సాక్షి, అనకాపల్లి: జిల్లాలో ఆరు ఇసుక స్టాక్ యార్డులను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా ఇసుక కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ విజయ కృష్ణన్ చెప్పారు. జిల్లాలో ఇసుక రీచ్‌లు లేకపోవడం.. రెండే డిపోలు ఉండడంతో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ చర్య తీసుకున్నట్టు బుధవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రీచ్‌ల నుంచి ఇసుక తీసుకువచ్చి, నిల్వ చేసి విక్రయించేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. నాలుగు ఎకరాల స్థలంలో స్టాక్ యార్డులను ఏర్పాటు చేయాలని, వాహనాలు వెళ్లేందుకు మార్గం ఉండాలని సూచించారు. జిల్లా గనుల శాఖ వీరికి మినరల్ డీలర్ లైసెన్స్ మంజూరు చేస్తుందన్నారు. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, నక్కపల్లి, చోడవరం, మాడుగుల, అచ్యుతాపురంలలో ఇసుక స్టాక్ యార్డులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
అనకాపల్లిలోని గనుల శాఖ కార్యాలయంలో ఈనెల 22 నుంచి 29వ తేదీ లోగా దరఖాస్తు ఇవ్వాలన్నారు. దరఖాస్తుతోపాటు ఒక్కో ఇసుక స్టాక్ యార్డుకు డిస్ట్రిక్ట్ లెవల్ శాండ్ కమిటీ పేరిట రూ.5 వేల డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలని పేర్కొన్నారు. జిల్లా ఇసుక కమిటీ నిర్దేశించిన ధరకే ఇసుక విక్రయించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment