ఏ బిడ్డా.. ఇది మా అడ్డా.. ఉంటే ఇక్కడ మా షాపులే ఉండాలి. బ్రాందీ అమ్మినా, బీరు అమ్మినా మేమే అమ్మాలి. తాగేవాళ్లు కూడా మా దగ్గరే తాగాలి. వేరొకరు అమ్మడానికి వీల్లేదు.. మాకు మేమే పోటీ, మాకెరూ లేరు సాటి.... అంటూ మద్యం షాపులు దక్కించుకున్న కొంతమంది వ్యాపారులకు పచ్చ సిండికేట్ చేస్తున్న హెచ్చరికలు ఇవి. ప్రత్యర్థ్ది షాపులు తాము ఏర్పాటు చేసే షాపులకు దరిదాపుల్లో ఉండకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి..
నక్కపల్లి : లాటరీలో వేరొకరికి మద్యం దుకాణాలు దక్కడాన్ని మద్యం సిండికేట్ జీర్ణించుకోలేకపోతోంది. అధికార బలంతో నయానో భయానో ఇతరులకు దక్కిన దుకాణాలను తామే నిర్వహించుకునేలా వేస్తున్న ఎత్తుగడలు ఫలించడం లేదు. దీంతో ప్రధాన కూడళ్లలో తమ దుకాణాల దరిదాపుల్లో ఇంకే దుకాణం ఉండకూడదని హుకుం జారీ చేస్తున్నారు. మంత్రి అండదండలు తమకే ఉన్నాయని చెబుతూ షాపులు దక్కించుకున్న వారిపై రాజకీయంగా ఒత్తిడి తెస్తున్నారు. ఎస్.రాయవరం మండలంలో టీడీపీలో కీలకంగా ఉన్న ముఖ్యనేత నేతృత్వంలో ఏర్పాటైన సిండికేట్ ఓ ప్రజాప్రతినిధి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తిని సిండికేట్‌లో భాగస్వామిగా చేర్చుకుని అతని ద్వారా దుకాణాలు దక్కించుకున్న వారిపై ఒత్తిళ్లు తెస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అతనికి ఎకై ్జజ్ అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎస్.రాయవరం మండలానికి 7 మద్యం దుకాణాలు మంజూరయ్యాయి. వీటిలో రెండు దుకాణాలు అడ్డురోడ్డు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసేందుకు రెండు వర్గాలు సిద్ధ పడుతున్నారు. ముహూర్తం చూసుకుని షాపులు కూడా ఏర్పాటు చేశారు. అమ్మకాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. అయితే విక్రయాలు భారీగా ఉండే అడ్డురోడ్డు జంక్షన్‌లో తమకు దక్కిన షాపు మాత్రమే ఉండాలని, వేరొకరి షాపు ఉండకూడదంటూ సిండికేట్ పావులు కదుపుతున్నారు. అడ్డురోడ్డు జంక్షన్ పరిసర ప్రాంతాల్లో గతంలో రెండు మద్యం దుకాణాలు ఉండేవి. వీటిని ప్రభుత్వమే నిర్వహించడంతో ఏ సమస్య ఉత్పన్నం కాలేదు. కూటమి ప్రభుత్వం ఈ దుకాణాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో డిమాండ్ పెరిగింది.
నిబంధనల సాకుతో...
ఎస్.రాయవరం మండలంలో ప్రధాన జంక్షన్ ఇదే. ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల వారికి ప్రధాన వాణిజ్య కేంద్రం కూడా ఇదే. నిత్యం ఈ రెండు మండలాల్లో దాదాపు 20 గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా అడ్డురోడ్డు జంక్షన్‌కు వివిధ పనులు, మార్కెట్ అవసరాల కోసం వస్తుంటారు. ప్రధాన పర్యాటక కేంద్రమైన రేవు పోలవరం కూడా ఈ జంక్షన్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మద్యం విక్రయాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. రోజుకు సుమారు రూ.3 నుంచి 4 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. ఇటువంటి జంక్షన్‌పై పచ్చ సిండికేట్ కన్ను పడింది. ఇక్కడ తమ వర్గానికి చెందిన దుకాణం మాత్రమే ఉండాలని వేరొకరి దుకాణం ఉండడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేస్తున్నారు.
పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన రెండు దుకాణాల్లో ఒకదానిని వేరొక చోటకు తరలించాలంటూ ప్రత్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నేషనల్ హైవేకి 200 మీటర్ల లోపు మద్యం దుకాణం ఉండడానికి వీల్లేదు. రెండు షాపులు 200 మీటర్ల తర్వాతే ఉన్నాయి. కానీ పలుకుబడి కలిగిన సిండికేట్ వారు ప్రత్యర్థి షాపును నిబంధనల సాకుతో వేరొక చోటికి తరలించాలని, అడ్డురోడ్డు దరిదాపుల్లో ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ రెండు రోజుల నుంచి ఒత్తిడి తెస్తున్నట్లు బోగట్టా. షాపును తరలించే బాధ్యత ఒక ఎకై ్జజ్ ఉన్నతాధికారి భుజాన వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
లైసెన్స్ కలిగిన దుకాణదారులను సమానంగా చూడాల్సిన ఎక్సైజ్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల వ్యవహారంలో ప్రజాప్రతినిధి జోక్యం లేనప్పటికీ పీఏ మాత్రం అన్ని తానై కథ నడిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధికంటే పీఏ గొప్పొడు, పలుకుబడి కలిగినోడుగా చెలామణి అవుతున్నాడని అధికారపార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment