ప్రకృతి సాగు.. లాభాలు బాగు
రాజవొమ్మంగి: పూత పిందె దశలో జీడిమామిడిపై మీనామృతం రెండుసార్లు పిచికారీ చేయడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని ఆర్‌వైఎస్‌ఎస్ (రైతు సాధికార సంస్థ) ఉర్లాకులపాడు క్లస్టర్ కో–ఆర్డినేటర్ అప్పలరాజు చెప్పారు. డివిజన్ పరిధిలో సాగవుతున్న జీడిమామిడి, నువ్వు, పెసర, మినుము పంటలను ఆయను గురువారం పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఉర్లాకులపాడు క్లస్టర్‌లో దాదాపు 440 ఎకరాల్లో జీడిమామిడి తోటలు ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ మీనామృతం పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నట్టు తెలిపారు. చేపలు, బెల్లంతో తయారు చేసిన మీనామృతం జీడిమామిడి సాగులో ఎంతో ఉపయోగకారిగా పనిచేస్తుందన్నారు. ఈ పద్దతిని పాటిస్తే ఒక్కో మొక్కకు 20 కిలోల (ఎకరాకు సుమారు 14 క్వింటాళ్లు) దిగుబడి సాధించవచ్చన్నారు. మండలంలోని కొమరాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్‌పీఎం షాపు (ప్రకృతి వనరుల కేంద్రం) ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల ద్రావణాలు తక్కువ ధరకే పొందవచ్చన్నారు. ప్రసుతం రబీలో సాగువుతున్న నువ్వులు, మినుము, పెసర పంటలపై నీమాస్త్రం పిచికారీ చేస్తే పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుందన్నారు. మండలవ్యాప్తంగా మరో ఐదు క్లసర్టర్లలో రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నట్టు అప్పలరాజు తెలిపారు. మరిన్ని వివరాలకు రైతులు దగ్గరలోని రైతు సాధికార సంస్థ కో–ఆర్డినేటర్లను సంప్రదించాలని కోరారు.
నాణ్యమైన దిగుబడికి మీనామృతం దివ్య ఔషధం
ప్రకృతి వ్యవసాయం క్లస్టర్ కో–ఆర్డినేటర్ అప్పలరాజు
సూచనలతో సత్ఫలితాలు
ప్రకృతి సేద్యంలో భాగంగా 2014లో ప్రారంభమైన రైతు సాధికారి సంస్థ మన్య ప్రాంతంలో ప్రతి మండలంలో మంచి ఫలితాలు ఇస్తోంది. వాతావరణ మార్పులను తట్టుకొని, తక్కువ ఖర్చుతో సహజ వ్యవసాయం కోసం జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ లో రైతులను ప్రోత్సహిస్తున్నాం. – అప్పలరాజు,
క్లస్టర్ కో–ఆర్డినేటర్, ప్రకృతి వ్యవసాయం
Comments
Please login to add a commentAdd a comment