నిండు గర్భిణికి డోలీ కష్టాలు
● గత ప్రభుత్వం ప్రారంభించిన రోడ్డు పనుల నిలిపివేత ● కూటమి సర్కారుపై సీపీఎం నేతల ధ్వజం
మాడుగుల: పురిటి నొప్పులకు డోలీ కష్టాలు తోడు కావడంతో నిండు గర్భిణి నరకయాతన అనుభవించింది. పగవారికి కూడా ఇంత బాధ రాకూడదని భగవంతుడిని వేడుకుంది. జాలంపల్లి పంచాయతీ శివారు సిరిపురం గ్రామానికి చెందిన చెదల వెంకటలక్ష్మికి బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు డోలీ కట్టి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాలంపల్లి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మాడుగుల సీహెచ్‌సీకి ఆటోలో తరలించారు. సుఖప్రసవం కావడంతో తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. కూటమి సర్కారు నిర్వాకంతో సిరిపురం గ్రామానికి రోడ్డు పనులు నిలిచిపోయాయని సీపీఎం మండల నాయకుడు ఇరటా నరసింహమూర్తి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ గ్రామానికి రోడ్డు వేసేందుకు రూ.5.30 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. అప్పట్లోనే ఈ రోడ్డుకు ఎర్త్ వర్క్ కూడా చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా ఈ రోడ్డు పనులు జరగలేదన్నారు. రాజకీయాలు విస్మరించి, రహదారులు లేని గిరి గ్రామాలకు వెంటనే రోడ్లు నిర్మించాలని, ముందు మధ్యలో నిలిచిపోయిన రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి డోలీ మోతలు తప్పించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment