srimatham
-
శ్రీమఠం పీఠాధిపతి తులాభారం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులకు తులాభారం వేడుక వైభవంగా జరిగింది. శ్రీమఠంలో శనివారం రాత్రి 9గంటలకు బెంగళూరు నగరానికి చెందిన అలసురమ్మ కుటుంబం సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫలాలు, ధాన్యంతో పీఠాధిపతిని తూగించారు. రాయరు అనుగ్రహ సందేశంతో పాటు ఫలపూల మంత్రాక్షితలతో పీఠాధిపతి ఆశీర్వదించారు. వేడుకల్లో ఏఏఓ మాధవశేట్టి, మేనేజరు శ్రీనివాసరావు, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
వేలం.. గందరగోళం
- నిలిచిపోయిన శ్రీమఠం సాగు భూముల వేలం పాటలు - ఆలస్యంగా నిర్వహించడంపై రైతుల ఆగ్రహం - వేలం పాడబోమంటూ వెనుదిరిగిన రైతులు - మౌనంగా ఉండిపోయిన అధికారులు మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సాగుభూముల కౌలు వేలం పాటలు గందరగోళం మధ్య ప్రారంభమై చివరకు ఆగిపోయాయి. ఏప్రిల్, మే నెలలు కాకుండా ఆలస్యంగా భూములకు వేలం నిర్వహించడం, కొంతమందికి మాత్రమే అనుమతి లభించడంతో రైతులు అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. వేలం పాటలు పాడేది లేదంటూ వాకౌట్ చేశారు. స్థానిక భూరమణ కల్యాణ మంటపంలో శ్రీమఠానికి చెందిన కల్లుదేవకుంట గ్రామ పరిధిలోని 199.94 ఎకరాల భూములకు గురువారం కౌలు వేలం పాటలు ప్రారంభించారు. దేవాదాయశాఖ ఈఓ డీవీఆర్కే ప్రసాద్ పర్యవేక్షణలో వేలం పాటలు మొదలెట్టారు. 10.45గంటల వరకు రైతుల నుంచి దరావతు కింద రూ. 10వేల ప్రకారం స్వీకరించి వేలాలకు అనుమతించారు. అయితే సగానికి పైగా రైతులు ఆలస్యంగా రావడంతో అనుమతి లభించలేదు. అధికారులను వేడుకున్నా సమయం మించిపోయిందంటూ తోసిపుచ్చారు. దీంతో 36మంది రైతులు మాత్రమే వేలం పాటల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఆదిలోనే రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవేంద్రస్వామి మఠం పరిధిలో దాదాపు 1600 ఎకరాలుండగా 199.94 ఎకరాలకు మాత్రమే వేలాలు నిర్వహించడం ఏంటని రైతు మాధవరెడ్డి అధికారులను నిలదీశారు. ఏప్రిల్, మే నెలల్లో కాకుండా ఇంత ఆలస్యంగా వేలాలు నిర్వహిస్తే పంటలు పండించుకునేది ఎలా అంటూ కొందరు రైతులు ప్రశ్నించారు. వేలం పాటలకు వచ్చే రైతులు చాలామంది ఉన్నారని, అందరినీ అనుమతించాలని మరి కొందరు... అధికారులను అడిగారు. అందుకు మఠం మేనేజర్ శ్రీనివాసరావు ససేమిరా అనడంతో వేలం పాటలు పాడేది లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం పాట నుంచి వాకౌట్ చేశారు. ఎస్ఐలు రాజారెడ్డి, శ్రీనివాసనాయక్ సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో అధికారులు ఒంటిగంట వరకు కల్యాణమంటపంలోనే మౌనంగా ఉండిపోయారు. వేలం పాటల్లో శ్రీమఠం ల్యాండ్ సెక్షన్ ఆఫీసర్ వెంకటకృష్ణుడు, నకాతే శ్యాంప్రసాద్, డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్వర్మా, రిటైర్డ్ డీటీ ఉపేంద్రబాబు, పర్యవేక్షకులు దక్షణామూర్తి, వీఆర్ఓ భీమన్న పాల్గొన్నారు. మొత్తం భూములకు వేలం నిర్వహించాలి .. - మాధవరెడ్డి, కల్లుదేవకుంట శ్రీమఠం పరిధిలో 1600 ఎకరాలుండగా 199.94 ఎకరాలకు మాత్రమే కౌలువేలం నిర్వహించడం సరికాదు. గతేడాది మఠం పరిధిలోని మొత్తం భూములకు వేలాలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే మా గ్రామ పరిధిలోని భూములకు మాత్రమే వేలాలు వేయడం పద్ధతికాదు. శ్రీమఠం అధికారులు ఇకనైనా మేల్కోవాలి. మొత్తం సాగు భూములకు కౌలు వేలం నిర్వహించాలి. అన్నింటికీ వేలాలు నిర్వహిస్తాం .. - మాధవశెట్టి, శ్రీమఠం ఏఏఓ హైకోర్టు, దేవాదాయశాఖ డైరెక్షన్లో శ్రీమఠం పరిధిలోని మొత్తం భూములకు కౌలు వేలాలు నిర్వహిస్తాం. రెండు గ్రామాల్లో మినహ అన్ని గ్రామాలలోని భూములకు వేలాలు ముగిశాయి. అలాగే మఠం పరిధిలోని వ్యాపార దుకాణాలకు సైతం త్వరలో వేలాలు నిర్వహిస్తాం. ఇప్పటికే బకాయిదారులకు నోటీసులు ఇచ్చాం. ఇందులో ఎలాంటి రాజకీయాలకు ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటాం. -
శ్రీమఠంలో సామూహిక సత్యనారాయణ పూజలు
మంత్రాలయం : ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో సామూహిక సత్యనారాయణస్వామి పూజలు గావించారు. శ్రీమఠంలోని గురుసార్వభౌమ కళాప్రదర్శన ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సత్యనారాయణస్వామి చిత్రపటాన్ని కొలువు చేశారు. అర్చకుడు కురిడి నాగేష్ అభిషేకాలు, అర్చనలు, హారతులు పట్టి పూజలు కానిచ్చారు. భక్తులు వందలాదిగా పాల్గొని స్వామి పూజలో తరించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు జయ, దిగ్విజయ, మూలరాముల పూజలు ఆకట్టుకున్నాయి. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
రైతు శ్రేయస్సుకు శ్రీమఠం చేయూత
– పేద రైతులకు ఉచితంగా 188 కోడెదూడల పంపిణీ – పీఠాధిపతి చేతుల మీదుగా వితరణ మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి కృపతో రైతు శ్రేయస్సుకు శ్రీమఠం చేయూతనిస్తోందని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పేర్కొన్నారు. శ్రీమఠం గోశాలలో శుక్రవారం పేద రైతులకు ఉచితంగా కోడెదూడల వితరణ కార్యక్రమం చేపట్టారు. గోశాలలో పురుడోసుకున్న 188 కోడెదూడలను 94 మంది రైతులకు అందజేశారు. ముందుగా వాటికి పూజలు గావించి డిప్ పద్ధతిలో రైతులకు పంపిణీ చేశారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ కరువు పరిస్థితుల్లో సేద్యానికి ఎద్దులు లేక అల్లాడిపోతున్న రైతులకు అండగా శ్రీమఠం నిలుస్తుందన్నారు. శ్రీరాఘవేంద్రస్వామి సన్నిధానంలో పెరిగిన పశువులను ఆరాధ్యంగా భావిస్తామని, వాటిని బాధించకుండా చూసుకోవాలన్నారు. అవసాన దశలో విక్రయించడం, కబేళాలకు తరలించడం చేయొద్దన్నారు. ఏదైనా పోషణ భారమనిపిస్తే తిరిగి గోశాలకు అప్పగించాలని సూచించారు. ఎలాంటి రాజకీయం జోక్యం లేకుండా పారదర్శకంగా కోడెదూడలు అందజేస్తున్నామన్నారు. రైతులు అంతే నమ్మకంతో పోషించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి పండలు పండి రైతులోకం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల రైతులకు కోడెదూడలు అందజేశారు. వితరణ స్వీకరించిన రైతులు శ్రీమఠానికి, స్వామిజీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో పండిత కేసరి రాజాఎస్ గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, గోశాల బాధ్యులు రఘుదేశాయ్, గుంజిపల్లి శ్రీనివాస పాల్గొన్నారు. -
శ్రీమఠంలో ముగిసిన హోమాలు
లోకకల్యాణార్థం మూడురోజులుగా నిర్వహణ మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో లోక కల్యాణార్థం చేపట్టిన హోమాలు బుధవారంతో ముగిశాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో మూడురోజులుగా శాంతి, వాస్తు హోమాలు నిర్వహించారు. శ్రీమఠం యాగశాలలో పండితుల వేద మంత్రోచ్ఛారణలు పఠిస్తుండగా, భక్తుల హర్షధ్వానాల మధ్య శాస్త్రోక్తంగా పురోహితులు క్రతువులు కానిచ్చారు. హోమాల సమర్పణోత్సవంలో భాగంగా పూర్ణాహుతి కనుల పండువగా చేశారు. ముందుగా పీఠాధిపతి పూర్ణకుంభాలతో రాఘవేంద్రుల బృందావనంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అక్కడి నుంచి ఊరేగింపుగా మంచాలమ్మ ఆలయం చేరుకుని పట్టువస్త్ర, ఆభరణాల సమర్పణ పూజలు చేశారు. యాగ శాలను చేరుకుని పూర్ణహుతి పలికారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలనే ఉద్దేశంతో హోమాలు చేపట్టినట్లు పీఠాధిపతి వివరించారు. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ద్వారపాలక అనంతస్వామి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శని, ఆదివారాలు సెలవులు కలిసిరావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రాఘవేంద్రుల బృందావన దర్శన, పరిమళ ప్రసాదం, అన్నపూర్ణభోజనశాల, పంచామృతం క్యూలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులు నదీతీరంలో స్నానాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రుల మూలబృందావన దర్శించుకుని పీఠాధిపతి సభుదేంద్రతీర్థుల మూలరాముల పూజలో తరించారు. యాగశాలలో కలశ పునఃప్రతిష్ఠాపన సందర్భంగా మృత్యుంజయ, శాంతి హోమాలు కొనసాగాయి. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
శ్రీమఠంలో భక్తుల రద్దీ
మంత్రాలయం : ప్రముఖ రాఘవేంద్రస్వామి మఠం భక్తుల సందడితో కళకళలాడింది. శని, ఆదివారాలు సెలవులు కలిసిరావడంతో కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో రాఘవేంద్రుల బృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప పంచామృతాభిషేకాలు గావించి విశేష పూజలు గావించారు. నైవేద్య సమర్పణ, మంగళహారతులు అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. -
కనుల పండువగా మధ్యారాధన
-నవ నిర్మాణ శిల్పికి భక్త నీరాజనం – వైభవంగా నవరత్న రథోత్సవం – బంగారుపూత బృందావన గోపుర ప్రారంభోత్సవం మంత్రాలయం : నవ మంత్రాలయ శిల్పి, శ్రీమఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులకు భక్తజనం నీరాజనం పలికింది. సుయతీంద్రతీర్థుల చతుర్థి మహా సమారాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యారాధన నిర్వహించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల నేతృత్వంలో వేకువజామున రాయరు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సుయతీంద్రతీర్థుల బృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, విశేష పంచామృతాభిషేకం గావించారు. తర్వాత స్వామీజీ చిత్రపటాన్ని నవరత్న రథంపై ఉంచి పీఠాధిపతి హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. మంగళవాయిద్యాల సుస్వరాలు, హరిదాస సాహిత్యం, మహిళల సంకీర్తనలతో శ్రీమఠం మాడవీధుల్లో అశేష భక్తజనం మధ్య రథయాత్ర కనుల పండువగా సాగింది. యజ్ఞమంటపంలో బెంగళూరుకు చెందిన సంగీత కులకర్ణి దాసవాణి భక్తులను ఎంతగానో అలరించింది. డోలోత్సవ మండపంలో విద్వాన్లు గురుప్రసాదాచార్య, రామవిఠలాచార్య ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. పీఠాధిపతి పూజామందిర్లో మూల,జయ, దిగ్విజయ రాముల పూజలో తరించారు. బంగారు బృందావన గోపురం ప్రారంభోత్సవం : శ్రీమఠం ముఖద్వార శిఖరాన బృందావనాన్ని బంగారు పూత తొడిగారు. హైదరాబాద్‌కు చెందిన దాత సహకారంతో బంగారు పూత పూశారు. వేడుక సందర్భంగా శుక్రవారం బృందావన గోపురాన్ని ప్రారంభించారు. వేడుకలో పండిత కేసరి గిరియాచార్, మఠం ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ద్వారపాలక అనంతస్వామి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. నేడు ఉత్తరారాధన : ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉత్తరారాధన నిర్వహించనున్నారు. సుప్రభాత సేవ, పాదపూజ, తీర్థ ప్రసాద వితరణ, మహా మంగళహారతులు ఉంటాయి. బెంగళూరుకు చెందిన వేదవ్యాసాచార్, బండిశ్యామాచార్, హుబ్లి దేఖాదినేష్ ప్రవచనాలు వినిపిస్తారు. -
హిందూ సంప్రదాయాన్ని కాపాడాలి
–శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు పెరవలి (మద్దికెర) : హిందూ సంప్రదాయం కాపాడాలని, ఇది ప్రతి హిందువు కనీస ధర్మమని మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు అన్నారు. ఆదివారం మండలంలోని పెరవలిలో రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా స్వామిజీకి భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుభుదేంద్ర తీర్థులు మాట్లాడుతూ మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే వారివారి మతాలను అగౌరపరచకుండా నడుచుకున్నపుడే జన్మ సార్థకమవుతుందన్నారు. ఈ సందర్భంగా భక్తులు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ విరాళదాత పారా విశ్వనాథ్, జెడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి, సర్పంచు వెంకట్రాముడు వర్మ, భక్తులు పాల్గొన్నారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.13 కోట్లు
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పిభ్రవరి నెల హుండీ ఆదాయం రూ.1,13,43,483 వచ్చింది. శనివారంతో ముగిసిన హుండీ లెక్కింపు వివరాలను మేనేజర్ శ్రీనివాసరావు వివరించారు. నగదు రూ.1.13 కోట్లు, బంగారు 32 గ్రాములు, వెండి కేజీ 490 గ్రాములు, యూఎస్ఏ 279 డాలర్లు, మలేసియా 536, న్యూజిలాండ్ 50, సింగపూర్ 36, యూఏఈ 375 విదేశీ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు. -
శ్రీమఠం..వైభవోత్సవం
–రెండో రోజు ఆకట్టుకున్న వేడుకలు మంత్రాలయం : పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థుల నేతృత్వంలో సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీవైభవోత్సవాలు రెండో రోజు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువ జామున సుప్రభాత సేవ, మూలబృంధావన, నిర్మల్య విసర్జన, పంచామృతాభిషేకాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి దివ్య మందిరంలో జయ, దిగ్విజయ , మూలరాములు , పూజలో తరించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయలకు చెక్క, వెండి, స్వర్ణం నవరత్న రథాల పై శ్రీమఠం మాడవీధుల్లో ఊరేగించారు. యోగేంద్ర మంటపంలో ఉడిపికి చెందిన కుమార విద్య భరత నాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. వేడుకలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌శ్రీనివాస రావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహా మూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ , ద్వారపాలక అనంత స్వామి పాల్గొన్నారు. -
శ్రీమఠంలో ఘనంగా రుద్రాభిషేకం
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో మహా శివరాత్రి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. శ్రీరాఘవేంద్రుల మూలబృందావనం బహుముఖంగా వెలసిన శివుడి లింగానికి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శివలింగానికి నిర్మల్య విసర్జన, జల, క్షీరం, తైలం, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలు గావించారు. పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య నిర్వహించిన పూజా విశిష్టతలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహామంగళ హారతులతో శివ పూజలకు ముగింపు పలికారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు ఫల, పూల మంత్రాక్షితలు అందజేసి ఆశీర్వదించారు. వేడుకలో మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలన అనంతస్వామి పాల్గొన్నారు. -
శ్రీమఠం అభివృద్ధికి కృషి
- పీఠాధిపతి సుబధేంద్ర తీర్థులు – అన్నపూర్ణ భోజనశాలతో ఏసీ వెయిటింగ్ హాల్‌కు భూమి పూజ – బృందావన గార్డెన్తో 66 నూతన గదుల నిర్మాణానికి శ్రీకారం – దాతల సహకారంతో శ్రీమఠానికి ప్రగతి కళ మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. బుధవారం అన్నపూర్ణ భోజన శాలతో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఏసీ వెయిటింగ్ హాల్, బృందావన గార్డెన్తో 66 గదులు, డార్మిటరీ సముదాయం నిర్మాణానికి పీఠాధిపతి భూమిపూజ చేశారు. కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి సౌజన్యం రూ.80 లక్షలతో ఏసీ వెయిటింగ్ హాల్, ఆపైన రెండు ఏసీ వీవీఐపీ సూట్స్ నిర్మిస్తారు. కర్ణాటక శ్రీరాఘవేంద్ర కో–ఆపరేటివ్ సొసైటీ నేతృత్వంలో డార్మిటరీ, 66 గదులు నిర్మాణం చేపడతారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పీఠాధిపతి నారీకేళ సమర్పణ, భూమిపూజ గావించారు. పీఠాధిపతి మాట్లాడుతూ.. దాతలు, భక్తుల సహకారంతో శ్రీమఠం గర్భాలయ శిలామండపం, స్వర్ణగోపురాలు, సుయతీంద్రతీర్థుల 200 గదులు సముదాయం, సుశీలేంద్ర 100 గదుల భవన నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం వికలాంగుల విశ్రాంత నిలయం, శ్రీమఠం క్వార్టర్స్‌తో విశ్రాంత పార్కు పనులు సాగుతున్నాయన్నారు. రాఘవేంద్రస్వామి కృపతో మఠం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందన్నారు. దాతలు మాట్లాడుతూ ఆగస్టులో జరిగే రాయరు సప్తరాత్రోత్సవాలకు.. నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
శ్రీ మఠం ఆదాయం రూ. 1.50 కోట్లు
మంత్రాలయం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం జనవరి నెలకు సంబంధించి రూ. 1.50 కోట్లు వచ్చినట్లు శ్రీ మఠం మేనేజర్ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. భక్తులు రాఘవేంద్రస్వామికి కానుకలు, ముడుపుల రూపంలో రూ.1.50 కోట్లతో పాటు 76 గ్రాములు బంగారం, 650 గ్రాములు వెండి, 2764 విదేశి డాలర్లు సమర్పించినటు్ల పేర్కొన్నారు. -
శ్రీ మఠంలో సినీ సంగీత దర్శకుడు
మంత్రాలయం రూరల్: శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుటుంబసభ్యులతో సోమవారం మంత్రాలయం వచ్చారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శేషవస్త్రం, స్వామివారి మెమొంటో, ఫలమంత్రాక్షితలిచ్చి ఆశీర్వాదించారు. -
శ్రీమఠంపై అజమాయిషీ లేదు
-దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు వెల్లడి - రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం మఠం పీఠాధిపతితో ఏకాంత భేటీ మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంపై దేవాదాయ శాఖ అజమాయిషీ ఉండదని మంత్రి మాణిక్యాల రావు పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ సోమువీర్రాజుతో కలిసి శ్రీమఠం రాఘవేంద్ర స్వామి దర్శనానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పేద భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం కార్యక్రమం చేపట్టామన్నారు. టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త నిధులతో రాష్ట్రంలో కొత్తగా 500 దేవాలయాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. విశాఖపట్నంలో యోగా యూనివర్సిటీ నిర్మాణం కోసం భూసేకరణ పూర్తిచేశామన్నారు. అంతకుముందు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన, హారతులు పట్టి రాఘవేంద్రుల మూల బృందావనం దర్శనం చేసుకున్నారు. పీఠాధిపతి జ్ఞాపిక, శేషవస్త్రం, ఫలపూల మంత్రాక్షితలతో వారిని ఆశీర్వదించారు. పీఠాధిపతితో మంత్రి ఏకాంత భేటీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో ఏకాంతంగా భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు స్వామిజీ ప్రత్యేక గదిలో మంతనాలు సాగించారు. ఆ సమయంలో శ్రీమఠం ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. మంత్రి గత పర్యటన వచ్చి వెళ్లిన కొద్ది రోజుల వ్యవధిలో శ్రీమఠానికి కొన్ని జీవోలు, వెసులబాటులు కల్పించారు. ఉద్యోగ భద్రతకు ఉరిగా జీవో 35 ప్రకటించారు. అయితే, ఉద్యోగుల ఆందోళన దృష్ట్యా సదరు జీవోను సుప్తచేతనావస్థలో ఉంచిన విషయం విదితమే. అయితే, ప్రస్తుత భేటీ రీత్యా శ్రీమఠానికి ఎలాంటి జీవోలు వస్తాయోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. స్థలభావం సమస్య తీర్చండి : వై.బాలనాగిరెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడా ప్రభుత్వ భూములు లేవని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రం చుట్టు శ్రీమఠం భూములు మాత్రమే ఉన్నాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు, పేదలకు గృహనిర్మాణానికి స్థలం కరువైందన్నారు. మండల కేంద్రం అభివృద్ధి నిమిత్తం శ్రీమఠం భూముల విషయంలో ఆలోచించాలన్నారు. అందుకు మంత్రి సమాధాన మిస్తూ శ్రీమఠంతో చర్చిస్తామన్నారు. అవసరమైతే ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి అవసరాలు తీర్చేందుకు యత్నిస్తామన్నారు. పర్యటనలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి నీలకంఠప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీఎస్ నాయుడు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు మురళీరెడ్డి, మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ రాజారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీమఠంలో పరిమళ ప్రసాదం తయారీ మిషన్
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం యాజమాన్యం పరిమళ ప్రసాదం తయారీ కోసం ప్రత్యేకంగా మిషనరీని తెప్పించింది. పరిమళ ప్రసాదాలను భక్తులు మహా పవిత్రంగా స్వీకరిస్తారు. నెలలో కనీసం 2 లక్షల ప్యాకెట్ల వరకు ప్రసాదాలు విక్రయిస్తున్నారు. రద్దీ సమయాల్లో ఈ సంఖ్య 5 లక్షలకు చేరుతోంది. భక్తుల డిమాండ్‌కు తగ్గట్టు ప్రసాదం తయారీని వేగవంతం చేసేందుకు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు. పరిమళ ప్రసాదం కౌంటర్లో రెండు మిషన్లను ఏర్పాటు చేశారు. వీటిని ప్యాకింగ్ చేసి కౌంటర్లలో భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. -
సుమధురం..గోవిందుడి నామస్మరణం
- శ్రీవారికి దివిటి సేవ గావించిన పీఠాధిపతి - వైకుంఠ ద్వార ప్రవేశంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి - ఆకట్టుకున్న పూలంకరణ, భజన కీర్తనలు మంత్రాలయం : పుష్పతోరణ పరిమళాలు.. మంగళవాయిద్యాల సుస్వరాలు.. దాససాహిత్య మహిళల భజన కీర్తనలు.. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సోమవారం భక్తులు గోవిందుడి నామస్మరణలో తరించారు. మంత్రాలయం నడిబొడ్డున శ్రీరాఘవేంద్రస్వామి చేతుల మీదుగా ప్రతిష్టితమైన శ్రీవేంకటేశ్వరుడి సన్నిధానంలో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. శ్రీమఠం పంచాంగం రీత్యా సోమవారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో శ్రీవారికి విశేషపూజలు, దివిటీసేవ, ప్రత్యేక మంగళహారతులు గావించారు. అనంతరం వైకుంఠ ద్వారానికి హారతులు పట్టి ఉత్తరదిశ ముఖస్థితులైన వేంకటనాథుడు, నైరుతిభాగంలో కొలువుదీరిన పద్మావతికి పూజలు చేశారు. అనంతరం వైకుంఠ ఏకాదశి విశిష్టతను పీఠాధిపతి భక్తులకు ప్రవచించారు. గురుసార్వభౌమ దాససాహిత్య అకాడమీ మహిళలలు ఆలపించిన భక్తి కీర్తనలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఆలయ పూజారి మదుప్రసాద్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠ మార్గ ప్రవేశం చేసి వెంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే కూతురు ప్రియాంక, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కృష్ణస్వామి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ. 1.15కోట్లు
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం డిసెంబర్ నెల హుండీ ఆదాయం రూ. 1.15 కోట్లు సమకూరింది. నాలుగురోజుల పాటు హుండీ లెక్కింపు సాగింది. ఇందులో నగదు 1,15,63,444, గోల్లు (బంగారం) 35గ్రాములు, వెండి 410 గ్రాములు, విదేశీ కరెన్సీ 914 డాలర్లు వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావ్ వివరించారు. -
పీఠాధిపతి తిరుపతి పర్యటన
– నేడు శ్రీవారి మెట్లోత్సవానికి హాజరు మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తిరుపతి పర్యటనకు ఆదివారం బయలుదేరి వెళ్లారు. సోమవారం తిరుమలలోని రాఘవేంద్రస్వామి మృత్తిక బృందావనం మఠంలో పిలిగ్రిం ఇమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. సాయంత్రం గురుసార్వభౌమ దాస సాహిత్య మండలి భజన భక్తాదులతో శ్రీవారి ఆది మెట్లను చేరుకుంటారు. అక్కడ పీఠాధిపతి విశిష్ట పూజల నిర్వహించి మెట్లోత్సవానికి అంకురార్పణ పలుకుతారు. దాదాపు వెయ్యి మంది భక్తులతో కలిసి కాలినడక శ్రీవారిని దర్శించుకుంటారు. మంగళవారం అక్కడే రాములోరి పూజా కార్యక్రమాలు ముగించుకుంటారు. సాయంత్రం పీఠాధిపతులకు సన్మానం ఉంటుందని మఠం మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
రాఘవుడి నెత్తిన బకాయిల భారం
- అద్దె చెల్లింపులో మొండికేసిన లీజర్లు - గ'లీజుల'తో శ్రీమఠం ఆదాయానికి గండి - రూ.21 లక్షల వరకు బకాయిలు మంత్రాలయం : శ్రీమఠం వ్యాపార దుకాణాలు స్వార్థపరుల జేబులు నింపుతున్నాయి. బంధుప్రీతి, రాజకీయ అండదండలతో వ్యాపార దుకాణాలను సొంతం చేసుకున్న లీజర్లు రూ.కోట్లు గడిస్తున్నారు. గ'లీజుల'తో శ్రీమఠం ఆదాయానికి రూ.కోట్లతో గండి కొడుతున్నారు. అద్దెలు చెల్లించకుండా శ్రీరాఘవుడి నెత్తిన మోయలేని భారం మోపుతున్నారు. çసబ్ లీజర్లను ముక్కుపిండి వసూళ్లు చేసుకుంటున్న లీజర్లు శ్రీమఠానికి మాత్రం మొండి చేయి చూపుతున్నారు. ఫలితంగా బకాయిల భారం అక్షరాల రూ.21 లక్షలకు చేరింది. ఇన్నాళ్లకు కోలుకున్న శ్రీమఠం .. నోటీసుల జారీకి సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించి కార్యాన్ని కానిస్తోంది. వ్యాపార దుకాణాలు .. శ్రీమఠం పరిధిలో మొత్తం 340 వ్యాపార దుకాణాలుండగా నదీ తీరంలో 174, ప్రాకారం ఆగ్నేయ దిశలో 54, శ్రీమఠం ప్రధాన ముఖద్వారంతో 50, విజయవిఠల మందిరంలో 60 దుకాణాలు కలవు. మరిన్ని దుకాణాలు వసతి నిలయాలు, అన్నపూర్ణభోజన శాలకు ఎదురుగా ఉన్నాయి. రూ.600-8 వేల వరకు దుకాణాలకు అద్దెలు వసూలు చేస్తున్నారు. నెలకు రూ.3 లక్షలకు పైగా అద్దెలు వస్తున్నాయి. గ'లీజుల' యవ్వారం .. శ్రీమఠం 340 దుకాణాలను అద్దెకు ఇచ్చింది. శ్రీమఠం అధికారులు, పీఠాధిపతి సమీప బంధువులు, రాజకీయ అండదండలు కల్గిన వ్యక్తులు తక్కువ ధరకే దుకాణాలను సొంతం చేసుకుని సబ్ లీజులకు ఇచ్చారు. దాదాపు 250 దుకాణాలు సబ్ లీజులతో నడుస్తున్నాయి. శ్రీమఠానికి రూ.2 వేలు చెల్లిస్తుండగా సబ్లీజర్తో రూ.10వేల నుంచి రూ. 20 వేలు వసూలు చేసుకుంటున్నారు. దీనికి తోడు అడ్వాన్సుల పేరుతో రూ.2 - రూ. 8 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బకాయిల పాపం రూ.21 లక్షలు.. శ్రీమఠం అధికారుల అలసత్వంతో రాఘవుడి నెత్తిన మోయలేని భారం పడింది. అద్దెలు వసూలు చేయడంలో చేసిన తాత్సారం శాపంగా మారింది. ప్రస్తుతం బకాయిల మొత్తం రూ.21 లక్షలకు చేరింది. కొంతమంది లీజర్లు రూ.లక్షల్లో బకాయిలు పడ్డారు. నెల నెలా పక్కాగా అద్దెలు వసూలు చేసుకుంటున్నా శ్రీమఠానికి లీజుల చెల్లింపులో మాత్రం మొండికేస్తున్నారు. ఇలా మిగులుబాటు అయిన సొమ్ముతో అంతస్తులు కట్టుకున్న లీజర్లూ ఉన్నారు. దేవుడికే శఠగోపం పెడుతున్నా శ్రీమఠం అధికారులు మొద్దునిద్ర వహించడం శోచనీయం. బకాయి లీజర్ల నుంచి ఇన్నాళ్లు వసూలు చేయకుండా వదిలేయడం విడ్డూరం. నోటీసులు జారీ చేశాం : ఎస్.కె. శ్రీనివాసరావు, శ్రీమఠం మేనేజర్ అద్దెలు చెల్లించకుండా మొండికేసిన లీజర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. సకాలంలో బకాయిలు చెల్లించాలని సూచించాం. అలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో లీజర్ల నుంచి దుకాణాలు స్వాధీనం చేసుకుంటాం. నోట్ల రద్దుతో కొంత మంది బకాయిలు చెల్లించారు. అయితే తక్కువ మొత్తంలోనే వసూలయ్యాయి. బకాయిదారులు వెంటనే బకాయిలు చెల్లించి శ్రీమఠానికి సహకరించాలి. -
గజలక్ష్మికి ఘన వీడ్కోలు
మంత్రాలయం : 36 ఏళ్లు రాఘవేంద్ర స్వామి సేవలు తరించిన గజలక్ష్మికి శ్రీమఠం ఘన వీడ్కోలు పలికింది. అటవీ శాఖ నిర్ణయం మేరకు శ్రీమఠం పీఠాధిపతులు సుబుదేంద్ర తీర్థులు నేతృత్వంలో ఆదివారం సాగనంపారు. çగజలక్ష్మికి పవిత్ర స్నానం చేయించి శ్రీమఠానికి తీసుకొచ్చారు. పీఠాధిపతి అలంకార శేషవస్త్రం కప్పి మాలలతో అలంకరించి వేదమంత్రోఛ్చారణల మధ్య విశేష పూజలు గావించారు. రాగి ముద్దలు, చెరుకు గడలు, అరటి పండ్లు నైవేద్య ఆహారంగా అందించారు. భక్తజన సంద్రం మధ్య మాడావీధుల్లో ఊరేగించారు. గజలక్ష్మి తొండంతో పీఠాధిపతికి ఆఖరి మాలధారణ గావించి టీటీడీ దేవస్థానం జంతు ప్రదర్శన శాల అధికారుల అప్పగింతలు కానిచ్చారు. ప్రత్యేక లారీలో టీటీడీ అధికారులు గజలక్ష్మిని తీసుకెళ్లారు. పీఠాధిపతి పూర్వ అస్తమ తండ్రి, పండితకేసరి గిరియాచార్ , మఠం మేనేజర్ శ్రీనివాస రావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మికసహాయక అ«ధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
నేడు గజలక్ష్మికి వీడ్కోలు
– శాస్త్రోక్తంగా సాగనంపేందుకు శ్రీమఠం ఏర్పాట్లు – టీటీడీ జూ పార్కుకు తరలింపు మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి సేవలో తరించిన గజలక్ష్మికి (ఏనుగు) నేడు వీడ్కోలు పలుకనున్నారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా పూజలు గావించి సాగనంపనున్నారు. శ్రీమఠంలో పాతికేళ్లపాటు ప్రహ్లాదరాయల సేవలో గజలక్ష్మి తరించింది. 2009 వరద కారణంగా జింకల పార్కులో జింకలు మృత్యువాత పడగా వన్యప్రాణుల సంరక్షణ శాఖ శ్రీమఠంపై కొరడా ఝలిపించింది. ఏనుగుకు అనుమతులు లేని కారణంగా ప్రత్యక్ష సేవను నిలిపేశారు. అప్పటి నుంచి ఏనుగు వీఐపీల స్వాగతం, భక్తుల ఆశీర్వాదానికి పరిమితమైంది. వయోభారం దృష్ట్యా జంతు సంరక్షణ శాఖ సూచన మేరకు ఏనుగును తరలించేందుకు శ్రీమఠం నిర్ణయం తీసుకుంది. ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం జంతు ప్రదర్శన శాలకు తరలించనున్నారు. ఏనుగు సేవకు సెలవు పలికేందుకు ప్రత్యేక పూజలు చేపట్టిన్నట్లు మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏనుగు రవాణా ఖర్చులు శ్రీమఠమే భరిస్తున్నట్లు తెలిపారు. భక్తులు తరలివచ్చి వీడ్కోలు వేడుకలో తరలించాలని కోరారు. -
శ్రీమఠం హుండీ లెక్కింపు ప్రారంభం
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం హుండీ లెక్కింపు సోమవారం సీసీ కెమెరాలు, అధికారుల నిఘా నేత్రాల మధ్య కొనసాగింది. లెక్కింపులో పలు ఆసక్తికర కానుకలు కనిపించాయి. ఓ భక్తుడు హుండీలో కేజీ వెండి బిస్కెట్లు, కంకణం, స్వామి రేకు వేశాడు. మరో భక్తుడు రూ.500 నోట్ల (100 నోట్లు) కట్టను సమర్పించారు. మొదటి రోజు హుండీ ఆదాయం రూ.63,95,600 సమకూరింది. రూ.2000 నోట్లు 106, రూ.వెయ్యి నోట్లు 746, రూ.500 నోట్లు రూ.3,466, రూ.100 నోట్లు 31,746, రూ.50 నోట్లు వెయ్యి, రూ.20 నోట్లు 1500 లెక్కలో తేలాయి. మఠం ప్రధాన హుండీతోపాటు 3 హుండీల ఆదాయాన్ని గణించారు. తహసీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, ఎస్ఐ శ్రీనివాసనాయక్, మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు సమక్షంలో ఎండోమెంట్ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు హుండీలను తెరిచారు. మరో రెండు రోజుల పాటు హుండీ లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. -
శ్రీమఠంలో సినీ నటి హరిప్రియ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ నటి హరిప్రియ ఆదివారం మంత్రాలయం వచ్చారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆమెకు అధికారులు మఠం మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మ ఆలయంలో అర్చనల అనంతరం రాఘవేంద్రస్వామి మూలబృందావనం దర్శించుకుని పూజలు, హారతులు పట్టారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ఫల,పూల మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. తెలుగులో పిల్ల జమిందార్, తకిట తకిట, ఈ వర్షం సాక్షిగా, గలాట చిత్రాలు, కన్నడలో 16, తమిళంలో ఓ చిత్రంలో నటించినట్లు హరిప్రియ విలేకరులకు తెలిపారు. పిల్ల జమిందార్ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు లభించిందన్నారు.