కలెక్టర్ సుడిగాలి పర్యటన
కె.కోటపాడు: కలెక్టర్ విజయ కృష్ణన్ కె.కోటపాడు మండలంలో శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఆమె మండలంలో ప్రవేశించారు. ముందుగా గొండుపాలెం గ్రామానికి వెళ్లిన కలెక్టర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పర్యవేక్షించారు. 16 నుంచి 59 ఏళ్ల వయస్సు గల ఉపాధి వేతనదారులు ఈశ్రమ్ రిజిస్ట్రేషన్లను గ్రామ, వార్డు సచివాలయం, సీఎస్‌సీ సెంటర్స్, పోస్టాఫీస్‌లలో ఉచితంగా చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. పీఎఫ్, ఈఎస్‌ఐ వర్తించని వారు ఈశ్రమ్‌లో రిజిస్ట్రేషన్‌ను చేయించుకునేందుకు అర్హులని ఆమె తెలిపారు. వారికి ఐదేళ్లలోగా ప్రమాదాల సమయాల్లో మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యం బారిన పడితే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అందుతుందని వివరించారు. అనంతరం కె.సంతపాలెం గ్రామంలో రైతులు పండిస్తున్న కూరగాయలు, మామిడిపంటను ఆమె పరిశీలించారు. కె.సంతపాలెం, ఆర్లి, సూదివలస, కింతాడ, మర్రివలస తదితర గ్రామాల్లో ఎంతమంది రైతులు కూరగాయల పంటలను సాగు చేస్తున్నారో, వారు పండించిన కూరగాయల పంటలను ఏఏ ప్రాంతాల్లో అమ్ముతున్నారో స్ధానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల ధరలు హెచ్చు తగ్గులు ఉండే సమయాల్లో రైతులు నష్టపోకుండా ఏం చేయవచ్చో ఉద్యానవన శాఖాధికారులు నివేదిక ద్వారా వివరించమని ఆమె సూచించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఆర్.పూర్ణిమాదేవి, డీఆర్‌డీఏ పీడీ కె.శచీదేవి, జిల్లా ఉద్యానవనశాఖాధికారి ప్రభాకరరావు, ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్ రమేష్, ఏపీవో అప్పలరాజు, వెలుగు ఏపీఎం చినబాబు, ఉద్యానవనశాఖాధికారి కిరణ్మయి, ఏవో సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఉదయం 6.30 గంటలకు కె.కోటపాడు మండలం సందర్శన
పింఛన్ల పంపిణీ, ఉపాధి పనుల పరిశీలన
కూరగాయ రైతుల కష్టసుఖాలు తెలుసుకున్న కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment