మద్దిలపాలెం : త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ నెల 17 నుంచి 23 వరకూ మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని ఆరాధాన ట్రస్ట్ ప్రతినిధులు ఎంఎస్‌ఎన్ రాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు తెలిపారు. ఈ ఏడాది ఏడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. తొలి రోజు 17న తమిళనాడు సంగీత, లలిత కళల విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, ప్రముఖ వీణ విద్వాన్సురాలు వీణా ఈ.గాయత్రి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మాక సంగీత కళాభారతి అవార్డును ప్రముఖ నాదస్వర విద్యాంసుడు గురువిళ్ల అప్పన్నకు అందిస్తున్నామని తెలిపారు. అవార్డుతోపాటు, పట్టు వస్త్రాలు, ప్రశంసాపత్రం, రూ.10వేలు నగదు పురస్కారం అందిస్తామన్నారు. అనంతరం సంగీత కార్యక్రమంలో హంస అకాడమీ అధ్యాపకులు, విద్యార్థులు త్యాగరాజ కీర్తనలతో కూర్చిన ‘సంగీత సాహిత్య సద్భక్తి సమన్వయం‘ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. రెండో రోజు 18న ఉదయం 7 గంటలకు స్థానిక త్యాగరాజ ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన తర్వాత శ్రీ సీతారామ పరివారాన్ని ఊరేగింపుగా కళాభారతి చూట్టూ, వందలాది కళాకారులు గానం చేస్తుండగా కోలాటం, నాదశ్వర వాయిద్యాలతో, కార్యదర్శి డాక్టర్.గుమ్ములూరి రాంబాబు త్యాగరాజ వేషధారణలో భారీ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు.
అనంతరం 200 మంది పైగా సంగీత విద్వాంసులు ఘనరాగ పంచరత్న కీర్తనలు ఆలపిస్తారని తెలిపారు. అనంతరం మంగళ ధ్వని – నాదస్వర వాద్యం గురువిల్లి అప్పన్న బృందం కచేరీ ప్రారంభమవుతుందని తెలిపారు. వారం రోజులపాటు జరిగే కచేరిలో పాల్గొనేందుకు 1169 దరఖాస్తులు రాగా వాటిలో 1110 అంగీకరించామన్నారు. ఏడు రోజుల పాటు 404 సంగీత కచేరీలు నిర్వహించనున్నామన్నారు. చైన్నె, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుంచి కళాకారులు తరలివస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment