ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి
పోరుబాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి
రంపచోడవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఆరు నెలల కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు), మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు అన్నారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో కలిసి పందిరిమామిడి నుంచి ర్యాలీగా విద్యుత్ సబ్ స్టేషన్‌కు చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాల అమలు చేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు చేతులేత్తాశారని విమర్శించారు.
తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారని, దాని ఊసే ఎత్తడం లేదని చెప్పారు.2014లో చంద్రబాబు అబద్ధాలతో ప్రజలు మోసపోయారని, ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే భర్త అరాచాకలకు అంతులేకుండా ఉందని ఆరోపించారు. పేద ఎమ్మెల్యే అని చెబుతున్నారని, ఆరు నెలల కాలంలో ఇంటి ముందు ఐదు ఖరీదైన కార్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గిరిజనులు విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని, ఒక బల్బు, ఫ్యాన్ ఉంటే రూ. 15వేలు, రూ. 20 వేలు కరెంటు బిల్లులు వచ్చాయని చెప్పారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ డీఈ గాబ్రియేల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు ఆనంద్‌రెడ్డి, సార్ల లలితకుమారి, కుంజం మురళీ, గోము వెంకటలక్ష్మి, పల్లాల కృష్ణారెడ్డి, వీర్రాఘవమ్మ, జెడ్పీటీసీ పండా వెంటకలక్ష్మి, సిరసం కృష్ణవేణి, కర్ర వెంకటలక్ష్మి, మద్దాల వీర్రాజు, చిచ్చడి మురళీ,గుజ్జ విజయ, స్థానిక సర్పంచ్ మంగా బొజ్జయ్య, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment