దాబాలో గోమాంసం విక్రయాలు
నక్కపల్లి: ఒడ్డిమెట్ట సమీపంలో పెట్రోలు బంకు పక్కన ఉన్న దాబాలో గోమాంసం వండి విక్రయిస్తున్నట్లు బీజేపీ ధార్మిక విభాగం రాష్ట్ర ప్రతినిధి, సినీ నటి కరాటే కల్యాణి ఆరోపించారు. శుక్రవారం ఈ దాబాలో సుమారు 5 కిలోల గోమాంసం కూరగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. పరిశీలించగా గోమాంసాన్ని చపాతీలతోపాటు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. దాబా నిర్వాహకులను నిలదీయగా ఇక్కడ లభించిన మాంసం గోవులదేనని అంగీకరించడంతో ఆమె వెంటనే నక్కపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సన్నిబాబు తమ సిబ్బందితో వచ్చి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కరాటే కల్యాణి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తమ ధార్మిక పరిషత్‌కు చెందిన వారు ఉన్నారని, వారి బంధువులు దాబా వద్దకు టిఫిన్ కోసం రాగా ఇక్కడ నిర్వాహకులు గోమాంసాన్ని వండి పుల్కా, చపాతీలకు కూరగా విక్రయిస్తున్నట్లు గుర్తించారన్నారు. తమకు సమాచారం ఇవ్వడంతో తాము హైదరాబాద్ వెళ్తూ మార్గంమధ్యలో దాబా వద్దకు వచ్చి నిర్వాహకులను నిలదీసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన దాబాలోనే కాకుండా విశాఖ నుంచి అన్నవరం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పలు దాబాల్లో గోమాంసాన్ని వండి పుల్కాలు, చపాతీలతో అమ్ముతున్నట్లు దాబా నిర్వాహకులు చెబుతున్నారన్నారు. పోలీసులు జాతీయరహదారి వెంబడి ఉన్న దాబాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల సహాయంతో తనిఖీలు నిర్వహించాలని కోరారు. గో అక్రమ రవాణాను, పశుమాంసం విక్రయాలను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఈ వ్యహారంపై జిల్లా ఎస్‌పీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు కల్యాణి తెలిపారు.
ఈ ఘటనపై ఎస్‌ఐ సన్నిబాబు మాట్లాడుతూ పట్టుబడ్డ మాంసాన్ని సీజ్ చేసి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. శనివారం వారు వచ్చి పరీక్షలు నిర్వహించి గోమాంసమని నిర్ధారిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. దాబా నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. గోమాంసాన్ని పట్టుకున్న కల్యాణి వెంట స్థానిక ధార్మిక పరిషత్ సిబ్బంది రామాల శ్రీను, కానుకోల్లు భాస్కర్‌రావు, కొమ్మన సాంబమూర్తి, పక్కుర్తి లోవకుమార్ తదితరులు ఉన్నారు.
పట్టుకున్న సినీ నటి కరాటే కల్యాణి
పోలీసులకు అప్పగింత
Comments
Please login to add a commentAdd a comment