సబ్బవరంలో భారీగా గంజాయి పట్టివేత
224 కిలోల గంజాయి స్వాధీనం
సబ్బవరం: అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై మర్రిపాలెం టోల్‌గేట్ వద్ద రూ.11.20 లక్షల విలువ చేసే 224 కిలోల గంజాయిని శనివారం సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. సీఐ పిన్నింటి రమణ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సింహచలం, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వ్యాన్‌లో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో పరవాడ డీఎస్పీ వల్లెం విష్ణు స్వరూప్, సీఐ పిన్నింటి రమణతో కలిసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మర్రిపాలెం టోల్‌గేట్ వద్ద ఎస్‌ఐ సింహచలం, సిబ్బందితో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆనందపురం నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న వ్యానును ఆపి తనిఖీ చేయగా, ఐరన్ లోడ్ కింద 108 గంజాయి ప్యాకెట్లు ఉంచి, టార్పాలిన్ కప్పి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 224 కిలోల గంజాయిని వాహనంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఆనందపురంలో లోడ్ చేసి.. మహారాష్ట్రలోని కోల్హాపూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి వద్ద నుంచి రూ. 39.62 లక్షల విలువ చేసే గంజాయి, వ్యాన్, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి.మాడుగులకు చెందిన డి.రమణమూర్తి, దుర్గా బాలరాజు, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన అనిల్ సురేష్, కౌలాలంపూర్‌కు చెందిన రాహుల్ రాకేష్, సుమిత్, అమిత్ బాటింగ్‌లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసులో 6వ నిందితుడు, వ్యాన్ యజమాని సరజీరావ్ గైక్వాడ్‌ను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. గంజాయిని పట్టుకున్న సీఐ పిన్నింటి రమణ, ఎస్‌ఐ సింహచలం, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment