అనంతపురం క్రైం:C రూ.లక్షలు దండుకుని ముఖం చాటేసిన మోసగాడు రాయచోటి శశిని చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు బీటెక్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలిప్పిసామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 150 మందిని మోసగించాడు. జిల్లాల వారీగా ఏజెంట్లను నియమించి వారి ద్వారా నిరుద్యోగుల నుంచి డబ్బు దండుకున్నాడు. నాలుగు రోజుల క్రితం పలువురు బాధితులు కుప్పం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బుధవారం ఉదయం రాయచోటిలోని తన స్వగృహంలో ఉన్న నిందితుడు శశిని అదుపులోకి తీసుకున్నారు.
కుప్పంలోని బాధితులకు మాత్రమే డబ్బు తిరిగిస్తానని నిందితుడు చెప్పినట్లు ఏజెంట్ల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే అనంతపురం జిల్లాతో పాటు మిగిలిన ప్రాంతాల్లోని బాధితుల పరిస్థితి ఏంటనేది అగమ్యగోచరమే. ఏజెంట్లు బలమైన సామాజికవర్గానికి చెందినవారు కావడంతో డబ్బు రికవరీపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. డబ్బు కోసం నిలదీస్తే ఏజెంట్లు టీడీపీకి చెందిన నాయకుల పేర్లు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని వాపోతున్నారు. వీరికి అల్లరిమూకలు, రౌడీషీటర్లు అండగా ఉండటంతో ఒత్తిడి చేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
ఖతర్నాక్ లేడీ బెదిరింపుల పర్వం..
ఉద్యోగాలిప్పిస్తామని తమ నుంచి తీసుకున్న నగదు తిరిగివ్వాలని అడిగిన నిరుద్యోగులను ‘ఖతర్నాక్ లేడీ’ పోలీసుల ద్వారా బెదిరిస్తోంది. నెల క్రితం అప్పటి అనంతపురం ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు కొంతమంది నిరుద్యోగులు తమకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. బెంగళూరుకు చెందిన సదరు మహిళ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు డబ్బు తీసుకుందని ఆరోపించారు. ఏడాది దాటినా ఉద్యోగం చూపకపోవడంతో బాధితులు ఆ మహిళను నిలదీసి డబ్బు కోసం ఒత్తిడి తెచ్చారు. దీంతో సదరు మహిళ వైఎస్సార్ జిల్లా పోలీసుల ద్వారా బాధితులను బెదిరింపులకు గురి చేస్తోంది. మహిళకు ఎందుకు ఫోన్ చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తుండటంతో.. బాధితులు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన విషయం తెలిపారు. అయితే న్యాయస్థానంలో కేసు వేసుకోండని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారని బాధితులు తెలిపారు.ఉ
Comments
Please login to add a commentAdd a comment