Registrations Department
-
చంద్రబాబు సర్కారు మరో భారీ బాదుడు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజలకు మరో పిడుగులాంటి వార్త. ఇప్పటికే కరెంట్ ఛార్జీలతో ఎడాపెడా బాదేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఇప్పుడు మరో భారీ బాదుడుకు కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధంచేసింది. తద్వారా ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపేందుకు చకచకా ఏర్పాట్లుచేస్తోంది. సాధారణ రివిజన్లో భాగంగా 20 శాతం మాత్రమే పెరుగుదల ఉంటుందని పైకి చెబుతున్నా దానికన్నా రెండు రెట్లు ఎక్కువ ఉండేలా భూముల విలువలను సవరించేందుకు చాపకింద నీరులా కసరత్తు జరుగుతోంది.భూముల క్లాసిఫికేషన్ల ప్రకారం కాకుండా వాటిని మార్చి అందులో రెండో విలువను జోడించడం ద్వారా దొడ్డిదారిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందుకోసం కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో భూములను పలు రకాలుగా వర్గీకరించారు. వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమి.. ఇళ్ల స్థలాలు, జాతీయ రహదారుల ఆనుకుని ఉన్న భూమి.. ఇలా పలు రకాలుగా విభజించారు. ఉదా.. ఒక ఏరియాలో మెట్ట భూముల విలువ రూ.5 లక్షలుగా, మాగాణి భూముల విలువ రూ.10 లక్షలుగా నిర్థారిస్తారు. ఎప్పుడైనా మార్కెట్ విలువలను వాటి ప్రకారమే పెంచడం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్లను మారుస్తున్నారు.రూ.5 లక్షలున్న మెట్ట భూమిలో ఒకచోట రూ.5 లక్షలు, దీని పక్కనే ఉన్న దానికి రూ.7 లక్షలు నిర్ణయిస్తున్నారు. అంటే.. ప్రతీ క్లాసిఫికేషన్‌లోనూ కొత్తగా రెండో రేటును ప్రవేశపెడుతున్నారు. అలాగే, జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపలున్న భూములను మరో క్లాసిఫికేషన్‌లో పెడుతున్నారు. దీనికి కొత్తగా ‘లేయర్’ విధానమని పేరు పెట్టారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలోని రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి అనుకుని ఉన్న భూమికి మరో రేటు, వాటి వెనకున్న వాటికి మరో రేటు నిర్ణయిస్తున్నారు.అలాగే, అర్బన్ ప్రాంతాల్లోనూ క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒక రేటు, సందుల్లో వాటి వెనుకున్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు. ఇక వాణిజ్య స్థలాలకు సంబంధించిన క్లాసిఫికేషన్లను రకరకాలుగా మార్చి గ్రిడ్లు, లేయర్లు పెడుతున్నారు. ఒక ఏరియాలోనే గతంలో మాదిరిగా ఒక క్లాసిఫికేషన్‌లో ఉన్న భూమికి ఒక రేటు కాకుండా ప్రతీదాని రేటును మార్చేస్తున్నారు. తద్వారా ఒకే ప్రాంతంలో ఉన్న భూమి మార్కెట్ విలువను వీలును బట్టి రెండు, మూడు రకాలుగా పెంచుతున్నారు.50–60 శాతం పెరిగే అవకాశం..ఇలా చేయడంవల్ల ప్రజల నెత్తిన మోయలేని భారం పడనుంది. దాదాపు ప్రతి వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఏరియా ప్రాతిపదికన కాకుండా సంబంధిత భూమి ప్రాతిపదికన రేటు పెట్టడంతో అన్ని భూముల విలువలకు రెక్కలు రానున్నాయి. దీంతో.. ప్రస్తుతమున్న మార్కెట్ విలువలు 50–60 శాతం పెరగనుండడంతో క్రయవిక్రయాలు జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీల వడ్డన భారీగా ఉండనుంది. పైకి మాత్రం ఇది కేవలం 20 శాతం మాత్రమే పెరుగుదల ఉంటుందని చెబుతున్నా క్లాసిఫికేషన్లు మార్చడం ద్వారా ఈ బాదుడు భారీగా ఉండనుంది.అన్ని జిల్లాల్లో దాదాపు కసరత్తు పూర్తి..ఇక ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే అన్ని జిల్లాల్లో చాలావరకు పూర్తయింది. రెండు నెలలుగా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లతో వారం, వారం సమీక్షలు జరిపి ఎలా చేయాలి, ఎంత పెంచాలో దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామ, ఏరియా మ్యాప్ తీసుకుని దాని ఆధారంగా రేట్లు పెంచేశారు. గ్రిడ్లు, లేయర్ల విధానంవల్ల కొన్నిచోట్ల ఇబ్బంది వస్తుందని కిందిస్థాయిలో అభ్యంతరాలు వచ్చినా లెక్కచేయలేదు. ప్రతీ భూమి విలువను పెంచాలి్సందేనని ఆదేశాలు అందడంతో అందుకనుగుణంగా సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ భారం ప్రజలపై వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక ఒక పక్క వర్షాలు, వరదలతో జనం అల్లాడుతుంటే మార్కెట్ విలువలు పెంచడం ద్వారా ప్రజల నెత్తిపై ఇంకా భారాలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
భూముల విలువల సవరణ ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ విలువల సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న విషయంలో స్పష్టత రావడం లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే సవరించిన విలువలు అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ పారదర్శకత పేరుతో థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించడంతో జాప్యం జరుగుతోంది. ఈ ఏజెన్సీ నివేదిక ఇంకా ప్రభుత్వం చేతికి రాలేదని తెలుస్తోంది.రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం నవంబర్ నెలలోనే సవరించిన విలువలను అమల్లోకి తేవాలనే యోచనలో ఉన్నా.. థర్డ్ పార్టీ నివేదిక ఎప్పుడు వస్తుందన్న దానిపైనే సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉన్నాయని చెపుతున్నారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నందున భూముల ధరలు పెంచడం వల్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో ఆ ఎన్నికలు పూర్తయ్యేవరకు భూముల విలువల సవరణ అమల్లోకి రాదనే వాదన కూడా వినిపిస్తోంది. నాలుగు నెలల క్రితం.. వాస్తవానికి, భూముల విలువల సవరణ కార్యక్రమాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది జూన్ 14వ తేదీన ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి సవరించిన విలువలు అందుబాటులోకి రావాల్సి ఉంది. షెడ్యూల్ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తమ కసరత్తు పూర్తి చేశాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి భూముల విలువలను సవరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.అయితే, ఈ ప్రతిపాదనల మేరకు విలువలు సవరించకుండా, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌పార్టీకి ఈ కసరత్తు బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ కసరత్తు ఎంత వరకు వచి్చందన్నది అంతుపట్టడం లేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలే చెబుతున్నాయి. అసలు ఎప్పుడు నివేదిక ఇస్తుందన్న దానిపై స్పష్టత రావడం లేదని, నివేదిక వచ్చిన తర్వాత కూడా మరోమారు అధికారికంగా ప్రతిపాదనలు చేసి కమిటీల ఆమోదానికి సమయం తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో విలువల సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై తామేమీ చెప్పలేమని ఆ వర్గాలు అంటున్నాయి. -
హైడ్రా.. రిజిస్ట్రేషన్లు విత్‌డ్రా
సాక్షి, హైదరాబాద్: చెరువులు, నీటి వనరుల పరిరక్షణ, ఆక్రమణల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’తో.. భూములు, ఆస్తుల కొనుగోళ్లపై ప్రభావం పడింది. జిల్లాల్లోనూ హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపట్టడంతో.. రాష్ట్రవ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గాయి. సుమారు రెండు నెలలుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏకంగా 30శాతానికిపైగా తగ్గింది. 20వేలకుపైగా లావాదేవీలు తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క నెలలో రూ.300 కోట్లు తగ్గిపోయి.. రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం.. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ ఒక్క నెలలోనే రూ.300 కోట్ల ఆదాయం తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 99,528 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి, ప్రభుత్వానికి రూ.955.12 కోట్ల ఆదాయం సమకూరింది. అదే ఈసారి సెప్టెంబర్‌లో 80,115 లావాదేవీలు జరిగి, రూ.650.80 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 2023 సెప్టెంబర్‌లో 21,407 లావాదేవీలు జరిగితే.. ఈసారి సెప్టెంబర్‌లో 16,687 లావాదేవీలే జరిగాయి. సుమారు ఐదువేల లావాదేవీలు తగ్గాయి. మేడ్చల్, పటాన్చెరు రిజిస్ట్రేషన్ జిల్లాల్లోనూ 4 వేల చొప్పున లావాదేవీలు తగ్గడం గమనార్హం. మొదట బాగానే ఉన్నా.. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 10.04 లక్షల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి.. ప్రభుత్వానికి రూ.7,229.88 కోట్లు రాబడి సమకూరింది. అదే ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 9.19 లక్షల లావాదేవీలతో రూ.7,291.28 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే స్వల్పంగా రూ.61.4 కోట్ల పెరుగుదల కనిపిస్తున్నా.. అది ఆస్తుల రేట్లు పెరగడం, తొలి నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్లు గణనీయంగా జరగడం వల్ల సమకూరినదేనని రిజిస్ట్రేషన్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఆర్థిక సంవత్సరం మొదట్లో రిజిస్ట్రేషన్లు, ఆదాయం గణనీయంగా పెరిగినా.. తర్వాత ఒక్కసారిగా తగ్గిపోయిందని స్పష్టమవుతోంది. ధరల పెంపు.. హైడ్రా దెబ్బ.. ఎల్ఆర్ఎస్ పేరుతో ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తున్న కారణంగా.. చాలా మంది డీటీసీపీ లేఔట్ల వైపు చూస్తున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక డాక్యుమెంట్ రైటర్ తెలిపారు. డీటీసీపీ ఫీజులు కూడా భారీగా పెరగడంతో చాలా మంది వెంచర్లు చేయడం లేదని.. వెంచర్లు చేసినా యుటిలిటీస్, కమ్యూనిటీ, పార్కుల పేరిట ఎక్కువగా భూమి వదలాల్సి రావడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ధరలు పెంచేశాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ‘హైడ్రా’ పేరిట కూల్చివేతలు చేపట్టడంతో.. కొనుగోలుదారుల్లో తెలియని భయం నెలకొందని వివరించారు. ప్లాట్లు అమ్ముదామంటే కొనేవాళ్లు లేరని.. చదరపు గజం ధర రూ.5 వేలకు మించి ఉన్న ప్లాట్ల విషయంలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ వంటి విషయాలను పరిశీలించుకునేలోపు కొనుగోలు దారుల మనసు మారిపోతోందని చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఇది ఇప్పటితో అయిపోలేదని, రిజిస్ట్రేషన్ లావాదేవీలు మరింత తగ్గుతాయని అంచనా వేశారు. ఇందుకు చాలా కారణాలున్నా.. ‘హైడ్రా’ ప్రభావం కూడా గణనీయంగా ఉందని పేర్కొన్నారు. హైడ్రాతో తారుమారురాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట చేస్తున్న హడావుడితో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకొచ్చినా..యుద్ధ ప్రాతిపదికన కూల్చివేతలు చేపట్టడంతో కొనుగోళ్లపై ప్రభావం పడింది. అటు కొనుగోలుదారుల్లో, ఇటు డెవలపర్లలో గుబులు కనిపిస్తోంది. కొనుగోలుదారులు కొంతకాలం వేచి చూసే ధోరణితో ఉండటంతో అమ్మకాలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందుల్లో పడటంతో దీనిపై ఆధారపడిన ఇతర రంగాలు కూడా కుదేలవుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారాన్ని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.– రావుల గోపాల్ యాదవ్, మోకిలా, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా -
నగదు ‘బదిలీ’! కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలు
విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు రూ.2కోట్లు... తిరుపతి రూరల్ తహసీల్దార్ పోస్టుకు రూ.2కోట్లు... కర్నూలు ఆర్డీవో పోస్టుకు రూ.కోటి... శ్రీ సత్యసాయి జిల్లాలో సీఐ పోస్టుకు రూ.50లక్షలు... ఇలా డిమాండ్‌ను బట్టి ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రజాప్రతినిధులు రేటు ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలుగా దోచుకోవడంపైనే దృష్టి పెట్టిన కూటమి నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. చివరికి సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిఫారసు చేసేందుకు కూడా రూ.లక్షన్నర వసూలు చేయా లని నిర్ణయించారు. తాము చెప్పినంత ఇస్తే నిబంధనలను సైతం పట్టించుకోకుండా జీరో సర్వీస్ బదిలీలు కూడా చేయిస్తామని భరోసా ఇస్తున్నారు. మామూళ్లు ఇవ్వనివారిని, తమకు నచ్చనివారిని మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు.పంచాయతీరాజ్, రెవెన్యూ, మైనింగ్, రిజిస్ట్రేషన్ల శాఖల్లో జోరుగా పైరవీలు సచివాలయ ఉద్యోగుల బదిలీకి టీడీపీ నేతల సంతకం తప్పనిసరి కానిస్టేబుల్ పోస్టింగ్‌కు సైతం డబ్బులు డిమాండ్సచివాలయ బదిలీకి రూ. లక్షన్నరగ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ కోసం స్థానిక టీడీపీ నాయకుడి సంతకం ఉండాలని చెబుతుండటంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఆ పార్టీ నేతలు బదిలీ కోసం సంతకం పెట్టడానికి రూ.1.50 లక్షలు అడుగుతుండడంతో ఆ శాఖలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే తీవ్ర అవమాన భారంతో సతమతమవుతున్న సచివాలయ ఉద్యోగులు తాజా పరిణామాలతో హతాశులవుతున్నారు. 0 సర్వీస్కృష్ణా జిల్లా పెనమలూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌కి పది రోజుల క్రితం ఏవోగా పదోన్నతి రావడంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోస్టింగ్ ఇచ్చారు. తాజా బదిలీల్లో ఆయన్ను పెనమలూరు ఏవోగా నియమించాలని స్థానిక ఎమ్మెల్యే సిఫారసు లెటర్ ఇచ్చారు. పట్టుమని పది రోజుల సర్వీసు కూడా పూర్తి కాకుండానే ఆయన బదిలీకి దరఖాస్తు పెట్టుకోవడం,దాని ఆమోదానికి రంగం సిద్ధమవడం విశేషం.రూ. లక్ష లక్షఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెంలో ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్‌తోపాటు ఎంపీడీవో కార్యాలయంలో ఏ పోస్టుకైనా సిఫారసు లెటర్ కావాలంటే ముందు లక్ష రూపాయలు ఇవ్వాలని, ఆ తర్వాత మరో రూ.లక్ష ఇవ్వాలని బేరం పెట్టారు. నియోజకవర్గంలో ఏ పోస్టుకైనా కప్పం కడితేనే సిఫారసు లెటర్ ఇస్తామని చెబుతున్నారు. రూ. 10 లక్షలుమైనింగ్ శాఖలో ఎన్టీఆర్ జిల్లా ఏడీ పోస్టుకి రూ.10 లక్షలు అడుగుతున్నట్లు సమాచారం. ఇందులో మంత్రి పేషీ, కార్యదర్శి పేషీల భాగస్వామ్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ. 2 కోట్లువిజయవాడలోని పటమట, విశాఖలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టుల కోసం ఉన్నత స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయి. ఈ పోస్టుల రేటు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు ఇచ్చిన గ్రీన్‌సిగ్నల్ పైరవీలకు రెడ్ కార్పెట్లా మారింది. నిబంధనలు, మార్గదర్శకాలను కాగితాలకే పరిమితం చేసి కాసులు, సిఫారసులతోనే బదిలీ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆయా శాఖల అవసరాలు, పనితీరుతో సంబంధం లేకుండా కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారినే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అధికార పార్టీ ప్రయోజనాల కోసమే ఈ బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేలు చెప్పిన వారిని, కాసులిచ్చిన వారిని మంచి పోస్టుల్లో కూర్చోబెట్టడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. తమకు ఇష్టం లేని వారిని, డబ్బులు ఇవ్వలేని వారిని పక్కన పెట్టేసి మారుమూల ప్రాంతాలు, ప్రాధాన్యత లేనిచోట్లకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదేళ్లు ఒకేచోట పని చేసిన వారిని కచ్చితంగా మార్చాలనే ప్రధాన నిబంధనను ఎక్కడా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. పాలనాపరమైన అవసరాలు, వ్యక్తిగత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని బదిలీల ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇష్టానుసారం బదిలీలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల సిఫారసులుంటే జీరో సర్వీసు ఉన్నా బదిలీకి అనుమతిస్తుండటంపై ఉద్యోగ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. – సాక్షి, అమరావతిగగ్గోలు పెడుతున్న అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు ఉద్యోగుల బదిలీలను ఎమ్మెల్యేలు తమకు అన్ని విధాలా అనుకూలంగా మార్చుకుంటున్నారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను తమ గుప్పెట్లో ఉంచుకునేలా ఈ బదిలీల పర్వాన్ని నిర్వహిస్తున్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులన్నింటిలోనూ తమకు అనుకూలమైన వారినే నియమించాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. ఎంపీడీవో, ఆ కార్యాలయంలోని ఉద్యోగులతోపాటు వ్యవసాయాధికారులుగా పలానా వారిని నియమించాలని సిఫారసు చేస్తూ ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో పోస్టులకు సైతం సిఫారసు లేఖలు ఇస్తున్నారు. వాటి ప్రకారమే ఆయా శాఖల ఉద్యోగులను బదిలీల జాబితాలో చేరుస్తున్నారు. లేఖలు ఇచ్చేందుకు ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు నిర్ణయించారు. ఆ లెటర్లు తీసుకెళ్లి అధికారులకు ఇచ్చాక.. అక్కడా డబ్బు అడుగుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బదిలీల వ్యవహారం అంతా డబ్బుమయంగా మారిపోయిందని వాపోతున్నారు.డిమాండ్‌ను బట్టి రేటు పెంచేశారు!తిరుపతి రూరల్ మండలం తహసీల్దార్ పోస్టుకు మంచి డిమాండ్ ఉండటంతో రేటు కూడా పెంచేసినట్లు తెలిసింది. ఇక్కడికి వచ్చేందుకు గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన ఓ మహిళా తహసీల్దార్ పైరవీలు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి అత్యంత సన్నిహితుల ద్వారా రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఆమె సిద్ధపడినట్లు సమాచారం. ఇదే పోస్టుకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పనిచేస్తున్న మరో తహసీల్దార్ కోటి రూపాయలు ఇస్తానని ముందుకు రావడం... ఆ వెంటనే మరో తహసీల్దార్ ఏకంగా 1.25 కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ పోస్టుకు గిరాకీ ఎక్కువగా ఉందని టీడీపీ నేత అమాంతంగా ధరను పెంచేశారు. ఏకంగా రూ.2 కోట్లు ధర నిర్ణయించారు. దీంతో అప్పటి వరకు తిరుపతి రూరల్‌పై ఆశలుపెట్టుకున్న చాలామంది తహసీల్దార్లు మరో పోస్టింగ్ చూసుకున్నారు. అయితే చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న తహసీల్దార్ మాత్రం రూ.1.5కోట్లు చెల్లించి, మిగతా మొత్తం మూడు నెలల్లో ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఆ సీటు చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రిక్వెస్ట్’ పేరుతో దోపిడీకి స్కెచ్ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఉద్యోగులు, అధికారుల నుంచి దోపిడీకి రిక్వెస్ట్ బదిలీ పేరిట పక్కా ప్లాన్ రెడీ చేశారు. ‘ఉద్యోగులంతా తప్పనిసరిగా బదిలీ అభ్యర్థన (రిక్వెస్ట్) ఫారం పూర్తి చేసి డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపండి. సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిసెంట్లు, కార్యాలయ సిబ్బంది ఇది పాటించి తీరాల్సిందే...’ అంటూ ఒక ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరడజను రిక్వెస్ట్ ఫారాలు వాట్సాప్‌లో సదరు అధికారికి పంపినట్లు సమాచారం. ఇప్పటికే డిప్యూటేషన్ల పేరుతో రూ.లక్షలు వెనకేసుకున్న అధికారులు... ఈ రిక్వెస్ట్ బదిలీల పేరుతో మరోసారి రూ.కోట్ల వసూళ్లకు తెరతీశారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్, కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు ఒక్కోదానికి రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర నిర్ణయించినట్లు తెలిసింది. సర్పవరం, సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు, రాజమహేంద్రవరంలో రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.60లక్షలు నుంచి రూ.80లక్షలు చొప్పున రేటు ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. రాజానగరం, పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు, అమలాపురంలో రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షలు, ముమ్మిడివరం సబ్‌రిజిస్ట్రార్ పోస్టుకు రూ.30లక్షలు చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిసింది. ఈ దందా అంతా విజయవాడ ప్రధాన కార్యాలయంలోని మార్కెట్ అండ్ ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న రిజిస్ట్రార్ ఒకరు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.జిల్లా స్థాయి పోస్టులకు భారీ డిమాండ్ మంత్రుల స్థాయిలో పైరవీలు⇒ జిల్లా స్థాయిలో ఉండే పోస్టులు, వివిధ కార్యాలయాల్లో ఉండే కీలకమైన సీట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. వీటి కోసం మంత్రులు, వారి పేషీలు, ఉన్నతాధికారుల వరకు పైరవీలు జరుగుతున్నాయి. పేషీకి ఒక రేటు ⇒ పంచాయతీరాజ్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు, ఇరిగేషన్ తదితర శాఖల్లో పోస్టులకు రూ.లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖలోని ఏఈ, డీఈ, ఈఈ పోస్టులకు సంబంధిత మంత్రి పేషీ నుంచి భారీ డబ్బు అడుగుతున్నట్టు తెలిసింది. మైనింగ్ శాఖలో డీడీ, ఏడీ, జియాలజిస్టు, సర్వే పోస్టులకు మంత్రి సిఫారసు లేఖ, ఆ తర్వాత సంబంధిత కార్యదర్శి పేషీ లోని కొందరు వ్యక్తులతో మాట్లాడుకుంటున్నారు. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, అనకాపల్లి వంటి జిల్లాల పోస్టులకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకుపైగా రేటు పెట్టారు. మంత్రి పేషీ వద్ద ఒక రేటు, ఆ తర్వాత కార్యదర్శి పేషీ వద్ద మరో రేటు.. ఈ రెండు ఓకే అయిన వారికే పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి నెలకొంది.ఈ పోస్టులకు ప్రభుత్వ స్థాయిలోనే బేరం⇒ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా బదిలీలన్నీ ఐజీ అండ్ కమిషనర్ కార్యాలయంలోనే చేసేలా ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్లు తీసుకోవడం ఆ శాఖలో కలకలం రేపింది. సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు భారీగా బేరాలు జరుగుతున్నాయి. విజయవాడలోని పటమట, విశాఖలోని మధురవాడ, భోగాపురం, కొత్తవలస, రేణిగుంట, తిరుపతి, నెల్లూరు, నల్లపాడు వంటి 25కు పైగా అధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ పోస్టులను ప్రభుత్వ స్థాయిలోనే బేరానికి పెట్టారనే చర్చ జరుగుతోంది. ఇరిగేషన్‌లోనూ తక్కువేం కాదు...⇒ ఇరిగేషన్ శాఖలో ఏఈ, డీఈ, ఈఈ పోస్టులకు అదే తరహాలో పైరవీలు సాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో పని చేసేందుకు ఈ క్యాడర్ అధికారులు ఎగబడుతున్నారు. అక్కడైతే బాగా బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉండటంతో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆ పోస్టులకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ప్రకాశంలో పెద్ద ఎత్తున వసూలు⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకాశం జిల్లాలో సీఐలు, ఎస్ఐలు, తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. పోలీసు శాఖలో కోరిన చోట పోస్టింగ్ కోసం టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నగదు వసూలు చేసినట్లు సమాచారం. రూ.8లక్షలు తెస్తేనే లెటర్ ⇒ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈఈ పోస్టుకి రూ.8 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అంత డబ్బు ఇస్తేనే సిఫారసు లెటర్ ఇస్తామని పలువురికి సంబంధిత మంత్రి అనుయాయులు చెప్పినట్లు తెలిసింది.పక్కాగా పైసా వసూల్సీఐకి రూ.50లక్షలు.. కానిస్టేబుల్‌కు రూ.50వేలు!⇒ శ్రీ సత్యసాయి జిల్లాలో సీఐ పోస్టింగుల కోసం రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బేరం జరిగినట్లు తెలిసింది. గోరంట్ల, హిందూపురం వన్‌టౌన్, ధర్మవరం వన్‌టౌన్, హిందూపురం రూరల్, హిందూపురం రూరల్ అప్‌గ్రేడ్, ధర్మవరం రూరల్, ముదిగుబ్బ, కదిరి స్టేషన్లలో సీఐల పోస్టులకు సిఫారసు లేఖలు ఎక్కువ ధర పలికినట్లు తెలిసింది. ఎస్ఐ స్థాయిలో ఏడాదికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చేందుకు అంగీకరించిన వారికే కోరిన చోట పోస్టింగులు ఇచ్చారని సమాచారం. కానిస్టేబుల్ బదిలీలకు కూడా టీడీపీ నేతలు రూ.50వేలు చొప్పున డిమాండ్ చేస్తున్నారు. తహసీల్దార్‌కు రూ.50లక్షలు.. వీఆర్వోకు రూ.లక్ష⇒ శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని మండలాల తహసీల్దార్ పోస్టులు రూ.50లక్షలు పలికినట్లు సమాచారం. జిల్లాలో పెద్దగా డిమాండ్ లేని మండలాల్లో అయినా ఆటంకాలు లేకుండా పని చేసుకునేందుకు టీడీపీ నేతలు రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. చిలమత్తూరు, కొత్తచెరువు, ధర్మవరం, హిందూపురం, పుట్టపర్తి, గోరంట్ల మండలాల పోస్టింగ్‌లకు అత్యధిక ధర పలికినట్లు ప్రచారం జరుగుతోంది. వీఆర్వోల బదిలీలకు కూడా రూ.లక్ష నుంచి బేరం ఆడుతున్నట్లు తెలిసింది. ముందు డబ్బులు ఇవ్వండి.. తర్వాత బదిలీ అవ్వండి⇒ ఎక్సైజ్ శాఖలో ‘సెబ్’ త్వరలోనే రద్దు చేస్తున్నామని, మద్యం పాలసీ మారగానే బదిలీలు ఖాయమని శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు రూ.10లక్షలు ఇస్తే రేపు నచ్చినచోట పోస్టింగ్ వేయిస్తామని ఎస్ఐ, సీఐల నుంచి వసూళ్లకు తెరతీశారు. గతి‘లేఖ’.. నేతల చుట్టూ...⇒ కృష్ణా జిల్లాలో కీలకమైన రెవెన్యూ, మునిసిపల్,పంచాయతీరాజ్, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల బదిలీలను సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తమ సిఫారసు లేకుండా బదిలీలు చేయవద్దని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో సిఫారసు లేఖల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు చేస్తున్నారు. గన్నవరం, పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు ఇచ్చేందుకు రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆర్డీవో పోస్టుకు రూ.కోటి.. ముగ్గురు పోటీ!⇒ కర్నూలు ఆర్డీవో పోస్టును టీడీపీ నాయకులు రూ.కోటికి బేరం పెట్టినట్లు తెలిసింది. ఈ పోస్టు కోసం ముగ్గురు అధికారులు పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఎంత రేటుకు ఈ పోస్టు దక్కుతుందో ఒకటి, రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. విశాఖలో రూ.10లక్షలు–రూ.20లక్షలు⇒ విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం, భీమిలి,పెందుర్తి మండలాల తహసీల్దార్ల పోస్టింగ్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోనే మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ప్రత్యేకం⇒ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు అధికార పార్టీ నేతలు రాష్ట్రంలోనే అత్యధిక ధర రూ.2కోట్ల వరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఆనందపురం, పెందుర్తి, గాజువాక, విశాఖ జాయింట్–1 పోస్టింగ్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఇక్కడ పోస్టింగ్ కోసం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు టీడీపీ నేతలు రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయినా కొందరు అధికారులు బదిలీల కోసం ప్రజాప్రతినిధులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోస్టింగ్‌లు ఇవ్వకముందే డబ్బులు వసూలు⇒ అనకాపల్లి జిల్లాలో తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పోస్టింగ్ ఇవ్వలేదు. బదిలీల ప్రక్రియలో అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, సబ్బవరం, అనకాపల్లి, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో పోస్టింగ్‌ల కోసం రూ.10లక్షలు చొప్పున, నర్సీపట్నం, చోడవరం మండలాల్లో రూ.5 లక్షలు చొప్పున కూటమి ప్రజాప్రతినిధులు వసూలు చేసినట్లు సమాచారం. సిఫారసు ఉంటేనీ సీఐ పోస్టింగ్⇒ అనకాపల్లి జిల్లాలో సీఐల బదిలీల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యేల లెటర్ ఉంటేనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. అనకాపల్లి జిల్లాలో సబ్బవరం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, నక్కపల్లి, చోడవరం సబ్ రిజిస్ట్రార్ల పోస్టింగ్‌ల కోసం రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. -
రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గిద్దామా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును ఒక శాతంమేర తగ్గిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై నివేదిక సమ ర్పించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారు లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికా రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫీజు తగ్గింపు అంశం చర్చకు వచ్చింది. ఎలాగూ భూముల «విలువలను సవరిస్తున్నందున సామాన్య ప్రజలపై భారం పడకుండా ఒక శాతం ఫీజు తగ్గిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని చర్చించినట్లు సమాచారం.రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌లతో పాటు పలువురు డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు, భూముల విలువల సవరణ, కొత్త సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం, బదిలీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లా డుతూ సామాన్యుడిపై భారం పడకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను సవరించాలని, బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా ఈ సవరణ చేపట్టాలని సూచించారు.వచ్చే వారంలోపు సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సబ్రిజిస్ట్రార్లు పనిచేయాలని మంత్రి సూచించారు. త్వరలోనే శాఖ పరిధిలో బదిలీలు జరగనున్నా యని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తా మని, బది లీల కోసం ఎవరూ తన వద్దకు రావ ద్దని, పైరవీలు చేసే వారిపై చర్యలు తీసుకుంటా నని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. ఇక, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి చెట్ల కింద వేచి ఉండే పరిస్థితులు ఉండకూడదని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని హంగులతో శాశ్వతంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భవనాలు నిర్మించే ప్ర క్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి కోరారు. సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
విలువలే కాదు.. తప్పులూ సవరణ..!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ సర్వే నంబర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో రిజిస్ట్రేటేషన్ విలువను సవరించినప్పుడు ఈ సర్వే నంబర్లోని ఎకరం వ్యవసాయ భూమిని ఎకరాల్లో కాకుండా పొరపాటున గజాల్లో నమోదు చేశారు. దీంతో ఈ సర్వే నంబర్లోని మొత్తం వ్యవసాయ భూమి విలువ గజాల్లోనే కనిపిస్తోంది. వ్యవసాయ భూమి కాబట్టి ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేటేషన్ జరుగుతుంది కానీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం గజాల లెక్కన చెల్లించాల్సి వస్తోంది. ఇది ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50 వరకు దరఖా స్తులు వచ్చాయని సమాచారం. తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూములు, ఆస్తుల విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఈ సమస్యకు చెక్ పడనుంది. ఇలాంటి పొరపాట్లను సవరించే పనిలో ఇప్పుడు విలువల సవరణ కమిటీలు బిజీగా ఉన్నాయి. నాలుగింటిలో మూడు క్లియర్ రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణ జరిగినప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగు రూపాల్లో ఈ విలువలను నమోదు చేస్తుంది. ఇందులో ఫామ్–1, 2ల కింద రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను నమోదు చేస్తుంది. ఫామ్–3 కింద గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, ఫామ్–4 కింద జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేస్తుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఫామ్–1,2,3ల నమోదు పూర్తయిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం ఫామ్–4 కింద హైవేల పక్కన ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేసే పని జరుగుతోంది. ఇందుకోసం రెవెన్యూ వర్గాల నుంచి సర్వే నంబర్ల వారీ వివరాలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రేటార్లు పనిలో పనిగా తప్పులు సవరించే పనిని కూడా ప్రారంభించారు. వ్యవసాయ భూమి గజాలుగా నమోదైన సర్వే నంబర్లను మళ్లీ ఎకరాల్లోకి మారుస్తున్నారు.29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. 29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. -
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఒక ఆస్తిగా వారికి అప్పగించేందుకు ఈ చట్ట సవరణ చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం 30.65 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది. పేదలు ఒక ఆస్తిలా ఆ స్థలాలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆ స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసమే అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. కాగా, ఈ నెల 29వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్టర్ చేసేందుకు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలను ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం శనివారం జీవో నంబర్ 36 జారీ చేసింది. కన్వేయన్స్ డీడ్స్ ద్వారా పేదలకు భరోసా ఇంతకుముందు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై వారికి హక్కులు పొందడానికి 20 ఏళ్ల గడువు ఉండేది. దాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం 2021లోనే పదేళ్లకు తగ్గించింది. అంటే ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల తర్వాత ఆ స్థలాలపై వారికి హక్కులు వస్తాయి. గతంలో ఉన్న విధానంలో లబ్ధిదారులకు హక్కులు రావాలంటే వారు లేదా వారి వారసులకు తహసీల్దార్లు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వడం, దాన్ని రిజిస్ట్రేషన్ల శాఖకు పంపిన తర్వాత హక్కులు కల్పించడం అంతా ఓ పెద్ద ప్రహసనం. అసైన్డ్ భూముల రికార్డులు సరిగా లేకపోవడం, అసైన్ చేసినప్పుడు ఇచ్చిన డి–పట్టాలు పోవడం వంటి రకరకాల కారణాలతో అసైన్డ్ ఇళ్ల పట్టాలపై హక్కులు పొందడం పేదలకు కష్టంగా మారిపోయింది. ఈ పరిస్థితిని నివారించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇచ్చినప్పుడే పేదల పేరు మీద వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. రిజిస్టర్ అయిన వెంటనే వారికి కన్వేయన్స్ డీడ్స్ జారీ చేయడం వల్ల పదేళ్ల తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా ఆ స్థలాలపై వారికి పూర్తి హక్కులు వస్తాయి. తహసీల్దార్ల నుంచి ఎన్వోసీ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఆ స్థలాలు వారి పేరు రిజిస్టరై ఉండడం, కన్వేయన్స్ డీడ్లు కూడా ఇవ్వడంతో వాటిని ఆస్తిపత్రాలు (సేల్ డీడ్)గా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా వారి పేరు మీదే చేయడం ద్వారా మహిళలకు ప్రభుత్వం భరోసా ఇవ్వనుంది. -
15 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం
సాక్షి, అమరావతి: సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని.. 15 నాటికి దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తామన్నారు. దీనిపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న కార్డ్ 1.0 (సీఏఆర్డీ–కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) వెర్షన్‌ను 1999లో రూపొందించారని చెప్పారు. ప్రస్తుతం పెరిగిన ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ సేవలను వేగంగా, నాణ్యంగా, సురక్షితంగా పూర్తి చేయడానికి కార్డ్ 2.0 వెర్షన్‌ను రూపొందించి అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు. కొత్త విధానంలో యజమానుల సంతకాలతో ఉండే భౌతిక దస్తావేజులు పూర్తిగా కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. కార్డ్ 2.0లో దస్తావేజులను ఆన్లైన్లో తయారుచేసుకుని, ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకుని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చన్నారు. లేనిపక్షంలో తాము తయారు చేసుకున్న దస్తావేజు సాఫ్ట్ కాపీని అప్లోడ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని వెల్లడించారు. 20 నిమిషాల్లోనే దస్తావేజుల జారీ.. ప్రస్తుత విధానంలో యజమానులు తాము తయారుచేసుకున్న దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని రామకృష్ణ గుర్తు చేశారు. కొత్త విధానంలో ప్రజలకు సమయం ఆదా అవుతుందన్నారు. అంతేకాకుండా దస్తావేజులోని వివరాలు వారే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల దస్తావేజులు తప్పులు లేకుండా ఉంటాయని చెప్పారు. చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీల వివరాలను వారే సొంతంగా లెక్కించుకోవచ్చని, ఆ చార్జీలను సులువుగా ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ కోసం తమకు కుదిరే టైమ్ స్లాట్ బుక్ చేసుకొని కేవలం 20 నిమిషాల్లోనే సాఫీగా పని పూర్తిచేసుకోవచ్చని తెలిపారు. దస్తావేజుల స్కానింగ్ ప్రక్రియ కూడా ఉండదని.. రిజిస్ట్రేషన్ తర్వాత 20 నిమిషాల్లోనే దస్తావేజులు కూడా జారీ చేస్తారన్నారు. ఆధార్ లింక్ చేయడం వల్ల తప్పుడు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకునే ప్రమాదం కూడా ఉండదన్నారు. దస్తావేజుల తయారీదారులు, లేఖరులు, న్యాయ నిపుణులకు కొత్త విధానం వల్ల పని సులువు అవుతుందని వెల్లడించారు. వారి ఉపాధి పోతుందనేది అపోహ మాత్రమేనన్నారు. ఈ విధానంలో వినియోగదారులు.. మధ్యవర్తులపై ఆధారపడకుండా తమ రిజిస్ట్రేషన్‌ను తామే సులువుగా పూర్తిచేసుకోవచ్చన్నారు. ఎలాంటి డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వెంటనే ఆటోమ్యుటేషన్.. కొత్త విధానంలో వ్యవసాయ భూమికి సంబంధించిన విక్రయ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మళ్లీ వ్యక్తిగతంగా తహశీల్దార్ కార్యాలయాన్ని మ్యుటేషన్ కోసం సంప్రదించాల్సిన అవసరం ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆటోమేటిక్ మ్యుటేషన్ జరిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని ఈ విధానాన్ని రూపొందించామని తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం దస్తావేజులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా అధికారులకు సమర్పించే అవకాశం ఉంటుందన్నారు. ఏమైనా సందేహాలంటే http://registration.ap.gov.in లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న మార్గదర్శి మోసాలు
సాక్షి, అమరావతి: ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రూ.459.98 కోట్ల సొమ్మును చట్టవిరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, తదితరాల్లోకి మళ్లించినట్లు ఆడిటింగ్‌లో అధికారులు నిర్ధారించారు. తద్వారా చందాదారుల సొమ్మును తమ వ్యక్తిగత లబ్ధి కోసం రామోజీరావు, ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజ వినియోగించుకున్నట్లు స్పష్టమైంది. తాజాగా ప్రతి చిట్ గ్రూపులో ఖాళీ చిట్లు, కంపెనీ పాడుకునే రెండో నెల చిట్ల లావాదేవీల్లోనూ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. మార్గదర్శి మేనేజర్లు సమర్పించిన మినిట్స్‌ను విశ్లేషించిన ఆడిట్ అధికారులు ఈ మోసాలను గుర్తించారు. ఖాళీ చిట్లకు గానీ, ప్రతి చిట్ గ్రూపులో కంపెనీ పాడుకునే రెండో నెల చిట్కు సంబంధించి గానీ ఎటువంటి సొమ్ము (నెల వారీ చందా) చెల్లించలేదని వెల్లడైంది. ప్రతి చిట్ గ్రూపులో రెండో నెల చిట్ పాటను కంపెనీయే పాడుకునే అవకాశం ఉంది. అందుకోసం అందరి చందాదారుల మాదిరిగానే కంపెనీ కూడా చందా కట్టాలి. కానీ చందా కట్టకుండానే ఆ రెండో నెల చిట్‌ను పాడుకుని కంపెనీ జమ చేసుకుంటోంది. కంపెనీ తరఫున కట్టా ల్సి న ఎటువంటి చందాలు కట్టకుండానే ప్రతి నెలా ప్రతి గ్రూపు నుంచి 5 శాతం కమీషన్‌ను తీసుకుంటోంది. ఆధారాలతో సహా వెలుగుచూసిన అక్రమాలు.. గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు మార్గదర్శి యూనిట్లలో ఈ మోసాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో ఐదు చిట్ గ్రూపులను విశ్లేషించగా వాటి ద్వారా రూ.1.18 కోట్లను చిట్ కమీషన్‌గా, రూ.1.73 కోట్లను రెండో నెల పాడుకున్న చిట్ సొమ్ముగా కంపెనీ జమ చేసుకుంది. కానీ పాడుకున్న రెండో నెల చిట్ చందా.. అలాగే ఆ గ్రూపులో తన పేరు (ఫోర్‌మెన్) మీద ఉంచుకున్న ఖాళీ చిట్లకు చెల్లించా ల్సి న చందా సొమ్ము రూ.6.98 కోట్లు చెల్లించలేదని అధికారులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో 12 చిట్ గ్రూపులను విశ్లేషించినప్పుడు ఫోర్‌మెన్ కమీషన్ రూ.60.50 లక్షలు, రెండో నెల పాడుకున్న చిట్ మొత్తం రూ.1.05 కోట్లను కంపెనీ ఖాతాలో వేసుకున్నారు. కానీ వాటికి సంబంధించి కట్టా ల్సి న రెండో నెల చిట్ చందాలు, కంపెనీ పేరు మీద ఉన్న ఖాళీ చిట్ల చందాల మొత్తం రూ.54.85 లక్షలు కట్టలేదని తేలింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 28 చిట్ గ్రూపులను పరిశీలించినప్పుడు వాటికి ఫోర్‌మెన్ కమీషన్ రూ.3.47 కోట్లు, రెండో నెల పాడుకున్న చిట్ల మొత్తం రూ.2.73 కోట్లను కంపెనీ తీసుకుంది. కానీ వాటికి సంబంధించి కట్టా ల్సి న రూ.2.88 కోట్ల చందా సొమ్మును కట్టలేదు. భారీగా ఉల్లంఘనలు.. నెల వారీగా చందాదారులతోపాటు కట్టా ల్సి న సొమ్మును కట్టకుండానే కమీషన్ తీసుకోవడం, ప్రతి గ్రూపులోనూ చందా కట్టకుండానే రెండో నెల చిట్‌ను పాడుకుని ఆ సొమ్మును తీసుకోవడం ద్వారా మార్గదర్శిలో చిట్లు వేసిన వారిని రామోజీరావు, ఆయన కోడలు శైలజ మోసం చేసినట్లు స్పష్టమైంది. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును పణంగా పెట్టి భారీగా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. ఖాళీగా ఉన్న చిట్లకు సంబంధించి ఎటువంటి చందా చెల్లించకుండా మిగిలిన చందాదారులను మభ్యపెట్టినట్లు తేలింది. ఈ ఉల్లంఘనలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సంబంధిత మార్గదర్శి బ్రాంచ్‌లను ఆదేశించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ తెలిపారు. -
‘ప్రీమియం’ రిజిస్ట్రేషన్ రెడీ
సాక్షి, అమరావతి: ఆస్తుల క్రయ విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనం. అడుగడుగునా అవినీతి, డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువ. ఇటువంటి కష్టాలు, అవినీతి లేకుండా ప్రజలకు సులభంగా, అత్యాధునిక పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఇందుకోసం సీఎం జగన్ నేతృత్వంలో ప్రీమియం రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్లకు అధికారులు రూపకల్పన చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తోంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఇక్కడ సేవలు అందుతాయి. తొలి దశలో 9 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, శ్రీకాకుళంలో రెండు సెటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుపై ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. విశాఖ మధురవాడ సెజ్‌లోని టవర్–బిలో ఏర్పాటు చేసిన తొలి ప్రీమియం రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్ ఇప్పటికే అన్ని హంగులతో సిద్ధమైంది. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళంలో రెండోది ఏర్పాటు చేస్తారు. అనంతరం విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడపలో ఏర్పాటు చేస్తారు. సోమవారం దీనిపై ముఖ్యమంత్రితో అధికారులు సమావేశమవనున్నారు. ఆయన అంగీకరించిన వెంటనే విశాఖలో పైలట్ ప్రాజెక్టు మొదలు పెడతారు. ఈ సెంటర్ల పనితీరు, ప్రజల నుంచి వచ్చిన స్పందననుబట్టి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్.. సింగిల్ విండో రిజిస్ట్రేషన్లు ఈ సెంటర్లలో ఫ్రంట్ ఎండ్ (ముందు భాగం)లో అవుట్సోర్సింగ్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు. బ్యాక్ ఎండ్‌లో సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది పనిచేస్తారు. మొదట కొద్ది రోజులు ఆఫ్‌లైన్ సేవలు అందించినా, ఆ తర్వాత అన్నీ ఆన్లైన్ సేవలే ఉండేలా వీటిని డిజైన్ చేశారు. వినియోగదారులు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దాని ప్రకారం సెంటర్‌కు వెళ్లి సింగిల్ విండో కింద రిక్వెస్ట్ పెడితే ఆన్లైన్లో సంబంధిత సేవా ప్రక్రియ మొదలవుతుంది. వినియోగదారులే తమ సమాచారాన్ని నమోదు (డేటా ఎంట్రీ) చేసుకోవచ్చు. అది ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్‌కి వెళుతుంది. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ప్రోపర్టీ వెరిఫికేషన్‌ను సంబంధిత ప్రభుత్వ శాఖ వెబ్సైట్ ద్వారా పరిశీలిస్తారు. అది సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఏమాత్రం ఉండదు. రిజిష్ట్రేషన్ అయిన వెంటనే చేయించుకున్న వారికి పూర్తయినట్లు మెసేజ్ వెళుతుంది. రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ మదింపు, ఈసీలు, సీసీలు, స్టాంపుల అమ్మకాలన్నీ ఇక్కడే జరుగుతాయి. స్టాంప్ డ్యూటీ కలెక్షన్లను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఇందుకోసం ఆ సంస్థ అక్కడ ఒక బ్రాంచిని ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా అక్కడికక్కడే ఆన్లైన్లో చెల్లింపులు చేయొచ్చు. ప్రస్తుతానికి ఇప్పటికే పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని వినియోగించనున్నారు. అవసరాన్నిబట్టి ఫ్రంట్ ఎండ్ సేవలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ సెంటర్లలో వినియోగదారుల కోసం విశ్రాంతి గది, కెఫెటేరియా వంటి సదుపాయాలుంటాయి. అవినీతి రహితంగా, సులభంగా రిజిస్ట్రేషన్లు అవినీతి రహిత రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రీమియం సెంటర్ల ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. – డాక్టర్ రజత్ భార్గవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ -
Registrations Department: కుర్చీ వదిలేదేలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపించే రిజిస్ట్రేషన్ల శాఖలో చాలా మంది అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసుకొని కూర్చుంటున్నారు. తమకు కాసుల పంట పండుతుండటంతో కొందరు డిప్యుటేషన్ల గడువు ముగిసినా సీట్ల నుంచి కదిలేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక జిల్లా కేంద్రంలో జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ పదేళ్లుగా అక్కడే పనిచేస్తుండగా మరో జిల్లా కేంద్రంలోని ఓ సబ్‌రిజిస్ట్రార్‌కు పోస్టింగ్ ఇచ్చి ఏకంగా 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటిదాకా బదిలీ కాలేదు. ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న వారు సైతం పదోన్నతులు పొందినా ప్రస్తుత స్థానాలను వదలడం లేదు. ఆయా సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నా రాజకీయ అండదండలతో అవే సీట్లలో కొనసాగుతున్నారు. దీంతో ఆమ్యామ్యాలు లేనిదే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరగడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దొడ్డిదారి.... పైరవీల రహదారి రాష్ట్రవ్యాప్తంగా 25 మంది వరకు డిప్యుటేషన్లపై కొనసాగుతుండగా ఇటీవలే బంజారాహిల్స్, నార్సింగి, ఉప్పల్, మహబూబ్‌నగర్ సబ్రిజిస్ట్రార్ల డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఇలాంటి కార్యాలయాల్లో పోస్టింగుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. సబ్ రిజిస్ట్రార్లుగా డిప్యుటేషన్, ఇన్చార్జి పోస్టింగుల కోసం ప్రభుత్వ పెద్దలపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. డిప్యుటేషన్ పోస్టింగుల కోసం పైరవీలు చేసిన వారే మళ్లీ వాటి రద్దు కోసం ప్రయత్నాలు చేయడం, కీలక బాధ్యతల్లో ఉన్న ఓ మంత్రిపై ఒత్తిడి చేస్తుండటం ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే జిల్లా రిజిస్ట్రార్ పోస్టింగుల కోసం కూడా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయని, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎక్కువగా జరిగే జిల్లాల్లో డీఆర్ పోస్టింగుల కోసం కూడా ప్రభుత్వ పెద్దలపై అధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతోంది. బదిలీలు ఏమయ్యాయి? రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు జరిగి దశాబ్ద కాలం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సబ్రిజిస్ట్రార్ల సాధారణ బదిలీలు జరగ్గా మియాపూర్ భూ కుంభకోణం తర్వాత 2017లో కొందరిని బదిలీ చేశారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోకల్ కేడర్ అలాట్మెంట్లో భాగంగా సీనియారిటీ ప్రాతిపదికన కొన్ని పోస్టులు అటూఇటు అయ్యాయి. అవి కూడా చాలా తక్కువ సంఖ్యలోనే. ఇక కిందిస్థాయి సిబ్బంది బదిలీలు 2010 తర్వాత జరగనేలేదు. అధికారులు, సిబ్బంది బదిలీల కోసం కొన్ని నెలల కిందటే కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం దానిపై నిర్ణయం మాత్రం తీసుకోకపోవడం గమనార్హం. సుదీర్ఘకాలంగా బదిలీలు జరగకపోవడంతోనే డిప్యుటేషన్ల కోసం పైరవీలు, ఇన్చార్జీల పాలన నడుస్తోందని.. వెంటనే రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. లంచాలివ్వకుంటే అన్నీ కొర్రీలే... చాలాకాలంగా ఒకేచోట పనిచేస్తున్న సబ్రిజిస్ట్రార్లలో కొందరు తమకు ‘రావాల్సినవి’అందిన డాక్యుమెంట్లు... ఏజెంట్లు తీసుకొచ్చే డాక్యుమెంట్ల విషయంలో ఒకలాగా, మిగిలిన డాక్యుమెంట్ల విషయంలో మరోలాగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదేమంటే రిజిస్ట్రేషన్ల చట్టంలోని ఏదో ఒక రూల్ చెప్పి కొర్రీ వేయడం వారికి పరిపాటిగా మారింది. నాలుగు సార్లు ఏదో రకంగా వెనక్కు పంపిస్తే ఐదోసారి తమకు కావాల్సినవి ముట్టజెప్తారనే ధోరణిలోనే సబ్రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారని, ముట్టిన తర్వాత చట్టాలు ఎలా ఉన్నా పని అయిపోతుందనే చర్చ బహిరంగ రహస్యమే. -
అక్రమ రిజిస్ట్రేషన్లు.. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ అరెస్టు
చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్: ఓ స్థలానికి సంబంధించి యజమాని ఒకరైతే.. వాళ్లకే తెలియకుండా మరొకరి పేరిట రూ.కోట్లు విలువ చేసే భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాను గత నెలలో చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన తహసీల్దార్ ఐ.సుబ్రహ్మణ్యం, సబ్ రిజిస్ట్రార్ జె.శ్రీధర్ గుప్తా, వీఆర్వోలు ధనుంజయ, ఎం.శివనారాయణ, కె.బాబును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలో దాదాపు రూ.50 కోట్లకుపైగా విలువ చేసే భూములు, ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల సాయంతో సురేంద్రబాబు తదితరులు ఓ ముఠాగా ఏర్పడి వేరేవారికి కట్టబెట్టారు. దీంతో సురేంద్రబాబుతో పాటు మొత్తం ఏడుగురిని సెప్టెంబర్ 30న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని అక్రమాలు జరిగినట్లు ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన లోతుగా దర్యాప్తు చేయించారు. అక్రమాలు బయటపడింది ఇలా.. చిత్తూరుకు చెందిన బాలగురునాథంకు చెందిన ఐదెకరాల స్థలాన్ని సురేంద్రబాబు ముఠా.. యాదమరి మండలం మాధవరం పంచాయతీకి చెందిన ఎబినైజర్, పూపతమ్మ, మురళి, శివకుమార్, చిట్టిబాబు, చిత్తూరుకు చెందిన నితీష్‌కు రూ.75 లక్షలకు అమ్మేశారు. తాము మోసపోయామని, ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకుండా విలువైన స్థలాలను తమకు రిజిస్ట్రేషన్ చేసి ఏమార్చారని ఎబినైజర్ గత నెల 25న యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన పోలీసులు ఎబినైజర్ కొన్న స్థలం బాలగురునాథంకు చెందిందిగా గుర్తించారు. ఈ భూమిని గ్రామకంఠం భూమిగా పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో రెండేళ్ల క్రితం చిత్తూరు తహసీల్దార్‌గా పనిచేసి, ప్రస్తుతం పుత్తూరు తహసీల్దార్‌గా ఉన్న ఐ.సుబ్రహ్మణ్యం, చిత్తూరు వీఆర్వోలు ధనంజయ, కె.బాబు, శివనారాయణ కీలకపాత్ర పోషించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ఈకేవైసీ చేయడం, ఉద్యోగుల లాగిన్, పాస్‌వర్డ్‌తోపాటు ప్రభుత్వ సమాచారాన్ని దళారులకు ఇవ్వడంలో ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది హస్తం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారులు నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పెద్ద మొత్తంలో నగదు రూపేణా లబ్ధి పొందినట్టు ఆధారాలు సేకరించారు. ఈ అరెస్టులు ఇంతటితో ఆగవని, మరికొంతమంది హస్తం ఉందని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.. చిత్తూరు అర్బన్ జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ గిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పందించిన ఆయన జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావును విచారణ అధికారిగా నియమించారు. విచారణలో శ్రీధర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు చిత్తూరు దాటివెళ్లవద్దని ఆదేశించారు. -
రోజుకు రూ. 30 కోట్ల పైమాటే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ల శాఖ కాసుల వర్షం కురిపిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయే తర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలు వలు పెరిగిన తర్వాత 15 రోజుల్లోనే ఆ శాఖ ఆదాయం అమాంతంగా పెరిగింది. ఈనెల ఒకటో తేదీ నుంచి తాజాగా గురువారంరాత్రి వరకు 61 వేలకుపైగా లావాదేవీలు జరగగా, రూ.502. 87 కోట్ల ఆదాయం సమకూరినట్టు రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, రోజుకు రూ.30 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోందన్న మాట. కేవలం వ్యవ సాయేతర భూములు, ఆస్తుల రిజి స్ట్రేషన్లకే ఈ ఆదాయం రాగా, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు మరో రూ.100 కోట్లు వస్తాయని రెవెన్యూవర్గాలు భావి స్తున్నాయి. ఈ నెలలో మిగిలిన 15 రోజు లకు మరో రూ.500 కోట్లు వస్తాయని, మొత్తం కలిపి ఈ నెలలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది రూ.10 వేల కోట్లు 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.12 వేల కోట్ల ఆదాయం రాబట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, ఫిబ్రవరి 15 నాటికే రూ.10 వేల కోట్లు వచ్చాయని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్టాంపుల విక్రయంతో వచ్చిన ఆదాయం కలుపుకుంటే అది రూ.12 వేల కోట్లకు చేరిందని సమాచారం. గతేడాది జూలైలో ప్రభుత్వ విలువలను సవరించడం, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి నప్పటి నుంచే రిజిస్ట్రేషన్ల ఆదాయం పరుగులు పెడుతోంది. తాజాగా ఫిబ్రవరి ఒకటిన ప్రభుత్వ విలువలను మరోసారి సవరించిన నేపథ్యంలో ఈ ఆదాయం మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిలకడగా కొన సాగుతుండటం, క్రయవిక్రయ లావా దేవీలు నానాటికీ పెరుగుతుండ టమే ఇందుకు కారణమని, వచ్చే ఆర్థిక సంవ త్సరంలో ఒక్క రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆ శాఖ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
ఓటీఎస్‌కు మంచి స్పందన
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి ఆదరణ పెరుగుతోంది. పథకం వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 8,11,697 మంది ఈ పథకం కింద లబ్ధిపొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1.14 లక్షలు, పశ్చిమ గోదావరిలో 1.03 లక్షలు, గుంటూరు జిల్లాలో 89 వేల మంది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 8.11 లక్షల మందిలో 6 లక్షల మంది గడిచిన 10 రోజుల్లో ముందుకు రావడం విశేషం. రూ.10వేల కోట్ల రుణాల మాఫీ ఇక గృహ నిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ఈ పథకంతో భారీ ఊరట కల్పించింది. ఓటీఎస్ రూపంలో రూ.10వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేసింది. దీంతోపాటు పేదలపై తలకు మించిన భారం మోపకుండా తక్కువ మొత్తంలో ధరలు నిర్దేశించి వాటిని చెల్లించిన వారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. ఎటువంటి రుసుములు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.6వేల కోట్లు, ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. రేపటి నుంచి పంపిణీ స్వచ్ఛందంగా పథకం వినియోగించుకోవడానికి ముందుకు వచ్చిన వారి పేర్లపై ఇళ్ల రిజిస్ట్రేషన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 26,023 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం రేపటి (మంగళవారం) నుంచి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేపట్టనుంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించనున్నారు. గతంలో చెల్లించిన వారికి కూడా.. 2000 నుంచి 2014 మధ్య వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వినియోగించుకుని, 2014–19 మధ్య ఓటీఎస్ లేకుండా రుణాలు చెల్లించిన వారికి కూడా ఇళ్లపై హక్కులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 2000–2014 మధ్య 2.31 లక్షల మంది రుణాలు చెల్లించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో వడ్డీ, అసలుతో కలిపి 43 వేల మంది లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు రుణాలు చెల్లించారు. అవగాహన కల్పిస్తున్నాం పథకంతో కలిగే ప్రయోజనాలపై అర్హులకు అవగాహన కల్పిస్తున్నాం. అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. 22ఏ జాబితా నుంచి స్థలాలను తొలగించి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిస్తోంది. దీంతో బ్యాంకుల్లో ఇళ్లను తనఖా పెట్టుకోవడానికి, అమ్మడానికి, వారసుల పేర్లపై బదిలీ చేయడానికి వీలుంటుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని మేలును వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తోంది. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ సంస్థ నుంచి ఐదుసార్లు సిఫార్సు చేసినా ఓటీఎస్ కింద వడ్డీలు మాఫీ చేయడానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. ప్రస్తుతం వడ్డీ, అసలు రెండింటిలో రాయితీ ఇవ్వడంతో పాటు, ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తుంటే టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అర్హులు దీన్ని గమనించాలి. అర్హులైన ప్రతిఒక్కరూ దీని ప్రయోజనాలను తెలుసుకుని పథకాన్ని వినియోగించుకోవాలి. – దావులూరి దొరబాబు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ -
‘రియల్’ ఒప్పందాల స్టాంప్ డ్యూటీపై మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే అభివృద్ధి, విక్రయ–జీపీఏ ఒప్పందాలకు కట్టే స్టాంప్ డ్యూటీకి సంబంధించిన అంశాలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టత కోసం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ఐజీ అండ్ కమిషనర్ రామకృష్ణ అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 2 మెమోలు జారీ చేశారు. అపార్ట్మెంట్లు నిర్మించే ముందు భూ యాజమాని, డెవలపర్ మధ్య జరిగే ఒప్పందాలు, నిర్మాణం తర్వాత విక్రయ–జీపీఏ (సేల్ కం జీపీఏ అగ్రిమెంట్లు)ఒప్పందాలకు స్టాంప్ డ్యూటీ కట్టించుకునే విషయంలో చాలాకాలం నుంచి కొన్ని అనుమానాలు, అస్పష్టతలు ఉన్న విషయం కమిషనర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వాటిని పరిష్కరించేందుకు పలు ఆదేశాలిచ్చారు. -
సమగ్ర భూసర్వే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం
సాక్షి, అమరావతి: అస్తవ్యస్తంగా మారిన భూముల రికార్డులను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. తొలుత 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే దాదాపు పూర్తయింది. ఈ గ్రామాల కొత్త సర్వే రికార్డులను భూ సర్వే శాఖ త్వరలో విడుదల చేయనుంది. దీనికి ముందు సర్వే ముగింపునకు సంబంధించిన నంబర్ 13 ముసాయిదా నోటిఫికేషన్లను ముద్రించనుంది. 51 గ్రామాల రీసర్వేలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించి.. తుది రికార్డులను రూపొందించామని అధికారులు తెలిపారు. తద్వారా మిగిలిన గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ 51 గ్రామాల్లో 63,433 ఎకరాలను రీసర్వే చేశారు. సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన డ్రోన్ చిత్రాలు, భూ యజమానులు వాస్తవంగా చూపించిన సరిహద్దులను పోల్చి కొలతలు వేశారు. తొలుత ఆ గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములను సర్వే చేశారు. ఆ తర్వాత పట్టా భూముల సర్వే నిర్వహించారు. కొత్తగా వచ్చిన కొలతలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జీఎన్ఎస్ఎస్ రోవర్‌తో మళ్లీ సర్వే చేశారు. ఈ గ్రామాల్లో రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి 588 వినతులు, సర్వేకి సంబంధించి 1,564 వినతులు వచ్చాయి. వాటిలో 95%కిపైగా వినతుల్ని మొబైల్ సర్వే బృందాలు పరిష్కరించాయి. రైతుల ఆమోదంతో తుది రికార్డులను రూపొందిస్తున్నారు. సాంకేతికతతో కచ్చితమైన కొలతలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూముల రికార్డులు వందేళ్ల క్రితం బ్రిటిషర్ల హయాంలో తయారుచేసినవి. అప్పట్లో చైన్ ద్వారా కొలిచి.. భూముల హద్దులు నిర్ణయించి రికార్డులు రూపొందించారు. వాటి ఆధారంగానే ఆ భూములు ఎన్నో తరాలుగా చేతులు మారుతూ వస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసి తమ పేరున రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తులు అధికారికంగా కొలతలు వేయించుకోవడం అరుదుగా జరిగేది. పాత రికార్డుల్లో ఉన్న హద్దుల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరిగేవి. దీంతో కొలతలు మారిపోయి సరిహద్దు తగాదాలు, ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయి. అడంగల్‌లో పాత రికార్డుల కొలతలు, ఇప్పటి కొలతలకు చాలా తేడాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసర్వేలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితమైన కొలతలతో ఈ 51 గ్రామాల్లో సరిహద్దులు నిర్ణయించారు. వాటి ఆధారంగా భూముల రిజిస్టర్లు, గ్రామ మ్యాప్‌లను రూపొందించారు. ఈ వివరాలనే అడంగల్‌లో నమోదు చేస్తారు. చివరిగా ప్రతి భూమికి సంబంధించి ఒక విశిష్ట సంఖ్యను ఇవ్వనున్నట్లు సర్వే సెటిల్మెంట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కెజియాకుమారి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుతోపాటే తొలి దశలో 5,500 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను గతంలోనే ప్రారంభించారు. అందులో 2,500 గ్రామాల్లో ప్రీ డ్రోన్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మిగిలిన గ్రామాల్లో సర్వే పనుల్ని ముమ్మరం చేశారు. పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో విజయవంతంగా సమగ్ర సర్వే పూర్తికావడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే ప్రక్రియ ఊపందుకుంటుందని అధికారులు చెబుతున్నారు. -
నగదు లావాదేవీలపై నిరంతర నిఘా
కైకలూరు : ఇకపై ప్రధాన నగదు లావాదేవీలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మండవల్లి సబ్ రిజిస్ట్రార్ నకిలీ చలానా కేసులో ప్రధాన నిందితుడు రామ్థీరజ్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. కైకలూరు సర్కిల్ కార్యాలయం వద్ద స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్, గుడివాడ డీఎస్పీ సత్యానందంతో కలసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా మోసపోయిన బాధితులు ప్రసాద్, వీరసత్యబాబులు తాము ఏ విధంగా నష్టపోయారో వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు.. నకిలీ చలానా కేసుపై సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారని, దీంతో గుడివాడ డీఎస్పీ సత్యానందంను ప్రత్యేకాధికారిగా నియమించి విచారణ జరిపించినట్టు తెలిపారు. తండ్రీకొడుకులది ప్రధాన పాత్ర.. మండవల్లికి చెందిన స్టాంప్ వెండర్ మేడేపల్లి రామ్థీరజ్, అతని తండ్రి డాక్యుమెంట్ రైటర్ బాలాజీ కలిసి.. 568 రిజిస్ట్రేషన్ల నిమిత్తం 640 చలానాలలో రూ.2,68,04,943 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, చలానాలను మార్ఫింగ్ చేసి కేవలం రూ.15,92,158 మాత్రమే చెల్లించినట్టు తెలిపారు. అదే విధంగా నాన్–జ్యుడిషియల్ స్టాంపుల కొనుగోలు నిమిత్తం ఏడు చలానాల ద్వారా రూ.1,55,800 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.1,981 మాత్రమే చెల్లించి, ప్రభుత్వానికి రూ.1,53,819 జమ చేయలేదన్నారు. ఈ నెల 19న సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో మండవల్లిలో కేసు నమోదు చేసి, బాధితులతో 21న డీఎస్పీ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. కేసును ఛేదించిన గుడివాడ డీఎస్పీ, కైకలూరు సీఐ వైవీవీఎల్ నాయుడు, మండవల్లి ఎస్ఐ రామకృష్ణను అభినందించారు. అలాగే మండవల్లి నకిలీ చలానా కేసులో పోలీసుల పనితీరు అభినందనీయమని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ రవీంద్రనాథ్ ప్రశంసించారు. -
‘నకిలీ చలానా’లపై ఏపీ సర్కార్ సీరియస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబుతో ఫోన్లో మాట్లాడారు. ఆయన నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నకిలీ చలానాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. జరిగిన అవకతవకలపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నష్టపోయిన సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా.. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే చర్యలు.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ల శాఖ వెంటనే రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం ముమ్మర తనిఖీలు చేసింది. మొదట కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగుచూసిన ఈ నకిలీ చలానాల వ్యవహారం మరికొన్నిచోట్ల కూడా జరిగినట్టు సమాచారం అందడంతో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏడాది కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నింటినీ పరిశీలించింది. డాక్యుమెంట్ విలువ ప్రకారం వాటికి చలానాలు కట్టారో, లేదో అధికారులు పరిశీలించారు. అనుమానం ఉన్న 20కిపైగా కార్యాలయాల్లో తనిఖీలు జరపగా 17 కార్యాలయాల్లో నకిలీ చలానాల వ్యవహారం బయటపడింది. శ్రీకాకుళం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలింది. మిగిలిన జిల్లాల్లో ఎక్కడో ఒక చోట అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించారు. మొత్తంగా నకిలీ చలానాల ద్వారా ఇప్పటివరకు రూ.5.42 కోట్లు పక్కదారి పట్టిందని నిర్ధారించారు. కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అత్యధికంగా 282 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.2.31 కోట్లను పక్కదారి పట్టించినట్లు తేలింది. పటమట (విజయవాడ), గజపతినగరం, నర్సీపట్నం, ఆలమూరు, భీమవరం, ఆకివీడు, గునుపూడి, ఆచంట, పెనుగొండ, గాంధీనగర్ (విజయవాడ), గుణదల (విజయవాడ), నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు. ఒక్క రోజులోనే రూ.1.37 కోట్లు రికవరీ దారిమళ్లిన సొమ్మును రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు తనిఖీల్లో రికవరీ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే రూ.1.37 కోట్లను రికవరీ చేశారు. విజయనగరం డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.21.74 లక్షలు ఆదాయం కోల్పోగా మొత్తాన్ని రికవరీ చేశారు. విశాఖపట్నం జిల్లాలో రూ.5.19 లక్షలకు రూ.4.96 లక్షలు రాబట్టారు. ఏలూరు డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.9.59 లక్షలకు రూ.4.84 లక్షలు, విజయవాడ డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.3.80 కోట్లకు రూ.71 లక్షలు, కర్నూలు డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.7.39 లక్షలకు రూ.7.39 లక్షలు, కడప డీఐజీ కార్యాలయం పరిధిలో రూ.1.08 కోట్లకు రూ.19.59 లక్షలు రికవరీ చేశారు. మిగిలిన మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ అక్రమాల పర్వానికి డాక్యుమెంట్ రైటర్లు ప్రధాన కారణమని తేల్చారు. వారితోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని కొందరు ఆపరేటర్లు, ఉద్యోగులు, ఒకటి, రెండు చోట్ల సబ్ రిజిస్ట్రార్ల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా.. తేడా ఉన్న చలానాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావని ఆ శాఖ విజయవాడ డీఐజీ రవీంద్రనాథ్ తెలిపారు. అవి చెల్లుబాటు కావాలంటే జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని ఆ డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయించుకున్న యజమానులకు సూచించారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు నకిలీ చలానాల ద్వారా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం మొత్తాన్ని తిరిగి రాబడతాం. ఇప్పటికే రూ.1.37 కోట్లు రికవరీ చేశాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నాం. అక్రమాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపడతాం. అక్రమార్కులు ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయించుకున్న యజమానులు ఎవరైనా తెలియక, పొరపాటున ఇందులో భాగస్వాములైతే తప్ప వారిని కూడా వదిలిపెట్టం. భవిష్యత్తులో చలానాల ద్వారా ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఇప్పటికే మార్పులు చేశాం. - ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ -
భూముల ధరలకు రెక్కలు.. ఎకరా కనిష్ట ధర రూ.75 వేలు
మూడు రకాల భూములు, ఆస్తులకు ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు ధరలు పెంచాలన్న దానిపై సుదీర్ఘ కసరత్తు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ కేటగిరీల వారీగా ధరలను నిర్ధారించింది. రియల్ ఎస్టేట్ బూమ్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఇటు మధ్య తరగతి ప్రజానీకానికి భారం పడకుండా ప్రభుత్వ విలువలను సవరించామని అధికారులు చెబుతున్నారు. ఖాళీ స్థలాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ అప్లోడ్ చేస్తుండగా, వ్యవసాయ భూముల వివరాలను ధరణి పోర్టల్ సాంకేతిక బృందం అప్లోడ్ చేయనుంది. ప్రస్తుతం ఉన్న6 శాతం నుంచి 7.5 శాతానికి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఫీజు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/అపార్ట్మెంట్లకు ప్రభుత్వ ధరల సవరణ ప్రక్రియ పూర్తయింది. వ్యవసాయ భూమి కనిష్ట ధర ఎకరం రూ.75 వేలుగా నిర్ధారించారు. సవరించిన ధరలు ఈనెల 20వ తేదీ నుంచి లేదా ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు (జనాభా ప్రాతిపదికన), కార్పొరేషన్లు, హెచ్ఎండీఏ -1, హెచ్ఎండీఏ-2, జీహెచ్ఎంసీలను యూనిట్‌గా తీసుకుని రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ధరలను ఖరారు చేసింది. వ్యవసాయ భూములను ఐదు కేటగిరీలుగా విభజించింది. వ్యవసాయ భూముల విషయంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)ని గ్రామీణ ప్రాంతాల్లో కలపగా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ)ల పరిధిలో ప్రత్యేక ధరలను నిర్ణయించింది. మూడు రకాలు.. పలు శ్లాబులు వ్యవసాయ భూముల విషయానికి వస్తే ప్రస్తుతం ఎకరాకు కనిష్టంగా రూ.10 వేలు ఉన్న బుక్ వాల్యూను రూ.75 వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇదే కనిష్ట ధరగా నిర్ధారణ కానుంది. ఆ తర్వాత శ్లాబులను 30, 40, 50 శాతంగా పెంచారు. ఫ్లాట్లు/అపార్ట్మెంట్ల విషయంలో జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకున్నారు. లక్షలోపు, లక్షకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలు, హెచ్ఎండీఏ, జీహెచ్‌ఎంసీలతో పాటు గ్రామీణ ప్రాంతాల ఆధారంగా ధరలు నిర్ణయించారు. లక్షలోపు జనాభా ఉన్న పంచాయతీలకు కనిష్ట ధర చదరపు అడుగుకు రూ.1,000గా ప్రతిపాదించారు. ఖాళీ స్థలాల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కనిష్ట ధర చదరపు గజానికి రూ.200, మండల కేంద్రాలు, 50 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రూ.300, 50 వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రూ.400, వీటీడీఏ మినహా ఇతర పురపాలికలు, కార్పొరేషన్లలో రూ.500, హెచ్ఎండీఏ -1లో రూ.1,500 హెచ్ఎండీఏ-2లో రూ.800, జీహెచ్ఎంసీలో రూ.3 వేలుగా కనిష్ట ధరను నిర్ధారించారు. అన్ని రకాల ప్రాంతాల్లోనూ గరిష్ట ధరను 3- 4 శ్లాబులుగా విభజించారు. ఈ విభజన మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ (కమర్షియల్)లో అత్యధికంగా ప్రస్తుతం గజం రూ.65 వేలుగా ఉన్న గరిష్ట ధర పెరిగిన ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత రూ.74,500 (30 శాతం) కానుంది. రాష్ట్రంలో చదరపు గజానికి ఇదే అత్యధిక ప్రభుత్వ ధర కానుండడం గమనార్హం. సవరణ కమిటీల ఆమోదం భూముల విలువల సవరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విలువల సవరణ కమిటీలు శనివారం సమావేశమయ్యాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన ఈ సమావేశాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదాలో తహసీల్దార్లు హాజరయ్యారు. ఆయా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల్లోని భూముల సవరణ ప్రతిపాదనలు కమిటీలు పరిశీలించి వాటికి ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఎప్పుడైనా సవరించిన విలువలను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రిజిస్ట్రేషన్ల శాఖ చెపుతుండగా, ఈనెల 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఒకవేళ వాయిదా పడితే ఆగస్టు 1 నుంచి సవరించిన విలువలు అమల్లోకి రావడం ఖాయమని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ఖాయం! భూముల విలువల సవరణతో పాటు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు కూడా ఖాయమేనని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఇందుకు అంగీకరించారని, ప్రస్తుతమున్న 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతానికి పెంచుతూ నేడో, రేపో ఉత్తర్వులు వస్తాయని సమాచారం. -
కొత్త సర్వర్‌పై రిజిస్ట్రేషన్లు మొదలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సర్వర్ల ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేయడం సోమవారం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణకు కలిపి హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ సర్వర్ వ్యవస్థను విభజించారు. గత రెండు రోజులుగా చేస్తున్న విభజన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని మంగళగిరిలో ఉన్న పై–డేటా సెంటర్‌కి డేటాబేస్‌ను మార్చారు. ఇక్కడ సర్వర్ల సామర్థ్యాన్ని గతంకన్నా పెంచి డేటాబేస్‌ను సిద్ధం చేశారు. ఈ సర్వర్లపైనే సోమవారం టెస్టింగ్ కింద రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం వరకు టెస్టింగ్‌లో భాగంగానే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. మార్చిన సర్వర్‌లో వస్తున్న సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. సర్వర్ స్పీడ్ ఎలా ఉంది, ఎప్పుడు తగ్గుతుంది, వేలిముద్రల స్కానింగ్, వెబ్‌ల్యాండ్, స్టోరేజీ తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మరో 48 గంటల సమయం పడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అండ్ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు ‘సాక్షి’కి తెలిపారు. బుధవారం నుంచి మార్చిన సర్వర్ వ్యవస్థ ద్వారా పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి సర్వర్‌తో ఇక్కట్లు సెంట్రల్ సర్వర్ వ్యవస్థ తెలంగాణతో కలిసి ఉండడం వల్ల ఇప్పటివరకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సర్వర్ల సామర్థ్యం సరిపోక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు తరచూ ఇబ్బందులు ఏర్పడేవి. రోజుల తరబడి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఉదంతాలున్నాయి. దీంతో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ సర్వర్ వ్యవస్థను విభజించి మన రాష్ట్రంలో కొత్త డేటాబేస్‌ను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, రోజూ జరిగే రిజిస్ట్రేషన్లు, అవసరమైన స్టోరేజీ తదితర వాటికి అనుగుణంగా సర్వర్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచారు. దీనివల్ల ఇకపై సర్వర్ సమస్యలు ఉండవని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. -
రియల్ బూమ్.. జోరుగా రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటివరకు రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 75,236 లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.382.64 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. దీంతోపాటు రూ.200 కోట్లు ఈ చలాన్ల రూపంలో వచ్చాయి. కరోనా మన రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందు సాధారణంగా రోజుకు 4-5 వేల వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. ఈ నెలలో వచ్చిన సెలవులను మినహాయిస్తే దాదాపు అదే స్థాయిలో లావాదేవీలు జరిగాయి. ఎప్పుడు ఏమవుతుందో? కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరగడానికి మళ్లీ లాక్డౌన్ పెడతారేమోననే ఆందోళనే కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాక ఏ క్షణమైనా ప్రభుత్వం లాక్డౌన్ పెట్టే అవకాశముందని రియల్టర్లు, కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ కూడా రియల్ లావాదేవీలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనుకుంటున్న ప్రభుత్వం.. కచ్చి తంగా మార్కెట్ విలువలను పెంచుతుందనే అభిప్రాయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉంది. ఏప్రిల్ 1 నుంచే మార్కెట్ విలువల పెంపు అమల్లోకి వస్తుం దనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ మార్కెట్ విలువలు పెరిగితే ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఫీజు పడుతుందనే ఆలోచనతోనే హడావుడిగా రిజిస్ట్రేషన్లకు వెళ్లాల్సి వస్తోందని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకోవడం కూడా లావాదేవీలు పెరిగేందుకు కారణమని రిజిస్ట్రేషన్ల అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు క్రయ, విక్రయ లావాదేవీల నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుండడంతో అన్ని రకాల కోవిడ్ నిబంధనలను రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తోంది. ముఖ్యంగా ఫొటో క్యాప్చరింగ్ సమయంలో మాస్కులు తీయాల్సి ఉన్నందున ఆ విభాగంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.400 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చిన నేపథ్యంలో ఈ నెలలో మిగిలిన పనిదినాల్లో జరిగే లావాదేవీల ఆధారంగా మరో రూ.100 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్ చదవండి: రియల్ బూమ్.. జోరుగా రిజిస్ట్రేషన్లు -
చారి.. జైలుకు పదకొండోసారి!
సాక్షి, హైదరాబాద్: అతడో ‘అవతార’పురుషుడు. చిన్నమొత్తాలు కొల్లగొట్టే పెద్దదొంగ. పేరు రాయబండి సూర్యప్రకాశ్‌చారి... ఇంటర్మీడియెట్ కూడా పాస్ కాలేదు... అయితేనేం.. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని అధికారినని చెప్పుకుంటాడు... నకిలీ జర్నలిస్ట్ అవతారం ఎత్తుతాడు.. సన్మానాలు, అన్నదాన కార్యక్రమాల పేరిట ప్రభుత్వాధికారులకు ఎరవేస్తాడు. బదిలీల పేరుతో భయపెట్టి అందినకాడికి దండుకుంటాడు. ఈ ఘరానా మోసగాడిని మధ్యమండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వివరాలను డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. సూర్యప్రకాశ్‌చారి ఇప్పటివరకు 11 సార్లు కటకటాల్లోకి వెళ్లాడు. అతడు ఏ నేరంలోనూ రూ.లక్షకు మించి వసూలు చేయలేదు. చిన్న మొత్తాలు అయితేనే అధికారులు పెద్దగా పట్టించుకోరని ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. నకిలీ విలేకరి అవతారంతో మొదలు... రంగారెడ్డి జిల్లా కుంట్లూరుకు చెందిన రాయబండి సూర్యప్రకాశ్‌చారి ఉప్పల్‌లోని కళ్యాణ్పురి కాలనీలో నివసిస్తున్నాడు. ఇతగాడికి ఆర్ఎస్పీ చారి, సూరిబాబు, ప్రకాశ్ అనే మారు పేర్లూ ఉన్నాయి. నగరానికి వలసవచ్చి కొన్ని దిన, వార పత్రికల్లో పనిచేశాడు. ఇతడి ప్రవర్తన కారణంగా ఉద్యోగాలు ఊడిపోయాయి. అయినా, హైదరాబాద్, సైబరా బాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అనేక స్కూళ్లు, ఆస్పత్రులకు కాల్ చేసి ప్రముఖ దినపత్రికలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకునేవాడు. తమ పత్రిక తరఫున భారీ ఈవెంట్ జరుగుతోందని, విరాళాలు ఇవ్వాలని అందినకాడికి దండుకునేవాడు. మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడినంటూ చెప్పి పలువురి దగ్గర డబ్బు వసూలు చేశాడు. మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ సైతం... ఈ తరహా నేరాలకు పాల్పడుతూ 2009 నుంచి కుషాయిగూడ, చైతన్యపురి, కీసర, మీర్పేట్, హయత్‌నగర్, చైతన్యపురి, సనత్‌నగర్, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇతడి మోసాల బారినపడినవారిలో మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి సైతం ఉన్నారు. 2016లో కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎ.రాణిరెడ్డికి అతడు ఫోన్‌కాల్ చేసి సీఎంవో నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. జిల్లాస్థాయిలో ఉత్తమ అధికారిణిగా ఎంపికయ్యారని, రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం చేయనున్నామని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమం నిర్వహణకు రూ.35 వేలు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతా నంబర్‌ను ఎస్సెమ్మెస్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన రాణిరెడ్డి సీఎంవోలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె అప్పట్లో హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు బ్యాంకు అకౌంట్, ఫోన్ నంబర్ ఆధారంగా సూర్యప్రకాశ్‌చారిని గుర్తించి అరెస్టు చేశారు. ఆ తరువాత ఓ ఐఏఎస్ అధికారి ఫిర్యాదుతో ఇతగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా రిజిస్ట్రేషన్స్ శాఖ టార్గెట్ ఈ మోసగాడు తాజాగా రిజిస్ట్రేషన్ శాఖలోని సబ్–రిజిస్ట్రార్లను లక్ష్యంగా ఎంచుకున్నాడు. సిద్ధిపేట, జగిత్యాల, షాద్‌నగర్, చౌటుప్పల్, వరంగల్, శామీర్‌పేటలకు చెందిన ఎస్ఆర్వోలకు కాల్ చేసి తెలంగాణ పోరాటయోధుల కార్యక్రమంలో భాగంగా అన్నదానం చేయడానికి రూ.లక్ష డొనేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తక్షణం తాను చెప్పిన బ్యాంకుఖాతాలో వేయాలని, లేదంటే, మారుమూల ప్రాంతానికి బదిలీ చేయిస్తానని బెదిరించడంతో సిద్ధిపేట రూరల్ ఎస్ఆర్వో, టౌన్ ఇన్చార్జ్ ఎస్ఆర్వోలు రూ.55 వేలు, సంగారెడ్డికి చెందిన ఓ ఎస్ఆర్వో రూ.30 వేలు డిపాజిట్ చేశారు. సదరు ఎస్ఆర్వోలు సీఎంవోలో ఆరా తీయగా సూర్యప్రకాశ్‌చారి అనే వ్యక్తి ఎవరూ లేరని తేలింది. -
‘రెరా’... బిల్డర్లు పట్టించుకోరా..?
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలుదారుకు భద్రతా, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) కార్యరూపం దాల్చడంలేదు. పునాది పడే ప్రతి ప్రాజెక్టు, లేఅవుట్ విధిగా ‘రెరా’లో నమోదు కావాల్సిందేనని చట్టం చెబుతున్నా బిల్డర్లు/డెవలప ర్లు పట్టించుకోవడంలేదు. 2017లో ‘రెరా’చట్టం మనుగడలోకి వచ్చినా.. ఇప్పటివరకు కేవలం 2,500 ప్రాజెక్టులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 6 వేల ప్రాజెక్టులకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర పట్టణ స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు) ఆమోదముద్ర వేస్తే.. అందులో 2,500 ప్రాజెక్టులే పేర్లను నమోదు చేసుకోవడం చూస్తే ‘రెరా’ అమలులో పురపాలక శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జరిమానాతో వెసులుబాటు! స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థలో పేర్లను నమో దు చేసుకోని సంస్థలపై కొరడా ఝళిపించాల్సిన సర్కారు.. జరిమానాలతో సరిపెడుతోంది. రూ.3 లక్షల పెనాల్టీతో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో పేరు నమోదు చేసుకోకున్నా ఏం కాదులే అన్న నిర్లక్ష్యం రియల్టీ కంపెనీల్లో కనిపిస్తోంది. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ వంటి అధికారిక సంస్థల నుంచి అనుమతి పొందిన స్థిరాస్తి సంస్థలు గత నవంబర్ 30 వరకు ఆన్లైన్లో ‘రెరా’లో నమోదు చేసుకునే అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆ తర్వాత రూ. 50 వేల జరిమానాతో గడువు ఇస్తే 50 సంస్థలు ముందుకు రాగా.. రెండోసారి రూ.3 లక్షల పెనాల్టీతో పేర్ల నమోదుకు అవకాశం కల్పించినా ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ చైర్మన్ రాజేశ్వర్ తివారి ఉత్తర్వులు జారీ చేశారు. అవగాహనాలోపం..! వినియోగదారులకు విశ్వాసం, నమ్మకం కలిగించేందుకు వీలుగా ‘రెరా’ను పకడ్బందీగా అమలు చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 500 చదరపు మీటర్ల పైబడిన స్థలం, 8 ప్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తప్పనిసరిగా ‘రెరా’లో నమోదుచేసుకోవాలనే నిబంధనను తీసుకొచ్చింది. కాగా, ప్రాజెక్టు అంచనా వ్యయంలో 70శాతాన్ని ప్రత్యేక అకౌంట్లో జమ చేయాలనే నిబంధన ఉండటంతో రియల్టర్లు ‘రెరా’లో నమోదుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులకు భరో సా ఇచ్చేలా.. డెవలపర్లు విధిగా పాటించేలా కొన్ని నిబంధనలు పకడ్బందీగా ఉండటం కూడా వారి వెనుకడుగుకు కారణంగా కనిపిస్తోంది. ‘రెరా’లో నమోదు అనంతరమే.. స్థలాలు, ఫ్లాట్లు విక్రయాలకు చెందిన ప్రచారం నిర్వహించుకోవాలనే షరతు విధించింది. ఈ మేరకు పత్రికా, ప్రసారమాధ్యమా ల్లో ‘రెరా’రిజిస్టర్ నంబర్‌ను ప్రచురించాలని స్పష్టం చేసింది. బడా సంస్థలు మినహా మధ్యతరగతి రియల్టీ కంపెనీలు ఈ నిబంధనలు పాటించడంలేదు. భూమి పూజ చేసిందే మొదలు ప్లాట్ల బేరాలను సాగిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేస్తున్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, తదితర సంస్థల సమన్వయం కొరవడడం కూడా ‘రెరా’లో పేర్లు నమోదు కాకపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ‘రెరా’కు తగినంత సిబ్బంది లేకపోవడం.. ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం లేకపోవడం ఈ పరిస్థితికి దారితీస్తోంది. రెరా ఆవశ్యకత, చట్టబద్ధత, ప్లాట్ల క్రయవిక్రయాల్లో ఈ చట్టం ఏ రకంగా ఉపయోగపడుతుందనే అం శంపై ప్రజల్లో చైతన్యం కల్పించడంగానీ, ప్రచారం చేయడంలో పురపాలక శాఖ విఫలమైంది. దీంతో ఈ చట్టంపై సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అవగాహన లేకుండా పోయింది. భారీగా జరిమానాలు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో బిల్డర్లపై రెరా సంస్థ భారీగానే జరిమానాలు విధిస్తోంది. ఇప్పటివరకు 400 ప్రాజెక్టులపై రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు జరిమానాలు విధించి రూ.3 కోట్లు వసూలు చేసింది. ఇవి కేవలం బడాసంస్థలకు సంబంధించినవి మాత్రమే కాగా, హెచ్ఎండీఏ, డీటీసీపీ పరిధిలోని అనధికార లేఅవుట్లు, అపార్ట్మెంట్ల విషయంలో తాత్సారం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ‘రెరా’అధికారులు మాత్రం మధ్యతరగతి రియల్ మోసాలు తమ వరకు రావడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ‘రెరా’లో నమోదు చేసుకోకుండానే వెంచర్లు చేసి అమ్ముకుంటున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అయితే, 2017 జనవరి తర్వాత వెలిసిన లేఅవుట్ల విషయంలో ఇప్పటి నుంచి పకడ్బందీగా వ్యవహరిస్తామని ‘రెరా’కార్యదర్శి విద్యాధర్ ‘సాక్షి’కి తెలిపారు. అక్రమ లేఅవుట్ల స్థలాలు రిజిస్ట్రేషన్ కాగానే సమాచారం తమకు వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ల శాఖతో సమన్వయం కుదుర్చుకునే పనిలో ఉన్నామని, సదరు డెవలపర్‌కు చెందిన సమస్త సమాచారాన్ని ఆ శాఖ నుంచి తీసుకుంటామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. -
రిజిస్ట్రేషన్లకు ‘సాంకేతిక’ గండం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఇంకా పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. సర్వర్, స్టోరేజి మార్పిడితో అత్యంత వేగవంతమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డితోపాటు పలు జిల్లాల్లో కొంతమేర కార్యాలయాలు పనిచేసినా మెజార్టీ జిల్లాల్లో మాత్రం పనిచేయలేదు. దీంతో కొత్త సర్వర్‌తో మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1,500 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ సేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకేసారి లాగిన్‌తో.. వాస్తవానికి, గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్లు తరచూ మొరాయిస్తుండేవి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు రోజుల తరబడి నిలిచిపోయేవి. ఈ సమస్యను అధిగమించేందుకుగాను ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి వ్యవస్థ నుంచి మన రాష్ట్ర సర్వర్‌ను విడగొట్టి ఈ ప్రక్రియను సాఫీగా చేసేందుకు మూడురోజుల విరామం ప్రకటించారు. దీంతో శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు అధికారికంగానే నిలిచిపోయాయి. వాస్తవానికి శని, ఆదివారాలు సెలవులు కావడంతో శుక్రవారం మాత్రం సేవలు ఆగిపోయాయి. అయితే, మూడు రోజుల వ్యవధిలో గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొత్త సెంట్రల్ సర్వర్, స్టోరేజిని రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో అనుసంధానం చేశారు. సోమవారం నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్ సేవలు కొత్త సర్వర్ ఆధారంగా గాడిలో పడతాయని అధికారులు అంచనా వేశారు. కానీ, సోమవారం ఒకేసారి అందరూ లాగిన్ కావడంతో లాగిన్ ఎర్రర్స్ వచ్చాయని ఆ శాఖ అధికారులు చెపుతు న్నారు. ఆ తర్వాత ఉదయం కొంతసేపు డాక్యుమెంట్ల అప్లోడ్, ఫొటోక్యాప్చరింగ్ ప్రక్రియలు సాఫీగా పనిచేసిన తర్వాత మళ్లీ నిలిచిపోయాయి. ఆ తర్వాత మళ్లీ కొంతసేపు ప్రారంభమైనా మళ్లీ ఆగిపోయాయి. కేవలం సాంకేతిక సమస్యల కారణంగానే ఈ అవాంతరాలు ఏర్పడ్డాయని నిర్ధారించిన రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సాయంత్రం 4 గంటల సమయానికి అన్ని అవాంతరాలను సరిచేశారు. దీంతో సాయంత్రం నుంచి మరో గంటపాటు సేవలు కొనసాగాయి. ఏదిఏమైనా తొలిరోజు కలిగిన అవాంతరాలతో రాష్ట్రంలో దాదాపు 50 శాతమే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆ శాఖ అధికారులు లెక్కలు గడుతున్నారు. మంగళవారం నుంచి ఎలాంటి సమస్యలు ఉండవని, తొలిరోజు వచ్చిన సాంకేతిక సమస్యలను సరిచేశామని ఆ శాఖ అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులు ‘సాక్షి’కి వెల్లడించారు. -
ఉమ్మడి నెట్‌వర్క్‌కు టాటా!
► ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ► ఏపీతో కలసి ఉన్న ఉమ్మడి నెట్వర్క్ నుంచి బయటకు.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తనకంటూ ఓ ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. రిజిస్ట్రేషన్ల లావాదేవీల్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌తో కలసి ఉన్న ఉమ్మడి నెట్వర్క్ నుంచి బయటకు వచ్చేసింది. ఇందుకోసం భారతీయ రైల్వేకు చెందిన రెయిల్‌టెల్‌తోపాటు ఐటీ హంగులను సమకూర్చుకునేందుకు విస్సెన్ ఇన్ఫోటెక్ అనే మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేందుకు కసరత్తు చేస్తోంది. మూడేళ్లుగా ఒకే నెట్వర్క్ రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు దాటుతున్నా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన నెట్వర్క్ మాత్రం ఒక్కటే నడుస్తోంది. తెలంగాణలోని 141, ఆంధ్రప్రదేశ్‌లోని 270 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే క్రయ విక్రయ లావాదేవీలన్నీ ఒకే నెట్వర్క్ పైనే జరుగుతున్నాయి. ఒకటే నెట్‌వర్క్‌తో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, తెలంగాణకు ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెట్‌వర్క్‌లో తలెత్తే ట్రాఫిక్ బిజీని తగ్గించుకోవచ్చని, మెరుగైన సేవలను వేగంగా అందించవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (స్వాన్)కు అదనంగా మరో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇండియన్ రైల్వేకు చెందిన ఐటీ సంస్థ రెయిల్‌టెల్‌తో నెట్వర్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెట్వర్క్ ద్వారా మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్ఎస్) వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. ఈ వ్యవస్థ ఏర్పాటుతో రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో ఐటీ సమస్యలు ఉండవని, ఒకవేళ వచ్చినా అన్ని కార్యాలయాలు స్తంభించిపోయే పరిస్థితి, సర్వర్లు డౌన్ అయ్యే పరిస్థితి ఉండదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1.2 కోట్లను రెయిల్‌టెల్‌కు చెల్లించనుంది. ఐటీ హంగులు కూడా.. కొత్త నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఐటీ హంగులను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సమకూర్చుకుంటోంది. ఇందుకోసం రూ.72 కోట్లతో విస్సెన్ ఇన్ఫోటెక్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 7–9 కొత్త కంప్యూటర్లతో పాటు స్కానర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలు, ఐరిష్ రీడర్లు, మోడెమ్‌లను ఆ సంస్థ సరఫరా చేసి ఐదేళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి 5 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక ఇంజనీర్‌ను కూడా నియమించుకుని రోజువారీ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే 30 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ సామగ్రి చేరుకోగా, అక్టోబర్ 15 కల్లా అన్ని కార్యాల యాల్లో ఐటీ హంగులను సమకూర్చనున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో సర్వర్లు, స్టోరేజీ సామర్థ్యం కూడా పెరగనుంది.