వర్గీకరణ సాధనే అంతిమ లక్ష్యం
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ● ‘వేల గొంతులు, లక్ష డప్పులు’ ను సక్సెస్ చేయాలని పిలుపు
కై లాస్‌నగర్: ఎస్సీ వర్గీకరణ సాధనే మాదిగల అంతిమ లక్ష్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో తలపెట్టిన ‘వేల గొంతులు, లక్ష డప్పులు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేతాజీ చౌక్, వినాయక్‌చౌక్ మీదుగా ఎస్టీయూ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు దేశంలోని అన్ని పార్టీలు మద్దతునిచ్చాయని, 59 ఎస్సీ కులాల్లో 58 కులాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న కొందరు స్వార్థ మాలలే వర్గీకరణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 15 శాతం రిజర్వేషన్‌లో నాలుగు శాతం పొందాల్సిన మాలలు 12 శాతం పొందుతున్నారని, 10 శాతం పొందాల్సిన మాదిగలు మూడు శాతం మాత్రమే పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వేసిన మూడు కమిషన్లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చాయన్నారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా అనుకూలమైన తీర్పినిచ్చిందని, పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వర్గీకరణను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. మాదిగల మద్దతుతోనే రేవంత్‌రెడ్డి రాజకీయంగా బలపడ్డారని, వర్గీకరణను అమలు చేయకుండా కమిషన్లు, కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ చేయకుండా మాదిగ బిడ్డలకు అన్యాయం చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌లో మాలల అధిపత్యం ఉందని తెలిపారు. వారు సీఎంను కూడా శాసిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కేంద్రం అఫిడవిట్ ఇవ్వడంతోనే తమకు న్యాయం జరిగిందని, తన జాతిని గెలిపించుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. వర్గీకరణ సాధించేదాకా తమ పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి బుర్రి సతీశ్, నాయకులు కూడాల స్వామి, కాంబ్లే బాలాజీ, జిల్లపెల్లి నవీన్, బర్కుంటి సుభాష్, మెడిపల్లి మనోజ్, గైక్వాడ్ సూర్యకాంత్, గుర్రాల ఆశన్న, బీజేపీ నాయకుడు పాయల్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment