కొండలు ఎక్కి.. గెడ్డలు దాటి
మోతుగూడెం: అడవి మార్గంలో కాలినడకన కొండలు ఎక్కి...గెడ్డలు దాటి శివారులో ఉన్న నేలకోట గ్రామాన్ని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ బుధవారం సందర్శించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామానికి కొన్నేళ్లుగా ఉన్నతాధికారులు ఎవరూ రాలేదని... సమస్యలతో సతమతమవుతోనే జీనవం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుంచి మోతుగూడెం వరకు రోడ్డు నిర్మించాలని వేడుకున్నారు. రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే నేలకోట గ్రామం నుంచి గొడ్లగూడెం పీహెచ్‌సీకి వెళ్లేందుకు 16 కిలోమీటర్లు, మోతుగూడెం పీహెచ్‌సీకి వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు. మోతుగూడెం వరకు రోడ్డు నిర్మాణంతో సమస్య పరిష్కారమవుతుందని గిరిజనులు వివరించారు. అనంతరం ఆయన తిరుగు ప్రయాణంలో కాలినడకను వెళ్తున్న పీవోను ఎంపీటీసీ సభ్యుడు వేగి నాగేశ్వరరావు కలిశారు. నేలకోటలో సమస్యలతో పాటు రహదారి నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. మోతుగూడెంలోని ఎస్టీ కాలనీలో గిరిజనులతో సమావేశమయ్యారు. పీవోకు పలు సమస్యలను వివరించారు. గ్రామంలోని సుమారు 60 ఎకరాల్లో పంటలకు సాగునీరు అందించేందుకు మోటార్ ఇచ్చారని, ప్రస్తుతం పనిచేయడం లేదని స్థానికులు సమస్యను విన్నవించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యను స్థానిక మహిళలు వివరించారు. మురుగునీరు రహదారులపై పారుతోందని, దుర్గంధంతో సతమతవుతున్నామని, వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, సమస్య పరిష్కరించాలని కోరారు. దీనిపై ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆయనతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
మోతుగూడెం శివారు నేలకోట గ్రామాన్ని సందర్శించిన చింతూరు
ఐటీడీఏ పీవో అపూర్వ భరత్
సమస్యల పరిష్కారానికి హామీ
అటవీ మార్గంలో వెళ్తున్న పీవో అపూర్వ భరత్
Comments
Please login to add a commentAdd a comment