రాప్తాడు రూరల్: భార్య ఎడబాటును తట్టుకోలేక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం సిండికేట్‌నగర్‌కు చెందిన నరసింహులు (40)కు 12 ఏళ్ల క్రితం ఉరవకొండకు చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. చేనేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు చెలరేగి తరచూ గొడవ పడేవారు. చివరకు భార్య సర్దుకుపోలేక ఆర్నెల్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.
అంతటితో ఆగకుండా తనకు విడాకులు కావాలంటూ దరఖాస్తు చేయడంతో నరసింహులకు నోటీసులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు లోనైన నరసింహులు.. రోజు క్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఇంట్లో బెడ్రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాడు. తల్లిదండ్రులు మరో బెడ్రూమ్‌లో పడుకున్నారు. ఉదయం 6.30 గంటలకు లేచిచూడగా కుమారుడి బెడ్రూం తలుపులు తీయలేదు.
అనుమానం వచ్చి తలుపులు ఎంత కొట్టినా లాభం లేకపోయింది. చివరికి బయట వైపు వెళ్లి కిటికీలో నుంచి చూడగా కుమారుడు ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. కుటుంబసభ్యుల రోదనలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని బలవంతంగా తలుపులు తీసి లోపలకు ప్రవేశించారు. ఉరికి వేలాడుతున్న నరసింహులును కిందకు దించి పరిశీలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment