అనంతపురం ఎడ్యుకేషన్: ‘లీడర్‌షిప్’, ‘ఎఫ్‌ఎల్‌ఎన్’ అంశాలపై విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు ఈనెల 4 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. అనంతపురం రూరల్ మండలం బళ్లారి రోడ్డులోని సీఆర్ ఐటీ కళాశాలలో ‘లీడర్ షిప్’, బుక్కరాయసముద్రంలో ‘ఎఫ్‌ఎల్‌ఎన్’ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం సమగ్రశిక్ష అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలల నిర్వహణకు సంబంధించి కలిగి ఉండాల్సిన నాయకత్వ లక్షణాలపై ఎంపిక చేసిన మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు), ప్రధానోపాధ్యాయులు, డైట్ కళాశాల అధ్యాపకులకు ‘లీడర్ షిప్’పై శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో సాగే ఈ శిక్షణకు అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల నుంచి వందమంది చొప్పున మొత్తం 300 మంది హాజరుకానున్నారు. తొలివిడత శిక్షణ ఆరు రోజుల పాటు ఈనెల 9 వరకు కొనసాగనుంది.
‘ఎఫ్‌ఎల్‌ఎన్’ శిక్షణకు
రెండు జిల్లాల నుంచి...
ప్రాథమిక పాఠశాలల్లో 1,2 తరగతులు బోధించే టీచర్లకు ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసి (ఎఫ్‌ఎల్‌ఎన్) శిక్షణ బుక్కరాయసముద్రం సమీపంలోని విజయభారతి డీఎడ్ కళాశాల వేదికగా ఇవ్వనున్నారు. తొలివిడత శిక్షణ గత నెల 21 నుంచి 26 వరకు సాగింది. ప్రస్తుతం రెండోవిడత శిక్షణ 4 నుంచి ప్రారంభం కానుంది. జిల్లా నుంచి 125 మంది, కర్నూలు జిల్లా నుంచి 125 మంది కలిపి మొత్తం 250 మంది హాజరుకానున్నారు. రెండు శిక్షణలకు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరూ హాజరుకావాల్సిందేనని, ఎవరికీ మినహాయింపు ఉండ దని సమగ్ర శిక్ష అధికారులు స్పష్టం చేశారు. గైర్హాజరయ్యే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
వేర్వేరు ప్రాంతాల్లో కార్యక్రమాలు
నాలుగు జిల్లాల నుంచి హాజరుకానున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment