Telangana Panchayat Elections 2019
-
కాకి లెక్కలు
పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఏరులై పారిన మద్యం.. యథేచ్ఛగా డబ్బుల పంపిణీ సర్వవిధితమే.. పోటా పోటీగా సాగిన అభ్యర్థుల ఖర్చులు చర్చనీయాంశంగా మారాయి. మేజర్ పంచాయతీల్లో రూ. కోటిన్నర వరకు అభ్య ర్థులకు వ్యయం అయినట్లు అంచనా.. కాగా వారు ఎన్నికల సంఘానికి చూపిన లెక్కలు విస్మయపరుస్తున్నాయి. మోర్తాడ్ (బాల్కొండ): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నిక ల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ప్రచార ఖర్చు లెక్కలను మొక్కుబడిగానే చూపారని తెలుస్తోంది. అభ్యర్థులు ప్రచారం కోసం రూ.లక్షలు కుమ్మరించగా ఎన్నిక ల సంఘానికి మాత్రం రూ.వేలల్లోనే ఖర్చు చేసినట్లు చూపి నట్లు అభ్యర్థులు వ్యయ పరిశీలకులకు అందించిన నివేదికలను పరిశీలిస్తే వెల్లడవుతోంది. గడచిన ముందస్తు శాసనసభ ఎన్నికలను తలపించేలా పంచాయతీ ఎన్నికలు సాగా యి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్య ర్థి తమ గెలుపు కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టినట్లు గ్రామాల్లో జరిగిన విందు రాజకీయాల ద్వారా స్పష్టమైంది. అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్న లెక్కలను చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలో 330 గ్రామ పంచాయతీలకు గాను 4,932 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇందులో రెండు సర్పంచ్, 11 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగలేదు. అలాగే కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలకు గాను 4,642 వార్డు స్థానాలు ఉన్నాయి. కొన్ని పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం కాగా మరి కొన్ని చోట్ల, సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే కొన్ని పంచాయతీల్లో వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. అయితే అభ్యర్థులు నామినేషన్ వేసిన నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు చేసిన ప్రచారంకు సంబంధించిన ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి అం దించాల్సి ఉంది. 5 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీ ల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ ప్రచారం కోసం రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేయడానికి ఎన్నికల సంఘం పరిమితిని విధిం చింది. వార్డు సభ్యులు రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చు. అలాగే 5 వేలకు తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.30వేల వరకు ప్రచారం కోసం ఖర్చు చేయవచ్చు. వాల్ పోస్టర్లు, డోర్ స్టిక్కర్లు, మద్దతు దారులకు టీ, టిఫిన్, భోజనం, టెంట్, ఆటో లేదా ఇతర వాహనాలకు మైక్ సెట్‌ను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించడం తదితర వాటికి మాత్రమే అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంది. ఏకగ్రీవం అయిన స్థానాలను మినహాయించి పోటీ జరిగిన స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారని అంచనా. వార్డు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. మద్యం, మాంసాలతో విందులకే కాకుండా ప్రచార సామగ్రి కోసం కూడా భారీగానే ఖర్చు చేశారు. అయితే ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితమైన ఖర్చులనే అభ్యర్థులు వ్యయ పరిశీలకులకు అందిస్తున్నారు. ఈనెల 9లోగా ఆయా మండలాల్లో అభ్యర్థులు తమ ప్రచారం లెక్కలను చూపాలని లేదంటే షోకాజ్ నోటీసు జారీ చేస్తామని హెచ్చరించడంతో అభ్యర్థులు ఆదరబాదరగా లెక్కలను అప్పగించారు. మొక్కుబడిగా లెక్కలను రాసి తప్పుడు రసీదులను జత పరిచి వ్యయ పరిశీలకులకు ప్రచారానికి సంబంధించిన లెక్కలను అభ్యర్థులు అప్పగించినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఎన్నికల్లో చేసిన వ్యయానికి, చూపుతున్న లెక్కలకు ఎంతో వ్యత్యాసం ఉంది. -
ఈసారి పక్కా!
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లా వ్యాప్తంగా జనవరి 30తో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. కానీ 30 పంచాయతీల్లో కోరం లేక పోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. గతనెల 30వ తేదీ వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఆ మరుసటిరోజు సాయంత్రం వరకు ఉప సర్పంచులను ఎన్నుకోవడానికి గడువు ఉంటుంది. ఆ సమయం వరకు ఎన్నికలు పూర్తి కాకపోతే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆగాల్సిందే. నోటిఫికేషన్ జారీ జిల్లాలో మిగిలిపోయిన ఉప సర్పంచ్ ఎన్నికకు సమయం వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 18వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెక్ పవర్ ఉండడంతో ఉప సర్పంచ్ పదవికి పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడుతల్లో జరిగాయి. మొదటి విడుతలో కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట్, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిలకొండలో కలిపి 249 పంచాయతీలు, 2,274 వార్డులో జనవరి 21వ తేదీన పోలింగ్ నిర్వహించారు. రెండో విడతలో మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట్, మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లోని 243 పంచాయతీలు, 2,068 వార్డులో జనవరి 25వ తేదీన పోలింగ్ జరిగింది. ఇక మూడో విడతలో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, సీసీకుంట, దేవరకద్ర, గండీడ్, మద్దుర్, కోస్గీ మండలాల్లో 227 పంచాయతీలు, 2,024 వార్డులో జనవరి 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 719 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహించారు. వాటిలో 30 స్థానాలు మినహా 689 గ్రామ పంచాయతీలకు ఉప సర్పంచ్ ఎన్నికలను జిల్లా ఎన్నిల అధికారులు పూర్తి చేశారు. ఈనెల 18న ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. పెరిగిన పోటీ.. మొదటి విడతలో 13, రెండో విడతలో 7, మూడో విడదలో 10 స్థానాల్లోని ఉపసర్పంచ్‌కు ఎన్నిక నిర్వహించనున్నారు. అత్యధికంగా మక్తల్, అడ్డాకుల, నారాయణపేట, కోయిల్‌కొండ మూడేసి ఉప సర్పంచులు, దన్వాడ, హన్వాడ, కోస్గి, నర్వ, ఊట్కూర్ మండలాల్లో ఒక్కొక్క ఉప సర్పంచ్ ఎన్నిక జరుతుంది. అడ్డాకుల, బలీద్‌పల్లి, కన్మానూర్, బాల్నగర్ మండలంలో మన్నేగూడెంతండా, నేరళ్లపల్లి, సీసీకుంట మండలంలో నెల్లకొండి, ఉంద్యాల, దామరగిద్ద మండలంలో కంసాన్పల్లి, ధన్వాడలో కిష్టాపూర్, గండీడ్ మండలంలో చౌదర్పల్లి, ధర్మాపూర్, హన్వాడ మండలంలో బుద్దారం, జడ్చర్ల మండలంలో ఈర్లపల్లి, కోడ్గల్, కోయిల్‌కొండ మండలంలో అనంతపూర్, లింగాల్చేడ్, శేరివెంకటాపూర్, కోస్డి మండలంలో హన్మాన్‌పల్లి, మద్దూరు మండలంలో నందిగామ, ఎక్కామేడ్, మక్తల్ మండలంలో కర్ని, రుద్రసముద్రం, సంగంబండ, మిడ్జిల్ మండలంలో బోయినపల్లి, మసిగుండ్లపల్లి, నారాయణపేట్ మండలంలో అమ్మిరెడ్డిపెల్లి, అప్పిరెడ్డిపల్లి, షెమాపల్లి, నర్వ మండలంలో ఎల్లంపల్లి, ఊట్కూర్ మండలంలో పులిమామిడి గ్రామ పంచాయతీలకు ఉప సర్పంచి ఎన్నిక జరగనుంది కోరం లేకున్నా.. ఉప సర్పంచ్ ఎన్నికకు ఎలాంటి కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహించనున్నారు. కోరం అవసరం లేకున్నా కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దానికి అనుగుణంగానే 18వ తేదీ ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చా యి. దానికి అనుగునంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశానికి వచ్చిన వారిలో ఒక్కరిని కచ్చితంగా ఉప సర్పంచ్‌గా ఎన్నిక జరుపనున్నారు. ఏర్పాట్లు చేస్తున్నాం.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మిగిలి పోయిన 30 స్థానాలకు ఈనెల 18వ తేదీన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తాం. కోరం ఉంటేనా సరి.. లేకున్నా ఎన్నిక మాత్రం ఆగదు. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. – వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి -
గ్రామాల్లో గులాబీ బలగం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: గ్రామాల పాలక మండళ్లే పార్టీ నిర్మాణంగా మారిన అరుదైన అవకాశం అధికార టీఆర్ఎస్కు లభించింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన సర్పంచులు, వార్డు సభ్యులే మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడంతో గ్రామస్థాయిలో పార్టీకి బలమైన బలగం లభించినట్లయింది. టీఆర్ఎస్ గ్రామ కమిటీలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేకపోగా, గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులతో కూడిన పాలక మండళ్లే గ్రామ కమిటీలుగా క్రియాశీలక పాత్రపోషించబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్కు ఉమ్మడి ఆదిలాబాద్‌లో తొలి నుంచీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షులు, కన్వీనర్ల నియామకంతోనే సరిపెట్టే పార్టీలో మిగతా వారంతా జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులుగానే చలామణి అవుతున్నారు. పార్టీ ఏర్పాటైన తొలినాళ్లలో 2004, 2009లలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయాలు నమోదు చేసుకున్నప్పటికీ, సంస్థాగతంగా మండల, జిల్లా కార్యవర్గాల ఏర్పాటు జరగలేదు. ఇక 2014లో పార్టీ అధికారం చేపట్టినా, అదే పరిస్థితి. తాజాగా 2018 ఎన్నికల్లో సైతం పార్టీ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది. 18 సం వత్సరాల పార్టీ ప్రస్థానంలో ఎలాంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహించని టీఆర్ఎస్కు ఈసారి ఏకంగా అధికార హోదాలోనే పార్టీ సంస్థాగత నిర్మాణం ఏర్పాటు కావడం అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. 933 పంచాయతీల్లో గులాబీదే హవా! ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో 1,508 గ్రామ పంచాయతీలకు గాను 1,493 చోట్ల ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏకగ్రీవం, ఎన్నికలు జరిగిన గ్రామాలు కలుపుకొని 933 పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచు అభ్యర్థులే విజయకేతనం ఎగరేశారు. ఒక్కో గ్రామంలో 6 నుంచి 12 మంది వార్డు సభ్యులు కూడా ఆ పార్టీ మద్ధతుదారులే. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాజకీయ పార్టీల ఏకీకరణ పేరుతో ఇతర పార్టీలకు చెందిన వారందరినీ గులాబీ గూటికి చేర్చుకొంది. . ఇటీవల పం చాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతోపాటు ఓడిపోయిన వారు కూడా టీఆర్ఎస్ మద్ధతుదారులే ఎక్కువగా ఉండడం ఇందుకు ఉదాహరణ. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఆ పార్టీకి చెంది న వారే అధికం. ఇప్పుడు గ్రామ కమిటీలు కూడా టీఆర్ఎస్ చేతికే చిక్కడంతో సంస్థాగత పార్టీ ని ర్మాణంతో సంబంధంలేకుండా...అధికార హోదా ల్లో టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఆవిర్భవించింది. కాంగ్రెస్‌కు 265 పంచాయతీలే.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ కేవలం ఆసిఫాబాద్‌లోనే స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 82 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఆదిలాబాద్‌లో 65, కుమురంభీంలో 67, మంచిర్యాలలో 51 స్థానాలు గెలిచింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఎందరు కాంగ్రెస్‌లో కొనసాగుతారనేది ప్రశ్న. ఇక స్వతంత్రులు గెలిచిన 249 స్థానాల్లో 200 మందికి పైగా టీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉంది. భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించిన టీఆర్ఎస్ అదే ఊపుతో రాబోయే ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తుండగా, ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న ఏడు మున్సిపాలిటీలకు తోడు మరో నాలు గు కొత్తవి ఏర్పాటు కాబోతున్నాయి. 11 మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నా రు. లోక్‌సభ ఎన్నికల్లో పట్టణ, గ్రామాల్లోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఎంపీ అభ్యర్థుల విజయానికి దోహదపడే అవకాశం ఉంది. -
కొలువుదీరారు
వనపర్తి: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో శనివారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. వీరు ఐదేళ్ల పాటు పాలన సాగించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పాత, కొత్త గ్రామ పంచాయతీలకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 2013 జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018 జూలై 31న సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. తెలంగాణ సర్కారు వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. పంచాయతీల పాలనబాధ్యతలను అధికారులకు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటీవల మూడు విడతలుగా 2019 జనవరిలో నిర్వహించింది. ఈ మేరకు శనివారం పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. వారితో ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు అను నేనూ.. అంటూ ఎమ్మెల్యే, ఎంపీల తరహాలోనే ప్రమాణస్వీకారం పూర్తి చేయించారు. జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 45 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 210 పంచాయతీలకు అధికారులు నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో గెలుపొందిన వార్డు సభ్యులలో ఒకరిని, మిగతావారి మద్దతుతో అధికారులు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. ఏడునెలల విరామం తర్వాత.. 2018 జూలై 31 నాటికి పాత సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. నాటి నుంచి ప్రభుత్వం పంచాయతీ పాలన అధికారులకు అప్పగించటంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో అధికారికి రెండు, అంతకంటే ఎక్కువ పంచాయతీల పాలన అప్పగించటంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదు. -
ముహూర్తం నేడే...
కోస్గి (కొడంగల్) : అటు ప్రజలు.. ఇటు పల్లెలను అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉన్న నేతలు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది.. సరిగ్గా ఆరు నెలల అనంతరం గ్రామపంచాయతీల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పాలన మొదలుకానుంది.. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, పాలకవర్గాలు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. ఇదే రోజు పాలకమండలి తొలి సమావేశం జరగనుంది.. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంతో పాటు మామిడి ఆకుల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు.. స్వపరిపాలన నినాదంతో ప్రజల ఆకాంక్ష మేరకు కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో తొలిసారి పాలన మొదలుకానుండడంతో ఆయా పంచాయతీల్లో సందడి నెలకొంది. 733.. 721.. 719 జిల్లాలో గతంలో 468 గ్రామపంచాయతీ ఉండేది. స్వపరిపాలన నినాదంతో కొన్నేళ్లుగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు డిమాండ్ ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందే జిల్లాలోని 265 ఆవాసాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసింది. ఇందులో 107 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ మేరకు మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య 733కు చేరగా.. ఇందులో 12 జీపీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో జీపీల సంక్య 721కి చేరింది. అయితే, జడ్చర్ల మండలంలోని బండమీదిపల్లి, శంకరాయపల్లి తండాల పాలకవర్గాల గడువు ఇంకా ముగియలేదు. ఫలితంగా జిల్లాలోని 719 గ్రామపంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతలుగా ఎన్నికలు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1వ తేదీన వెల్లడించింది. ఈ మేరకు మూడో విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా తొలి విడత జనవరి 21న 10 మండలాల్లోని 249 గ్రామపంచాయతీలు, 2,274 వార్డుల్లో, రెండో విడతగా జనవరి 25న ఏడు మండలాల్లోని 243 గ్రామపంచాయతీలు, 2,068 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక మూడో విడతగా 30వ తేదీన ఎనిమిది మండలాల్లోని 227 గ్రామపంచాయతీలు, 2,024 వార్డుల్లో పోలింగ్, లెక్కింపు జరిపి విజేతల వివరాలను ప్రకటించారు. టీఆర్ఎస్ హవా అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు కావడం.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలే విజయం సాధించిన నేపథ్యంలో వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ జీపీలను ఏకగ్రీవం చేసేందుకు యత్నించారు. అలా వారి కృషి ఫలించి మొత్తంగా 126 జీపీల కార్యవర్గాలను ప్రజలు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. మిగతా వాటికి మాత్రం మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. మొత్తంగా పరిశీలిస్తే ఏకగ్రీవమైన వాటితో కలిపి టీఆర్ఎస్ మద్దతుదారులు 503 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ మద్దతుదారులు 71 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 47 స్థానాలను, స్వతంత్రులు 98 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తమ పట్టు నిలుపుకున్నట్లయింది. ఆరు నెలల అనంతరం అంతకుముందు ఉన్న గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు గత ఏడాది ఆగస్టు 2న ముగిసింది. అప్పటి నుంచి వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక డిసెంబర్ మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. ఆ వెంటనే హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. మూడు విడతలుగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ జనవరి 30న ముగిసింది. ఇక 2వ తేదీ శనివారం అని గ్రామపంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ముహూర్తంగా నిర్ణయించింది. అంటే సరిగ్గా ఆరు నెలల తర్వాత గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలన మొదలుకానుంది. ఇందులో 265 కొత్త పంచాయతీలు ఉండడంతో అక్కడి ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. -
కొత్తగా...
చుంచుపల్లి/బూర్గంపాడు: కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లాలో గతంలో ఉన్న 205 పంచాయతీలకు తోడుగా మరో 276 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. పాత 205 పంచాయతీల్లో 2 పంచాయతీలు సారపాక, భద్రాచలం పురపాలక సంఘాలుగా మార్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టబోతుంది. దీంతో పాత పంచాయతీలు 203, కొత్త పంచాయతీలు 274తో కలిపి మొత్తం 477 పంచాయతీల్లో పరిపాలన శనివారం నుంచి మొదలు కానుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 479 పంచాయతీలకు 54 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, రెండు పంచాయతీల్లోఎన్నికలు నిర్వహించలేదు. జిల్లావ్యాప్తంగా 477 పంచాయతీలో జిల్లా వ్యాప్తంగా కొత్త పాలక మండళ్లు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. కొత్త పంచాయతీల్లో సమస్యల తిష్ట జిల్లాలో ఇటీవల ఏర్పాటైన 276 కొత్త పంచాయతీల్లో పక్కా భవనాలు లేవు. పాత పంచాయతీల్లోనూ పూర్తిస్థాయిలో భవనాల సమస్య వెంటాడుతూనే ఉంది. 276 కొత్త పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో ఆగస్టు 2 తేదీ నుంచి అద్దె భవనాల్లోనే పరిపాలనను కొనసాగిస్తున్నారు. వాటి నిర్మాణాలకు కేంద్రం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10 లక్షలు వరకు కేటాయిస్తోంది. కొత్త పంచాయతీలు ముందుగా పంచాయతీ భవనాల నిర్మాణాలతో పాటుగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న పంచాయతీల్లో సరిపడా గదులతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. ఆర్థిక వనరులపై దృష్టి సారించాలి పంచాయతీ పాలకవర్గాలు ఆదాయాన్ని సృష్టించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వ నిధులు కాకుండా పంచాయితీకి స్వయంగా సృష్టించుకోవాలి.అప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది. పంచాయితీ స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. చేపలచెరువుల నిర్వహణ, బందెలదొడ్లు, వ్యాపార సముదాయాలకు అనుమతులు ఇతరత్రా అంశాలపై దృష్టి పెట్టాలి. పంచాయతీలకు ఇంటి పన్ను, కుళాయి పన్ను, ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక నిధులు, జిల్లా,మండల పరిషత్ నిధులు, సంతల నిర్వహణ ద్వారా నిధులు, ఎంపీ,ఎమ్మెల్యేల నిధులు, ఉపాధిహామీ ద్వారా నిధులు సమకూరే అవకాశం ఉంది. ఉపాధిహామీ పథకంలో గ్రామపంచాయతీ భవనాలు, అంతర్గత రహదారుల అభివృద్ధి, డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు, పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, వంటగదులు, భోజనశాలలు ఏర్పాటు చేసుకునే వీలుంది. కొత్త పాలకవర్గాలు 14వ ఆర్థికసంఘం నిధులు అందుబాటులో ఉంటాయి. ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గిరిజనులు,అనుబంధ గ్రామాల ప్రజలకు కొత్త పంచాయతీలతో సుపరిపాలన చేసుకునే అవకాశం దక్కింది. అభివృద్ధి సం క్షేమంలో ఇతర గ్రామాలతో పోటీ పడే అవకాశం చిన్న గ్రామాలకు దక్కనుంది. పాలన గిరిజనులదే.. కొలువుదీరనున్న 477 పంచాయతీల్లో అత్యధికంగా ఎస్టీ రిజర్వ్‌డే ఉన్నాయి. తండాలు, గూడేలు పంచాయతీలుగా మారడంతో గిరిజనులకు స్వయంగా పాలించుకునే అవకాశం లభించింది. సుమారు 95శాతం వరకు సర్పంచులు, వార్డు సభ్యులు గిరిజనులే ఉన్నారు. ఇక నుంచి గ్రామపాలన వీరి ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. సహజంగా గిరిజనులలో ఉండే ఐక్యతను గ్రామాభివృద్ధిలో చాటుకుంటే గ్రామాల్లో అభివృద్ధికి బీజం పడుతుంది. నేటి నుంచి కొత్త పాలనకు శ్రీకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలో ఇటీవల ఎంపికైన నూతన పాలక మండళ్లు శనివారం ప్రమాణ స్వీకారం చేస్తాయి. ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలలో పరిపాలన నేటి నుంచి అమల్లోకి వస్తుంది. –ఆర్.ఆశాలత, డీపీవో నూతన పంచాయతీలకు కార్యాలయ భవనాలు కరువు అశ్వాపురం: నూతన పాలకవర్గాలకు పంచాయతీ కార్యాలయ భవనాల సమస్య తలనొప్పిగా మారనుంది. నూతనంగా కొత్త పంచాయతీలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా పంచాయతీ కార్యాలయ భవనాలు నిర్మించలేదు. నేడు నూతన పంచాయతీ పాలకవర్గాలు అరకొర వసతులతో అద్దె భవనాలలోనే ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించనున్నారు. పాత పంచాయతీ కార్యాలయాలకు పలు గ్రామపంచాయతీలకు భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరైనా పలు చోట్ల పనులు పూర్తి కాలేదు. కొత్త పంచాయతీలు ఏర్పాటై ఆరు నెలలు గడిచినా అద్దె భవనాలలోనే అరకొర వసతులతో పంచాయతీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అద్దె భవనాల్లో ఫర్నిచర్ కూడా లేదు. ప్రభుత్వం స్పందించి నూతన పంచాయతీలకు గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరు చేయాలని నూతన పంచాయతీ పాలకవర్గాలు కోరుతున్నారు. -
పంచాయతీ @రూ.105 కోట్లు
ఎన్నడూ లేని విధంగా ఈసారి పంచాయతీ ఎన్నికలు చాలా హాట్‌హాట్‌గా మారాయి. రాజకీయాలకు తొలిమెట్టు అయిన పంచాయతీల్లో గెలుపొందేందుకు సర్పంచ్ అభ్యర్థులు ఏ అవకాశాన్ని వదులుకోలేదు. రిజర్వేషన్లు ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల రోజు వరకు కులసంఘాలు, యువకులను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఎన్నికల మధ్యలోనే వచ్చిన సంక్రాంతి పండుగను కూడా వదలలేదు. సర్పంచ్, వార్డుమెంబర్‌గా బరిలో ఉన్న వారు నేరుగా ఇళ్లకే మద్యం, మాంసం ఇస్తూ తమను ‘గుర్తు’ంచుకునేలా చేశారు. ఇలా రాజన్నసిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 210 గ్రామాల్లో దాదాపు రూ.105 కోట్ల వరకు వెచ్చించారు. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటుండగా.. ఓడిన వారు ఎలా జరిగిందనేదానిపై సమీక్షించుకుంటున్నారు. సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు రాజన్నసిరిసిల్ల జిల్లాలో మూడు విడతలుగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామాలు ఉండగా రెండు గ్రామాలు మినహా 253 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 43 గ్రామాల్లో ఏకగ్రీవంకాగా.. 210 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల బరిలో జిల్లావ్యాప్తంగా 1,056 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీపడ్డారు. రాజకీయాల్లో తొలిమెట్టుగా భావించే గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార, ప్రలోభపర్వాలకు తెరలేపారు. 210 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఖర్చు రూ.105 కోట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగాయి. పంచాయతీకి ఎమ్మెల్యేలు దూరం జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగగా స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం పట్టించుకోలేదు. మానకొండూరు, వేములవాడ, చొప్ప దండి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్ ఒకటి, రెండుసార్లు నియోజకవర్గం లోని ముఖ్య గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారు. మిగతా గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేలు దూ రంగా ఉన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పంచాయతీ ఎన్నికలకు దూ రంగా ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు గ్రామస్తులు ఐక్యంగా చేసుకుంటేఎమ్మెల్యే కోటాలో రూ.15లక్షలు ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు. అంతకుమించి ఆయన ఎవరు గెలిచినా నా వాళ్లే అంటూ కార్యకర్తల సమావేశంలో బాహాటంగానే ప్రకటించారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం పంచాయతీ ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. పంచాయతీ ఖరీదు రూ.105 కోట్లు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు చాలా ఖరీదయ్యాయి. గ్రామ పంచాయతీల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రలోభాలపర్వం జోరుగా సాగింది. జిల్లాలోని 210 గ్రామపంచాయతీల్లో 1,056 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేయగా.. వారంతా పోటాపోటీగా ఖర్చుపెట్టారు. సగటున చిన్న గ్రామాల్లో రూ.3లక్షలు వెచ్చించగా.. పెద్ద పంచాయతీలు, పోటీ ఎక్కువగా నెలకొన్న గ్రామాల్లో రూ.15 నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చించారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు చీరలు పంచుతూ, సెల్ఫోన్లు కొనిస్తూ.. నేరుగా డబ్బులిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలోపడ్డారు. ఎన్నికల సమయంలోనే సంక్రాంతి పండుగ రావడంతో.. సందర్భాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు నూనెప్యాకెట్లు, చికెన్, మద్యం బాటిళ్లను నేరుగా ఇళ్లకే పంపుతూ ఓటర్లకు అభ్యర్థులు ‘గుర్తు’ండిపోయేలా ప్రలోభాలకు గురిచేశారు. మరోవైపు యువకులకు క్రికెట్కిట్లు, టీషర్ట్స్, కులసంఘాలకు, ఆలయాలకు మైక్సెట్లు ఇస్తూ ప్రచారం సాగించారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు రూ.105 కోట్ల వరకు వెచ్చించినట్లు ప్రాథమిక అంచనా.. చిలుము వదిలింది ! ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్ని లక్షలు వెచ్చించాం.. ఎన్ని ఓట్లు వచ్చాయని లెక్కలేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు పూర్తవగా విజయం సాధించిన అభ్యర్థులు ఎన్నికలకు చేసిన ఖర్చులను లెక్కలేస్తుండగా ఓడిన అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు, వచ్చిన ఓట్లను లెక్కిస్తూ నారాజవుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడంలో ప్రత్యర్థులు అనుసరించిన వ్యూహాలను సమీక్షించుకుంటున్నారు. డబ్బులతోపాటు లోపాయికారీగా జరిగిన ఒప్పందాలు, జరిగిన పొరపాట్లను సమీక్షించుకుంటూ పరాజితులు ఆలోచనలో పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వార్డుమెంబర్ సభ్యులు సైతం ఎన్నికల్లో చేసిన ఖర్చులను లెక్కలేస్తూ అయోమయానికి గురవుతున్నారు. వార్డుసభ్యులు సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీని ఎదుర్కోవడం ఆందోళన కలిగిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల వ్యవధిలో గ్రామపంచాయతీ ఎన్నికల ఖరీదు రూ.వంద కోట్ల మైలురాయిని దా టడం జిల్లా చరిత్రలో తొలిసారి కావడం విశేషం. నేతల మద్దతు కోసం విజేతలు జిల్లాలో విజయం సాధించిన సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అధికార పార్టీ మద్దతుతో విజయం సాధించినవారు ఇప్పటికే ఎమ్మెల్యేలను కలిశారు. ఇక.. స్వతంత్రంగా బరిలోకి దిగి గెలిచిన సర్పంచులు, ఇతర పార్టీల నాయకులు ఐదేళ్ల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేనిదే వచ్చే ఐదేళ్లు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం అసాధ్యమని భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. -
రేపే ముహూర్తం
పాపన్నపేట(మెదక్): కొత్త సర్పంచ్‌లు కొలువు దీరేందుకు ఫిబ్రవరి 2వ తేదీ ముహూర్తం ఖరారయ్యింది. గతేడాది ఆగస్టు 2 నుంచి నేటి వరకు 184 రోజుల పాటు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. నేటితో ఈ పాలనకు తెరపడనుంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది కొత్తవారే సర్పంచ్‌లుగా ఎన్నిక కావడంతో పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పిస్తు.. వారి విధులు.. అధికారాలు గురించి వివరించేందుకు 11వ తేదీ నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి మెదక్ కొత్త జిల్లాగా అవతరించినపుడు మొదట 312 గ్రామంచాయతీలు ఉండేవి.అయితే 500 జనాభా గల గిరిజన తండాలను, మధిర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు 157 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అలాగే ఎనిమిది గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 4,58,325 ఓటర్లున్నారు. ఇందులో 90 శాతం పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 2న కొత్త సర్పంచ్‌లు కొలువు దీరనున్నారు. ఈమేరకు అపాయింట్మెంట్ డే గా నిర్ణయిస్తూ పంచాయతీరాజŒ æశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అతే ఆ రోజు జరిగే సమావేశంలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ స్వీకారం చేస్తారు. ఆరోజు నుంచి 5 ఏళ్ల పాటు వారి పదవీ కాలం కొనసాగనుంది. ఫిబ్రవరి 11 నుంచి శిక్షణ కొత్త సర్పంచ్‌లకు విధులు, అ«ధికారాలు, బాధ్యతలు తదితర విషయాలపై అవగాహన కల్పిచేందుకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు జిల్లాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తొలివిడత శిక్షణ 11 నుంచి 15 వరకు, రెండో విడత 18 నుంచి 22 వరకు, మూడో విడత ఫిబ్రవరి 25 నుంచి మార్చి1 వరకు ఉండనుంది. అంతకు ముందు ఫిబ్రవరి 3 నుంచి మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ ఇస్తారు. పదవీ స్వీకారానికి ఏర్పాట్లు కొత్త సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ స్వీకారం చేసేందుకు వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చాం. 2వ తేదీన ఉదయం స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి, కొత్తగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించి చార్జి అప్పగిస్తారు. ఈ మేరకు మినిట్స్‌లో నమోదు చేస్తారు. –హనోక్, డీపీఓ శిక్షణ మంచి కార్యక్రమం నేను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాను. కొత్త పంచాయతీ రాజ్ చట్టం, సర్పంచ్ విధులు, అధికారాలు, గ్రామ సభల ఏర్పాటు, హరితహారం, బాధ్యతలు, ఆదర్శ గ్రామావృద్ధి తదితర విషయాలు, రికార్డుల నిర్వాహణ గురించి ఎక్కువగా తెలియదు. అందు వల్ల సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం సంతోషం. –కలాలి నవీన్‌గౌడ్, కొత్త లింగాయపల్లి -
గులాబీ జోరు
సాక్షి, మెదక్: పల్లెల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. రెండు విడతల్లో మెజార్టీ పంచాయతీలు గెలుపొందిన టీఆర్ఎస్ మూడవ విడతలోనూ అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుంది. జిల్లాలో బుధవారం మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 133 పంచాయతీలు, 1031 వార్డుల్లో ఎన్నికలు జరగగా 90.28 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, తూప్రాన్, నార్సింగి, చేగుంట, మనోహరాబాద్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఎనిమిది మండలాల్లో మొత్తం 1,53, 354 మంది ఓటర్లు ఉండగా 1,38, 445 మంది ఓటు వేశారు. వారిలో పురుషులు 67182 మంది ఉండగా, మహిళలు 71,263 మంది ఓట్లు వేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి మెదక్ మండలంలోని మాచవరంలో ఓటు వేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తన స్వగ్రామం కోనాపూర్‌లో ఓటు వేశారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాత్రి 8.30 గంటల వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. మూడవ విడతలో 133 పంచాయతీల్లో 505 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. మూడవ విడతలో ఎన్నికలు జరిగిన 133 పంచాయతీలకుగాను 108 చోట్ల టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే 15 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో మొదటి సారిగా చేగుంట మండలంలోని గొల్లపల్లి, జక్రంతండా, చిట్టోజిపల్లిలో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు విజయం సాధించారు. కాగా ఈ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. జిల్లాలో టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి ఒక్క సర్పంచ్ అభ్యర్థిని కూడా బరిలో దింపలేకపోయారు. దీంతో పల్లెల్లో టీడీపీ జాడ లేకుండా పోయింది. మూడు విడతల్లోనూ టీఆర్ఎస్ హవా.. జిల్లాలో మూడు విడతల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ పంచాయతీల్లో విజయం సాధించింది. జిల్లాలో మొత్తం 469 పంచాయతీలకుగాను 84 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. 385 పంచాయతీలకు ఈ నెల 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 385 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 358 పంచాయతీల్లో టీఆర్ఎస్, 73 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే మూడు పంచాయతీల్లో బీజేపీ, 35 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొదట విడతగా 122 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 82 టీఆర్ఎస్, 28 కాంగ్రెస్, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రెండవ విడతలో 130 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 84 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు, 30 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, 16 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బుధవారం మూడవ విడత 133 పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా 108 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు, 15 పంచాయతీల్లో కాంగ్రెస్, మూడు పంచాయతీల్లో బీజేపీ, ఏడు పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మెజార్టీ పంచాయతీల్లో గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మూడవ విడత ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో విజయోతవ్స ర్యాలీలు నిర్వహించారు. మెదక్ మండల జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి స్వగ్రామం బాలానగర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు వికాస్ 23 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ మద్దతుదారు గోపాల్‌పై గెలుపొందారు. మాచవరంలో కాంగ్రెస్ మద్దతుదారు సంధ్యారాణి 165 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ బలపర్చిన రాధికపై విజయం సాధించారు. మంబోజిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ మద్దతుదారు ప్రభాకర్ నాలుగు ఓట్ల స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిజాంపేట మండలం చల్మెడలో నర్సింహారెడ్డి 500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నార్లపూర్ పంచాయతీలో కాంగ్రెస్ జిల్లా నేత అమరసేనారెడ్డి టీఆర్ఎస్ మద్దతుదారుపై విజయం సాధించారు. చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్‌లో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కామారంలో బీజేపీ మద్దతుదారు రాజిరెడ్డి ఓటమిపాలయ్యారు. తూప్రాన్ కోనాయిపల్లి(పిబి) గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థి కంకణాల పాండు, టీఆర్ఎస్ మద్దతుదారు విఠల్‌కు 143 చొప్పున సరిసమానం ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేయగా స్వతంత్ర అభ్యర్థి పాండు గెలుపొందారు. ఆదర్శ గ్రామం మల్కాపూర్‌లో ఆరుగురు పోటీ చేయగా టీఆర్ఎస్ మద్దతుదారు మన్నె మహాదేవి గెలుపొందారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లేశం గెలుపొందారు. ముప్పిరెడ్డిపల్లిలో టీఆర్ఎస్ మద్దతుదారు ప్రభావతి గెలుపొందారు. మనోహరాబాద్‌లో టీఆర్ఎస్ మద్దతుదారు చిట్కుల్ మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు. -
పల్లె సిగలో గులాబీ జెండా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శాసనసభ ఎన్నికల విజయంతో ఊపుమీదున్న టీఆర్ఎస్ పార్టీ పంచాయతీ పోరులోనూ పైచేయి సాధించింది. మూడు విడతల్లో మొత్తం 558 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా.. 264 జీపీలు టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా ఆయా పంచాయతీల్లో గెలుపు బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కూడా చెప్పుకోదగ్గ రీతిలో జీపీలను హస్తగతం చేసుకున్నారు. 171 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక రెండు విడతల్లో స్థబ్దుగా ఉన్న బీజేపీ చివరి దశ ఎన్నికలో కాస్త తేరుకుంది. 16 జీపీల్లో కాషాయ జెండాను ఎగురవేసింది. తుది విడతలో పోటాపోటీ.. మొదటి, రెండో విడతల ఎన్నికల ఫలితాలకు, తుది దశ ఫలితాల్లో కాస్త తేడా కనిపించింది. ఒకటి, రెండు విడతల్లో కారు ప్రభంజనం కొనసాగగా.. ఆఖరి దశ ఎన్నికలకు వచ్చే సరికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. ఈ రెండు పార్టీల నడుమ రసవత్తర పోరు నడిచింది. కొన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అధికంగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. మూడు మండలాల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మార్క్ కనిపించింది. ఈ మండలాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులను ఆమె గెలిపించుకోగలిగారు. ఆమె సొంత గడ్డ అయిన చేవెళ్ల, మొయినాబాద్, కందుకూరులో కాంగ్రెస్ ఆధిపత్యం కనిపించింది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చేవెళ్ల నియోజకవర్గ కేంద్రమైన చేవెళ్ల పంచాయతీని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఇక సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో అధికార పార్టీ మద్దతుదారు పాగా వేయడం విశేషం. తగ్గిన పోలింగ్ శాతం తొలి, రెండో విడతలతో పోల్చితే తుది దశ ఎన్నికలు జరిగిన 186 జీపీల్లో పోలింగ్ శాతం తగ్గింది. మొదటి రెండు విడతల్లో 93 శాతం, 89 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. చివరి దశలో 88 శాతమే నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 నుంచి 11 గంటలలోపే అధికశాతం మంది ఓటేశారు. ఈ రెండు గంటల వ్యవధిలో 37 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య 33 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక చివరి రెండు గంటల్లో 18 శాతం మంది ఓటేశారు. అన్ని పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
ముగిసిన పంచాయతీ ఎన్నికలు
సాక్షి, వరంగల్ రూరల్: నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటైన తర్వాత , స్వరాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. 89.78శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో విడతలో చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూర్, దామెర, గీసుకొండ మండలాల్లోని 120 గ్రామ పంచాయతీలు, 1070 వార్డు స్థానాలకు ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 29 గ్రామాల్లో సర్పంచ్‌లు, 310 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 91 గ్రామాలు, 760 వార్డు స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తమ ఓటును వినియోగించుకున్నారు. దామెర మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు. జిల్లాలో 91.23శాతం ఓటింగ్.. మూడో విడతలోని చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ మండలాల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదయింది. ఐదు మండలాల్లో 1,16,846 మంది ఓటర్లు ఉండగా 1,04910 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 57,898 మంది పురుష ఓటర్లుండగా 51,978, 58,939 మంది మహిళా ఓటర్లుండగా 52,932 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు మండలాల్లో 89.78శాతం ఓటింగ్ శాతం నమోదు కాగా అత్యధికంగా ఆత్మకూర్‌లో 92.28శాతం ఓటింగ్ నమోదు కాగా నెక్కొండలో తక్కువగా 88.02శాతం ఓటింగ్ నమోదయింది. మధ్యాహ్నం ఎన్నిక కౌంటింగ్ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నికలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభించారు. రాత్రి వరకు కౌంటింగ్‌ను నిర్వహించి ఆయా గ్రామ పంచాయతీల వారిగా ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
ప్రశాంతంగా మూడో విడత
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గ్రామ పంచాయతీ చివరి విడత పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ము గిసింది. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధి ఎనిమిది మండలాల్లోని 148 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, 1,098 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. మొత్తం 211 పంచాయతీలకు గాను, 61 జీపీలు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఇందల్వాయి మండలంలోని రెండు జీపీలు తిర్మన్‌పల్లి, గంగారాంతండాలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించి నామినేషన్లు వేయనందున ఎన్నికలు జరుగలేదు. మిగిలిన 148 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించిన ఎన్నికల అధికార యంత్రాంగం, భోజ న విరామం అనంతరం కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించిన తర్వాత, సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టా రు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. పోలింగ్ ప్రారంభమైన ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. అత్యధికంగా 87 శాతం ఓట్లేసిన మహిళలు.. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 2.16 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1.73 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా మహిళలు 1,00,847 (87 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 72,262 (71శాతం) మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషు ల కంటే మహిళలే ఉత్సాహం గా ఓటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 35.40 శాతం పోలింగ్ జరిగింది. 11 గంటల వ రకు ఈ పోలింగ్ శాతం 59.69 శాతానికి పెరిగింది. పోలింగ్ ముగిసే సమయం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొత్తం 79.81 శాతం పోలింగ్ నమోదైందని అధికార యంత్రాంగం ప్రకటించింది. పకడ్బందీ ఏర్పాట్లు.. పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు ఓటేసేందుకు వచ్చిన వికలాంగులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీల్చైర్లు ఏర్పాటు చేశారు. తాగు నీ టి వసతి కూడా కల్పించారు. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. సిరికొండ మండలం రావుట్లలో నిజామాబాద్‌రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుమారుడు జగన్, కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. జల్లాపల్లికి పోలింగ్.. పోలింగ్ నిలిచిపోయిన కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామానికి బుధవారం పోలింగ్ నిర్వహించారు. రెండో విడతలో జరగాల్సి ఉండగా, బ్యాలెట్ పేపర్లో జరిగిన పొరపాటు కారణంగా పోలింగ్ నిలిపివేవారు. ఓటరు జాబితా నుంచి తమ ఓట్లు గల్లంతయ్యాయని ఇందల్వాయి మండలం గన్నారంలో కొందరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాక్లూర్ మండలం కేంద్రంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేసిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలన.. జిల్లాలో పోలింగ్ సరళిని కలెక్టర్ ఎంఆర్ఎం రావు కలెక్టరేట్లో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పరిశీలించారు. సమస్యాత్మక ఎనిమిది పంచాయతీల పరి«ధిలోని 25 పోలింగ్ కేంద్రాల్లో ఈ వెబ్‌క్యాస్టింగ్ ప్రక్రియను నిర్వహించారు. -
గులాబీ గుబాళింపు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పల్లెపోరులో గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో 837 పంచాయతీలకు ఎన్నికలు జరగగా... టీఆర్ఎస్ మద్దతుదారులు 520 పంచాయతీల్లో విజయం సాధించి తమ పట్టును నిరూపించుకున్నారు. తొలి రెండు విడతల్లో దేవరకొండ, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్లలో 20 మండలాల పరిధిలోని 580 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 380 పంచాయతీలు టీఆర్ఎస్ మద్దతుదారుల ఖాతాలోకే వెళ్లాయి. బుధవారం మూడో విడత నల్లగొండ డివిజన్లోని 11 మండలాల పరిధిలో ఉన్న 241 పంచాయతీల్లో (మొత్తం 257 కాగా, 16 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి) పోలింగ్ జరిగింది. మూడో విడతలో టీఆర్ఎస్ మద్దతుదారులు 140 పంచాయతీల్లో గెలిచారు. దీంతో మొత్తంగా జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే టీఆర్ఎస్ మద్దతుదారులు 520 పంచాయతీల్లో, కాంగ్రెస్ మద్దతుదారులు 268 పంచాయతీల్లో, స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుదారులంతా కలిపి 49 పంచాయతీల్లో విజయం సాధించారు. ఏకగ్రీవాల ద్వారానే 102 మూడు విడతల పంచాయతీ సమరంలో ఏకగ్రీవాల ద్వారానే టీఆర్ఎస్ మద్దతుదారులు 102 చోట్ల విజయం సాధించారు. తొలి విడతలో భాగంగా ఈ నెల 21వ తేదీన దేవరకొండ డివిజన్లోని 305 గ్రామ పంచాయతీలకు గాను 52 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, వీరిలో 50 మంది టీఆర్ఎస్ మద్దతుదారులే ఉన్నారు. ఈ నెల 25వ తేదీన మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 276 గ్రామ పంచాయతీలకుగాను 43 మంది సర్పంచులు ఏకగ్రీవం కాగా, వీరిలో 42 మంది టీఆర్ఎస్ వారే ఎన్నికయ్యారు. మూడో విడతలో 257 పంచాయతీల్లో కేవలం 16 పంచాయతీల్లో మాత్రం సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 10 మంది టీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. మొత్తంగా మూడు విడతల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాల ద్వారానే 102 పంచాయతీలను సొంతం చేసుకున్నారు. చిత్రమైన పొత్తులు పల్లెలపై పట్టుకోసం ఆయా పార్టీలు పంచాయతీ సమరంలో చిత్ర విచిత్రమైన పొత్తులు పెట్టుకున్నాయి. పూర్తిగా పార్టీ రహిత ఎన్నికలే అయినా... ప్రతి పంచాయతీలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా, ఆ పార్టీ నేతల ప్రచారం చేయకుండా ఎన్నికలు జరగలేదు. ప్రధానంగా టీఆర్ఎస్లో సర్పంచ్ టికెట్లకు గట్టి పోటీ ఏర్పడింది. దీంతో పదుల పంచాయతీల్లో టీఆర్ఎస్ వర్గీయుల్లోనే పోటీ నెలకొంది. మరోవైపు పంచాయతీలను గెలుచుకునేందుకు స్థానిక పరిస్థితులను బట్టి పార్టీల మద్దతుదారులు పొత్తులు పెట్టుకున్నారు. అయితే.. ఒక పంచాయతీకి మరో పంచాయతీకి పోలికే లేకుండా అయ్యింది. కొన్ని పంచాయతీల్లో టీఆర్ఎస్, సీపీఎం, ఇతర పార్టీలు కలిస్తే, మరికొన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ సీపీఎం, ఇతర పార్టీలు కలిశాయి. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీసీఎం, తదితర పార్టీలు కలిసి పోటీ చేసిన పంచాయతీలు కూడా ఉన్నాయి. ఆయా పార్టీల మద్దతుదారులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీలో నిలిచిన వారికి ఎదుటి పక్షం వారూ మద్దతిచ్చి గెలిచిపించిన ఉదంతాలు ఉన్నాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా పంచాయతీ సమరంలో చిత్రవిచిత్రమైన పొత్తులు కనిపించాయి. పొత్తుల్లో ఉప సర్పంచ్ పదవులే కీలకంగా మారాయి. ఉనికి నిలబెట్టుకున్న కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులకు అనుకూలంగా గాలి వీచినా.. కొన్ని మండలాల్లో కాం గ్రెస్ మద్దతు దారులు సైతం సమ ఉజ్జీలుగా నిలిచారు. జిల్లా మొత్తంలో ఆ పార్టీ మద్దతుదారులు 268 పంచాయతీల్లో గెలిచారు. తొలి రెండు విడతల్లో ఏకంగా 167 చోట్ల విజయం సాధించారు. మూడో విడతలో 101 పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా మొత్తం గా 268 పంచాయతీల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మద్దతుదారులు తమ పార్టీ ఉనికిని నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లకు అభినందనలు : కోమటిరెడ్డి నల్లగొండ రూరల్ : నల్లగొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. గెలుపొందిన వారంతా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడంతోపాటు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోవద్దన్నారు. పదవి ఉన్నా లేకున్నా నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం గెలుపొందిన అభ్యర్థులు కృషి చేయాలని కోమటిరెడ్డి కోరారు. -
దూసుకెళ్లిన కారు
హుజూరాబాద్‌రూరల్: మూడో విడత పంచాయతీలు ఎన్నికలు బుధవారం ప్రశాం తంగా జరిగాయి. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, వి.సైదా పూర్ మండలాల్లో తుది దశ ఎన్నికలు నిర్వహించారు. 109 గ్రామపంచాయతీలకు గాను, 13 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 96 గ్రామపంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే 1024 వార్డులకు గాను 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా... ఏకగ్రీవ పంచాయతీలతో కలుపుకుని మొత్తం 817 పంచాయతీలలో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు దీటుగా.. టీఆర్ఎస్కు పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు పట్టం కట్టారు. బుధవారం జరిగిన మూడో విడతలో మొత్తం 407 పంచాయతీలకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో ఎన్నిక వాయిదా పడ్డాయి. ఎన్నికలు జరిగిన 406 పంచాయతీల్లో టీఆర్ఎస్ 279, కాంగ్రెస్ 55 బీజేపీ 15, టీడీపీ 02, స్వతంత్రులు 55 స్థానాల్లో గెలుపొందారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఈ విడతలో కాంగ్రెస్‌కు అత్యధికంగా 40 చోట్ల విజయం చేకూరింది. అసెంబ్లీ ఎన్నికల విజయఢంకా మోగించిన టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లోను జోరు కొనసాగడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మూడు విడతల్లోనూ ఆధిక్యమే... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ మూడు విడతల్లో కూడా అత్యధికంగా టీఆర్ఎస్ మద్దతుదారులే సర్పంచ్‌లుగా విజయం సాధించారు. 21న మొదటి విడతలో మొత్తం 414 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ 289, కాంగ్రెస్ 82 చోట్ల గెలుపొందగా, బీజేపీ ఎనిమిది, టీడీపీ 03 స్వతంత్రులు 32 చోట్ల విజయం సాధించారు. రెండో విడతలో 389 పంచాయతీలకు 249 టీఆర్ఎస్, 68 కాంగ్రెస్, 16 బీజేపీ, 01 టీడీపీ, 07 సీపీఐ, 48 స్వతంత్రులు గెలుచున్నారు. బుధవారం జరిగిన మూడో విడతలో 407 పంచాయతీలకు 279 టీఆర్ఎస్ మద్దతుదారులు ఎన్నిక కాగా, 55 కాంగ్రెస్, 15 బీజేపీ, టీడీపీ 02, స్వతంత్రులు 55 గెలుచుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన మూడు విడతల ఎన్నికల్లో బీజేపీ 39 స్థానాలకు పరిమితం కాగా, సీపీఐ ఏడింట గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఫలితాలు మరింతగా దిగజారిపోయాయి. కేవలం ఆరు స్థానాలకే పరిమిత కావాల్సి వచ్చింది. 2013లో ఎన్నికల్లో 379కే టీఆర్ఎస్ పరిమితం... 2013లో పూర్వ కరీంనగర్ జిల్లాల్లో 1207 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. 379 గ్రామాల్లో టీఆర్ఎస్, 372 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. 137 టీడీపీ, 37 బీజేపీ, 30 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. 17 చోట్ల సీపీఐ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, 235 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. అయితే 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గ్రామాలు అభివృద్ధి బాటన నడవాలంటే అధికార పార్టీ పంచన చేరడమే మేలని’ భావించిన చాలా మంది సర్పంచ్‌లు ప్లేట్ ఫిరాయించారు. దీంతో మూడింట రెండు వంతులకు పైగా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహించడం, జగిత్యాల నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో పలువురు ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది ఆగస్టు 2న సర్పంచ్‌లు పదవీ విరమణ చేసే నాటికి 942 మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లుగా అప్పట్లో ప్రకటించారు. తాజా ఎన్నికల్లో మొత్తం 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా... ఏకగ్రీవ పంచాయతీలో కలుపుకుని మొత్తం 817 పంచాయతీలలో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయఢంకా మోగించడంతో ఉమ్మడి జిల్లాలో గులాబీ గుబాళించింది. -
సం‘గ్రామం’.. సమాప్తం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. తొలి దశలో తప్పిస్తే రెండు, మూడో దశల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. చివరి దశ గ్రామాల్లో బుధవారం పోలింగ్ జరిగింది. ఈ మేరకు మొదటి దశలో పోలిస్తే ఎక్కువగా, రెండో దశతో పోలిస్తే తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో భాగంగా ఎనిమిది మండలాల్లోని 227 పంచాయతీలకు గాను 24 జీపీల పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 203 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. కాగా, ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా రీ పోలింగ్ నిర్వహించే అవసరం రాకపోవడం.. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 85.91 శాతం నమోదు మూడో దశ ఎన్నికల సందర్భంగా 85.91 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈనెల 21న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 84.71 శాతం, 25వ తేదీన రెండో దశ ఎన్నికల్లో 89.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు మొదటి దశలో పోలిస్తే ఎక్కువగా, రెండో దశతో పోలిస్తే తక్కువగా మూడో దశలో పోలింగ్ నమోదైనట్లయింది. పర్యవేక్షించిన అధికారులు ఎన్నికల సందర్భంగా అటు ఉద్యోగులు, ఇటు ఓటర్లకు ఇటు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం పోలింగ్ సందర్భంగా ఎనిమిది మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ రెమారాజేశ్వరి ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించిన వారు సజావుగా సాగేలా ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. ఉదయం మందకొడిగా... మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా చలి ప్రభావం పెరిగింది. ఇది బుధవారం జరిగిన పోలింగ్‌పై ప్రభావం చూపింది. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మంచు కురుస్తుండడంతో పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైనా పెద్దగా ఓటర్లు రాలేదు. ఇక 9 గంటల తర్వా త మాత్రం పోలింగ్ జోరందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 31.81 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత 11 గంటల్లోపు ఇది 66.07 శాతానికి చేరింది. మొత్తంగా ఒంటి గంటకు పోలింగ్ ముగిసే సరికి పోలింగ్ శాతం 85.91గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉద్యోగి మృతి పోలింగ్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. కోస్గి మండలంలోని ముశ్రీఫా వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న నర్సప్ప (48)కు ఎన్నికల సందర్భంగా అదే పంచాయతీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయ్యాక ఆయనకు ఛాతినొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికే కన్నుమూశారు. ఓటు వేసిన ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భూత్పూర్ మండలంలోని సొంత గ్రామమైన అన్నసాగర్లో ఆయన ఓటు వేశారు. ఈ మేరకు పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బారులు తీరిన ఓటర్లు ఓట్లు వేసేందుకు గ్రామాల్లో ప్రజలు ఉత్సాహం చూపారు. మూడో విడతలో జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగగా మొత్తం 85.91 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, అత్యధికంగా దేవరకద్ర మండలంలో 91.49 శాతం, తక్కువగా గండీడ్ మండలంలో 74.75 శాతం పోలింగ్ నమోదైంది. పలు గ్రామాల్లో ఉదయం మందకొడిగా సాగినా.. 9గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఇక సమయం ముగిసే ఒంటి గంటకు కొద్దిముందు ఓటర్లు ఎక్కువగా> రాగా.. అందరినీ అనుమతించారు. కట్టుదిట్టమైన భధ్రత జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ఆ బూత్‌ల్లో గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ రెమారాజేశ్వరి స్వయంగా పలు కేంద్రాల్లో బందోబస్తును పర్యవేక్షించారు. ఓటు వేసిన 2,17,049 మంది మూడో విడతగా ఎన్నికలు జరిగిన 203 పంచాయతీల్లో 2,52,647 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయా జీపీల్లో మొత్తం 1,26,476 మంది పురుషులు, 1,26,090 మంది మహిళా ఓటర్లతో పాటు ఏడుగురు ఇతరులు ఉన్నారు. వీరిలో 1,08,778 మంది పురుషులు, 1,08,269 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. ఇద్దరు ఇతరులు ఓటు వేశారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉదయం 7 గంటల నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సాగింది. అనంతరం భోజనం కోసం అధికారులు గంట పాటు విరామం తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు ప్రారంభించారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లు, అనంతరం సర్పంచ్ ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. ఆ తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేతులు లేపే పద్ధతిలో నిర్వహించారు. -
పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి
కోస్గి (కొడంగల్): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ఓ వీఆర్ఓ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంఘటన మండలంలోని ముశ్రీఫాలో బుధవారం చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని ముశ్రీఫా వీఆర్ఓగా పనిచేస్తున్న నర్సప్ప(48) ఎన్నికల విధుల్లో భాగంగా ఇదే పంచాయతీ ఇన్చార్జ్గా ఉన్నారు. ఎన్నికలు ప్రారంభమై ప్రశాంతంగానే కొనసాగుతున్న తరుణంలో నర్సప్పకు ఒక్కసారిగా కళ్లు తిరుగుతూ చెమటలు పట్టడంతో గ్రామంలోని ఓ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లారు. బీపీ ఎక్కువగా ఉందని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించగా ఆటోలో కోస్గికి వస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే కుప్పకూలిపోయారు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పతికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ బుచ్చయ్య, రెవెన్యూ అధికారులు సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని నర్సప్ప కుటంబ సభ్యులను పరామర్శించారు. కాగా నర్సప్ప స్వగ్రామం దౌల్తాబాద్ మండలం చంద్రకల్ కాగా, ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
తీన్మార్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. తొలి, మలి విడతల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ.. మూడో విడతలోనూ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 24 జీపీలు ఏకగ్రీవం కావడంతో బుధవారం 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ఏకగ్రీవాలతో కలుపుకుని టీఆర్ఎస్ మద్దతుదారులు 114, కాంగ్రెస్ 50, టీడీపీ 2, సీపీఐ 5, సీపీఎం 10, స్వతంత్ర అభ్యర్థులు 11 స్థానాల్లో గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందుకు భిన్నంగా టీఆర్ఎస్ తన ప్రభావం చూపడం విశేషం. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఒక జీపీ ఎన్నిక వాయి దా పడింది. మూడు విడతలుగా జరిగిన జీపీ ఎన్నికలను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీ ప్రచారం నిర్వహించడం ద్వారా పల్లె రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో దాదాపు ప్రశాంతంగానే ముగిశాయి. మూడో విడతలో ఒకటి, రెండు మండలాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చింతకాని మండ లం నేరెడ జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా పోటీ చేసిన ఈశ్వరమ్మ ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించగా.. దీనిపై టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేసి రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. దీంతో రీకౌంటింగ్ నిర్వహించిన అనంతరం అధికారులు ఈశ్వరమ్మ ఐదు ఓట్లతో గెలిచినట్లు ధ్రువీకరించారు. మూడోవిడత పంచా యతీ ఎన్నికలు టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాములునాయక్ నియోజకవర్గాలైన ఖమ్మం, వైరా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో జరిగాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 12 స్థానాలు ఏకగ్రీవం కావడానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ తీసుకోగా.. మిగిలిన పంచాయతీల్లో టీఆర్ఎస్ విజయం కోసం స్వయంగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం 25 జీపీలకు ఎన్నికలు జరగ్గా.. టీఆర్ఎస్ 13 జీపీలను, కాంగ్రెస్ 11, సీపీఐ ఒక గ్రామ పంచాయతీని గెలుచుకున్నాయి. వైరా, మధిర నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల, వైరా మండలాల్లో మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. సీపీఎం, సీపీఐలు మూడు విడతల ఎన్నికల్లో తమ ప్రాభవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకునే స్థాయిలో పంచాయతీలను గెలుపొందగా.. టీడీపీ ఉనికి పంచాయతీ ఎన్నికల్లో మరింత ప్రశ్నార్థకంగా మారింది. 2013 ఎన్నికల్లో అత్యధిక జీపీలను గెలుచుకున్న పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీ ఈ ఎన్నికల్లో 25 స్థానాలను సైతం గెలుచుకోలేకపోయింది. మధిర మండలంలో స్వతంత్ర అభ్యర్థులు 6 పంచాయతీలను కైవసం చేసుకోగా.. టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 6 పంచాయతీలను గెలుచుకున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం రఘునాథపాలెం మండలం మంచుకొండలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. సర్పంచ్ పదవికి పోటీ చేసిన వారిలో ఒకరు గెలిచి.. మరొకరు ఓడిపోవడంతో ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ ఈ ఉద్రిక్తతకు దారితీసింది. మూడు విడతల్లోనూ గులాబీదే హవా.. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 584 గ్రామ పంచాయతీలకుగాను.. ఏన్కూరు మండలం నూకాలంపాడు జీపీకి ఎన్నిక జరగలేదు. 80 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మొత్తం 503 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవాలతో కలిసి టీఆర్ఎస్ మూడు విడతల్లో 351 జీపీలు, కాంగ్రెస్ 114, సీపీఎం 24, సీపీఐ 12, టీడీపీ 22, న్యూడెమోక్రసీ 5, బీజేపీ ఒక జీపీ, స్వతంత్ర అభ్యర్థులు 54 గ్రామ పంచాయతీల్లో గెలుపొందారు. -
పంచాయతీ ఎన్నికల్లో విషాదం
దౌల్తాబాద్: పంచాయతీ ఎన్నికల్లో విషాదం చోటుచేసుకుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. బుధవారం వికారాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో ఉన్న వీఆర్వో, ఓటేసి వెళ్తూ ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందారు. కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన నర్సప్ప (50) కోస్గి మండలం ముశ్రీఫా వీఆర్ఓగా పనిచేస్తున్నారు. బుధవారం తుదివిడత పంచాయతీ ఎన్నికల కోసం.. కోస్గి మండలం ముశ్రీఫా గ్రామానికి వెళ్లాడు. విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో నర్సప్ప కిందపడిపోయాడు. స్థానికులు గమనించి కోస్గి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నర్సప్ప మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య అరుణమ్మ ఇటీవల చంద్రకల్ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఘటనలో ఓటరు పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామానికి చెందిన కోరె వెంకటమ్మ (65) బుధవారం పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఓటేసేందుకు వరుసలో నిల్చుని ఉంది. ఓటేసిన వెంటనే వెంకటమ్మకు గుండెపోటు రావడంతో ఆమె పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు స్పందించి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. పరిశీలించిన స్థానిక వైద్యులు ఆమె చనిపోయినట్లు వెల్లడించారు. -
‘ఓటేయ్యండి.. బాండ్ రాసిస్తా’
సాక్షి, నల్లగొండ : ‘నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే మీ దగ్గరినుంచి రూపాయి ఆశించను. ఇప్పుడు ఉన్న ఆస్తికంటే ఎక్కువ సంపాదిస్తే జప్తు చేసి ప్రజలకు పంచండి’అంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి వంద రూపాయల బాండ్ పేపర్‌పై సంతకం చేసి ప్రజలకు పంచుతూ ఓట్లను అభ్యర్థించాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సీపీఎం మద్దతుతో చిలుముల రమణ రామస్వామి బరిలో నిలిచారు. తనని సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ మంగళవారం రూ.100 బాండ్ పేపర్ జిరాక్స్ ప్రతులను ఇంటింటికి పంపిణీ చేశారు. -
మూడో విడత పోలింగ్ ప్రారంభం.. 23 గ్రామాల్లో ఎన్నికల బంద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,506 పంచాయతీలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 3,506 పంచాయతీలకు 11,664 మంది, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో భూపాలపల్లి జిల్లాకు చెందిన 23 పంచాయతీల్లో ఎన్నికలను నిలిపివేశారు. -
తుది సమరం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో బుధవారం జరిగే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే తొలి, మలివిడత ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు.. అదే తరహాలో మూడో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియ ఒంటిగంట వరకు కొనసాగనున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ తర్వాత ఎన్నికల అధికారులు ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల నిర్వహణ నుంచి కౌంటింగ్ ప్రక్రియ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, లావుడ్యా రాములునాయక్ నియోజకవర్గాలైన ఖమ్మం, వైరాలతోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాజకీయ పక్షాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మూడో విడతలో 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. అందులో 24 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 168 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధమయ్యారు. అలాగే 1,740 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 245 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. 1,495 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏడు మండలాల్లో 2,20,011 మంది ఓటర్లు ఉండగా.. 1,08,007 మంది పురుషులు.. 1,11,990 మంది మహిళలు, ఇతరులు 14 మంది ఉన్నారు. 24 జీపీలు ఏకగ్రీవం.. రెండో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో 24 గ్రామ పంచాయతీలు, 245 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 168 గ్రామ పంచాయతీల్లో ఎన్నిక జరగనుండగా.. 3,484 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. అదనంగా మరో 200 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వెబ్‌కాస్టింగ్‌లో 136 మంది పాల్గొననున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నిమిత్తం ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బంది తరలివెళ్లారు. పల్లెల్లో పోటాపోటీ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకోవడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు తమ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే తమకు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు గ్రామాలు, వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సోమవారం సాయంత్రం మూడో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకుంటున్నారు. దూర ప్రాంతంలో ఉన్న ఓటర్లను గ్రామాలకు రప్పించే ప్రయత్నాలను ప్రారంభించారు. -
పోలింగ్ విధులకు హాజరైన కానిస్టేబుల్‌కు పాము కాటు
సాక్షి, పెద్దపల్లి : పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరైన మహిళా కానిస్టేబుల్ పాము కాటుకు గురైన ఘటన ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలింగ్ విధుల నిమిత్తమై బసంతనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ వనిత నందిమేడారం గ్రామానికి వెళ్లారు. డ్యూటీలో ఉన్న వనిత మంగళవారం రాత్రి పాము కాటుకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలింగ్ సిబ్బంది, స్థానికుల సాయంతో వనితను కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వనిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వనిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. -
సర్పంచ్‌గా అవకాశం ఇవ్వలేదని గర్భిణి ఆత్మహత్య
సాక్షి, అశ్వారావుపేట రూరల్: సర్పంచ్‌గా పోటీచేసే అవకాశం ఇవ్వలేదనే మనస్తాపానికి గురైన ఓ గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఊట్లపల్లి పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో గ్రామానికి చెందిన రెబక్కారాణి(26)ని టీఆర్ఎస్ మద్దతుతో బరిలో దింపేందుకు స్థానిక నాయకులు కుటుంబ సభ్యులతో చర్చించి ఆమె వివరాలు తీసుకున్నారు. అయితే ఈమె ఏడు నెలల గర్భిణి కావడంతో రెబక్కారాణి వదిన(సోదరుడి భార్య) సాధు జ్యోత్స్నబాయిని బరిలోకి దింపారు. ఈనెల 25న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో జ్యోత్స్నబాయి సర్పంచ్‌గా గెలుపొందారు. కాగా, తనకు వచ్చిన అవకాశాన్ని దక్కకుండా చేశారంటూ జ్యోత్స్నబాయి నామినేషన్ వేసిన రోజు నుంచి రెబక్కారాణి కుటుంబసభ్యులతో ఘర్షణ పడుతోంది. సోమవారం కూడా తన అన్న, తండ్రితో తీవ్రంగా వాగ్వాదం జరిగింది. ఆ కోపంతోనే తన ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో బయటకు వెళ్లిన భర్త నరేంద్ర కాసేపటి తర్వాత ఇంటికి వెళ్లి తలుపు తీసేందుకు ప్రయత్నించగా రాలేదు. దీంతో పక్క ఇంట్లోనే ఉన్న మామ, బావమరుదులను పిలిచి తలుపు పగులగొట్టి చూసేసరికి రెబక్కారాణి మృతి చెంది ఉంది. మృతురాలికి భర్తతో పాటు ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. స్థానిక ఎస్ఐ వేల్పుల వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భయంకరంగా రాజకీయాలు : ఉత్తమ్
సాక్షి, చింతలపాలెం (హుజూర్నగర్) : రానురాను రాజకీయాలు భయంకరంగా మారిపోతున్నాయని టీపీసీసీ చీఫ్, హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని దొండపాడు, వజినేపల్లి, గాంధీనగర్‌తండా, గుడిమల్కాపురం, చింతలపాలెం గ్రామాల్లో ఆయన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పేద ప్రజలు, సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకుండా పోతోందని, అంతా ధన రాజకీయం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించి ఓటు వేయాలని కోరారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారీటీతో గెలిపిస్తే పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఉత్తమ్ పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఇతర పార్టీల నాయకుల బెది రింపులకు భయపడవద్దని ఆ నాయకుల మాటలు పట్టించుకోవద్దని చెప్పారు. కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఉత్తమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా వీరారెడ్డి, పుల్లారెడ్డి, గున్నం నాగిరెడ్డి, దేవిరెడ్డి లక్ష్మారెడ్డి, రాములు నాయక్, సీతారెడ్డి, ఉస్తేల నారాయణరెడ్డి, ఉస్తేల సజన, ఆయా గ్రామాల సర్పంచ్, వార్డులకు పోటీలో ఉన్న అభ్యర్థులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘తుది’ ప్రచారానికి నేటితో తెర
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెర పడనుంది. ఇప్పటికే ఐదు రోజులపాటు ప్రచారం చేసిన అభ్యర్థులు.. చివరిరోజున మరింత హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ర్యాలీలు, ఓటర్ల ఇంటింటికీ వెళ్లి అభ్యర్థించడం, ఆయా పార్టీల ప్రధాన నాయకులు, ఎమ్మెల్యేలు పర్యటించడం వంటి కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. ఆ తర్వాత అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించేందుకు పావులు కదుపుతున్నారు. తుది విడతగా 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఆరు మండలాల పరిధిలో 198 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో 12 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఇక్కడ ఎన్నికలు ఉండవు. మిగిలిన 186 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పల్లెల్లో సర్పంచ్ పదవుల కోసం 586 మంది బరిలో నిలిచారు. అలాగే 1,756 వార్డులకుగాను 178 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవిపోను మిగిలిన 1,578 వార్డుల్లో 815 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.