బ్యాంకులు లక్ష్యాన్ని మించి రుణాలు అందించాలి
తుమ్మపాల: బ్యాంకులు వ్యవసాయ, విద్య, ఉపాధి రంగాలకు లక్ష్యాలకు మించి రుణాలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ త్రైమాసిక సమావేశంలో ఆమె మాట్లాడారు. కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందించాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా రుణాలు అందించాలని ఆదేశించారు.
కళాశాలల్లో క్యాంపులు నిర్వహించాలి
విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యారుణాలు అందించాలని, ఇందుకోసం కళాశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, అవగామన కల్పించాలని సూచించారు. రుణమేళాలు నిర్వహించి, రుణాలు మంజూరు చేయాలన్నారు. నిరర్థక ఖాతాల్లో నగదును, సంబంధీకులకు అందజేయాలన్నారు. సదరు ఖాతాదారులను గుర్తించేందుకు డీఆర్‌డీఏ, మెప్మా సిబ్బంది సహకారం తీసుకోవాలని తెలిపారు. తోటలు, కూరగాయలు, పశు సంవర్థక, డెయిరీ, మత్స్య పరిశ్రమలలో కాలానుగుణంగా ఉత్పత్తి సాధించే రంగాలకు ఆర్థిక చేయూతనివ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు, బ్యాంకు అధికారుల సమన్వయంతో వ్యవసాయ, అనుబంధ రంగ రైతులను ప్రోత్సహించాలని సూచించారు. బ్యాంకులు, నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా అందిస్తున్న నైపుణ్యశిక్షణను జిల్లాలోని ఫార్మా కంపెనీలలో గల ఉద్యోగాలకు అవసరమైన అంశాలలో అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. రైతులకు ఉదారంగా రుణాలు అందించాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ రుణ ప్రణాళిక అమలు నివేదికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆర్‌బీఐ ఏజీఎం ఆర్.కె.హనుమకుమారి వివిధ బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్న రుణాలను సమీక్షించారు. బ్యాంకర్లు లక్ష్యాలను సాధించాలని, ఏమైనా సమస్యలుంటే జిల్లా అధికారులతో కలసి పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ ప్రాంతీయ అధికారి పి.సన్యాసిరాజు, జిల్లా గ్రామీణాభివృది సంస్థ పీడీ కె.శచీదేవి, జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డా.బి.రామమోహనరావు, ఇతర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ విజయ కృష్ణన్
Comments
Please login to add a commentAdd a comment