vangapandu
-
ఆదర్శనీయం వంగపండు జీవితం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ప్రజాకవి వంగపండు ప్రసాదరావు జీవితం ఎందరికో ఆదర్శనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో బుధవారం వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ..సాంస్కృతిక, కళా రంగానికి వంగపండు జీవితం అంకితం చేశారని చెప్పారు. ప్రజాకవి గుమ్మడి విట్టల్‌రావు (గద్దర్) మాట్లాడుతూ..కళాకారులంతా వంగపండు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జానపద కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. వంగపండుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని గౌరవం కల్పించిందన్నారు. ఆయన చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టిందని గుర్తుచేశారు. బీచ్‌రోడ్డులో వంగపండు విగ్రహం ఏర్పాటుకు చర్యలు, ఏటా ఆయన పేరిట ఓ కళాకారుడికి రూ.2 లక్షల నగదు అవార్డు ప్రదానం చేయడం మంచి నిర్ణయమన్నారు. కళాకారులకు సీఎం వైఎస్ జగన్ ఎంతో గౌరవం ఇస్తున్నారంటూ సభాముఖంగా సెల్యూట్ చేశారు. గద్దర్, ఆర్.నారాయణమూర్తి, విమలక్క తదితరులు తమ ఆటపాటలతో అలరించారు. బాడ సూరన్నకు అవార్డు ప్రదానం శ్రీకాకుళం జిల్లాకు చెందిన జానపద కళాకారుడు బాడ సూరన్నకు జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సత్కరించారు. అవార్డులో భాగంగా రూ.2 లక్షల నగదును ప్రభుత్వం తరఫున అందించారు. బాడ సూరన్న మాట్లాడుతూ..తన 36 ఏళ్ల జీవితంలో కళను, కళాకారుడిని ఇంతలా గౌరవించిన ప్రభుత్వం మరొకటి చూడలేదన్నారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకరరావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి చైరపర్సన్ వంగపండు ఉష, వీఎంఆర్డీఏ చైరపర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్‌కుమార్, రాష్ట్ర విద్యాభివృద్ధి మౌలిక సదుపాయాల సంస్థల చైర్మన్ మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాడ సూరన్నకు వంగపండు అవార్డు అందజేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విశాఖటప్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్వర్యంలో జానపద వాగ్గేయకారుడు వంగపండు వర్ధంతి సభ బుధవారం ఘనంగా జరిగింది. జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో..బాడ సూరన్నను సత్కరించారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. అవార్డులో భాగంగా ప్రభుత్వం తరఫున మంత్రి బాడ సురన్నకు రూ.2 లక్షలు అందజేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళలు, కళాకారులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ‘‘నా గురువు వంగపండు పాట ద్వారా అవార్డు దక్కడం గర్వంగా ఉంది’’ అన్నారు సూరన్న. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగపండు వర్ధంతి సభను ప్రభుత్వం నిర్వహించడం గొప్ప విషయం. వంగపండు విగ్రహ ఏర్పాటు ద్వారా కళాకారులకు గుర్తింపు లభించింది. సీఎం వైఎస్ జగన్‌కు కళాకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. -
సిక్కోలు పొద్దుపొడుపు వంగపండు
సిక్కోలు సమరాన ధిక్కార స్వరమొకటి విశాఖ ఉక్కయిన ఆంధ్రుల హక్కొకటి ఎడతెగని సంద్రాన ఎదురెల్లె నావొకటి అడిగాయిలే నిన్ను వంగపండూ– నీ కలము నుండి జారి పడుకుంటూ జానెడు కడుపునకై దారబోసిన చెమట దేహమే కంజరయి ధన ధన సప్పుడట కాళ్లగజ్జెలు ఘల్లు నెమలితో పోటీపడి చేతి అందెల మోగె వంగపండు– నీ గుండె చప్పుడును వినుకుంటూ ఏం పిల్లడోయని ఎలుగెత్తి పాడినా ఎల్దమస్తవంటు రమ్మని అడిగినా యంత్రాల పాటతో మంత్రముగ్దుల జేసె కథ జెప్తవా వింటాను వంగపండు– నా రెండు కండ్లు జూస్తె చాలకుండూ ఎవరు దోసుకు పోని ఆటపాటల మూట ఆస్తులుగ పిల్లలకు పంచిపోయావంట సీమల దండులో సిలుకలా గుంపులో సాగిపోతివ నీవు వంగపండు వంగె పొద్దులో వర్ణాలు జూసుకుంటూ కాలమే కడుపుతో కన్నకవులెందరో మేరిమి కొండల్లో మెరుపులింకెందరో జముకు జనరాగంగా అందియలు మోగంగ ఉర్రూతలూగెనట ఉత్తరాంధ్ర– నీ చరితనే దేశము చదువుతుండా సలాములే నీకు వంగపండు – పాట సలాములె నీకు వంగపండు లాల్సలాములే నీకు వంగపండు– ఆట సలాములే నీకు వంగపండు – మిత్ర (నేడు విశాఖలో వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి) -
వంగపండుకు సుస్థిర స్థానం
మార్పు కోసం తూర్పు కొండల్లో ఉదయించిన ప్రజాగాయకుడు, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావుకు ఏపీ ప్రభుత్వం విశేష గుర్తింపునిచ్చింది. ఆయన పేరుమీద జానపద పురస్కారం ఏర్పాటు చేయటమేకాక, నిరుపేద జీవితం గడిపిన ఆయన కుటుంబానికి పదిలక్షల పారితోషకం అందిస్తూ సాంస్కృతిక శాఖ జీఓను విడుదల చేసింది. వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న ప్రతి ఏటా పురస్కారం ఇచ్చేందుకు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. గద్దర్ వంటి వారితో కలిసి సుదీర్ఘ కాలం జననాట్యమండలి కోసం పనిచేసిన వంగపండు,ఉమ్మడి రాష్ట్రంలో పల్లెపల్లెనా పలు ప్రదర్శనలు ఇచ్చి తమ పాటతో జన చైతన్యానికి కృషి చేశారు. ఆయన పాడిన పాటల్లో జజ్జనకరి జనారే, యంత్రమెట్ట నడుస్తున్నదంటే వంటివి విశేష ఆదరణ పొందాయి. 300కి పైగా జాపపదాలు రచించారు. బాణీకట్టి, తానే స్వయంగా కాలికి గజ్జెకట్టి ఆడి, పాడే ఆయన తెలియనివారు ఎవరూ ఉండరు. పార్వతీపురం దగ్గర్లోని పెదబొండపల్లి ఆయన స్వగ్రామం. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా’ అంటూ ఆయన రాసి, పాడిన పాట ఎంత సంచలనం కలిగించింది. తెలుగు సమాజాలకు ఉత్తరాంధ్ర అందించిన ఉత్తమ కళాకారులలో ఆయన అగ్రగణ్యులు. ప్రజాకళాకారుడు. మూడు వందల పాటల సృజనతో, ఎడతెగని ప్రదర్శనలతో, ఏళ్ల తరబడి ఆడిన నాటకాలతో వంగపండు తన సాహిత్య, కళా, ప్రజాజీవితాన్ని సుసంపన్నంగా గడిపారు. నిజమైన అర్థంలో కార్మిక కవి. ‘జజ్జనకరి జనారే... ఏం పిల్లడో ఎల్దుమొస్తవా..’, యంత్రమెట్టా నడుత్తు ఉందంటే’, ఓడా నువ్వెళ్లిపోకే’, ‘మా కంపెనీకి జీతాలు పెరిగినయ్’... ‘ఉందర్రా మాలపేట’ వంటి పాటలు ప్రజాబాహుళ్యంలో ఉర్రూ తలూగిం చాయి. వంగపండు దళితసంవేదనను పలికించారు. కుల నిర్మూలన భావజాలంతో గజ్జెకట్టి ఆడిపాడారు. భూమిభాగోతం – వంగపండు రాసిన నృత్యరూపకం. ఈ రూపకాన్ని తెలుగునేలపై ఎన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారో తెలియదు. ఒక వెనుకబడిన ప్రాంతానికి, అదే సమయంలో సాహిత్య కళా రంగాలలో గొప్ప వారసత్వమున్న ప్రాంతానికి, వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన వంగపండు చరిత్రలో చిరస్థానాన్ని సాధించుకున్నారు. అటువంటి మహా కళాకారుడికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అత్యున్నత గుర్తింపు ఇవ్వడమేకాక, ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయం. – నేలపూడి స్టాలిన్ బాబు (04–08–2021న వంగపండు ప్రథమ వర్థంతి సందర్భంగా) -
‘విశాఖ బీచ్ రోడ్లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు’
సాక్షి, విశాఖపట్నం: దివంగత ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు వర్థంతిని విశాఖపట్నంలో రేపు(బుధవారం) నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 4న వంగపండు వర్థంతిని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వంగపడు ప్రసాదరావు స్మారక అవార్డు పేరిట ఉత్తమ జానపద కళాకారునికి రూ.2 లక్షల అవార్డు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి తెలిపారు. -
వంగపండు కుటుంబానికి మంత్రులు పరామర్శ
సాక్షి, పార్వతీపురం: ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని మంత్రులు ఆదివారం పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. వంగపండు ప్రసాదరావు కుమార్తె ఉష, కుమారుడు దుష్యంత్, భార్య విజయలక్ష్మిలకు ముఖ్యమంత్రి తరపున మంత్రులు సంతాపం తెలిపారు. వంగపండు మృతి ఉత్తరాంధ్ర లోని పేదలు, అట్టడుగు వర్గాల వారికి లోటని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి వంగపండు అని పేర్కొన్నారు. వంగపండు ప్రసాదరావు భౌతికంగా లేకపోయినా ఆయన పాట, మాట ఈ పుడమి వున్నంత కాలం చిరస్థాయిగా నిలిచి వుంటాయని మంత్రి పేర్ని నాని అన్నారు. అట్టడుగు వర్గాల, గిరిజనుల గొంతుక గా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి వాటి పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి వంగపండు ప్రసాదరావు అని మంత్రి కొడాలి నాని తెలిపారు. -
పాటల విత్తనాలను చల్లిపోయాడు
వంగపండు గురించి రాయడం అంటే నా బాల్యాన్ని నేను తడుముకోవడమే. నా జ్ఞాపకాలు గూడు కట్టుకునే ప్రాయానికి ఊర్లోకి పరిగెత్తుకొచ్చిన పాట వంగపండు. అది మా బాల్యంతో ఆడుకుంది. మమ్మల్ని ‘జీపీ వత్తింది రండిరా’ అంటూ మట్టిబాట మీద దుమ్ము రేపుకుంటూ వచ్చి మా పిల్లలందరినీ ఆ పాటలజీపు ఎక్కించి, ఊరేగించాడు వంగపండు. తదనంతరం తన పాటలతో దుమ్మురేపాడు. వంగపండు చాలా పేదరికంలో పుట్టి పేదరికంలోనే పోయాడు. మధ్యలో పాటతోనే బతికాడు. పేదరికాన్ని వండుకుతినే దుర్భర దారిద్య్రంలో పిసరంత ప్రేమను తాపే తల్లి కడతేరిపోవడం దురదృష్టం. తల్లి ఒడి నుంచి దాటకముందే తల్లి దాటి వెళ్లిపోవడం ఏ బిడ్డకైనా నరకమే. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. సవతి తల్లి రావడంతో ఆయన పడ్డవన్నీ సినిమా కష్టాలే. పిల్లల్ని ఆడించడం, ఇంటి చాకిరీ, పశువుల కాపుకి పోవడం. ఈ పనుల వల్ల ఆయన చదువు సాగలేదు. అసలు సిసలైన చదువు పశువుల కాపరులతోనూ, షిప్‌యార్డు కార్మికులతోనూ సాగిందని చెబుతుండేవాడు. వంగపండుకు పాట పితృదత్తంగా వచ్చింది. తండ్రి జానపద కళాకారుడు. చాలా పేరు పొందిన చుక్క దాలినాయుడు బుర్రకథ బృందంలో ఆయన ఒక సభ్యుడు. వారికి వంగపండు బుర్రకథలు రాసిచ్చేవాడు. అక్కడినుంచి ఆయనలో కళాకారుడు ఎదగడం ప్రారంభించాడు. ఒక కవి స్థానం, స్థల కాలాలు నిర్ణయిస్తాయి అంటారు కదా. షిప్‌యార్డ్ కార్మికుడిగా చేరిన తర్వాతే ఆయన పాటకి ఒక పరమార్థం చేకూరింది. అవి విరసం ఆవిర్భవించిన రోజులు. శ్రీశ్రీ, రావిశాస్త్రి, కారా, చలసాని మొదలైన రచయితల సహచర్యం ఆయనకు వెన్నుదన్ను అయ్యింది. విరసం ఆయనకు ఒక శాస్త్రీయ దృక్పథాన్ని ఇచ్చింది. జననాట్య మండలి ఆయనకు ఒక సాంస్కృతిక వేదిక అయింది. ఎండు పుల్లలు తొందరగా మండినట్టే, ఎండిపోయిన జనం అగ్గిలాంటి ఆయన పాటకు తొందరగానే అంటుకుపోయారు. కారణం ఆయన తీసుకున్న బాణీలు వారి బతుకు లోనివే కాబట్టి. శ్రీకాకుళ ఉద్యమానికి వంగపండు పాట ఊపిరి అయింది. ఉప్పెనలా ఎగిసిపడింది. సునామీలా ప్రపంచాన్ని చుట్టేసింది. అది ఒక చరిత్ర. ఆ వసంత మేఘ గర్జనలో ఆయన పాటల ఉరుముంది, మెరుపుంది. ఆ క్రమంలో ఆయన ఎన్నో రచనలు చేశాడు. కథలు రాశాడు. టీవీ వచ్చాక, జానపద కళల నిరాదరణకు సంబంధించి దొమ్మరి సాని అనే నవల రాశాడు. శ్రీకాకుళ పోరాటానికి సంబంధించి సిక్కోలు యుద్ధం అనే కంజిర కథను రాసి ప్రదర్శించాడు. విశాఖ సత్యానంద్ దర్శకత్వంలో ఆయన రాసిన నాటకం అడవి దివిటీలు ఎంత ప్రజాదరణ పొందిందో వేరేగా చెప్పక్కరలేదు. ఇక భూమి బాగోతం నృత్య రూపకం సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ప్రతి పల్లెలో పెద్దవాళ్ళది, చిన్నవాళ్ళది రెండు బృందాలు ఉండేవి. పల్లెల్లో ఏ వేడుక జరిగినా ఈ ప్రదర్శన ఉండి తీరాల్సిందే. మొదట్లో గ్రామ పెద్దలు దీన్ని నిషేధించిన సందర్భాలు ఉన్నాయి. పెద మేరంగి రౌతు వాసు మాస్టారి దర్శకత్వంలో వందలాది ప్రదర్శనలు జరిగాయి. చాలామంది పిల్లల నోట్లో ఈ పాటలే నిత్యం వినబడుతుండేవి. ఏరువాక, పొలికేక, జజ్జనకరి జనారే, ఆయన పాటల సంకలనాలు. ఆరు మాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. కానీ ఐదు దశాబ్దాల నగరవాసం ఆయనకు ఏమాత్రం నాగరికతను అంటించలేకపోయింది. ఏమాత్రం నాగరికత అంటినా ఆయనలో ఉన్న జానపదుడు మాయమైపోయే వాడేమో! ఆ పాటల్లో పల్లె పరిమళం ఆవిరై పోయేదేమో! పట్నంలో తప్పిపోయిన పల్లెటూరి పిల్లవాడిలా చివరంటా అదే అమాయకత్వం, అదే బెరుకు. ఇన్నేళ్లలో ఆయన యాస, భాషలు మారలేదు. డాంబికాలు, భేషజాలు, పోజులు తమ ప్రదర్శనకి వంగపండు పనికిరాడు అని వాటికి తెలుసు. అందుకే దరి చేరలేదు. పత్రిక ఆఫీసుకు వెళ్లి ‘సభలకు వెళ్ళడానికి పైసలు లేవు, అక్రెడిటేషన్ పాస్ ఏమైనా ఇస్తారా’ అని, డీపీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ‘అమ్మా! నాకు పింఛన్ ఇవ్వడానికి వయసు సరిపోయినట్లు లేదు. కొంచెం చూడమ్మా’ అని అభ్యర్థించడం వంగపండుకే చెల్లింది. అతడు హనుమంతుడి లాంటివాడు. అతని గురించి అతనికి తెలియదు. కానీ అవతల వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు కాదనలేరు. వంగపండు ప్రజల సమస్యలకు సంబంధించిన ప్రతి సందర్భంలోనూ ప్రతిస్పందించి, పాటై ప్రతిధ్వనించాడు. నిన్న మొన్నటి కరోనా పాట వరకు నిత్యం పాటల ఊటగా స్రవిస్తూనే ఉన్నాడు. సాదాసీదాగానే బతికాడు. ఉద్యమంలో ఉన్నప్పుడు జీవిత పర్యంతం అసిధారావ్రతం ఎవరికైనా అసాధ్యం. కుటుంబం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఇరుగు పొరుగులతో తైపారు వేసుకుంటూ మా సంగతేమిటనే ప్రశ్నను కొడవలిలా ఎత్తుతుంది. సమాధాన పరచడం, సంతృప్తి పరచడం అంత సామాన్యమేమీ కాదు. ఆ ఆటుపోట్లు తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. దీనికి వంగపండూ అతీతుడు కాదు. అలాంటి ఇబ్బందులు పడ్డాడు. కానీ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. సజీవ కవిగా సంచరిస్తూ బైరాగి లాగా బతికాడు. ఏమైనా ఆయన సృష్టించిన సాహిత్యం సామాన్యమైనది కాదు. మన ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామమంతా అందులో ఉంది. పక్వానికి వచ్చిన తర్వాత పండు రాలి పోవలసిందే. అయితే వంగపండు చాలా పాటల విత్తనాలు చల్లి పోయాడు. వాటిని అంకురింపజేసి పాదుకొల్పడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. - జి.ఎస్.చలం -
పండు రాలిపోయింది.. పాట మిగిలింది
స్విచ్ వేస్తే తీగలోకి విద్యుత్ ప్రవహించినట్టు.. ఆ పాట నరనరానా ఉత్తేజం నింపుతుందని రాచకొండ అన్నారు. అదిగో ఆ ఉత్తేజప్రసార వాగ్గేయకారుడు వంగపండు అకస్మాత్తుగా పాటను మనకొది లేసి వెలిపోయేడు. ఇపుడాయన గురించి వలపోతలు, తలపోతలు, జేజేలు, ఆహాలు, ఓహోలు... అన్నన్నాలు... యేమలగాలు.. చ్చొచ్చోలు.. వినబడుతున్నాయి. కొందరు వంగపండు పాటలో వసంతకాల గానాన్ని వెదకపూనుకున్నారు. మరి కొందరు–వసంతకాల మేఘఘర్జనలు ఇపుడా పాటగానిలో గానీ, పాటలో గానీ లేవనీ; ఏ ప్రజల కోసం ఆ పాట అంత శక్తివంతమయ్యిందో ఆ ప్రజలను వొదిలాక పాట శక్తిని కోల్పోయిందనీ, పాటగాడు వొంటరయ్యేడనీ... వొంటరిగా వెళిపోయాడని– విప్లవ కోర్టుపీఠాల మీంచి యే పీఠానికి ఆ పీఠం తీర్పుల ప్రకటనలిచ్చేశాయి. చాన్నాళ్ళకిందట ఒకాయన–అమాయక జానపద ఎర్రజెండా–వంగపండు అని వ్యాఖ్యానించేడు. అవును.. వంగపండు అమాయక జానపద ఎర్రజెండా! అమాయకుడుగాబట్టే–అప్పుడుకి సిలకల రెక్కలిరిగి, ఊపిర్లాగి నేలకొరిగినాయి, పిల్లుల వేటలో యెలకలు కొన్ని సనిపోయినాయి. మరికొన్నిబోనుల్ల బందీ ఐనాయి. ఆకు తెంపితే ఆదివాసీ నెత్తురు సుక్కలుసుక్కలుగా కారుతున్న రోజులవి. కోరన్న, మంగన్న నుంచి జరుగుబాటు కోసం తిరుగుబాటు నేర్పిన గురువులు దాకా యెందరో వొరి గిన సమయమది. జెండా పీలికలు పీలికలయ్యింది. యెవులే పీలికకి లీడరో? ఏ రోడ్ యెటు తీసకపోతాదో అంతా తికమక మకతికగ ఉన్న సమయాన తికమకలూ, మకతికల్లేకుండా–ఏమ్ పిలడో యెల్దుమొస్తవా, శికాకుళంలో సీమకొండకని పిలుస్తూ, శికాకుళం బయలెళ్ళిపోనాడు.. సుత్తీకొడవలి గురుతుగ ఉన్న ఎర్రని జెండాని పట్టుకొని! ఉడుపు మళ్ళల్లో వినిపించే ఉడుపుగత్తెల నోమీనోమన్నలు, పశుల కాపర్ల గొంతులు తెగే రాగాలు.. బాల్యం లోనే వంగపండు వొంటిని పట్టేయి. ఉపాధి కోసం ఐటీఐ చేసి విశాఖపట్నం చేరాడు. పల్లె రైతు బతుకు నుంచి పట్నపు కార్మిక బతుకులోకి వొచ్చేడు. అపుడు పుట్టిందే.. సుత్తీకొడవలి గురుతుగ ఉన్నా ఎర్రని జెండా పాట. కార్మిక గీతాలతో విశాఖలో మార్మోగిన వంగపండు గొంతు తొలిసారిగా పార్వతీపురంలో ‘వొత్తన్నాడొత్తన్నాడు.. ఆ భూములున్న బుగతోడు, పోలీసుల తోడుతోను, అడుగడుగో అటుసూడు..’ అని చేత చిరతలతో, కీచుగొంతుతో వేలాది జనానికి వినిపించేడు. వేలాది జనం ఆ రోజు మహాకవి శ్రీశ్రీ కోసం వచ్చేరు. జనం వంగపండు పాటకు వన్స్‌మోర్ కొట్టేరు. శ్రీశ్రీ– ఇప్పుడు కావాల్సిన కవిత్వమిదీ అని వంగపండుని పొగిడేరు. అమాయక జానపదుడు కాబట్టి శ్రీశ్రీలాగా.. ఇకముందు పాటని నేను నడుపుతాను. ఈ యుగం నాది అనన్లేదు. ఈ పాట జనానిది అనన్నాడు. ‘రండిరో... పండరి భజనకు’ అన్న భజన గీత బాణీని, భావాన్ని ప్రజల చైతన్య మార్గంలోకి మరల్చే పాటగా.. ‘రండిరో కూలన్నా.. సంఘం కడదామూ, ఈళ సంగతేదో సూద్దామూ..’ అని రాసేడు. పట్నం, పల్లె జీవితాల మీద పాటలు రాసేడు. మాలపేటని కళ్ళముందర పెట్టేడు. కూలోళ్ళపిల్లని లోకానికి చూపేడు. మడిలో బెడ్డలన్ని– నీ నెత్తురు గడ్డలూ, పండిన పంటలన్ని నీ సెమటా సుక్కలని రైతోడికి ఎరుక పరిస్తే; ఎంత్రమెట్టా నడుస్తు ఉందంటే... వోరన్నోలమ్మీ అని యంత్ర గమనాన్ని కార్మికునికి వినిపించేడు. వంగపండు విశిష్టతకు ఓ గొప్ప ఉదాహరణ – భూమి బాగోతం నృత్య నాటక రచన, ప్రదర్శన. తెలుగునేల అశేష పల్లెల్లో ఇంత విస్తృతంగా ప్రదర్శనలు పొందిన కళారూపం ఇటీవల మరొకటి లేదు. శ్రీకాకుళ పోరాటాన్ని శిక్కోలు యుద్ధం పేరుతో కంజరి కథ; కారా గారి ప్రసిధ్ధ కథ ‘యగ్యం’ కంజరి కథగా రాసి ప్రదర్శనలు ఇచ్చాడు. అపార కళాసంపదను లోకానికి అందించిన ఈ వాగ్గేయకారుడు అతిపేదగా జీవించి మరణించాడు. వ్యాసకర్త ప్రముఖ కథా, నవలా రచయిత ‘ఉరకవే’ అధ్యక్షుడు ‘ 94400 31961 -
వంగపండు ఉషకు సీఎం జగన్ ఫోన్
సాక్షి, తాడేపల్లి : ప్రముఖ విప్లవ కవి, ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు కుమార్తె వంగపండు ఉషను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. వంగపండు మృతితో ఓ ప్రజా గాయకుడిని కోల్పోయామని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, వంగపండు ఉష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ, కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్లో వంగపండు ప్రసాదరావు మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) -
వంగపండుకు విరసం నివాళి
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ విప్లవ కవి, కళాకారుడు వంగపండు ప్రసాద్ మృతి పట్ల విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం తెలియజేసింది. ఉత్తరాంధ్ర జన జీవిత సౌందర్యాన్ని, శ్రీకాకుళం ఆదివాసీ పోరాట పరిమళాన్ని కళా రంగంలో ఒడుపుగా పట్టుకున్న వాగ్గేయకారుడనీ, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన తొలి దశ పాత్ర చెరిగిపోనిదని విరసం అధ్యక్షులు అరసవెల్లి కృష్ణ, ఉపాధ్యక్షులు బాసిత్, సహాయ కార్యదర్శి రివేరా పేర్కొన్నారు. ఆయన తొలి దశ పాటలు, కళారూపాలు, ప్రదర్శనలు ప్రజా పోరాటాల్లో, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో శాశ్వతంగా ఉంటాయని, ఆయనకు విరసం నివాళులర్పిస్తోందని చెప్పారు. విప్లవోద్యమం ఏ జీనవ క్షేత్రాల్లో కి విస్తరించిందో, ఏ ప్రజా సమూహాల్లోకి వెళ్లిందో ఆ ప్రజల జీవితాన్ని, ప్రత్యేక సమస్యలను, నిర్దిష్ట సాంస్కృతిక విశిష్టతలను పట్టుకొని ఉద్యమ వైఖరిని ప్రతిబింబిస్తూ వంగపండు వందలాది పాటలు రాశారని, ‘వంగపండు ఉరుములు’, ‘వంగపండు ఉప్పెన’ పేర్లతో ఆయన పాటల క్యాసెట్లు వేలాది గ్రామాలకు చేరాయని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాలకు తీరని లోటు ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ..జన నాట్యమండలితో కలిసి తమ సంస్థ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. జనం దరువు పేరుతో తెలుగు రాష్ట్రాల్లో వంగపండుతో కలిసి ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే భూ బాగోతం ప్రదర్శనల్లోనూ అరుణోదయ పాల్గొన్నదని, వంగపండు కూతురు ఉష కూడా అరుణోదయ సంస్థతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. జీవితమంతా ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన వంగపండు ప్రసాద్‌కు అరుణోదయ సంస్థ పక్షాన ఘన నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి ప్రజలకు ... ♦ ప్రజా కళలను వెలికి తీసి వాటిని పదునెక్కించి తిరిగి ప్రజల వద్దకు వెళ్లాడు వంగపండు. ప్రజలను చైతన్యవంతం చేశాడు. విప్లవోద్యమం వైపు నడిపించాడు. ఆయనకు నా నివాళి. – ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు విప్లవోద్యమ గొంతుక... ప్రజాకవి, వాగ్గేయకారుడు, విప్లవోద్యమ గొంతుక అయిన వంగపండు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మరణం సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు. – చిక్కుడు ప్రభాకర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక -
‘ఏం పిల్లడో’ ఎల్లిపోయావా
సాక్షి, అమరావతి: ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అంటూ ఊరించి.. ఉరిమించి ఊరూవాడా ఏకం చేసి కవ్వించి.. కదం తొక్కించి..చెప్పకుండానే ఎల్లిపోయాడు..‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’.. అంటూ ప్రజలను చైతన్యం చేసిన ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు (77) ఇకలేరు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్లో మంగళవారం వేకువజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వంగపండుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పదునైన పదాలకు సొంపైన బాణీలతో స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వరులు దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా వంగపండు అంత్యక్రియలను పూర్తి చేశారు. విప్లవ గీతాలకు పెట్టింది పేరు 1943 జూన్‌లో పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చినతల్లి దంపతులకు వంగపండు జన్మించారు. తన రచనలతో, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు. 1972లో నాటి పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి 400కి పైగా జానపద గీతాలను రచించారు.అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో వంగపండు రచించిన గీతాలను ఆలపిస్తూ విప్లవ జ్యోతికి తుది వీడ్కోలు పలికారు. వంగపండు కుమార్తె ఉష వైఎస్సార్సీపీలో ఉన్నారు. రాష్ట్ర çసృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ చైర్ పర్సన్ గా సేవలందిస్తున్నారు. తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఆమె పార్వతీపురం చేరుకున్నారు. తండ్రితో కలసి పలు ప్రదర్శనల్లో పాల్గొని విప్లవ గీతాలతో చైతన్యం రగిల్చారు. ఆ గుర్తులను తలచుకుని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతి..: జగన్ ప్రజా గాయకుడు, కవి వంగపండు ప్రసాదరావు మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పామును పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఆయన ఓ మహాశిఖరంగా నిలిచిపోతారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’’ అని సీఎం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వంగపండు జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
గజ్జెకట్టిన పాటెళ్లిపోయింది
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ పార్వతీపురంటౌన్/సాక్షి, అమరావతి: ‘ఏం పిల్లో ఎల్దమొస్తవా‘... అంటూ ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) ఇకలేరు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్లో మంగళవారం వేకువ జామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వంగపండు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పదునైన పదాలకు సొంపైన బాణీలతో స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు. సీఎం జగన్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వరులు దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా వంగపండు అంత్యక్రియలను పూర్తి చేశారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో వంగపండు రచించిన గీతాలను ఆలపిస్తూ విప్లవ జ్యోతికి తుది వీడ్కోలు పలికారు. వంగపండు కుమార్తె ఉష వైఎస్సార్సీపీలో ఉన్నారు. రాష్ట్ర సృజనా త్మక, సాంస్కృ తిక కమి షన్ చైర్ పర్సన్‌గా సేవలందిస్తున్నా రు. తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే ఆమె పార్వతీపురం చేరుకున్నారు. తండ్రితో కలసి పలు ప్రదర్శనల్లో పాల్గొని విప్లవ గీతాలతో చైతన్యం రగిల్చారు. ఆ గుర్తులను తలచుకుని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి భౌతిక కాయం వద్ద విలపిస్తున్న కుమార్తె వంగపండు ఉష విప్లవ గీతాలకు పెట్టింది పేరు 1943 జూన్‌లో పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చినతల్లి దంపతులకు వంగపండు జన్మించారు. తన రచనలతో, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు. 1972లో నాటి పీపుల్స్ వార్ సాం స్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి 400కి పైగా జానపద గీతా లను రచించారు. ముఖ్యమంత్రి జగన్ సంతాపం ప్రజా గాయకుడు, కవి వంగపండు ప్రసాదరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పామును పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఆయన ఓ మహాశిఖరంగా నిలిచిపోతారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’’ అని సీఎం ట్వీట్ చేశారు. చైతన్య స్ఫూర్తిని కోల్పోయాం.. వంగపండు మృతి పట్ల ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సంతాపం తెలిపారు. జన పదాలతో ప్రజల గొంతుక వినిపించిన వంగపండు మృతితో చైతన్య స్ఫూర్తిని కోల్పోయామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గళంతోనే జగత్తును కదిలించిన ప్రజాకవి వంగపండు మృతి పట్ల వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, ఏపీడబ్లు్యజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.ఆంజనేయులు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీఐటీయూ నాయకుడు గఫూర్ తదితరులు సంతాపం తెలిపారు. -
జనం కోసం ఆడిపాడారు
నా మొదటి సినిమా ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’కి వంగపండు పాటలు రాశారు, పాడారు, నటించారు కూడా. ఆ సినిమా విజయానికి ఎంతో దోహదపడ్డారు. ఆయన ప్రజలకోసం రాసి, ఆడి, పాడి ప్రజల మనిషయ్యారు. మా వ్యక్తిగత విషయాల్ని పంచుకునేంత గొప్ప స్నేహం మాది. నా సినిమాలు ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ మొదలుకొని ‘ఆలోచించండి’, ‘భూపోరాటం’, ‘అడవి దివిటీలు’, ‘చీమలదండు’, ‘అన్నదాత సుఖీభవ’ తదితర చిత్రాలకు పాటలు రాయడంతో పాటు నాలుగైదు సినిమాల్లో నటించారాయన. నా ‘దండకారణ్యం’ చిత్రంలో ఆయనతో ప్రజాకవి వేషం వేయిద్దామనుకున్నాను. ఆ కవిని పోలీసులు నిర్భందించి, టార్చర్ పెట్టే సన్నివేశం ఉంది. ఆ సమయంలో ఆయన యాంజియోగ్రామ్ చేయించుకున్నారు. ఈ సన్నివేశాలు వచ్చినప్పుడు వంగపండుని తోసేస్తే అప్పుడు ఆయనకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమోనని, ‘ఈ వేషం మీరు వేయొద్దు సార్’ అని చెప్పాను. ఆయన చాలా ఫీలై, ఆ వేషం నేను వేయగలను అన్నారు. వృత్తిపట్ల ఆయనకున్న సెంటిమెంట్, అంకితభావం అలాంటిది. కానీ నేను ఆ పాత్ర చేయించలేదు. ‘ఏం పిల్లడో ఎల్ద మొస్తవా..’, ‘యంత్రమెట్లా నడుస్తున్నదంటే...’, ‘ఎక్కడపుట్టి ఎక్కడ పెరిగామో...’, ‘మా పోరు ప్రజా పేరు...’, ‘రైతు తిరుగుబాటు..’, ఇలా నా చిత్రాల్లో ఎన్నో పాటలు రాశారు, పాడారు. జానపద కవిగా, పీడిత ప్రజల పక్షపాతిగా ఆయన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. -
నిఖార్సయిన విప్లవకవి
అప్పుడు విరసం (విప్లవ రచయితల సంఘం) సభలు జరుగుతున్నాయి. 40 ఏళ్ల క్రితం జరిగిన ఆ సభలో రావిశాస్త్రిగారు, కె.వి.రమణారెడ్డిగారు.. ఇలా మహామహులు ఎందరో ఉన్నారు. అప్పుడు నేను ‘అందుకోరా గుత్తందుకో..’ అనే పాట రాశాను. నేను స్టేజి మీద పాడుతూ, మనిషి ఎత్తుకు ఎగురుతున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి డోలక్ కొడుతూ, కోరస్ ఇచ్చారు. ఆయనే వంగపండు ప్రసాదరావు. ఆ తర్వాత నేను, వంగపండు.. నారాయణమూర్తి గారి సినిమాల ద్వారా కలిసి చాలాసార్లు వారాలు, నెలలపాటు గడిపాము. వంగపండు చేతిలో చిన్న అందెలు ఉండేవి. అవి పోయాయి. నేను దుబాయ్ వెళ్లినప్పుడు తీసుకొచ్చిన అందెలు నా దగ్గర పది జతలు ఉన్నాయి. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు నాకివ్వమని అడిగితే ఇచ్చాను. ఆయనకు ఇచ్చిన అందెలే నాకు ఇప్పుడు చివరి జ్ఞాపకంగా మిగిలాయి. గద్దరన్న, వంగపండు రాసిన ప్రతి పాటా అపురూపమే. ఎందుకంటే వాళ్లు పేరు కోసమో, డబ్బు కోసమో పాటలు రాయరు. ఒక మహోన్నతమైన ఉద్యమం కోసం వాళ్లు పాటలు రాశారు. వంగపండు నిరాడంబరుడు. ఆయన జీవితానుభవాలే పాటలుగా ఆయన గుండెలోతుల్లో నుండి వచ్చాయి. ఆ కాలంలో గద్దరన్న ప్రవాహానికి, ఉప్పెనకు నిలబడ్డ ఏకైక వ్యక్తి వంగపండు. తర్వాత ఆయన స్టెప్పు, మాటతో ఎంతో విభిన్నంగా ఉండేవారు. చాలా నిఖార్సయిన విప్లవ కవి ఆయన. ఆయనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆర్. నారాయణమూర్తి చాలా సాయం చేశారు. ఆయన సినిమాల ద్వారా వంగపండుగారి పాటలు ఎంతోమందికి దగ్గరయ్యాయి. -
జనం మనిషి
ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. యువతను చైతన్యపరచిన పాట. ఓడా నువ్వెళ్లిపోకే.. శ్రామికుడి బాధను వ్యక్తపరిచిన పాట. యంత్రమెట్టా నడుస్తు ఉందంటే.. యంత్రం కంటే మనిషి గొప్ప అని చెప్పే పాట. అన్నంపెట్టే అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యమా.. రైతు బాధను చెప్పిన పాట... వంగపండు పాట జనంలోంచి వచ్చింది. అందుకే అన్నీ జనం మెచ్చిన పాటలయ్యాయి. మూడు దశాబ్దాల కాలంలో సుమారు 300 వందల పైచిలుకు జానపద పాటలు రాశారు వంగపండు ప్రసాదరావు. అలాగే ఓ 30 సినిమాలకు పాటల్ని కూడా రచించారాయన. ఆర్. నారాయణ మూర్తి తీసిన ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ చిత్రంతో వంగపండు సినీ ప్రస్థానం మొదలయింది. ఈ సినిమా కోసం రాసిన ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా, ఏం పిల్లో ఎల్దమొస్తవా...’ పాటకు విశేష ఆదరణ లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో మారుమోగిపోయింది. ఇదే సినిమాకి ‘నీయమ్మ చచ్చినా’ అనే పాట కూడా రాశారు. ఆర్.నారాయణ మూర్తి తెరకెక్కించిన ‘ఆలోచించండి, భూపోరాటం, అడివి దివిటీలు, చీమలదండు, అన్నదాత సుఖీభవ’ వంటి చిత్రాల్లో పాటలు రాశారు వంగపండు. ‘చీమలదండు’లో మనిషికన్నా యంత్రం ముఖ్యం అనే భావం వచ్చే సన్నివేశాల్లో ‘యంత్రమెట్ల నడుస్తున్నదంటే..’ అనే పాటను రాశారు వంగపండు. యంత్రాన్ని కనిపెట్టేది మనిషే.. ఆ యంత్రాన్ని నడపేది కూడా మనిషే.. మనిషి కంటే యంత్రం ఎలా గొప్పదవుతుంది అంటూ ఆయన రాసిన పాట చాలామంది హృదయాలను తాకింది. ఇక ‘అన్నదాత సుఖీభవ’ సినిమా కోసం రాసిన ‘అన్నం పెట్టే అన్నదాతలకు ఆత్మహత్యే శరణ్యమా..’ పాట పేద రైతుల కష్టాలను కళ్లకు కట్టింది. ‘ఎర్ర సముద్రం’ సినిమాలో ఎంతో కష్టపడి తయారు చేసిన ఓడను షావుకారు తీసుకెళుతున్నప్పుడు ‘ఓడా.. నువ్వెళ్లిపోకే..’ అంటూ వంగపండు కలం కన్నీరు పెడితే, ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. అలానే మాదాల రంగారావు, టి.కృష్ణ, దాసరి సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో పాటలు రాశారు వంగపండు. నాలుగైదు సినిమాల్లో నటించారు కూడా. వంగపండు జనం మనిషి. అందుకే ‘ఏం పిల్లడో పోయి వస్తవా..’ అంటూ వంగపండు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. ఆయన మృతి పట్ల ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. -
ఏం పిల్లడో.. మళ్లీ వస్తవా..?
పాటెళ్లిపోయింది... ఉత్తరాంధ్ర ఉద్యమానికి ఊపిరులూదిన గళం.. మూగబోయింది. అక్షరానికి గజ్జెకట్టి.. లక్షల హృదయాల్ని కొల్లగొట్టిన స్వరం.. ఆగిపోయింది. సిక్కోలు మాండలికానికి మాణిక్యంగా మారిన పాట.. వెళ్లిపోయింది. తూరుపు కనుమల్లో ఊపిరిపోసుకున్న పాటల సూరీడు అస్తమించాడు.. మట్టివాసనని విశ్వానికి పరిచయం చేసిన ప్రజాగాయకుడు మట్టిలో కలిసిపోయాడు. ఏం పిల్లడో మళ్లీ వస్తవా– అంటూ జనగళం విషాద స్వరంతో అడుగుతోంది. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా..సికాకుళంలో చీమలన్నయట..ఏం పిల్లడో వెల్దమొస్తవా’ ఈ పదాలు చాలు ఆయన్ని పరిచయం చేయడానికి. సిక్కోలు నక్సల్బరి ఉద్యమాన్ని తన గీతాలతో ఉరకలెత్తించిన గాయకుడు. తన ఇంటి పేరు జానపదానికి బ్రాండ్‌నేమ్‌గా మార్చుకున్న ఉద్యమ కారుడు. ఆయనే వంగపండు. పూర్తి పేరు వంగపండు ప్రసాదరావు అయినా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ప్రపంచంలో ఏ మూలకెళ్లినా వంగపండుగానే చిరపరిచితులు. తాను నమ్మిన సిద్ధాంతాలకు.. విలువలకు కట్టుబడి జీవనపోరాటం సాగించిన ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం. విజయనగరంలో పుట్టినా.. ఇక్కడే జీవితం... విజయనగరం జిల్లాలో వంగపండు పుట్టినా.. సింహభాగం విశాఖలోనే గడిపారు. షిప్‌యార్డులో పనిచేశారు. ఆంధ్రావర్సిటీ థియేటర్ ఆఫ్ ఆర్ట్సులో గౌరవ ఆచార్యునిగా సేవలందించారు. ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ కావడంతో బొబ్బిలి లో ఐటీఐ చేసి.. తండ్రితో కలిసి వ్యవసాయం చేశారు. ఊళ్లలో మాట్లాడుకునే పల్లెపదాలతో తోచిన బాణి కట్టుకుని పాడుతుంటే.. ఊళ్లల్లో అందరూ ’ఒరేయ్ కవి’అని వంగపండుని పిలుస్తూ.. జానపద లొల్లాయి గీతాలను పాడించుకునే వారు. అయితే వివాహమైన రెండేళ్లకు మొదలైన నక్సల్బరి ఉద్యమం వంగపండు జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది. ఉద్యమమే ఊపిరిగా.. పాటే జీవితంగా.. వంగపండు... తుది శ్వాస విడిచే వరకూ ఉద్యమమే జీవితంగా... పాటే ఊపిరిగా జీవించారు. ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్‌గా ఉద్యోగం రాగానే అందులో చేరారు. కానీ... ఉద్యోగం కంటే ఉద్యమమే తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తోందంటూ ప్రతి రోజూ సహచరులతో చెప్పేవారు. అందుకే పదిరోజులు పనికెళ్లడం.. 20 రోజులు ఉద్యమాల్లో పాల్గొనడం చేసేవారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాలన్నీ తిరిగారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా.. ఆరేళ్లకు పైగా సర్వీసు ఉన్నా షిప్‌యార్డు ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పాటే ఊపిరిగా పనిచేశారు. సినిమా ఛాన్సులు వచ్చినా... జనాల్ని ఉత్తేజపరిచే వంగపండు జానపద గీతాలు సినిమా వాళ్లని కూడా ఆకట్టుకున్నాయి. అభ్యుదయకారులైన టి. కృష్ణ, ఆర్.నారాయణమూర్తిలతో పాటు ఎంతోమంది తమ సినిమాలకు పాటలు రాయమని ఒత్తిడి తీసుకొచ్చేవారు. దర్శకుడు టి. కృష్ణ అయితే వంగపండు ఇంటికి స్వయంగా వచ్చి పాట రాయించుకునేవారంటే.. ఆయన జానపదం అంటే.. సినిమాకు ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సుమారు 30 సినిమాల్లో జనాల్ని ఉత్తేజ పరిచే గీతాల్ని రాశారు. అదేవిధంగా ఆరేడు సినిమాల్లోనూ వంగపండు నటించారు. అనేక సినిమాల్లో కూడా పాటలు రాసే అవకాశాలొచ్చినా జననాట్యమండలి నిబంధనలకు కట్టుబడి వదులుకున్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతాల్ని పక్కన పెట్టి.. సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి పాటలు రాసి ఉంటే.. ఆయన జీవితం మరోలా ఉండేదేమో.. శివుడంటే ఇష్టం.. కానీ.. నాస్తికుడు వంగపండుకు శివుడంటే ఇష్టమని చెప్పేవారు. ఎందుకంటే.. సాధారణ జీవితం గడిపేవాడు కాబట్టి అని అనేవారు. కానీ.. ఆయన ఏనాడు శివాలయానికి వెళ్లలేదు. శివుణ్ణి పూజించలేదు. ఎందుకంటే.. వంగపండు నాస్తికుడు. తనకు జన్మనిఇచ్చిన తల్లిదండ్రుల్నే దైవాలుగా భావించేవారు. ఆ తర్వాత కొలిచే దైవం జానపద కళ మాత్రమే. మానవత్వమే నిజమైన దైవత్వమని వంగపండు విశ్వసించారు. తోటి వారికి సాయపడే గుణమున్న ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం ఉందని ఎప్పుడు వంగపండు అనేవారు. పాటకు ప్రపంచవ్యాప్తంగా పట్టాభిషేకం... వంగపండు 400కుపైగా జానపద గీతాలు రాసారు. వాటిలో 200కు పైగా గీతాలు వంగపండుకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఆయన పాటలన్నీ గిరిజన భాషల్లోనే కాదు. దేశంలోని అనేక భాషల్లోకి అనువదించారు. ముఖ్యంగా ...ఏం పిల్లో ఎల్దమొస్తవ పాటని అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో ఇంగ్లిష్ భాషలోకి తర్జుమా చేసి మరీ పాడుకున్న చరిత్రను సొంతం చేసుకుంది. అదేవిధంగా.. జజ్జనకరి జనారే..యంత్రమెట్టా నడుస్తున్నదంటే.. మొదలైన పాటలు అన్ని వర్గాల ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. కర్షకుల కష్టాన్ని.. కార్మికుల శ్రమనీ.. పేదోడి ఆకలినీ.. గిరిజనుల దుర్గతినీ.. వలస బతకుల్నీ... మొత్తంగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని తన పాటతో ప్రపంచానికి పరిచయం చేసిన వంగపండు కీర్తి విశ్వవ్యాప్తమైంది. ఆయన మరణంతో జానపద గళం మూగబోయినా.. ఆయన స్ఫూర్తితో ఉత్తరాంధ్ర గడ్డపై పురుడు పోసుకున్న ప్రతి కలంలోనూ, గళంలోనూ వంగపండు సాహిత్యం సందడి చేస్తుంటుంది.. మోగే గజ్జెల సవ్వడిలో ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది. – సాక్షి, విశాఖపట్నం పేరు: వంగపండు ప్రసాదరావు జననం: 1943 జూన్ పుట్టిన ఊరు: విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లి తల్లిదండ్రులు: జగన్నాథం, చినతల్లి కుటుంబం: ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు (వంగపండు పెద్దవాడు) విద్యాభ్యాసం: బొబ్బిలిలో ఐటీఐ ఉద్యోగం: హిందూస్థాన్ షిప్‌యార్డులో ఫిట్టర్, ఏయూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ గౌరవ అధ్యాపకుడు సినీప్రస్థానం: అర్థరాత్రి స్వాతంత్య్రంతో ప్రారంభం జననాట్యమండలి 1972లో స్థాపించారు. పీపుల్స్‌వార్ సాంస్కృతిక విభాగంగా దీన్ని స్థాపించారు. పేరు తెచ్చిన పాటలు: ఏం పిల్లో ఎల్దమొస్తవ, జజ్జనకరి జనారే, తరమెల్లిపోతున్నాది, ఓడ నువ్వెల్లిపోకే... పేరు తెచ్చిన నత్యరూపకం: భూమిబాగోతం అవార్డులు: 2017లో ఏపీ ప్రభుత్వం తరఫున కళారత్న పురస్కారం; 2008లో బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ పురస్కారం; సుద్దాల అశోక్‌తేజ అవార్డు, నంది అవార్డు, తానా నుంచి రంగస్థల రత్న అవార్డు -
రేపటిరోజు మీదే అని శ్రీశ్రీ అన్నారు – గద్దర్
బావ అంటే బావ అనుకునే పరిచయం నాది, వంగపండుది. అది ఎలా అయిందో చెబుతాను. 50 ఏళ్ల క్రితం వంగపండు ప్రసాదరావుతో పరిచయం జరిగింది. నక్సల్బరి ఉద్యమంలో మా ఇద్దరి స్నేహం బలపడింది. నేను ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి అప్పుడప్పుడే కాలు పెడుతున్న సమయం అది. అక్కడ అప్పటికే వంగపండు చాలా ఫేమస్. బొబ్బిలిలో ప్రదర్శన ఇవ్వటం కోసం వెళ్లాం. స్టేజి మీద ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే సమయానికి పోలీసులు వచ్చారు. అప్పుడు నేను ఆ ప్రాంతానికి కొత్త. ‘ఒరేయ్ బావా.. నీ గొంగళి, గజ్జెలు ఇడిíసిపెట్టకు’ అని నాకు వంగపండు చెప్పిండు. ఆయన వెనక ఆయన దారిలోనే పోయాను. అక్కడ ఓ పోలీసాయన ఆపితే ‘మేమేం చేశాం, పాట పాడుతున్నాం. అంతేకదా’ అని ఎదురు తిరిగి వాదన పెట్టినాడు. ఆయన నా వైపు చూసి ‘వీడెవడు’ అని అడిగాడు. అప్పుడు ప్రసాద్ తడుముకోకుండా ‘మా బావ’ అన్నాడు. అలా అక్కడినుండి తప్పించుకుని లాడ్జ్‌కి పోయాము. అక్కడ మహాకవి శ్రీశ్రీ ఉన్నారు. అప్పుడు శ్రీశ్రీగారు మమ్మల్ని ఉద్దేశించి ‘నేను ఎక్కడికి వెళ్లలేకపోయానో మీ పాటతో మీరు అక్కడికి చేరారు. రేపటి రోజు మీదేరా’ అన్నారు. అంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఏముంటుంది? అప్పుడు మా బావ శ్రీకాకుళం యాసలో శ్రీశ్రీగారితో ‘ప్రోగ్రామ్ పోయినాదండి’ అన్నాడు. నేను నవ్వుతుంటే ‘ఏంట్రా బావా..∙నవ్వుతున్నావు’ అని నన్ను చూసి చమత్కరించాడు. మా ఇద్దరినీ చూసి మీ కాంబినేషన్ బావుందని శ్రీశ్రీగారు అన్నారు. ‘మీ ఇద్దరూ ఉండగా మీటింగ్ ఎలా అయిపోద్ది, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం’ అని మూడు తెల్లపేపర్లు తెప్పించారాయన. అందులో నక్సలైట్లు, దేశభక్తులు అని రాసి మా మెడలో వేసి ఆయన కూడా ఒకటి తగిలించుకుని ‘ఇక పదండి పోదాం’ అని బయలుదేరారు శ్రీశ్రీగారు. మాతో పాటు భూషణం అనే రచయిత, చలసాని ప్రసాద్ తదితరులు ఉన్నారు. అక్కడికెళ్లేసరికి స్టేజ్ లేదు, కూలిపోయింది. అక్కడ ఏ స్టేజ్ లేకపోయినా వంగపండు ‘ఏం పిల్లో ఎల్దమొస్తవా’ అంటూ ముందు బయలుదేరితే మేమంతా ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా...’ అంటూ కోరస్ పాడుతూ ఆయన్ను ఫాలో అయ్యాం. అప్పటివరకు చెల్లాచెదురైన జనమంతా మా పాటలో కలిశారు. భావం భౌతికశక్తిగా మారినప్పుడు అది దిశను ఇస్తుంది. పాలకవర్గాల రాజకీయ అధికారం పౌరసమాజం భావాల్లో ఉంటుంది. ఆ భావాలను మార్చటమే కవి, వాగ్గేయకారుడు, కళాకారుడు చేయాల్సిన పని. మా బావ ఆ పనిని చక్కగా చేశాడు. మేం పాడని పాటలేదు, ఆడని ఆట లేదు. వరంగల్‌లో పన్నెండు లక్షలమందిని పొద్దుగాల నుండి తెల్లారే వరకు కూర్చోపెట్టగలిగామంటే పాట భౌతికశక్తిగా మారింది. సినిమా పరిశ్రమలో ఆర్. నారాయణమూర్తి మాతో ఎన్నో పాటలు రాయించి, మా వేలు పట్టుకు నడిపించారు. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...’ అనగానే గుండెకు హత్తుకుని నీవు రాయవే.. నా సినిమాలో ఈ పాట పెడదాం అని భరోసా ఇచ్చే మనిషి ఎవరుంటారు? నారాయణమూర్తి మాకు భరోసా ఇచ్చారు. వంగపండుకు కూడా తన సినిమాలన్నిటిలో అవకాశం ఇచ్చి ఈ రోజు వంగపండు పాటను ప్రపంచం మొత్తానికి వినపడేలా చేశారాయన. తెలుగు అక్షరం ఉన్నంతవరకు వంగపండు పాట ఉంటుంది, వంగపండు ఉంటారు. ప్రజల యాసలో జీవితాన్ని పలికించారు.. చిన్న చిన్న పదాలతో, ప్రకృతిలో కనిపించే పశుపక్ష్యాదులతో, ప్రజల భాషలోని యాసతో జీవితత్వాన్ని చెప్పారు. శ్రీకాకుళ ఉద్యమం తరువాత తెలంగాణ బాట పట్టిన వంగపండు జగిత్యాల జైత్రయాత్రతో సహా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1990లో నిజాం కళాశాలలో జరిగిన జననాట్యమండలి బహిరంగసభలో వంగపండు ఆట, పాటలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. -
వంగపండు మృతికి ‘తానా’ సంతాపం
ఉత్తరాంధ్ర జానపద కాణాచి, ప్రజా వాగ్గేయా కళాకారుడు వంగపండు ప్రసాదరావు(77) మృతికి తానా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సంతాపం ప్రకటించింది. ప్రసాదరావు ఆకస్మిక మరణం కళా రంగానికి తీరని లోటని పేర్కొంది. మే 31న ప్రారంభమైన తానా ప్రపంచ సాహిత్య వేదికకు వంగపండు ముఖ్య అతిధిగా హాజరై తమ బృందంతో అంతర్జాలంలో అద్భుతమైన పాటలు పాడి అందరిని అలరించారని తానా ప్రతినిధులు తెలిపారు. అదే ఆయన చివరి కార్యక్రమం కావడం దురదృష్టకరమని అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర సంతాపం తెలియజేశారు. అదే విధంగా ప్రసాదరావు మృతికి అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పంతాపం ప్రకటించింది. ఆయనకు 2017లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జానపద కళారత్న అవార్డును అందజేశామని అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర తెలిపారు. -
పార్వతీపురంలో వంగపండు అంత్యక్రియలు
-
చైతన్య స్ఫూర్తిని కోల్పోయాం: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్టణం : సమకాలీన ప్రపంచంలో జానపదానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి కళారంగానికి తీరని లోటని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వంగపండు మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దశాబ్దాల తరబడి కళాసేవ చేస్తూ, జానపదాలతో ప్రజల గొంతుకను వినిపించిన వంగపండు, ప్రజల మదిలో చిరకాలం నిలిచి ఉంటారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భవగవంతుడుని ప్రార్ధించారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) జానపద రంగానికి తీరని లోటు: ఆళ్లనాని విప్లవకవిగా తెలుగు రాష్టాల్లో పేరు పొందిన వంగపండు ప్రసాద్ రావు మృతి అత్యంత బాధాకరమని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఉత్తరంద్ర జానపదాలకు గజ్జ కట్టి పాడిన వంగపండు మరణం ఈ రాష్ట్రములో జానపద రంగానికి తీరని లోటు. ఆయన వందలాది జానపద పాటలను రచించారు. తనపాటలతో పల్లెకారులతో పాటు గిరిజనులను చైతన్య పరిచారు. 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు. మూడు దశబ్దాలల్లో 300పాటలు రచించారు. వంగపండు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకుప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని మంత్రి ఆళ్లనాని అన్నారు. వంగపండు మృతి తెలుగు రాష్టాలకు తీరని లోటు: జర్నలిస్టు ఫోరం వంగపండు మృతిపై విశాఖ జర్నలిస్టు ఫోరం సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి దుర్గారావు మీడియాతో మాట్లాడారు. 'ప్రముఖ వాగ్గేయ కారుడు వంగపండు ప్రసాదరావు మృతి తెలుగు రాష్టాలకు తీరని లోటు. కళాకారుడుగా వంగపండు ప్రస్థానం ప్రసంశనీయం. నిరంతరం సమాంము కోసమే ఆయన తన ఆటపాటతో ముందుకు సాగారు. ప్రజా సమస్యలను తన పాటల రూపంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించే గొప్ప వాగ్గేయకారుడు. తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం నింపిన వ్యక్తి వంగపండు. ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. వంగపండు మరణం యావత్ తెలుగు ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాము' అని అన్నారు. (చంద్రబాబుకు మతి తప్పింది) -
ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతి: సీఎం జగన్
-
అనంత లోకాలకు...ఏం పిల్లడో..
-
ఆయన పాటలోనే సామాజిక చైతన్యం ఉంది
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వంగపండు ప్రసాదరావు సాంస్కృతిక రంగానికి ఓ ఆణిముత్యం. అలాంటి ఆణిముత్యం భౌతికంగా దూరం కావడం బాధాకరం. వంగపండు పాటలోనే సామాజిక చైతన్యం ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. గుంటూరు: ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. వంగపండు మృతికి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన కళాకారుడు వంగపండు. ఆయన విజయనగరం జిల్లా వాసి కావడం తెలుగువారికి గర్వకారణమన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో వంగపండు ప్రజల్లో చైతన్యం నింపారని, దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తన పాటలతో వినిపించిన గొప్ప కళాకారుడని తెలిపారు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ఉర్రూతలూగించి.. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఒక మేరుశిఖరంగా వంగపండు నిలిచిపోతారని లక్ష్మణరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర గళం వంగపండు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. వందలాది జానపద గేయాలతో అయన ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారని వంగపండు కుటుంబ సభ్యులకు లక్ష్మణరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. (ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది: నారాయణమూర్తి) -
ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది: నారాయణమూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మరణం సమాజానికీ తీరని లోటని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయనని ఉత్తరాంధ్ర సంతకం అని గొల్లపూడి మారుతీరావు కొనియాడారు. పార్వతీపురం మహాసభలో మహాకవి శ్రీశ్రీ మాట్లాడుతూ నిజమైన ప్రజాకవి నేను కాదు వంగపండు ప్రసాదరావు, గద్దర్ అన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) వంగపండు నా అర్ధరాత్రి స్వతంత్య్రం సినిమాలో గొప్ప పాటలు రాశారు, పాడారు, నటించారు. తర్వాత కూడా నా అనేక చిత్రాలకు ఆయన పాటలు రాశారు. నా చిత్ర విజయాలకు అయన పాటలు ఎంతో దోహదం చేశాయి. దాసరి నారాయణరావు, టీ కృష్ణ, మాదాల రంగారావు సినిమాలతో పాటు అనేక చిత్రాలకు పాటలు రాశారు. ఆయన మరణంతో ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు, సాహిత్య లోకానికే కాదు.. పీడిత ప్రజానీకానికి, సమాజానికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. (వంగపండు మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం) ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం ఉత్తరాంధ్రకు తీరని లోటని మిధునం సినిమా నిర్మాత ఆనంద్‌రావు అభిప్రాయపడ్డారు. అతని పాట వింటే ఊపు వస్తుందని..పేద ప్రజల గుండెచప్పుడు ఆ పాటలో కనిపిస్తుంది. ప్రజల కష్టాలను పాట రూపంలో ఓదార్చిన వ్యక్తి వంగపండు. అలాంటి ప్రజా గాయకుడు మళ్ళీ ఈ తరంలో కనిపిస్తారా. తన చిన్నతనంలో వంగపండు పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహాన్ని పొందేవాడినని నిర్మాత ఆనంద రావు అన్నారు. -
వంగపండు మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు ప్రసాదరావు మృతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘పామును పొడిచిన చీమలున్నా’యంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఓ మహాశిఖరంగా ఆయన నిలిచిపోతారు. వంగపండు మృతిపట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారు: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వంగపండు ప్రసాదరావు మృతికి సంతాపం ప్రకంటించారు. ‘ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు గారు మృతి తీరని లోటు. ఈ తెల్లవారుజామున మనల్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది. వందలాది జానపద గేయాలతో ఆయన ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ ట్వీట్ చేశారు. గొప్ప కళాకారుడు వంగపండు: డిప్యూటీ సీఎం ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతికి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన కళాకారుడు వంగపండు. ఆయన విజయనగరం జిల్లాలో మా ప్రాంత వాసి కావడం మా అందరికి గర్వకారణం. తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం నింపారు. 5 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తన పాటలతో వినిపించిన గొప్ప కళాకారుడు వంగపండు. ఆయన ఉత్తరాంధ్ర గళం. ఆయన మరణం యావత్ ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు. ఆయన కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి: తానేటి వనిత వంగపండు ప్రసాదరావు మృతికి మంత్రి తానేటి వనిత సంతాపం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వంగపండు తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో ప్రజల్లో ఎంతో చైతన్యం కల్పించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి