కరక ఫారెస్ట్‌లో ఏం జరుగుతోంది?
నర్సీపట్నం: కరక రంగురాళ్లకు మంచి గిరాకీ ఉంది. రంగురాళ్ల వ్యాపారులు సమయం కోసం నిత్యం క్వారీపై కన్నేసి ఉంచుతారు. కోట్ల విలువ చేసే రంగురాళ్లను అటవీశాఖ అధికారులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కరక రంగురాళ్ల క్వారీని నిషేధిత ప్రాంతంగా ప్రకటించడంతో పాటు 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చారు. అటవీశాఖ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నర్సీపట్నం మైనింగ్ అధికారులు రంగురాళ్ల వ్యాపారులను వెంటబెట్టుకొని కరక రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న రంగురాళ్ల క్వారీ ప్రాంతానికి శుక్రవారం వెళ్లారు. దీంతో అనుమతి లేకుండా క్వారీ ప్రాంతానికి వెళ్లిన మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ సత్యమూర్తికి అటవీశాఖ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. గతంలో ఈ క్వారీలో అనధికారిక తవ్వకాలు జరిగిన విషయం తెలిసిందే. నర్సీపట్నం మైనింగ్ అధికారులు అటవీశాఖకు సమాచారం ఇవ్వకుండా కరక రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రవేశించడంతో గస్తీలో ఉన్న ఫారెస్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాయల్టీ ఇన్‌స్పెక్టర్ సత్యమూర్తి, రంగురాళ్ల వ్యాపారులు, మరికొంతమంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని నర్సీపట్నం రేంజ్ కార్యాలయానికి తరలించారు. మైనింగ్ ఏడీ శివాజీ ఆదేశాల మేరకు తాము సర్వేకు వెళ్లామని రాయల్టీ ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. తనతో వచ్చిన సర్వే బృందంలో రంగురాళ్ల వ్యాపారులు ఉన్న విషయం తనకు తెలియదని ఆర్‌ఐ చెబుతున్నారు. ఈ విషయంపై మైనింగ్ ఏడీ శివాజీ పొంతన లేని సమాధానం ఇచ్చారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వకపోవటం, మైనింగ్ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడం రంగురాళ్ల క్వారీల్లో అక్రమ తవ్వకాలకు ఊతమిస్తుంది.
అదుపులో టీడీపీ నేత : గతంలో రంగురాళ్ల కేసులు ఉన్న వ్యాపారి, టీడీపీ నాయకుడు కొండలరావు, కరక క్వారీకి సమీపంలో గల యల్లవరం గ్రామానికి చెందిన అల్లు నూకరాజులతోపాటు చోడవరం మైనింగ్ సిబ్బందిగా చెబుతున్న పి.శివకుమార్, కూర్మదాసు అప్పలనాయుడు, ఒ.వీర నాగేశ్వరరావు, రామచంద్రరావులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. విచారణ తరువాత మిగిలిన వ్యక్తులపై చర్యలకు అటవీ అధికారులు సిద్ధమవుతున్నారు.
చట్టరీత్యా చర్యలు : ముందస్తు అనుమతులు లేకుండా కరక రంగురాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రవేశిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో ఎం.శామ్యూల్ స్పష్టం చేశారు. సర్వే పేరుతో క్వారీ ప్రాంతానికి వెళ్లిన మైనింగ్ సిబ్బంది, కొంతమంది వ్యక్తులపై విచారణ జరుగుతోందని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో స్పష్టం చేశారు.
మైనింగ్ అధికారుల అత్యుత్సాహం
అప్రమత్తమైన అటవీ అధికారులు
సర్వేకు వెళ్లిన రాయల్టీ అధికారికి షోకాజ్ నోటీసు
‘మైనింగ్’ బృందంలో ఇద్దరు రంగురాళ్ల వ్యాపారులు
వారిలో ఒకరు టీడీపీ నేత
మైనింగ్ ఏడీ ఆదేశాలతోనే సర్వేకు వచ్చినట్టు చెబుతున్న రాయల్టీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment