అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

అదుర్స్‌

Published Sat, Feb 1 2025 2:24 AM | Last Updated on Sat, Feb 1 2025 2:24 AM

అదుర్

అదుర్స్‌

ఆరంభం
అరకు ఉత్సవం.. అభివృద్ధికి దోహదం

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా ఊటీ అరకులోయలో చలి ఉత్సవ్‌ ఆరంభం అదిరింది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ‘అరకు చలి ఉత్సవ్‌’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 7.30 గంటలకు 5కె రన్‌ మారథాన్‌ పోటీలతో కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌ కుమార్‌ ఉత్సవ్‌ను ప్రారంభించారు. అరకులోయ రవ్వలగూడ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన 5కె రన్‌ మారథాన్‌లో పర్యాటకులు, స్థానిక గిరిజన యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. ఈ ఉత్సవ్‌లో పారా గ్లైడింగ్‌, ఎయిర్‌ బెలూన్‌, హెలికాప్టర్‌ రైడింగ్‌, పద్మాపురం గార్డెన్‌లో ప్లవర్‌ షో, అరకులోయలో రవ్వలగూడ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఆదివాసీల వంటకాల ఫుడ్‌ ఫెస్ట్‌, వివిధ రాష్ట్రాల గిరిజన కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న పర్యాటకులు హెలికాప్టర్‌లో గగనతలం నుంచి మన్యంలో అందాలను వీక్షించారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రదర్శించిన సంప్రదాయ గిరిజన నృత్యాలైన థింసా, నగరభేరి, కూచిపూడి, జముకు పాట, బస్తర్‌ బ్యాండ్‌, తోడా డ్యాన్స్‌, గోండ్‌ ట్రైబల్‌ డ్యాన్స్‌, డప్పు వాయిద్యాల డ్యాన్స్‌, ఆదివాసీ యువత చేసిన తీన్‌మార్‌, కొమ్ముకాయి, సవర, జాతపు, మణిపూర్‌ డ్యాన్స్‌, తప్పెటగుళ్ల నృత్యాలు అలరించాయి. అరకు వింటర్‌ ఫెస్టివల్‌ తొలి రోజు 5 వేల మంది వరకూ సందర్శకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. రెండో రోజు, మూడో రోజు వీకెండ్స్‌ కావడంతో కనీసం 10 వేల నుంచి 20 వేల మంది వరకూ పర్యాటకులు రావచ్చని భావిస్తున్నారు. ఈ ఉత్సవ్‌ 2వ తేదీ వరకూ కొనసాగుతుంది.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ల స్టెప్‌లు..

అరకు చలి ఉత్సవంలో భాగంగా సాయంత్రం ట్రైబల్‌ మ్యూజియంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లు డ్యాన్స్‌లు వేశారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, జేసీ అభిషేక్‌ గౌడ, పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌, అడిషనల్‌ ఎస్పీ ధీరజ్‌, మహిళా అధికారులు ఎర్రటి వస్త్రాలను తలపాగాలు కట్టుకుని స్టెప్‌లు వేశారు. డ్యాన్స్‌లో పలువురు అధికారులు, స్థానిక గిరిజన యువత, సందర్శకులు జతకలిశారు.

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌.. పారా గ్లైడింగ్‌

ఈ ఉత్సవ్‌ సందర్భంగా పద్మాపురం గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, మాడగడ వ్యూ పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన పారా గ్లైడింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిచాయి. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌కు ఒకరికి రూ.1800 చొప్పున టికెట్‌ ధర నిర్ణయించారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఎక్కేందుకు ఉత్సవ్‌లో తొలిరోజు పర్యాటకులు క్యూ కట్టారు. మాడగడ వ్యూ పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన పారా గ్లైడింగ్‌ను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ప్రారంభించారు. పూణేలో ప్రైవేట్‌ సంస్థకు చెందిన ఈ పారా గ్లైడింగ్‌ బృందం ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. పర్యాటకులెవరికీ పారా గ్లైడింగ్‌చేసేందుకు అవకాశం ఇవ్వలేదు.

తొలిసారిగా హెలికాప్టర్‌ రైడ్‌..

ఉత్సవ్‌లో భాగంగా తొలిసారిగా ప్రైవేటు భాగస్వామ్యంతో అందుబాటులోకి తెచ్చిన హెలికాప్టర్‌ రైడ్‌ పర్యాటకులకు తెగ నచ్చేసింది. ఆన్‌లైన్‌లో, నేరుగా బుక్‌ చేసుకున్న 150 మంది వరకూ సందర్శకులు తొలిరోజు హెలికాప్టర్‌ ఎక్కారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో 10.30 గంటలకు వరకూ హెలికాప్టర్‌ రైడింగ్‌ చేయలేదు. వాతావరణం అనుకూలించిన తరువాత నుంచి సాయంత్రం 4.30 వరకూ హెలికాప్టర్‌ రైడింగ్‌ నిర్వహించారు. ధర ఎక్కువైనా ఎక్కడా పర్యాటకులు తగ్గేదే లేదంటూ రైడింగ్‌కు ఆసక్తి చూపారు.

అలరించిన ఫ్లవర్‌ షో

అరకు వింటర్‌ ఉత్సవాల సందర్భంగా పద్మాపురం గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఫ్లవర్‌ షో ఆకర్షించింది. ఐటీడీఏ, హార్టికల్చర్‌ సంయుక్తంగా ఈ షోను ఏర్పాటుచేశాయి. కడియం, విశాఖపట్నం నుంచి 10 వేలకు పైగా పెద్ద చామంతులు, 5 వేలకు పైగా గులాబీలు, ఏజెన్సీ వాతావరణానికి అనుకూలంగా ఉన్న ఆర్కిడ్స్‌, బంతి, జరబరాలు పువ్వులు ప్రత్యేకంగా తీసుకువచ్చారు. మొత్తం 15 రకాల పువ్వులను ఏర్పాటు చేశారు. కూరగాయలు, జామ, ఇతర పండ్లతో తయారు చేసిన తాబేలు, షిప్‌, ట్రైన్‌, చక్రం, గుమ్మడి కాయలతో తయారు చేసిన పడవ తదితర ఆకారాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సుమారు రూ.15 లక్షలు వెచ్చించి విద్యుత్‌ కాంతులతో ఆకట్టుకునేలా ప్రదర్శనను తీర్చిదిద్దారు.

ఆకట్టుకున్న 25 రకాల స్టాళ్లు..

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 25 రకాల స్టాళ్లు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఆదివాసీలు పండించే వివిధ రకాల ఉత్పత్తులు, గిరిజన సంప్రదాయ వస్తువులు, జీసీసీ ఉత్పత్తులు, చిరు ధాన్యాలు, నాగాలాండ్‌కు చెందిన ఉన్ని వస్త్రాలు, ఊటీ నుంచి తెచ్చిన నీలగిరి టీ, పెర్ఫ్యూమ్స్‌, ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి బొండవాలి, మణిపూర్‌ నుంచి హ్యాండీ క్రాఫ్ట్‌, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి సవరా ఆర్ట్స్‌, విజయవాడ నుంచి ఆర్గానిక్‌ సీడ్స్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి బస్తర్‌ ఫేమస్‌ ఆభరణాలు, వెదురు ఫ్లవర్‌ బొకేలు, గిరిజన సంప్రదాయ దండలు, బ్యాగులతో 25 రకాల స్టాళ్లను ప్రత్యేకంగా నిలిచా యి. ట్రైబల్‌ మ్యూజియంలో వలే పూరిగుడిసెలో సంప్రదాయ వేషధారణలో నివసించే గిరిజనుల సంస్కృతిని తెలియజేసేలా స్టాల్‌ ఏర్పాటు చేశారు.

ఆహా.. ఏమి రుచి

అరకు చలి ఉత్సవాల్లో గిరిజన వంటకాలు ఆహా అనిపించాయి. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో చిరు ధాన్యాలతో తయారు చేసిన వంటకాలు సందర్శకులకు తెగ నచ్చేశాయి. వీటిలో రాగి పిండితో తయారు చేసిన అంబలి(రాగి జావ), తోప(రాగి సంగటి), సామ, కొర్రల బియ్యంతో అన్నం, రాజ్‌మా, కందులు, బొబ్బర్లు (అలసందలు) తదితర గిరిజన వ్యవసాయ ఉత్పత్తులతో తయారుచేసిన వంటకాలు సందర్శకులను కట్టిపడేశాయి. రాగి బెల్లం పిట్టు, కందుల పిట్టు, అలసందల కిచిడీ, రాగి తోప, రాగి అంబలి, రాగి బెల్లం ఉండలు, సామ బియ్యం అన్నం, రాజ్‌మా కూర, వెదుర కొమ్ముల కూర, శంకర లడ్డు, రాగి కుడుము, రాగి సక్కు, కర్ర పెండలం దుంపలు, రాజ్‌మా పిక్కలతో చేసిన రాబా, సారాకుల కూరతో రాబా, కొర్రల బియ్యం పాయసం, చిలగడ దుంపలు, గుమ్మడి ఆకుల కూర, పిండి దుంపల కూర, అడ్డ పిక్కలు, హల్వా ఆహా అనిపించాయి.

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఫిబ్రవరి 2 వరకు

కొనసాగనున్న

కార్యక్రమాలు

అరకులోయ టౌన్‌/డుంబ్రిగుడ: అరకులోయ చలి ఉత్సవాలు గిరిజన ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్‌ ఎ.ఎస్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు అరకు రైల్వే స్టేసన్‌ వద్ద 5కె మారథాన్‌ రన్‌ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. విజేతలకు బహుమతులతో పాటు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సేటు నో డ్రగ్స్‌ పోస్టర్‌ను జేసీ అభిషేక్‌ గౌడ్‌, పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, సబ్‌కలెక్టర్‌ సౌర్యమాన్‌ పటేల్‌, ఏఎస్‌పీ ధీరజ్‌లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ వద్ద కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పారా గ్లైడింగ్‌ను ప్రారంభించారు. సాయంత్రం ఢంకా మోగించి, ఉట్టిలో ధాన్యం, నీరు పోసి, ఒడ్లు దంచి స్టాళ్లను ప్రారంభించారు.

పూణేలోని ఆరెంజ్‌లైఫ్‌ పారా గ్‌లైడింగ్‌ పాఠశాల నుంచి వచ్చిన పైలట్‌ అలీషా ద్వారా మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ వద్ద పారా గ్లైడింగ్‌ను ప్రారంభించారు. అనంతరం డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో స్టాళ్లను ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 5కె రన్‌లో 300 మంది పాల్గొన్నట్టు చెప్పారు. ఈఉత్సవాలకు హాజరైన ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

5కె రన్‌లో విజేతలు వీరే..

5కె రన్‌లో పురుషుల విభాగంలో వి.రమేష్‌ ప్రథమ స్థానం, డి.అభిషేక్‌ ద్వితీయ స్థానం, శామ్యూల్‌ తృతీయస్థానంలో నిలిచారు. విద్యార్థినుల విభాగంలో జీవన తన్య ప్రథమస్థానం, ఎస్‌.మంజుల ద్వితీయస్థానంలో నిలిచారు. వీరికి కలెక్టర్‌ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

500 మందితో బందోబస్తు

అరకులోయ పరిసర ప్రాంతాల్లో సుమారు ఐదు కిలో మీటర్ల పరిధిలో ఐదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మారథాన్‌ 5కె రన్‌ ప్రారంభమైన అరకు రైల్వే స్టేషన్‌ నుంచి ఉత్సవ్‌ వేదిక వరకు ఏఎస్పీ ధీరజ్‌ ఆదేశాల మేరకు అరకులోయ సీఐ ఎల్‌.హిమగిరి పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అదుర్స్‌1
1/4

అదుర్స్‌

అదుర్స్‌2
2/4

అదుర్స్‌

అదుర్స్‌3
3/4

అదుర్స్‌

అదుర్స్‌4
4/4

అదుర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement