ఆదిత్య శశాంక్‌ను అరెస్ట్ చూపిస్తున్న పోలీసులు
అనంతపురం: మేనమామ డాక్టర్ మూర్తిరావు ఖోకలేను దారుణంగా హత్య చేసిన కేసులో మేనల్లుడు ఆర్.ఎం.ఆదిత్య శశాంక్‌ను అనంతపురం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ రెడ్డప్ప వెల్లడించారు. అనంతపురంలోని ఎల్‌ఐసీ కాలనీలో నివాసముంటున్న ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మూర్తిరావును ఈ నెల 10న హతమార్చిన విషయం తెలిసిందే.
మేనమామ మాట నమ్మి... చదువు మానేసి
పామిడి గ్రామానికి చెందిన మూర్తిరావుకు ఐదుగురు అక్కచెల్లెళ్లు, ఓ సోదరుడు ఉన్నారు. అందరితోనూ కలుపుగోలుగా ఉండేవారు. కుటుంబసభ్యులందరి బాగోగులను ఆయనే చూసుకునేవారు. ఈ క్రమంలో తన పెద్ద అక్క నాగరత్నాబాయి కుమారుడు ఆర్.ఎం.ఆదిత్య శశాంక్ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతుండే వాడు. ఆ సమయంలోనే ఆదిత్యతో మూర్తిరావు మాట్లాడి చదువు మధ్యలోనే వదిలేసి అనంతపురానికి వస్తే మంచి ఉద్యోగం ఇప్పి స్తానని నమ్మబలికాడు. దీంతో ఆదిత్య శశాంక్ చదువు ఆపేసి మేనమామ వద్దకు చేరుకున్నాడు. అప్పటి నుంచి మేనల్లుడితో పాటు తన అక్క బాగోగులను ఆయన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు.
పథకం ప్రకారం..
మేనమామ మాట నమ్మి వచ్చిన తనతో పాటు తల్లి బాగోగులూ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన మేనమామ తీరు ఆదిత్యకు నచ్చలేదు. అంతా తాను చెప్పినట్లే జరగాలి.... అందరూ తన ఆధీనంలోనే ఉండాలన్న భావనతో తన కుటుంబాన్ని అణగదొక్కుతున్నారని మేనమామపై ఆదిత్య కసి పెంచుకున్నాడు. తన భవిష్యత్తును కాలరాసిన మేనమామను ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అనంతపురంలోని జేఎన్‌టీయూ ప్రధాన గేట్ ఎదురుగా ఉన్న మేనమామ ఇంటిలో అద్దెకు ఉంటున్న మణికంఠ అనే వ్యక్తి ఇల్లు ఖాళీ చేశాడు. ఈ నెల 10న రాత్రి ఇదే విషయాన్ని మూర్తిరావుకు మణికంఠ ఫోన్ చేసి తెలిపి, ఇంటి తాళం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తన భార్య శోభాబాయితో కలసి మూర్తిరావు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కాపు కాసిన ఆదిత్య కత్తితో మూర్తిరావు గొంతుపై పొడిచి హతమార్చాడు.
రిమాండ్‌కు నిందితుడు
హత్య జరిగిన వెంటనే అప్రమత్తమైన అనంతపురం ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద తచ్చాడుతున్న ఆదిత్యశశాంక్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వినియోగించిన కత్తితో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
ఇద్దరిని బలిగొన్న క్షణికావేశం
ఆదిత్య శశాంక్ క్షణికావేశంతో దారుణానికి ఒడిగట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తన కళ్ల ఎదుటే భర్తను మేనల్లుడు కత్తితో పొడిచి హత్య చేస్తున్న దారుణాన్ని చూసిన శోభాబాయి అదే రోజు రాత్రి 11 గంటలకు గుండెపోటుకు గురై మృతి చెందింది. దీంతో మూర్తి రావు కుటుంబం ఛిన్నాభిన్నమైంది. హతుడికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment