yvu
-
అరుదైన మొక్కకు ‘రాజశేఖరుడి’ పేరు
విద్యా రంగానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఓ అరుదైన మొక్కకు ఆయన పేరు పెట్టి యోగి వేమన యూనివర్సిటీ(వైవీయూ) గౌరవించింది. దీనిని లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్‌కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని పరిశోధక సంస్థలు ధ్రువీకరించాయి. వివరాలు.. వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎ.మధుసూదన్‌రెడ్డి, పరిశోధకుడు, ఢిల్లీలోని ఎస్వీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కె.ప్రసాద్‌ల బృందం 2020లో వైఎస్సార్ జిల్లా బాలుపల్లి అటవీ రేంజ్‌లోని మొగిలిపెంట ప్రాంతంలో ఓ మొక్కను గుర్తించింది. శాస్త్రీయ పరిశోధనల అనంతరం అరుదైన మొక్కగా గుర్తించి.. నిర్ధారణ కోసం లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్, కోల్‌కతాలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, సౌత్ చైనా బొటానికల్ గార్డెన్, గౌన్‌డోంగ్ ప్రావిన్స్ సంస్థలకు పంపించింది. ఆయా సంస్థలు మొక్క శాస్త్రీయతను నిర్ధారించి.. అరుదైన మొక్కగా గుర్తింపునిచ్చాయి. న్యూజిలాండ్‌కు చెందిన సైంటిఫిక్ జర్నల్ ఫైటోటాక్సాలో దీనిని కవర్ పేజీగా ప్రచురించారు. ప్రపంచం మొత్తం మీద శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే మొక్కగా నిర్ధారణ అవ్వడంతో.. ఈ ప్రాంతానికి సంబంధించిన పేరు పెట్టుకునే వెసులుబాటు లభించింది. దీంతో పరిశోధకులు, అధికారులు చర్చించి.. వైవీయూ వ్యవస్థాపకుడు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. ఔషధ విలువలు అధికం లెపిడోగాథిస్ జాతికి చెందిన ఈ మొక్కకు ప్రజాతిగా ‘రాజశేఖరే’(లాటిన్ భాష) పేరును కలిపి నామకరణం చేశారు. లెపిడోగాథిస్ జాతికి చెందిన మొక్కలు ప్రపంచవ్యాప్తంగా 144 ఉండగా.. ఇప్పుడు 145వ మొక్కగా ‘లెపిడోగాథిస్ రాజశేఖరే’ గుర్తింపు పొందింది. భారత్‌లో 34 మొక్కలు ఉండగా.. ఇది 35వది. ఏపీలో 8 మొక్కలు ఉండగా.. ఇది తొమ్మిదవది. ఈ జాతికి సంబంధించిన మొక్కలను స్థానిక భాషలో ముళ్లబంతి, సూర్యకాంతం తదితర పేర్లతో పిలుస్తారు. ఔషధ విలువలు కూడా ఉండటంతో.. సంరక్షించాల్సిన జాతుల కింద వీటిని గుర్తించారు. జ్వరం, ఎగ్జిమా, సోరియాసిస్, ఎపిలెప్సీ, దురద, మౌత్ అల్సర్, కీటకాల కాటు, దెబ్బలు తదితర చికిత్సలకు వీటిని వినియోగిస్తారని వైవీయూ వృక్షశాస్త్ర విభాగ ప్రొఫెసర్ డా.ఎ.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ మొక్కలకు మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే పూలు పూస్తాయని చెప్పారు. వైవీయూలోని బొటానికల్ గార్డెన్లో సంరక్షిస్తున్నట్లు చెప్పారు. –వైవీయూ (వైఎస్సార్ జిల్లా) -
యోగి వేమనా.. నీకు వందనం
వైవీయూ(వైఎస్సార్ జిల్లా): విశ్వదాభిరామ.. వినురవేమ.. అనేమాట వినని తెలుగువారు ఉండరు.. ‘‘వానకు తడవని వారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరు’’ అని లోకోక్తి. ఆ మహాకవికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని గతనెలలో జీఓ నెంబర్ 164ను విడుదల చేసింది. దీంతో ప్రతియేటా జనవరి 19న వేమన జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ∙ప్రజాకవి, తాత్వికవేత్త అయిన వేమన పేరుతో దేశంలో ఏర్పాటైన ఏకైక విశ్వవిద్యాలయం యోగివేమన విశ్వవిద్యాలయం. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయంలో 2014లో వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి యేటా జనవరి 18వ తేదీన వేమన జయంతి వేడుకలు నిర్వహిస్తూ వచ్చారు. వేమన జయంతి జనవరి 18 అనేందుకు చారిత్రక ఆధారాలు ఎక్కడా లేకపోవడంతో సాహితీవేత్తలు, చరిత్రకారుల అభిప్రాయాల మేరకు అప్పటి వీసీ ఆచార్య మునగల సూర్యకళావతి ఆదేశాల మేరకు గత రెండు సంవత్సరాలుగా వైవీయూలో జనవరి 19న నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జనవరి 19న రాష్ట్రవేడుకగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో వేమన పద్యాలు.. వేమన పద్యాలు ఎంత సరళంగా స్పష్టంగా, అర్థవంతంగా ఉంటాయో.. ఆ పద్యాలకు ఉన్న ఆదరణే తెలియజేస్తుంది. అయితే వేమన పేరుతో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఆయన నోటి నుంచి జాలువారిన పద్యాలను ఎంపిక చేసుకుని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయంలో ‘వేమన మాట’ పేరుతో వేమన పద్యాలను రాసి క్యాంపస్‌లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నేడు వైవీయూలో.. యోగివేమన విశ్వవిద్యాలయంలో గురువారం వేమన జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుగుశాఖ విభాగాధిపతి ఆచార్య జి. పార్వతి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి, సభాధ్యక్షులుగా వైస్ చాన్సలర్ ఆచార్య రంగ జనార్ధన, ప్రత్యేక ఆహ్వానితులుగా రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్ ఆచార్య కె. కృష్ణారెడ్డి హాజరవుతారని తెలిపారు. ప్రధానవక్తగా మైసూరులోని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం పీఠాధిపతి ఆచార్య ఎం. రామనాథంనాయుడు హాజరై కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా వేమన విగ్రహానికి పుష్పమాలలతో అలంకరణ, వేమన చైతన్య యాత్ర, వేమన నాటికప్రదర్శన, పద్యగానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. -
ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. విగ్రహం మార్పుపై వైవీయూ వీసీ క్లారిటీ
సాక్షి, వైఎస్సార్ కడప: యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహ ఏర్పాటుని రాజకీయం చేయొద్దని యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి కోరారు. న్యాక్ గ్రేడింగ్‌లో యూనివర్శిటీ అభివృద్ధి చూసే ఏ గ్రేడ్ ఇచ్చారని తెలిపారు. అభివృద్ధి పనులలో భాగంగానే వేమన విగ్రహాన్ని యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పేరుతో ఉన్న యూనివర్శిటీ కాబట్టి ప్రధానం ద్వారం వద్ద ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 'ఎవరికీ ఇబ్బంది లేకుండా వేమన విగ్రహాన్ని మూడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశాము. యూనివర్సిటీ స్థాపకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనుక ఖాళీ అయిన వేమన విగ్రహ స్థలంలో వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టాము. కొత్త విగ్రహాలు ఏవీ తీసుకుని రాలేదు.. ఉన్న విగ్రహాలనే వేరేచోట మార్చడం జరిగింది. నూతన వైఎస్సార్ పరిపాలన భవనం అని పేరు పెట్టినందున వలన అక్కడే ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటు చేశాం' అని వైస్ ఛాన్సలర్ మునగాల సూర్యకళావతి తెలిపారు. చదవండి: (యోగివేమన విశ్వవిద్యాలయంకు ‘విశ్వ’ఖ్యాతి) -
కల కళలాడే.. కెరీర్
ఊహలకందని భావాలను ఆవిష్కరించే నైపుణ్యం.. ఎల్లలు లేని సృజనాత్మకత, కళలపై ఆసక్తి ఉన్నవారు చదవదగ్గ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. యోగివేమన విశ్వవిద్యాలయంలోఈ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు, ఆప్షన్స్ ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని, ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని లలితకళల విభాగం అధ్యాపకులు కోరుతున్నారు. వైవీయూ(కడప): చిత్రలేఖనంలో రాణించాలనుకునే వారికి యోగివేమన విశ్వవిద్యాలయంలోని ఫైన్ఆర్ట్స్ విభాగం వేదికగా నిలుస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలతో పాటు అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తూ పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ (బీఎఫ్ఏ) యోగివేమన విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉండటం ఇక్కడి కళాకారులకు ఊతమిస్తోంది. ఆసక్తి, అభిరుచి కలిగిన విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉండటంతో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరుతున్నారు. 2010లో యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ కోర్సులో ఎందరో విద్యార్థులు చేరడంతో పాటు, కోర్సు పూర్తి చేసుకున్నవారంతా తమ అభిరుచికి తగ్గ రంగాల్లో స్థిరపడటం విశేషం. కోర్సు ద్వారా లభించే అవకాశాలు.. ఈ కోర్సులు చేయడం ద్వారా యానిమేషన్, ఫ్యాషన్, జ్యువెలరీ డిజైనింగ్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా అడ్వర్టయిజింగ్‌కు ఉన్న డిమాండ్‌ను బట్టి ఆయా ఏజన్సీల్లో సైతం ఉపాధి పొందవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, పిల్లల బొమ్మల తయారీ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. కార్పొరేట్ స్కూల్స్, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా, ప్రొఫెషనల్ ఆర్టిస్టుల్లా రాణించే అవకాశం ఉంది. అర్హతలు.. ప్రవేశం కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. 90 శాతం ప్రాక్టికల్స్‌తో కూడిన కోర్సు. ఎటువంటి ఒత్తిడిలేని వాతావరణంలో విద్యను సాగించే వీలున్న కోర్సు. ప్రవేశాల కోసం ఎస్సీహెచ్ఈఏపీ.జీఓవి.ఇన్‌లో ఈ నెల 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ఆప్షన్స్ ద్వారా యోగివేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. సాధించిన విజయాలు.. 2022లో నేషనల్ ట్రెడిషనల్ అండ్ ట్రైబల్ పెయింటింగ్ వర్క్‌షాపు ద్వారా వివిధ రాష్ట్రాల ట్రైబల్, ట్రెడిషనల్ ఆర్టిస్టులు వైవీయూకు విచ్చేసి వర్క్‌షాపులో పాల్గొన్నారు. 2020లో వైవీయూ, లలితకళా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పెయింటింగ్ వర్క్‌షాపులో 7 రాష్ట్రాల ఆర్టిస్టులు విచ్చేసి వారి ప్రతిభను కనబరిచారు. అదే యేడాది విజయవాడలో నిర్వహించిన ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో ఎల్దరడో పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వైవీయూ విద్యార్థులు 10 మంది పాల్గొని తమ పెయింటింగ్స్ ప్రదర్శించారు. 2020లో న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో పోస్టర్ మేకింగ్, ఇన్స్టలేషన్ విభాగంలో వైవీయూ విద్యార్థులు రెండోస్థానంలో నిలిచారు. 2019లో అలగప్ప విశ్వవిద్యాలయంలో నిర్వహించిన దక్షిణభారత యువజనోత్సవాల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారు. 2018 మార్చినెలలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా చిత్రకారిణిల వర్క్‌షాపునకు బీఎఫ్ఏ విద్యార్థులు ఎన్.రేఖ, పి.గాయత్రి పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుల చేతుల మీదుగా నగదు పురస్కారం, ఘన సన్మానం అందుకున్నారు. 2018 ఏప్రిల్ నెలలో విజయవాడ–అమరావతి కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యాలరీలో వైవీయూ ఫైన్ఆర్ట్స్ ఫైనలియర్ విద్యార్థులు చిత్రం, శిల్పకళాఖండాలు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభను మెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10వేలు నగదు ప్రోత్సాహం అందించారు. విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్ర సంతలో విద్యార్థుల ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించారు. 2018 ఫిబ్రవరిలో ‘ఇంటాగ్లియో’ ప్రింట్ మేకింగ్ విధానంపై వారంరోజుల వర్క్‌షాపు నిర్వహణ. 2018 అక్టోబర్‌లో 34వ సౌత్‌జోన్ యూత్ ఫెస్టివల్లో శిల్పం విభాగంలో బి.ఎఫ్.ఎ విద్యార్థి జి.సోమశేఖర్‌కు ప్రథమస్థానం. 2017లో ప్రపంచ పర్యాటక దినోత్సవం –2017లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం. 2015లో మధ్యభారతదేశ కళలు అన్న అంశంపై లలితకళా అకాడమీ న్యూఢిల్లీ వారి ఆర్థిక సహకారంతో తొలి జాతీయ సెమినార్ నిర్వహణ. 2013లో న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి రూ.10వేలు కైవసం చేసుకున్న వైవీయూ లలిత కళల విద్యార్థి వెంకటేశ్వర్లు. వీసీ, రిజిస్ట్రార్ల ప్రోత్సాహంతో.. యోగివేమన విశ్వవిద్యాలయంలో ఫైన్ఆర్ట్స్ కోర్సు దినదినాభావృద్ధి జరుగడానికి కారణం విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ల సంపూర్ణ సహకారమే. రాయలసీమలో తొలుత వైవీయూలోనే ఈ కోర్సు ప్రారంభించారు. ఇంటర్ తర్వాత కాస్త సృజనాత్మకంగా ఆలోచించేవారికి చక్కటి కోర్సు. ఆధునిక కాలపు ఒత్తిడిని దూరం చేసే విధంగా కోర్సు రూపకల్పన, బోధన జరుగుతోంది. చదువుకుంటూనే సంపాదించుకునే మంచి అవకాశం కూడా ఉంది. – డా. మూల మల్లికార్జునరెడ్డి, లలితకళల విభాగాధిపతి, వైవీయూ -
ఇక కొలువు సులువు..
మనసులోని భావాలకు దృశ్యరూపం ఇచ్చే అరుదైన కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్లోని యానిమేషన్ కోర్సు. పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కోర్సు డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. 100 శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న ఈ కోర్సు ప్రత్యేకతలపై కథనం. సాక్షి,కడప(వైవీయూ): కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి స్పెషలైజ్డ్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయం. వందశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పెద్ద నగరాలకే పరిమితమైన యానిమేషన్ కోర్సును బీఎఫ్ఏ యానిమేషన్ కోర్సుగా కడప విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలను తీర్చేవిధంగా తీర్చిదిద్దిన ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా సొంతగా, వివిధ సంస్థల్లో పనిచేసి పేరుప్రఖ్యాతులు, ఆకర్షణీయమైన వేతనాలు పొందవచ్చును. అర్హత : ఇంటర్మీడియట్లో ఏదైనా కోర్సు పూర్తిచేసిన ఇందులో చేరడానికి అర్హులు. ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021 ద్వారా ప్రవేశాలు పొందచ్చు. నాలుగు సంవత్సరాల ఈ కోర్సుకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. కోర్సులో ప్రవేశం పొందిన వారికి వివిధ రకాల సాంకేతికతను వినియోగించి ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. అవకాశాల వెల్లువ.. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నది నిపుణుల మాట. చదువకుంటూ వివిధ సంస్థల్లో ఫ్రీలాన్స్‌గా కూడా ఉద్యోగం చేసుకునే సౌకర్యం ఉంది. ఆన్లైన్ ద్వారా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఫిల్మ్‌మేకింగ్, గేమ్ డిజైనింగ్ ప్రోగ్రామింగ్ చేసే అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు యానిమేషన్, గేమ్ డిజైనింగ్, కార్టూన్, టీవీఛానల్స్, బుక్ మేగజైన్స్, వెబ్ మాధ్యమాల్లో అపారంగా అవకాశాలు ఉన్నాయి. 2డీ, 3డీ యానిమేటర్లుగాను, లైటింగ్, రిగ్గింగ్ ఆర్టిస్ట్‌గాను, కేరక్టర్ డిజైనర్‌గాను, స్క్రిప్ట్ రైటర్, వీడియో, ఆడియో ఎడిటర్‌గా, పోస్ట్ ప్రొడక్షన్లో వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, డిజైనర్‌గా, గ్రాఫిక్ డిజైనర్, టాయ్ యానిమేటర్, స్టోరీబోర్డు ఆర్టిస్టుగా, ఇలస్ట్రేటర్‌గా, టైటిల్ డిజైనర్, కంపోస్టర్, విజువల్ డెవలపర్, ఫ్లాష్న్యూస్మేకర్స్, ప్రొడక్షన్ డిజైనర్, లేఅవుట్ ఆర్టిస్ట్, 3డీ మోడులర్, కీ ప్రైమ్ యానిమేటర్, ఇమేజ్ ఎడిటర్‌గా, ఫోరెన్సిక్ యానిమేటర్ వంటి వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చదవండి: వైవీయూకు ఏపీ పీజీసెట్–21 నిర్వహణ బాధ్యతలు -
‘ఉర్దూ’ కోర్సుపై ఊగిసలాట
సాక్షి, వైఎస్సార్ కడప : రాయలసీమ ప్రాంతానికి నడిబొడ్డుగా ఉన్న వైఎస్ఆర్ కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో 2017–18 విద్యాసంవత్సరంలో ఎంఏ ఉర్దూ కోర్సును సెల్ఫ్‌సపోర్టింగ్ కోర్సుగా ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచనతో అప్పటి వీసీ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి దీనికి బాటలు వేయగా అప్పటి వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి కోర్సును ప్రారంభించారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఉర్దూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్లవుతున్నా ఇంకా సెల్ఫ్‌సపోర్టింగ్ కోర్సుగానే పరిగణిస్తూ వస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులకు ఆర్థికభారంతో పాటు పరిశోధనలకు అవకాశం లేకుండా పోతోంది. కోర్సును రెగ్యులరైజ్ చేసి పరిశోధనలకు అవకాశం కల్పించాలని ఉర్దూ భాషాభిమానులు కోరుతున్నారు. తొలి సమావేశంలోనే తీర్మానం.. వైవీయూ తొలి మహిళా వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య మునగాల సూర్యకళావతి ఉర్దూ కోర్సును రెగ్యులరైజ్ చేసే అంశాన్ని 2020 ఫిబ్రవరి 25న నిర్వహించిన తొలి పాలకమండలి సమావేశంలోనే ఆమోదింపచేశారు. సెల్ఫ్ సపోర్టింగ్ నుంచి రెగ్యులర్ కోర్సుగా మార్పు చేస్తున్నట్లు జూన్ 23వ తేదీన రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ ఉత్తర్వులు మాత్రం బయటకు రాలేదు. ఈ ఏడాది నోటిఫికేషన్లో సైతం ఉర్దూను సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుగానే పరిగణించారు. కాగా ఎంఏ ఉర్దూ కోర్సును రెగ్యులర్ చేయడంతో పాటు కోర్సుకు అవసరమైన రెగ్యులర్ అధ్యాపక పోస్టులను మంజూరు చేయాలని వైవీయూ అధికారులు ఉన్నతవిద్య అధికారులకు ప్రతిపాదనలు పంపారు. జిల్లాకు చెందిన మైనార్టీశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్‌బాషా దృష్టికి కూడా తీసుకువెళ్లారు. పరిశోధనలకు గండి వైవీయూలో గతంలో కొన్ని కోర్సులను పాలకమండలిలో ఆమోదించి రెగ్యులర్ కోర్సుగా మార్పుచేశారు. ఇప్పుడు అలాగే చేయాలని ఉర్దూ భాషాభిమానులు కోరుతున్నారు. వైవీయూ అధికారులు మాత్రం గతానికి, ఇప్పటికి నిబంధనలల్లో చాలా మార్పులు వచ్చాయని, కోర్సును రెగ్యులర్ చేయాలంటే రెగ్యులర్ అధ్యాపకులు, సిబ్బంది అవసరమని పేర్కొంటున్నారు. కాగా వైవీయూలో ఉర్దూ రెగ్యులర్ అధ్యాపకులు లేనప్పటికీ రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఒకరు చొప్పున జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉర్దూ విభాగంలో ఉన్నారు. వీరికి ఉర్దూ పరిశోధకులకు గైడ్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశం కల్పించకపోవడంతో పరిశోధన అవకాశాలకు కూడా గండిపడినట్లయింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.. వైవీయూలో ఎంఏ ఉర్దూ కోర్సును సెల్ఫ్‌సపోర్టింగ్ నుంచి రెగ్యులర్ కోర్సుగా మార్పు చేసేందుకు తొలి పాలకమండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నాం. కోర్సు నిర్వహణకు అవసరమైన రెగ్యులర్ అధ్యాపకులు, సిబ్బంది మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆమోదం వచ్చిన వెంటనే ఉరర్దూను రెగ్యులర్ కోర్సుగా మార్పుచేస్తాం. – ఆచార్య మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్‌లర్, వైవీయూ -
వైవీయూ నిర్లక్ష్యం..!
ఆధునిక సాంకేతికత కొంత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో.. అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన విశ్వవిద్యాలయం పాత చింతకాయపచ్చడిలా..పాత సమాచారాన్నే కొనసాగిస్తూ.. నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తోంది. సాక్షాత్తు విశ్వవిద్యాలయం చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ మారినా ఇంకా అధికారులకు మాత్రం తెలియనట్లుంది. వైవీయూ పాలకమండలిని రద్దు చేసి నెలరోజులవుతున్నా ఇంకా వారిపే ర్లనే కొనసాగిస్తూ తరిస్తున్నారు. ఇటువంటి చిత్ర విచిత్రాల సమాచారం కనిపించే వైవీయూ వెబ్సైట్ నిర్వహణపై ప్రత్యేక కథనం.. సాక్షి, వైవీయూ: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏదైనా సమాచారం అవసరమైతే ఎక్కువగా ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల విద్యార్థులు ఏదైనా సమాచారం కోసం వైవీయూ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే కొన్ని అంశాలు మినహా మిగతా సమాచారం అంతా పాతదే కనిపిస్తోంది. దీనికి తోడు జూలై 17న విశ్వవిద్యాలయాలు తప్పని సరిగా వెబ్సైట్లో సమాచారాన్ని వెబ్సైట్లో నమోదు చేయాలని యూజీసీ సూచిస్తూ రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. వెబ్సైట్లో నమోదు చేసే అంశాలకు సంబంధించి డాక్యుమెంట్స్, ఫొటోగ్రాఫ్స్, వీడియో తదితర అంశాలను తాజా సమాచారంతో పొందుపరచాలని సర్కులర్ సైతం జారీ అయింది. అప్డేట్ కాని సమాచారం.. ►ఈనెల 24వ తేదీన రాష్ట్ర గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ ఎవరైతే ఉంటారో వారే విశ్వవిద్యాలయాలకు చాన్సలర్‌గా ఉంటారు. అయితే వైవీయూ వెబ్సైట్లో మాత్రం ఇప్పటికీ చాన్సలర్‌గా పూర్వపు గవర్నర్ నరసింహన్ చిత్రమే కనిపించడంతో పాటు పేరు కూడా మార్చలేదు. ►జూన్ 28వ తేదీన వైవీయూ పాలకమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికీ పాలకమండలి సభ్యులుగా టీడీపీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, విజయజ్యోతి, సానుభూతి పరులు పెంచలయ్య, రామచంద్రయ్య పేర్లను వెబ్సైట్లో కొనసాగిస్తున్నారు. ఇదే వరుసలో ఉన్న ప్రిన్సిపల్, రిజిస్ట్రార్, రెక్టార్ల పేర్లను, సమాచారం మాత్రం అప్డేట్ చేసిన వీరికి పైనే మారిన పాలకమండలి సభ్యుల పేర్లు కనిపించకపోవడం గమనార్హం. ►వెబ్సైట్లో ప్రిన్సిపల్‌గా ఆచార్య జి.సాంబశివారెడ్డి పేరు, ఫొటో కరెక్ట్‌గా చూపుతున్న వెబ్సైట్, వైస్ ప్రిన్సిపల్‌గా ఆచార్య కె. కృష్ణారెడ్డి నియమితులైనా ఆయన ఫొటో, పేరు లేకుండా మళ్లీ ఆచార్య జి.సాంబశివారెడ్డి చిత్రమే కనిపిస్తోంది. ►పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా పనిచేసిన డా. వి. వెంకట్రామ్ రెండు నెలల క్రితమే మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీకి అనుబంధ నూజివీడు పీజీ కళాశాలలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అయినప్పటికీ ఆయన చిత్రం, పేరు, సమాచారమే ఇప్పటికీ దర్శనమిస్తోంది. ఈయన వైవీయూ రిసెర్చ్ సెల్ కోఆర్డినేటర్‌గా కూడా కొనసాగుతున్నట్లు పాతసమాచారమే దర్శనమిస్తోంది. ►వెబ్సైట్లో ప్రవేశాల గురించి తెలుసుకుందామని అడ్మిషన్స్‌పై క్లిక్ చేస్తే అండర్ కన్స్ట్రక్షన్స్ అని చూపుతోంది. ►వీటితో పాటు వైవీయూలోని కోర్సులకు సంబంధించిన పూర్తి సమాచారం లేదు. గత రెండు సంవత్సరాలకు పైగా ఉర్దూ కోర్సు నడుస్తున్నప్పటికీ ఇది ఉన్నట్లు కూడా చూపడం లేదు. ఇటీవల ప్రవేశపెట్టిన ఎంఏ రూరల్ డెవలప్మెంట్ ఎంఎస్సీ ఫుడ్‌టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటేషనల్ డాటా సైన్స్ కోర్సుల ఊసు వెబ్సైట్లో లేదు. ►వీటితో పాటు ఐక్యూఏసీ (ఇంటర్ క్వాలిటీ అసెస్‌మెంట్‌సెల్) విభాగం క్లిక్ చేస్తే చివరిసారిగా 2015 డిసెంబర్ 1లో అప్డేట్ చేసినట్లు చూపుతోంది. ►ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయానికి పలు పురస్కారాలు వచ్చాయి. వీటికి సంబంధించిన సమాచారం కూడా నమోదు చేయలేదు. రూ.17 కోట్లు వెచ్చించి నిర్మించిన ఆర్ట్స్బ్లాక్కు సంబంధించిన చిత్రం ఒక్కటి కూడా వైవీయూ ఫొటోగ్యాలరీలో కనిపించకపోవడం గమనార్హం. ►అబౌట్ వైవీయూలోకి వెళ్లి అడ్మినిష్ట్రేషన్ వింగ్‌ను క్లిక్ చేస్తే కేవలం చిత్రాలు ఉంటాయే తప్ప అక్కడ ఎవరి పేర్లు, సమాచారం కనిపించవు. వివరాలు లేకుండా ఫొటోలు ఎందుకు ఉంచారో ఎవరికీ తెలియదు. ►వైవీయూ పీహెచ్డీ థీసిస్ అన్న అంశాన్ని ఓపెన్‌చేస్తే 2017 జూలై 21వ తేదీ వరకు వచ్చినవి మాత్రమే కనిపిస్తాయి. తర్వాత నుంచి సమర్పించిన పీహెచ్‌డీల సమాచారం లేదు. ►2019 పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చినా ఇంకా 2018 ఇన్స్టంట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాల సమాచారమే కనిపిస్తోంది. ►సమాచారహక్కు చట్టంలో నేటికీ నాలుగు సంవత్సరాల క్రితం ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేసిన ఆచార్య జయపాల్‌గౌడ్ పేరే ఉండటం గమనార్హం. పైన కనిపిస్తున్నవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అప్డేట్ సమాచారాన్ని అందించాల్సిన విశ్వవిద్యాలయ పాలకులు ఇంకా పాత సమాచారాన్నే కలిగి ఉండటం నెటిజన్లకు ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాజా సమాచారంతో పాటు విభాగాలకు సంబంధించిన పూర్తి సమాచారం విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ఉంచాలని విద్యార్థులు, మేధావులు కోరుతున్నారు. వైవీయూ వెబ్సైట్లో దర్శనమిస్తున్న పూర్వపు చాన్సలర్ చిత్రం -
వైవీయూ రిజిస్ట్రార్‌గా ఆచార్య గులాంతారీఖ్
సాక్షి, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ఆచార్య జి. గులాంతారీఖ్ నియమితులయ్యారు. ప్రస్తుత రిజిస్ట్రార్ ఆచార్య కె.చంద్రయ్య పదవీకాలం మంగళవారం ముగియడంతో సాయంత్రం గులాంతారీఖ్ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన యోగివేమన విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌గా పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రగతి కోసం ఏర్పాటైన విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. విశ్వవిద్యాలయంలో వైస్ ప్రిన్సిపాల్‌గా, డీన్‌గా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా పలు బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో మంచి పాలన అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆచార్య కె. చంద్రయ్యతో పాటు పలువురు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. గులాంతారీఖ్ నేపథ్యం.. ఆచార్య గులాం తారీఖ్ కడప నగరం అగాడికి చెందిన ప్రొఫెసర్ డా. షేక్ గులాంరసూల్ (లేట్), అజీమాబి దంపతుల కుమారుడైన ఈయన తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ అధ్యాపకవృత్తిలో ఉత్తముడుగా పేరుప్రఖ్యాతులు సాధించారు. తండ్రి వృత్తిరీత్యా తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిలో ఉండగా ఈయన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య సైతం అదే విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. ఎంఫిల్, పీహెచ్‌డీలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. 1983లో అధ్యాపక వృత్తిలో ప్రవేశించి కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో లెక్చరర్‌గా, రీడర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2008 జూలై యోగివేమన విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 జనవరిలో ప్రొఫెసర్‌గా నియమితులైన ఈయన పలు కమిటీల్లో సభ్యుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. వైవీయూ ఆంగ్లశాఖ విభాగాధిపతిగా, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, సెంట్రల్ అడ్మిషన్ సంచాలకులుగా, ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్‌గా, ఎంఈడీ, ఇంగ్లీషు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఆర్ట్స్ విభాగం డీన్‌గా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా, పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించారు. దీంతో పాటు 2016లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డును సైతం ఈయన అందుకున్నారు. ప్రస్తుతం వైవీయూ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఈయనకు రిజిస్ట్రార్‌గా అవకాశం లభించింది. ఆంగ్లసాహిత్యంలో పట్టు... ఆచార్య గులాం తారీఖ్ ‘కంటెపరరీ ఆఫ్రికన్ నావెల్’ అనే పుస్తకాన్ని రచించగా ఢిల్లీకి చెందిన పబ్లిషర్స్ దీనిని ముద్రించారు. దీంతో పాటు 30 జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ఈయన పత్రాలు ప్రచురితమయ్యాయి. 50 వరకు జాతీయ, అంతర్జాతీయస్థాయి సెమినార్లలో పాల్గొని ప్రసంగించారు. బ్రిటీష్ లిటరేచర్, ఆఫ్రికన్ లిటరేచర్, ఇండియన్ ఇంగ్లీషు లిటరేచర్ అన్న అంశాలపై ఈయన పరిశోధన ప్రధానంగా సాగుతోంది. ఈయన వద్ద ఇప్పటి వరకు 10 ఎంఫిల్, మరో 10 మంది పరిశోధక విద్యార్థులు ఈయన మార్గదర్శకత్వంలో పీహెచ్డీ చేస్తుండటం విశేషం. -
ఫీ‘జులుం’ఇక సాగదు
సాక్షి, కడప ఎడ్యుకేషన్: ఉన్నత స్థానాలు అధిరోహించాలి. బంగారు భవితకు బాటలు చేయాలి. కానీ కన్నవారి కలల సాకారానికి ప్రభుత్వ కళాశాలలు అంతగా లేవు. అరకొరగా ఉన్నా వాటిలో కూడా అధ్యాపకుల కొరతతోపాటు మౌలిక వసతుల కొరత వేధిస్తున్నాయి. ఈ రెండింటి సమస్యల నడుమ ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు నలిగిపోవాల్సిందే. ఈ వ్యవహారమంతా ప్రభుత్వానికి తెలిసినా కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల యాజమాన్యానికి మేలు చేకూర్చేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ కళాశాలల్లోని సమస్యలను పరిష్కరించడంలో అంతగా చొరవ చూపడం లేదంటూ మేధావులు, విద్యావంతులు తçప్పుబడుతున్నారు. వీటన్నింటిని గమనించిన తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి బోధన అందించాలనే ఉద్దేశంతో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలను ఆశ్రయిస్తే దానిని వారు అదనుగా తీసుకుని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు రకరకాల కోర్సుల పేరుతో అడ్డు అదుపు లేకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ఫీజుల భారం మోయలేక ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక ఫీజుల భారంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో పడి మానసిక వేదనతో విలవిల్లాడుతున్నారు. పిల్లలను చదివించలేకపోతున్న పేదల వేదనను ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన ఆయన కార్పొరేట్ ఫీజులను క్రమబద్ధీకరించే వ్యవస్థను తీసుకొస్తానని ప్రకటించారు. అందుకు కమిషన్‌ను నియమించి నేరుగా ముఖ్యమంత్రికి నివేదికను అప్పగించే నియంత్రణ వ్యవస్థను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఫీజులను తగ్గించడమే కాకుండా కళాశాలలకు మెరుగైన వసతుల కల్పనకు రెగ్యులేటర్ కమిషన్‌ద్వారా తానే సమీక్షిస్తానంటూ ప్రకటించడంపై పేద, మధ్య తరగతి కుంటుబాలతోపాటు మేధావులు, సామాన్యులు సైతం హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్లో ఫీజులుం ఇలా ... జిల్లాలో 80కి పైగా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరిపై ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యం వివిధ రకాల కోర్సుల పేరుతో ఫీ‘జులుం’ ప్రదర్శిస్తున్నారు. జిల్లా పరిధిలోని పలు కార్పొరేట్ కళాశాలల్లో ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీసీ 18 వేలు, ఏఐఈఈఈ ఐసీ బ్యాచ్ రూ. 24 వేలు, జెడ్ఎఫ్టీసీకి రూ. 32, బైపీసీ నీట్ ఐసీ బ్యాచ్ రూ. 24 స్పార్కు బ్యాచ్ 32, ఐఐటి స్పార్క్ రూ. 60 వేలు, ఎన్‌వన్ 20 బ్యాచ్ రూ. 25 వేలు, నీట్ 40 వేలు, నీట్ ఎన్40 బ్యాచ్‌కు 80 వేలు ఇలా ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీలకు సంబంధించి రూ. 12 వేల నుంచి 18 వేల వరకు ఉన్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులకు కళ్లెం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడంతో ఫీజుల దోపిడీకి నియంత్రణ లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపు, ప్రైవేట్ టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్షణీయం. – రాహుల్, ప్రొద్దుటూరు. పేదలకు ఊరట ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చాలా మంచి నిర్ణయం. ప్రస్తుతం విద్యావ్యవస్థ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒకటో తరగతికి రూ.80వేలు పైనే ఫీజులు ఉన్న పాఠశాలలు ప్రతి పట్టణంలోనూ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చాలామంది పల్లెలలో చిన్నారులను చదివించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ జగన్ నిర్ణయం ఇలాంటి వారికి ఊరట కలిగిస్తుంది. – సుకన్య, బద్వేలు ప్రభుత్వ బడులు నిర్వీర్యం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయి. గత నాలుగేళ్లలో జిల్లాలో 500కు పైగా పాఠశాలలు మూత పడ్డాయి. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు కల్పించకపోవడంతో చాలామంది ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరుతున్నారు. ఇలాంటి దుస్థితి మారుస్తామని వైఎస్ జగన్ ప్రకటన చేశారు. నిర్వీర్యమైన పాఠశాలలకు తిరిగి పునర్జీవం వస్తుంది. – పవిత్ర, మామిళ్లపల్లె, కలసపాడు మండలం విద్య వ్యాపారంగా మారింది... నేటి సమాజంలో విద్య వ్యాపారంగా మారింది. అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, స్టడీమెటీరియల్, రికార్డులు వీటితోపాటు ఫీజులను ఇలా పలు రకాల పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులను వసూలు చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేస్తామనటం అభినందనీయం. – అంబటి, రాజశేఖర్‌రెడ్డి, ఆలంఖాన్‌పల్లె, కడప. అందరికీ అందుబాటులో విద్య... ప్రస్తుత తరుణంలో కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల భారం మోయలేని విధంగా తయారైంది. తల్లిదండ్రులు కార్పొరేట్ మోజులో పడి అప్పులు చేసి చదివిస్తున్నారు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కార్పొరేట్ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీని నియమిస్తామనటంతో అందరికీ విద్య అందుబాటులోకి వస్తుంది. – చెంచిరెడ్డి, రిటైర్డు హెడ్మాస్టర్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నాం ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటను మేము స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థ స్థానంలో కామన్ విద్యా విధానం తీసుకరావాలి. అప్పుడు మాత్రమే సామాన్యలు తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించడానికి వీలుంటుంది. – ఖాజారహ్మతుల్లా, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. చదువు మీది..భరోసా మాది..! వైవీయూ : పేదరికం కారణంగా ఫీజులు చెల్లించలేక ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కావద్దని దివంగత ముఖ్యమంత్రి డాక్టర వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా లక్షలాది విద్యార్థులు ఉన్నతవిద్యకు నోచుకోగా.. ఆయన మరణానంతరం ఈ పథకాన్ని పాలకులు క్రమేణా నీరుగార్చారు. ప్రస్తుత ప్రభుత్వం సరిగా నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. గతంలో సెమిస్టర్‌కు 75 శాతం ఉండాలని పేర్కొనగా.. ప్రస్తుతం ప్రతినెలా 75 శాతం హాజరు ఉండాలంటూ ఇలా రకరకాల నిబంధనలు పెట్టడం వలన విద్యార్థులు చాలా మంది ఈ పథకానికి దూరమవుతున్నారు. జననేత జగన్ హామీతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులు పడుతున్న బాధలు విన్నారు.. మీకు నేను ఉన్నానంటూ వారికి ఫీజుల భారం తగ్గిస్తామని ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో సైతం చేర్చి తన నిబద్ధతను చాటుకున్నారు.ఈ నిర్ణయం పట్ల విద్యార్థిలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. వైఎస్ఆర్ హయాంలో.. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసే సమయంలో పేద విద్యార్థుల కష్టాలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉన్నత, సాంకేతిక విద్య చేరువై లక్షలాది మంది విద్యార్థులు వైద్యులుగా, ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా రాణించారు. టీడీపీ పాలనలో.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిబంధనలతో కోత పెట్టారు. మరోవైపు కళాశాలలకు ఫీజులు పెంచడానికి అనుమతులిచ్చేశారు. లక్షల్లో ఫీజు ఉంటే వేలల్లో మంజూరు చేస్తుండటంతో మిగిలిన భారం విద్యార్థులపై పడుతోంది. వైఎస్ జగన్ వాగ్దానమిదీ.. పేద విద్యార్థుల చదువుకు పూర్తి ఖర్చు భరిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నవరత్నాల్లో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కళాశాల ఫీజుతో పాటు భోజనం, వసతి కోసం రూ.20వేలు ఇస్తామన్నారు. జగన్ మాటిస్తే తప్పరని, అన్నమాటపై భరోసా ఉంటుందని విద్యార్థి లోకం విశ్వసిస్తోంది. కొండంత భరోసా.. విద్యార్థులకు ఉన్నత చదువును అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తామని జగనన్న ప్రకటించడం సంతోషంగా ఉంది. దీంతో పాటు వసతి, భోజనం కోసం రూ.20 వేలు ఇస్తామనడం గొప్ప నిర్ణయం. దీని వలన పేద విద్యార్థులందరూ కూడా ఉన్నతవిద్యవైపు వస్తారు. – ఎం. అరుంధతి, ఎంఎస్సీ జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్, వైవీయూ భవిష్యత్‌పై ఆశలు.. పేద విద్యార్థులు ఉన్నతవిద్య సులువుగా చదువుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్ సరిగా రాక ఇబ్బందులు పడ్డాం. వైఎస్ జగన్ ప్రకటించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మా భవిష్యత్‌పై ఆశలు నిలుపుతోంది. – ఎస్. గురువయ్య, పీజీ విద్యార్థి, బద్వేలు -
హోదాతోనే నవోదయం.!
అడ్డగోలు విభజనతో చితికిపోయిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సంజీవనే అంటున్నారు జిల్లా ప్రజానీకం.. ప్రత్యేకహోదా లభిస్తే రాష్ట్రానికి అనేక రాయితీలతో పాటు పన్నుల్లో మినహాయింపు లభిస్తుందంటున్నారు. పెద్దసంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. జిల్లాతో పాటు రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని విశ్వసిస్తున్నారు.. ప్రత్యేకహోదా అంశం నేటికీ సజీవంగా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లేనని.. హోదా కోసం జాతీయస్థాయిలో పోరాటం చేసిన హోదా యోధుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడేనని.. హోదా కోసం తమ పదవులను తృణప్రాయంగా విడిచి రాజీనామాలు చేసిన హోదా వీరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అని జనం ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. సాక్షి, వైవీయూ : తల్లిని చంపి బిడ్డను బతికించిన తీరున ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించారు. 5 కోట్ల ఆంధ్రప్రజల విన్నపాలను పట్టించుకోకుండా పార్లమెంట్ తలుపులు మూసి మరీ రాష్ట్ర విభజన చేశారు. హైదరాబాద్ కాదు.. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తాం.. అన్న వారు ఆనక మాట తప్పారు. ఇస్తామన్న ప్రత్యేకహోదాకు మంగళం పాడారు. హోదా పదేళ్లు కాదు.. పదిహేనేళ్లు కావాలన్న చంద్రబాబు కేసులకు భయపడి కేంద్రానికి వంతపాడారు. హోదాతో ఏమొస్తుంది..? హోదా ఏమైనా సంజీవనా..? అంటూ ప్యాకేజీనే ముద్దంటూ కేంద్ర ఆర్థికమంత్రికి లేఖసైతం రాశారు. అయితే తొలినుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదాపై ఒకేమాట.. ఒకే బాటగా వ్యవహరిస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకహోదా అంశం రాష్ట్రంలో సజీవంగా ఉండేలా ఎన్నో పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు చేశారు. యువభేరి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి యువతలో చైతన్యం రగిలించారు. హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలను తెలియజెప్పారు. ప్రత్యేకహోదా అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు దేశరాజధాని ఢిల్లీలో సైతం ధర్నా చేపట్టారు. చివరి అస్త్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయించారు. జాతీయస్థాయిలో ప్రత్యేకహోదా అంశాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని, హోదా ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయని, రాష్ట్రాభివృద్ధి వేగంగా జరుగుతుందని,యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని వైఎస్ జగన్ చెప్పిన మాటలను ప్రజలంతా విశ్వసిస్తున్నారు. ప్రత్యేకహోదా వస్తే జిల్లాకు ఒనగూరే ప్రయోజనాలు.. ప్రత్యేకహోదా వస్తే ఖనిజాల ఖిల్లా అయిన వైఎస్ఆర్ జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఉక్కుపరిశ్రమతో పాటు, దానికి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక యూనిట్లకు 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపుతో పాటు పలు రాయితీలు కల్పించడం ద్వారా లభించే అవకాశం ఉండటంతో కడప నగర సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో పరిశ్రమలు పరుగులు తీస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. స్థానికులకు వారి సమీప గ్రామాల్లోనే ఉద్యోగాలు లభిస్తాయి. హార్టికల్చర్ హబ్‌గా రూపొందించే అవకాశం ఉండటంతో పాటు ఉద్యాన ఉప పరిశ్రమలు, అరటి, మామిడి పల్ఫ్, జ్యూస్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని మంగంపేటలోని బెరైటీస్, పుల్లరిన్ తదితర ఖనిజ సంపదకు స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. ముగ్గురాళ్ల ఉప పరిశ్రమలు ఏర్పాటవుతాయి. సిరామిక్, టైల్స్ తదితర పరిశ్రమలు ఏర్పాటవుతాయి. దీంతో పాటు ఎర్రచందనం అధికంగా లభిస్తుండటంతో రెడ్‌శాండల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. అదే విధంగా మూతబడిన ఆల్విన్ ఫ్యాక్టరీ లాంటివి తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటాయి. -
ఒక మండలం.. ఐదుగురు ఎమ్మెల్యేలు
సాక్షి, వైవీయూ : రాజంపేట నియోజకవర్గం పరిధిలోని నందలూరు మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకే మండలం నుంచి ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్యేలు కాగా, మరో ఇద్దరు ఇదే మండలంలో పెళ్లిళ్లు చేసుకుని మండలం అల్లుళ్లు కావడం విశేషం. 1967, 1972, 1985 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన బండారు రత్నసభాపతి స్వగ్రామం నందలూరు మండలం యల్లంపేట. అలాగే 1978, 1983, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండూరు ప్రభావతమ్మ, 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డిల స్వగ్రామం నందలూరు మండలంలోని పాటూరు గ్రామం. 1994, 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పసుపులేటి బ్రహ్మయ్యది మండలంలోని పొత్తపి గ్రామం. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడా వెంకట మల్లికార్జునరెడ్డిది మండలంలోని చెన్నయ్యగారిపల్లె. అదే విధంగా 1962లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండూరు మారారెడ్డి నందలూరు మండలంలో పెళ్లి చేసుకోవడంతో ఆయన ఈ మండలానికి అల్లుడయ్యారు. ఇక 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆకేపాటి అమర్నాథ్రెడ్డి నందలూరు మండలంలోని గట్టుమీదపల్లెలో వివాహం చేసుకోవడంతో ఈయన కూడా నందలూరు మండలం అల్లుడయ్యారు. కాగా ఇదే మండలంలోని ఈదరపల్లెకు చెందిన భూమన కుటుంబ సభ్యులైన భూమన కరుణాకర్‌రెడ్డి 2012 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం. వీరు గత కొన్ని సంవత్సరాల క్రితమే తిరుపతి చేరుకుని అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుండటం విశేషం. ఈయనతో కలుపుకుంటే మండలం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి సంఖ్య 6కు చేరుతుంది. -
సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి
వైవీయూ: సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని ప్రగతిపథంలో నడవాలని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జ్ఞానభేరిలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 25వేల కోట్లను విద్యకు కేటాయిస్తోందన్నారు. విలువలతో కూడిన విద్య అందించాలన్నారు. విద్యారంగంలో 17వ స్థానంలో ఉన్న మనరాష్ట్రం నేడు 3వ స్థానంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఒక ఐడియా మీ జీవితాలనే మారుస్తుందని.. సరికొత్త ఆలోచనగా అమరావతిలో ల్యాండ్‌పూలింగ్ విధానం విజయవంతమైందన్నారు. ప్రణాళికాబద్ధంగా హార్డ్‌వర్క్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. చలనం ఉన్న ఏదీ ఆగిపోకూడదని.. లక్ష్యం చేరేలా కష్టపడి పనిచేయాలని సూచించారు. టెక్సాస్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కర్బారీ, డాక్టర్ అశ్వంత్‌లు మాట్లాడుతూ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు శ్రమించాలని.. జీవితంలో సాధించలేనిది లేదన్నారు. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలే తప్ప నేలచూపులు తగవన్నారు. మాటలు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలని.. వినడం కూడా ఒక కళ అన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎస్. విజయరాజు, కార్యదర్శి వరదరాజన్‌లు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని.. ఆకాశమే హద్దుగా నవ ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. జ్ఞానభేరి కార్యక్రమానికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను జ్ఞానభేరి యాప్‌ద్వారా తెలియజేయాలన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. వర్లు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా మనందరం మారాలని సూచించారు. నిద్రానంగా ఉన్న శక్తులను మేల్కొలిపి నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. అవధాని గరికపాటి నరసింహారావు, సినీ నేపథ్యగాయకుడు గంగాధరశాస్త్రిలు మాట్లాడుతూ ప్రపంచానికి జ్ఞానం అందించిన గొప్ప పుణ్యభూమి భారతదేశమన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య, చదువు, సంస్కారం, సమాజహితం, మానవ జీవనంలో భగవద్గీత ప్రాధాన్యత, లక్ష్యాల గురించి సుదీర్ఘంగా వివరించారు. వైవీయూ వైస్ చాన్స్‌లర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల వయసు గల విశ్వవిద్యాలయంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం ఒక చరిత్రగా ఆయన అభివర్ణించారు. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కళాశాలల నుంచి దాదాపు 80వేల మంది విద్యార్థులను జ్ఞానభేరిలో భాగస్వాములను చేశామన్నారు. ఉన్నత విద్యామండలి ప్రతినిధి వెంకట్ ఈదర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే ప్రభుత్వం రూ.లక్షలాది రూపాయలు సబ్సిడీ ఇస్తూ చదివించేందుకు సరికొత్త పథకం తెస్తోందన్నారు. ఇందులో భాగంగా టెక్సాస్ యూనివర్సిటీ వారితో ఒప్పందం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. చంద్రయ్య స్వాగతోపన్యాసం చేయగా.. వైవీయూ అధ్యాపకులు డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, వినోదినిలు తమ సంభాషణలతో సభికులను అలరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి అధికారులు, వైవీయూ పాలకమండలి సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
22 నుంచి వైవీయూ సెట్ కౌన్సెలింగ్
సాక్షి, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కళాశాల, అనుబంధ కళాశాలల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన వైవీయూ సెట్–2018 ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య టి.శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మొదటి దశ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ అర్హతకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు, హాల్‌టికెట్, ర్యాంకుకార్డు, ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకుని రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జూన్ 22న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, అడ్వాన్స్డ్ లైఫ్‌సైన్సెస్, తెలుగు, ఉర్దూ కోర్సులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కంప్యూటర్‌సైన్స్, ఆంగ్లం, జియాలజీ, పీజీ డిప్లొమో ఇన్ థియేటర్ ఆర్ట్స్, ఫైన్ఆర్ట్స్, ఫుడ్ టెక్నాలజీ, కంప్యూటేషనల్ డేటా సైన్స్‌కు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. 23న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కామర్స్ కోర్సులకు సంబంధించి 1 నుంచి 450వ ర్యాంకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 450పైన ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు, భౌతికశాస్త్రం, మెటీరియల్‌సైన్స్ నానోటెక్నాలజీ, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఎడ్యుకేషన్ కోర్సుకు సంబంధించిన అన్ని ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు వివరించారు. 24న ఉదయం 9 నుంచి 1 గంట వరకు గణితం, స్టాటిస్టిక్స్, జనరల్ టెస్ట్‌లో ర్యాంకు సాధించిన అభ్యర్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రసాయనశాస్త్రం, పర్యావరణశాస్త్రం, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ కోర్సుల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. -
నియామకాలకు బ్రేక్..!
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో అధ్యాపక నియామకాలకు సంబంధించిన ప్రక్రియకు బ్రేక్ పడింది. యూజీసీ నిబంధనలు, ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి విరుద్దంగా నియామకాలు చేపడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కొందరు అధ్యాపకులు, విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పలు విశ్వవిద్యాలయాల్లో నియామక ప్రక్రియకు ఇప్పటికే బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అదే విధంగా వైవీయూలో నియామక ప్రక్రియ, రోస్టర్ విధానంలో తప్పులతడకపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో వైవీయూకు చెందిన పరిశోధక విద్యార్థులు బి.బాలాజీనాయక్, వి.శ్రీనివాసులు, ఎం. నాగేంద్రనాయక్లు కోర్టును ఆశ్రయించారు. రిట్‌పిటీషన్ నంబర్ 12500/2018ను కోర్టు స్వీకరించడంతో పాటు ఈ నియామక ప్రక్రియపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు స్టే ఇస్తూ గురువారం తీర్పునిచ్చింది. రోస్టర్ విధానం, జీఓనం.117, ఎస్టీ రిజర్వేషన్లో నిబంధనలు పాటించకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్టే ఇవ్వడం గమనార్హం. దీంతో వైవీయూలో 2017 అక్టోబర్ 18న విడుదల చేసిన బ్యాక్లాగ్ నోటిఫికేషన్‌తో పాటు 2018 జనవరి 3,4 తేదీల్లో వేర్వేరుగా ఇచ్చిన జనరల్ నోటిఫికేషన్లు సైతం నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే దాదాపు 3వేలకు పైగా దరఖాస్తులు విశ్వవిద్యాలయానికి చేరుకోగా వాటిని స్క్రూటినీ చేసే పనిలో అధికారులు ఉండగానే.. నియామక ప్రక్రియపై నీలినీడలు కమ్ముకోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా.. యూజీసీ నిబంధనలు, ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగినవి. ఈ నిబంధనల ప్రకారం ఒక విభాగం ఏర్పాటు కావాలంటే అందులో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలన్న నిబంధన ఉంది. అదే విధంగా 12బీ, 2ఎఫ్ కలిగిన విద్యాలయాలకు యూజీసీ గ్రాంట్స్, ఇతరత్రా నిధులు లభిస్తాయి. ఇందులో ఏవైనా కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలన్నా, నూతన పోస్టులు మంజూరు చేయాలన్నా విశ్వవిద్యాలయ పాలకమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం 390 జీఓను జారీ చేసి హైపవర్ కమిటీ పేరుతో రేషనలైజేషన్ ప్రక్రియ, పోస్టులను కన్వర్ట్ చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా కొన్ని కోర్సులు కనుమరుగు కావడంతో పాటు పోస్టులు కూడా గల్లంతు అయ్యే పరిస్థితి తలెత్తింది. మరికొన్ని చోట్ల అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా తలకిందులయ్యాయి. దీంతో కేవలం ఒక్క వైవీయూలోనే 43 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు వాటిని 18 పోస్టులకు కుదించారు. ఈ 18 పోస్టుల్లో సైతం మళ్లీ 12 పోస్టులను బ్యాక్లాగ్ కింద కేటాయించారు. వీటితో పాటు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నప్పటికీ 5 విభాగాలను హేతుబద్దీకరణ పేరుతో మూసివేతకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఈ 2017 జనవరిలో రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల నుంచి కొందరు అధ్యాపకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైవీయూ నుంచి ఫిజిక్స్ అధ్యాపకుడు వై.పి. వెంకటసుబ్బయ్య కోర్టును ఆశ్రయించడంతో దీనిపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు వెలువరిచింది. దీంతో ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వారీగా నియామకాలు చేపట్టేందుకు వేర్వేరు జీఓలను విడుదల చేసింది. దీంతో ఒక్కో విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేశాయి. నియామక ప్రక్రియకు సంబంధించి వైవీయూకు 2017 జూన్ 30వ తేదీన జీ.ఓ ఎంఎస్ నెం.28ను విడుదల చేసింది. 2017 అక్టోబర్‌లో వైవీయూ జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో ఈ నియామక ప్రక్రియ కోసం జారీ అయిన జీఓనెం. 28పై స్టే విధించింది. దీనిపై ప్రభుత్వం మళ్లీ కోర్టును ఆశ్రయించగా నియామక ప్రక్రియ నిర్వహించి ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పరిశోధక విద్యార్థులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కడంతో నియామక ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడినట్లయింది. -
హరితవనంగా వేమన విశ్వవిద్యాలయం
► వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయాన్ని పరిశోధనలకు ఉపయోగపడేలా చక్కటి హరితవనంగా తీర్చిదిద్దుతామని వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వైవీయూలోని బొటానికల్ గార్డెన్లో బోరుబావి తవ్వేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జాతీయస్థాయిలో వైవీయూ బొటానికల్ గార్డెన్‌కు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. దీంతో దాదాపు రూ. 90లక్షలను బొటానికల్ గార్డెన్ అభివృద్ధి, పరిశోధనలకు కేటాయించారన్నారు. భారత పర్యావరణ, అడవుల సంరక్షణ, వాతావరణ మార్పులకు సంబంధించిన సంస్థ అరుదైన వృక్షజాతులను కాపాడేందుకు ఈ మొత్తాన్ని వినియోగించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. చంద్రయ్య మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రారంభమైన అనతి కాలంలోనే పేరెన్నికగల విశ్వవిద్యాలయాలతో పోటీపడుతోందన్నారు. ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రాజెక్టు గురించి వివరించారు. అనంతరం బొటానికల్ గార్డెన్లో బోరు వేయగా 180 అడుగుల్లోనే రెండు ఇంచుల నీళ్లు ధారాలంగా రావడంతో అధికారులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో 100 ఇంకుడు గుంతలు యోగివేమన విశ్వవిద్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 ఇంకుడు గుంతలను తవ్వుతున్నట్లు వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ అధికారులంతా ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రిన్సిపల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య జి. గులాంతారీఖ్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
భళా.. చిత్రకళ..!
► వైవీయూలో అబ్బురపరిచిన ప్రదర్శన ► ప్రారంభించిన వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం బీఎఫ్ఏ చివరి సంవత్సరం విద్యార్థులు వేసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శుక్రవారం వైవీయూ లలితకళల విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైవీయూ విద్యార్థులు చక్కటి ప్రదర్శన ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమలో ఏకైక లలితకళల విభాగం విశ్వవిద్యాలయంలో ఉండటం గర్వకారణమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు భావోద్వేగాలను అదుపులో ఉంచే గొప్ప ఔషదంగా ఆయన అభివర్ణించారు. వైవీయూ లలిత కళల విభాగం దక్షిణభారత దేశంలోనే మేటి నిలవాలని ఆకాంక్షించారు. వైవీయూ ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, విప్రో ఫైర్ అండ్ సేఫ్టీ కర్నూలు విభాగం అధిపతి రామాంజినేయులు విచ్చేసి ఈ ప్రదర్శనను తిలకించారు. కాగా ఈ ప్రదర్శనలో 60 కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఫైన్ఆర్ట్స్ విద్యార్థి చిన్నరాయుడు, లోకేష్‌నాయుడు, వరలక్ష్మి, దివ్య, నారాయణస్వామి తదితరులు వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. కాగా కార్యక్రమాన్ని లలితకళల విభాగం సహాయ ఆచార్యులు కోట మృత్యుంజయరావు పర్యవేక్షణలో, లలితకళళ విభాగం సమన్వయకర్త డా. మూల మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం మనోహర్, సంతోష్, సునీతలు పాల్గొన్నారు. -
వైవీయూ వాలీబాల్ జట్టు మేనేజర్‌గా కెప్టెన్ విజయభాస్కర్
కడప స్పోర్ట్స్: ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కాలికట్లో నిర్వహించే దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనే వైవీయూ మహిళల వాలీబాల్ జట్టు మేనేజర్‌గా కెప్టెన్ సి. విజయభాస్కర్ నియమితులయ్యారు. జిల్లాలోని రాజంపేట డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఈయన అటు క్రీడారంగంలో, ఎన్సీసీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. వైవీయూ క్రీడాబోర్డు కార్యదర్శి డా. కె. రామసుబ్బారెడ్డి, సమన్వయకర్త డా. చాన్‌బాషాలు ఆయన్ను అభినందించారు. -
మరియాపురంలో ఉచిత వైద్య శిబిరం
కడప ఎడ్యుకేషన్: కడప నగరం మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గోసుల కృష్ణారెడ్డి ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. సంబంధిత క్యాంపును మరియాపురం ఎంపీపీఎస్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో డాక్టర్లు గోసుల శివభారత్‌రెడ్డి, డాక్టర్ సతీష్‌రెడ్డితోపాటు బీఎంఓ టెక్నీషియన్ షరీఫ్‌లు వైద్యసేవలందించారు. సంబంధిత క్యాంపును కళాశాల కరస్పాండెంట్ బాలస్వామిరెడ్డి, ప్రిన్సిపాల్ రజనీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో చాలా మంది పాల్గొని తమ మోకాళ్ల నొప్పులకు, ఎముకల సాంధ్రతను పరీక్షించుకున్నారు. వైవీయూ ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్ రాంప్రసాద్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ పీవో బాబులు పాల్గొన్నారు. -
వైవీయూలో మల్టీ ఛానల్ సిస్టం ఏర్పాటు
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం, విక్రమ్‌సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో కుదిరిన ఎంఓయూలో భాగంగా వైవీయూలో మల్టీఛానల్ మల్టీ కాన్ట్సులేషన్ సిస్టంను ఏర్పాటు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియను వీఎస్ఎస్సీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజ్‌కుమార్‌చౌదరి, సార్క్ కో–ఆర్డినేటర్, వైవీయూ ఫిజిక్స్ ప్రొఫెసర్ డా. కె. కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. వైవీయూలోని సర్ సీవీరామన్ సైన్స్‌బ్లాక్ పై భాగంలో ఏర్పాటు చేస్తున్న పనులను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సిస్టం ఏర్పాటు చేయడం ద్వారా వైవీయూ నుంచి 22 కిలోమీటర్ల పరిధిలోని ల్యాండ్‌ను గుర్తించడం, హద్దులు కనుగొనడం వంటివి స్పష్టంగా ఇంటర్నెట్ ద్వారా గుర్తించవచ్చన్నారు. దీని పరిధిలో ఎక్కడ ఏమి జరిగినా జీపీఎస్ సిస్టం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. వీరి వెంట వీఎస్ఎస్సీ టెక్నికల్ ఆఫీసర్ డా. మహమ్మద్ నజీర్ ఉన్నారు. -
రెఫ్రెషర్ కోర్సులు ఉపయుక్తం
వైవీయూ: రెఫ్రెషర్ కోర్సులు అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడతాయని కర్నాటక విశ్వవిద్యాలయం విశ్రాంత వైస్ చాన్సలర్ ఆచార్య శ్రీనివాస్ సైదాపూర్ పేర్కొన్నారు. మంగళవారం వైవీయూ వృక్షశాస్త్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెఫ్రెషర్ కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి అధ్యాపకుడు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఇటువంటి కోర్సులు ఉపయోగపడతాయన్నారు. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య వై.నజీర్అహ్మద్ మాట్లాడుతూ వైవీయూలో తొలిసారిగా రెఫ్రషర్ కోర్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. కోర్సు సమన్వయకర్త డాక్టర్ మధూసూధన్‌రెడ్డి మాట్లాడుతూ కోర్సు ఉద్దేశాలను అభ్యర్థులకు వివరించారు. బెంగుళూరు సైన్స్ అకాడమీ గౌరవ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.ఆర్. రావు మాట్లాడుతూ రెఫ్రషర్ కోర్సుల ద్వారా పరిశోధనలకు కావాల్సిన విషయాలు తెలుస్తాయన్నారు. ప్రిన్సిపల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి రెఫ్రషర్ కోర్సులను మరిన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆచార్య శివన్న జీవపరిణామ సిద్ధాంతం గురించి వివరించారు. వృక్షశాస్త్ర అధ్యాపకులు ఆచార్య షావలీఖాన్, చంద్ర ఓబులరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ముదురుతున్న వివాదం
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం టీచింగ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విషయం అధికారులు, పరిశోధక విద్యార్థుల మధ్య వివాదంగా తయారైంది. వివరాల్లోకి వెళితే.. యోగివేమన విశ్వవిద్యాలయంలో కొన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల స్థానాల్లో పీజీ అర్హత కలిగిన అభ్యర్థులను టీచింగ్ అసిస్టెంట్లుగా (బోధన సహాయకులుగా) నియమిస్తారు. ఈ యేడాది కళాశాల ప్రారంభమై మూడు నెలలు గడిచినా దాని గురించి పట్టించుకోలేదు. తీరా దసరా సెలవులు వస్తున్న నేపథ్యంలో హడావుడిగా నోటిఫికేషన్ జారీచేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విశ్వవిద్యాలయంలో గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూ (కొన్ని విభాగాల్లో) మరోవైపు తరగతులు కూడా బోధిస్తున్న పరిశోధక విద్యార్థులకు టీచింగ్ అసిస్టెంట్‌గా అవకాశం కల్పించి కాస్త ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. దీనికి అధికారులు స్పందించకపోవడంతో వైవీయూ పరిశోధక విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. దీంతో వ్యవహారం వాయిదా పడింది. అయితే మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో టీచింగ్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ కోసం అనుమతి పొందిన పాలకులు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో పరిశోధక విద్యార్థి సంఘం నాయకులు దీనిని అడ్డుకునే యత్నం చేశారు. ప్రిన్సిపాల్ ఛాంబర్ వద్ద ఆందోళన.. టీచింగ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసేందుకు రంగం సిద్ధమైన విషయం తెలుసుకున్న వైవీయూ పరిశోధక విద్యార్థులు బుధవారం ప్రిన్సిపల్ ఛాంబర్ వద్దకు వెళ్లి బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైవీయూ పరిశోధక విద్యార్థుల సంఘం నాయకుడు దస్తగిరి మాట్లాడుతూ ఇతర విశ్వవిద్యాలయాల్లో పరిశోధక విద్యార్థులకు టీచింగ్ అసిస్టెంట్లు అవకాశం కల్పిస్తుంటే మీరెందుకు కల్పించరని కోరారు. తొలి ప్రాధాన్యత వైవీయూలో పరిశోధన చేస్తున్న విద్యార్థులకే ఇవ్వాలని కోరారు. దీంతో అధికారులు దీనిపై తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని నోటిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేశారు. కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు రమేష్పిచయ్, శ్రీనివాసులు, భరత్‌కుమార్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వైవీయూ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న రీవాల్యుయేషన్, రీ టోటలింగ్, పర్సనల్ వెరిఫికేషన్లకు సంబంధించిన ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వైవీయూ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ఆచార్య బాయినేని శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. యూజీ రీవాల్యూయేషన్ ఫలితాల్లో ఇయర్ ప్యాట్రన్ (ప్రథమ, ద్వితీయ, తృతీయ) పలితాలు, యూజీ సెకండ్ సెమిస్టర్ సీబీసీఎస్ రివాల్యూయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు ఫలితాల కోసం వైవీయూ వెబ్సైట్లో సంప్రదించాలని కోరారు. -
వైవీయూ ఎన్ఎస్ఎస్ ర్యాలీ
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం, దోమలపై దండయాత్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీయూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ఆచార్య తప్పెట రాంప్రసాద్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రాధాన్యతను తెలియజేశారు. అదే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ దోమలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిన్న దోమే కదా నిర్లక్ష్యం చేస్తే వేలాది రూపాయలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని అవగాహన కల్పించారు. స్థానిక తహశీల్దార్ రామాంజినేయులు, ఎంపీడీఓ మల్‌రెడ్డిలు కార్యక్రమానికి విచ్చేసి వైవీయూ ఎన్ఎస్ఎస్ యూనిట్లు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని.. ప్రజలు ఉదాసీనత విడనాడి పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామంలో సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సుజాత, వైద్యాధికారి లక్ష్మీకర్, గుండాల్రెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో.. నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎన్ఎస్ దినోత్సవం, దోమలపై దండయాత్ర కార్యక్రమాలను నిర్వహించారు. కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీని ప్రిన్సిపాల్ డా. పి. సుబ్బలక్షుమ్మ ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ఏడురోడ్ల కూడలికి చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగాం ఆఫీసర్ గంగిరెడ్డి విజయలక్ష్మి, ఎకోక్లబ్ మెంబర్ యుగవాణి, రిబ్బన్‌క్లబ్ కన్వీనర్ సుబ్బారెడ్డి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పాల్గొన్నారు. -
వైవీయూ అధ్యాపకులకు కొత్త బాధ్యతలు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో నెలరోజులుగా కొనసాగుతున్న పదవుల పంచాయతీ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఇద్దరు ఆచార్యులకు విభాగాధిపతులుగా, 15 మంది సహాయ ఆచార్యులకు విభాగాల సమన్వయకర్తలు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జూన్ చివరివారంలో వైవీయూలో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 10మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించారు. దీంతో విశ్వవిద్యాలయంలో సహ ఆచార్యులు అన్నవారే లేకుండా పోయింది. దీంతో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే మిగిలారు. దీంతో పదోన్నతులు పొందిన కొందరు కేవలం ప్రొఫెసర్లు మాత్రమే విభాగాధిపతులు ఉండాలని పేర్కొనగా.. ఎప్పుడూ వారేనా అంటూ సహాయ ఆచార్యులు సైతం తమ గళం వినిపిస్తూ వచ్చారు. దీంతో వారి మధ్య కొన్ని విభాగాల్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. దీంతో వీరి మధ్య సయోధ్య కుదర్చి గత వారంలో నలుగురికి ఇవ్వగా తాజగా 17 మందికి విభాగాల బాధ్యతలను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వీరంతా బాధ్యతలు స్వీకరించి విధులకు హాజరయ్యారు. –––––––––––––––––––––––––––––––––––––––––––––– అధ్యాపకుడి పేరు హోదా విభాగం ––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఆచార్య టి. రామకృష్ణారెడ్డి విభాగాధిపతి తెలుగు ఆచార్య ఎం. రామకృష్ణారెడ్డి విభాగాధిపతి ఎర్త్‌సైన్స్ ––––––––––––––––––––––––––––––––––––––––––––––– డా. ఎం. శ్రీధర్‌బాబు సమన్వయకర్త అప్లైడ్ మ్యాథ్స్ డా.ఎ. చంద్రశేఖర్ సమన్వయకర్త బయోటెక్నాలజీ డా.వి. రామకృష్ణ సమన్వయకర్త బయోటెక్నాలజీ అండ్ బయోఇన్మర్మాటిక్స్ టి. శ్యామ్స్వరూప్ సమన్వయకర్త కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం డా. బి. దీనామార్గరేట్ సమన్వయకర్త ఎకనామిక్స్ డా.ఎస్. సుమిత్ర సమన్వయకర్త ఎన్విరాన్మెంటల్ సైన్స్ డా. ఎం. మల్లికార్జునరెడ్డి సమన్వయకర్త ఫైన్ఆర్ట్స్ డా.బి. రమేష్ సమన్వయకర్త జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్ డా. వి. వారిజ సమన్వయకర్త హిస్టరీ అండ్ ఆర్కియాలజీ డా. ఎస్. ఆదినారాయణరెడ్డి సమన్వయకర్త మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ డా. డి. విజయలక్ష్మి సమన్వయకర్త మైక్రోబయాలజీ డా. ఎస్. చాన్‌బాషా సమన్వయకర్త ఫిజికల్ ఎడ్యుకేషన్ డా. వి. లాజర్ సమన్వయకర్త సైకాలజీ డా. ఎస్. గోవర్దన్‌నాయుడు సమన్వయకర్త పీఎస్ అండ్ పీఏ కె. శ్రీనివాసరావు సమన్వయకర్త కంప్యూటర్ అప్లికేషన్ -
మృత్యుంజయరావుకు పురస్కారం
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం సమన్వయకర్త కోట మృత్యుంజయరావుకు వరదా వెంకటరత్నం స్మారక అవార్డు వరించింది. ఇటీవల కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలోని విక్టోరియా జూబ్లీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన చిత్రాకళా ప్రదర్శనలో ఈయన వేసిన చిత్రానికి అవార్డు లభించింది. ప్రసిద్ధ 60 చిత్రప్రదర్శనలు మాత్రమే ఇందులో ఉంచగా కోట మృత్యుంజయరావు కృష్ణానది పౌరాణికగాథను ఆధారం చేసుకుని పెయింటింగ్ వేశారు. అవార్డులో భాగంగా ఈయనకు ప్రశంసాపత్రం, శాలువా, రూ.6వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా మృత్యుంజయరావు మాట్లాడుతూ ప్రతిపాదనల స్థాయిలోనే నిలిచిపోయిన లలితకళల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు ప్రక్రియను తిరిగి చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈయనకు అవార్డు రావడంపై రెక్టార్ ఆచార్య ఎం. ధనుంజయనాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్అహ్మద్, ప్రిన్సిపాల్ ఆచార్య సత్యనారాయణరెడ్డి, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.