ఏపీకి తీరని అన్యాయం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్యాలనాయుడు
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వం వైఫల్యంతో విశాఖపట్నం రైల్వే జోన్ ఖరారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టం హామీ అయిన విశాఖపట్నం రైల్వే జోన్‌ను అనుకున్న రీతిగా సాధించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే కొత్తవలస –కిరండూల్ లైన్ (కేకే లైన్), పలాస–ఇచ్ఛాపురం లైన్‌ను ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త డివిజనల్‌లో చేర్చడం దారుణమన్నారు. దీంతో కొత్తగా ఏర్పడే విశాఖపట్నం రైల్వే డివిజన్ రాబడికి భారీగా గండి పడుతుందన్నారు. ఒడిశా అధిక రాబడినిచ్చే కేకే లైన్ లేని రైల్వే జోన్ వృథా అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
ఒడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రైల్వే ప్రాజెక్టులను సాధించుకోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. రాష్ట్రానికి నష్టం జరిగితే ఎంతటి వారినైనా ప్రశ్నించి, నిలదీస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ గొంతు ఎందుకు మూగబోయిందని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment