపోయిన స్థానికులు బతికి ఉన్న పసికందును పూడ్చిపెట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని నిలదీశారు. అతడు సరిగా సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. అతనికి దేహశుద్ధి చేశారు. దీంతో తాను కృష్ణా ఆస్పత్రి చెందిన సెక్యూరిటీ గార్డునని పేర్కొన్నాడు. స్థానికులు బాలల సంరక్షణ విభాగానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించి పసిబిడ్డను రక్షించారు. ఈ విషయమై కృష్ణా ఆస్పత్రి నిర్వాహకుడు సీతారామరాజును ‘సాక్షి’ వివరణ అడగడానికి ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం నెలల నిండని శిశువును పెదజాలారిపేట శ్మశానవాటికలో పూడ్చిపెట్టేందుకు యత్నిస్తున్న విషయాన్ని స్థానికుల సమాచారం మేరకు తెలుసుకున్నాం. అక్కడికి వెళ్లి ఆ బిడ్డను రక్షించి వెంటనే కృష్ణా ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో బిడ్డ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – సీఐ మళ్ల మహేష్ పోలీసుల అదుపులో సెక్యూరిటీ గార్డు