ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అఽఽధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో బుధవారం జూమ్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అభ్యర్థుల నామినేషన్‌ల స్వీకరణ కార్యక్రమం జరుగుతోందన్నారు.ఈనెల 11న నామినేషన్ల పరిశీలన,13న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఈనెల 27వ తేదీ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, అనంతరం బ్యాలెట్ బాక్సులను విశాఖపట్నం,ఏలూరులకు తరలించి భద్రపరుస్తామని తెలిపారు.మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలుజేయాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. పోస్టర్లు,బ్యానర్లు,ఫ్లెక్సీలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు 14మంది నోడల్ అధికారులను నియమించినట్టు చెప్పారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఎన్నికల అధికారులు,సిబ్బంది రవాణాకు అవసరమైన రూట్‌మ్యాప్‌తో పాటు వాహనాలను సమకూర్చాలని సర్వే ఏడీతో పాటు రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. పాడేరు డివిజన్‌లో ఐదు జోన్లు,రంపచోడవరం డివిజన్‌లో ఏడు జోన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.ఎన్నికల అధికారులు,సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై తగిన శిక్షణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాఽఽధికారిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్,ర్యాంపులు తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ అమిత్‌బర్దర్,ఏఎస్పీ ధీరజ్,రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, డీఆర్‌వో కె.పద్మలత,ఎస్‌డీసీలు అంబేడ్కర్,లోకేష్,డీఈవో బ్రహ్మాజీరావు,జిల్లా వ్యవసాయాధికారి నందు,సీపీవో ఎస్.ఎస్.ఆర్.కె.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రంపచోడవరం: తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీ తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన సమస్యలు, సందేహాలు ఉంటే 08864–243561 అనే నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని చెప్పారు.
కోడ్ పక్కాగా అమలు చేయాలి
కలెక్టర్ దినేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment