చిన్నారుల మృతిపై సమగ్ర నివేదిక
చింతపల్లి: మండలంలోని వాంగెడ్డ కొత్తూరులో శిశువుల వరుస మరణాలపై సమగ్ర విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిస్తామని కేజీహెచ్‌కు చెందిన వైద్యనిపుణుల బృందం సభ్యులు తెలిపారు. వాంగెడ్డ కొత్తూరు గ్రామంలో గడచిన 20 రోజుల్లో వరుసగా ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ మరణాలు సంభవించాయని దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేయడం తెలిసిందే. ఇదే విషయంపై చింతపల్లిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాంగెడ్డ కొత్తూరు గ్రామానికి వెళ్లి అక్కడ బాధిత గిరిజనులతో ఆయన మాట్లాడారు. దీనిపై కలెక్టర్, ఐటీడీఏ పీవోల దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లడంతో ప్రభుత్వం దీనిపై సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు కేజీహెచ్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ తాతం నాయుడు, డాక్టర్ వందన, డాక్టర్ రాహుల్‌నాయర్‌తో కూడిన బృందం గురువారం మండలంలో పర్యటించింది. ముందుగా స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించింది. నవజాత శిశుసంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసింది. శిశువులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించింది. అనంతరం వాంగెడ్డ గ్రామానికి వెళ్లి అక్కడ చిన్నారులను కోల్పోయిన బాధిత కుటుంబాలతో బృందం సభ్యులు మాట్లాడారు. శిశువుల తల్లిదండ్రులతో విడివిడిగా మాట్లాడి మరణానికి ముందు తరువాత దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. శిశువుల మరణానికి ప్రధానంగా న్యుమోనియా కారణంగా తాము గుర్తించినట్టు బృందం సభ్యులు తెలిపారు. దీనిపై సమగ్రంగా ప్రభుత్వానికి నివేదిస్తామని బృందం సభ్యులు తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణారావు, చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, ఏవో చంద్రశేఖర్, జర్రెల పీహెచ్‌సీ వైద్యాధికారి మణిదీప్, ఎంపీహెచ్‌ఈవోలు రామకృష్ణ, బాలయ్య పాల్గొన్నారు.
కేజీహెచ్‌కు చెందిన వైద్యనిపుణుల
బృందం వెల్లడి
బాధిత కుటుంబాల నుంచి వివరాల సేకరణ
Comments
Please login to add a commentAdd a comment