చోడవరం: భోగి పండగ రోజు నుంచే తీర్థాలు ప్రారంభమయ్యాయి. ఆదిదేవుడైన చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం వద్ద మొదటి తీర్థం జరిగింది. భోగి పండగను పురస్కరించుకొని విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి పట్టణ పురవీధుల్లో స్వామి తిరువీధోత్సవం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఆలయం వద్ద మొదటి తీర్థం జరిగింది. గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టే బెలూన్లు, పిండివంటలు, పంచదార చిలుకలు అమ్మడంతో వాటిని కొనుగోలు చేసేందుకు అంతా ఆసక్తి చూపారు. రంగులరాట్నాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో తీర్థం అంతా సందడి చోటుచేసుకుంది. ఆలయం వద్ద 400మంది పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలిపతిరావు, ఆలయ కమిటీ చైర్మన్ పసుమర్తి సాంబ తదితరులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన కూరగాయల తీర్థం : జిల్లాలో ఎక్కడా జరగని విధంగా చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం వద్ద సందడిగా కూరగాయల తీర్థం జరిగింది. సంక్రాంతి పండగలో రైతులు పండించిన కొత్త పంటలే ముఖ్యం కావడంతో ఆ పంటలను ఈ తీర్థంలో విక్రయిస్తారు. ప్రధానంగా చోడవరం పరిసర గ్రామాల్లో పండిన రకరకాల కూరగాయలన్నీ ఈ తీర్థంలో అమ్మకానికి ఉంచారు. ఈ కూరగాయల తీర్థంలో కూరగాయలు కొనుగోలుచేసి సంక్రాంతి రోజున పూజ చేస్తే మంచి జరుగుతుందని ప్రతీతి. భోగి పండగను మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన కుటుంబసభ్యులతో సోమవారం తన స్వగ్రామమైన కేజే పురంలో సందడిగా జరుపుకొన్నారు. స్థానిక రామాలయంలో భజనలు, కీర్తనలు ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment