ఫలసాయంలో ‘పండు ఈగ’
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల పండ్ల తోటల్లో పండు ఈగ (ఫ్రూట్ ఫ్‌లై) ప్రధాన సమస్యగా మారిందని, దీని వల్ల రైతులకు నష్టం వాటిల్లుతున్నట్లు నేషనల్ పెస్ట్ సర్వైవలెన్స్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌ఎస్) గుర్తించినట్లు జాతీయ మొక్కల యాజమాన్య సంస్థ (ఎన్‌పీహెచ్‌ఎం), అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) ప్రతినిధులు తెలిపారు. పండు ఈగ అంశంపై గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఉమ్మడి జిల్లా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, రెండు జిల్లాల ఉద్యానశాఖ అధికారులు బీఎంవీ నరసింహారావు, జి.చంద్రశేఖర్, టెక్నికల్ హెచ్‌ఓ పల్లవితో పాటు ఎన్‌పీహెచ్‌ఎం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ప్యాలజ్యోతి, అపెడా బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పెద్దస్వామి తదితరులు పాల్గొన్నారు. గతంలో కేవలం మామిడిలో మాత్రమే కనిపించే పండు ఈగ ఇటీవల వాతావరణ మార్పులు, విచ్చలవిడిగా రసాయన మందులు వాడకం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం లాంటి కారణాలతో జామ, చీనీ, సీతాఫలం, దానిమ్మ లాంటి పండ్డ తోటలతో పాటు బీర లాంటి కూరగాయల పంటలోనూ ఎక్కువగా ఆశించి నష్టం కలుగుజేస్తోందన్నారు. ఈ నష్టంపై రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యాన పంటలు చేతికొచ్చే సమయంలో పండు ఈగ ఆశిస్తే దిగుబడులు తగ్గి రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. దీని నివారణకు పండు ఈగ ఎరలు, మిథైల్ యూజినాల్ ఎరలు ఎకరాకు 6 నుంచి 8 వరకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. 1.5 గ్రాముల అసిఫేట్ లేదా 1 గ్రాము డెల్టామైత్రీన్ లేదా పిప్రోనిల్ లాంటి మందుల పిచికారీతో నివారించుకోవాలని సూచించారు. ఎరలు ఏర్పాటు చేసి పురుగు ఉనికి ఉధృతిని బట్టి మేలైన సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు.
రైతులు జాగ్రత్తలు పాటించకపోతే నష్టాలు అధికం
అవగాహన సదస్సులో ఎన్‌పీహెచ్‌ఎం, ‘అపెడా’ ప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment