Waka Manjula Reddy
-
సమాజాన్ని అద్దంలో చూపించాను
‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ పేరుతో తన జర్నలిస్ట్ జీవితాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించారు అరుణా రవికుమార్. ముప్ఫై ఎనిమిదేళ్ల కిందట ‘అరుణా అశోకవర్ధన్’ పేరుతో తొలిసారి బైలైన్ చూసుకోవడం నుంచి నేటి వరకు సాగిన అక్షరయానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘నేను మీడియా రంగంలోకి రావడమే ఒక ఆశ్చర్యం. నా చదువు ఇంగ్లిష్ మీడియంలో, గ్రాడ్యుయేషన్ సైన్స్‌లో సాగింది. అమ్మ రచయిత కావడంతో తెలుగు సాహిత్యం మీద అభిరుచి మెండుగా ఉండేది. నా లక్ష్యం సివిల్స్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ పరీక్షల నాటికి తాతగారు పోవడంతో రాయలేకపోయాను. ఆ తర్వాత అనుకోకుండా ఓ ఇంగ్లిష్ పత్రికలో జర్నలిస్టుగా చేరాను. నా తొలి రిపోర్టింగ్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ రిపోర్ట్ మీద. బై లైన్‌తో వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు, ప్రపంచ విజేతనైన భావన. అలా మొదలైన నా జర్నీ ఎలక్ట్రానిక్ మీడియాకు మారింది. తెలుగులో ప్రైవేట్ టీవీ రంగంలో రిపోర్టర్ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళను. పెళ్లి చేసుకున్న తర్వాత విజయవాడకు బదిలీ కావడం కూడా చాలా కీలకమైన అనుభవాన్నిచ్చింది. అది 1988, మార్చి నెల పదవ తేదీ. విజయవాడ వెళ్లిన తొలి రోజు, దేవినేని మురళి హత్య. సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఓ కుర్రాడు పరుగున లోపలికి వచ్చి షట్టర్ వేసేశాడు. భయం కలిగినప్పటికీ నిబ్బరంగా ఉండిపోయాను. ఓ అరగంట తర్వాత షట్టర్ తీశారు. రోడ్డు మీదకు వస్తే... అంతకు ముందు ఏమీ జరగనట్లు తుపాను తర్వాత ప్రశాంతతలా ఉంది వాతావరణం. జర్నలిస్టుగా కొత్త ప్రపంచాన్ని చూశాను. చీరాలలో చేనేతకారుల ఆకలి చావులను రిపోర్ట్ చేయగలిగాను. సమాజంలో వేళ్లూనికొని ఉన్న ఆవేదనలు, ఆందోళనలకు అద్దం పట్టాను. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టు సాంబశివుడి ఇంటర్వ్యూ చేశాను. ఎలిమినేటి మాధవరెడ్డి గారి హత్యకు కొద్దిగా ముందు ఆయనతోపాటు వారి వాహనంలోనే ప్రయాణించాను. అప్పటికే రెక్కీ నిర్వహించి హత్యకు ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆ తర్వాత నాకు తెలిసింది. బళ్లారిలో ఎన్నికలను కవర్ చేశాను. భ్రూణహత్యల మీద పరిశోధనాత్మక కథనాలకు యూనిసెఫ్ అవార్డు వచ్చింది. స్టూడియో లో ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలు ఎన్ని చేసినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలనా కథనాలు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. ఫ్లోరోసిస్ బాధితుల కథనాలకు స్పందనగా ప్రభుత్వాలు నీటి సౌకర్యాన్ని కల్పించడం రిపోర్టర్‌గా నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భం. లంబాడా తండాల్లో ఆడపిల్లలను పుట్టగానే చంపేయడం, కుటుంబాన్ని పోషించడానికి ఓ మహిళ మూడుసార్లు సరోగసీ ద్వారా బిడ్డను కని అనారోగ్యం పాలు కావడం వంటి కథనాలెన్నింటికో నేను అక్షరసాక్షిని కావడం ద్వారా నాకు ఈ రంగం ఎంతో సంతృప్తినిచ్చింది. మా వారి బదిలీల రీత్యా, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ల చదువులు కీలక దశల్లో ఉన్నప్పుడు కెరీర్లో విరామాలు తీసుకుంటూ నా వృత్తిని కొనసాగిస్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ‘మరాడర్స్ ఆఫ్ హోప్’ నా తొలి రచన. ‘దేర్ ఐ వజ్, మీడియా మ్యూజింగ్స్’ నా రెండవ రచన. ఇండిపెండెంట్ జర్నలిస్టుగా హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికీ రోజూ చదువుతాను, రాస్తుంటాను. మహిళ ఎన్ని సాధించినప్పటికీ సమాజంలో సమానత్వం మాత్రం పూర్తిస్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో సమాజంలో స్త్రీ–పురుషుల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత తీవ్రంగా లేదు. కానీ సమానత్వం మాత్రం ఇంకా రాలేదు’’ అంటూ తన అక్షరయానం గురించి వివరించారు అరుణ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్‌కుమార్ మోర్ల -
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్‌లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్‌లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్‌మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్‌లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి -
Chennamadhavuni Ashok raj: విశ్రాంతి ఉద్యోగానికే... జీవితానికి కాదు!
ప్రతిరోజూ మనదే. ప్రతిరోజునీ శ్వాసించాలి. ప్రతిరోజునీ ఆఘ్రాణించాలి. ప్రతిరోజునీ ఆస్వాదించాలి. ప్రతిరోజుకీ జీవం ఉండాలి. అప్పుడే... జీవితం జీవంతో ఉంటుంది. సంతోషాల సుమహారమవుతుంది. ‘బోర్ కొడుతోంది’ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి ముని పెదవుల మీద ఉంటుందీ మాట. పిల్లలను బోర్డమ్ నుంచి బయటేయడం సులువే. కానీ రిటైర్ అయిన వాళ్లను వేధించే బోర్‌డమ్‌కు పరిష్కారం ఎలా? వయసు పై బడేకొద్దీ... అలవాటు పడిన జీవితం నుంచి కొద్దిపాటి మార్పును కూడా స్వీకరించలేని మొండితనం ఆవరించేస్తుంటుంది. ఆ మొండితనం నుంచి బయటపడలేక అవస్థలు పడే వార్ధక్యానికి ఓ సమాధానం చెన్నమాధవుని అశోక్‌రాజు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల దగ్గరకు వెళ్లిన తల్లిదండ్రులు ‘మేమక్కడ ఉండలేక΄ోయాం. బోర్ కొట్టి చచ్చాం. ఒక్క రోజు ఒక్క యుగంలా గడిచింది’ అనే వాళ్లకు సమాధానంగా అశోక్‌రాజు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. కలప కరెంట్ స్తంభాలు ‘‘మేము హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో విశ్రాంత జీవనం గడుపుతున్నాం. యూఎస్‌లోని రెడ్మాండ్లో మా పెద్దమ్మాయి, అల్లుడు, మనుమరాలు ఉన్నారు. గడచిన ఏడాది నేను, మా ఆవిడ వీణారాణి... పెద్దమ్మాయి దగ్గరకు వెళ్లి ఆరు నెలలు ఉండి డిసెంబర్లో ఇండియాకొచ్చాం. టూర్లో భాగంగా... యూఎస్‌లో టకోమా – సియాటెల్ ఎయిర్΄ోర్ట్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన రెడ్మాండ్కు చేరుకున్నాం. రోడ్డు వెడల్పుగా, ఇరువైపులా నిటారుగా పెరిగిన చెట్లతో పచ్చగా ఉన్నాయి పరిసరాలు. కర్రలతో నిర్మించిన ఇళ్లు చూడముచ్చటగా ఉన్నాయి. ఇంటి చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లతో అడవిమధ్యలో ఇల్లు కట్టినట్లు ఉంది. ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు, విద్యుత్ స్తంభాలుగా కూడా కలపనే వాడతారు. బాగా ఎత్తుగా పెరిగిన చెట్లను కరెంట్ స్తంభాలుగా ఉపయోగిస్తారు. పైన్ లేక్, లేక్ వాషింగ్టన్, స్నో క్యూలమిన్ ఫాల్స్, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను చూశాం. ఓపెన్ ప్లేస్ మేరిమూర్ పార్క్‌లో సినిమా చూడడం మాకు విచిత్రమైన అనుభూతి. మన దగ్గర ఉన్నట్లు క్లోజ్డ్ థియేటర్ కాదది. బహిరంగ ప్రదేశంలో లాన్లో కుటుంబాలతో కూర్చుని స్నాక్స్ తింటూ, కూల్డ్రింకులు తాగుతూ సినిమా చూస్తుంటారు. పాశ్చాత్యంలో మన పతంజలి యోగ మెక్సికోలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం కంకూన్కెళ్లాం. అక్కడ క్లౌన్ ΄్యారడైజ్ క్లబ్... ఐదు వందలకు పైగా గదులున్న పెద్ద హోటల్. యూఎస్, కెనడా, బ్రెజిల్, యూకే నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. మన దగ్గర ఫైవ్‌స్టార్ హోటళ్లలో జిమ్లుంటే... అక్కడ అతిథుల కోసం డెయిలీ రొటీన్లో యోగసాధన కూడా ఉంది. అక్కడి శిక్షకులు పతంజలి యోగ పుస్తకాన్ని ఆధారం చేసుకుని స్పానిష్ భాషలో వివరిస్తున్నారు. థియరీని మక్కీకి మక్కీ నేర్చుకుని అర్థమైనంతలో సాధ్యమైనంత వరకు ఆచరణలో పెడుతున్నారని అర్థమైంది. నాకున్న ముప్పై ఏళ్ల యోగ సాధన అనుభవంతో సీనియర్ సిటిజెన్ కోసం ఆరు రోజుల కోర్సు డిజైన్ చేసి నేర్పించాను. పవన ముక్తాసనం, మకరాసనం, సర్పాసనం, వజ్రాసనం, భుజంగాసనం, సూర్య నమస్కారాలతోపాటు ్రపాణాయామం, భస్త్రిక సాధనను కూడా వాళ్లు వీడియో తీసుకుని ఇకపై ఇలాగే సాధన చేస్తామని చె΄్పారు. పర్యటన కోసం అక్కడికి వెళ్లిన భారతీయులకంటే పాశ్చాత్యులు, అక్కడ స్థిరపడిన భారతీయులు యోగసాధన పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. శంకర నేత్రాలయ కోసం దాండియా యూఎస్ పర్యటనలో కొన్ని రోజులు అట్లాంటాలో గడిపాం. అట్లాంటాలో ఉన్న రోజుల్లో నేను రోజూ జేమ్స్ క్రీక్ క్లబ్లో యోగసాధన చేసేవాడిని. అక్కడి వారి కోరిక మేరకు యోగాతోపాటు విపస్సన ధ్యాన ప్రక్రియ కూడా నేర్పించాను. అక్కడ ఉద్యోగ, వ్యాపారాల్లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు యోగ సాధన చేయాలని ఉన్నప్పటికీ టీచర్ లేక΄ోవడంతో ్రపాక్టీస్ చేయలేక΄ోయేవారు. ‘అట్లాంటా విజిటర్స్ అసోసియేషన్’ వాట్సాప్ గ్రూప్‌లో కనెక్ట్ అయ్యాం. అక్కడ చాలా విశాలమైన కమ్యూనిటీ హాల్ ఉంది. అందులో సమావేశపరిచి యోగ, విపస్సన నేర్పించాను. వీటన్నింటికంటే నాకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం ఏమిటంటే... సియాటెల్‌లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో నవరాత్రి సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ్ర΄ోగ్రామ్లో పాల్గొనడం. ఎందుకంటే అది మనదేశంలో పేదవారికి ఉచితంగా వైద్యం అందించే సేవాసంస్థ ‘శంకర్ నేత్రాలయ’ కోసం ఫండ్ రైజింగ్ ్ర΄ోగ్రామ్. పాశ్చాత్య గడ్డ మీద మన భారతీయులతో కలిసి దాండియా నాట్యం చేయడం, విదేశీయులకు నేర్పించడం, అది కూడా ఒక సామాజిక ప్రయోజనం కోసం కావడం నాకు సంతోషాన్నిచ్చింది. మనం ఎక్కడ ఉన్నా సరే... రోజును ఉపయుక్తంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని నమ్ముతాను. అదే ఆచరణలో పెడతాను. పని... చేసే వారికి ఎదురొస్తుంది! ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. పెద్దమ్మాయి అమెరికా, చిన్నమ్మాయి ఆస్ట్రేలియాలో స్థిరపడడంతో రెండేళ్లకోసారి ఒక్కో అమ్మాయి దగ్గరకు వెళ్లడం అలవాటు చేసుకున్నాం. ఎక్కడ ఉన్నా నాకు బోర్ అనే మాట నా దగ్గరకు చేరదు. ఎందుకంటే మనిషి సంఘజీవి. ఏ సంఘంలో ఉంటే ఆ సంఘంతో మమేకమై జీవించాలనేది నా ఫిలాసఫీ. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడి వాళ్లతో కలిసి కమ్యూనిటీ ఫార్మింగ్ చేశాను. మా చిన్నల్లుడి సహకారంతో అక్కడి లైబ్రరీలో తెలుగు పుస్తకాలు పెట్టే ఏర్పాటు చేయగలిగాను. మనం ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేయడానికి సిద్ధంగా ఉంటే చాలు. అక్కడ మన అవసరం ఏమిటో, మనం మాత్రమే చేయగలిగిన పని ఏమిటో మనకు కనిపించి తీరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే పని మనకు ఎదురొస్తుంది. అలా ఒక వ్యాపకంలో నిమగ్నమైతే చాలు. మన వల్ల మరొకరికి ప్రయోజనమూ కలుగుతుంది. మనకు రోజు నిర్వీర్యంగా గడిచి΄ోకుండా ఉపయుక్తంగా గడిచిన సంతోషమూ కలుగుతుంది’’ అన్నారు చెన్నమాధవుని అశోక్‌రాజు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Madhavi Kattekola: జై జవాన్‌కు టిఫిన్ బాక్స్
సమాజానికి మంచి ఆహారాన్నివ్వాలనుకుంది. ఖాద్యమ్... పేరుతో తినదగిన ఆహారాన్నిస్తోంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లోనూ నిరూపించుకుంది. దేశ రక్షణ కోసం కొండల్లో గుట్టల్లో డ్యూటీ చేసే సైన్యానికి మంచి ఆహారాన్నిచ్చే బాధ్యత చేపట్టింది. ఈ సందర్భంగా కట్టెకోల మాధవి విజయగాథ. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి అనుమతి సాధించారు ఓ తెలుగు మహిళ. ఈ అనుమతి సాధించడానికి ముందు ఆమె ఆహారం మీద అంతులేని పరిశోధన చేశారు. భూమిలో నాటే గింజ నుంచి పంట దిగుబడి, దినుసులను ప్రాసెస్ చేయడం, వండి చల్లార్చి డబ్బాల్లో ప్యాక్ చేయడం వరకు ప్రతిదీ ఒక చేతి మీదుగా నడిచినప్పుడే నిర్దేశించిన ప్రమాణాలను పాటించగలమని నమ్ముతారామె. సేంద్రియ పంట, వంటను ఈ నెల న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో ప్రదర్శించి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న కట్టెకోల మాధవి. రైతులు విచిత్రంగా చూశారు! మాది సూర్యాపేట. నాన్న ఉద్యోగ రీత్యా నా చదువు మొత్తం హైదరాబాద్‌లోనే. నిజానికి నా చదువుకి, నేనెంచుకున్న ఈ రంగానికి సంబంధమే లేదు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి కొంతకాలం టీచర్‌గా, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. మా వారు మైక్రో బయాలజీ చేసి హిమాలయ సంస్థలో ఉద్యోగం చేశారు. నెలలో ఇరవై రోజులు క్యాంపుల ఉద్యోగం ఆయనది. జీవితం ఇది కాదనిపించేది. మన జ్ఞానాన్ని సరిగ్గా ఒకదారిలో పెడితే గొప్ప లక్ష్యాలను సాధించవచ్చనిపించింది. సొంతంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి 2009లో వచ్చాం. నాలుగేళ్లపాటు సమాజం అవసరాలేమిటి, అందుబాటులో ఉన్న వనరులేమిటి అని అధ్యయనం చేశాం. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం తప్ప అన్నీ ఉన్నాయని తెలిసింది. మేము 2014లో గ్రామాలకు వెళ్లి రైతులతో కొర్రలు పండిస్తారా అని అడిగినప్పుడు మమ్మల్ని వెర్రివాళ్లను చూసినట్లు చూశారు. కుగ్రామాలకు వెళ్లి మహిళలకు మా ఉద్దేశాన్ని వివరించాం. విత్తనాల నుంచి పంటకు అవసరమైన ఇన్పుట్స్ అన్నీ మేమే ఇస్తాం, మీరు పండించిన పంటను మేమే కొంటాం... అని భరోసా ఇచ్చాం. దాంతోపాటు వారు పండించే కంది పంట మధ్య చాళ్లలో చిరుధాన్యాలను పండించమని సూచించాం. ఒక కందిపంట సమయంలో చిరుధాన్యాలు మూడు పంటలు వస్తాయి. తమకు నష్టం ఏమీ ఉండదనే నమ్మకంతోపాటు మామీద విశ్వాసం కలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో మొత్తం 1350 మంది మహిళారైతులు మాతో కలిశారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2018లో కంపెనీ ఖాద్యమ్ని రిజిస్టర్ చేశాం. ఖాద్యమ్ అనే సంస్కృత పదానికి అర్థం తినదగినది అని. పంట నుంచి మా ప్రయోగాలు వంటకు విస్తరించాయి. వండి చల్లబరుస్తాం! ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలు యంత్రాల్లోనే తయారవుతాయి. ఉడికిన వెంటనే మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లడంతో వాటిలో ఉండే తేమ హరించుకుపోతుంది. ఇలా తయారైన ఆహారం ప్యాకెట్లలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడినీటిలో ముంచితే ఐదు నిమిషాల్లో ఇడ్లీ మెత్తగా మారుతుంది, సాంబార్, చట్నీలు కూడా అంతే. మేము కనుగొన్న విజయవంతమైన ఫార్ములా ఇది. పోహా నుంచి స్పగెట్టీ, పాస్తా వరకు ఒక ఇంట్లో అన్ని తరాల వారూ ఇష్టపడే రుచులన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. మొదట్లో రెడీ టూ కుక్ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాం. రోజూ వండి బాక్సు పట్టుకెళ్లడం కుదరని రోజుల్లో రెడీ టూ ఈట్ విధానాన్ని అనుసరించాం. ఆఫీస్‌కి టిఫిన్ బాక్స్ తేలిగ్గా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి మా ఉత్పత్తులు చాలా అనువుగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సైన్యం అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేయడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైసూర్లో ఉన్న డీఎఫ్ఆర్ఎల్కి ఎన్నిసార్లు వెళ్లామో లెక్క పెట్టలేం. యాభైసార్లకు పైగా వెళ్లి ఉంటాం. విమాన టిక్కెట్ల ఖర్చే లక్షల్లో వచ్చింది. సైంటిస్టులు సూచించిన నియమావళి ప్రకారం తయారు చేయడం, శాంపుల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్లు చెప్పిన సవరణలను రాసుకుని హైదరాబాద్ రావడం, మేడ్చల్ దగ్గర బండ మాదారంలో ఉన్న మా యూనిట్లో తయారు చేసి మళ్లీ పట్టుకెళ్లడం... ఇలా సాగింది. మా ప్రయోగాల గురించిన ప్రతి వివరాన్నీ నోట్స్ సమర్పించాం. జీవితంలో ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం, ఆ ప్రయాణంలో మేము లక్ష్యాన్ని చేరేలోపు ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బు రెండు కోట్లకు పైగా ఖర్చయిపోయింది. ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా దీక్షగా ముందుకెళ్లడమే ఈ రోజు విజేతగా నిలిపింది. ఏ– ఐడియా వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగానూ, మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ–కామర్స్ వేదికల మీద పన్నెండు దేశాలకు చేరుతున్నాయి. ఢిల్లీలో ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సు జరిగింది. అందులో స్టాల్ పెట్టమని ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడమే ఈ ప్రయత్నంలో మేము గెలిచామని చెప్పడానికి ఉదాహరణ’’ అని వివరించారు ఖాద్యమ్ కో ఫౌండర్ మాధవి. డీఎఫ్ఆర్ఎల్... డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ. కర్నాటక రాష్ట్రం మైసూర్లో ఉన్న ఈ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఒక విభాగం. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారికి నిల్వ ఉండే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. పర్వత ప్రాంతాలు, లోయలు, గడ్డకట్టే మంచులో ఉండే ఆర్మీ క్యాంపుల్లో విధులు నిర్వర్తించేవారికి తాజా ఆహారాన్ని అందించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వారి ఆకలి తీర్చేది... ముందుగానే వండి, శీతలపరిచి డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారమే. అలా నిల్వ చేసే ఆహారాన్ని తయారు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఆహారం నెలల కొద్దీ నిల్వ ఉండాలి, అందులో పోషకాలు లోపించకూడదు. – వాకా మంజులారెడ్డి ఫొటో : నోముల రాజేశ్ రెడ్డి -
సంకల్పమే సగం బలం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్’ (ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్ అందుకున్నారు. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్ నుంచి ‘ఐ విల్’ కోర్సు చేశారు. ‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్ క్లాసిక్’లో పాల్గొని ‘మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ విజేతనయ్యాను’’ అన్నారామె. ఉన్నది ఒకటే ఆప్షన్! మిసెస్ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ సూపర్ క్లాసిక్ ఫైనల్స్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దాదాపు ఇరవై సెషన్స్ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్‌లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్‌ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది. మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్ ఒక్కటే. ప్లాన్ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్లో ప్రజెంటేషన్స్ చాలా థియరిటికల్‌గా ఇచ్చాను. ఫైనల్ రౌండ్లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్ అప్ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను. ఇవే విజేతను చేశాయి! మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని. అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను. మహిళలు సాధించలేనిది లేదు! చంద్రయాన్ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్‌తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి. నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్‌ని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ. ప్రతి రోజూ అమూల్యమే! సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను. – డాక్టర్ విజయ శారదారెడ్డి మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
పండించారు... వడ్డించారు!
రైతుకు కొత్త నిర్వచనం కావాలి. వ్యవసాయానికి కొత్త అర్థం చెప్పాలి. మహిళ సాగు చేస్తే నేల పులకిస్తుంది. గాజుల చేతిలో గరిటే కాదు... నాగలి కూడా గర్వంగా చాలుదీరుతుంది. అనంతపురంలో మహిళలు ‘ఆదర్శసాగు’ చేస్తున్నారు. ఆరోగ్యం కోసం ఏం తినాలో ఎలా తినాలో నేర్పిస్తున్నారు. దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు. వినడానికి బావుంటుంది. దేశానికి కంచంలో అన్నంగా మారేది గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలే... కాబట్టి గ్రామానికి, రైతుకి అంతటి గుర్తింపు వచ్చింది. మరి అదే పొలం రైతుకి సమాధి అవుతుంటే వ్యవసాయం బతికి బట్టకట్టేదెలా? నాగలి కర్రు రైతు గుండెను చీలుస్తుంటే భూమిలో బంగారం పండేదెప్పుడు? రైతు వాణిజ్య పంటల మాయలో పడి అప్పుల పాలైతే ఆ రైతుని, ఎరువులతో కలుషితమైన ఆ భూమిని కాపాడేదెవరు? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే కసితో రైతు మహిళలు ఆ పనిని చేపట్టారు. భర్తను మింగేసిన పంటపొలాల్లోనే భవితను వెతుక్కుంటున్నారు. సంఘటితంగా వ్యవసాయం చేస్తూ దిగుబడితో లాభాలు కళ్ల చూస్తున్నారు. ఇది అనంతపురంలోని మహిళలు సాధించిన విజయం. వాళ్లకు దారి చూపిన భానుజ సంకల్పం. అనంతపురం జిల్లా, రూరల్ మండలం, కురుగుంట్ల గ్రామం. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలను చూసిన గ్రామం. ఇప్పుడు ఆ రైతు కుటుంబాల మహిళలు నిర్వహిస్తున్న రెస్టారెంట్‌ను చూస్తోంది. ఆ రెస్టారెంట్లో వంటకు అవసరమైన ధాన్యాలను పండిస్తున్న వ్యవసాయ క్షేత్రాలను చూస్తున్నారు. ఈ విజయాన్ని ‘చెరువు భానుజ’... సాక్షితో పంచుకున్నారు. ‘ఒంటరి’ పోరాటం! ‘‘భర్త వాణిజ్య పంటలతో నష్టాల ఊబిలో కూరుకుపోయి, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే... అగమ్యగోచరంగా, అచేతనంగా మిగిలిన వాళ్లకు అండగా నిలిచాను. సింగిల్ పేరెంట్‌గా పిల్లల పోషణ బాధ్యతను మోస్తున్న మహిళలే వీరంతా. భర్తను కోల్పోయిన వాళ్లకు తక్షణ సహాయం చేస్తూ, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం కోసం కార్యాలయాలకు వెళ్లి పని చేయించడం వరకు తోడుగా ఉంటున్నాను. అంతటితో ఆ కుటుంబం గట్టెక్కదు. ఉపాధి కావాలి, వాళ్లకు వచ్చిన పని వ్యవసాయమే. అయితే పొలం లేదు. దాంతో కలెక్టివ్ ఫార్మింగ్ కోసం పొలం లీజుకు తీసుకున్నాం. వ్యవసాయ క్షేత్రాలకు ‘పుడమి తల్లి, మన భూమి’ అని పేర్లు పెట్టుకుని సేద్యం మొదలు పెట్టాం. తక్కువ ఖర్చుతో పంట చేతికి రావడానికి మిల్లెట్స్ సాగు, ఏడాది పొడవుగా రాబడి కోసం కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నాం. మా ప్రయాణంలో అసలైన టర్నింగ్ పాయింట్ ఇక్కడే. పంటతో ఆపేయకుండా వంట కూడా మొదలుపెట్టాం. మార్కెట్ పుట్టింది! హరిత విప్లవంతో మనదైన సాగు కనుమరుగైంది. మిల్లెట్స్ సాగు మర్చిపోయాం, విత్తనాలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఇక ఈ వంటల గురించి ఈ తరానికి తెలియనే తెలియదు. ప్రభుత్వ సంస్థల సహకారంతో విత్తనాలు సేకరించాను. సేద్యం తెలిసిన మహిళలు కావడంతో సాగులో పెద్దగా ఇబ్బందులు రాలేదు. కానీ వీటిని ఎలా వండాలో నేర్పించడానికి మాస్టర్ షెఫ్‌లతో శిక్షణ ఇప్పించి మరీ కురుకుంట్లలో రెస్టారెంట్ పెట్టాం. రెస్టారెంట్ పెట్టడానికి ముందు ఆ ఊరిని డయాబెటిక్ ఫ్రీ విలేజ్‌గా మార్చాలనే సంకల్పంతో ఉచితంగా వండిపెట్టాం. డైటీషియన్లు సూచించినట్లు చిరుధాన్యాల వంటలను మూడుపూటలా తినాల్సిన మెనూను వండి వడ్డించాం. నాలుగవ వారానికి షుగర్ లెవెల్స్ అదుపులోకి రావడాన్ని స్వయంగా తెలుసుకున్నారు పేషెంట్లు. మిల్లెట్స్ పట్ల గ్రామస్థుల్లో అవగాహన కోసం చేసిన ప్రయత్నం అది. అయితే ఆ భోజనం తిన్న వాళ్లు, తెలిసిన వాళ్లు రెస్టారెంట్ పెట్టమని సూచించారు. మా మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చారు. అలా రెండు నెలల కిందట ‘పుడమి తల్లి మిల్లెట్ హోటల్’ ప్రారంభమైంది. ‘ఆర్థిక భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత’ మా ట్యాగ్‌లైన్. ఊహించనంత గొప స్పందన వచ్చింది. ఆఫీసర్లు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. హోటల్ అనేక ప్రదేశాల్లో శాఖలు తెరవమని అడుగుతున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే హోటల్ మరో శాఖ ప్రారంభం కావాలంటే అందుకు తగిన వ్యవసాయ క్షేత్రాన్ని విస్తరించాలి. ఇప్పుడు మేము సాగు చేస్తున్న పొలంలో సహజమైన సేంద్రియ పద్ధతుల్లో పండినవే మా రెస్టారెంట్లో వండుతున్నాం. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నాలుగు శాఖల్లో మొత్తం 1800 మంది రైతుమహిళలు మాతో సంఘటితమై ఉన్నారు. వారందరికీ ఉపాధిమార్గాల అన్వేషణ కోసం విస్తృతంగా పని చేయాల్సి ఉంది. వెలుగు పుట్టింది! ‘సూర్యోదయం అవుతున్నప్పుడు పుట్టింది, ఇంటికి వెలుగు తెస్తుంద’ని... మా నాన్న నాకు భానుజ అని పేరు పెట్టారు. మాది అనంతపురం జిల్లా, నల్లమాడ మండలం, బడవాండ్ల పల్లి. నాన్న చదువుకున్నది తక్కువే, కానీ కమ్యూనిస్ట్ నేపథ్యంలో చాలా నేర్చుకున్నారాయన. పాటలు రాసి పాడేవారు. చిన్నప్పుడు నాన్నతో సమావేశాలకు వెళ్లేదాన్ని. ఆ జ్ఞానమే నన్ను ఇలా తీర్చిదిద్దింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు, సందర్శనకు వచ్చన అధికారులకు మా హాస్టల్లో వసతులలేమిని చెప్పే ధైర్యం ఉండేది. టెన్త్ చదువుతూనే యంగ్ ఇండియా సంస్థలో వాలంటీర్‌గా పని చేశాను. అమ్మ పట్టుపట్టి ఇంటర్లో చదువాపించి మరీ పెళ్లి చేసింది. కానీ నేను గృహిణిగా ఇంటికే పరిమితం కాకుండా సామాజిక కార్యకర్తనయ్యాను. మహిళలు, పిల్లలు, దళితుల ఉన్నతి కోసం పని చేయాలనే ఉద్దేశంతో 1996లో రెడ్స్ స్థాపించాను. ట్రాఫికింగ్‌కి గురైన మహిళలను కాపాడడం నుంచి, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, ఉమ్మడి అటవీ సంరక్షణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పని చేశాను. మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్లు కదిరిలో నా ఇంటిని కాల్చేశారు. దాంతో నా నివాసం అనంతపూర్ పట్టణానికి మారింది’’ అని తన సమాజ సేవాయాత్రను వివరించారు భానుజ. – వాకా మంజులారెడ్డి -
బొమ్మల కొలువు
పండుగకు బొమ్మలను కొలువుదీర్చడం లేదామె. బొమ్మల తయారీ ‘కొలువు’ను పండగ చేస్తున్నారు. బొమ్మలతో ‘చక్కటి కొలువు’కు మార్గం వేస్తున్నారు. మన బొమ్మల నుంచి మన చేనేతల వరకు... సంప్రదాయ కళల పురోగతికి బాట వేస్తున్నారామె. ‘‘కళకు రాజపోషణ అవసరమే. కానీ కళ జీవించాల్సింది కేవలం దాతల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే కాదు. కళ స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే ఆ కళకు గుర్తింపు, కళాకారులకు గౌరవం లభిస్తాయి’’ అన్నారు చిత్రాసూద్. ఆమె హైదరాబాద్‌లో కార్పొరేట్రంగంలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సమాజానికి చేయాలనుకున్న పనులను ఒక సుమహారంగా మలుచుకున్నారు. తన ప్రవృత్తిలో భాగంగా గొల్లభామ చీరలు, బొబ్బిలి నేత, ఇకత్ లక్ష వత్తుల చీర వంటి తెలుగు వారి సిగ్నేచర్ వీవింగ్‌కు సహజ రంగులను మేళవిస్తున్నారు. కొండపల్లి బొమ్మల కళాకారులు వృత్తిని వదిలి ఇతర ఉపాధి మార్గాల వైపు మరలుతున్న పరిస్థితిని గమనించి ఆ కళను పరిరక్షించే పనిలో పడ్డారామె. ఆ వివరాలతోపాటు తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన పరిస్థితులను సాక్షితో పంచుకున్నారు చిత్రాసూద్. తమిళనాడు నుంచి తెలంగాణకు ‘‘మా పూర్వికులది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి. అమ్మవైపు విశాఖపట్నం. ఇరువైపుల కుటుంబాలూ తమిళనాడులో స్థిరపడ్డాయి. నాన్న కుటుంబం చెన్నైలో, అమ్మ వాళ్లు మధురైలో. అలా నేను పుట్టిన ప్రదేశం మధురై, పెరిగింది చెన్నై. నా చిన్నప్పుడే నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి వచ్చేశాం. ఆ తర్వాత స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థిరపడ్డారు. అలా నా చదువు సింగరేణిలో, పాల్వంచలో సాగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నేను నా బాల్యంలోనే నాగరక భారతాన్ని, గ్రామీణ భారతాన్ని దగ్గరగా చూడగలిగాను. అప్పట్లో తలెత్తిన అనేక సందేహాలే ఇప్పుడు నేను చేస్తున్న పనుల కారకాలు. గ్రామీణ మహిళలు, పిల్లల్లో చైతన్యం లేకపోవడం, చదువు లేకపోవడం, అవకాశాలు లేకపోవడం అప్పట్లో నాలో ఆలోచనను రేకెత్తించేవి, కానీ వాటిని ఎలా పరిష్కరించాలో తెలియదు. అలాగే నా తొలి ఉద్యోగంలో నేను చూసిన పరిస్థితులు కూడా ఆందోళనకరమైనవే. అది హైదరాబాద్ శివారులో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ. ఆ జిలెటిన్ తయారీ పరిశ్రమలో ఏడెనిమిదేళ్ల పిల్లలు పని చేసేవాళ్లు. పొడులను జల్లెడ పట్టడం వంటి పనిని ఆటలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్లు. తామెంత విపత్కరమైన పని చేస్తున్నారనేది తెలియని అమాయకత్వం వారిది. నా చదువు నా ఉన్నతికి మాత్రమే పరిమితం కాకూడదు, ఇంకా ఏదైనా చేయాలని గట్టిగా అనిపించిన సందర్భం కూడా అదే. నాలో అస్పష్టంగా ఉన్న ఆలోచనలకు ఒక రూపాన్ని ఇవ్వడం పదేళ్ల కిందట మొదలైంది. చదువులో రాణిస్తూ ఉన్నత చదువులకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో సమాజానికి మా వంతు చారిటీ మొదలు పెట్టాం. ఆ టాస్క్‌లో మా హస్బెండ్ అనిల్ సూద్ సహకరిస్తున్నారు. చేనేతల్లో నాచురల్ కలర్స్ వాడకం, కొండపల్లి బొమ్మల కళ పరిరక్షణలో ‘అభిహార’ సంస్థ నిర్వాహకురాలు చిత్ర అనుభవాన్ని కలుపుకుని ముందుకుపోతున్నాను. కళలో సామాజిక మార్పు! ఏ కళలనైనా దాతల సహకారంతో ఎంతకాలమని పరిరక్షించగలం? కళ తనకు తానుగా స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే కళకు, కళాకారులకు గౌరవం. అందుకే మహిళలకు శిక్షణ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇవ్వడంతోపాటు మార్కెట్ సౌలభ్యత కోసం పని చేస్తున్నాను. కొండపల్లిలో ఉండే మహిళలను తీసుకువచ్చి హైదరాబాద్‌లోని సప్తపర్ణిలో ఎగ్జిబిషన్ పెట్టించడంలో నా ఉద్దేశాలు రెండు నెరవేరాయి. ఒకటి గ్రామీణ మహిళలకు తమ బొమ్మలకు ప్రపంచంలో ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియాలి, అలాగే కొనేవాళ్లు ఏం కోరుకుంటున్నారో అర్థం కావాలి. అలాగే ఒక అద్భుతమైన కళను సంపన్నుల లోగిళ్లను చేరగలిగితే ఆ కళకు రాజపోషణకు దారి వేసినట్లే. ఈ రెండూ సాధ్యమయ్యాయి. ఎప్పుడూ చేసే దశావతారాలు, ఎడ్లబండ్ల నుంచి కళాకారుల నైపుణ్యాన్ని టేబుల్ టాప్స్, మొబైల్ ఫోన్ స్టాండ్ వంటి రోజువారీ వాడుక వస్తువుల తయారీకి విస్తరించగలిగాం. అలాగే ఒక కళ ఆవిర్భవించినప్పుడు అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఒక రూపం సంతరించుకుని ఉంటుంది. ఆ రూపాలను కాలానుగుణంగా మార్చుకోవాలి. అందుకే కళను ధార్మికత పరిధి నుంచి సామాజిక పరిధికి విస్తరించాల్సిన అవసరాన్ని నేర్పిస్తున్నాం. ఈ బొమ్మలను లాంకో కంపెనీ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ హస్తకళాకృతుల సంస్థలు లేపాక్షి, గోల్కొండలు పెద్ద ఆర్డర్లతో ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ నేను నమ్మే సిద్ధాంతం ఏమిటంటే... కళను పరిరక్షించడం అనేది పెద్దమాట. కళ ద్వారా ఉపాధి పొందడం ప్రధానం. అప్పుడే కళ కలకాలం నిలుస్తుంది, కళాకారులు తమ ఉనికిని గర్వంగా చాటుకోగలుగుతారు. నా సర్వీస్‌తో ఎన్ని కుటుంబాలు, ఎన్ని కళారూపాలు స్వయంసమృద్ధి సాధించాయనేది నాకు మిగిలే సంతృప్తి’’ అన్నారు చిత్రాసూద్. వృత్తులకు, కళలకు ఇల్లే యూనివర్సిటీగా ఉండేది. పుస్తకం–కలం లేకుండానే విస్తృతమైన జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యేది. కాలం మారింది, ప్రపంచీకరణ మన సంప్రదాయ వృత్తులను కాలగర్భంలో కలిపేస్తున్న తరుణంలో మన కళల జ్ఞానాన్ని గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది. దానికి శాస్త్రబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఈ సైన్స్ ఏ పుస్తకంలోనూ లేదు! కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రానికి అనుబంధంగా సహజ రంగుల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సొరకాయ ఆకులతో చెక్కకు రంగు అద్దవచ్చని ఇంతవరకు ఏ పుస్తకమూ చెప్పలేదు. కొండపల్లి బొమ్మల కళాకారులకు మాత్రమే తెలిసిన సైన్స్ అది. ఇక చేనేతల్లో గొల్లభామ, బొబ్బిలి, ఇకత్ చీరల్లలోనూ నేచురల్ కలర్స్ ప్రయోగం మొదలైంది. ఈ రంగాల్లో ఉన్న జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడం కూడా మా తదుపరి ప్రాజెక్టుల్లో ఒకటి. భూమండలాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టివేస్తున్న కారకాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ కాలుష్యం ప్రధానమైనది. అందుకే మనవంతుగా కొన్ని అడుగులు వేయగలిగితే, మరికొందరి చేత వేయించగలిగితే... ఆ తర్వాత ఈ నేచర్ మూవ్మెంట్ దానంతట అదే ముందుకు సాగుతుంది. – చిత్రాసూద్, యాక్టివిస్ట్, రివైవల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కో – ఫౌండర్, అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ‘మహిళ’ శ్రమ చర్చకే రాదు! మహిళ స్థితిగతులు మారాలంటే ఆర్థిక స్వావలంబన సాధించాలనేది జగమెరిగిన సత్యం. మన వ్యవస్థలన్నింటిలోనూ మహిళలను సహాయక పనులకే పరిమితం చేయడంతో వారి శ్రమ గుర్తింపునకు నోచుకోవడం లేదు. మహిళలకు కూడా ఆర్టిజన్ కార్డ్ ఇప్పించడానికి పని చేస్తున్నాను. అలాగే వేతనపెంపు విషయంలో మహిళల పని గురించి చర్చ కూడా ఉండడం లేదు. ఎంతగా శ్రమించినప్పటికీ మహిళకు గుర్తింపు ఉండదు, ఆదాయం తక్కువ. ఈ పరిస్థితిని మార్చడానికి ‘అభిహార’ అనే వేదిక ద్వారా పని చేస్తున్నాను. కొండపల్లి బొమ్మలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోంది. ఏపీ ప్రాథమిక పాఠశాలల్లో బోధన పరికరాలు కొండపల్లి కళాకృతులే. నేను హార్టికల్చర్ విద్యార్థిని కావడంతో నాకు తెలిసిన సైన్స్‌ని హస్తకళల రంగానికి మేళవిస్తున్నాను. హస్తకళల రంగంలో విశేషమైన కృషి చేస్తున్న ఉజ్రమ్మ, సురయ్యా హసన్బోస్, జగదరాజప్పలు నాకు గురువులు. నా ఆకాంక్షలు, చిత్ర ఆలోచనలు ఒకే తీరుగా సాగడంతో మా ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. – సుధారాణి ముళ్లపూడి, సీఈవో, అభిహార సోషల్ ఎంటర్ప్రైజ్ – వాకా మంజులారెడ్డి -
ముందుకు సాగడమే జీవితం.. సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని..
కిన్నెర నాగ చంద్రికాదేవి పుట్టింది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం (కడప జిల్లా). పెరిగింది కడప జిల్లా ఎర్రగుంట్లలో. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన నాగచంద్రాదేవికి పదో తరగతితోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. అలాగే రెండు వందల తులాల బంగారంతో మొదలైన ఆమె జీవితంలో కాలంతోపాటు బంగారం కరిగిపోవడమూ ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, సమాజ సేవ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుందని కూడా ఊహించని సంఘటనలే. అలాగే సోదరులున్నప్పటికీ తల్లిదండ్రుల దహన సంస్కారాలు తన చేతులతో చేయాల్సి వస్తుందని కూడా ఊహించని పరిణామమే. అలాగే తన హోమ్‌లో కాలధర్మం చెందిన ఆరు వందల మందికి స్వయంగా అంత్యక్రియలు చేయడం కూడా ఊహించని సంఘటనలే. తన సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారామె. ‘జీవితం అంటేనే గమ్యం ఏమిటో తెలియకనే మొదలు పెట్టే ప్రయాణం. ఊహకందని మలుపులతో సాగే ఈ ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లుంటాయి, గతుకులుంటాయి, వాహనం మొరాయిస్తుంది, మరమ్మతులు చేసి ముందుకు సాగబోతే ఇంధనం నిండుకోనూవచ్చు. ఇన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే మనం చేయగలిగింది. వృద్ధుల సేవలో నా జీవితానికి ఒక అర్థాన్ని నిర్వచించుకున్నాననే అనుకుంటున్నాను’ అన్నారామె. నైరాశ్యం– నేను– నా బిడ్డ ‘‘మా నాన్న మెడికల్ ఆఫీసర్. అమ్మానాన్నలకు తొలి సంతానం నేను. నన్ను మా మేనత్తకు దత్తత ఇచ్చారు. అత్త, మామ ఇద్దరూ హైస్కూల్ టీచర్లు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ టెన్త్ క్లాస్‌తోనే పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కాలేజ్‌కెళ్లే అవకాశం ఉండింది. ఇంటర్ తర్వాత విద్యుత్‌సౌధలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను. ఈ లోపు బాబుకి తల్లి కావడం... బిడ్డనెత్తుకుని ఇంటి నుంచి బయటపడడం వరకు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ చిన్నవయసుకే పూర్తయిపోయాయి.. ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే నాలుగ్గోడల మధ్య నేను, నా కొడుకు. నైరాశ్యం ఆవరించినట్లయ్యేది. దాని నుంచి బయటపడడానికి వేసిన ఒక్కో అడుగూ నన్ను ఇవాళ ఇలా సేవకు ప్రతీకగా నిలబెట్టాయి. నా పనిని గుర్తించి అవార్డులు వరించాయి. నన్ను అంటిపెట్టుకుని నేడో రేపో అన్నట్లు కళ్లలో ప్రాణాలు నిలుపుకుని రోజులు లెక్కపెట్టుకుంటున్న వాళ్లు ఉన్నారు. నేను కనిపించగానే వాళ్ల కళ్లలో కనిపించే వెలుగు నన్ను నడిపిస్తోంది. ఒకరికి ఒకరు తోడు మగవాడి మోసానికి గురయి ఒంటరైన మహిళలకు నా ఇంట్లో ఉంచుకుని వాళ్లు ఏదో ఒక పని నేర్చుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు ఆసరా ఇస్తూ వచ్చాను. అలాగే ఏ దిక్కూలేని వృద్ధులను ఇంటికి తీసుకురావడం కూడా. ఏ బంధుత్వం లేని వాళ్లను అలా ఇంట్లో ఉంచుకోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని తెలిసి 2003లో మా ఇంటి పేరుతోనే కిన్నెర ఫౌండేషన్ స్థాపించాను. అక్కడి నుంచి నా సర్వీస్ విస్తరణ కూడా మొదలైంది. స్కూల్లో ఉండాల్సిన పిల్లలు వీథుల్లో ఉంటే వారిని సమీకరించి కౌన్సెలింగ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను. ఎందుకో తెలియదు కానీ అక్కడ కూడా సింగిల్ పేరెంట్ సంరక్షణలో ఉన్న పిల్లలే ఎక్కువగా ఉండేవారు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నా బిడ్డల్లా అనిపించేవారు. సామాజిక చైతన్యం మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ ప్రభుత్వపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో షీ టీమ్‌తో కలిసి పని చేశాను. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట దగ్గర జప్తేసద్గూడ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్లోరోసిస్ బాధితులకు మంచి నీటి ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేయగలిగాను. వృద్ధుల సేవనే ప్రధానంగా తీసుకోవడానికి కారణం మా అమ్మమ్మ, అత్త మంచం పట్టిన రోజులను దగ్గరగా చూడడమే. వాళ్ల మీద మనకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ల బాధను పంచుకోలేం. మనం చేయగలిగింది వారికి తోడుగా ఉంటూ భరోసా ఇవ్వడం మాత్రమే. అందుకే మా హోమ్‌లో హాస్పిస్ సేవలే ప్రధానంగా ఉంటాయి. హోమ్ నిర్వహణకు నెలకు మూడు లక్షల ఖర్చు వస్తుంది. ఒక కంపెనీ నుంచి అద్దెలో కొంత ఆర్థిక సహాయం, మరో కంపెనీ నుంచి బియ్యం నెలనెలా అందుతున్నాయి. పుట్టినరోజులు హోమ్‌లో చేసుకోవడానికి కొంతమంది వస్తారు. మిగిలిన ఖర్చుల కోసం ... ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో సంపాదించుకున్న ఇల్లు, రెండు ప్లాట్లు అమ్ముకున్నాను. బంగారం బ్యాంకులో తాకట్టు పెడుతూ విడిపిస్తూ, పెద్ద అవసరంలో అమ్ముకుంటూ అలా 30 తులాలు ఖర్చయింది. మాసాబ్ ట్యాంకులో అద్దె ఇంట్లో హోమ్ నిర్వహిస్తున్నాను. నా శక్తి తగ్గిపోతోందనే సమయం వచ్చిందని కాబోలు భగవంతుడు హోమ్ కోసం సొంత భవనాన్ని నిర్మించే మార్గం చూపించాడు. చిన్న జీయర్ స్వామి సూచనతో ముచ్చింతల్‌లో హోమ్ నిర్మాణం పూర్తయితే మా హోమ్ అక్కడికి మారుతుంది’’ అని వివరించారు నాగ చంద్రికాదేవి. సేవలోనే సాంత్వన నా సర్వీస్‌కి గుర్తింపుగా స్టేట్ అవార్డు, ఉత్తమ మహిళ అవార్డు, సేవాధార్మిక, గవర్నర్ అవార్డు, నేషనల్ అవార్డు అందుకున్నాను.ఈ పనుల్లో నన్ను నేను ఎంగేజ్ చేసుకున్నాను. ఈ సేవలో నాకు సాంత్వన లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏపీలో గుణదలలో పోస్టింగ్ వచ్చింది. నేను హైదరాబాద్ వదిలి వెళ్లాలంటే హోమ్‌లో ఉన్న వాళ్ల సంరక్షణ ప్రశ్నార్థకమైంది. వాళ్లను ఎవరి మీద వదలాలి? తాత్కాలికంగా బాధ్యత అందుకోవడానికి కూడా ఏ ఆసరా లభించలేదు. దాంతో 2016లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. – నాగ చంద్రికాదేవి, ఫౌండర్, కిన్నెర ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్‌ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్‌ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్‌సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్‌కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్‌కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్‌లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
Sudheera Valluri: మన వృత్తే మన గుర్తింపు
విమానం నడిపిన అమ్మాయిలను చూస్తున్నాం. విమానంలో యుద్ధం చేసే అమ్మాయిలనూ చూశాం. ఇప్పుడు... విమానాలు తయారు చేస్తున్న అమ్మాయిని చూద్దాం. వల్లూరి సుధీర ఏరో స్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్. జర్మనీలోని లిలియుమ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీలో మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్‌కి హెడ్. ఆ కంపెనీ స్థాపించిన తర్వాత ఉద్యోగంలో చేరిన వంద మంది ఇంజనీర్లలో ఒకే ఒక యువతి ఆమె. సెలవు మీద హైదరాబాద్‌కి వచ్చిన సుధీర ఈ రంగంలో అడుగుపెట్టడానికి స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని, ఏరోస్పేస్ మ్యాన్యుఫాక్చరింగ్ విభాగంలో తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ ఉద్యోగ ప్రకటన! ‘‘మా తాతయ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్‌గా పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో ఉద్యోగం చేశారు. అమ్మమ్మ అదే డిపార్ట్మెంట్లో క్లర్క్‌గా భువనేశ్వర్‌లో రిటైర్ అయ్యారు. నేను ఏరోస్పేస్ ఇంజనీర్ కావడానికి డైరెక్ట్‌గా ప్రభావితం చేయలేదు, కానీ పరోక్షంగా వారి నేపథ్యం నాకు మంచి భరోసానిచ్చింది. నిజానికి మా అమ్మానాన్నలిద్దరి మూలాలూ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులోనే ఉన్నాయి. అమ్మానాన్న హైదరాబాద్‌లో సెటిల్ కావడంతో నా బాల్యం భాగ్యనగరంలోనే. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇంగ్లిష్ పేపర్లో ఒక ప్రకటన చూశాను. పైలట్ల కోసం ప్రకటన అది. అయితే మగవాళ్లకు మాత్రమే. అప్పుడు ‘అమ్మాయిలెందుకు వద్దు’ అనిపించింది. అమ్మాయిలు విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదవరా అని కూడా అనుకున్నాను. నేను ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ కోర్సులు చేయాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మానాన్న పెద్దరికపు సవరణలేమీ చేయకుండా నన్ను నేను కోరుకున్న కోర్సులో చేర్చారు. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్‌లోని ఎమ్ఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అప్పట్లో నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి ఆర్మీలో పని చేయాలని ఉండేది. పరీక్షలు రాశాను, కానీ సెలెక్ట్ కాలేదు. అప్పుడు ఆదిభట్లలో ఉన్న ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ కంపెనీ మా క్యాంపస్‌కి ప్లేస్మెంట్ గురించి వచ్చింది, అలా 2012లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ప్రొడక్షన్ ప్లానింగ్, కంట్రోల్ విభాగాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా చేయడంతో పని మీద మంచి పట్టు వచ్చింది. రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత మాస్టర్స్ చేయాలని, అది కూడా మాన్యుఫాక్చరింగ్లోనే చేయాలనుకుని యూఎస్‌లోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి వెళ్లాను. కోర్స్ పూర్తయిన తర్వాత గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ కార్పొరేషన్లో ఉద్యోగం చేశాను. అది బిజినెస్ జెట్లు తయారు చేసే కంపెనీ. ఇప్పటి వరకు నాది చాలా మామూలు జర్నీనే. 2017లో పెళ్లి, అబ్బాయి నాకు బీటెక్ క్లాస్మేటే. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఏవియేషన్ ఆఫీసర్. పెళ్లి తర్వాత ఇండియాలో ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు జర్మనీలో మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందట నేను మాత్రమే జర్మనీలో ‘లిలియుమ్ ఎయిర్ క్రాఫ్ట్’ కంపెనీలో ఎయిర్ క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలో అప్పుడు... అంటే 2018లో వందమంది ఇంజనీర్లలో అమ్మాయిని నేను మాత్రమే. అయితే ఆ గుర్తింపు నాకు పెద్దగా సంతోషాన్నివ్వదు. అమ్మాయిలు కోరుకోవాల్సింది జెండర్ సెపరేషన్తో కూడిన గుర్తింపు కాదు. వందమందిలో యాభై మంది అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకోవాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనేది నా ఆకాంక్ష. ఇప్పుడు మా కంపెనీలో ఎనిమిది వందల మంది ఇంజనీర్లున్నారు, వారిలో వందమంది వరకు అమ్మాయిలున్నారు. ఈ నాలుగేళ్లలో వచ్చిన పురోగతి. ఈ ఫీల్డ్‌లో అమ్మాయిలు నెగ్గుకురావడం కష్టమనేది అపోహ మాత్రమే. నేనిప్పుడు మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్‌కి హెడ్‌ని. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగంలోకి సెలెక్ట్ చేసుకోగలిగాను. మా టీమ్‌లో పోలండ్, బ్రెజిల్, యూకే, యూరప్ దేశాల వాళ్లు ఉన్నారు. వాళ్లతో కలిసి పని చేయడం, వాళ్ల నుంచి పని తీసుకోవడంలో ఎక్కడా ఇబ్బందులేవీ రాలేదు. అయితే ఒక టాస్క్ ఇచ్చే ముందు వాళ్ల బేసిక్ అండర్స్టాండింగ్ లెవెల్స్‌ని అర్థం చేసుకోగలిగితే టీమ్‌తో పని చేయించుకోవడం ఏ మాత్రం కష్టంకాదనేది నా అభిప్రాయం. నేను టీమ్ లీడర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో మంది మహిళలను చూశాను, వారితో పనిచేశాను కూడా. మిగిలిన అన్ని రంగాల్లోలాగానే ఈ రంగంలో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారు’’ అన్నారు ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ వల్లూరి సుధీర. సబ్జెక్ట్‌ని నిరూపించుకోవాల్సిందే! ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ వంటి సాంకేతికత ఎక్కువగా ఉంటే రంగాల్లో టెక్నికల్ పీపుల్‌తో పని చేసేటప్పుడు వాళ్లు ఆడవాళ్ల మాటను పట్టించుకోరనే అభిప్రాయం కూడా ఉంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే... యంగ్ ఇంజనీర్కంటే సీనియర్ టెక్నీషియన్‌కి ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయనడంలో సందేహం లేదు. కొత్త మార్పును తెచ్చేటప్పుడు టెక్నికల్ పీపుల్‌కి మనం విషయమంతా వివరించేటప్పుడు సబ్జెక్ట్ పరంగా మనం ఒక అడుగు ముందున్నామనే విషయాన్ని నిరూపించుకోవాలి. ఈ నిరూపణ మగవాళ్లకైనా ఉంటుంది, ఆడవాళ్లకూ ఉంటుంది. నేను మహిళలకు చెప్పే మాట ఒక్కటే... మనల్ని మనం ‘ఇంజనీర్, సైంటిస్ట్, పైలట్’ అని ప్రొఫెషన్పరంగా మాత్రమే గుర్తించుకోవాలి, ‘ఉమన్ ఇంజనీర్, ఉమన్ పైలట్, ఉమన్ సైంటిస్ట్’ అని జెండర్‌పరంగా కాదు. అన్ని పరీక్షలనూ మగవాళ్లతోపాటు పూర్తి చేసి ఈ స్థాయికి వచ్చాం. రిజర్వేషన్లలో రాలేదు. ఇక ఉమన్ అని జెండర్‌తో ఐడింటిఫై అవడం ఎందుకు? – వల్లూరి సుధీర, ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్ – వాకా మంజులారెడ్డి -
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్‌ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్‌ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్‌లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్‌గా తెలుసుకునే విధంగా హ్యూమన్‌లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్‌లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్‌లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్‌లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్‌లోని యూసీ డేవిస్‌లో పూర్తి చేసి హైదరాబాద్‌లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్‌ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్‌తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్‌ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్‌గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్‌కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
Disha Bill: సత్వర పరిష్కార దిశ
ఆడపిల్ల పుడితే... అదృష్టం పుట్టిందని సంబరపడాలి. ఆడపిల్ల పెరుగుతుంటే... ఆ ఇంట్లో ఆనందం వెల్లి విరియాలి. ఆడపిల్ల ఆ ఇంటికి సంతోషం... ఆ ఇంటి వేడుకల కల్పవల్లి. ఆ సంతోషం... ఆనందం... అదృశ్యమై ఆందోళన రాజ్యమేలుతుందా? ఆడపిల్ల అమ్మానాన్నల గుండె ఆందోళనతో కొట్టుకుంటే ఆ తప్పెవరిది? మొదట సమాజానిది... ఆ తర్వాత చట్టానిది... ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ ‘దిశ’ గా అప్రమత్తమైంది... నేరగాళ్ల మీద కొరడా ఝళిపిస్తోంది. అతడు 85 ఏళ్ల వృద్ధుడు, కోర్టు బోను ఎక్కడానికి కూడా దేహం సహకరించనట్లు ఆయాసపడుతున్నాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అతడి మీద నమోదైన కేసు గురించి తెలిసి పోలీసుల మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించారు. ఆ ఆధారాలను చూసిన న్యాయమూర్తి ఆగ్రహాన్ని అణచుకుంటూ తీర్పు రాశారు. ఆ తీర్పు పాఠం కోసం కోర్టు హాలు నిశ్శబ్దంగా చెవులు రిక్కించింది. అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. సరైన తీర్పే వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారంతా. అపరాధి మాత్రం ‘మన న్యాయవ్యవస్థ ఇంత త్వరగా తీర్పులు చెప్పేస్తోందా, మన పోలీసులు ఇంత త్వరగా కేసులు దర్యాప్తు చేసేసి బలమైన ఆధారాలు సేకరించి శిక్ష పడేవరకు విశ్రమించడం లేదా! కేసు కోర్టుకు రావడానికి ఏ పుష్కరకాలమో పడుతుందనుకుంటే... వీళ్లకిదేం పోయేకాలం...’ అన్నట్లు అసహనంగా చూశాడు. బాధితురాలు మూడేళ్ల పాపాయి. తనకేం జరిగిందో తనకు తెలియదు. రోజూ తాను ఆడుకునే పక్కింటి తాతయ్య తన మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తెలియని పసితనం ఆ పాపాయిది. ఈ జ్ఞాపకాలేవీ తన బిడ్డకు గుర్తుండకూడదని కూతుర్ని తన వైపు తిప్పి గట్టిగా హత్తుకుంది. కోర్టు దృశ్యం పాపాయి మెదడులో నిక్షిప్తం కాకూడదని దేవుణ్ని ప్రార్థిస్తోంది పాపాయి తల్లి. సంఘటన జరిగిన ఆరు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేశారు ‘దిశ’ పోలీసులు. తొమ్మిది నెలల్లో నిందితుడికి శిక్ష పడింది. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు దిశ పోలీసులు చేస్తున్న యజ్ఞమిది. ∙∙∙ అది నేపాల్ నుంచి వచ్చి మన దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న కుటుంబం. వాళ్లకు నాలుగున్నరేళ్ల పాపాయి. ఆటపాటల్లో మునిగిపోయి ఆకలైనప్పుడు అమ్మ కోసం వెతుక్కునే వయసది. ఆ పరిసరాల్లో నివసించే ఓ వ్యక్తి కళ్లు ఆ పాపాయి మీద పడ్డాయి. ‘నీకు టీవీ చూపిస్తాను’ అని లోపలికి తీసుకువెళ్లాడు. కేసు వెలుగులోకి వచ్చింది. టీవీ చూపిస్తూ, చాక్లెట్లు ఇచ్చి ఎలా మాయచేశాడో చెప్పడానికి పాపాయి ప్రయత్నిస్తోంది. కానీ పాపాయికి, వాళ్ల తల్లిదండ్రులకు తెలుగు రాదు, ఇంగ్లిష్ రాదు. ఏం జరిగిందనేది పోలీసులకు అర్థమవుతోంది. కానీ పాపాయి చేత చెప్పించి కేసు రికార్డు చేయించక తప్పదు. నేపాలీ ట్యూటర్ని పిలిపించి కేసు రికార్డు చేశారు. ఎనిమిది రోజుల్లో చార్జిషీట్ వేయగలిగారు. మెడికల్ సర్టిఫికేట్లు కోర్టుకు సమర్పించడం వంటి ప్రక్రియ మొత్తం వేగంగా జరిగి పోయింది. ఏడు నెలల్లో నిందితుడికి జీవితఖైదు పడింది. అలాగే మరో పన్నెండేళ్ల అమ్మాయిని వ్యూహాత్మకంగా పడుపు వృత్తిలోకి దించిన ఉదంతంలో ఏకంగా 74 మందిని అరెస్టు చేశారు. వారిలో యూఎస్‌కి వెళ్లబోతున్న టీసీఎస్ ఉద్యోగి కూడా ఉన్నాడు. యూకేలో ఉన్న ఒక నిందితుడు, ఇండియాలోనే ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు దిశ పోలీసులు. ∙∙∙ ఆ బిల్లు దిశగా దర్యాప్తు గుంటూరు, దిశ పోలీస్ స్టేషన్ ఏఎస్పీ సుప్రజ పై కేసుల దర్యాప్తును వివరిస్తూ... ‘‘మేము దిశ బిల్లు స్ఫూర్తితో కేసులను సత్వరం పరిష్కరిస్తున్నాం. పై కేసుల్లో కూడా నేరగాళ్లకు శిక్ష పడితీరాలన్నంత ఆవేశంతో పని చేశాం. పసిబిడ్డల పట్ల ఆ దుర్మార్గులు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. మరొకరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకూడదన్నంత సీరియెస్‌గా పని చేస్తున్నాం. నేరం జరిగిన విషయం నిజమే అయినప్పటికీ న్యాయపోరాటంలో కొన్నిసార్లు మేము దఖలు పరిచిన ఆధారాలు వీగిపోతుంటాయి. అందుకే కొన్ని ఆధారాలను అత్యంత గోప్యంగా ఉంచి నేరుగా కోర్టులో బయటపెట్టాను. ఎనభై ఐదేళ్ల వృద్ధుడు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కోర్టులో అతడి నటన కూడా ఆస్కార్‌కు దీటుగా ఉండింది. దాంతో జడ్జిగారు మమ్మల్నే సందేహించారు కూడా. అప్పుడు నేను వీడియో బయటపెట్టడంతో కేసు నిలిచింది’’ అన్నారు సుప్రజ. దిశ బస్సులు పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహిళలకు వృత్తిపరమైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బందోబస్తు డ్యూటీకి వెళ్లినప్పుడు విఐపీ రావడానికి నాలుగు గంటల ముందే ఆ ప్రదేశంలో ఉండాలి. ప్రోగ్రామ్ పూర్తయి, అందరూ వెళ్లిపోయే వరకు డ్యూటీ ఉంటుంది. కనీసం ఏడెనిమిది గంటలు పడుతుంది. ఏ ఒకటి – రెండు చోట్లనో తప్ప బాత్రూమ్ వంటి సౌకర్యాలు ఉండవు. మహిళలకు అన్ని రోజులూ ఒకటిగా ఉండవు. కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. వారి కష్టాలను అర్థం చేసుకుని సీయెం వారికి ‘దిశ బస్సు’ల రూపంలో మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించి మహిళాపోలీసుల కష్టాలను దూరం చేశారు. ‘ఈ మేలును మేము ఎప్పటికీ మర్చిపోలేమ’ని అంటున్నారు మహిళాపోలీసులు. దిశ కేసుల విషయంలో కూడా ఇనుమడించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. బిల్లు ఇంకా చట్టం రూపం సంతరించుకోలేదు. దిశ పోలీస్స్టేషన్లు, దిశ పోలీసులు మాత్రం ఆ బిల్లును స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తున్నారు. న్యాయపోరాటంలో బాధితుల పక్షాన నిలుస్తున్నారు. కొన్నింటికి ఆధారాలుండవు! చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అనే కాదు... మొత్తంగా ఆడవాళ్ల మీద జరిగిన నేరాన్ని రుజువు చేయడం చాలా కష్టం. ముందు సమాజమే అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. పైన వృద్ధుడి విషయంలోలాగానే సమాజం పోలీసులనే సందేహిస్తుంది. మహిళల విషయంలో కూడా మొదట బాధితురాలినే తప్పు పడుతుంది. ఈ నెగిటివ్ ఆటిట్యూడ్ తొలగిపోవాలి. ప్రతి కేసుకీ వీడియోలు ఉండవు. కానీ నేరం జరిగి ఉంటుంది. మహిళను తేలికగా మాట్లాడే ముందు జరిగిన అన్యాయాన్ని కనీసంగా అర్థం చేసుకోవడానికి అయినా ప్రయత్నించాలి. – సుప్రజ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్చార్జ్, వెస్ట్ సబ్ డివిజన్, దిశ పోలీస్ స్టేషన్,గుంటూరు – వాకా మంజులారెడ్డి -
డబ్బు లెక్క... ఓ కొలిక్కి వస్తోంది
ఇటీవల ఒక సర్వేలో వెల్లడైన నిజాలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళ బ్యాంకు పోపుల డబ్బానే! ఆర్థిక వ్యవహారాలకు మహిళలు దూరంగానే ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఏటీఎమ్ కార్డుల నిర్వహణ భర్తదే! అందుకే... ఫైనాన్షియల్ లిటరసీ అవసరం అంటారు శుభ్రా మహేశ్వరి. ‘‘చాలామంది మహిళలకు ఆర్థిక వ్యవహారాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. ఇది గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులైన మహిళల విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కనీస అవగాహన లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. నగరంలో ఇంటిని నిర్వహించే గృహిణి నెల ఖర్చులకు ముప్పై – నలభై వేల వరకు ఆమె చేతుల మీదుగా ఖర్చు చేస్తుంటుంది. కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాస్తే డబ్బే డబ్బును రెట్టింపు చేస్తుందనే చిన్న లాజిక్‌ని మిస్ అవుతున్నారు. ఇది వెల్త్ క్రియేషన్‌లో వెనుకబాటుతనమేనంటారు శుభ్ర. అక్షరాలు వచ్చు! లెక్క తేలదు!! ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే... పెద్ద చదువులు చదువుకున్న మహిళలు కూడా బంగారాన్ని ఆభరణం రూపంలో కొని బీరువాలోనో, బ్యాంకు లాకర్లోనో దాచుకుంటున్నారే తప్ప గోల్డ్‌బాండ్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. బాండ్ రూపంలో ఉన్న బంగారం విలువను అర్థం చేసుకోవడంలో నిరక్షరాస్యతలో ఉన్నారనే చెప్పాలి. బ్యాంకులు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. కానీ చిన్న మొత్తమైనా సరే బ్యాంకులో దాచుకుని బ్యాంకు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ లావాదేవీ నిర్వహించడం నేర్చుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాలేజీల్లో కూడా విద్యార్థులకు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే నేర్పిస్తారు. డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడం మీద దృష్టి వెళ్లడం లేదు. ‘‘పరిశ్రమలు స్థాపించిన మహిళలు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టిన మహిళలు శ్రమించడంలో ఏ మాత్రం అలసత్వం ఉండదు. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్లనే లాభాల బాట పట్టాల్సిన పరిశ్రమలు పట్టాలు తప్పుతున్నాయి. ఒక చార్టెడ్ అకౌంటెంట్‌గా నేను గమనించింది ఒక్కటే. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఆ మహిళల శ్రమ వృథా అవుతోంది. వర్క్‌లో డెడికేషన్ ఎంత ముఖ్యమో, రైట్ డైరెక్షన్లో చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాను. ఇటీవల మనదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయంగా పెరిగారు. ఈ దశలో ఈ చైతన్యం చాలా అవసరం. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వర్క్ షాపులు చేపడుతున్నాం. భారీ సమావేశాలకు బదులు చిన్న చిన్న క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద విషయాన్ని సరళంగా వివరించడానికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాం. సమావేశంలోనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం కూడా జరుగుతుంది’’ అన్నారు శుభ్రా మహేశ్వరి. కలను దర్శించాలి! ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్‌గా ఆమె మహిళను మానసికంగా శక్తిమంతం చేయడానికి ‘స్ట్రాంగర్ షీ’ అనే కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన అంశం ‘ఫైనాన్షియల్ లిటరసీ’. దేశంలోని గ్రామీణ, పేద మహిళ నుంచి మధ్య తరగతి మహిళలు, వైట్ కాలర్ జాబ్‌లో ఉన్న మహిళలను కూడా కలుసుకుంటారు. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు, డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా నేర్పించడం, డబ్బుతో డబ్బును ఎలా పెంపొందించుకోవాలో తెలియచేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ‘‘భూమ్మీద నీకంటూ ఒక స్థానం ఉంది. ఆకాశంలోనూ నీ కంటూ కొంత భాగం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఎదగడానికి నీకంటూ ఒక కల ఉండాలి. నీ జ్ఞానంతో ఆ కలను దర్శించగలగాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి నీ శ్రమను అనుసంధానం చేసుకోవాలి. నీ కలను నిజం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయంగా ఉండే వారే, ఫలితం పూర్తిగా నీదే. అది విజయం అయినా అపజయం అయినా పూర్తి బాధ్యత నీదేననే విషయాన్ని మర్చిపోకూడదు’’ మహిళలకు నా సందేశం ఇదేనన్నారు శుభ్రా మహేశ్వరి. రోజూ తెల్లకాగితమే! శుభ్రా మహేశ్వరి పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. తండ్రి పారిశ్రామికవేత్త. ఆమె మాత్రం చార్టెడ్ అకౌంటింగ్ వైపు ఆసక్తి చూపించింది. పెళ్లి తర్వాత ఇరవై ఏళ్ల కిందట భర్తతో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బ్లూ స్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్‌గా విధులు నిర్వహణతోపాటు చార్టెడ్ అకౌంటెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానమ్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, నేషనల్ హైవేస్తోపాటు దాదాపుగా మూడు వందల కార్పొరేట్ కంపెనీలకు ఆడిటర్‌గా సేవలందించిన, అందిస్తున్న అనుభవం ఆమెది. ‘‘మన జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త రోజే. డైరీలో కొత్త పేజీనే. ఏమీ రాయని తెల్లకాగితమే. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి కాగితాన్నీ మంచి విషయంతో నింపాలి. అదే అందమైన కథ అవుతుంది. అంటే ఏ ఒక్క రోజునూ నిరుపయోగంగా గడపవద్దు. ప్రయోజనకరంగా గడపాలి’’ అంటారు శుభ్రా మహేశ్వరి. – వాకా మంజులారెడ్డి -
‘ఏ కలర్స్ అద్దమంటారు’ .. ఓ డిజైనర్ ప్రయాణం
‘‘మేడమ్! మీ వీడియోలు చూశాం. పోయిన వారం హైదరాబాద్‌కి వచ్చాం, మిమ్మల్ని చూసిపోదామని...’’ అని ఏలూరు దగ్గర వేల్పుచర్ల అనే గ్రామం నుంచి ముగ్గురు మహిళలు వచ్చారు. ‘‘మేడమ్! మా అమ్మ ఇలా ఉంటారు’’ అని ఫోన్లో ఫొటో చూపిస్తూ ‘‘అమ్మకు ఏ కలర్ కాంబినేషన్లో చీరలు తీసుకోమంటారు’’ అని ఓ యువతి అడుగుతోంది. ఇంతలో ఆమె భర్త వచ్చి ‘‘గాయత్రీ! వేర్‌హౌస్‌కి వెళ్తున్నాను’’ అని చెప్పి బయలుదేరారు. షోరూమ్ వెనుకగా ఉన్న ప్రింటింగ్ యూనిట్లో ఒక వ్యక్తి ఒక చీరను తెచ్చి బోర్డరు చూపిస్తూ... ‘‘ఏ కలర్స్ అద్దమంటారు’’ అని అడిగి ఆమె ‘పింక్’ అని చెప్పగానే తలూపుతూ వెళ్లిపోయాడు. ‘‘మీ వీడియోలు రోజూ చూస్తుంటాం. అలవాటైపోయింది. మీరు మా ఇంట్లో ఒకరిలా అయిపోయారు’’ అంటూ ఆ మహిళలు గాయత్రితో మాటల్లో పడిపోయారు. ‘‘మమ్మీ! వీడియో అప్ లోడ్ చేశాను. అమ్మమ్మ క్యారియర్ పంపించింది. ఆఫీస్ రూమ్‌లో పెట్టాను’’ అని క్లుప్తంగా చెప్పి మరో ఫ్లోర్‌లోకి వెళ్లి పోయాడు ఓ కుర్రాడు. ఇది... హైదరాబాద్, సైనిక్‌పురిలో ‘గాయత్రీరెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియో’ నిర్వహిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ గాయత్రి డైలీ రొటీన్. ఇది ఆమె తనకు తానుగా నిర్మించుకున్న సామ్రాజ్యం. 2008లో ఇంట్లో ఒక మూలగా ఒక టేబుల్‌తో మొదలైన తొలి అడుగు ఇప్పుడు పర్వత శిఖరానికి చేరువలో ఉంది. అన్నీ అమరిన దశ నుంచి జీవితం ఒక్కసారిగా పరీక్ష పెట్టింది. అంతా అగమ్యం. జీవితం తనను ఎటు తీసుకువెళ్తుందో తెలియని అస్పష్టమైన అయోమయమైన స్థితిలో వేసిన మొదటి అడుగు అది. గమ్యం కనిపించకపోయినా సరే... నీ ప్రయాణం ఆపవద్దు అనే ‘సంకల్పం’ మాత్రమే ఆమెకు తోడు. నేను కూడా నీకు తోడుగా వస్తానని భర్త నైతిక మద్దతునిచ్చాడు. ‘కుటుంబాన్ని నడిపించాల్సిన నేను వ్యాపారంలో నష్టపోయాను. నా బాధ్యతను నీ భుజాలకెత్తుకున్నావు. ఈ టైమ్‌లో నేను చేయగలిగింది ఇంతవరకే’ అని మాత్రం చెప్పాడాయన. పదమూడేళ్ల కిందట అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు నెలకు వందమందికి పైగా ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి చేరింది. బంధువులను మొహమాట పెట్టి కస్టమర్లుగా మార్చుకోలేదామె. కస్టమర్లను ఆత్మీయ బంధువులుగా మార్చుకున్నారు. మధ్యవర్తులెవరూ లేరు! ‘‘నా కస్టమర్‌కు నేను మంచి క్వాలిటీ ఇవ్వాలి. ధర అందుబాటులో ఉండాలి. అందుకోసం చేనేతకారులున్న ప్రతి గ్రామానికీ వెళ్లాను. ఐదేళ్ల పాటు నిరంతర ప్రయత్నం తర్వాత నేను వారి విశ్వాసం చూరగొనగలిగాను. అప్పటి వరకు చేనేతకారులు వాళ్ల వాళ్ల గ్రామాల్లో షావుకారు చేతిలో ఉండేవారు. షావుకారు నూలు కొనుగోలు కోసం డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటాడు. కాబట్టి చేనేతకారులు నేసిన దుస్తులను షావుకారుకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేదనే విరచిత రాజ్యాంగం ఒకటి అమలులో ఉండేది. బయటి వాళ్లు ఎవరైనా సరే ఆ షావుకారు దగ్గర కొనాల్సిందే. ఏ వ్యాపారమైనా సరే... ఉత్పత్తిదారుడికీ– వినియోగదారుడికి మధ్య వారధిగా ఉండే వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ధర కూడా పెరిగిపోతుంది. నేను ఐదేళ్లు కష్టపడి షావుకారు అనే ఒక మధ్య వ్యక్తిని తొలగించగలిగాను. అలాగే నాకు ఏ కౌంట్ నేత కావాలో, ఏయే కాంబినేషన్లలో కావాలో చేనేతకారులకు ముందుగానే చెప్తాను. ఇంత పోటీలో కూడా నన్ను మార్కెట్లో నిలబెట్టింది. సౌకర్యం విషయంలో ఫ్యాబ్రిక్ ధరించినప్పుడు ఒంటికి హాయిగా అనిపించాలి. మన్నిక విషయంలో పెట్టిన డబ్బు వృథా కాలేదని సంతృప్తి కలగాలి. ఇవే నేను నమ్మిన సూత్రాలు. అనుసరిస్తున్న నియమాలు.’’ అని చెప్పారు గాయత్రి. పిల్లలకు కొంతే ఇవ్వాలి! ‘‘మరో రెండేళ్లకు యాభై ఏళ్లు నిండుతాయి. అప్పటికి షోరూమ్, వేర్ హౌస్, నగరంలో ఉన్న మూడు ప్రింటింగ్ యూనిట్లను ఒక చోటకు చేర్చాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని రకాల వస్త్రకారులను అనుసంధానం చేస్తూ నేను ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ను నా ఉద్యోగులతో నడిపించాలని, ఇక నా పరుగులు ఆపేయాలనేది కోరిక. భగవంతుడి దయ వల్ల పోగొట్టుకున్న ఆస్తులకంటే ఎక్కువే సంపాదించుకున్నాం. పిల్లలను చదివించాం, జీవితాన్ని మొదలుపెట్టడానికి భరోసాగా కొన్ని ఆస్తులను మాత్రమే వాళ్లకు ఇస్తాం. వాళ్ల జీవితాన్ని వాళ్లే మొదలు పెట్టాలి. అలా చేయకపోతే డబ్బు మీద గౌరవం ఉండదు, జీవితం విలువ తెలియదు. ఇక సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలు కావాల్సిన సమయం వచ్చింది. అది నా ఉద్యోగులతోనే మొదలవుతుంది’’ అని చెప్పేటప్పుడు గాయత్రీరెడ్డిలో జీవితం నేర్పిన పరిణతితోపాటు స్థితప్రజ్ఞత కనిపించింది. అక్షరం నేర్పిన విలువలు ఇల్లు దిద్దుకోవడం, చక్కగా వండి పెట్టుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం... ఇదే నా లోకంగా ఉండేది. ఆర్థిక సమస్యలే రాకపోయి ఉంటే నాలో ఇంత శక్తి ఉందని నాకు కూడా ఎప్పటికీ తెలిసేది కాదేమో. అయితే కంచి పరమాచార్య చెప్పినట్లు మనం దేనిని పైకి విసురుతామో అది మనకు అంతకంటే వేగంగా వచ్చి చేరుతుందని నమ్ముతాను. మా వారు మధ్యప్రదేశ్‌లో కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు తప్పని సరై నేర్చుకున్న హిందీ ఇప్పుడు నార్త్ ఇండియా పర్చేజ్కి, అక్కడి నుంచి వచ్చిన పనివాళ్లతో మాట్లాడడానికి పనికొస్తోంది. బెంగళూరులో ఉన్నప్పుడు రోజంతా ఏమీ తోచడం లేదని నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఈ రోజు నన్ను విజేతగా నిలబెట్టింది. అంతకంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. పదో తరగతి వరకే చదివిన నేను మా ఇంటి దగ్గరున్న లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో చందమామ నుంచి ఆధ్యాత్మికం వరకు దాదాపుగా చదివేశాను. ఆ అక్షరజ్ఞానం నేర్పిన విలువలే నాకు యూనిట్ నిర్వహణలో ఉపయోగపడుతున్నాయి. – గాయత్రీరెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి -
‘నాన్న కష్టం చూడలేక’.. సూర్యుడి కంటే ముందే డ్యూటీ
ఈ ఇద్దరమ్మాయిలు... అక్కాచెల్లెళ్లు. అక్క ఇంటర్ ఫస్టియర్... చెల్లి టెన్త్ క్లాస్. ఇద్దరూ ధైర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. నాన్న కోసం కష్టమైన పనిని ఇష్టంగా అందుకున్నారు. ఆడపిల్లలు చేయని సాహసానికి సిద్ధమయ్యారు. చీకటి చీల్చడానికి సూర్యుడు డ్యూటీ చేస్తాడు. ఆ సూర్యుడికంటే ముందే వీళ్ల డ్యూటీ మొదలవుతుంది. సూర్యుడు వెలుతురును పంచేలోపు... ఈ అక్కాచెల్లెళ్లు అక్షరాల వెలుగును పంచుతున్నారు. నాన్నకు ఎదురైన కష్టాన్ని పంచుకున్నారు. ఇంటి చీకటిని తొలగిస్తున్న కాంతి వీచికలయ్యారు. తెలతెలవారుతోంది. హైదరాబాద్ నగర వీథుల్లో రోడ్డు మీద మాణింగ్ వాకింగ్ చేసే వాళ్లు, వీథులు చిమ్మేవాళ్లు తప్ప మనుష్య సంచారం పెద్దగా లేదు. ఓ అమ్మాయి రయ్యిమంటూ స్కూటీ మీద వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. న్యూస్ పేపర్ని రోల్ చుట్టి ఇంటి బాల్కనీలోకి విసిరేసింది. మరో కాలనీలో అంతకంటే చిన్నమ్మాయి ఇంటింటికీ వెళ్లి న్యూస్ పేపర్ వేస్తోంది. ఓ ఇంటి ముందు అప్పటికే నిద్రలేచి ఉన్న ఓ పెద్దావిడ నవ్వుతూ ఆ అమ్మాయిని పలకరించింది. ‘‘ఆడపిల్ల ఇంత ధైర్యంగా పొద్దున్నే ఇలా ఇంటింటికీ వచ్చి పేపర్ వేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందమ్మాయ్! అయినా ఇంత కష్టమైన పనికి ధైర్యంగా ముందుకు రావడం గొప్ప విషయమే. జాగ్రత్త తల్లీ’’ అని జాగ్రత్త చెప్పిందా పెద్దావిడ. ‘‘అలాగే మామ్మ గారూ!’’ అని ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మామ్మగారికి టాటా చెప్పి మరో ఇంటిదారి పట్టింది. న్యూస్‌పేపర్ డెలివరీ చేస్తున్న ఈ అమ్మాయిలు కెలావత్ ప్రమీల, పవిత్ర. హైదరాబాద్, బోరబండ, శివమ్మ బాపురెడ్డి హిల్స్‌లో నివసిస్తున్నారు. రోజూ ఉదయం ఐదింటికే నిద్రలేచి ఆరు లోపు మోతీనగర్ చౌరస్తాలోని పేపర్ పాయింట్‌కు చేరుకుంటారు. ఏడు గంటల లోపు మోతీనగర్ చుట్టు పక్కల ఐదారు కాలనీల్లో పేపర్ వేసేసి, ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయ్యి ఆన్లైన్ క్లాసులకు సిద్ధమవుతారు. పవిత్ర టెన్త్ క్లాస్, ప్రమీల ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కుటుంబానికి కూడా పరీక్ష పెట్టింది. బాయ్స్ మానేశారు ‘‘మా నాన్నకు న్యూస్ పేపర్ లైన్ ఉంది. ఇరవై ఏళ్లుగా పేపర్లు వేస్తున్నాడు. నాన్న దగ్గర బాయ్స్ ఉండేవాళ్లు. మా లైన్లో మొత్తం ఏడు వందల పేపర్లు పడేవి. కరోనా కారణంగా చాలా మంది పేపర్ మానేశారు. బాయ్స్ కూడా పని మానేశారు. కరోనా భయం తగ్గిన తర్వాత కొందరు బాయ్స్ మళ్లీ వచ్చారు. కానీ అప్పటికే పేపర్ కాపీలు బాగా తగ్గిపోయాయి. బాయ్స్‌కు ఒక్కొక్కరికి వెయ్యి, పన్నెండు వందలు ఇవ్వాలంటే నాన్నకు కుదిరేది కాదు. బాయ్స్ లేకుండా అన్ని ఇళ్లకూ నాన్న ఒక్కడే వేయాలంటే టైమ్ సరిపోయేది కాదు. పేపర్ లేటుగా వేస్తే కోప్పడతారు కదా! పైగా నాన్న పేపర్ వేసిన తరవాత ఫిల్మ్ నగర్లో రేషన్ షాపులో ఉద్యోగానికి వెళ్లాలి. నాన్న అటూ ఇటూ పరుగులు తీయాల్సి వచ్చేది. నాన్న కష్టం చూస్తుంటే బాధనిపించేది. దాంతో ‘మేము పేపర్ వేస్తాం నాన్నా’ అని నాన్నని ఒప్పించాం’’ అని చెప్పింది ప్రమీల. రోజూ పేపర్ చదువుతాం నాన్న పనిలో ఉండడం వల్ల మాకు రోజూ ఇంగ్లిష్, తెలుగు పేపర్లు చదవడం అలవాటైంది. మేము చదివేది ఇంగ్లిష్ మీడియమే, కానీ చిన్నప్పటి నుంచి పేపర్లు చదవడం వల్ల తెలుగు కూడా బాగా వచ్చేసింది’’ అని చెప్పారు ప్రమీల, పవిత్ర. బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతామని చెప్తున్న ఈ అక్కాచెల్లెళ్ల సాహస ప్రస్థానం పలువురికి స్ఫూర్తిదాయకం. మెచ్చుకుంటున్నారు! లాక్డౌన్ పోయి అన్‌లాక్ మొదలైంది. కానీ పరిస్థితులు మాత్రం పూర్వపు స్థితికి చేరనేలేదు. పేపర్‌తో కరోనా రాదని తెలిసిన తర్వాత కూడా కాపీలు ముందులాగ పెరగలేదు. ఇప్పుడు మా లైన్లో మూడు వందల కాపీలు వేస్తున్నాం. మేము పేపర్ వేసే ఇళ్లలో పెద్ద వాళ్లు చాలామంది మమ్మల్ని పలకరించి మాట్లాడతారు. ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని పనుల్లోనూ ముందుకు రావాలమ్మా. మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది’ అంటారు. – ప్రమీల పేపర్ల మధ్య పెరిగాం! మేము చిన్నప్పుడు సెలవుల్లో నాన్న పేపర్ వేయడానికి వెళ్తుంటే మారం చేసి మరీ నాన్న స్కూటీ మీద వెళ్లే వాళ్లం. ఈ కాలనీలన్నీ మాకు బాగా తెలుసు. పేపర్ల మధ్యనే పెరిగాం. ఏ కాలనీలో ఏ పేపర్ ఎన్ని కాపీలు వేయాలనే లెక్క కూడా త్వరగానే తెలిసింది. మాకిద్దరికీ స్కూటీ నేర్పించాడు నాన్న. మా అక్క రూట్లో ఇళ్లు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. తను స్కూటీ మీద వెళ్తుంది. దగ్గర దగ్గరగా ఉన్న ఎనభై పేపర్ల రూట్ నాది. పేపర్ వేసిన తరవాత నాన్న, అక్క, నేను ముగ్గురం కలిసి ఇంటికి వెళ్తాం – పవిత్ర – వాకా మంజులారెడ్డి -
డాక్టరవ్వాలని... ఓ కూరగాయలమ్మాయి ఎదురుచూపులు
‘ఒక పేదింటి బిడ్డ డబ్బు లేని కారణంగా చదువుకు దూరం కాకూడదు’ అనే స్ఫూర్తి ఏమైంది? ఒక విద్యా కుసుమం ఎందుకు వాడిపోవడానికి సిద్ధంగా ఉంది? ఎవరైనా వచ్చి పాదులో నీళ్లు పోస్తే సంపూర్ణంగా వికసించాలనే ఆశతో ఎదురు చూస్తోంది. డాక్టర్ అయి తీరాలనే కోరిక ఆ అమ్మాయి చేత ఓ సాహసం చేయించింది. తొలి అడుగు వేయగలిగింది. కానీ విధి పరీక్షల్లో తర్వాతి అడుగులు తడబడుతున్నాయి. ఇంత పెద్ద సమాజంలో పెద్ద మనసుతో ఎవరైనా ముందుకు రాకపోతారా అని బేలగా చూస్తోంది హైదరాబాద్, మోతీనగర్‌లోని అనూష. ‘‘నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవాలనే కోరిక ఉండేది. స్కూల్‌డేస్ నుంచి అదే కలతో చదివాను. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో 945వ ర్యాంకు వచ్చింది. ఎన్సీసీ, స్పోర్ట్స్ పాయింట్లు ఉంటే ఫ్రీ సీటు వచ్చేది. మా పేరెంట్స్ ఇద్దరూ ఏమీ చదువుకోలేదు. నాకు చిన్నప్పుడు ఇలాంటివి చెప్పేవాళ్లెవరూ లేరు. ఏ రిజర్వేషనూ లేదు. ఓపెన్‌లో సీట్ తీసుకుంటే గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఏడాదికి ఏడు లక్షలుంది. ప్రైవేట్‌లో అయితే కోటిదాకా ఉంది. కిర్గిస్తాన్‌లో అయితే పాతిక లక్షల్లో కోర్సు పూర్తవుతుందని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. మా ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. ఆ డబ్బు సమకూర్చుకోవడం కూడా జరిగే పని కాదు. అయితే మెరిట్ స్టూడెంట్‌ని కాబట్టి స్కాలర్షిప్లు వస్తాయని, మిగిలిన డబ్బు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చనుకున్నాను. స్కాలర్షిప్ కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టానో లెక్కేలేదు. ‘ఈపాస్’ లో అయితే ఇరవై సార్లు అప్లయ్ చేశాను. బ్యాంకులోన్ కూడా రాలేదు విద్యాలక్ష్మి పథకానికి అప్లయ్ చేసిన తర్వాత బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. కానీ ష్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం కుదరదన్నారు. కూరగాయల బండిని ష్యూరిటీగా పెట్టుకోలేం. నీ సర్టిఫికేట్లన్నీ బాగున్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఉన్నా... ఆ ఇంటి మీద లోన్ ఇస్తామన్నారు. కానీ మాకు ఇల్లు లేదు. నాకు చదువుకోవడానికి సహాయం చేయమని ఎంతమంది కాళ్లమీదనో పడ్డాను. అందరమూ పని చేస్తున్నాం మా నాన్న వాచ్‌మన్, అమ్మ స్వీపర్‌గా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తోంది. నెలకు తొమ్మిది వేలు వస్తాయి. ఆమె ఉదయం నాలుగు గంటలకు లేచి మార్కెట్‌కెళ్లి కూరగాయలు తెచ్చి, ఆరు గంటలకు తన డ్యూటీకి వెళ్తుంది. మధ్యాహ్నం తర్వాత కూరగాయలమ్మేది. ఇప్పుడు నేను కూరగాయలు అమ్ముతున్నాను. తమ్ముడు డిగ్రీ చదువుతూ ఖాళీ సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు. రోజంతా క్షణం తీరిక లేకుండా పని చేసి కూడబెట్టుకున్న డబ్బును అనారోగ్యం హరించి వేసింది. ఇక ఇప్పుడు మూడవ సంవత్సరం చదువుకు వెళ్లాలి. రెండవ సంవత్సరం ఫీజు, ఈ ఏడాది ఫీజు కలిపి పది లక్షలు కట్టాలి. నేను కాలేజ్‌లో అడుగుపెట్టగలిగేది ఆ డబ్బు చేతిలో ఉంటేనే’’ అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది అనూష. ఆమె మాటల్లో అన్ని దారులూ మూసుకుపోయాయనే దిగులుతోపాటు ఏదో ఒక దారి కనిపించకపోతుందా అనే చిరు ఆశ కూడా కనిపించింది. ఆమె ఆశ, ఆశయం నెరవేరుతాయని భావిద్దాం. విధి కూడా ఆడుకుంటోంది ఎలాగైనా డాక్టర్నవ్వాలనే ఆశతోనే కిర్గిస్తాన్‌లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో చేరాను. కిర్గిస్తాన్ వెళ్లడానికి చెవి కమ్మలతో సహా ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మేశాం. చిట్టీల డబ్బులు... అంతా కలిపితే మూడు లక్షలు జమయ్యాయి. మొదటి ఏడాది ఫీజు ఆరులక్షల్లో సగం ఫీజు కట్టాను. రెండవ ఏడాదిలో ఉండగా మరో మూడు లక్షలు కట్టాను. రెండవ ఏడాది ఫీజు కట్టాల్సిన సమయంలో అమ్మకు యాక్సిడెంట్ అయింది. ఫీజు కోసం సమకూర్చుకున్న డబ్బు వైద్యానికి అయిపోయింది. కాలేజ్ ప్రొఫెసర్లు ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో ఫీజు కట్టకనే పరీక్షలు రాయగలిగాను. ఇంతలో కరోనా రూపంలో మరో ఉత్పాతం వచ్చి పడింది. కాలేజ్ యాజమాన్యం స్టూడెంట్స్ అందరినీ వారి దేశాలకు పంపించి వేసింది. నేను ఇండియాకి వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. నా వైద్యం కోసం మళ్లీ అప్పులు. ఐదు లక్షలు ఖర్చయ్యాయి. – వాకా మంజులారెడ్డి -
మనోజ్ఞ అద్దకం
పదేళ్ల కిందటి మాట. మచిలీపట్నం కలంకారీ పరిశ్రమ ఖాయిలా పడడానికి సిద్ధంగా ఉంది. పెడనలో ఉన్న అద్దకం బల్లలు నిరుత్సాహంగా ఊపిరి పీలుస్తున్నాయి. కుటుంబ వారసత్వంగా అంది వచ్చిన కళ అన్నం పెడుతుందనే భరోసా లేకపోవడంతో ఒక్కొక్కరు ఇతర మా ర్గాలకు మళ్లుతున్నారు. ఒక్కో అద్దకం బల్ల అటకెక్కుతోంది. అలాంటి సమయంలో కలంకారీ కళలో జీవితాన్ని వెతుక్కున్నారు మనోజ్ఞ. ఈ కళతో పరిచయం లేని కుటుంబం ఆమెది. అయినా ఈ కళ మీద ఇష్టంతో అద్దకపు ముద్రికను అందుకుంది. మగవాళ్లే ఒక్కొక్కరుగా దూరమవుతున్న ఈ రంగంలో పరిశ్రమ స్థాపించారు మనోజ్ఞ. ఆ రోజు ఆమె వేసిన తొలి అడుగు మరెంతో మందికి ఆసరా అయింది. ఒక విస్తారమైన కలంకారీ సామ్రాజ్యానికి పునాది అయింది. ఆమె జీవితాన్ని మనోజ్ఞంగా డిజైన్ చేసుకుని, చక్కగా అద్దుకుంది. పెళ్లి ఖర్చు నాలుగువేలు ‘‘మా సొంతూరు నూజివీడు. నాన్నగారి అనారోగ్యరీత్యా మా కుటుంబాన్ని మా మేనమామ మచిలీపట్నానికి తీసుకువచ్చారు. 2009 ఫిబ్రవరిలో నవీన్‌తో నా పెళ్లయింది. పెళ్లి ఖర్చు నాలుగు వేల రూపాయలు. నిరాడంబరత కోసం కాదు, అంతకంటే ఖర్చు చేయగలిగిన స్థితి లేకనే. మా వారు అప్పటికే ఫ్యాన్సీ షాప్ పెట్టి నష్టపోయి ఉన్నారు. నేను కూడా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని అర్థమైంది. పెడనలో ముద్రించిన కలంకారీ మెటీరియల్ 2,870 రూపాయలకు కొన్నాను. అదే నా తొలి పెట్టుబడి. ఆ కలంకారీ మెటీరియల్‌తో చీరకు బోర్డరు, బ్లవుజ్, పల్లుకి చిన్న పువ్వులు (ఆ పూలను చీర మీద అప్లిక్ వర్క్‌లాగా కుట్టించుకోవడమే) వచ్చేటట్లు కట్ చేసి అంచులు కుట్టి సెట్ తయారు చేశాను. అది బాగా క్లిక్ అయింది. పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చాయి. రా మెటీరియల్ (కలంకారీ డిజైన్ అద్దిన క్లాత్) అవసరం భారీగా పెరిగింది. మెటీరియల్ సరఫరా సక్రమంగా కొనసాగి ఉంటే నాకు అద్దకం పరిశ్రమ స్థాపించాల్సిన అవసరం ఉండేది కాదు. సహాయ నిరాకరణ! కలంకారీ పరిశ్రమ కుటీర పరిశ్రమగా విస్తరించిన పెడనలో దళారీ వ్యవస్థ పాతుకుపోయి ఉండేది. మాకు మెటీరియల్ సమయానికి అందేది కాదు. కొన్ని సందర్భాలలో నాణ్యత లేని మెటీరియల్ వచ్చేది. అలాంటి మెటీరియల్‌తో వ్యాపారం చేస్తే మా క్రెడిబులిటీ దెబ్బతింటుంది. అందుకోసం సొంతంగా అద్దకం పరిశ్రమ పెట్టాలనే నిర్ణయానికి వచ్చాం. అలా 2014లో దసరా రోజున కలంకారీ ప్రింటింగ్ యూనిట్, 2015 ఫిబ్రవరిలో గార్మెంట్స్ యూనిట్ ప్రారంభించాం. పని నేర్చుకున్నాను! కలంకారీ మీద ఇష్టంతో అద్దకం కూడా నేర్చుకున్నాను. కానీ అద్దకం పనికి విశాలమైన ప్రాంగణం, పెద్ద షెడ్, టేబుళ్లు కావాలి. ఇంత పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్‌కు డబ్బు లేదు. అప్పుడు మా నవీన్ ఫ్రెండ్ కిషోర్‌యాదవ్ గారు అర ఎకరం స్థలాన్ని, అందులో నిర్మించిన విశాలమైన షెడ్‌ని వాడుకోమన్నారు. కలంకారీ కళ మరుగున పడకుండా ప్రపంచ ప్రఖ్యాతి సాధించడానికి తన వంతు సహాయంగా ఆయన ఆ షెడ్‌ను ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మా యూనిట్ రెక్కలు విచ్చుకున్న సీతాకోక చిలుకలా మారింది. మా శ్రమకు ఫలితం త్వరగానే దక్కింది. ఆరునెలల్లో బ్రేక్ ఈవెన్ వచ్చింది. మేము ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత యూనిట్‌ని రాయవరానికి మార్చాం. ఏడు వందల ప్యాటర్న్‌లా! చీరల మీద అనేక ప్రయోగాలు చేశాను. ఆర్గండి, క్రేప్, సిల్క్, నెట్... ఇలా రకరకాల క్లాత్‌ల మీద కలంకారీ అద్దకాలు వేశాం. ఆ ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఒక్క చీరల మీద అద్దకంలోనే ఏడు వందల ప్యాటర్న్లు రూపొందించాం. చుడీదార్లలో 55, బెడ్షీట్లలో 180 ప్యాటర్న్‌లను రూపొందించాం. అద్దకంలో ప్రతి దశనూ నోట్స్ రాసుకుంటాను. తర్వాత ఏం చేయాలో ఒక స్టిక్కర్ మీద రాసి అతికిస్తాను. ‘కరక్కాయ ప్రాసెస్ అయింది– బ్యాక్‌గ్రౌండ్ వేయాలి, బ్యాక్ గ్రౌండ్ అద్దకం అయింది– అవుట్‌లైన్ అద్దాలి, అవుట్‌లైన్ అయింది– ఫిల్లింగ్ అద్దాలి’ ఇలాగన్నమాట. దాంతో పనివాళ్లకు రోజూ నేను దగ్గరుండి ఏ క్లాత్ మీద ఏది అద్దాలనే ఆదేశాలు ఇవ్వాల్సిన పని ఉండదు. పేరు వెనుక... మా పరిశ్రమ పేరు మానవ్... అంటే ఏమిటని అందరూ అడుగుతుంటారు. నా పేరు మనోజ్ఞలోని మొదటి రెండు (‘ఎంఎ’) అక్షరాలు, మా వారు నవీన్ పేరులోని మొదటి మూడు (‘ఎన్ఎవి’) అక్షరాల సమాహారమే మానవ్’’ అని వివరించారు మనోజ్ఞ. నిపుణుల తయారీ! ఇరవై మంది మహిళలకు ఆరు నెలల పాటు నెలకు నాలుగు వేల రూపాయలు ఉపకార వేతనం ఇస్తూ పని నేర్పించాం. ఇప్పుడు వారిలో నెలకు తొమ్మిది–పది వేలు సంపాదించుకునే వాళ్లున్నారు. వీళ్లంతా 18 ఏళ్ల నుంచి 30–35 ఏళ్ల లోపు వారే. ఈ ప్రయత్నం ద్వారా మరో 30 సంవత్సరాల వరకు కలంకారీ కళను బతికించడానికి మా వంతు ప్రయత్నం చేశామనే సంతృప్తి కలుగుతోంది. వీరంతా ఈ వృత్తిలో సంతోషంగా ఉంటే మరో తరం కూడా తయారవుతుంది. నేను ఉపాధి పొందడంతోపాటు కొడిగడుతున్న కలంకారీ పరిశ్రమను నిలబెట్టాలనేదే నా ప్రయత్నం. కలంకారీ కాకుండా వేరే చెప్పడానికి నా జీవితంలో ఏమీ లేదు. మా ఇద్దరమ్మాయిలకు కూడా ఈ పని నేర్పిస్తాను. – తుమ్మలపల్లి లక్ష్మీ మనోజ్ఞ ‘మానవ్ కలంకారీ’ వ్యవస్థాపక నిర్వాహకురాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎక్మోర్ లైఫ్
గుండె ఆగిపోయినా ఊపిరితిత్తులు పనిచేయకపోయినా ప్రాణాల్ని నిలబెట్టే మెషీన్ మోర్ లైఫ్ ఇచ్చే ట్రీట్మెంట్ ‘ఎక్మో’ గుప్పెడంత గుండె చేసే సంక్లిష్టమైన పనులను, ఊపిరితిత్తుల పనిని ఎక్మో మెషీన్ చేస్తుంది. దీని సహాయంతో దేహంలోని భాగాలన్నింటికీ ఆక్సిజెన్, రక్తం సరఫరా అవుతుండడంతో ఆయా భాగాలు వాటి పనితీరును సక్రమంగా నిర్వహించగలుగుతాయి. ఈ మెషీన్‌తో పేషెంటుకి బయటి నుంచి లైఫ్ సపోర్టు ఇస్తూ దేహంలో అనారోగ్యానికి గురైన అవయవానికి చికిత్స నిర్వహిస్తారు. ఈ టెక్నాలజీ గుండె కంటే శ్వాసకోశ వ్యవస్థలో లోపాలను సరి చేయడానికి బాగా ఉపకరిస్తుంది. హార్ట్ పేషెంట్లలో సక్సెస్‌రేట్ 40 నుంచి 50 శాతం ఉంటే, లంగ్స్ పేషెంట్లలో 60- 70 శాతం సక్సెస్ రేట్ ఉంటుంది. హార్ట్ పేషెంట్లలో గుండె సాధారణ స్థితికి రావడం కష్టమనిపించినప్పుడు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ప్రయత్నించాల్సి ఉంటుంది. కానీ... అందులో సక్సెస్‌రేట్ చాలా తక్కువ. దేహం ఫారిన్ బాడీని అంత సులువుగా ఆమోదించకపోవచ్చు. అప్పుడు మళ్లీ గుండె రికవర్ అయ్యే వరకు ఎక్మో సపోర్టు తీసుకోవాల్సిందే. అయితే ఎక్మో పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పడం కష్టమే. అది పేషెంట్ వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యం, రోగనిరోధక శక్తి వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్మో ఎలా పని చేస్తుంది? పేషెంటు తొడలోని సిర (వీన్) నుంచి ట్యూబు ద్వారా రక్తాన్ని మెషీన్‌లోని ట్యూబుకు అనుసంధానం చేస్తారు. అది మెషీన్‌లోని నియమిత పైపుల ద్వారా ప్రయాణించి మెంబ్రేన్ అరలోకి చేరుతుంది. అక్కడ కార్బన్డయాక్సైడ్ వేరవుతుంది. అక్కడి నుంచి ఆక్సిజనేటర్లోకి చేరి ఆక్సిజెన్‌తో కలిసి రక్తం ప్యూరిఫై అవుతుంది. శుద్ధి అయిన రక్తం మరొక ట్యూబ్ ద్వారా గుండె దగ్గర ఉండే ధమని (ఆర్టరీ)కి చేరుతుంది. అక్కడి నుంచి దేహంలోని అన్ని భాగాలకూ ప్రసరిస్తుంది. దేహ భాగాల నుంచి సిరల ద్వారా చెడు రక్తాన్ని సేకరించి, దానిని మంచి రక్తంగా మార్చి ధమనుల ద్వారా దేహమంతటికీ చేరవేస్తుంది. మానిటర్ మీద పల్స్‌రేటు, రక్తం సరఫరా వేగం నమోదవుతుంటుంది. ఎక్మో పరికరం గుండె చేయాల్సిన పనిని, శ్వాస వ్యవస్థ పనిని కూడా చేస్తుంది. వైద్యం ద్వారా శ్వాస వ్యవస్థ, గుండె లోపాలను సరిదిద్దే వరకు ఈ పరికరం వాటికి విశ్రాంతినిస్తుంది. ఓ వారం ఆగాల్సిందే! ఎక్మో పరికరంతో సపోర్టు మొదలుపెట్టిన తర్వాత రోగి స్పందన కోసం ఐదు నుంచి ఏడు రోజులు ఆగాల్సి ఉంటుంది. వారం తర్వాత ఈ యంత్రం నుంచి అందే సపోర్టును కొద్దిగా తగ్గించి దేహంలో స్పందనలను గమనిస్తారు. పల్స్, బిపిని పరీక్షిస్తూ, ఎకో పరీక్షలు కూడా చేస్తారు. ఇది నిపుణులైన వైద్యం బృందం ఆధ్వర్యంలో జరగాలి. ఎక్మో సపోర్టు తగ్గించినప్పుడు రక్త సరఫరా, పల్స్ ఒక మోస్తరుగా పని చేస్తున్నా రోగి చక్కగా స్పందిస్తున్నట్లే చెప్పాలి. అలాంటప్పుడు క్రమంగా ఎక్మో సపోర్టు తగ్గిస్తూ గుండె, శ్వాసవ్యవస్థ పూర్తి స్థాయిలో సొంతంగా పని చేసే వరకు పర్యవేక్షిస్తారు. దీని అవసరం ఎప్పుడు? ఎక్మో ట్రీట్మెంట్ సాధారణంగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్, కార్డియాక్ ఫెయిల్యూర్ అయిన సందర్భాలలో నేరుగా ఉపయోగిస్తారు. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే డయాలసిస్ చేయాల్సినప్పుడు దీని సహాయాన్ని పరోక్షంగా తీసుకుంటారు. కిడ్నీ ఫెయిల్యూర్లో పేషెంటు దేహం నుంచి రక్తాన్ని డయాలసిస్ యంత్రంలోకి సేకరించకుండా ఎక్మో పరికరం ద్వారా డయాలసిస్ యంత్రానికి రక్తాన్ని సరఫరా చేస్తారు. కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించిన వెంటనే పేషెంటుకు సిపిఆర్ (కార్డియో పల్మనరీ రెససిటేషన్) చేస్తారు. అంటే గుండె మీద ఒత్తిడి కలిగిస్తూ గుండె తిరిగి కొట్టుకునే అవకాశం కోసం ప్రయత్నించడం. పేషెంటు ప్రాణాలను కాపాడడానికి సిపిఆర్ చేసి బ్లడ్ ప్రెషర్ మెయింటెయిన్ చేస్తూ ఎక్మో మెషీన్‌ను సిద్ధం చేసుకోవాలి. పేషెంటును ఎక్మో పరికరానికి అనుసంధానం చేసిన క్షణం నుంచి దేహంలో అన్ని అవయవాలూ యథాతథంగా పని చేస్తుంటాయి. అలా ఎన్ని రోజులైనా కొనసాగించవచ్చు. ఏడెనిమిది వారాలపాటు ఉంచినా పేషెంటు కోలుకునే సూచనలు లేవనిపించినప్పుడు వైద్యబృందం ఆ సంగతిని పేషెంటు బంధువులకు తెలియ చేస్తుంది. హార్ట్ పేషెంట్ల విషయంలో ఎక్మో ట్రీట్మెంట్ చివరి ప్రయత్నం అనే చెప్పాలి. ప్రయత్నించకుండా వదిలేయడం కంటే ప్రయత్నించి ఫలితాల కోసం ఎదురు చూడడాన్నే వైద్యరంగం కోరుకుంటుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎక్మో ద్వారా కోలుకున్న కేసులు తప్పని సరిగా ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం ఒకింత తక్కువ. ముందుగా చెప్పుకున్నట్లు పేషెంటు వయసు, ఇతర అనేక అంశాలతోపాటు దేహం ట్రీట్మెంట్కి స్పందించడం వంటివన్నీ కీలకమే. ఇది ఖరీదైన వైద్యం! ఎక్మో పరికరాలు హైదరాబాద్‌లో ఏడెనిమిదికి మించి లేవు. ఈ ట్రీట్మెంట్లో తొలిరోజే నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చవుతుంది. వయసులో ఉండి, తగినంత డబ్బు ఉన్న సందర్భాలలోనే ఇది సాధ్యమవుతుంది. ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ ప్యాకేజ్‌లలో ఇది చేరలేదు. ప్రభుత్వం పూనుకుంటేనే ఇది సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది. వెంటిలేటర్కీ ఎక్మోకీ తేడా! వెంటిలేటర్ ద్వారా లంగ్స్‌లోకి నేరుగా ట్యుబ్ ద్వారా గాలిని పంపిస్తారు. ఆ గాలిని తీసుకుని మిగిలిన పని మొత్తం శ్వాసకోశ వ్యవస్థ చేసుకోవాలి. వెంటిలేటర్ నుంచి అందిన గాలిని దేహం స్వీకరించలేకపోతున్నప్పుడు ఎక్మో సేవలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. దీని ద్వారా ఊపిరితిత్తులకు కొంత విశ్రాంతినిచ్చినట్లవుతుంది. అలాగే వెంటిలేటర్ వాడినప్పుడు ట్యూబు ద్వారా లంగ్ ఇంజ్యూరీ రావచ్చు. ఎక్మోతో ఆ ఇబ్బందులు ఉండవు. ఈసిఎంఓ... ఎక్మో... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితి విషమించిన నేపథ్యంలో తరచుగా వినిపించిన మాట. ఈసిఎంఓ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేనస్ ఆక్సిజనేషన్. దీనిని ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్టు అని కూడా వ్యవహరిస్తారు. ఈ టెక్నాలజీతో శ్వాసకోశ, గుండె సమస్యలు ఎదురైనప్పుడు పేషెంటుకి బయటి నుంచి మెడికల్ సపోర్టు అందిస్తారు. - వాకా మంజులారెడ్డి డాక్టర్ కిశోర్ జయంతి పీడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివిస్ట్ అండ్ ఎక్మో స్పెషలిస్ట్, స్టార్ హాస్పిటల్ హైదరాబాద్. గుండెపోటుకూ...గ్యాస్‌కూ తేడా! గుండెపోటు లక్షణాలూ, గ్యాస్ పైకి ఎగజిమ్మినప్పుడు కనిపించే లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. దాంతో అది గుండెపోటా లేక అంతగా ప్రమాదం కలిగించని గ్యాస్ సమస్యా అన్నది తెలియక కొందరు అయోమయానికి గురవుతుంటారు. సాధారణంగా చాలామంది గుండెపోటు, గ్యాస్ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. వాస్తవానికి అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ ఇలా ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేదని మీరు భావిస్తే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే. గుండెనొప్పి (యాంజైనా)తో పాటు తేన్పులు వస్తుంటాయి. అందుకే దీన్ని గ్యాస్ సమస్యగా అపోహపడుతుంటారు. కొంతమంది శారీరక శ్రమ / ఉద్వేగం తర్వాత 5 - 15 నిమిషాల పాటు నొప్పి ఉంటుంది. మరికొందరిలో ఇది 20 నిమిషాలు కొనసాగుతుంది. నిమిష నిమిషానికీ చెమటలు పట్టడం పెరుగుతూ, వాంతులు, శ్వాస అందకపోవడం, చివరకు స్పృహ తప్పడం కూడా జరగవచ్చు. అప్పుడు దాన్ని గుండె సమస్యగానే పరిగణించాలి. ఉపశమన మందులు వాడినా.... నొప్పి తగ్గకపోతే సత్వరం రోగిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయాలి. పైన పేర్కొన్నట్లు నొప్పి తగ్గకుండా అదేపనిగా కొనసాగుతూనే ఉంటే పూర్తిగా గుండె సంబంధితమైన నొప్పిగా పరిగణించాలి. డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ హైదరాబాద్. -
గడుసు దెయ్యం
చేతనబడి సాధారణంగా... దెయ్యం మనిషిని పట్టుకుంటుంది. మరి, మనిషే దెయ్యాన్ని పట్టుకుంటే? అక్కడో కథ ఉంటుంది. వ్యథ ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్నది వేరే టాపిక్. ఈ కథలోని అమ్మాయి దెయ్యాన్ని పట్టుకుంది. పట్టుకుని ఏం చేసింది? ఏం సాధించింది? చదవండి. మాఘమాసం. ‘ఇదిగో.. వెళ్లిపోతున్నా’నన్న సంకేతాలిస్తూనే మధ్యరాత్రి రగ్గు వెతుక్కునేటట్లు చేస్తోంది చలి. పగలవగానే సూర్యుడూ బద్దకంగానే ఒళ్లు విరుచుకుంటున్నాడు. ఉండీలేనట్లున్న చలి; లేనట్లు, ఉన్నట్లున్న గోరువెచ్చని ఎండ. పెళ్లి పనులు చేసుకోవడానికి, పెళ్లికి హాజరయ్యే వారికి హాయైన వాతావరణం ఇది. ఉదయం పది గంటలు. కల్యాణిని పెళ్లి కూతురిగా అలంకరిస్తున్నారు. ఇంటి ముందు పెళ్లిపందిరి. బంధువులు ఒక్కొక్కరే వస్తున్నారు. పట్టుచీర కట్టుకున్న వధువు మండపంలోకి అడుగుపెట్టింది. కొబ్బరికాయను పూజారి చేతిలో పెట్టి పీటల మీద కూర్చుంది. పూజారి ఇచ్చిన అక్షతలను గౌరీదేవి మీద వేయకుండా పూజారి ముఖం మీదకు చల్లింది! పూజారి ఖంగుతిన్నాడు. అంతలోనే సర్దుకుని ‘గౌరీదేవికి పూజ చేయమ్మా’ అన్నాడు అనునయంగా. అమ్మాయి కళ్లెర్రబడ్డాయి. బాడీ లాంగ్వేజ్ మారింది. ‘ఎందుకు గౌరీ పూజ, ఎవరికి పెళ్లి చేస్తున్నావ్’ అంటూ పూజ సామగ్రిని చిందరవందర చేస్తోంది. వేదిక కింద కూర్చున్న వాళ్లకు పరిస్థితి అర్థంకావడం లేదు. ‘పెళ్లి కూతురికి దెయ్యం పట్టినట్లుంది’... గుసగుసలాడుతున్నారు వేదిక మీదున్న మహిళలు. ‘ఆ...’ అంటూ కంగారుపడ్డారు పెళ్లికొడుకు బంధువులు. వెంటనే వేదిక దిగి ఓ పక్కగా గుమిగూడి... ‘పెళ్లిచూపులప్పుడు బాగానే ఉందా, అప్పుడెవరెవరెళ్లారు, వాళ్లింట్లో ఇంకెవరికైనా గాలి పట్టిందా...’ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఆరా తీస్తున్నారు. ఈ మాటలన్నీ పెళ్లికూతురి బంధువుల చెవిన కూడా పడుతున్నాయి. ‘లక్షణంగా చదువుకుంటున్న పిల్ల. ఎప్పుడూ ఇలాంటిది లేదు. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు దెయ్యం పట్టడమేంటి?’ ఆందోళన మొదలవుతోంది వారి గుండెల్లో. అబ్బాయి వాళ్లు ఏమనుకుంటారో ఏమో... పెళ్లి ఆగకుండా మూడుముళ్లు పడితే చాలు’ ఆని మనసులోనే దేవుళ్లకు మొక్కుకుంటోంది అమ్మాయి తల్లి రాణెమ్మ. తండ్రి ‘బాణు’ ముఖం ఎర్రగా కందగడ్డలా ఉంది. అమ్మాయి మేనమామలు చొరవ తీసుకుని పెళ్లికొడుకు అన్నావదినలకు నచ్చచెబుతున్నారు. ఎలా స్పందించాలో తెలియని అయోమయం వారిది! నీ కోరికలు చెప్పమ్మా! దెయ్యం... కోరిన కోరికలు తీరిస్తే వదులుతుందని నమ్మకం. ఇద్దరు మహిళలు ధైర్యం చేసి ‘నీకేం కావాలమ్మా’ అనగానే... రకరకాలుగా నోరంతా తెరిచి విచిత్రంగా అభినయిస్తూ ‘మాంసం, చేపలు, కోళ్లు...’ జాబితా చదువుతోంది. ‘అమ్మో! ఇది రాకాసి దెయ్యమే...’ నిర్ధారణకు వచ్చేశారు పెళ్లికొడుకు బంధువులు. మంచి దెయ్యమైతే పూలు, చీరలు, ఆకు, వక్క, తాంబూలం వంటివి అడుగుతుందని, అవి పెద్దగా హానికరం కాదని, మాంసం అడిగిన దెయ్యాలు భయంకరమైనవని, అవి ప్రాణాన్ని బలి తీసుకునే వరకు వదలవని నమ్ముతారు. పెళ్లి కూతురు మాంసం అడగడంతో ... ‘అసలే పెద్ద దిక్కు లేని కుటుంబం మాది. అమ్మానాన్నలు లేని వాడిని అన్నావదినలు పట్టించుకోకుండా వదిలేశారంటారని బాధ్యతగా పెళ్లి చేస్తున్నాం. ఈ దెయ్యాన్ని ఇంటికి తీసుకెళ్తే మాలో ఎవర్ని మింగుతుందో ఏమో’ అని మనసులో ఉన్న భయాన్ని కక్కేసింది పెళ్లికొడుకు వదిన. అంతే... అబ్బాయి వాళ్లంతా ఒక్కొక్కరుగా మాయమయ్యారు. గతం మెదిలింది! ఇంతలో అమ్మాయి పీటల మీద నుంచి లేచి నిలబడింది. తండ్రిని ‘ఏరా’ అని సంబోధిస్తోంది. బాణు పరుగెత్తుకుంటూ వెళ్లి కూతురి ఎదురుగా నిలబడ్డాడు. కూతురి మాటల్ని బట్టి ఆమెను పూనింది తన తండ్రని భావించాడతడు. ‘పిల్లకు ఇష్టం లేని పెళ్లి చేస్తావురా, నేన్నీకు అట్లనే చేసిన్నా’ అంటూ రంకెలు వేస్తోంది. నిలువునా కూలబడిపోయాడతడు. బంధువులు ధైర్యం చెబుతున్నారు. ఆడవాళ్లు పెళ్లికూతురిని శాంత పరుస్తున్నారు. బంధువుల్లో ఓ పెద్దాయన చొరవగా బాణుతో ఓ మాటన్నాడు. ఆ మాటతో బాణు కళ్ల ముందు ‘నాగు’ మెదిలాడు. అతడి కొడుకులు సునంద్, ప్రమోద్లకైతే గతంలో.. కల్యాణి జోలికి రావద్దని నాగును మందలించిన సంఘటన కూడా కళ్ల ముందు మెదిలింది. సందేహంగా తండ్రి వైపు చూశారు. ‘మేము మాట్లాడతాం’ అంటూ మరికొందరు ఆత్మీయులు ముందుకొచ్చారు. నాగు కూడా ఆ పెళ్లికి వచ్చాడు! అయితే పెళ్లి ఆగిపోయింది. ఇంకా అక్కడే ఉంటే ఏం బావుంటుందని వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు నాగు, అతడి అన్నలు. ‘కల్యాణిని పెళ్లి చేసుకుంటావా’ అని నాగును అడగ్గానే... ‘నాకిస్తారా’ అంటూ బదులు ప్రశ్నించాడు నాగు. ‘మేమిప్పుడే వస్తా’మని వధువు గదిలోకి వెళ్లారు పెద్దలు. ‘నాగును పెళ్లి చేసుకోవడానికే ఇదంతా’ అనేసిందా అమ్మాయి. ఆ ఒక్క సందర్భం మినహా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ అమ్మాయికి దెయ్యం పట్టనేలేదు. పెద్దవాళ్లకు పెద్ద మనసుండాలి పెద్దవాళ్లు... పెద్దవాళ్లమనే మొండితనంతో ఇష్టంలేని పెళ్లిని పీటల వరకు తీసుకురాకపోయి ఉంటే ఆ అమ్మాయికి అసలు దెయ్యమే పట్టేది కాదు. ఒక మూర్ఖత్వం నుంచి తప్పించుకోవడానికి ఈ మూఢత్వాన్ని ఒంటబట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పుకోవడానికి సరదాగానే ఉంటుంది. కానీ అప్పటి వరకు ఒక అమ్మాయి పడిన ఆవేదనను వివరించడానికి మాటలు చాలవు. కల్యాణి ధైర్యం ఉన్న అమ్మాయి. దెయ్యం డ్రామాతో కథను సుఖాంతం చేసుకుంది. కానీ చాలా మంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మౌనంగా రోదిస్తూ జీవిస్తుంటారు. మరికొంత మంది జీవితాన్ని అంతం చేసుకుంటారు. అందుకే... తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వాళ్లను ప్రేమించినంతగా వాళ్ల ఇష్టాల్నీ ప్రేమించగలగాలి. పిల్లల ప్రేమలో ఆకర్షణ తప్ప జీవితానికి బంధం ఏర్పడే భరోసా లేదనిపించినప్పుడు ఆ విషయాన్ని వారితోనే మాట్లాడాలి. వారిని మాట్లాడనివ్వాలి. పిల్లల్ని కన్విన్స్ చేయాలి. తల్లిదండ్రులు ఏది చెప్పినా పిల్లల పట్ల ప్రేమతోనే చెబుతారనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి. పిల్లల ఎంపిక బావుందనే భరోసా కలిగితే పెద్దలూ ఒప్పుకోవాలి. అలాగే పేరెంట్స్ చెప్పిన విషయాన్ని ఓ క్షణం పాటు వాళ్ల స్థానంలో నిలబడి ఆలోచిద్దాం అని పిల్లలూ అనుకోవాలి. వాళ్లనుకోకపోతే తల్లిదండ్రులే ‘మా స్థానంలో నిలబడి ఆలోచించ’మని ఓ రిక్వెస్ట్ చేస్తే పోయేదేమీ ఉండదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి గమనిక: వ్యక్తుల పేర్లు మార్చాం. నాగు ఎవరు? అనంతపురం జిల్లా, ముదిగుబ్బ గ్రామంలో బాణు పొలాన్ని కౌలు చేసేవాళ్లు నాగు అన్నలు. ఆ కుటుంబంతోదూరపు బంధుత్వం కూడా ఉంది. ముగ్గురన్నలు కష్టపడుతూ చిన్నవాడిని చదివించారు. అనంతపురం కాలేజీలో నాగు డిగ్రీ చదివేటప్పుడు కల్యాణి ఇంటర్ చదివేది. ఒక ఊరి వాళ్లు, తెలిసిన వాళ్లు కావడంతో కలిసి ప్రయాణించేవారు. సాన్నిహిత్యం పెరుగుతుందేమోనని సందేహ పడిన కల్యాణి అన్నదమ్ములు నాగును మందలించారోసారి. అప్పటి నుంచి కల్యాణి, నాగుల సాన్నిహిత్యం పెరిగింది. ప్లాన్ లేదు కానీ... ప్రేమ ఉంది నాగుతో ‘కల్యాణికి దెయ్యం ప్లాన్ ఇచ్చింది నువ్వేనా’ అంటే ‘అదేమీ లేదబ్బా’ అన్నాడు కంగారుగా. ‘ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతుంటే బాధతో ఆ పరిసరాల్లోకి రాకుండా దూరంగా ఉంటారు ఎవరైనా. మరి నువ్వు పెళ్లి పందిట్లో ఎందుకున్నావు’ అని అడగ్గానే... నవ్వుతూ ‘పోనివ్వకూడదూ’ అని... ‘ఆ అమ్మాయి ఎప్పుడైనా ప్రేమిస్తున్నానని నాతో చెప్పిందా, లోపలే దాచుకుంది. నాకు మాత్రం చెప్పాలని ఉండేది. వాళ్ల డబ్బు చూసి భయమేసేది’ అన్నాడు. వాళ్లిద్దరూ పెళ్లయ్యాక ఎం.ఎ, బిఈడీ చేసి, ఇప్పుడు బెంగళూరులో టీచర్లుగా ఉద్యోగం చేసుకుంటున్నారు. నాలుగేళ్ల కొడుకుతో ఆనందంగా జీవిస్తున్నారు. - ఎస్. శంకర శివరావు, కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ -
బిడ్డ పేలిక
పురిటినొప్పుల కంటే భరించలేని నొప్పులు ఏవో చెప్పుకోండి?! గొడ్రాలి నొప్పులు! ఈ నొప్పులు కడుపులోంచి తన్నుకురావు. సమాజమే స్వయంగా వచ్చి తన్నిపోతుంది. ఎలాగైనా ఈ నొప్పుల్నుంచి బయటపడాలి. ఒక పేలిక దొరికినా పట్టుకుని ఈ గొడ్రాలి సముద్రాన్ని ఈదేయాలి. కానీ... అదే పేలిక.. ముంచింది! బిడ్డ అచ్చం వాళ్ల నాన్న పోలికే... మా తమ్ముణ్ని చూసినట్టే ఉంది... మేనల్లుడి బుగ్గలు పుణుకుతూ మురిసిపోతోంది మేనత్త. రంగు మేనమామది... అంటూ నచ్చని వాటిని అవతలి వాళ్ల మీదకు తోసేసే ప్రయత్నం చేస్తోంది నానమ్మ. వాళ్లమ్మ కళ్లలాగానే చెంపకు చారడేసి ఉన్నాయి... అంటూ మనవడి అందంలో తన కూతురి భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తోంది బిడ్డ అమ్మమ్మ. పోలికలు ఎవరివైతేనేం... ఎలా ఉంటేనేం... కన్నొంకర కాలొంకర లేకుండా సక్కంగా పుట్టాడు... బంగా...రయ్య... వీడి తాతలాగానే మంచిపేరు తెచ్చుకోవడం నా కళ్లతో చూడాలి... అంటూ బిడ్డ తాతమ్మ మంచంలో కూర్చుని బుడ్డోడి భవిష్యత్తును రీళ్లురీళ్లుగా విజువలైజ్ చేసుకుంటోంది. బిడ్డను చూడడానికి వచ్చి వెళ్లే బంధువులు, స్నేహితులతో ఇల్లు సందడిగా ఉంది. అందరిలా ఆ ఊళ్లోని ఒకామె కూడా వచ్చి బిడ్డను చూసి, తల్లిని పరామర్శించి చాలాసేపు ఉంది. ఆనక వెళ్లలేక వెళ్లలేక, తిరిగి తిరిగి చూస్తూ వెళ్లిపోయింది. మరుసటి రోజు కూడా వచ్చింది. బిడ్డ మంచాన్ని వదలకుండా దగ్గరే కూర్చుంటోంది. కొంతసేపటికి అయిష్టంగా వెళ్తోంది. నాలుగైదు రోజులు గడిచాయి. హటాత్తుగా ఒకరోజు నుంచి రావడం మానేసింది. ఇంట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిడ్డ తాతమ్మ ఊరుకోలేదు. కోడలికి రహస్యంగా ఏదో చెప్పింది. ఆమె గొంతులో ఆదుర్దా, ముఖంలో ఆందోళన. చెప్పడం పూర్తి కాకనే కోడలి ముఖంలోనూ రంగులు మారాయి. ఆవేశంతో ముఖం జేపురించింది. భర్త కోసం వెతికింది. ఆ రోజు సాయంత్రానికి రచ్చబండ దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం. అందరి ముఖాలూ ఆగ్రహావేశాలకు ప్రతీకల్లా ఉన్నాయి. అందరి చూపు ఒక మహిళ మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఆమె పెడరెక్కలు విరిచి, చెట్టుకి కట్టేశారు. ఆమె జుట్టు రేగి చింపిరిగా చిందరవందరగా ఉంది. దుస్తులు చిరిగి ఉన్నాయి. చెమటలు కారుతున్నాయి. ఒంటి మీద దెబ్బల వాతలు, నెత్తుటి చారికలు. ఆమె మాట్లాడే ఓపిక కూడా లేనట్లు తల వాల్చేసి నిస్సహాయంగా ఉంది. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? బాణామతి... ‘నిజమే ఆమె బాణామతి చేస్తోంది’ అందరి ఆరోపణా అదే. ‘ఆమె బాణామతి చేయడం మీరు చూశారా’ అని జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరోప్రశ్న అంతే సూటిగా వచ్చింది. ‘పురిట్లో బిడ్డ పక్కకేసిన కోకను చింపుకెళ్లినామె బాణామతి చేయకపోతే ఇంకేం చేస్తుంది’ ఆగ్రహంగా ప్రశ్నించాడు బిడ్డ తాత. ఆ పక్కనే వాళ్ల బంధువులు ఆమె మీదకురకడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడడానికి నోరు పెగలని స్థితిలో తనకేమీ తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపుతోందామె. అత్త ఆరళ్లకు భయపడి... ఆ అమాయకురాలి గతంలోకి వెళ్తే... ఆమెకి పెళ్లయి పదేళ్లయినా పిల్లలు పుట్టలేదు. మన గ్రామాల్లో ఒక మహిళను రాచి రంపాన పెట్టడానికి ఈ ఒక్క కారణం చాలు. ‘నీకు పిల్లలు పుట్టేట్టు లేరు. నా కొడుక్కేం తక్కువ... మరో పెళ్లి చేస్తే ఏడాది తిరక్కుండా తండ్రవుతాడు’ అంటూ అత్త సాధింపులు. ఇంట్లో తన స్థానం పదిలంగా ఉండాలంటే ఓ బిడ్డను కనితీరాలి. బిడ్డలు పుట్టే మంత్రం ఏదైనా ఉంటే బావుణ్ను. ఆమె ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. ఇలాంటి అమాయకుల కోసమే కాచుకుని ఉండే మంత్రగాడు ఆ క్షణంలో ఆమెకు ఆపద్బాంధవుడిలా కనిపించాడు. వారం వారం అతడిని దర్శించుకుంటోంది. పండ్లు, ప్రదక్షిణలు, దక్షిణలు సమర్పించుకుంటూనే ఉంది. ఆమె కాయకష్టం చేసి దాచుకున్న పైసలు అయిపోయాయి. పుట్టింటి వాళ్లు పెట్టిన బంగారమూ అయిపోయింది. ఆమె అమాయకంగా అడిగే ప్రశ్నలతో సహజంగానే స్వామీజీ మీద ఒత్తిడి పెరిగింది. ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి స్వామీజీ ఓ ప్లాన్ వేశాడు. ‘పురిట్లో బిడ్డ పక్క చించి చిన్న ముక్క తెస్తే దాంతో పూజ చేస్తాను. అప్పుడు నీకు బిడ్డలు పుడతారు’ అని నమ్మబలికాడు. ఆమె నమ్మింది. మంత్రగాడు చెప్పినప్పటి నుంచి ఊళ్లో ఎవరు బిడ్డను కంటారా అని ఎదురు చూసింది. తనకు తెలిసినావిడ నెలతప్పినప్పటి నుంచి ఆమె ప్రసవం కోసం ఎదురు చూసింది. కొన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది. బాలింతను పరామర్శించి, బిడ్డను చూడాలనే వంకతో ఆ ఇంటికి తరచూ వెళ్లేది. ఓ రోజు తననెవరూ చూడట్లేదనుకుని రహస్యంగా బిడ్డ పక్కకేసిన పాత చీర నుంచి చిన్న ముక్కను చించుకుని వెళ్లిపోయింది. ఎంత జాగ్రత్తగా చేసినా, మంచంలో ఉన్న పెద్దావిడ కంట్లో పడనే పడింది. ఎందుకిలా చేసిందనే సందేహాలు కూడా తలెత్తాయి. బాణామతి చేయడానికేమోనని అనుమానించారు. తనకు బిడ్డల్లేరు. కాబట్టి బిడ్డలు పుట్టిన వాళ్లను చూసి ఓర్వలేక బాణామతి చేస్తోందేమో! అని మరో సందేహం. అది కేవలం సందేహమే, అయితే ఇదే నిజమని ఊరు ఊరంతా ఆరోపించింది. బాణామతి ఉందని కానీ లేదని కానీ వాళ్లలో ఎవరూ చెప్పలేరు. కానీ ఒక అమాయకురాలిని వధ్యశిల మీద నిలబెట్టడానికి మాత్రం ఎవరూ వెనుకాడలేదు. తల్లి కావాలనే ఆరాటంతో ఆమె మంత్రగాడిని ఆశ్రయిస్తే, ఆ మంత్రగాడి మోసం, అవకాశవాదం ఆమెను ఊరి ముందు దోషిలా నిలిపాయి. ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత ఆమెను వదిలి పెట్టారు. ఇక్కడ మనసును కలిచి వేసే లౌక్యమూ ఉంది. నిందారోపణలతో శిక్షించడానికి వెనుకాడని జనం, పొరబడ్డామని ఒప్పుకోవడానికి ముందుకురావు. అజ్ఞానాంధకారంలో మూర్ఖంగా ప్రవర్తించాం- అని ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తుంది. పైగా అదే అహం ముసుగులో ఊరంతా కలిసి ‘పాపం అమాయకురాలు క్షమించేద్దాం’ అని తీర్మానించేశారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నచ్చచెప్పడం చాలా కష్టం అయింది ఇది నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలోని శివనేనిగూడ గ్రామంలో జరిగింది. ఊళ్లో ఒకావిడను కట్టేసి కొడుతున్నారని తెలిసిన వెంటనే మా జనవిజ్ఞానవేదిక మిత్రులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ మొదలు పెట్టగానే స్థానికులు మా వాళ్ల మీద విరుచుకు పడ్డారు. కొట్టినంత పని చేశారు. మీరు నచ్చినట్లే చేద్దురు కానీ ముందు ఆమెని మాట్లాడనిద్దాం... అని వారిని సమాధాన పరిచాం. ఆమె నోరు విప్పిన తర్వాత అందరిలో సానుభూతి వ్యక్తమైంది. అయినప్పటికీ... బాణామతి అనేది మూఢనమ్మకం అని ఊరి వారిని సమాధానపరచడం మాత్రం చాలా కష్టమైంది. అదే ప్రదేశంలో సమావేశం పెట్టి మంత్రతంత్రాలు ఉండవని చెప్పాం. ఆమె భర్త, అత్తగారికి విడిగా కౌన్సెలింగ్ ఇచ్చాం. డాక్టర్‌కు చూపించుకుని భార్యాభర్తలిద్దరూ వైద్యం చేయించుకోవాలని సూచించాం. మా ప్రయత్నంతో ఆమె కాపురం చక్కబడింది. - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ -
గెలుపును చూసిన కళ్లు
యుద్ధ క్షేత్రం: కెప్టెన్ బీఎల్కే రెడ్డిది వ్యవసాయ కుటుంబం. హెలికాప్టర్‌ను నడిపిన అనుభవం. నాటి భారత విజయంతో ఉప్పొంగిన ఉత్సాహం నేటికీ ఆ కళ్లలో... కనిపిస్తూనే ఉంది ఆయన మాటల్లో ధ్వనిస్తూనే ఉంది. ‘‘అది 1971వ సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతోంది. మాకు తూర్పు పాకిస్తాన్ సరిహద్దులో డ్యూటీ వేశారు. మన సైనికులను 15 హెలికాప్టర్లలో మేఘన నది అవతలికి దాటించాలి. నా హెలికాప్టర్లో మూడు ట్రిప్పులు తరలించాను. ల్యాండింగ్ సమయంలో ప్రత్యర్థి దళాలు కాల్పులు జరిపాయి. అప్పుడు సమయం తెల్లవారు జామున నాలుగు గంటలు. టేకాఫ్ అయిన ఇరవై నిమిషాల్లో మంటలు ఇంధనం ట్యాంకుకు చేరాయి. పరిస్థితి అర్థమవుతోంది. కానీ ఎక్కడా ల్యాండ్ చేయడానికి చదునైన నేల లేదు. శీతకాలం కావడంతో పర్వతాలను మంచు కప్పేసింది. గాల్లో ఉన్నా పేలి పోక తప్పనప్పుడు నేల మీదకు దిగడానికి ఓ ప్రయత్నం చేయడమే ప్రత్యామ్నాయం. అప్పటికే కాక్‌పిట్ నిండా పొగ కమ్మేసింది. మాకు శిక్షణలో నేర్పించిన విన్యాసాలు చేస్తూ స్పీడ్ తగ్గించి దించేశాను. దేవుని దయ వల్ల పర్ఫెక్ట్గా ల్యాండ్ అయింది. వెంటనే నేను, కో పైలట్, ఒక గన్నర్, ఇద్దరు వైద్యసిబ్బంది దిగి, మూడు మృతదేహాలను (పాక్ భూభాగంలో ప్రాణాలు వదిలిన సైనికులవి) బయటకు తీయగానే హెలికాప్టర్ పేలి పోయింది. మా హెలికాప్టర్‌కు ఎదురైన ప్రమాదాన్ని గుర్తించిన బేస్‌స్టేషన్ మాకు సహాయంగా మరో హెలికాప్టర్‌ను పంపించింది. అందులో మా క్యాంపునకు చేరాం. అప్పట్లో మనదేశానికి రష్యన్లు వాడి రీ కండిషన్ చేసిచ్చిన హెలికాప్టర్లే ఆధారం. అలాంటిదే మరో సంఘటన అదే నెలలో 21వ తేదీన ఎదురైంది. అప్పటికి యుద్ధం సద్దుమణిగింది. అగర్తల నుంచి కుంభీగ్రామ్ వెళ్తుండగా హెలికాప్టర్ ఇంజన్ ఫెయిలైంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి కిందకు దిగి చూసుకుంటే హెలికాప్టర్ ప్రధాన భాగం మనదేశంలో ఉంది, తోక బంగ్లాదేశ్‌లో ఉంది. మొత్తానికి యుద్ధం సమయంలో సరుకులు, యుద్ధసామగ్రిని చైనా, బర్మా, నాగాలాండ్ వంటి క్లిష్టమైన ప్రదేశాల్లో చాకచక్యంగా రవాణా చేసినందుకు ‘వాయుసేన మెడల్’ అందుకున్నాను. మాది మెదక్ జిల్లా జోగిపేట దగ్గర కుస్సంగి. నా చదువు హైదరాబాద్‌లోనే. ఇంజనీరింగ్‌లో ఉండగా రక్షణరంగంలోకి వెళ్లి, 1967 డిసెంబర్లో హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఉద్యోగంలో చేరాను. పెళ్లయ్యాక నా భార్య ఉషతో అస్సాంలోని దిబ్రూఘర్‌లో ఏడేళ్లు ఉన్నాను. అడవుల్లో వెదురు కర్రల మీద గుడిసెలో జీవించాం. చండీగఢ్‌లో నాలుగువేల మంది ఉద్యోగులను పర్యవేక్షించడం, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేయడం వంటివి వృత్తిపరమైన సంతృప్తినిచ్చాయి. 1978లో ముందస్తు పదవీవిరమణ తీసుకుని ‘హాలెండ్ షెర్నర్ ఎయిర్వేస్’లో కమర్షియల్ పైలట్‌గా పనిచేశాను. 28 దేశాల పైలట్లను చూశాను. కానీ భారతీయ పైలట్లలో ఉండే అంకితభావం మరెవరిలోనూ చూడలేదు’’ అంటున్న బీఎల్కే రెడ్డి ఇప్పుడు హైదరాబాద్‌లోని గోల్ఫ్ అసోసియేషన్ సెక్రటరీగా గోల్ఫ్‌ను విస్తరించే పనిలో ఉన్నారు. భారతీయుడిగా... నా రక్షణ రంగ జీవితాన్ని తలుచుకున్నప్పుడల్లా గర్వంగా ఛాతీ ఉప్పొంగేది... సరెండర్ అవుతూ పాక్ సైన్యం లెటర్ రాసిన సన్నివేశమే. డిసెంబర్ 16వ తేదీ ఢాకాలో ఇండో-పాక్ సైనికాధికారులు సమావేశమయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ ఎ.ఎ.కె. నియాజీ సరెండర్ లెటర్ రాయడం, దాని మీద మన లెఫ్టినెంట్ జనరల్ జగత్సింగ్ అరోరా కూడా సంతకం చేయడం నా కళ్ల ముందే జరిగింది. - కెప్టెన్ బీఎల్కే రెడ్డి, వాయుసేన మెడల్ గ్రహీత - వాకా మంజులారెడ్డి -
వ్యవస్థీకృతమైన సంరక్షణ ఇది ఓ తల్లి ఆలోచన
మహిళా విజయం: రేష్మా పుట్టిల్లు బెంగళూరు... అత్తిల్లు హైదరాబాద్. యూఎస్‌లో ఉద్యోగం చేస్తూ ఓ పాపాయికి తల్లయ్యారు... ఇండియాకి వచ్చిన తర్వాత... రెండో బిడ్డను కన్నప్పుడు... ఆమె ముందు ఓ సవాల్ నిలిచింది. ఫలితంగా... ‘వియ్ కేర్’ ఆవిర్భవించింది. ‘‘నేను పుట్టి పెరిగింది బెంగళూరులో. నాన్న డెంటిస్ట్, అమ్మ స్పెషల్ ఎడ్యుకేటర్(ప్రత్యేకమైన పిల్లలకు శిక్షణనిచ్చే టీచర్). నేను ‘వియ్ కేర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ను ప్రారంభించడానికి నా స్వీయానుభవమే కారణం. నేను పెళ్లి చేసుకుని అమెరికాలో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పాప పుట్టింది. తనను డే కేర్ సెంటర్లో వదిలి ఉద్యోగం చేసుకున్నాను. బాబు పుట్టే నాటికి ఇండియాకి వచ్చేశాం. సత్యంలో సీనియర్ బిజినెస్ లీడర్‌గా ఉద్యోగం. మెటర్నిటీ లీవ్ పూర్తయిన తర్వాత బాబును డే కేర్‌లో ఉంచడానికి అనువైన సెంటర్ కనిపించలేదు. ఆఫీసులో ఉన్నా ఇంటి గురించి, బిడ్డ గురించే ఆలోచన. బాబు కోసం ఉద్యోగంలో విరామం తీసుకోవాల్సి వచ్చింది. నాలాగ ఎందరో మహిళలు పిల్లల గురించి కెరీర్‌ను కోల్పోతున్నారనిపించింది. పిల్లలు పెద్దయిన తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరినా కెరీర్ గ్రాఫ్‌లో పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. ఎదుగుదల, ప్రమోషన్ వంటి వాటికి దూరమవుతుంటారు. మహిళల్లో ఎక్కువ మంది పెద్ద స్థాయికి వెళ్లకపోవడానికి వారిలో నైపుణ్యం లేకపోవడం కాదు. పిల్లల కోసం తీసుకునే గ్యాప్ పెద్ద అగాధంగా మారుతోందనిపించింది. దాంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘వియ్ కేర్’ను ప్రారంభించాను. ఐటీ ఉద్యోగాల్లో ఒత్తిడి, ఎక్కువ పని గంటలు ఉంటాయి కాబట్టి వారి మీదనే దృష్టి పెట్టాను. హైదరాబాద్‌లో తొలి సెంటర్‌ని గచ్చిబౌలిలో ఈ నెల ఆరవ తేదీన ప్రారంభించాను. - రేష్మా శ్రీనివాస్, ఎం.డి, వియ్‌కేర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నాణ్యమైన సర్వీసే నా సక్సెస్! మొదటి సెంటర్‌ని బెంగళూరులో 2008లో హరిణి అనే పాపాయితో ప్రారంభించాను. ఆ ఏడాదిలోనే 60 మందికి చేరింది. డే కేర్‌తోపాటు ప్రీస్కూల్ కూడా నిర్వహించడంతో ఎక్కువ మందికి ఉపయుక్తంగా ఉంటోంది. ప్రస్తుతం ఆరు వారాల నుంచి పన్నెండేళ్ల వయసున్న పిల్లలు దాదాపుగా వెయ్యి మందికి పైగా మా సెంటర్లలో పెరుగుతున్నారు. మూడు వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఉదయం ఎనిమిది గంటలకంతా వదిలేసి వెళ్తారు. వారికి పాలు, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం చిరుతిండ్లు, రాత్రి భోజనం అన్నీ పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లల డాక్టర్లు సూచించిన విధంగా ఇస్తాం. స్కూలు నుంచి వచ్చిన వారికి రిఫ్రెష్మెంట్, తినిపించడం, హోమ్ వర్క్ కూడా ఇక్కడే. దాంతో పేరెంట్స్ పిల్లలతో గడిపే కొద్ది సమయం కూడా క్వాలిటీగా గడుపుతున్నారు. హైదరాబాద్‌లో మరికొన్ని సెంటర్లను పెట్టిన తర్వాత వియ్‌కేర్ సేవలను చెన్నైకి విస్తరించాలనుకుంటున్నాను. ఆరు వారాలనే నియమం... పిల్లలు పుట్టిన తర్వాత ఆరు వారాల వరకు తల్లి స్పర్శను ఆస్వాదిస్తే ఇక వారు తల్లిని మర్చిపోరని నిపుణులు నిర్ధారించారు. ఆయాలు, నర్సుల చేతిలో ఎంతకాలం పెరిగినా తల్లి స్పర్శను గుర్తించగలగడానికే ఈ నియమం. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి manjula.features@sakshi.com -
అందంగా... ఆకర్షణీయంగా... పేపర్ బ్యాగ్
మీరే పారిశ్రామికవేత్త పాత వార్తాపత్రికలను కత్తిరించి చక్కగా మడతపెట్టి జిగురుతో అతికిస్తే చక్కటి సంచి తయారవుతుంది. పాతికేళ్ల కిందట మందుల దుకాణాలతోపాటు చిన్న చిన్న కిరాణా దుకాణాలు విరివిగా ఉపయోగించిన కవర్లు ఇవే. అప్పట్లో అనేక కుటుంబాల్లో మహిళలు, పిల్లలు ఈ పని చేసుకుంటూ దుకాణాల్లో అమ్మి చేతి ఖర్చులకు డబ్బు సంపాదించుకునే వారు. ఎప్పుడైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వచ్చిందో ఈ ఉపాధి అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ అది పరిశ్రమ రూపు సంతరించుకుని మార్కెట్లో విహరిస్తోంది. ఈ పరిశ్రమ స్థాపించాలంటే... యాభై నుంచి ఎనభై లక్షల పెట్టుబడితో భారీ స్థాయిలో ప్రారంభించవచ్చు. సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ యంత్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉత్పత్తికి చేత్తోనే చేసుకోవచ్చు. ఇందుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఒకటి - రెండు గదులు సరిపోతాయి. లక్షా- రెండు లక్షల రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టవచ్చు. ముడి సరుకు సర్దుకోవడానికి, తయారైన వస్తువులను పెట్టుకోవడానికి ర్యాక్‌లు - రెండు (ఒక్కొక్కటి 2,500), అల్మైరా - ఒకటి (ఆరేడు వేలు), ఫోల్డింగ్ మెషీన్ (చేతితో పని చేసే చిన్న మెషీన్) - పది వేల లోపు. ఐలెట్ పంచెస్ (రంధ్రాలు చేయడానికి) - 2, కత్తెర - 1, పెద్ద స్కేలు - 1, టేపు - 1 ఐదొందల్లో వస్తాయి. ముడిసరుకు... కనీసంగా కావల్సినవి పేపర్, ఐలెట్స్, త్రెడ్, ఫెవికాల్. ఆకర్షణీయంగా తయారు చేయడానికి అలంకరణలు పెంచుకోవచ్చు. అలాగే వినియోగదారుల అవసరాన్ని, వారి బడ్జెట్‌కి అనుగుణంగా సంచి తయారు చేసివ్వడం కోసం రకరకాల పేపర్లు అందుబాటులో ఉంచుకోవాలి. క్రాఫ్ట్ పేపర్, ఆర్ట్బోర్డు పేపర్, ఆర్ట్ కార్డ్ పేపర్, హ్యాండ్‌మేడ్ పేపర్... ఇలా చాలా రకాలుంటాయి. అలాగే కాగితం మందం కూడా ముఖ్యమే. శిక్షణ గురించి... భారత ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘వందేమాతరం’ పథకం ద్వారా ఆసక్తి ఉన్న వారికి శిక్షణనిస్తోంది. ఎలీప్ సంస్థ నిర్వహిస్తోన్న ఈ శిక్షణ కార్యక్రమాలకు కనీస విద్యార్హత ఐదవ తరగతి ఉన్న 18-45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు హాజరుకావచ్చు. నేర్చుకున్న తర్వాత... స్వయంగా పరిశ్రమ స్థాపించవచ్చు. ఇతర పరిశ్రమల్లో ఉద్యోగం పొందవచ్చు లేదా పరిశ్రమల నిర్వాహకుల నుంచి ముడిసరుకు తెచ్చుకుని ఇంటి దగ్గరే తయారు చేసుకుని ఒక్కొక్క సంచి తయారీకి తగిన వేతనాన్ని (పీస్ లెక్కన) పొందవచ్చు. ఈ విధానంలో మార్కెట్ ఒత్తిడి ఉండదు. పరిశ్రమ స్థాపించి ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఎలీప్ సంస్థ ‘విపణి’ అనే కార్యక్రమం ద్వారా మార్కెట్ కల్పిస్తోంది. పని నేర్చుకుంటున్నాం... పని చేస్తున్నాం... మాది నల్గొండ జిల్లా హుజూర్నగర్. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేసి ఫార్మా రంగంలో ఉద్యోగం చేశాను. బాబు పుట్టిన తర్వాత ఎలీప్లో శిక్షణ తీసుకుని స్నేహితురాలితో కలిసి పరిశ్రమ ప్రారంభించాను. - వాసిరెడ్డి శిరీష, 9494428686 మార్కెట్ మీద పట్టు... మాది వరంగల్. శిరీష బాబు, మా పాప ఒకే క్లాస్ కావడంతో మాకు పరిచయమైంది. అప్పటికే శిరీష జైపూర్, మహారాష్ట్రలు తిరిగి పరిశ్రమ నిర్వహణ, ముడిసరుకు దొరికే ప్రదేశాలను తెలుసుకుంది - మడిశెట్టి అర్చన, 9642444450 శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ ఇలా... 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో ఉదయం 11 గంటల నుంచి - సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చు. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి -
రాజా రాణీ రాకెట్ రోవర్
గమనం నదుల స్వగత కథనం నా పేరు శరావతి. నేనొక దాన్ని ఉన్నాననే సంగతి చాలామందికి తెలియదు. నేను ప్రయాణించే దూరం తెలిస్తే శరావతి కూడా ఓ నదేనా? బహుశా ఉప నదేమో అనే సందేహం రావచ్చు కూడా. నేను ఉపనదిని కాదు, ప్రధాన నదినే. అయితే చిన్న నదిని! ఎందుకంటే స్వయంగా సముద్రంలో కలుస్తాను, నాకు ఉపనదులున్నాయి. అంతే. రెండే రెండు జిల్లాలు... షిమోగా, ఉత్తర కన్నడ... పుట్టింది ఒక జిల్లా, సాగరంలో కలిసేది మరో జిల్లాలో... ఈ మధ్యలో మరో జిల్లా కూడా లేదు. నా ప్రయాణం 128 కి.మీ.లతో ముగుస్తుంటే నా పేరు పెట్టుకున్న రైలు మాత్రం కర్ణాటకలోని మైసూరు నుంచి మహారాష్ట్రలోని దాదర్ వరకు 1212 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. శరం అంటే బాణం! నాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే... స్థానికులు ఓ చక్కని కథనాన్ని వినిపిస్తారు. రాముడు సీతతోపాటు అరణ్యవాసం చేస్తున్న సమయంలో... వనవిహారం చేస్తుండగా సీతకు దాహం వేయడంతో రాముడు వింటిని సంధించి భూమిని చీల్చాడని, బాణం వేసిన చోట నీరు పైకి ఎగచిమ్మి అది తటాకంగా మారిందంటారు. అందుకే ఆ తటాకం నుంచి మొదలైన ప్రవాహానికి శరావతి అనే పేరు వచ్చింది. శరం అంటే బాణం. అంబుతీర్థం అనే పదానికి అర్థం కూడా బాణం వేసిన ప్రదేశం అనే అర్థం. నేను పుట్టిన ప్రదేశానికి అంబుతీర్థం అనే పేరు వెనుక ఉన్న కథనం కూడా ఇదే. అలా మొదలయ్యే నా ప్రయాణంలో ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్లే సరికి అల్లంత దూరంలో సముద్రం కనిపిస్తూ ఉంటుంది. గట్టిగా లెక్కేస్తే 30 కిలోమీటర్లకు మించదు. అయినా నేను ఎనిమిది వందల అడుగులకు పైగా ఎత్తులోనే ఉంటాను. ఇక సాగరాన్ని చేరాలంటే ఎక్కడో ఓ చోట నేలను చేరాల్సిందేనని దిక్కులు చూస్తూ గెరుసొప్ప చేరేసరికి... నా కోసమే అన్నట్లు నేల మాయమై లోయ కనిపిస్తుంది. అంతే ఒక్కసారిగా లోయలోకి దూకేస్తాను. అదే కర్నాటకలోని ప్రసిద్ధ జోగ్జలపాతం. నేను అత్యంత చిన్న నదిని, అయితే ఆ జలపాతానికి అత్యంత ఎత్తై జలపాతాల్లో ఒకటిగా రికార్డు ఉంది. ఇటీవలి కాలం వరకు భారతదేశంలో ఎత్తై జలపాతంగానూ, ప్రపంచంలో రెండవ ఎత్తై జలపాతంగానూ చెప్పుకునే వారు. ఇటీవల మేఘాలయలోని నోహకాలికాయ్ ఫాల్స్‌ను గుర్తించారు. ఇప్పుడా కిరీటం నోహకాలికాయ్ జలపాతానికి దక్కింది. దేశంలో పొరుగు రాష్ట్రాలు జోగ్ రెండవస్థానాన్ని అంగీకరిస్తాయి. కానీ కన్నడిగులు, మరీ ముఖ్యంగా నేను పుట్టిన షిమోగా జిల్లా వాసులు మాత్రం ఒప్పుకోరు. వారి మాటనూ తీసేయడానికి లేదు. ‘కుంచికల్ జలపాతం’ సవ్వడి నా చెవులను సోకుతూనే ఉంటుంది, జోగ్కంటే ఎత్తై జలపాతం కుంచికలేనంటూ ‘విరాహి’ నది నాతో చెప్తున్నట్లు అనిపిస్తుంటుందా సవ్వడి. అలాగే సీతానది నుంచి జాలువారే ‘బర్కానా జలపాతం’ కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే వాటి సవ్వడి నాకు ఏడాది పొడవునా వినిపించదే! ఎత్తై జలపాతాల కిరీటం జోగ్‌ను కాదని వాటికెలా దక్కుతుంది? అందుకే జాతీయ స్థాయిలో జోగ్నే గొప్పగా చెప్పుకుంటారు. పైగా నా ప్రవాహం అలా ఇలా ఉండదు. డెబ్బై మీటర్ల వెడల్పుతో నేలకు దూకుతాను. సింహ గర్జనను తలపిస్తూ... నేను నేలకు ఉరికే తొందరలో నేల ఎత్తుపల్లాలను దాటుకుంటూ నాలుగు పాయలుగా చీలిపోతాను. రసజ్ఞుల దృష్టి నిశితంగా ఉంటుందని ఒప్పుకోవాల్సిందే. జలపాతం తీరును నాలుగు రకాలుగా చెబుతూ ‘రాజా, రాణి, రాకెట్, రోరర్ ’ అని నాలుగు పాయలకు నాలుగు పేర్లు పెట్టేశారు. రాజా పాయ చాలా హుందాగా నేలను తాకుతుంటే, రాణి పాయ జాలువారుతున్న తీరు సుతిమెత్తగా, ఒయ్యారంగా అడుగులు వేస్తున్న నాట్యకారిణిని తలపిస్తుంది. రాకెట్ పాయలో నీరు ఎక్కువ మోతాదులో భూమిని చేరుతుంది కానీ పాయ చాలా సన్నగా ఉంటుంది. ప్రవాహవేగం నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్‌ను గుర్తుచేస్తుంది. ఇక నాలుగో పాయ రోరర్... ఇది కూడా చిన్న పాయే... అయినా ఇది చేసే శబ్దం చిన్నది కాదు. ఈ చప్పుడు పులి గర్జనను పోలి ఉంటుందని ఈ పేరు స్థిరపడింది. నా ప్రవాహాన్ని ఇంత గొప్పగా చెప్పుకోవడానికి ‘నందిహోలె, హరిద్రావతి, మావినహోలె, హిల్కుంజి, యెన్నెహోలె, హుర్లిహోలె, నగోదిహోలె... ఉపనదులే కారణం. మాయలా కప్పేసే మబ్బులు! నా తీరాన ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించి తీరాల్సిందే తప్ప మాటల్లో వర్ణించనలవి కాదు. పశ్చిమ కనుమల పచ్చదనం, కొండల అంచులను తాకుతూ కదిలే మేఘాల నీలవర్ణం కలగలిసి కొత్తరంగును ఆవిష్కరిస్తుంటాయి. వర్షాకాలంలో మేఘాలు సమూహంగా వచ్చి వర్షిస్తున్నాయా అనిపిస్తుంది. తెల్లని నురగలతో నీటి ప్రవాహం... ప్రవాహ వేగానికి గాల్లోకి లేచే మంచుబిందువులు ప్రదేశాన్ని పొగమంచులా కప్పేస్తాయి. ప్రబంధ కవులు ఇక్కడికి వచ్చారంటే... గంగా మాత ఆకాశం నుంచి భూమాతను పరామర్శించడానికి వచ్చే క్రమంలో ఒలికిన తుషార, తుహిన, నీహారికల సమ్మేళనం... అంటూ బరువైన పదాలతో అందమైన భావాన్ని పద్యాలల్లేస్తారు. అంతటి అందమైన ప్రదేశమే మరి. ప్రాచ్యానికీ - పశ్చిమానికీ మధ్య... నా తీరం ఓ చారిత్రక ఘట్టానికి సాక్షి. చతుర్ముఖ బాసాడి జైన ఆలయాన్ని నిర్మించడానికి నిర్మాణ సామగ్రి చేరవేత నా మీదనే జరిగింది. పన్నెండవ శతాబ్దం నుంచి కన్నడిగ రాజ్యాన్ని పాలించిన హోయసల రాజులు హిందూత్వంతోపాటు జైనాన్ని కూడా ఆదరించారు. చతుర్ముఖ బాసాడి ఆలయంలో నలుగురు జైన తీర్థంకరుల విగ్రహాలున్నాయి. గ్రానైట్ మందిరం... ఇప్పటికీ చెక్కు చెదరలేదు కానీ మెరుపు తగ్గి రంగు వెలిసింది. పిల్లలు చూస్తే ఇదేంటి ఇలా పాతగా అంటూ ముఖం చిట్లించుకుంటారో ఏమో! ఇందులో చెన్నబైరదేవి విగ్రహం అసంపూర్తిగా ఉండిపోయింది. సాళ్వ వంశంలో గొప్ప పాలనదక్షత కలిగిన రాణి ఆమె. క్రీ.శ 1552 నుంచి 1606 వరకు పాలించిన చెన్నబైరదేవి మిరియాల రాణిగా పేరు తెచ్చుకుంది. పశ్చిమ తీరం నుంచి మేలు రకం మిరియాలను పశ్చిమదేశాలకు ఎగుమతి చేసి ఆ పేరు తెచ్చుకుంది. గెరుసొప్ప రాణిగా కూడా పిలుస్తారు. సాల్వ రాజుల రాజధాని గెరుసొప్ప. ‘నగర్ బస్తికెరి’గా పిలిపించుకున్న రోజుల్ని చూశాను. ఇది అందమైన వాణిజ్య కేంద్రం. సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాల వేదిక. హోన్నావర్ పెద్ద హార్బర్. అంతర్జాతీయ వాణిజ్య రవాణా కేంద్రం. మధ్య ప్రాచ్యం, పాశ్చాత్య దేశాలకు ఓడల్లో మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు రవాణా అయ్యేవి. గతం తాలూకు వైభవాన్ని తలుచుకుంటూ వర్తమానంలో నా చెంత చేరే కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. చిన్న నదినే, అయినా చేవ ఉన్న నదిని. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పుట్టిన ప్రదేశం: కర్నాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా, తీర్థహళ్లి గ్రామానికి సమీపంలోని అంబుతీర్థం. సాగర సంగమం: కర్నాటక రాష్ట్రంలోనే... ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నావర్ తీరం దగ్గర అరేబియా సముద్రంలో. ప్రవాహ దూరం: 128 కి.మీ.లు -
హిమగిరి నుంచి బ్రహ్మఝరి
గమనం : నదుల స్వగత కథనం మానస సరోవరం... జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలనిపించే ప్రదేశం. నేను అక్కడే పుట్టి కైలాస పర్వతాన్ని చూస్తూ ప్రయాణం మొదలు పెట్టాను. హిమాలయాల్లోని చెమాయుంగ్ దుంగ్ హిమనీనదం నా పుట్టిల్లు. ప్రాచీనంలో తూర్పు దేశాలకు, పశ్చిమానికి మధ్య రవాణా నా కళ్ల ముందే జరిగేది. మానస సరోవరానికి కైలాసపర్వతానికి మధ్యనున్న ‘పర్కా’ వాణిజ్యకేంద్రం వ్యాపార లావాదేవీల స్థావరం. ‘యార్లాంగ్ గ్జాంగ్పో’ పేరుతో పుట్టిన నేను టిబెట్ పీఠభూమి నుంచి నేలను వెతుక్కుంటూ ‘నమ్చబర్వా పర్వతం’ దగ్గర మంచుకొండలను చుడుతూ వంపు తిరిగి, లోయల్లోకి జారిపోతాను. అలా జారిపోవడంలో సున్నితత్వం లోపించి కరుకుగా పర్వతాన్ని కోసేస్తుంటాను. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర భారత్‌లో అడుగుపెడతాను. అక్కడ నన్ను ‘సియాంగ్’ అని పిలుస్తారు. అక్కడి నుంచి కొద్దిగా దిశ మార్చుకుంటూ, అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశిస్తానో లేదో ‘లుయిత్’ అంటూ పలకరిస్తారు. బహుశా ఈ లుయిత్... సంస్కృతంలో లౌహిత్య పేరుతో పిలిచిన పేరుకి వ్యవహారిక నామం కాబోలు. బోడోలయితే నన్ను ‘భుల్లుంబత్తర్’ అంటారు. భుల్లుంబత్తర్ అంటే - నీటిని గొంతు దగ్గర ఆపేసి గరగర శబ్దం చేస్తుంటారు చూడండి! - అలాంటి శబ్దం అని అర్థం. గిరిపుత్రులు చెప్పిన భాష్యం నా ప్రవాహవేగాన్ని చెప్పకనే చెప్తోంది. మరి సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తు నుంచి నేలకు దిగే ప్రయాణం నిశ్శబ్దంగా ఎలా ఉంటుంది? దిహంగ్, లుయిత్లు కలిసిన తర్వాత నన్ను ‘బ్రహ్మపుత్ర’ అని పిలుస్తారు. మంచు కరిగే రోజుల్లో... హిమాలయాల్లో మంచు కరిగే కొద్దీ నా ప్రవాహం ఉద్ధృతమవుతుంటుంది. నా తీరంలో నేలలు ఎప్పుడూ చిత్తడిగానే ఉంటాయి. ఎటు చూసినా పచ్చటి చెట్లు, దట్టమైన అడవులు, పొదల మయం. పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్లు ఉంటుంది. కళ్లు ఒక్క ఆకుపచ్చ రంగుని మాత్రమే చూస్తున్నాయా, ఇతర రంగులను గుర్తించడం మానేశాయా అనే భ్రమ కలుగుతుంది కూడా. ఏడాది పొడవునా నీటి ప్రవాహంతో అలరారే నా తీరం ఇలాగే ఉంటుంది మరి. మంచు కరగడం తగ్గుముఖం పడుతుందో లేదో వర్షాలు మొదలవుతాయి. నా తీరాన ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించడం కష్టం. ఉన్న ఫళంగా కుండపోత కురుస్తుంది. చిరపుంజిలో కురిసే ప్రతి చినుకూ నన్నే చేరుతుంది. నా తీరాన నిలబడి ‘ఈ ఒడ్డు ఆ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు’ అని పాడుకోవడం అంత సులభం కాదు. చాలా చోట్ల రెండు ఒడ్డుల మధ్య దూరం పది కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రధాన జలరవాణా మార్గాన్ని కూడా. నా తీరాన దట్టమైన అడవులు, పచ్చటి పంట పొలాలు విస్తరించాయని సంతోషపడే లోపు వరద బీభత్సానికి తల్లడిల్లే తీర ప్రజలతోపాటు కజిరంగా నేషనల్పార్కులోని వన్యమృగాలు కళ్ల ముందు మెదులుతాయి. కజిరంగాలో... ఖడ్గమృగం భారంగా పరుగులు తీస్తుంటుంది. ఏనుగు బరువుగా అడుగులేస్తుంటుంది. చిన్న సవ్వడికే లేడి చెంగున ఎగురుతుంటే, దుప్పి అంత తొందరేముందన్నట్లు పరికించి చూస్తూ అడుగులేస్తుంటుంది. నీటి బర్రెలు... ఇంకెక్కడికెళతాం అన్నట్లు వీపులు మునిగే లోతులో విశ్రాంతిగా కాలం గడుపుతుంటాయి. రాయల్ బెంగాల్ పులులు, చిరుతలు ఎప్పుడో కానీ కనిపించవు. నీలిరంగు పాలపిట్ట, అడవి కోడి, గద్ద, తోడేళ్ల గుంపులు కనువిందు చేస్తుంటే... రామచిలుకలు ఆకుల్లో కలిసిపోయి మేమున్నామంటూ చిట్టి పలుకులతో ఆకర్షిస్తుంటాయి. ఏనుగు అంబారీ ఎక్కి వన్యమృగాలను చూడడానికి అడవిలో పర్యటించే పర్యాటకులు నా ప్రవాహ సవ్వడిని నేపథ్య సంగీతంలా ఆస్వాదిస్తుంటారు. ఇంత అందమైన ప్రదేశం కావడంతోనో ఏమో హిందువులు, జైనులు జీవితంలో ఒక్కసారైనా కైలాసపర్వతాన్ని చూడాలని, ఆ యాత్ర బ్రహ్మపుత్ర మీదుగానే సాగాలని కోరుకుంటారు. కైలాసపర్వతాన్ని అందరూ ఎడమ నుంచి కుడివైపుగా ప్రదక్షిణ మార్గంలో చుట్టివస్తుంటే బోనులు మాత్రం కుడి నుంచి ఎడమవైపుకి అప్రదక్షిణ మార్గంలో చుట్టి వస్తుంటారు. బౌద్ధులు, జైనులు, బోనులు నన్ను నదీమతల్లిగా గౌరవిస్తారు. ప్రకృతి పరిరక్షణ నియమాలన్నీ పాటిస్తారు. నా ప్రవాహంలో ‘అమోచు, సంకోష్, దిబాంగ్, రాయ్దక్, భరేలి, మాన్స్, లుహిత్, జియా భోరేలి, కామెంగ్, తీస్తా నదులు నాకు తోడుగా వచ్చి నా శక్తిని పెంచుతుంటే అస్సాంలో నేనే ‘ఖేర్జుతియా’ పేరుతో ఒక పాయగా దూరంగా వెళ్లిపోతాను. వంద కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఖేర్జుతియా పాయ తిరిగి నాలో కలిసిపోతుంది. ఆ మధ్యలో ఉన్న భూభాగం ‘మజులి’ ద్వీపం. ఇది ప్రపంచంలో పెద్ద నదీద్వీపం. ఈ కలయికను చూస్తుంటాయి గౌహతి నగరం, ‘కామాఖ్య’ ఆలయం. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ‘ఇక్కడి వరకు వచ్చి కామాఖ్య ఆలయాన్ని దర్శించుకోకపోతే బ్రహ్మపుత్రను ఏడుసార్లు దాటాల్సి వస్తుందని’ ఓ నానుడి. అంత విశాలంగా ఉండే నేను గౌహతి దాటి షిల్లాంగ్ చేరేసరికి సన్నగిల్లి ఒక్క కిలోమీటరు వెడల్పుకే పరిమితమవుతాను. ఇక్కడికి చేరగానే 17వ శతాబ్దం నాటి సరయ్ఘాట్ యుద్ధం కళ్ల ముందు మెదులుతుంది. ‘అహోం’ రాజ్యం మీద మొఘలుల ప్రతినిధి రాజా రామ్‌సింగ్ చేసిన దాడిని, గౌహతి వరకు విస్తరించిన పాలనను చూశాను. రాజ్యవిస్తరణలో మొఘలులు చేసిన చివరి ప్రయత్నం అదే. భూతాన్ని దాచుకున్నానని... సముద్రాన్ని తలపించే భారీ నదిని కావడంతో అలలు ఎగిసిపడుతుంటాయి. నీటి లోపల భూతం ఉండడంతోనే భారీ వరదలనీ, పడవలు బోల్తా పడతాయనీ, భూతాన్ని కడుపులో దాచుకున్న నది అని శాపనార్థాలు పెడతారు గిరిపుత్రులు. అస్సాంలోని వెనుకబాటును వెనక్కి తోసి అభివృద్ధి పథంలో నడిపించడానికి నేనూ దోహదం అవుతున్నానని సంతోషించే లోపు దిగ్బాయ్ ఆయిల్ రిఫైనరీ ఫీల్డ్స్ నుంచి పెట్రో ఉత్పత్తుల వెలికితీత, రవాణాలతో కలుషితమవుతున్నాను. బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టగానే సుందర్బన్ అడవుల సాక్షిగా మరోసారి చీలిపోతాను. ఇక్కడ విచిత్రమేమిటంటే పెద్ద పాయకు నా పేరు ఉండదు, ‘జమున’ అని పిలుస్తారు. జమున కాస్తా ‘పద్మ’ (గంగను బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు)లో మమేకమవుతుంది. బ్రహ్మపుత్రగా కొనసాగిన నేను చాంద్‌పూర్ దగ్గర ‘మేఘన’లో కలుస్తాను. ఇక్కడ నాకు మిగిలే సంతోషం... జమున పేరుతో వేరుపడిన నా పాయ కూడా మేఘనలోనే కలుస్తుంది. నేరుగా నాలో కలవడానికి కొద్దిగా భేషజం అడ్డొచ్చిందేమో మరి! ఇంత పెద్ద ప్రవాహాన్ని, ప్రపంచంలో పెద్ద నదుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేను... నేనుగా సముద్రంలో అడుగుపెట్టడం లేదు. అయితే ఆ ప్రదేశాన్ని గంగ- బ్రహ్మపుత్ర డెల్టా అంటూ నా పేరు వ్యవహారంలో ఉండడం నాకు సంతోషం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి manjula.features@sakshi.com