గూడెంకొత్తవీధి: మండలంలోని సీలేరు అటవీ రేంజ్ పరిధిలో పరిసర గ్రామాల ప్రజలకు పులిభయం పట్టుకుంది.సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద ఆదివారం పెద్దపులి ప్రయాణికుల కంటపడింది. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానికులతో పాటు జిల్లాకు వచ్చి వెళ్లే ప్రయాణికులను భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆదివారం దారకొండ సంతలో పులి ప్రచారంపై గిరిజనులను అప్రమత్తం చేయడంతో మరింతగా భయపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే దారకొండ మార్గంలో తగినన్ని ఆర్టీసీ సర్వీసులు లేవు. రోజులో నాలుగైదు సర్వీసులు మాత్రమే తిరుగుతాయి. దీంతో చాలా వరకూ గూడెంకొత్తవీధినుంచి సీలేరు, దారకొండ, సప్పర్ల, ఒడిశా వంటి ప్రాంతాలకు ప్రైవే టు వాహనాలపైనే ఆధారపడుతుంటారు. అత్యధిక శాతం మంది ద్విచక్రవాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో అధికంగా సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది ఉన్నారు. వీరితోపాటు వారపు సంతలకు వెళ్లే వ్యాపారులు ఆటోలు, జీపులు తదితర వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. దారకొండ దారాలమ్మను దర్శించుకునేందుకు ప్రతిరోజూ అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గురు, ఆదివారాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పండగలు, సెలవు దినాల్లో ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ప్రధాన రహదారిపై పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలు రావడంతో ఈమార్గంలో వెళ్లేందుకు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుని పెద్దపులి సంచారంపై స్పష్టమైన ప్రకటన చేయాలని, దానిని బంధించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
ప్రయాణికులను వెంటాడుతున్న భయం
Comments
Please login to add a commentAdd a comment