టెన్త్‌లో శత శాతం ఉత్తీర్ణత
● సాధనకు కార్యాచరణ సిద్ధం చేయాలి ● కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: టెన్త్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో విద్యాశాఖకు సంబంధించి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో విద్యా ప్రగతిపై శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరచడం, నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యాలను సాధించడంపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. బోధన విషయంలో నిరక్ష్యం వహించే ఉపాధ్యాయులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రోజు ఆయా మండల విద్యా శాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాలకు 5 నిమిషాలు ముందుగానే హాజరుకావాలన్నారు. విద్యార్థుల ఆధార్ అప్‌టుడేట్, పాఠశాలల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు, ఎఫ్ 1, ఎఫ్ 2, మధ్యాహ్నం భోజన పథకం తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. ప్రతి సోమవారం విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. లక్ష్య సాధనలో వెనుకబడినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు పారామీటర్ల వారీగా ప్రగతి నివేదికలు సమర్పించాలని తెలిపారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, పాఠశాలలకు రాని విద్యార్థులపై దృష్టి సారించి పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి విద్యార్థి ఆధార్ వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, మధ్యాహ్న భోజన పథకం అమలులో శుభ్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సీసీ కెమెరాలు, వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈవో జి.అప్పారావునాయుడు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment