వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు
● రంగురాళ్ల క్వారీల వద్ద పహారా ● జిల్లాలో 15 ప్రాంతాల్లో నర్సరీలు ● డీఎఫ్‌వో ఎం.శామ్యూల్ వెల్లడి
నర్సీపట్నం : వాల్టా చట్టాన్ని అతిక్రమించి చెట్లు నరికితే అటవీ చట్టాలను అనుసరించి చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ అధికాఽరి ఎం.శామ్యూల్ పేర్కొన్నారు. ప్రధానంగా నేరేడు, మామిడి ఇతర జాతుల చెట్లను నరకడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. మొక్క చెట్టుగా ఎదగాలంటే ముప్ఫై ఏళ్లు పడుతుందని, చెట్లు పెంచడం భావితరాల అవసరాలకు చాలా అవసరమని అన్నారు. ఇటీవల నర్సీపట్నం ప్రాంతంలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి మామిడి, నేరేడు ఇతర జాతుల చెట్లను నరికి రవాణా చేస్తున్న వారిపై కేసులు పెట్టామన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు పెంచి, అడవులను సంరక్షించాలన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి తగిన కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు.
అంకుడు చెట్ల పెంపకంపై దృష్టి
లక్క బొమ్మల తయారీకి ప్రధాన ముడిసరుకుగా వినియోగించే అంకుడు చెట్ల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్‌వో తెలిపారు. దీనికి సంబంధించి విత్తనాలను సేకరించి అటవీశాఖ నర్సరీల్లో మొక్కలు ఉత్పత్తి చేస్తామన్నారు. ఏటికొప్పాక, కై లాస ప్రాంతాల్లో వందల కుటుంబాలు లక్కబొమ్మల తయారీపై అధారపడి జీవిస్తున్నారు. వీరికి జీవోనాపాధికి అంకుడు కర్ర చాలా అవసరమన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో ఐదు రేంజ్‌ల పరిధిలో 15 ప్రాంతాల్లో నర్సరీలు పెంచుతామని తెలిపారు. సరుగుడు, టేక్, అంకుడు, ఫలాసాయాన్ని ఇచ్చే మొక్కలను ఈ నర్సరీల్లో పెంచుతామని, నాణ్యమైన మేలుజాతి మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
నర్సీపట్నం రేంజ్ పరిధిలోని ధన్వంతరీ వనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామన్నారు. అటవీ శాఖ సరఫరా చేస్తున్న మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రంగురాళ్ల క్వారీల్లో తవ్వకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. కరక, సాలికమల్లవరం, ఆరిలోవ అటవీ ప్రాంతాల్లోని క్వారీల వద్ద బేస్ క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment