Tax exemptions
-
షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే
ముంబై: షిర్డీ సాయి బాబా ట్రస్టుకు హుండీ కానుకల రూపంలో వస్తున్న నగదుకు ఆదాయపు పన్ను మినహాయింపు సబబేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతేడాది అక్టోబరు 25న ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇచ్చిన తీర్పును సమర్థించింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (షిర్డీ) ఒక ధార్మిక సంస్థ అని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని ముంబై ఐటీ కమిషనర్ (మినహాయింపులు) వాదించారు. హుండీ రూపంలో గుర్తుతెలియని భక్తులు సమర్పిస్తున్న కానుకలు.. మొత్తం విరాళాల్లో ఐదు శాతాన్ని దాటుతున్నాయి కాబట్టి.. పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. 2015–16, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో హుండీ కానుకల రూపంలో షిర్డీ ట్రస్టుకు రూ.400 కోట్లు అందాయని, అందులో కేవలం రూ. 2.3 కోట్లు మాత్రమే మతపరమైన కార్యక్రమాలకు వెచ్చించారని ఐటీ కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. అధికభాగం నిధులను విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వైద్య సదుపాయాలకు మళ్లించారని పేర్కొన్నారు. జస్టిస్ జి.ఎస్.కులకర్ణి, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్‌లు ఈ వాదనతో విభేదించారు. షిర్డీ ట్రస్టు మతపరమైన, చారిటబుల్ ట్రస్టు అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు కోరడం చట్టబద్ధంగా న్యాయమని, సబబని తీర్పునిచ్చారు. -
Union Budget 2024-25: బడ్జెట్ మథనంలో అమృతం చిలికేనా!
అమృతకాల బడ్జెట్‌గా మోదీ అభివర్ణిస్తున్న కేంద్ర బడ్జెట్–2024 అన్ని వర్గాల ఆశలపైనా నిజంగానే అమృతం చిలికిస్తుందా? పన్ను వాతలు, ఎడాపెడా కోతలతో ఖేదమే మిగులుస్తుందా? 2047కల్లా వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా పడుతున్న బలమైన పునాదిగా ప్రధాని చెప్పుకున్న ఈ బడ్జెట్లో మధ్యతరగతిని ఎంతో కొంత మురిపిస్తారా? ముఖ్యంగా ఐటీ మినహాయింపులు పెంచి వేతన జీవులకు కాస్తయినా ఉపశమనం కలిగిస్తారా? కేవలం ప్రగతి పరుగులకే మరింత ఊపునిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొద్ది గంటల్లో జవాబులు లభించనున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్ కావడం విశేషం. మోదీ 3.0 సర్కారు తొలి బడ్జెట్ నుంచి ఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే... ఐటీ ఊరట.. ఈసారైనా...! ఆదాయ పన్ను చెల్లించే మధ్య తరగతి, వేతన జీవులు ఈ బడ్జెట్లోనన్నా ఎంతో కొంత ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు. ఐటీ శ్లాబులను సవరించాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఓటాన్ అకౌంట్లో నిర్మల దీని జోలికి పోలేదు. నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి. తద్వారా వేతన జీవుల చేతిలో మరిన్ని డబ్బులు ఆడతాయని, వారి కొనుగోలు సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింతగా కళకళలాడుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది పాత పన్ను విధానానికే మొగ్గుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులకు చోటు దక్కవచ్చని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. 80సీ తో పాటు స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని కూడా పెంచాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. అది నెరవేరితే రియల్టీ పరిశ్రమకు కూడా మరింత ఊపు వస్తుంది. రియల్టీ డేటా సెంటర్లతో పాటు రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టు (ఆర్ఈఐటీ)లకు పలు తాయిలాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడమే గాక ఉద్యోగావకాశాల సృష్టికి ఇదెంతో దోహదపడుతుందన్నది రియల్టీ పరిశ్రమ ముఖ్యుల అభిప్రాయం. రియల్టర్లకు నగదు అందుబాటును పెంచేందుకు ఆర్‌ఈఐటీలను ఈక్విటీ ఇన్‌స్ట్రుమెంట్లుగా పరిగణించే అవకాశం ఉందంటున్నారు. ఈ రంగానికి జీఎస్టీ చట్టం కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అనుమతించాలన్న ఆర్ఈఐటీ సంఘం డిమాండ్ ఏ మేరకు నెరవేరుతుందన్నదీ ఆసక్తికరమే. ఈవీలపై ఏం చేస్తారో...ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) జోరు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశ్రమకు మరింతగా ప్రోత్సాహకాలను అందించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈవీలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం తెస్తే బాగుంటుందన్న అభిప్రాయముంది. అన్నిరకాల ఈవీ వాహనాల తయారీ పూర్తిగా భారత్‌లోనే జరిగేందుకు అనువైన వాతావరణాన్ని కలి్పంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అలాగే ఆటో విడి భాగాలన్నింటిపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో పాటు పలు రకాలైన మినహాయింపులను ఆశిస్తున్నాయి. ఈవీ రంగంలో స్టార్టప్‌లకు దన్నుగా నిలిచే దిశగా చర్యలు ఉండవచ్చంటున్నారు. తుక్కు విధానాన్ని కూడా మరింతగా సరళీకరిస్తారేమో చూడాల్సి ఉంది. ఫార్మా కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో మరింత కీలకంగా మారిన ఫార్మా రంగానికి పలు ప్రోత్సాహకాలు నిర్మల బడ్జెట్లో చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా పరిశోధన, ఇన్నొవేషన్ కార్యక్రమాలను ప్రోత్సహించే చర్యలు ఉండవచ్చంటున్నారు. ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉన్న పలురకాల అనుమతుల ప్రక్రియలను మరింత సరళతరం చేయవచ్చని చెబుతున్నారు. కీలకమైన ఔఫధాల తయారీ తదితరాలకు ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించిన ప్రకటనపై కూడా ఫార్మా దిగ్గజాలు ఆశలు పెట్టుకున్నాయి. ‘స్వదేశీ’ రక్షణ! అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, చైనా దూకుడు తదితర నేపథ్యంలో రక్షణ రంగానికి కేటాయింపులను ఈసారి కూడా ఇతోధికంగా పెంచడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో రక్షణ సంబంధిత ఉత్పత్తి, మౌలిక సదుపాయాల పరిశ్రమల్లో ‘ఆత్మ నిర్భరత’కు మరింత పెద్దపీట వేసేలా మరిన్ని చర్యలు ఉండనున్నాయి. ఇది ఆర్థిక రంగానికి మరింత ఊపునివ్వడమే గాక అపారమైన ఉపాధి అవకాశాలను కలి్పస్తుందని, అంతిమంగా ప్రజల జీవన నాణ్యతనూ పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్పేస్ కంపెనీలకు పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధన రంగంలో (స్పేస్) పనిచేసే కంపెనీలకు పన్ను మినహాయింపులు కలి్పంచడం వల్ల గణనీయమైన వృద్ధికి ఊతమిచి్చనట్టు అవుతుందని డెలాయిడ్–సీఐఐ నివేదిక సూచించింది. పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించేందుకు, తుది ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోడీపడేందుకు వీలుగా.. చేపట్టాల్సిన పన్ను సంస్కరణలపై వివరణాత్మకమైన అధ్యయనం చేపట్టాలని పేర్కొంది. ‘‘భారత సర్కారు స్పేస్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని ప్రారంభించింది. పన్ను మినహాయింపులు, పన్నురహితం దిశగా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతో మొత్తం వ్యాల్యూ చైన్ ప్రయోజనం పొందుతుంది’’అని తెలిపింది. అంతర్జాతీయంగా ఈ రంగానికి సంబంధించి వివిధ దేశాలు అమలు చేస్తున్న చర్యలు, వాటి ప్రభావంపై విస్తృత అధ్యయనం అవసరమని సూచించింది. దీన్ని బెంచ్‌మార్క్‌గా తీసుకుని, భారత్ అదనంగా తన వంతు చర్యలను అమలు చేయాలని, ఇండియన్ స్పేస్ పాలసీ 2023ను ఎప్పటికప్పుడు నవీకరించాలని కోరింది. అంతర్జాతీయ, భారత అంతరిక్ష రంగం మార్కెట్ పరిమాణం.. ఈ రంగానికి సంబంధించిన విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, పెట్టుబడుల వ్యూహాలు, ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడింది. భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలతో చురుకైన భాగస్వామ్యాల దిశగా పనిచేస్తోందని.. తద్వారా అంతరిక్ష పరిశోధనా అభివృద్ధికి, స్పేస్ టెక్నాలజీల వృద్ధికి దోహదపడుతున్నట్టు తెలిపింది. ఈ భాగస్వామ్యాలు మారుమూల ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, పరిశోధనా ల్యాబ్‌లకు చేరుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. -
సీబీఎస్ఈకి ఆదాయ పన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: పరీక్ష ఫీజులు, పాఠ్యపుస్తకాల విక్రయాలు మొదలైన వాటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి ఆర్థిక శాఖ మినహాయింపునిచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష ఫీజులు, అఫిలియేషన్ ఫీజులు, పాఠ్యపుస్తకాలు.. ప్రచురణల విక్రయం, రిజిస్ట్రేషన్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, శిక్షణ ఫీజులు మొదలైన ఆదాయాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో సీబీఎస్ఈ ఎలాంటి వ్యాపార కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా ఉంటేనే ఈ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. 2020 జూన్ 1 నుంచి పరిమిత కాలం పాటు మాత్రమే ప్రస్తుత నోటిఫికేషన్లో ప్రస్తావించినందున అంతక్రితం సంవత్సరాలకు కూడా దీన్ని వర్తింపచేసేలా, అప్పటికే కట్టిన ట్యాక్స్‌ల రీఫండ్లను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రత్యేక అనుమతి కోసం సీబీడీటీకి సీబీఎస్ఈ దరఖాస్తు చేసుకోవాల్సి రావచ్చని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ జాయింట్ పార్ట్నర్ ఓమ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. -
ఇల్లు కొనాలా.. అద్దెకు ఉండాలా..? దేనివల్ల అధిక ప్రయోజనం
సొంతంగా ఇల్లు సమకూర్చుకోవాలా..? లేదంటే అద్దె ఇంట్లో ఉంటే ప్రయోనమా? ఈ విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి గణాంకాల సహితంగా తెలుసుకుంటే కానీ, తీరే సందేహం కాదు ఇది. అప్పు తీసుకుని అయినా ఇల్లు సమకూర్చుకోవాలని, అదే లాభదాయకమని కొందరు బలంగా నమ్ముతుంటారు. భూ మి ధర ఎప్పటికైనా పెరిగేదే కదా, దీనితో ఆస్తి విలువ ఇతోధికం అవుతుందని భావిస్తుంటారు. కానీ, గతంలో ఉన్నంతగా భూమి విలువ వృద్ధి ఇక ముందూ ఉంటుందని చెప్పలేం. అలాగే, సొంతిల్లు పనిచేస్తున్న ప్రదేశానికి సమీపంలో ఉంటుందని కూడా చెప్పలేం. ఇదే నిజమైతే కార్యాలయానికి వచ్చి వెళ్లేందుకు రోజూ అదనపు సమయం, ఇంధనం రూపేణా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినా కానీ, ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. ఎన్నో జ్ఞాపకాలు, కలల నిలయం అని ఎక్కువ మంది చెబుతారు. కనుక సొంతింటి కలను రుణం రూపంలో నెరవేర్చుకుంటే లేదా అద్దె ఇంట్లో ఉంటే పన్ను కోణంలో ఉండే లాభ, నష్టాలను తెలుసుకుందాం. సొంతింటి కల.. రుణంపై సొంత ఇంటిని సమకూర్చుకుంటే మంచి పన్ను ఆదా ప్రయోజనాలు ‘ఆదాయపన్ను పాత విధానం’లో ఉన్నాయి. నెలవారీ చెల్లించే ఈఎంఐ మొత్తంలో అసలు, వడ్డీ రెండు భాగాలు. ఈఎంఐలో భాగంగా చెల్లించే రుణం అసలును సెక్షన్ 80సీ కింద క్లెయిమ్ చేయొచ్చు. అలాగే, ఇంటి కొనుగోలుకు చెల్లించిన స్టాంప్ డ్యూటీ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా సంబంధిత ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. వడ్డీ విషయానికొస్తే.. కొనుగోలు చేసిన ఇంట్లోనే నివాసం ఉండేవారు ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ భాగం ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.2 లక్షల మొత్తంపై పన్ను చెల్లించక్కర్లేదు. అంటే ఆదాయంలో రూ.2 లక్షల మేర గృహ రుణానికి చెల్లిస్తున్న వడ్డీ కింద మినహాయింపు చూపించుకోవచ్చు. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే.. ఆ ఇంటి రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీతోపాటు ఆ ఇంటికి చెల్లించే మున్సిపల్ ట్యాక్స్, అద్దె ఆదాయంలో 30 శాతాన్ని స్టాండర్డ్ డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు అదనంగా రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులను సెక్షన్ 80ఈఈఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే సదరు రుణం 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో మంజూరై ఉండాలి. ఇంటి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45లక్షలు మించకూడదన్నది షరతు. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రయోజనాలు ఆదాయపన్ను కొత్త విధానంలో లేవు. సెటాఫ్, క్యారీఫార్వార్డ్ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిలో సొంతంగా నివసించే వారు అద్దె రూపంలో ఎలాంటి ఆదాయం లేనట్టయితే.. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీని నష్టంగా చట్టం పరిగణిస్తుంది. దీన్ని వేతనం, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం కింద సర్దుబాటు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ మొత్తం ఇంతకంటే ఎక్కువ ఉంటే, ఆ నష్టాన్ని తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో (క్యారీ ఫార్వార్డ్) ఇతర ఆదాయంతో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ ఇళ్లు కలిగి ఉంటే నోషనల్ రెంట్ అంశం తెరపైకి వస్తుంది. రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగించుకుంటున్నారని అనుకుంటే, మిగిలిన ఇళ్లను అద్దెకు ఇచ్చినా ఇవ్వకపోయినా.. చట్టం కింద ఇచ్చినట్టుగానే పరిగణిస్తారు. మార్కెట్లో ఉన్న సగటు అద్దె ధరలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అనుకూలతలు: అద్దె ఇంటితో పోలిస్తే సొంతిల్లు తీసుకోవడం వల్ల ఆస్తి సమకూరుతుంది. ఇంటి రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ప్రతికూలతలు: రుణంపై తీసుకున్నప్పటికీ, పన్ను చెల్లింపుదారుడు డౌన్ పేమెంట్ కింద తన వంతు వాటా కట్టాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్‌లను ఏటా చెల్లించాలి. రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ చార్జీలు అదనం. ఇంటికి మరమ్మతుల కోసం వెచ్చించాలి. విక్రయించాలంటే వెంటనే అమ్ముడుపోకపోవచ్చు. అంటే లిక్విడిటీ తక్కువ. ప్రాపర్టీ ధర పెరుగుతుందని, గణనీయంగా పెరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఉద్యోగం లేదా ఆదాయం నిలిచిపోయినా రుణం, దానిపై వడ్డీ చెల్లించాల్సిందే. చిన్న ఇంటికి వెళ్లి అద్దె భారం తగ్గించుకునే అవకాశం ఉండదు. అద్దె ఇంట్లో ఉండే వారికి కంపెనీలు తమ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) ని వేతనంలో భాగంగా ఇస్తుంటాయి. ఈ భాగానికి పన్ను ప్రయోజనం ఉంటుంది. స్థూల పన్ను వేతనంలో గరిష్టంగా రూ.5,000 వరకు ఉంటుంది. కాకపోతే హెచ్ఆర్ఏకి పన్ను మినహాయింపు పొందాలంటే పనిచేస్తున్న కార్యాలయం ప్రాంతంలోనే సొంత ఇల్లు కలిగి ఉండకూడదనేది షరతు. పన్ను ప్రయోజనాలు: అద్దె ఇంట్లో ఉండేవారు, వేతనంలో భాగంగా పొందిన హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే, హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపునకు కొన్ని షరతులు ఉన్నాయి. మూల వేతనం, కరువు భత్యం మొత్తంలో 10 శాతం. లేదంటే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో నివసించే వారు వేతనంలో 50 శాతం, మిగిలిన పట్టణాల్లో నివసించే వారు 40 శాతాన్ని హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు కింద చూపించుకోవచ్చు. లేదా అసలు హెచ్ఆర్ఏ రూపంలో తీసుకున్న మొత్తం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తంపైనే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి ఆదాయపన్ను చట్టం అనుమతిస్తుంది. అనుకూలతలు: రుణంతో ఇల్లు కొనుగోలు చేస్తే చెల్లించాల్సిన ఈఎంఐ కంటే, అద్దె ఇంటి కోసం చెల్లించే మొత్తం తక్కువగా ఉంటుంది. అద్దె ఇల్లు అయితే పనిచేసే ప్రాంతానికి అతి సమీపంలో లేదా కావాల్సిన చోట ఉండొచ్చు. సొంతిల్లు అయితే అందుబాటు ధర కోసం, పట్టణానికి వెలుపలి ప్రాంతాల్లో కొనుగోలు చేయాల్సి (ఎక్కువ మంది విషయంలో) వస్తుంది. అద్దె ఇ్లలు అయితే కోరుకున్నప్పుడు ఇల్లు మారిపోవడం సులభం. చెల్లించే అద్దెపై పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. ప్రతికూలతలు: అద్దె ఇంట్లో ఉంటే ఆస్తి సమకూరదు. ఏటా అద్దె పెరుగుతూ ఉంటుంది. నచ్చినట్టుగా ఇంటిని నిర్మించుకోలేరు. ఇంటి యజమానికి నచ్చకపోయినా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎవరికి ఎలా ప్రయోజనం..? ఎక్స్ అనే వ్యక్తి స్థూల వార్షిక ఆదాయం రూ.20లక్షలు. నెలవారీగా అద్దె కింద రూ.30వేలు చెల్లిస్తున్నాడు. వై అనే వ్యక్తి వార్షిక ఆదాయం కూడా రూ.20 లక్షలే. కానీ, అతడు సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంటి రుణంపై ఏటా రూ.3 లక్షలు వడ్డీ కింద, రూ.1.5 లక్షలు అసలు కింద చెల్లిస్తున్నాడు. ఇప్పుడు వీరికి నికర పన్ను భారం (ఆదాయపన్ను పాత విధానం కింద) ఎలా ఉంటుందని చూస్తే.. (పక్క బాక్స్‌లో) -
పన్ను భారం తగ్గించుకోవాలంటే..
వేతన జీవులకు ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోగా, అందుబాటులోని అన్ని మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుంటే మరో రూ.5 లక్షల ఆదాయంపైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే తమ ఆదాయం, పన్ను బాధ్యతలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని, పెట్టుబడులు చేసుకోవడం మెరుగైన మార్గం. కానీ, చాలా మందికి ఇది ఆచరణలో అసాధ్యంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివరిలోనే పన్ను ఆదా బాధ్యతలపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాలపై కథనం ఇది. ఏడాది చివర్లో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, హడావిడిగా చేసే పెట్టుబడుల్లో తప్పులకు చోటు ఇవ్వకూడదు. అదే సమయంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణిక అంశం కూడా కాకూడదు. ఒకవైపు పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇస్తూనే, మరోవైపు చేసిన పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని కూడా అందించేలా ఉండాలి. పైగా మనలో కొందరు చిన్న వయసులో ఉంటారు. మరికొందరు మధ్య వయసులో, కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండొచ్చు. కొందరి ఆర్జన మెరుగ్గా, కొందరి ఆర్జన మధ్యస్థంగా, తక్కువగాను ఉండొచ్చు. ఆదాయానికి అనుగుణంగా తీసుకునే రిస్క్ సామర్థ్యం మారిపోతుంటుంది. ఉదాహరణకు ఈఎల్ఎస్ఎస్ అన్నది సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పన్ను సాధనాల్లో ఒకటి. అచ్చం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ సాధనంలో పెట్టుబడులపై రాబడి దీర్ఘకాలంలో ఏటా 12 శాతానికి పైనే లభిస్తుంది. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత లిక్విడిటీ సమస్యే ఉండదు. కానీ, కొందరికి ఈక్విటీలు నచ్చకపోవచ్చు. కొందరికి పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించడం ఇష్టం లేకపోవచ్చు. అందుకనే అందుబాటులో సాధనా లు, వాటి మంచి చెడులను అర్థం చేసుకుంటే, ఇన్వెస్టర్లు తమకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఎన్పీఎస్– మూడు ప్రయోజనాలు ఇందులో రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షికంగా 8–11 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో చేసే పెట్టుబడులు రిటైర్మెంట్ వరకు లాకిన్లోనే ఉంటాయి. డెట్ నుంచి ఈక్విటీ, ఈక్విటీ నుంచి డెట్‌కు అలోకేషన్‌ను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఎన్పీఎస్కు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగి మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్పీఎస్కు కంపెనీలు జమ చేస్తే, ఆ మొత్తంపైనా పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కనుక ఎన్పీఎస్ ఇచ్చే ప్రయోజనాలతను వేరొక సాధనంతో పోల్చడం సరికాదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ (గిల్ట్ ఫండ్స్) అనే మూడు కేటగిరీలు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన రెండింటిలో నూరు శాతం కేటాయింపులకు అనుమతి ఉంది. మూడింటి మధ్య తమ రిస్క్‌స్థాయిని బట్టి కేటాయింపుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఇలా చేసుకునేందుకు అనుమతి ఉంది. పనితీరు నచ్చకపోతే ఫండ్ మేనేజర్లను కూడా మార్చుకోవచ్చు. మార్కెట్ల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది అనుకూలమైన టూల్. వీటికి అదనంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ విభాగం కూడా ఉంది. జీవిత బీమా పథకాలు జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి దీర్ఘకాలానికి 5 శాతంగా ఉంటుంది. పన్ను ఆదా కోసం ఇది మెరుగైన ఎంపిక కాదు. దీనికంటే కూడా యులిప్‌లు మెరుగైనవి. లేదంటే ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బీమా ఎండోమెంట్ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ కూడా చెల్లించే ప్రీమియానికి నామమాత్రంగానే ఉంటుంది. రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ రూ.12,0000 ప్రీమియానికి వస్తుంది. కానీ, ఎండోమెంట్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీ కావాలంటే ఏటా రూ.4–5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. జీవితానికి రక్షణ కోణంలోనే బీమా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు ఎన్ఎస్సీలను పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పన్ను ఆదా ఎఫ్డీని బ్యాంకుల్లో తీసుకోవచ్చు. రెండింటిలోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.10 శాతం రేటును ఆఫర్ చేస్తుంటే, యాక్సిస్ బ్యాంక్ రూ.7.75 శాతం ఇస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో 6.70 శాతం నుంచి 7.50 శాతం మధ్య రేట్లు ఉన్నాయి. పన్ను ఆదా ఎఫ్డీ అంటే పెట్టుబడిపైనే. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎన్ఎస్సీ కేవలం పోస్టాఫీసులోనే కొనుగోలు చేసుకోగలరు. దీంతో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని బ్యాంకుల్లో ప్రారంభించడం, క్లోజ్ చేసుకోవడం సులభం. కొన్ని బ్యాంక్‌లు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఎస్సీలో ప్రస్తుతం 7 శాతం రేటు అమల్లో ఉంది. ఎన్ఎస్సీలో పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. యులిప్‌లు యులిప్‌లలో గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 8–9 శాతం మధ్య ఉంది. యులిప్ అన్నది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే బీమా సాధనం. బీమా సంస్థలు ఒకవైపు పాలసీదారులకు బీమా రక్షణ ఇస్తూ.. మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన రాబడిని పంచుతాయి. యులిప్లోనూ ఎన్‌పీఎస్‌లో మాదిరే ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇలా మార్చుకుంటే పన్ను కట్టక్కర్లేదు. ఈక్విటీల విలువలు గరిష్టాలకు చేరినప్పుడు డెట్‌కు మారి, మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. రాబడులపై పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. యులిప్‌లో పెట్టుబడులపై ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. ఆ తర్వాత కోరుకున్నప్పుడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మాదిరి ఇందులో ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవడానికి అవకాశం లేదు. యులిప్‌ను జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. వార్షిక పెట్టుబడితో పోలిస్తే జీవిత బీమా కవరేజీ కనీసం 10 రెట్లు ఉంటే సెక్షన్ 10(10డీ) కింద మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది ఐదేళ్ల పథకం. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 8 శాతంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం ఆరంభంలో) ఆదాయం అందుకునేందుకు ఇది అనుకూలం. ఇందులో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాకపోతే 60 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అంటే ఈ పథకంలో రూ.6.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఏడాదిలో రూ.50,000 పన్ను లేని ఆదాయం అందుకోవచ్చు. వార్షికాదాయం రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పీపీఎఫ్ ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబడులు 15 ఏళ్ల పాటు లాకిన్‌లో ఉంటాయి. పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణ ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సాధనం ఇది. కనుక స్థిరాదాయ పథకాలతో పోలిస్తే మెరుగైనది. బ్యాంక్ ఎఫ్‌డీలపైనా ఇంతే వడ్డీ రేటు లభిస్తున్నప్పటికీ, అది పన్ను పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్‌ను అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. పోస్టాఫీసులోనూ దీన్ని తెరవొచ్చు. బ్యాంకుల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది. సొంత ఖాతా నుంచే పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ బదిలీ చేసుకోవచ్చు. కోరుకున్నప్పుడు ఈ–స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఆరో ఏట తర్వాత పాక్షిక ఉపంసహరణకు అనుమతి ఉంటుంది. నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్నుంచి సగం తీసుకోవచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మూడో ఏట నుంచి ఆరో ఏట వరకు బ్యాలన్స్‌పై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ 7.6%. కుమార్తెల పేరిట ప్రారంభించి, పెట్టుబడులు పెట్టుకునే పథకం ఇది. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించుకోవచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఏటా రూ.1.50 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువు ముగిసిన తర్వాత తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ఇద్దరి పేరిట ఖాతాలు తెరిచినా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు కోరగలరు. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో గత మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 7–13 శాతం మధ్య ఉన్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను సైతం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల్లో 40 శాతాన్ని ఈక్విటీలకు, 55–60 శాతాన్ని డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్ ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో రిస్క్ తక్కువ. తక్కువ రిస్క్ ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. రాబడి మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తే, డెట్ ఫండ్స్ మాదిరిగా లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించొచ్చు. -
అప్పటిదాకా స్టార్టప్‌లకు పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ: అంకురసంస్థలకు కేంద్రం మరోసారి ప్రోత్సాహకాలు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటయ్యే అంకురసంస్థలకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్లు మంత్రి నిర్మల చెప్పారు. 2024 మార్చి నెలలోపు స్థాపించబడిన స్టార్టప్ సంస్థలకు పన్ను మినహాయింపులు కొనసాగుతాయని ఆమె స్పష్టంచేశారు. ‘నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఫార్వార్డ్ చేసే వెసులుబాటును ప్రస్తుతమున్న ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నాం. 2023 మార్చి 31 నుంచి 2024 మార్చి 31వ తేదీదాకా ఆదాయ పన్ను మినహాయింపులు పొందవచ్చు. 2016–17 ఆర్థికసంవత్సర అంచనాలకు ముందు చెరకు రైతులకు ఇచ్చేసిన చెల్లింపులను చక్కెర సహకార సంఘాలు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం’అని మంత్రి చెప్పారు. దీంతో చక్కెర సహకార సంఘాలకు రూ.10,000 కోట్లమేర లబ్ధిచేకూరనుంది. ‘కొత్త కోపరేటివ్లకూ 15 శాతం పన్ను లబ్ధి దక్కుతుంది. ల్యాబ్‌లలో తయారయ్యే డైమండ్ల కోసం వినియోగించే ముడి సరకుపై కస్టమ్ సుంకాలను సైతం తగ్గించే యోచనలో ఉన్నాం. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు తీసుకునే రుణం/ డిపాజిట్ చేసే మొత్తానికి రూ.2,00,000ను గరిష్ట పరిమితిగా విధించాలని భావిస్తున్నాం’అని మంత్రి తెలిపారు. -
వేల కోట్ల టాక్స్ మినహాయింపులు: కాగ్ కీలక నివేదిక
సాక్షి ముంబై: ఛారిటబుల్ ట్రస్టులు 2014-15, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో 18,800 కోట్ల రూపాయల పన్ను మినహాయింపులను పొందాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదిక వెల్లడించింది.ఇందులో రిజిస్టర్ కాని ట్రస్ట్‌లు 21వేలకుపైగా ఉన్నాయని తెలిపింది. అలాగే 347 ట్రస్టులు, విదేశీ సహకార నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) నమోదు కానప్పటికీ, విదేశీ విరాళాలు పొందాయని సోమవారం పార్లమెంటులో సమర్పించిన నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. (Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?) మొత్తం రూ.18,800 కోట్ల మినహాయింపులో, అత్యధికంగా రూ.4,245 కోట్ల మినహాయింపులు ఢిల్లీకి చెందిన 1345 ట్రస్టులు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,745 ట్రస్టులు 2వేల 500 కోట్ల మినహాయింపును పొదవాయి.ఉత్తరప్రదేశ్‌లో 2,100 ట్రస్ట్‌లు రూ. 1,800 కోట్ల పన్ను రహిత ఆదాయాన్ని పొందగా, రూ.1,600 కోట్ల మేర చండీగఢ్‌లో 299 ట్రస్టులు పొందాయి. మధ్యప్రదేశ్‌లో ఇటువంటి 770 కంటే ఎక్కువ ట్రస్ట్‌లు రూ. 1,595 కోట్లకు పైగా మినహాయింపును పొందాయి మరియు గుజరాత్, ఆంధ్ర మరియు కర్ణాటకలలోని ట్రస్ట్‌ల ద్వారా క్లెయిమ్ చేయబడిన ఒక్కొక్కటి రూ. 1,000 కోట్లకు పైగా మినహాయింపులు ఉన్నాయి. కనీసం 347 ట్రస్ట్‌లు ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ని లేనప్పటికీ విదేశీ విరాళాలను పొందినట్లు నివేదించింది. సెక్షన్ 11 కింద తమ ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి చారిటబుల్ ట్రస్ట్‌లు ఐటీ చట్టంలోని సెక్షన్ 12AA కింద రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. “2014-15 నుండి 2017-18 వరకు అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్న్‌లకు సంబంధించి I-T (సిస్టమ్స్) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అందించిన డేటా ప్రకారం 21,381 కేసులలో సెక్షన్ 11 కింద మినహాయింపు క్లెయిమ్ చేసినట్లు ఆడిట్ గుర్తించింది. అయితే, సెక్షన్ 12AA ప్రకారం నమోదు అందుబాటులో లేదనని నివేదిక పేర్కొంది. ఈ ట్రస్ట్‌లు విదేశీ విరాళాలను స్వీకరించడానికి ఎఫ్సీఆర్ఏ క్రింద రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది.ఎఫ్సీఆర్ఏ చట్టం కింద నమోదు చేయకుండానే అత్యధికంగా విదేశీ విరాళాలు పొందిన రాష్ట్రాల్లో కర్ణాటక, టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయని ఆడిట్లో తేలింది. -
TAX SAVINGS: బంగారం .. సొంత ఇల్లు.. జాగా..
చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు .. అయ్యా సేవింగ్స్ బోలెడంత ఉన్నాయి .. అబ్బాయి అమెరికా నుండి పంపారు. అక్కడ సంవత్సరానికి రూపాయి కూడా వడ్డీ రాదు. ఇండియాలో ఎక్కువ ఆదాయం వస్తుంది .. మమ్మల్ని ఎందులో ఇన్వెస్ట్ చేయమంటారు .. ఎంతవరకు చెయ్యాలి అని అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో .. ఈ వారం ‘ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్‘లో కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చన్న ప్రశ్నకు మీ దగ్గర ఉన్న .. లేదా చేసిన సేవింగ్స్‌ను ఎలా పొదుపు చేశారన్న దానిపై మీరు వివరణ ఇవ్వాలి. అది పన్ను చెల్లించగా మిగిలిన మొత్తమా .. పీఎఫ్ విత్డ్రాయలా, ఎన్ఎస్సీల మెచ్యూరిటీ మొత్తమా, జీవిత బీమా నుండి వచ్చిందా .. మీ పుత్రరత్నం విదేశాల నుండి మీకు పంపినదా .. ఏదైనా ఫర్వాలేదు. సోర్సు అంటూ ఒకటి ఉండాలి. అదీ పక్కాగా ఉండాలి. డాక్యుమెంటరీ ఎవిడెన్సు ఉండి తీరాలి. ఇక బంగారమా.. భవంతా .. లేక జాగానా.. ఏదైనా మీ ఇష్టం. రాయితీలు లేవ్.. అయినా సరే బంగారం కొనడం వల్ల ఎటువంటి రాయితీలు, మినహాయింపులు రావు. ఇన్‌కం ట్యాక్స్ చట్టంలో వీటి గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు. మీరు కొన్న బంగారం ధరకి ‘సోర్స్‘ ఉండాలి. వివరణ ఇవ్వాలి. బంగారం ధర పెరగవచ్చు. తగ్గవచ్చు. ఈ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోరు. అమ్మతే లాభం వస్తే ఆ లాభాన్ని లేదా నష్టాన్ని మూలధనం లాభనష్టాల్లా భావిస్తారు. దీర్ఘకాలికం అయితే 20 శాతం రేటు చొప్పున పన్ను వేస్తారు. దీర్ఘకాలికం కాకపోతే శ్లాబుని బట్టి రేటు ఉంటుంది. సెస్సు అదనం. బంగారమైనా ఆభరణాలైనా ఇదే తీరు. కొంటున్నప్పుడు ఎటువంటి రాయితీలు రావు. అమ్మినప్పుడు పన్ను భారం ఉంటుంది. పన్ను భారం చెల్లించితే మిగతా చాలా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ .. ఆలికి సింగారం.. అదనుకి బంగారం అన్న పాత సామెత ఈ రోజుకీ వర్తిస్తుంది. జాగా విషయంలో జాగా/ఫ్లాటుకి కూడా బంగారంలాగానే. కొన్నందుకు ఎటువంటి మినహాయింపు ఉండదు. అమ్మితే పన్ను భారం ఉంటుంది. వేలల్లో కొని కోట్లలో అమ్మిన సందర్భాలు ఉన్నా ఎంతో లాభం ఉంటుంది. అందులో 20 శాతం ప్రభుత్వానికి పోతుంది. మిగతా అంతా మనదే. ఇంత పెద్ద మొత్తంతో చక్కటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సొంతిళ్లు సొంత ఇల్లు ఎంతో మందికి కల. ఆ కల సాకారం అవ్వటానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు. ఇంటి గురించి అంటే ఫ్లాటు లేదా ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం వంటివి వస్తాయి. సేవింగ్స్ / స్వంత డబ్బులతో కొంటే ఎటువంటి రాయితీలు రావు. ఎటువంటి మినహాయింపులు రావు. అప్పు చేసి కడితే / కొంటే ఆ అప్పు మీద వడ్డీ కట్టాల్సి ఉంటే .. వడ్డీకి మినహాయింపు ఉంది. అప్పు ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. ఇచ్చే వ్యక్తికి ‘సోర్స్‘ సామర్థ్యం ఉండాలి. కాగితాలు ఉండాలి. ఈ అప్పుని తిరిగి చెల్లించినందుకు గాను కూడా మినహాయింపు పొందవచ్చు. రుణం చెల్లించేటప్పుడు నిర్దేశించిన వారి నుంచే అప్పులు తీసుకుని ఉండాలి. సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వడ్డీ నిమిత్తం రూ. 2,00,000 దాటితే ఇవ్వరు. మీరే ఆలోచించుకోండి. నిర్ణయం ఏదైనా చట్టబద్ధం అవ్వాలి. బ్లాక్ వ్యవహారాలు చేయకండి. మీ కుటుంబ అవసరాలు, ప్రాధాన్యతలు, మీ బాధ్యతలు, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే.. -
పన్ను పోటు లేని ప్రదేశం.. క్యూ కడుతున్న కోటీశ్వరులు
ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు చాలా దేశాల్లో కఠినతరంగా అమలు అవుతున్నాయి. ఒకరకంగా చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే.. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే చట్టపు మినహాయింపులతో కొంచెం ఊరట లభిస్తోంది. ఈ తరుణంలో అమెరికా, ఇతర దేశాల నుంచి పన్ను పోటును తప్పించుకునేందుకు ఓ చిన్న కరేబియన్ ద్వీపానికి క్యూ కడుతున్నారు క్రిప్టో కుబేరులు. ప్యూర్టో రికా.. మూడున్నర వేల చదరపు మైళ్ల విస్తీర్ణం, 32 లక్షలకు పైగా జనాభా ఉన్న చిన్న కరేబియన్ టెర్రిటరీ. కార్యనిర్వాహణ, కరెన్సీ మొత్తం వ్యవహారాలన్నీ అమెరికా దేశ పరిధిలోనే నడుస్తోంది. ఈ దీవిలోని సెయింట్ రెగిస్ బహియా బీచ్ రిసార్ట్ ఇప్పుడు తెర మీద చర్చనీయాంశంగా మారింది. 483 ఎకరాల ప్రకృతి రిజర్వ్‌లో గోల్ఫ్ కోర్స్, సముద్ర ముఖ నివాసాలు ఉంటాయి ఈ రిసార్ట్‌లో. కానీ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి హాట్ డిమాండ్ ఏర్పడింది. పన్ను మినహాయింపులతో కూడిన ఆ రిసార్ట్ వెబ్సైట్ చూసి.. అక్కడికి క్యూ కడుతున్నారు క్రిప్టో కోటీశ్వరులు. ఒకరి తర్వాత ఒకరు.. ఐకిగాయ్ అసిస్టెంట్ మేనేజర్ ఆంటోనీ ఎమ్ట్మ్యాన్.. ఈ ఏడాది మార్చ్‌లో లాస్ ఏంజెల్స్‌ను వీడి ఈ దీవిని కొనుగోలు చేసి సెటిల్ అయ్యాడు. క్రిప్టో కమ్యూనిటీ మొత్తం ప్యూర్టో రికా క్యూ కట్టడానికి మూల కారణం ఇతగాడే. ఇక ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిణి, విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సిస్ హ్యూగెన్ కూడా.. ప్యూర్టో రికోలో తన క్రిప్టో స్నేహితులతో కలిసి జీవించనున్నట్లు ఈ మధ్యే ప్రకటించారు. మరోవైపు న్యూయార్క్ మేయర్-ఎలెక్ట్ ఎరిక్ ఆడమ్స్ కిందటి నెలలో క్రిప్టో బిలియనీర్ బ్రాక్ పియర్స్‌తో కలిసి ప్యూర్టో రికా గవర్నర్పెడ్రోతో కలిసి ఏకంగా డిన్నర్ చేశాడు. ఇలా అమెరికా కుబేరులు.. ప్రత్యేకించి డిజిటల్ కరెన్సీతో సంబంధం ఉన్నవాళ్లంతా ఇప్పుడు ఈ దీవి పట్ల ఆసక్తికనబరుస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ నామమాత్రమే! క్రిప్టో కుబేరులంతా ప్యూర్టో రికాకు క్యూ కట్టడానికి కారణం.. ఇక్కడ పన్ను మినహాయింపులు ఉండడం. అవును కొత్తగా వస్తున్న నివాసితులంతా.. తాము సంపాదించే దాని మీద నామమాత్రపు పన్ను ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. పైగా క్రిప్టో కరెన్సీ విషయంలో ఆ మినహాయింపు ఇంకా ఎక్కువే ఉంది. అదెందుకో చెప్పే ముందు.. అసలు వాళ్లు అమెరికాను ఎందుకు వీడుతున్నారో చూద్దాం.. అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం.. అమెరికాలో ఇన్వెస్టర్లు 37 శాతం తక్కువ రాబడి వచ్చినా సరే 20 శాతం దాకా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు కుబేరుల నుంచి మరింత పన్నులు వసూలు చేయాలంటూ బైడెన్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు డెమొక్రట్లు. ఈ ప్రయత్నాలతో పాటు కొత్తగా రాబోతున్న చట్టాలతో మిలీయనీర్లకు, బిలీయనీర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఈ క్రమంలోనే తమకు ‘మినిమమ్’ ట్యాక్స్ వెసులుబాటు అందిస్తున్న కరేబియన్ ద్వీపం ప్యూర్టో రికాకు తరలిపోతున్నారు. లోకల్ కంటే నాన్-లోకల్‌కే.. ప్యూర్టో రికా చట్టాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇక్కడి శాశ్వత నివాసితులు ఫెడరల్ ట్యాక్సులు కట్టాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల మీద వాళ్లకొచ్చే ఆదాయం ఆధారంగా చెల్లించాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. అదే అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చే ‘బోనా ఫైడ్ రెసిడెన్స్’ నామినల్ ట్యాక్సుల కింద 4 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్యూర్టో రికా ట్యాక్స్ చట్టం.. స్థానికుల కంటే పొరుగు వాళ్లకే ఎక్కువ లాభం చేకూరుస్తోందన్నమాట. అందుకే ఇప్పుడు ప్రతీ కుబేరుడి చూపు అటువైపు ఉంటోంది. ఇది తట్టుకోలేకే ప్యూర్టో రికా ప్రజలు.. యూఎస్ఏలో 51వ దేశంగా ప్యూర్టో రికాను గుర్తించాలని పోరాటాలు చేస్తున్నారు. తద్వారా తమకు దక్కని మినహాయింపులు.. ఇతరులకు దక్కడంపై వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. మినహాయింపు కారణం.. కరెన్సీ కొరత, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు 2012 లో ప్యూర్టో రికన్ ప్రభుత్వం ట్యాక్స్ చట్టానికి సవరణ చేసి.. మినహాయింపులు ఇచ్చింది. ఈ కారణంతోనే రియల్ ఎస్టేట్ ధరలు ఈ నేలపై ఎప్పుడో ఆకాశాన్ని అంటాయి. నిజానికి 2017లోనే క్రిప్టో కరెన్సీ రన్ కొనసాగుతున్నప్పుడు.. ఎంతో మంది ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ, ఆ టైంలో ఆ ఐడియా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ ఏడాది క్రిప్టో బూమ్ కొనసాగుతుండడంతో ఏకంగా 1,200 అప్లికేషన్లు ‘ఇన్వెస్టర్స్ యాక్ట్’ ప్రకారం దాఖలు అయ్యాయట. దీంతో క్యాపిటల్ గెయిన్(సంపాదన) మీద పైసా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక అమెరికా నుంచి వస్తున్న ఈ అప్లికేషన్ల సంఖ్య గతంలో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని రిపోర్టులు చెప్తున్నాయి. ఇదే తొలి కాదు.. చివరా కాదు క్రిప్టో మార్కెట్స్ పెరుగుదల, రిమోట్ వర్క్ కారణంగా చాలా మంది ప్యూర్టో రికాలో సెటిల్ అయ్యేందుకు, బిజినెస్ లావాదేవీల కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రిసార్ట్ కమ్యూనిటీలో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. పంటేరా క్యాపిటల్, రెడ్‌వుడ్ సిటీ వెంచర్స్.. కార్యాలయాలు నెలకొల్పి జోరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్యూర్టో రికా రాజధాని శాన్ జువాన్‌కి 26 మైళ్ల దూరంలోని బహియా, డోరాడో బీచ్ రీసార్ట్, కొండాడో (శాన్ జువాన్లోని సిటీ).. డిమాండ్ ఊపందుకుంటోంది. మినీ మియామీగా కొండాడోను అభివర్ణిస్తున్నారు. ట్యాక్స్ బచాయించడానికి ఇక్కడికి చేరుకుంటున్న క్రిప్టో కుబేరులు.. డిసెంబర్ 6న ఏకంగా బ్లాక్‌చెయిన్ వీక్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఒకరకంగా ‘బ్లాక్‌చెయిన్ క్యాపిటల్’గా గుర్తింపు దక్కిందని చెప్తున్నారు బిట్యాంగిల్స్ ఫౌండర్ మైకేల్ టర్పిన్. అయితే ఇలా డిజిటల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ప్రాంతంగా ప్యూర్టో రికా మొదటిదేం కాదు. చివరిది కూడా కాదు. చిన్న దేశం ఎల్ సాల్వడర్ ఇందులో(బిట్ కాయిన్‌కి అధికారికత కట్టబెట్టడం..తయారీ) ఎప్పటి నుంచో ముందంజలో ఉంది. ఇక పోర్చుగల్ కూడా క్రిప్టోకరెన్సీ క్రయవిక్రయాల మీద ట్యాక్స్‌లు విధించకుండా(ప్రధాన ఆదాయ వనరు కానంత వరకే).. డిజిటల్ మార్కెట్‌ను ఆకట్టుకుంటోంది. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
బంధువులు ఇచ్చే బహుమతులయితే ఒకే.. లేదంటే పన్ను కట్టాల్సిందేనా ?
ప్ర. బహుమతులను ఆదాయంగా పరిగణిస్తారా? – యం. రామ్ గౌడ్, నిజామాబాద్ జ. బంధువుల నుంచి వచ్చే బహుమతులను ఆదాయంగా పరిగణించరు. అంటే, ఎటువంటి పన్ను భారం ఉండదు. కానీ స్నేహితుల నుండి తీసుకుంటే అటువంటి మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. మీరు ముందుగా బంధువు నిర్వచనాన్ని తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి సంబంధించి ఈ కింది వారు బంధువుల జాబితాలోకి వస్తారు. 1. జీవిత భాగస్వామి 2. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 3. జీవిత భాగస్వామి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 4. తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు 5. అటు తరం, ఇటు తరం వంశస్థులు (ముత్తాత, తాత, నాన్న, కొడుకు, మనవడు, మునిమనవడు) 6. జీవిత భాగస్వామి యొక్క అటు తరం, ఇటు తరం వంశస్థులు 7. (2) నుండి (7)వరకు పేర్కొన్న వారి జీవిత భాగస్వాములు బీరకాయ పీచు బంధుత్వం ఒక విధంగా చెప్పాలంటే ‘బంధువు‘ నిర్వచనం అనేది దగ్గర వాళ్లందరినీ చుట్టబెట్టేస్తుందని చెప్పాలి. ఈ పరిధి దాటి వెళ్లకండి. ఎత్తేస్తే ఏడు చెక్కలయ్యే బంధువుల దగ్గరకి, బీరకాయ.. బెండకాయ పీచు చుట్టాలు..బాదరాయణ సంబంధాల జోలికి వెళ్లకండి. ఇక బంధువుల నుంచి వచ్చేవే కాకుండా మరికొన్ని బహుమతులకు కూడా మినహాయింపు ఉంది. ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 విలువ దాటి బహుమతులు వస్తే మొత్తం విలువ మీద ఎటువంటి బేసిక్ లిమిట్ లేకుండా ఆదాయంగా భావిస్తారు. కానీ ఈ కింది సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. 1. వివాహ సందర్భంలో 2. వీలునామా ద్వారా 3. ఇచ్చే వ్యక్తి (దాత) చనిపోయే సందర్భంలో 4. స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలు, ట్రస్టులు మొదలైనవి ఇచ్చినవి (కొన్ని పరిమితుల మేరకు) 5.‘బదిలీ‘ కాని వ్యవహారాల నుండి వచ్చినవి అయితే, వ్యవహారం జరిపే ముందు తగిన జాగ్రత్త వహించాలి. దాత ఎవరైనా సరే మూడు విషయాలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 1. దాత ఐడెంటిటీ (డమ్మీని సృష్టించకండి) 2. ఇచ్చే విషయంలో దాత సామర్థ్యం (దాతకు నిర్దిష్ట సోర్స్ ఉండాలి) 3. వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు ఇవి చూపించకపోతే, స్థాపించకపోతే ఈ మొత్తాన్ని మీ ఆదాయంగా పరిగణించే అవకాశం ఉంది. ప్ర. ఆదాయపు పన్ను రిటర్నులలో ఏమేమి ఫారాలు దాఖలు చేయాలి? – మహ్మద్ ఖదీర్ బాషా, నల్గొండ జ. ఒక్క వాక్యంలో చెప్పాలంటే రిటర్నులతో పాటు ఏ కాగితం దాఖలు చేయనక్కర్లేదు. ఇప్పుడు అమలవుతున్న నియమం ప్రకారం ఎటువంటి అటాచ్మెంటు ఇవ్వనవసరం లేదు. ఆన్లైన్లో వేసినా, ఆఫ్‌లైన్‌లో వేసినా ఇదే రూలు. అయితే, మీరు ఒక స్టేట్మెంట్ తయారు చేసుకోండి. అన్ని సోర్స్‌లకు సంబంధించి ఆదాయాలు, లెక్కలు, కాగితాలు, రుజువులు, సర్టిఫికెట్లు, టీడీఎస్ పత్రాలు, ట్యాక్స్ చలాన్లు, ఫారం 16, ఫారం 16 అ, ఫారం 26 అ , ధృవపత్రాలు, కన్ఫర్మేషన్ లెటర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈమెయిల్స్, బ్యాంకు అకౌంటు స్టేట్మెంట్లు, అగ్రిమెంట్లు, సేల్ డీడ్లు, డివిడెండు వారంట్లు .. ఇలా అవసరమైనవన్నీ భద్రపర్చుకోండి. కేసీహెచ్ ఏవీఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు -
వీరికి ఐటీ రిటర్నుల నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు విషయంలో స్థానికంగా నివసించని వారు, విదేశీ ఇన్వెస్టర్లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌లో నివసించని వారు (కార్పొరేట్స్).. నిర్దేశిత ఫండ్‌లో పెట్టుబడులు మినహా ఎటువంటి ఆదాయాన్ని పొందని వారు.. గిఫ్టిసిటీలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేటగిరీ–3 కిందకు వచ్చే వారు రిటర్నులు దాఖలు చేయనక్కర్లేదని సీబీడీటీ తన నోటిఫికేషనలో తెలిపింది. అర్హత కలిగిన విదేశీ ఇన్వెస్టర్లు.. జీడీఆర్, రూపీ డినామినేటెడ్ బాండ్లు, డెరివేటివ్‌లు లేదా ఎంపిక చేసిన సెక్యూరిటీలు, ఐఎఫ్ఎస్సీలోని గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్సేంజ్ల్లోని లిస్టెడ్ సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహించిన వారు రిటర్నులు దాఖలు చేయనవసరం లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని తెలిపింది. -
GST Tax Payers: సెప్టెంబరు 10లోగా టీడీఎస్ దాఖలు చేయండి
న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆగస్టుకి సంబంధించి జీఎస్టీ నుంచి డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ (టీడీఎస్) మినహాయింపు పొందాలని ఆశించే వారు సెప్టెంబరు 10లోగా జీఎస్టీఆర్- 7 ఫామ్‌ని దాఖలు చేయాలని కోరింది. టీడీఎస్ మినహాయింపుకు మరో మూడు రోజుల సమయమే ఉందని చెప్పింది. నిర్దేశిత గడువులోగా జీఎస్టీ ఫామ్ 7ను దాఖలు చేయాలని లేదంటే ఆలస్య రుసుముతో పాటు వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. Attention GST Taxpayers who are required to deduct Tax at Source (TDS) under GST! File your GSTR-7 Return for the month of August, 2021 by September 10th, 2021. pic.twitter.com/6XmfZuRkDq— CBIC (@cbic_india) September 8, 2021 చదవండి: ప్రత్యేక ఆర్థిక జోన్లకూ పన్ను రిఫండ్ పథకం? -
పాత ఇల్లు అమ్మకం.. పన్ను రాయితీ పొందడానికి మార్గాలు
దీర్ఘకాలిక మూలధన లాభాలని ఆదాయంగా భావించి పన్నుభారం లెక్కేస్తారు. ఇతర ఆదాయాలలో కలపకుండా, ఈ లాభం మీద ప్రత్యేక రేట్ల ప్రకారం లెక్కలు వేస్తారు. స్పెషల్ రేటు 20 శాతం, సెస్సు అదనం. పన్ను భారం లేకుండా బైటపడాలంటే మరో ఇల్లు కొనండి లేదా నిర్దేశించిన క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయండి. కింది పేర్కొన్న ఉదాహరణలు ఒకసారి గమనించండి (డిపార్ట్మెంట్ సౌజన్యంతో).. ∙ఎంత ఇన్వెస్ట్ చేయాలి? కేవలం వ్యవహారంతో ముడిపడ్డ లాభం మాత్రమే ఇన్వెస్ట్ చేయవచ్చు. అమ్మగా వచ్చిన మొత్తం కాదు. ఉదాహరణకు ఇల్లు అమ్మగా వచ్చిన ప్రతిఫలం రూ. 90,00,000 అనుకోండి. లెక్కల ప్రకారం దీనిలో మూలధనం లాభం రూ. 22,00,000 అనుకోండి. కొత్త ఇంటి నిమిత్తం కేవలం రూ. 22 లక్షలు వెచ్చిస్తే సరిపోతుంది. ∙రెండు ఇళ్ల మీద లాభం వెచ్చించవచ్చా? మూలధన లాభాలు రూ. 2 కోట్లకు లోబడి, గడువు తేదీ లోగా రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. అయితే, ఇలా ఒకేసారి రెండు ఇళ్లకు జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. మూలధన లాభం రూ. 2 కోట్లు దాటితే, రెండు ఇళ్లు అనుమతించరు. కొత్తవి రెండు ఇళ్లు ఒకేసారి కొనాలనేమీ లేదు. వెనుకా ముందు అయినా ఫర్వాలేదు. కానీ నిర్దేశించిన గడువు లోపల లావాదేవీ జరగాలి. అంటే 3 సంవత్సరాల లోపు గానీ లేదా ఒక సంవత్సరం ముందు/రెండు సంవత్సరాల లోపు గానీ జరగాలి. ∙మినహాయింపు ఎంత ఇస్తారు? మినహాయింపు మొత్తం మూలధన మొత్తాన్ని దాటదు. మొత్తం మూలధన లాభాలను ఇన్వెస్ట్ చేయాలి. లేదా ఎంత చేస్తే అంతకే మినహాయింపు పరిమితం అవుతుంది. మూలధన లాభం రూ.50,00,000 అనుకోండి.. రూ. 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటేనే పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. కేవలం రూ.40 లక్షలు పెట్టి కొంటే.. మినహాయింపు కూడా అంతకే పరిమితమవుతుంది. ∙పైన ఉదాహరణకు మరో మార్గం ఉందా? ఇల్లు కొనే బదులు మీరు క్యాపిటల్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మినహాయింపు ఇస్తారు. రూ. 40,00,000 పెట్టి ఇల్లు కొని మిగతా రూ. 10,00,000 పెట్టి బాండ్లు కొన్నా మీకు పూర్తి మినహాయింపునిస్తారు. ∙గడువు తేదీలోగా ఇల్లు కొనలేకపోతే? ఏవైనా ఇతరత్రా కారణాల వల్ల ఇల్లు కొనలేకపోయినా లేదా కట్టుకోలేకపోయినా గాభరా పడక్కర్లేదు. ఆయా సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను వేసే గడువు తేదీ లోపల మూలధన లాభాన్ని బ్యాంకులో ‘క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్‘లో డిపాజిట్ చేయాలి. ఇలా సకాలంలో డిపాజిట్ చేస్తే ఆ మొత్తం మీద మినహాయింపునిస్తారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసి ఈ మొత్తాన్ని సకాలంలో వెచ్చించకపోతే మినహాయింపుని రద్దు చేస్తారు. ∙ఏయే పరిస్థితుల్లో మినహాయింపు పోతుంది? కొత్త ఇంటిని 3 సంవత్సరాల లోపల అమ్మేస్తే ముందు ఇచ్చిన మినహాయింపును రద్దు చేస్తారు. కాబట్టి హోల్డింగ్ పీరియడ్ విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. (వచ్చే వారం ఉదాహరణలు చూద్దాం) - కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: 75 ఏళ్లు దాటినవారికి ఐటీ రిటర్నుల మినహాయింపు -
మెడల్స్-నజరానా ఓకే.. కట్టింగ్ల పరిస్థితి ఇది!
కనివినీ ఎరుగని రీతిలో భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాల ద్వారా చరిత్ర సృష్టించారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో పాయింట్ల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది మన దేశం. నీరజ్ చోప్రా, బజరంగ్, మీరాబాయ్ చాను, సింధు, భారత హాకీ టీం.. ఇలా పతకాలు తెచ్చిన వీరులను నజరానాలతో ముంచెత్తుతున్నారు. ఈ తరుణంలో వాళ్లకు దక్కబోయే-దక్కుతున్న వాటికి ట్యాక్స్ కట్టింగ్లు వర్తిస్తాయా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్‌లో సెక్షన్ 10(17ఏ) ప్రకారం.. వేటి మీద కోత ఉంటుందో వేటి మీద ఉండదో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నిర్ణయిస్తుంది. ఇలాంటి విజయాల సమయంలో ఆటగాళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నాకే నజరానాలపై ట్యాక్స్‌లు విధించకూడదని నిర్ణయించుకుంది. 1989 నుంచే ఈ చట్టం ఉన్నప్పటికీ.. 2014లో సీబీడీటీ ఆదేశపూర్వకంగా వీటి వివరాలను వెల్లడించింది. ప్రభుత్వాలు అందించే క్యాష్ ప్రైజ్గానీ మరేయితర రూపమైన నజరానాపైగానీ మెడల్స్ విన్నర్లకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. వీళ్లకు నో.. అయితే స్థానిక అధికార సంస్థలు, క్రీడా విభాగాలు, పారిశ్రామికవేత్తలు ప్రకటించే నజరానాలపై పన్ను మినహాయింపు ఉండదు. ఈ లెక్కన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా(చోప్డా)కు ఆనంద్ మహీంద్ర ప్రకటించిన ఎస్యూవీ వెహికిల్ కోసం 30 శాతం పన్ను ఫీజును తన జేబులోంచి కట్టాల్సి ఉంటుంది నీరజ్. ఇక హరియాణా, పంజాబ్, మణిపూర్ ప్రభుత్వాలు ప్రకటించిన కోట్ల రూపాయల నజరానా మాత్రం ఎలాంటి కట్టింగ్లు లేకుండానే నీరజ్ చేతికి అందుతుంది. చదవండి: వీరులకు బ్రహ్మరథం హాకీ ఉమెన్.. కట్ కేవలం ‘విజేతలకు మాత్రమే’ అనే సీబీడీటీ ఆదేశాలు.. మిగతా టాలెంటెడ్ ఆటగాళ్లకు విఘాతంగా మారాయి. ఒలింపిక్స్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన భారత మహిళా హాకీ టీం 9 మంది ప్లేయర్లకు హరియాణా సర్కార్ రూ.50లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. మెడల్ గెలవనందున ఈ డబ్బు నుంచి ట్యాక్స్ కట్టింగ్లు పోనున్నాయి. కేవలం ప్లేయర్స్‌కే కాదు.. వాళ్ల కోచ్‌కు కూడా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థల నుంచి ఎలాంటి రివార్డు అందినా.. అదీ కోతకు గురికావాల్సిందేనని చట్టం స్పష్టం చేస్తోంది. 30 శాతం తప్పదు ప్లాట్ రేట్ ప్రకారం.. మినహాయింపులు లేని నజరానాల నుంచి 30 శాతం కోత తప్పనిసరి. కేవలం గెలిచిన వాళ్లే కాదు.. ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అందించే నజరానాలకు ఈ కోత తప్పదు. ఒకవేళ దాతనే ముందుకొచ్చి ఆ చెల్లింపులు భరిస్తే మాత్రం.. ఆటగాళ్లపై భారం పడదు. ఇక విమాన, రైల్వే, బస్సు ప్రయాణాలంటూ ఆటగాళ్లకు ఉచిత ఆఫర్లను ప్రకటిస్తుంటాయి సంస్థలు. అయితే ప్రభుత్వ-ప్రైవేట్ రంగ పరిధిలోని ఏవైనా సరే ప్రయాణాలకు మాత్రమే ఫ్రీ ఆఫర్‌ను ఇస్తాయి. ఫుడ్, లగేజీ ప్యాకింగ్ తదితర ఛార్జ్‌లపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా.. ఎంతో కొంత ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. -
భార్యాభర్తలు.. ఒక్కరికే పన్ను మినహాయింపు
గత ఎన్నో ఏళ్లుగా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం.. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసి, సంపాదించడం, సంసార బాధ్యతలను నిర్వర్తిస్తుండటం. ఇలా మన దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి జనాల్లో ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారెందరో ఉన్నారు. ఎన్నో కారణాల వల్ల వేర్వేరు స్థలాల్లో పని చేసే భార్యాభర్తలు ఉన్నారు. ప్రస్తుతం ఒకే ప్రాంతంలో, ఒకే ఇంట్లో కలిసి కాపురం చేస్తూ పన్ను పరిధిలోకి వచ్చే భార్యాభర్తల అంశం చూద్దాం. ఒకే ఇంట్లో అద్దె చెల్లిస్తున్న భార్యభర్తలు .. తమ తమ ఆదాయంలో నుంచి ఇంటద్దెను ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం. ఉదాహరణకు.. ఒక జంట.. ఒకే హోదా, ఇంచుమించుగా సమానమైన జీతభత్యాలు అందుకుంటూ ఒకే ప్రాంతం, ఒకే ఇంట్లో అద్దె చెల్లిస్తూ, జీవిస్తున్నారనుకుందాం. ఇంటద్దె రూ. 40,000 అనుకుందాం. సాధారణంగానే పన్ను భారం ఎలా తగ్గించుకోవాలన్నది ప్రతి వారూ ఆలోచిస్తారు. ఇందుకోసం ప్లానింగ్ చేసుకోవడంలోనూ తప్పు లేదు. అయితే, ఇలాంటి సందర్భాల్లో చాలా మంది చేసే పొరపాటు.. ఇద్దరూ విడివిడిగా తమ సంస్థలకు సబ్మిట్ చేసే స్టేట్మెంట్లలో ఇంటద్దెను చూపించి, మినహాయింపు పొందుతుంటారు. ఇలా చేయడం తప్పు. వారి వాదన ఏమిటంటే యజమాని వేరు.. అసెస్మెంట్ చేసే అధికారులు వేరు .. ఎవరికీ ఏమీ తెలియదు.. భార్య పాన్‌కార్డులో భర్త పేరుండదు.. తన తండ్రి పేరు ఉంటుంది కాబట్టి ఎవరూ కనిపెట్టలేరు .. అలాగే భర్త పాన్‌కార్డులో తన తండ్రి పేరు ఉంటుంది ... వీళ్లిద్దరూ భార్యాభర్తలని తెలుసుకోవడం కష్టమని అనుకుంటూ ఉంటారు. యజమాని సంస్థలోని అధికారులు కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తారు. ’ఒక కాగితం, రశీదు, పాన్‌కార్డు ఓనరుది ఇవ్వండి చాలు’ అని సరిపెట్టేస్తారు. కృత్రిమ మేధతో పసిగట్టేస్తారు..జాగ్రత్త.. ఇప్పుడు అసెస్మెంట్లు ఇదివరకులా జరగడం లేదు. కృత్రిమ మేధస్సు ద్వారా ఎన్నో విషయాలను పసిగడుతున్నారు. కాబట్టి ఇద్దరూ మినహాయింపు క్లెయిమ్ చేయకండి. ఎవరి జీతం/ఆదాయం ఎక్కువ ఉందో వారే క్లెయిమ్ చేయకండి. మిగతావారు చేయకండి. లేదా ఇద్దరూ చెరో సగం చేయండి. నిజంగా అద్దె చెల్లించకుండా ఇంటద్దె మినహాయింపు పొందవద్దు. తాతగారిల్లు అనో.. మావగారి ఇల్లు అనో తప్పుడు క్లెయిమ్ చేసి, దొంగ సంతకాలు ఎడమ చేతితో పెట్టి రశీదులు ఇవ్వకండి. యజమాని సంస్థలో పనిచేసే ఉద్యోగి సహకారం, సహాయం తప్పుగానే భావించండి. ఆ తప్పుడు డిక్లరేషన్లు నిలవవు. ఏదో ఒక కాగితంలే.. ఏదో ఒక రశీదులే అని తేలికగా తీసిపారెయ్యకండి. ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వారే ఇవ్వాలి. స్వర్గస్తులైన వారి పేరు మీద కూడా కొందరు దొంగ రశీదులపై సంతకాలు చేస్తున్నారు. గంతకు తగ్గ బొంతలాగా ఓనర్లు కూడా అలాగే ఉంటున్నారు. ‘మా అబ్బాయి ఇల్లు. వాడు అమెరికాలో ఉంటాడు. రెంటు నా అకౌంటులో పడుతుంది. ఈ రెంటు నాది కాదు‘ అని చూపించడం మానేసిన వాళ్లు కూడా ఉంటున్నారు. అది తప్పు. అలాంటిదేదైనా ఉంటే మీ అబ్బాయి అకౌంటులోనే చూపించండి. ఒకవేళ తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ పన్ను భారం తగ్గించుకునేందుకు అద్దెకు ఉన్నట్లు చెప్పే బదులు.. నిజంగానే అద్దె ఇవ్వండి. అది మీకు ఖర్చు కాబట్టి అందుకు మినహాయింపు పొందండి. భార్యభర్తల విషయంలో ఒకరే మినహాయింపు పొందండి. భార్యభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి నిజంగానే అద్దె చెల్లిస్తున్నట్లయితే మినహాయింపు పొందండి. మీ కుటుంబ సభ్యులకే అద్దె చెల్లిస్తున్నట్లయితే, దాన్ని వారి ఆదాయంలో ఇంటద్దెగా చూపించమనండి. -
ఇన్‌కంట్యాక్స్ నుంచి మినహాయింపు కావాలా? ఇవిగో మార్గాలు
వ్యాపారం ఎంతో రిస్క్‌తో కూడిన పని. అనేక కష్టనష్టాలకు ఓర్చితేనే ఏదైనా కంపెనీ లాభాల బాట పడుతుంది. అయితే ఈ లాభాల నుంచి ఆదాయపన్ను కట్టాల్సి వస్తుంది. బడా కంపెనీలకు ఇది పెద్ద సమస్య కాకపోయినా ఎదుగుతున్న కంపెనీలు పన్ను మినహాయింపు ఆశిస్తాయి. ప్రతీనెల జీతం తీసుకునే ఉద్యోగులు ఆదాయం పన్ను మినహాయింపును కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం చట్ట పరంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చే వాటిలో కొన్ని.. టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మనకు, మన కుటుంబానికి ఇన్సురెన్స్ భద్రత అందిస్తుంది. ఆదాయపన్ను కడుతున్నవారు ఇన్వెస్ట్ చేయాల్సిన వాటిలో ఇన్సురెన్స్ ప్రధానమైంది. ఇన్సురెన్స్ పాలసీ ప్రీమియంగా చెల్లించిన మొత్తానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం కడితే ఆ ఏడాదికి సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చట్టపరంగా ఇన్‌కంట్యాక్స్‌ను తగ్గించుకునేందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం చక్కనగా ఉపకరిస్తుంది. ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ప్రారంభించి, అందులో జమ చేసిన సొమ్ముకు పన్ను నుంచి మినహయింపు ఉంటుంది. అయితే ఇందులో జమ చేసే మొత్తాన్ని 15 ఏళ్ల వరకు విత్‌డ్రా చేయడానికి వీలులేదు. ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు ఎక్కువ మంది ఎంచుకునే మార్గాల్లో ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఒకటి. ఈక్విటీ మార్కెట్లతో పోల్చితే రిస్క్ తక్కువ, గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అయితే డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ పథకం ద్వారా పన్ను రాయితీ పొందవచ్చు. తక్కువ ఆదాయం పొందే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. రిటర్న్స్ కూడా ఎక్కువగా అందిస్తుంది. ఈ పథకం ద్వారా రూ. 1.50 లక్షల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం అరవై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు పన్ను రాయితీ కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఐదేళ్లు మెచ్యూరిటీ పీరియడ్‌గా ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. -
పన్ను మినహాయింపులకు నీతి ఆయోగ్ ఓటు
సాక్షి, న్యూఢిల్లీ: లాభాపేక్ష లేని ఆసుపత్రులకు లభించే విరాళాలు, చౌక వడ్డీ రేట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాల ప్రొవిజన్‌పై ఆదాయపన్ను మినహాయింపులు ఇవ్వవలసి ఉన్నట్లు నీతి ఆయోగ్ తాజాగా ప్రతిపాదించింది. పూర్తి స్థాయిలో(100 శాతం) పన్ను మినహాయింపులను కల్పించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. తద్వారా దేశీయంగా ఆరోగ్య పరిరక్షణ సర్వీసులను పటిష్ట పరచవచ్చని తెలియజేసింది. దేశంలో లాభాపేక్షలేని ఆసుపత్రి ఎలా ఉండాలో సూచించే నమూనాపై ఒక సమగ్రమైన అధ్యయన నివేదికను నీతి ఆయోగ్ మంగళవారం విడుదల చేసింది. తెలంగాణలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్స్ సహా పలు ఆసుపత్రులను అధ్యయనం చేయడం ద్వారా కనుగొన్న అంశాలను ఈ నివేదికలో వివరించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సౌకర్యాల నిర్వహణలో ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో గరిష్ట సేవలందించే ఆసుపత్రులు భాగస్వాములు కావడం మేలు చేకూర్చగలదని అభిప్రాయపడింది. లాభాపేక్షలేని ఆసుపత్రులను గుర్తించేందుకు వీలుగా దాతృత్వ కార్యక్రమాలకుగాను ప్రస్తుతం అమలు చేస్తున్న 50% ఆదాయపన్ను మినహాయింపును 100%కి పెంచాలని ప్రతిపాదించింది. దీంతో నిధుల ఆవశ్యకత ఉన్న సంబంధిత ఆసుపత్రులకు మద్దతు లభిస్తుందని, అవసరమైన ఆసుపత్రులకు తగిన వనరులు సమకూరేందుకు వీలుంటుందని వివరించింది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ మాట్లాడుతూ ‘దేశంలో ప్రైవేటు రంగంలో ఆరోగ్య సదుపాయాల విస్తరణకు సంబంధించి పెట్టుబడులు తక్కువ స్థాయిలోనే లభిస్తున్నాయని తెలిపారు. నివేదికలో కీలక అంశాలు లాభాపేక్ష లేని ఆసుపత్రులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా తక్కువ వేతనాలు ఇవ్వాల్సి రావడంతో వైద్య నిపుణులు త్వరితగతిన వెళ్లిపోతుండడం, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన చోట మౌలిక వసతులు లేక వైద్య నిపుణులు వచ్చేందుకు ఇష్టపడకపోవడం, ప్రభుత్వ స్కీములు అమలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ త్వరితగతిన రాకపోవడం, మౌలిక వసతుల విస్తరణకు ఆర్థిక వనరులు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయని నివేదిక తెలిపింది. అలాగే మారుమూల ప్రాంతాల్లోని ఆసుపత్రులు ప్రభుత్వ నియంత్రణకు సంబంధించిన పలు నిర్దేశాల అమలు కూడా సవాలుగా మారిందని తెలిపింది. చదవండి: Covid Vaccine: టీకా ప్రభావాన్ని డెల్టా ప్లస్ తగ్గించలేదు! -
వ్యాక్సిన్‌పై ఐదు శాతం జిఎస్టీ
-
GST Council meet: కీలక నిర్ణయాలు
సాక్షి,ఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నుల తగ్గించారు. కోవిడ్-19 చికిత్సకు ఉపయోగించే మూడు రకాల మందులకు పన్ను మినహాయింపునిచ్చారు. అయితే కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 శాతం జీఎస్టీ యధా విధిగా అమలవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈమినహాయింపులు ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో వ్యాక్లిన్లపై జీఎస్టీ వడ్డింపు నుంచి ఊరట లభిస్తుందని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. ఆంబులెన్స్‌లపై విధించే జీఎస్టీని 12 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు ఇది 28శాతంగా ఉంది.అలాగే ఎలక్ట్రిక్ ఫర్నేసులు,టెంపరేచర్ తనిఖీపరికరాలపై 5శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు. దీంతోపాటు బ్లాక్‌ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్-బీపై జీఎస్టీ మినహాయింపు నివ్వడం విశేషం. వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు, ఇతర ముఖ్య అధికారులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో శనివారం జరిగిన భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్య నిర్ణయాలు వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ అమలు కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌పై సిఫారసులకు ఆమోదం టోసిలుజుమాబ్, యాంఫోటెరిసిన్ ఔషధాలపై పన్ను మినహాయింపు రెమ్‌డెసివిర్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు మెడికల్ ఆక్సిజన్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు జనరేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు వెంటిలేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్న సవరించిన జీఎస్టీ మినహాయింపులు -
కోవిడ్ ఔషధాల ధరలు తగ్గేనా?
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జూన్ 12వ తేదీన అత్యున్నత స్థాయి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కోవిడ్, బ్లాక్ ఫంగస్ ఆవశ్యక ఔషధాలపై పన్నులను తగ్గించే అంశంపై ఈ సమావేశం ప్రధానంగా చర్చించనున్నదని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ కౌన్సిల్లో రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా ఉంటారు. మే 28 కోవిడ్ ఔషధాల తగ్గింపు మే 28వ తేదీన జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. కోవిడ్ ఔషధాల ధర తగ్గింపుపై ఆ సమావేశంలో చర్చించినా ... ఏకాభిప్రాయం రాకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి జీఎస్టీ కౌన్సిల్ ఇదే అంశం ప్రధానంగా సమావేశం కానుంది. ధరలు తగ్గుతాయి పీపీఈ కిట్లు, మాస్క్‌లు , వ్యాక్సిన్లుసహా కోవిడ్ ఆవశ్యక ఔషధాలకు పన్ను రాయితీ అంశాలపై సిఫారసులు చేయడానికి మంత్రిత్వ స్థాయి గ్రూప్ (జీఓఎం) ఏర్పాటైంది. దేశీయ తయారీ వ్యాక్సిన్లపై ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ ఉంది. కోవిడ్ మందులు, ఆక్సిజన్ కాన్సెంట్రేషన్లపై ఈ రేటు 12 శాతంగా ఉంది. జీఎస్టీ తొలగిస్తే వీటి ధరలు తగ్గుతాయి. -
ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ..!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతుండగా, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆక్సిజన్ కొరతపై ప్రత్యేక దృష్టి సారించింది. కోవిడ్-19 పై చేస్తున్న పోరాటంలో ఆక్సిజన్ సిలిండర్లు, మందులపై పన్నులను రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం రోజున ప్రధాని నరేంద్రమోదీకి లేఖను రాశారు. దాంతో పాటుగా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని కోరింది. కోవిడ్-19 రోగుల వైద్యం కోసం అవసరమయ్యే పరికరాలను, మందులు, ఆక్సిజన్ సరఫరాను పెంచాలని మమతా బెనర్జీ లేఖలో రాశారు. పెద్ద ఎత్తున పలు ఎన్జీవోలు, వ్యక్తులు కోవిడ్-19 రోగుల కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, సిలిండర్లు, క్రయోజనిక్ స్టోరేజీ ట్యాంకర్లను, కంటైనర్లను ప్రభుత్వానికి అందించడానికి ముందుకు వస్తున్నారని పేర్కొంది. ఈ సంస్థల నుంచి వస్తోన్న పరికరాలతో ప్రభుత్వాలకు ఆపన్నహస్తంలా ఉంటాయని మమత లేఖలో తెలిపారు. మెడికల్ సదుపాయాలపై పన్నుల నుంచి వెసులుబాటు కల్పించాలని స్వచ్చంద సంస్ధలు తెలిపిన విజ్ఞప్తి మేరకు, మెడికల్ వస్తువులపై పన్నులు వేయకుండా మినహాయింపును ఇవ్వాలని లేఖలో స్పష్టం చేశారు. పన్నుల చెల్లింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో రోగుల ప్రాణాలను కాపాడే మందులు. పరికరాలపై పన్నులను ఎత్తివేయాలని కోరారు. దాంతో పాటుగా దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందజేయాలని మమత బెనర్జీ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. చదవండి: ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు -
ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త!
ఇల్లు కొనుగోలు అన్నది చాలా మంది విషయంలో అత్యంత ఖరీదైన వ్యవహారం. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు.. ఇంటి కొనుగోలుతో తమకు ఓ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు.. బోలెడు పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. దేశవ్యాప్తంగా చాలా మార్కెట్లలో ఇళ్ల ధరలు స్తబ్దుగానే ఉన్నాయి. గతేడాది కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇళ్ల ధరలు పెద్దగా పెరిగింది లేదు. సొంతింటి కోసం ప్రణాళిక వేసుకునే వారికి ఇది అత్యంత అనుకూల సమయంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు చాలా కనిష్ట స్థాయిలకు వచ్చేశాయి. పైగా పన్ను ఆదాను కలిపి చూసుకుంటే ఇంటి కొనుగోలు మంచి లాభసాటే అవుతుంది. ఇంటిపై పన్ను ప్రయోజనాలు ఎన్నిరకాలుగా ఉన్నాయనే వివరాలను ఈ కథనంతో తెలుసుకుందాం.. మొదటి ఇంటి కొనుగోలు.. మొదటి సారి ఇంటిని కొనుగోలు చేస్తున్నట్టయితే.. ఆదాయపన్ను చట్టంలోని మూడు సెక్షన్ల కింద ప్రయోజనాలకు అర్హులు. ఉదాహరణకు రూ.40 లక్షల ఇంటిని 80 శాతం రుణంతో (రూ.36 లక్షలు) కొనుగోలు చేస్తున్నారనుకుంటే.. 20 ఏళ్ల కాలానికి వడ్డీ రేటు 7 శాతం అనుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.31,000 అవుతుంది. మొదటి ఏడాదిలో రూ.3,72,000 చెల్లించాల్సి వస్తుంది. ఇందులో రూ.2.77 లక్షలు రుణంపై వడ్డీ కింద జమ అవుతుంది. రూ.95,000 రుణానికి అసలు కింద జమ అవుతుంది. రుణ గ్రహీత వార్షిక ఆదాయం రూ.15 లక్షలు అనుకుంటే ఈ కేసులో.. రూ.95,000 అసలు చెల్లింపులను సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల మొత్తంపై పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. కనుక మిగిలిన రూ.55,000ను ఇంటి కొనుగోలు కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ చార్జీలను మొదటి ఏడాది కింద మినహాయింపుగా చూపించుకోవచ్చు. ఇక వడ్డీ భాగం కింద రూ.2.77 లక్షల చెల్లింపుల్లో రూ.2,00,000ను సెక్షన్ 24 కింద చూపించుకోవడం ద్వారా ఆ మొత్తంపై రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. మిగిలిన రూ.77,000ను సెక్షన్ 80ఈఈఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మొదటి ఏడాదిలో రూ.4.27లక్షల మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ప్రిన్సిపల్ (అసలు), వడ్డీ భాగం అన్నది ఏటా మారుతుంటుంది. కనుక పన్ను మినహాయింపుల విషయమై ఏటా ముందే ఓ స్పష్టతకు రావాలి. రెండో ఇంటిపై పెట్టుబడి పెడుతుంటే..? అందరూ మొదటిసారే ఇళ్లను కొనుగోలు చేస్తారని అనుకోవడానికి లేదు. రెండో ఇంటిపైనా ఇన్వెస్ట్ చేసే వారు ఉంటారు. కనుక రెండో ఇంటి కొనుగోలుకు రుణం తీసుకున్నట్టయితే.. వడ్డీ చెల్లింపుల భాగాన్ని సెక్షన్ 24(బి) కింద చూపించుకునే అవకాశం ఉంది. కానీ, ఇక్కడొక పరిమితి ఉంది. రెండు ఇళ్లకూ కలిపి సెక్షన్ 24(బి) కింద గరిష్టంగా రూ.2లక్షల వడ్డీ చెల్లింపులకే పన్ను మినహాయింపు పొందగలరు. 2019–20 నుంచి రెండో ఇల్లు, సొంతంగా ఉండే ఇంటిపై నోషనల్ రెంట్ ఎత్తి వేశారు. అంటే 2019–20 ముందు వరకు ఒక్క ఇంటినే సొంతానికి వినియోగిస్తున్నట్టు చూపించుకునే అవకాశం ఉండగా.. ఆ తర్వాత నుంచి రెండు ఇళ్లను సైతం సొంత వినియోగం కింద చూపించుకునే అవకాశం కల్పించారు. దీంతో నోషనల్ రెంట్ రూపంలో పన్ను చెల్లించాల్సిన ఇబ్బంది తప్పింది. రెండు ఇళ్లనూ స్వీయ వినియోగానికే కేటాయించుకుంటే.. గరిష్టంగా రూ.2,00,000 వడ్డీ చెల్లింపులను సెక్షన్ 24 (బి) కింద.. సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు అసలు చెల్లింపులపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చారనుకుందాం.. అప్పుడు అద్దె ఆదాయం నుంచి 30 శాతాన్ని ప్రామాణిక మినహాయింపు కింద చూపించుకోవచ్చు. అదే సమయంలో ఇంటి అద్దె ఆదాయన్ని కూడా వార్షిక ఆదాయానికి కలిపి చూపిస్తూ.. అదే ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా (పరిమితి లేకుండా) పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ఇతర ఆదాయ నష్టం రూ.2,00,000 వరకు సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత ఏదైనా మిగులు ఉంటే దాన్ని తదుపరి ఎనిమిది సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చని ఎన్ఏ షా అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అశోక్ షా పేర్కొన్నారు. జాయింట్‌గా ఇంటి కొనుగోలుపై.. భార్యా, భర్త ఉమ్మడిగా ఇంటిని కొనుగోలు చేస్తే.. వారు విడివిడిగా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులు. అయితే, ఇక్కడ పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు స్త్రీ, పురుషులు ఇరువురూ ఆదాయ వనరు కలిగి ఉండడం తప్పనిసరి. అలా కాకుండా.. భార్యా, భర్త ఉమ్మడిగా ఇంటిని కొనుగోలు చేసినప్పటికీ.. భార్యకు ఎటువంటి ఆదాయ వనరు లేకపోతే.. పన్ను ప్రయోజనాలకు భర్త ఒక్కరే అర్హులవుతారు. పన్ను ప్రయోజనాలను భార్యా, భర్తలు ఇద్దరూ విడిగా క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. వారు ఎంత మేరకు వాటా కలిగి ఉన్నారన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇద్దరి ఆదాయాన్ని కలిపితే అర్హత ఎక్కువ లభిస్తుంది. రుణం సాఫీగా మంజూరవుతుంది. మహిళా దరఖాస్తుదారులకు కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లపై గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో చెల్లించాల్సిన ఈఎంఐ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే, చాలా రాష్ట్రాలలో మహిళా కొనుగోలుదారులకు స్టాంప్‌డ్యూటీ రేటు తక్కువ అమలవుతోంది. ‘‘సెక్షన్ 80సీ కింద గృహ రుణం అసలు చెల్లింపులు రూ.1.50లక్షలు.. సెక్షన్ 24 కింద గృహ రుణంపై వడ్డీ రూ.2,00,000 వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుంటే ఎవరికి వారు గరిష్టంగా ఈ మేరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులు’’అని నిస్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో అమిత్గోయంకా తెలిపారు. ఉదాహరణ: ఇప్పుడు ఒక జంట ఉమ్మడిగా గృహ రుణం తీసుకుని రూ.కోటి విలువైన ఇంటిని కొనుగోలు చేశారని అనుకుందాం. ఇందు కోసం రూ.90,00,000 రుణాన్ని బ్యాంకు నుంచి 7 శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారు. స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల రూపేణా వీరు రూ.3,00,000 చెల్లించారు. ఇలా చూస్తే ఈ జంట మొదటి ఏడాది రూ.5,50,000ను వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అలాగే, రూ.2,00,000ను ప్రిన్సిపల్‌గా జమ చేయాలి. ఇటువంటి సందర్భంలో.. వీరు ఎవరికి వారే విడిగా.. సెక్షన్ 24 (బి) కింద గరిష్టంగా రూ.2లక్షలను వడ్డీ రూపంలో మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ అద్దెకు ఇస్తే ఈ పరిమితి రూ.2,75,000కు పెరుగుతుంది. సెక్షన్ 80సీ కింద ఎవరికి వారు రూ.1.50 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. మహిళ కొనుగోలుదారుగా ఉంటే.. ఆదాయపన్ను చట్టం కింద మహిళలకు ఎటువంటి ప్రత్యేక ప్రయోజనాలు ఇంటిపై లేవు. పురుషులతో సమానంగా ఆదాయపన్ను చట్టం కింద పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, కొన్ని రాష్ట్రాలు మహిళలు ఇంటి కొనుగోలుదారులుగా ఉంటే స్టాంప్ డ్యూటీ చార్జీల్లో 1–2 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. రాజస్తాన్‌లో స్టాంప్ డ్యూటీ చార్జీ 8.8 శాతంగా ఉంటే.. మహిళలకు 7.5 శాతమే అమలు చేస్తున్నారు. ఇటువంటి ప్రయోజనాలు ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. -
పన్ను మినహాయింపులు పొడిగించాలి
ఐటీ కంపెనీలు అత్యధికంగా ఉన్న సెజ్‌లకు సంబంధించి ఈ ఏడాది మార్చితో ముగిసిపోనున్న ఆదాయపు పన్ను మినహాయింపు వెసులుబాటును మరో అయిదేళ్ల పాటు పొడిగించాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్..కేంద్రాన్ని కోరింది. అలాగే, అత్యంత ప్రభావం చూపగలిగే వినూత్న టెక్నాలజీలను రూపొందించే డీప్ టెక్నాలజీ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూ. 3,000 కోట్లతో అయిదేళ్ల కాలంలో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించిన ప్రీ–బడ్జెట్ కోర్కెల చిట్టాలో నాస్కామ్ ఈ అంశాలు పొందుపర్చింది. తయారీ రంగంలోని కొత్త స్టార్టప్స్ కోసం ప్రకటించిన 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ రేటును ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) కొత్త సర్వీస్ కంపెనీలకు కూడా వర్తింపచేయాలని నాస్కామ్ కోరింది. దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయాల్లో దాదాపు 75 శాతం వాటా ఎగుమతుల నుంచే వస్తోంది. అయితే, ట్యాక్స్ రేట్లు తక్కువగా ఉన్న ఇతర వర్ధమాన దేశాల నుంచి పోటీ దేశీ కంపెనీలకు పోటీ తీవ్రమవుతోంది. భారత్‌లో కార్పొరేట్ ట్యాక్స్ రేటు 25 శాతంగా ఉండగా చైనాలో ఐటీ..టెక్నాలజీ రంగానికి ఇది 15 శాతంగానే ఉంది. శ్రీలంకలో 14 శాతం, వియత్నాంలో తొలి 15 ఏళ్ల పాటు 10 శాతం, ఫిలిప్పీన్స్‌లో తొలి నాలుగు నుంచి ఆరేళ్ల దాకా పూర్తి మినహాయింపు.. ఆ తర్వాత నుంచి 5 శాతంగా రేటు ఉంటోందని నాస్కామ్ పేర్కొంది. మందగమనం, అంతర్జాతీయంగా పోటీ తీవ్రమవుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో పన్ను మినహాయింపు వెసులుబాటును పొడిగించిన పక్షంలో సేవల రంగానికి గణనీయంగా తోడ్పాటు లభించగలదని నాస్కామ్ పబ్లిక్ పాలసీ విభాగం సీనియర్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు ట్యాక్స్ ప్రోత్సాహకాలు..! ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించే దిశగా స్టార్టప్ సంస్థలకు పన్నుపరమైన ప్రోత్సాహకాలను బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పరిశ్రమలు.. అంతర్గాత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖకు పలు సిఫార్సులు చేసినట్లు సమాచారం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏర్పాటైన ఇన్క్యుబేటర్లకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ ఫీజులపై జీఎస్టీ తగ్గింపు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్‌పై(ఎసాప్స్) పన్ను ప్రయోజనాలు మొదలైనవి వీటిలో ఉన్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో భారత్.. ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా ఎదగగలదని అధికారిక వర్గాలు తెలిపాయి. శైశవ దశలో ఉన్న స్టార్టప్‌లకు ఎసాప్స్ ఉత్తమమైన సాధనాలని, వీటిపై సాధ్యమైనంత తక్కువగా పన్నులు ఉండాలని టీ కేఫ్ చెయిన్ చాయోస్ వ్యవస్థాపకుడు నితిన్ సలూజా పేర్కొన్నారు. -
‘పన్ను’కు టైమైంది..
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు పెద్దగా సమయం లేదు. వాస్తవానికి జూలై చివరి నాటికే ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ చివరి వరకు గడువును పొడిగించింది. దీంతో ఈ నెల చివరి వరకు అవకాశం లభించినట్టు అయింది. కనుక వెంటనే ఐటీఆర్ దాఖలును ప్రారంభించడం మంచిది. బేసిక్ పన్ను మినహాయింపు అయిన రూ.2.5 లక్షలు (60 ఏళ్లు దాటిన వారికి రూ.3 లక్షలు) దాటి ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరూ నిబంధనల మేరకు ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాలంటే, అందులో ఉండే పన్ను అంశాలు, వాటికి సంబంధించి ఇవ్వాల్సిన వివరాలు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అంతేకాదు అందరికీ ఒకటే ఐటీఆర్ వర్తించదు. వేతన జీవులు, వ్యాపారులు, ఉమ్మడి కుటుంబాల వారు... ఇలా వారి ఆదాయ మార్గాలను బట్టి ఐటీఆర్ కూడా మారిపోతుంది. కనుక ఐటీఆర్ ప్రక్రియ గురించి అవగాహన కలిగి ఉంటే, సులభంగా దాఖలు చేయవచ్చు. ఆ వివరాలే ఈవారం ప్రాఫిట్ ప్లస్ కథనం... గడువులోపు ఐటీఆర్ దాఖలు అన్నది మంచి చర్య అవుతుంది. లేదంటే పెనాల్టీలు, ఇతర వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఐటీఆర్ దాఖలు కోసం ముందుగా మీరు మీ ఆదాయ వనరులు అన్నింటిపై అవగాహన కలిగి ఉండాలి. వేతనం, ఇంటి అద్దె, ఏవైనా రాయల్టీలు (ప్రతిఫలాలు) ఇలా అన్ని ఆదాయ వనరుల సమాచారం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆదాయంలో దేనిపై పన్ను వర్తిస్తుందన్నది తెలుసుకోవాలి. ఆదాయపన్ను అన్నది బేసిక్ శాలరీ, కరువుభత్యం (డీఏ), బోనస్‌లపై అమలవుతుంది. సొంతిల్లు ఉండి, అందులో మీరు నివసిస్తుంటే తప్ప ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పన్ను పరిధిలోకి రాదు. ఇక ఆదాయంలో పన్ను మినహాయింపులు వేటికన్నది గుర్తించాల్సి ఉంటుంది. సేవింగ్స్ పథకాలు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటివన్నీ సెక్షన్ 80సీ కింద మినహాయింపులోకి వస్తాయి. పన్ను వర్తించే ఆదాయం అన్నది స్థూల ఆదాయంలో ఒక భాగం కాగా, మిగిలినది మినహాయింపులకు అర్హమైనది. పన్ను వర్తించే ఆదాయంపై పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పన్ను ఆదాయం ఉన్న వారి వేతనం నుంచి టీడీఎస్‌ను సంస్థలు మినహాయిస్తుంటాయి. ఈ వివరాలను ఫామ్–16 రూపంలో సంస్థ నుంచి పొందొచ్చు. ఐటీ చట్టం ప్రకారం పలు రకాల పన్ను శ్లాబులు ఉన్నాయి. మీకు పన్ను వర్తించే ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, అందులో వర్తించే రేటు మేరకు పన్ను చెల్లించాలి. ఐటీఆర్‌లో అన్ని వివరాలు పొందుపరిచి మినహాయింపుల ఆదాయం పోను మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించిన తర్వాత... ఏవైనా వ్యత్యాసం ఉంటే.. ఆ మేరకు పన్ను చెల్లింపుదారుడు రిఫండ్ కోరొచ్చు. తనే అదనంగా చెల్లించాల్సి ఉంటే పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆదాయ వనరులు... మీరు ఉద్యోగి అయితే, నెలవారీ ఆదాయం లేదా వార్షికాదాయంతోపాటు.. ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం (అంటే ఇంటిపై అద్దె, ఉన్న ఆస్తిని విక్రయించగా వచ్చిన ఆదాయం వంటివి). పన్ను పరంగా అన్ని రకాల ఆదాయం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం కిందకు వస్తుంది. బేసిక్ సాలరీ, బోనస్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర అలవెన్స్‌ను వేతనంలో భాగంగా పొందుతుంటే అది పన్ను వర్తించే ఆదాయమే. అలాగే, ఇంటిపై వచ్చే ఆదాయంపైనా పన్ను ఉంటుంది. ఏదైనా ఆస్తిని విక్రయించగా వచ్చిన మూలధన లాభం లేదా నష్టం. వ్యాపారంపై వచ్చే ఆదాయం. ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంకు ఖాతాపై వడ్డీ ఆదాయం, గిఫ్ట్, కుటుంబ పెన్షన్‌ను సైతం ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది. మినహాయింపులు... ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు ఆదాయంలో కొంత వరకు పన్ను మినహాయింపులు పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి. సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు చెల్లింపులు ఈ సెక్షన్ల కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవి. అందుబాటులో ఉన్న సాధనాల్లో మీకు అనుకూలమైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మేరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం సౌకర్యవంతం. ఇవి కాకుండా ఇతర పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలు (ప్రిన్సిపల్) మొత్తంపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితి మేరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక మొదటి సారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. బ్యాంకు సేవింగ్స్ ఖాతాపై వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు (హెచ్‌యూఎఫ్) సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీసీజీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడులపై 50 శాతం, గరిష్టంగా 25,000కు... దీర్ఘకాలిక ఇన్ఫ్రా బాండ్లలో రూ.20,000 పెట్టుబడులకు సెక్షన్ 80సీసీఎఫ్ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద వ్యక్తులు అయితే రూ.25,000 వరకు హెల్త్ ప్రీమియంపై, వృద్ధులకు రూ.30,000 ప్రీమియంకు పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80ఈ కింద విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు పరిమితి లేకుండా ప్రయోజనం పొందొచ్చు. ఐటీఆర్ దాఖలు ఇలా... అన్ని వివరాలపై అవగాహన తెచ్చుకున్న తర్వాత ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా సమగ్రంగా ఉండేలా చూసుకోవచ్చు. ఆన్లైన్లో స్వయంగా ఐటీఆర్ దాఖలు చేయడం లేదంటే నిపుణుల సాయం తీసుకోవచ్చు. మీ సమక్షంలో వారు ఐటీఆర్ దాఖలు చేస్తారు. ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రం సహజ్‌ను పొందొచ్చు. ఆదాయపన్ను ఈఫైలింగ్ వెబ్‌పోర్టల్‌లో తమ పేరిట అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, ఆన్లైన్లోనే ఈ ఫామ్‌ను పూర్తి చేసి దాఖలు చేయవచ్చు. ఇలా రిటర్నులు దాఖలు చేసే ముందు ఆదాయం, పెట్టుబడుల వివరాలను, సంబంధిత డాక్యుమెంట్లను, ఫామ్ 16ను రెడీగా ఉంచుకోవాలి. రిటర్నుల సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులభంగా పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ టూల్‌ను గతంలో వినియోగించినట్టయితే, లాగిన్ అయి ప్రీఫిల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా ఇతర వివరాలను నమోదు చేసి దాఖలు ప్రక్రియను పూర్తి చేయడం సులభం. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీపై పన్ను చెల్లింపు బాధ్యత ఎంతన్నది లెక్కించుకోవాలి. అంతిమంగా చెల్లించాల్సిన పన్ను, అప్పటికే టీడీఎస్ రూపంలో చెల్లించినది పోను మిగిలిన మేర చెల్లించాలి. ఐటీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత ఐటీఆర్–వీ ఫామ్ అన్నది జనరేట్ అవుతుంది. దీనిపై డిజిటల్‌గా సంతకం చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకుని ఐటీఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. లేదంటే ఐటీఆర్–వీ పత్రాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి, ఐటీ కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు. ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి.. ఒక వ్యక్తి ఏయే ఫారంల ద్వారా రిటర్నులు దాఖలు చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. గతంలో వేతన జీవులకొక ఫారం, ఇతరులకొక ఫారం అంటూ రెండే ఉండేవి. కాలక్రమంలో ఎన్నో మార్పు.. ఎన్నో ఫారాలు.. మొత్తం వాడుకలో ఉన్న ఏడు ఫారాలలో నాలుగు ఫారాలు వ్యక్తులకు వర్తిస్తాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రీఫిల్డ్ ఫారాలు అమల్లో ఉన్నాయి. ఐటీ సైట్లోకి వెళ్లి my account ఆప్షన్‌లోకి వెడితే.. Prefilled XML ఉంటుంది. ఫారం 26 A లోని వివరాలు కనిపిస్తాయి. జీతం, పెన్షన్, వడ్డీ.. తదితరసమాచారం ఇందులో ఉంటుంది. ఐటీ ట్యాక్స్ వివరాలు ఉంటాయి. ఐటీఆర్1 వ్యక్తులు.. రెసిడెంట్ అయి ఉండి, నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటని వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయం ఉండకూడదు. ఏదేని సంస్థలో డైరెక్టర్ అయి ఉండకూడదు. వ్యాపారం, క్యాపిటల్ గెయిన్స్ ఉండకూడదు. ఏ వనరు ద్వారా కూడా నష్టం ఉండకూడదు. ఒక ఇంటి నుంచే ఆదాయం ఉండాలి. మరో విధంగా చెప్పాలంటే.. కేవలం జీతం, వడ్డీ, ఒక ఇంటి మీద ఆదాయం (నష్టం కాదు) ఉన్న వారు ఈ ఫారం దాఖలు చేయాలి. వ్యవసాయం మీద ఆదాయం, డివిడెండ్లు రూ. 5,000 దాటకపోతే కూడా వేయొచ్చు. ఐటీఆర్ 2 వ్యక్తులు మరియు ఉమ్మడి కుటుంబాలు ఈ ఫారం దాఖలు చేయొచ్చు. జీతం, ఇంటి మీద ఆదాయం (నష్టం ఉన్నా ఫర్వాలేదు), ఇతర ఆదాయాలు, క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. నాన్ రెసిడెంట్లు కూడా ఈ ఫారం వేయొచ్చు. అయితే, వారు తమ ట్యాక్స్ ఐడెంటిటీ నంబరు ఇవ్వాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటిన వారు దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల వివరాలు, షేర్లు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, పెయింటింగ్, కళాత్మక వస్తువులు, బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, రావల్సిన అప్పులు, నగదు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఆస్తులను కొన్న ధర చూపాలే తప్ప ప్రస్తుత మార్కెట్ విలువ కాదు. నష్టం, సర్దుబాటు చూపొచ్చు. ఐటీఆర్ 3 ట్యాక్స్ క్రెడిట్ పరిధిలోకి రానివారు, పలు వనరుల నుంచి ఆదాయం ఉన్నవారు.. అంటే జీతం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతరత్రా వ్యాపారం.. వృత్తిగత ఆదాయాలు ఉన్నవారు దీన్ని దాఖలు చేయొచ్చు. ఇది పెద్ద ఫారం. చాలా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్లు, వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు దీన్ని వేయొచ్చు. ఆస్తులు.. అప్పుల పట్టీ, స్థూల ఆదాయం, ఖర్చుల వివరాలు, నగదు, బ్యాంకు నిల్వల వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఐటీఆర్ 4 ఇది రెసిడెంట్లు మాత్రమే ఉపయోగించగలిగే ఫారం. వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు దీన్ని దాఖలు చేయొచ్చు. వ్యాపారం మీద స్థూల ఆదాయం/టర్నోవరు రూ. 2 కోట్లు దాటకూడదు. వృత్తి నిపుణుల స్థూల ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు. ఒక ఇంటి మీద మాత్రమే ఆదాయం ఉండాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటకూడదు. ఊహాజనిత ఆదాయాలున్న వారు దీన్ని వేయొచ్చు. ఈ ఫారాన్ని ఒకసారి వేస్తే.. వరుసగా అయిదేళ్ల పాటు ఇదే ఫారం దాఖలు చేయడం కొనసాగించాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఫారం 3 వేస్తే రాబోయే అయిదు సంవత్సరాలు కూడా ఫారం 3 మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఇంకా సందేహాలు ఉంటే వృత్తి నిపుణులను సంప్రతించండి. ఐటీ రిటర్నులను మీరే స్వయంగా దాఖలు చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తప్పులు చేయొద్దు. ఆదాయాన్ని చూపించడం మానొద్దు. లేకపోతే 50–200% దాకా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య