రాజయ్యపేట సభ వెలవెల
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో రూ.1,877 కోట్ల వ్యయంతో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్‌పార్క్‌కు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖలో శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమాన్ని మండల ప్రజలు తిలకించేందుకు రాజయ్యపేట వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వర్చువల్‌విధానంలో మోదీ సందేశాన్ని వినిపించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జాయింట్‌కలెక్టర్ జాహ్నవి, నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మండల నలుమూలలనుంచి రెండు వేలమందిని బస్సుల్లో తరలించి విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం, టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాలుగు రోజుల ముందునుంచే భారీవేదిక, పెద్ద టీవీ స్క్రీన్‌లు,కుర్చీలు ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన మేర ప్రజలు రాలేదు. డ్వాక్రామహిళలను ఈ కార్యక్రమానికి రప్పించారు. మధ్యాహ్నం మూడు గంటలనుంచి సభావేదిక వద్ద నక్కపల్లి, బోదిగల్లం పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులతో కోలాటాలు, డ్యాన్సులు ప్రదర్శించారు. వచ్చిన కొద్దిపాటి జనం మంత్రి లోకేష్ ప్రసంగం ప్రారంభం కాగానే వెళ్లిపోయారు. మోదీ ప్రసంగం సమయానికి మూడు వంతులకుపై సభా ప్రాంగణం ఖాళీ అయింది. అధికారులు, సచివాలయ, అంగన్‌వాడీ సిబ్బంది మాత్రమే మిగిలారు. టీడీపీ నాయకులకు కూడా పెద్దగా హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నర్సింహమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి కొండబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెటి వెంకటేష్, సీనియర్ నాయకులు కొప్పిశెట్టి బుజ్జి, వెలగా శ్రీను, సుధాకర్,ఏపీఐఐసీ సిబ్బంది పాల్గొన్నారు.
మత్స్యకారులకు నిరాశే...
అచ్యుతాపురం: స్థానిక సెజ్‌లో ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌కు విశాఖ నుంచి ప్రధాన మోదీ బుధవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన దృశ్యాలను ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కోసం కేటాయించిన స్థలం వద్ద ఏర్పాటు చేసిన టీవీల ద్వారా పలువురు వీక్షించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సభలో ప్రధాని, సీఎం తదితరుల నుంచి హామీ లభిస్తుందనుకున్న మత్స్యకారులకు నిరాశ ఎదురైంది. ఉత్తరాంధ్ర జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ సుందరపు విజయ్‌కుమార్,కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పలువురు నాయకులు ,అధికారులు పాల్గొన్నారు.
మోదీ సభకు నలుగురితో వెళ్లిన బస్సు
అనకాపల్లి: విశాఖలో బుధవారం జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు కూటమి నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉచితంగా బస్సులు వేసి ప్రజలను తరలించారు. అయితే బుధవారం అనకాపల్లి నుంచి తరలివెళ్లిన ఓ బస్సులో నలుగురు మాత్రమే ఉండడం కనిపించింది. ప్రచార ఆర్భాటం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని సభకు వచ్చిన ముగ్గురికి అస్వస్థత
మహారాణిపేట: ప్రధానమంత్రి రోడ్డు షో, బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ముగ్గురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రావాడ రామారావుకు ఫిట్స్ రాగా, రత్నం కడుపునొప్పికి గురయ్యారు. లక్ష్మి కాలికి దెబ్బతగిలింది. వీరికి డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు, డాక్టర్ భరత్, 108 వాహనం జిల్లా కో–ఆర్డినేటర్ వి.త్రినాథరావు, సిటీ కో–ఆర్డినేటర్ ఎం.సురేష్ ప్రథమ చికిత్స అందించి.. కేజీహెచ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment