పోస్టల్ ఉద్యోగి మృతదేహం లభ్యం
● రైవాడ జలాశయంలో గుర్తింపు ● మృతుడు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వాసి ● చింతలపూడిలో సబ్ పోస్టుమాస్టర్‌గా విధులు
దేవరాపల్లి: దేవరాపల్లిలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన చింతలపూడి పోస్టల్ ఉద్యోగి దాసరి సత్య ప్రవీణ్ (23) రైవాడ జలాశయంలో గురువారం ఉదయం శవమై కనిపించాడు. జలాశయం గట్టుపై గురువారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు నీటిలో తేలిన మృతదేహాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సత్య ప్రవీణ్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు అప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఉండటంతో అనుమానంతో వెంటనే అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. సత్య ప్రవీణ్ మృతదేహమేనని అతడి కుటుంబ సభ్యులు స్టేషన్ రైటర్ ఎస్. పైడిరాజు ఎదుట నిర్థారించడంతో గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పుట్టెడు దుఖంలో కుటుంబ సభ్యులు..
చేతికి అందివచ్చిన కొడుకు అర్థంతరంగా తనువు చాలించడంతో బాధిత కుటుంబ సభ్యులు పుట్టెడు దుఖంలో మునిగిపోయారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన లోవరాజు, సుధారాణిల రెండవ కుమారుడు దాసరి సత్య ప్రవీణ్. మూడేళ్ల క్రితం దేవరాపల్లి మండలం చింతలపూడి సబ్ పోస్టుమాస్టర్‌గా ఉద్యోగం రావడంతో దేవరాపల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎప్పటి మాదిరిగా మంగళవారం కూడా ఉద్యోగానికి వెళ్లిన సత్య ప్రవీణ్ ఇంటికి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం వాతావరణం చల్లబడటంతో రైవాడ జలాశయ సందర్శనకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి జలాశయంలో పడి మృతి చెందాడని తండ్రి లోవరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment