ఐటీ కంపెనీలు అత్యధికంగా ఉన్న సెజ్‌లకు సంబంధించి ఈ ఏడాది మార్చితో ముగిసిపోనున్న ఆదాయపు పన్ను మినహాయింపు వెసులుబాటును మరో అయిదేళ్ల పాటు పొడిగించాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్..కేంద్రాన్ని కోరింది. అలాగే, అత్యంత ప్రభావం చూపగలిగే వినూత్న టెక్నాలజీలను రూపొందించే డీప్ టెక్నాలజీ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూ. 3,000 కోట్లతో అయిదేళ్ల కాలంలో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించిన ప్రీ–బడ్జెట్ కోర్కెల చిట్టాలో నాస్కామ్ ఈ అంశాలు పొందుపర్చింది. తయారీ రంగంలోని కొత్త స్టార్టప్స్ కోసం ప్రకటించిన 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ రేటును ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) కొత్త సర్వీస్ కంపెనీలకు కూడా వర్తింపచేయాలని నాస్కామ్ కోరింది. దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయాల్లో దాదాపు 75 శాతం వాటా ఎగుమతుల నుంచే వస్తోంది. అయితే, ట్యాక్స్ రేట్లు తక్కువగా ఉన్న ఇతర వర్ధమాన దేశాల నుంచి పోటీ దేశీ కంపెనీలకు పోటీ తీవ్రమవుతోంది.
భారత్‌లో కార్పొరేట్ ట్యాక్స్ రేటు 25 శాతంగా ఉండగా చైనాలో ఐటీ..టెక్నాలజీ రంగానికి ఇది 15 శాతంగానే ఉంది. శ్రీలంకలో 14 శాతం, వియత్నాంలో తొలి 15 ఏళ్ల పాటు 10 శాతం, ఫిలిప్పీన్స్‌లో తొలి నాలుగు నుంచి ఆరేళ్ల దాకా పూర్తి మినహాయింపు.. ఆ తర్వాత నుంచి 5 శాతంగా రేటు ఉంటోందని నాస్కామ్ పేర్కొంది. మందగమనం, అంతర్జాతీయంగా పోటీ తీవ్రమవుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో పన్ను మినహాయింపు వెసులుబాటును పొడిగించిన పక్షంలో సేవల రంగానికి గణనీయంగా తోడ్పాటు లభించగలదని నాస్కామ్ పబ్లిక్ పాలసీ విభాగం సీనియర్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ పేర్కొన్నారు.
స్టార్టప్‌లకు ట్యాక్స్ ప్రోత్సాహకాలు..!
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించే దిశగా స్టార్టప్ సంస్థలకు పన్నుపరమైన ప్రోత్సాహకాలను బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పరిశ్రమలు.. అంతర్గాత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖకు పలు సిఫార్సులు చేసినట్లు సమాచారం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏర్పాటైన ఇన్‌క్యుబేటర్లకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీజులపై జీఎస్‌టీ తగ్గింపు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్‌పై(ఎసాప్స్) పన్ను ప్రయోజనాలు మొదలైనవి వీటిలో ఉన్నాయి. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో భారత్.. ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఎదగగలదని అధికారిక వర్గాలు తెలిపాయి. శైశవ దశలో ఉన్న స్టార్టప్‌లకు ఎసాప్స్ ఉత్తమమైన సాధనాలని, వీటిపై సాధ్యమైనంత తక్కువగా పన్నులు ఉండాలని టీ కేఫ్ చెయిన్ చాయోస్ వ్యవస్థాపకుడు నితిన్ సలూజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment