ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

Published Fri, Sep 27 2024 3:18 AM | Last Updated on Fri, Sep 27 2024 3:18 AM

ఖైదీల

కళ్యాణదుర్గం: ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్‌ అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం కళ్యాణదుర్గం సబ్‌ జైలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఖైదీల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరుగు దొడ్లు, శుభ్రత, స్టోర్‌ రూం, కిచెన్‌, లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ తదితర వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ ధనుంజయ నాయుడు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరి చక్రవర్తి, న్యాయవాదులు దేవేంద్ర, పలువురు పాల్గొన్నారు.

లావణ్య పాలీ క్లినిక్‌ సీజ్‌

అనంతపురం మెడికల్‌: నగరంలో రామచంద్రనగర్‌లోని లావణ్య పాలీ క్లినిక్‌ను డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఈ.భ్రమరాంబ దేవి గురువారం సీజ్‌ చేశారు. కూడేరు మండలం హంసపల్లి గ్రామానికి చెందిన వేలూరు రాధకు ఇటీవల కడుపు నొప్పి రావడంతో వైద్యం కోసం లావణ్య పాలీ క్లినిక్‌కు వెళ్లారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తించే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమణా నాయక్‌ ఆమెకు ఆపరేషన్‌ చేయగా అది వికటించింది. దీంతో భర్త రామానాయుడు, కుటుంబీకులు కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో డీఎంహెచ్‌ఓ భ్రమరాంబ దేవి క్లినిక్‌లో ప్రాథమిక విచారణ చేపట్టారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరిగినట్లు తేలడంతో క్లినిక్‌ను సీజ్‌ చేశారు. శస్త్రచికిత్స వికటించిన విషయమై విచారణకు ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీ వేసినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమణా నాయక్‌పై తదుపరి చర్యలుంటాయని ఆమె పేర్కొన్నారు.

చెల్లెల్నే చెరబట్టిన

కామాంధుడు

పెద్దపప్పూరు: సొంత చిన్నాన్న కుమార్తెనే ఓ కామాంధుడు చెరబట్టాడు. వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి బాలిక బాగోగులను ఆమె పెదనాన్న కుమారుడు రామాంజనేయులు చూసుకుంటున్నాడు. అప్పటికే తనకు పైళ్లె, ఇద్దరు పిల్లలు ఉన్నా.. పాడుబుద్ధితో బాలికపై కన్నేశాడు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా బాలిక ఇంటికి వచ్చిన సమయంలో ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. బయట ఎక్కడా చెప్పరాదంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే యాడికి మండలంలో తను విద్యనభ్యసిస్తున్న పాఠశాలకు బాలిక చేరుకుంది. గురువారం పాఠశాలలో తన స్నేహితురాళ్లకు విషయం తెలపగా.. వారు పాఠశాల నిర్వాహకురాలికి తెలియజేశారు. ఆమె వెంటనే ఎస్‌ఐ గౌస్‌బాషాకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రామాంజనేయులును అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.

నాణేలను తిరస్కరించొద్దు

అనంతపురం అర్బన్‌: చెలామణిలో ఉన్న నాణేలను తీసుకునేందుకు విముఖత చూపకూడదని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సూచించారు. అలా తిరస్కరించే వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నాణేల అంశంపై గురువారం ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నాణేలను ఆర్థిక, సామాజిక, సాంస్కృతికత,కాలానుగుణంగా పరిచయం చేస్తారన్నారు. ప్రస్తుతం 1, 2, 5, 10 రూపాయలకు సంబంధించి నాణేలు చెలామణిలో ఉన్నాయన్నారు. ఈ నాణేల వాస్తవికతపై కొన్ని వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. దీంతో వ్యాపారులు, దుకాణదారులు వీటిని తీసుకోవడం లేదన్నారు. ముఖ్యంగా రూ.10 నాణేలను తిరస్కరిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని బ్యాంకు శాఖల్లోనూ నాణేలను మార్పిడి చేసుకోవచ్చని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2019 జనవరి 14న ప్రత్యేకంగా బ్యాంకులకు సూచనలు ఇచ్చిందని కలెక్టర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి 1
1/1

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement