పకడ్బందీగా సమగ్ర కుటుంబ సర్వే
● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: జిల్లాలో చేపట్టనున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో ఈ సర్వే కీలక పాత్ర పోషిస్తుందని, తప్పులు లేకుండా పూర్తి చేయాలన్నారు. సందేహాలుంటే శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలన్నారు. డేటా ఎంట్రీ సైతం పక్కాగా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. నవంబర్‌లో నిర్వహించనున్న సర్వే కోసం ఎన్యూమరేటర్ల బ్లాక్, హౌస్ లిస్టింగ్ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. ప్రతీ తహసీల్దార్, ఎంపీడీవోల వద్ద గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నివాస స్థలాల మ్యాప్‌లు, హౌస్ లిస్టింగ్ ఫార్మాట్, 57 ప్రశ్నల ఫార్మాట్, సర్వే పూర్తయిన ఇంటిపై అతికించు స్టిక్కర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. సర్వే నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్యూమరేటర్లకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీపీవో శ్రీలత, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎల్‌పీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment