హద్దుగా..
ఆకాశమే
సాక్షి, పాడేరు: గిరిజనుల సంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే భారీజం సందడి మన్యంలో తాండవించింది. అందరూ ఆరోగ్యంగా జీవించాలని, పంటలు బాగా పండాలనే ఆకాంక్షతో ప్రకృతి దేవతలు, గ్రామంలోని గిరిజనుల ఆరాధ్యదైవం శంకులమ్మ తల్లికి పూజలు చేస్తూ సంక్రాంతి సీజన్‌లో భారీజం పండగను గిరిజనులు ఘనంగా జరుపుకుంటారు. డోకులూరు గ్రామంలో ప్రతి ఏడాది ఈ వేడుక జరుపుకోగా, అనేక ప్రాంతాల్లో మూడేళ్లకు ఓసారి ఈ పండగ నిర్వహిస్తారు. డోకులూరులో గురువారం భారీజం పండగ హోరెత్తింది. గ్రామచావిడిలో గిరిజన సంప్రదాయ డప్పు వాయిద్యాలను మోగించిన గిరిజనులు భారీజంను ఈ ఏడాది ఘనంగా ప్రారంభించారు. డోకుల కుటుంబం ఇంటిలో పూజలందుకుంటున్న పురాతన నాలుగు కత్తులకు సంప్రదాయంగా మళ్లీ పూజలు చేశారు. తమర్భ వంశానికి చెందిన డాక్టర్ తమర్భ విశ్వేశ్వరనాయుడు, గ్రామంలోని పాంగి, డూరు, డోకుల కుటుంబాల పెద్దలంతా ఈ కత్తులకు పూజలు చేసిన అనంతరం గ్రామంలోని శంకులమ్మతల్లి, గంగమ్మతల్లి దేవతామూర్తులు కొలువుదీరిన ఆలయాల వరకు ఘనంగా ఊరేగించారు. శంకులమ్మతల్లి ఆలయం వద్ద కత్తులను ప్రతిష్టించి మళ్లీ ఆ ఆయుధాలకు గిరిజనులంతా ప్రత్యేక పూజలు చేసి కోడిని బలిచ్చారు. అనంతరం వేర్వేరు కులాలకు చెందిన గిరిజనులు బావమరుదులు వరుస చూసుకుని కత్తులను చేతబూని ప్రదర్శన చేశారు. ఈ కత్తుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం కత్తులను మళ్లీ గ్రామ చావిడి వరకు ఊరేగింపుగా మోసుకువెళ్లారు. ఆ సమయంలో కత్తుల ఊరేగింపు సంబరానికి అనేక గ్రామాల గిరిజనులు భారీగా తరలివచ్చారు.
మయూరాల్లా థింసా నృత్యాలు
భారీజం పండగతో డోకులూరు గ్రామంలో అన్ని వర్గాల గిరిజనులు మయూరాల్లా పోటాపోటీగా థింసా నృత్యాలు చేశారు. శంకులమ్మతల్లి ఆలయ ప్రాంగణంతో పాటు గ్రామ చావిడిలోను సుమారు 3 గంటలపాటు థింసా నృత్యాలు హోరెత్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా గిరిజనులు థింసా నృత్యాలతో సందడి చేశారు. ఒడియా బ్యాండ్ అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం ఈ కత్తులను గ్రామచావిడిలో పెద్దలంతా ప్రదర్శన నిర్వహించిన డోకుల కుటుంబంలోని దేముడు మూలకు చేర్చారు. అనంతరం భారీజం పండగను భక్తిశ్రద్ధలతో ఈ ఏడాదికి ఘనంగా ముగించారు.
ఆరోగ్యం బాగుండాలి.. పంటలు బాగా పండాలి.. అంతటా ఆనందం తాండవించాలి.. అంటూ పాడేరు మండలం డోకులూరు గ్రామంలో జరిగిన భారీజం సంబరాలు అంబరాన్నంటాయి. భారీజం అంటే భారీ విజయం అని అర్థం. పిల్లా పాపలు, పశువులకు ఎలాంటి అనారోగ్యం సోకకూడదని, కరువు కాటకాలు దరి చేరరాదని, దుఃఖంపై విజయం సాధించి అందరూ సుఖంగా ఉండాలని ఈ వేడుక నిర్వహిస్తారు.
ప్రతిబింబించిన గిరిజన సంప్రదాయాలు థింసా నృత్యాలతో హోరెత్తిన డోకులూరు ఆకట్టుకున్న కత్తుల విన్యాసాలు
అంగరంగ వైభవం.. భారీజం సంబరం
Comments
Please login to add a commentAdd a comment