తవ్వుకో.. అమ్ముకో.. మనల్ని ఆపేదెవరు ?
● తాండవలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ● కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్న ఇసుక అక్రమ రవాణా ● పట్టించుకోని అధికారులు ● లోతుగా తవ్వేయడంతో వంతెనలకు పొంచి ఉన్న ప్రమాదం ● చమ్మచింత వద్ద ఆక్విడెక్టు కూలితే నీటి సరఫరాకు ఇబ్బందులు ● రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగు నీరు ప్రశ్నార్థకమే
ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. తాండవ నదిలో విచ్చలవిడిగా తవ్వేస్తూ ఇసుక దందా సాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రతిరోజూ ట్రాక్టర్లల్లో ఇసుక తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పట్టపగలే ట్రాక్టర్లలో తరిలించేస్తున్నా అధికారుల చూసీచూడనట్టు ఉన్నారు. ఇసుకను తోడేస్తుండడంతో వంతెనలకు ప్రమాదం పొంచి ఉంది. అక్విడెట్ కూలితే వేలాది ఎకరాలకు సాగునీరు సరఫరా ప్రశ్నార్థకంగా మారుతుంది.
నాతవరం: మండలంలో చమ్మచింత, పొట్టినాగన్నదొరపాలెం, తాండవ, కె.వి.శరభవరం, గుమ్మడిగొండ, కొవడటిపూడి అగ్రహారం, చిక్కుడుపాలెం, రాజుపేట అగ్రహారం మీదగా తాండవ నది కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోకి ప్రవహిస్తుంది. నాతవరం మండలంలో చిక్కుడుపాలెం, గుమ్మడిగొండ, చమ్మచింత గ్రామాల వద్ద రాకపోకలు సాగించేందుకు తాండవ నదీపై సుమారుగా రూ.12 కోట్ల వ్యయంతో మూడు వంతెనలు నిర్మించారు. చమ్మచింత వద్ద తాండవ రిజర్వాయర్ నుంచి కుడికాలువు ద్వారా నాతవరం మండలంతో పాటు కాకినాడ జిల్లా కోటనందురు, రౌతులపూడి మండలాల్లో ఉన్న ఆయకట్టు భూములకు నీరు ప్రవహించేందుకు నదీలో వంతెన నిర్మించి, అక్విడెట్ ఏర్పాటు చేశారు. చమ్మచింత వద్ద నదిలో నిర్మించిన వంతెన సిమెంటు స్తంభాలు చుట్టూ లోతుగా ఇసుక తవ్వేయడంతో రాళ్లు తేలి ఐరన్ ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. రెండు సిమెంటు స్తంభాల ఊచలు పాడైపోవడం కూలేందుకు సిద్ధం ఉన్నాయి. ఇక్కడ నదిలో నిర్మించిన అక్విడెట్ కూలిపోతే రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగు నీరు అందించే కూడి కాలువకు నీటి ప్రవాహం నిలిచిపోతుంది.
చమ్మచింత ప్రాంతంలో నదిలో లోతుగా ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో నది ఒడ్డున ఉన్న రైతులు భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో రైతులు తవ్వకం దారులను అడ్డుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా కూటమి ప్రభుత్వ పెద్దలకు భయపడి అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చమ్మచింత గ్రామానికి చెందిన కొందరు రైతులు ధైర్యం చేసి నదిలో ఇసుక తవ్వకాలు అడ్డుకుని, కూలేందుకు సిద్ధంగా ఉన్న వంతెన సిమెంటు స్తంభాల చుట్టూ రాళ్లు, మట్టి వేసి, దిమ్మగా కట్టారు. ఇసుక తవ్వకాలతో నదిలో ప్రమాదకరంగా ఏర్పడిన గోతులను పూడ్చారు.
50 ట్రాక్టర్లలో తరలింపు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాండవ నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు.అయినా యథ్చేచ్ఛగా తవ్వుతూ రోజూ 50 పైగా ట్రాక్టర్లతో రాత్రీపగలనే తేడా లేకుండా ఇసుక తరలించేస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు రోజుకు 5నుంచి 6 ట్రిప్పులు తిరుగుతోంది. నాతవరం మండలంతో పాటు నర్సీపట్నం మున్సిపాలిటీకి, ఇతర ప్రాంతాలకు పట్టపగలే దర్జాగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. వాస్తవంగా ఉచిత ఇసుక తరలిచేటప్పుడు విధిగా ట్రాక్టరుకు బ్యానర్ ఉండాలి, ఇసుక రవాణా చేసే ఏ వాహనానికి ఉచిత ఇసుక బ్యానర్ కనిపించడం లేదు.కూటమి నేతలకు భయపడి అన్ని శాఖలు అధికారులు పట్టనట్టగా వ్యవహరిస్తున్నారు.
వంతెనలు కాపాడండి
తాండవ నదీలో ఇసుక తవ్వకాలు కొనసాగితే వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంది. వంతెనల నిర్మాణం కోసం వామపక్షాల ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి ఆందోళనలు చేశాం. ఆక్విడెక్టు సిమెంటు స్తంభాలు కూలిపోతే రెండుజిల్లాలకు ప్రవహించే తాండవ కుడి కాలువు నీరు నిలిచిపోతుంది, రైతులకు ఊహించని నష్టం జరిగే ప్రమాదం ఉంది.
అడిగర్ల రాజు,
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment