విద్యార్థుల పక్షాన ఫీజు పోరు
అనకాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5న కలెక్టరేట్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు చెప్పారు. స్థానిక రింగ్‌రోడ్డులోని పార్టీ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.3,900 కోట్ల మేర పేరుకుపోయాయని, ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అటకెక్కించిందని, వైఎస్సార్‌సీపీ వాటి కోసం ప్రజల తరపున పోరాడుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ చార్జీలు తగ్గించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ముందుగా కలెక్టర్, ఎస్పీలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వినతిపత్రం అందజేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. కొంతమంది విద్యార్థులు మధ్యలో చదువులు మానేసి పనులకు వెళ్లే దుస్థితి ఏర్పడిందన్నారు.
కూటమి షాకులతో జనం బెంబేలు
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల షాక్ నెల రోజులు తరువాత గట్టిగా తగులుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చార్జీలు పెంచి, ఒక్క అమరావతిలో మాత్రం పెంచలేదనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒక్క అమరావతిలోనే పేదలున్నారా.. అని నిలదీశారు. కేంద్రం నుంచి అప్పులు తెచ్చి, కూటమి నేతలు వారి జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ సర్కారు వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని, కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి మనసు రావడం లేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థుల ఫీజు పోరు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జెడ్సీటీసీలు దంతులూరి శ్రీధర్‌రాజు, దొండా రాంబాబు, సత్యం, పార్టీ మండలాల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, 80, 84వ వార్డుల ఇన్‌చార్జ్‌లు కె.ఎం.నాయుడు, కోరుకొండ రాఘవ, రాష్ట్ర గవర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బొడ్డేడ శివ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని 5న కలెక్టరేట్ వద్దవైఎస్సార్‌సీపీ నిరసన
న్యాయం జరిగే వరకు పోరాడతాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్యాలనాయుడు
Comments
Please login to add a commentAdd a comment