![3 నుంచి నామినేషన్ల స్వీకరణ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/30vsc91-320092_mr-1738269432-0.jpg.webp?itok=TAFEnTIt)
3 నుంచి నామినేషన్ల స్వీకరణ
● 27న పోలింగ్, మార్చి 3న లెక్కింపు ● ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు ● కలెక్టర్, ఆర్వో హరేందిరప్రసాద్ వెల్లడి
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం మొదలు పెట్టిందని విశాఖ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29వ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. 24 గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయా ల్లో, పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయపరమైన పోస్టర్లు, ఫొటోలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కలెక్టరేట్‌లో గురువారం డీసీపీ అజిత, జిల్లా రెవెన్యూ అధికారి, సహాయక రిటర్నింగ్ అధికారి బీహెచ్ భవానీ శంకర్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఆ రోజు నుంచి అన్ని ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కలెక్టర్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారని ఆర్వో హరేందిరప్రసాద్ తెలిపారు. 10వ తేదీ సాయంత్రం 3 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని, 11న పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందన్నారు. 27న పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని కలెక్టర్ వివరించారు. 2024 డిసెంబర్ 30న వెలువరించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా ప్రకారం ఆరు జిల్లాల పరిధిలో 21,555 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వీరిలో పురుష ఓటర్లు 12,948, మహిళా ఓటర్లు 8,607 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పరిధిలో 123 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment