రూ.27 కోట్లతో 742 పనులు
కె.కోటపాడు/దేవరాపల్లి/చీడికాడ: ఉమ్మడి విశాఖ జిల్లాలో 2024–25 కాలానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.27 కోట్లతో 742 పనులను చేపడుతున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి చెప్పారు. కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించి, అధికారులతో మాట్లాడారు. కె.కోటపాడు మండల పరిషత్ కార్యాలయానికి మొదటిసారిగా వచ్చిన సీఈవోకు స్థానిక ఎంపీపీ రెడ్డి జగన్‌మోహన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సీఈవో నారాయణమూర్తి మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. జెడ్పీ నిధులతో చేపడుతున్న పనులను ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి పూర్తి చేయాలని సూచించారు. ఈ నిధులతో ప్రధానంగా శ్మశానవాటికలు, డ్రెయినేజీ, మంచినీటి పథకాల నిర్వహణతోపాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. కె.కోటపాడు మండలంలో పల్లె పండగ కార్యక్రమంలో 51 పనులకు రూ.6 కోట్ల 29 లక్షల నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పనుల్లో ఇప్పటికే 24 పనులు పూర్తి కాగా 27 పనులు ప్రస్తుతం సాగుతున్నాయన్నారు. గ్రామాల్లో ప్రతి శనివారం ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీడీవో ఎ.ఎ.సాంబశివరావు, సూపరింటెండెంట్ ఎస్.అప్పలరాజు, మండల ఇంజినీరింగ్ అధికారి సుమతి, ఈవోఆర్డీ రమణి, కొండలరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేవరాపల్లిలో సీఈవో మాట్లాడుతూ.. మాడుగుల నియోజకవర్గంలో 195 పనుల కోసం రూ 27.44 కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు. దేవరాపల్లి మండలంలో జల్‌జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఎంపీడీవో సువర్ణరాజు తదితర అధికారులు పాల్గొన్నారు. చీడికాడలో ఎంపీడీవో హేమసుందర్, తదితర అధికారులను పనుల పురోగతి గురించి ఆరా తీశారు.
డిసెంబర్ చివరినాటికి పూర్తి చేయాలి
జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment