ఆదిలాబాద్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో జిల్లా ముఖ్యనేతల ప్రసంగాలు ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధానంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రసంగం ఆధ్యంతం వాడీవేడిగా సాగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఇతర అధిష్టాన పెద్దల సమక్షంలోనే బహిరంగసభ వేదికగా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష జరగాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొందరు అనవసరంగా తనపై అభాండాలు వేస్తున్నారని, పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ప్రయత్నించినప్పటికీ తనపై నిందలు వేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా మీడియాకు లీకులు ఇస్తూ వార్తలు రాయిస్తున్నారని, ఇలాంటి వారి భరతం పట్టాల్సిన అవసరముందని అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఆ బాధ్యత కూడా తానే తీసుకుంటానని కార్యకర్తల సమక్షంలో అధిష్టాన పెద్దల ముందు పేర్కొనడం గమనార్హం. ఆయన ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారనేది మాత్రం నేరుగా స్పష్టం చేయలేదు. అయితే జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణలను ఉద్దేశించి అన్నారా అనే మీమాంస కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. మొత్తంగా ఈ వ్యవహారం ప్రస్తుతం పార్టీలో దూమారం కలిగిస్తోంది.
ఎన్నికల ముందు ఏంటిలా..?
ఆదిలాబాద్‌ను ఎన్నికల సెంటిమెంట్‌గా భావించిన హస్తం పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనూ ఇక్కడి నుంచే సమీక్షలు షురూ చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు సోమవారం సమావేశం నిర్వహించింది. అయితే అనుకున్నదొకటి.. అయ్యింది మరోటి అన్న చర్చ పార్టీలో మొదలైంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశం అంతా సవ్యంగా సాగిందని పార్టీ పైకి చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం నేతల విభేదాలపై మళ్లీ చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయం సాధించి కార్యకర్తల్లో ఉత్సాహం పెంచాలని అధిష్టానం భావించినప్పటికీ జరిగిన పరిణామాలతో అధిష్టాన పెద్దలే ఆదిలాబాద్ విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇవీ ఇక్కడికే సమసిపోతాయా.. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయా అన్న కొత్త టెన్షన్ మొదలైంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ తన ప్రసంగంలో అలకలు పక్కనపెట్టి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు. ఇప్పటికై నా విభేదాలు వీడి పనిచేస్తారా లేదా చూడాల్సిందే.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రసంగం తర్వాత మాట్లాడిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ప్రసంగంలో కూడా మాటల తూటాలు పేలాయి. లీడర్ అంటే అందరిని కలుపుకునిపోవాలని, లేకపోతే గ్రూప్‌లు తయారవుతాయని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ఎవరి పేరు తీసుకోకుండా మాట్లాడినా పరోక్షంగా ఎవరిని ఉద్దేశించి అన్నారో అనే దానిపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అంతే కాకుండా ఇందిరమ్మ కమిటీల్లో లొల్లి ఎందుకు వస్తుందని ఆమె ప్రశ్నించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఆమెనే ఆ కమిటీలకు ఆమోద ముద్ర వేయడం గమనార్మం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోటే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఈ కమిటీల పరంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment